వారు దాన్ని ఎప్పుడు చదువుతారు, వారెలా ప్రయోజనం పొందుతారు
ఉదయాన్నే:
ఒక వివాహిత జంట, వారిద్దరు తమ గృహానికి వెలుపల పనిచేస్తారు, ప్రతి ఉదయాన కేవలం పది నిమిషాలు ముందు నిద్రలేచి, పని కొరకు బయటికి వెళ్లడానికి ముందు ఇద్దరూ కలిసి బైబిలు చదవడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకొనేందుకు వాళ్లు నిర్ణయించుకున్నారు. వాళ్లు ఇంటిని విడిచివెళ్తూ చక్కగా సంభాషించుకోవడానికి వారు చదివినది ఒక ఆధారాన్ని కలుగజేస్తుంది.
నైజీరియాలోని ఒక పెద్ద తన ఇంట్లో కుటుంబమంతా కలిసి బైబిలు చదవడానికి, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కొరకు కేటాయించబడిన కార్యక్రమాన్ని ఉపయోగిస్తాడు. సాధారణంగా ఉదయంవేళ, ప్రతి దినము దిన వచనాన్ని చర్చించిన తర్వాత వారు దానిలోని కొంత భాగాన్ని చదువుతారు. కేటాయించబడిన భాగాలను చదవడంలో పిల్లలు వంతులు తీసుకొని చదవాలని కోరబడతారు. తర్వాత, చదవబడిన వచనాలలో నుండి వారిని ప్రశ్నలు అడుగమంటారు.
జపానులోని ఒక గృహిణి 1985 నుండి ప్రతి సంవత్సరం పూర్తి బైబిలు చదివింది. ప్రతి దినము ఉదయం ఐదుగంటలకు ప్రారంభించి 20 నుండి 30 నిమిషాలు చదవడం ఆమె కార్యక్రమం. ప్రయోజనాల గురించి, ఆమె ఇలా చెబుతుంది: “నా విశ్వాసం బలపర్చబడింది. నా అనారోగ్యాన్ని మరచిపోయి, పరదైసు నిరీక్షణపై ధ్యాసనుంచడానికి అది నాకు సహాయం చేస్తుంది.”
గత 30 సంవత్సరాలుగా పయినీరుగావున్న ఒక సహోదరి, అయితే, ఆమె భర్త సాక్షి కాదు, బైబిలు చదవడం కొరకు ప్రతి ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తుంది. హెబ్రీ లేఖనాల్లో నుండి దాదాపు నాలుగు పేజీలు, క్రైస్తవ గ్రీకు లేఖనాల నుండి ఒక అధ్యాయం, సామెతల నుండి ఒక వచనం చదవడం ఆమె కార్యక్రమంలో చేరివుంటాయి. ఆమె 1959 నుండి ప్రతి సంవత్సరం మొత్తం బైబిలు చదువుతోంది. ఆమె ఇలా చెబుతుంది: “నేను అలా చదవడం మూలంగా, యెహోవా నన్ను ప్రేమిస్తున్నట్లు నేను భావిస్తాను . . . నేను ప్రోత్సాహాన్ని, ఓదార్పును, గద్దింపును పొందుతాను. బైబిలు చదవడం అంటే ప్రతిదినం యెహోవా నన్ను బలపర్చినట్లు ఉంటుంది.”
యెహోవాసాక్షుల పని నిషేధింపబడిన దేశంలో సత్యం నేర్చుకున్న ఒక సహోదరి భర్త కూడా ఆమె నమ్మకాలను వ్యతిరేకించేవాడు. ఆమె సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 6 నుండి 7 గంటల మధ్య బైబిలు చదవగలుగుతుంది. ఇది ఆమెకు అంతర్గత బలాన్నిచ్చింది. చదవడం తనపై ఎలా ప్రభావాన్ని చూపిందో తెలియజేస్తూ, ఆమె ఇలా చెబుతుంది: “సమస్యలు, కష్టాలు ఉన్నప్పటికీ, యెహోవా వాగ్దానాలు ఎన్నడూ విఫలం కావని తెలుసుకొని, మనం యెహోవాను, యేసును ప్రేమించడం, సంతోషంగా జీవించడం నేర్చుకుంటాము.”
పయినీరు సేవా పాఠశాలకు హాజరైన ఒక సహోదరి, బైబిలు చదవడాన్ని ప్రతిదిన అలవాటుగా చేసుకోమని అక్కడ ఇవ్వబడిన ఉపదేశాన్ని పాటించేందుకు తీర్మానించుకుంది. మొదట్లో ఆమె ఉదయం 5 నుండి 6 గంటల మధ్య చదవగలిగేది. ఉద్యోగంలో మార్పు వచ్చినప్పుడు, ఆమె దాన్ని రాత్రి 9 నుండి 10 గంటల మధ్యకు మార్చుకుంది. ఇతర సవాలుతో కూడిన పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఆమె ఇలా చెబుతుంది, “పరిస్థితులకు అనుగుణ్యంగా నేను నా పట్టికను సరిచేసుకునేదాన్ని.”
దినం యొక్క మధ్య భాగంలో:
బ్రెజిల్ బేతేలు కుటుంబ సభ్యులైన ఇద్దరు స్వంత అక్కచెల్లెలు మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతిదినము దాదాపు 20 నిమిషాలు ఇద్దరు కలిసి బైబిలు చదివే అలవాటు కలిగివుండేవాళ్లు. వాళ్లు మొత్తం బైబిలును దాదాపు 25 సార్లు చదివారు; అయినప్పటికీ వారిలా వ్రాస్తున్నారు: “మేము ఎప్పుడు ఏదో ఒకటి క్రొత్తది కనుగొంటాము, అందుకే బైబిలు చదవడం ఎన్నడూ విసుగు కలిగించదు.”
జపానులోని ఒక ఒంటరి సహోదరి, సాక్షిగా పెంచబడినప్పటికీ, తనకు లేఖనాలు సరిగ్గా తెలియవని గుర్తించింది; ఆమె పయినీరు అయినప్పుడు, బైబిలు క్రమంగా చదవాలని నిశ్చయించుకుంది. ఇప్పుడు ఆమె ప్రతి వారంలో ఒక దినము వైద్యం కొరకు ఆసుపత్రికి ప్రయాణిస్తుండగా దైవపరిపాలనా పాఠశాల కొరకు చదువుతుంది. ఆ తర్వాత, ఇంటి వద్ద మిగతా పరిశోధన చేస్తుంది. వారాంతంలో, బైబిలు పుస్తకాలు వ్రాయబడిన క్రమంలో వాటిని ఎంపిక చేసుకుని ఆమె మరింత బైబిలు అధ్యయనం చేస్తుంది.
ఇప్పటికే పూర్తి బైబిలు మూడుసార్లు చదవడం ముగించిన పదమూడు సంవత్సరాల బాలుడు, ప్రస్తుతం పాఠశాల నుండి ఇంటికి వచ్చాక ప్రతి దినము ఒక అధ్యాయం చదువుతున్నాడు. ఇది, “యెహోవా ఎడల మరింత ప్రేమ భావం కలిగివుండడానికి” తనకు సహాయం చేసిందని ఆయన చెబుతున్నాడు.
ఒక పనిచేసే వ్యక్తిగా, ఒక పెద్దగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఎంతో పనితొందరగల పట్టిక కలిగివున్న ఒక సాక్షి రైలులో తన పని కొరకు ప్రయాణిస్తుండగా బైబిలు ఆడియో క్యాసెట్లను వింటాడు. ఆ తర్వాత ఇంటి వద్ద అదే విషయాన్ని గూర్చి వ్యక్తిగతంగా చదువుకుంటాడు.
ఫ్రాన్సులో ఒక పయినీరు తాను వ్యక్తిగతంగా చదువుకోవడంతోపాటు, భోజనాలు సిద్ధం చేస్తుండగా, వాహనం నడుపుతుండగా, కష్టసమయాలను ఎదుర్కొంటున్నప్పుడూ అలాగే కేవలం ఆనందం కొరకు కూడా ఆమె బైబిలు ఆడియో క్యాసెట్లను వింటుంది.
జపానులోని 21 సంవత్సరాల ఒక పయినీరు, ప్రతిదినము ఏదైనా కొంత ఆత్మీయసంబంధమైనది తీసుకోవాలని తన తల్లి చెప్పేదని, తనకు మూడేళ్లు ఉన్నప్పటి నుండి, ఎప్పుడూ ఒకే సమయంలో కాకపోయినప్పటికీ, ప్రతిదినము తాను బైబిలు చదువుతున్నానని గుర్తు చేసుకుంటున్నాడు. ఆ దినం కొరకు తాను ఎంపిక చేసుకున్న భాగాన్ని చదివిన తర్వాత, కీలకమైన లేఖనాలను ఆయన తప్పకుండా మళ్లీ చదివి, తాను చదివిన దాన్ని కొద్ది క్షణాలు మానసికంగా పునఃసమీక్షించుకోవడానికి కొన్ని నిమిషాలు తీసుకుంటాడు.
పయినీరు అయిన మరో సాక్షి, గత 12 సంవత్సరాల్లో పూర్తి బైబిలును దాదాపు పదిసార్లు చదివింది. ఆమె భర్త అవిశ్వాసి గనుక, ఆమె మధ్యాహ్న సమయాల్లో చదువుతుంది.
సాయంకాలం:
జపానులో పెద్దగా, క్రమ పయినీరుగా ఉన్న ఒక వ్యక్తి ప్రతిరాత్రి నిద్రపోవడానికి ముందు బైబిలు చదువుతాడు, గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ఇలా చేస్తున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “యెహోవా ఎలా ఆలోచిస్తాడో, విషయాల గురించి ఆయన ఎలా భావిస్తాడో, పరిస్థితులతో ఆయనెలా వ్యవహరిస్తాడో సూచించే లేఖనాలంటే నాకు ప్రాముఖ్యంగా ఇష్టం. ఈ లేఖనాలపై ధ్యానించడం ద్వారా, యెహోవా ఆలోచనా విధానాన్ని నా స్వంత ఆలోచనా విధానంగా చేసుకోవడానికి, నా క్రైస్తవ సహోదర సహోదరీలకు మరియు నా కుటుంబ సభ్యులకు మద్దతునిచ్చేందుకు నాకు సహాయం లభించింది.”
ఫ్రాన్సులో ఒక పెద్ద 1979 నుండి ప్రతి సాయంకాలం ఒక గంటసేపు బైబిలు చదువుతున్నాడు. తరచూ ఆయన పోల్చడం కొరకు ఐదు లేక ఆరు అనువాదాలను తన ముందుంచుకుంటాడు. “ప్రతిదిన పరిస్థితులలో బైబిలు జ్ఞానాన్ని ఎలా అన్వయించుకోవాలో” గ్రహించడానికి తాను జాగ్రత్తగా చదవడం తనకు సహాయం చేసిందని ఆయన చెబుతున్నాడు. లేఖనాల్లో నుండి ఉపదేశం ఇచ్చేటప్పుడు ఎంతో ప్రభావవంతంగా ఉండేందుకు కూడా ఇది ఆయనకు సహాయం చేసింది.
నైజీరియాలో ఒక సహోదరుడు, గత 28 సంవత్సరాలుగా, ప్రతిదినము లేఖనములను పరిశీలించుటనందు మరునాడు ఉదయం కొరకు ఇవ్వబడిన లేఖనాన్ని సాయంకాలం చదవడాన్ని ఒక అలవాటుగా చేసుకున్నాడు. దానితోపాటు, ఆ లేఖనం ఏ పుస్తకంలో నుండి తీసుకొనబడిందో అందులో నుండి ఒక అధ్యాయం మొత్తం చదువుతాడు. ఆయన వివాహం చేసుకున్న తర్వాత, సమాచారాన్ని తన భార్యతో కలిసి చదివి చర్చించడం ద్వారా ఆ అలవాటును కొనసాగించాడు.
తన తల్లిదండ్రులు సాక్షులుకాని ఒక యౌవనస్థురాలు, ప్రతిరాత్రి నిద్రపోవడానికి ముందు ఐదు నుండి పది నిమిషాలు చదవడాన్ని ఒక అలవాటుగా చేసుకుంది. అవి ఆమెకెంతో అమూల్యమైన నిమిషాలు, ఆమె చదవడానికి ముందు, ఆ తర్వాత ప్రార్థన చేస్తుంది. ప్రతి బైబిలు రచయితను వ్రాయడానికి యెహోవా నడిపించిన సమాచారాన్ని తెలుసుకోవడమే ఆమె లక్ష్యం.
బేతేలు సేవలో ఉండి వివాహితుడైన ఒక సహోదరుడు, తాను గత ఎనిమిది సంవత్సరాల నుండి సంవత్సరానికి ఒకసారి బైబిలు చదువుతున్నానని చెబుతున్నాడు. రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి ముందు 20 నుండి 30 నిమిషాలు ఆయన చదువుతాడు. ఆయన బాగా అలసిపోయినప్పుడు కూడా, చదవకుండా పడుకున్నట్లయితే, ఆయన నిద్రపోలేడు. ఆయన లేచి ఆ ఆత్మీయ అవసరతను తీర్చుకోవలసిందే.