8వ అధ్యాయం
మంచివార్త ప్రచారకులు
మనం అనుసరించడానికి యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును ఒక పరిపూర్ణ ఆదర్శంగా ఇచ్చాడు. (1 పేతు. 2:21) యేసును అనుసరించే వ్యక్తి, దేవుని పరిచారకుల్లో ఒకరిగా మంచివార్త ప్రకటిస్తాడు. అలా ప్రకటించడం ఆధ్యాత్మిక సేదదీర్పునిస్తుందని చెప్తూ యేసు ఇలా అన్నాడు: “భారం మోస్తూ అలసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను. నేను సౌమ్యుడిని, వినయస్థుడిని కాబట్టి నా కాడిని మీ మీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు సేదదీర్పు పొందుతారు.” (మత్త. 11:28, 29) ఆయన వాగ్దానం, ఆ ఆహ్వానానికి స్పందించి వచ్చినవాళ్లను ఎప్పుడూ నిరాశపర్చలేదు!
2 దేవుని ముఖ్య పరిచారకుడైన యేసు, తనను అనుసరించమని కొంతమందిని ఆహ్వానించాడు. (మత్త. 9:9; యోహా. 1:43) పరిచర్యలో ఆయన వాళ్లకు శిక్షణనిచ్చి, తాను చేస్తున్న ప్రకటనా పనిని చేయడానికి వాళ్లను పంపాడు. (మత్త. 10:1–11:1; 20:28; లూకా 4:43) తర్వాత, దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడానికి మరో 70 మందిని పంపించాడు. (లూకా 10:1, 8-11) యేసు ఆ శిష్యుల్ని పంపిస్తున్నప్పుడు ఇలా అన్నాడు: “మీ మాట వినేవాళ్లు నా మాట వింటారు. మిమ్మల్ని పట్టించుకోనివాళ్లు నన్ను కూడా పట్టించుకోరు. అంతేకాదు, నన్ను పట్టించుకోనివాళ్లు నన్ను పంపిన దేవుణ్ణి కూడా పట్టించుకోరు.” (లూకా 10:16) అలా చెప్పడం ద్వారా, శిష్యులకు అప్పగించబడిన బాధ్యత ఎంత ప్రాముఖ్యమైనదో యేసు నొక్కిచెప్పాడు. వాళ్లు యేసుకు, సర్వోన్నతుడైన దేవునికి ప్రతినిధులుగా ఉండాలి! మన కాలంలో, “వచ్చి నన్ను అనుసరించు” అని యేసు ఇచ్చిన ఆహ్వానానికి స్పందించే వాళ్లందరికీ అది వర్తిస్తుంది. (లూకా 18:22; 2 కొరిం. 2:17) అలా స్పందించే వాళ్లందరూ దేవుని రాజ్య సువార్త ప్రకటించి, శిష్యుల్ని చేయాలనే దైవిక ఆజ్ఞను పొందారు.—మత్త. 24:14; 28:19, 20.
3 తనను అనుసరించమని యేసు ఇచ్చిన ఆహ్వానానికి స్పందించడం వల్ల మనం యెహోవాను, యేసుక్రీస్తును ‘తెలుసుకోగలిగాం.’ (యోహా. 17:3) అంతేకాదు, మనం యెహోవా మార్గాల్ని నేర్చుకున్నాం. ఆయన సహాయంతో మన ఆలోచనాతీరులో మార్పులు చేసుకుని, కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకుని, యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం ప్రవర్తించగలుగుతున్నాం. (రోమా. 12:1, 2; ఎఫె. 4:22-24; కొలొ. 3:9, 10) యెహోవాపట్ల హృదయపూర్వక కృతజ్ఞతతో మనం ఆయనకు సమర్పించుకున్నాం, దానికి గుర్తుగా నీటి బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం దేవుని పరిచారకులమయ్యాం.
4 నిర్దోషమైన చేతులతో, స్వచ్ఛమైన హృదయంతో దేవున్ని సేవించాలని ఎప్పుడూ గుర్తుంచుకోండి. (కీర్త. 24:3, 4; యెష. 52:11; 2 కొరిం. 6:14–7:1) యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా మనం స్వచ్ఛమైన మనస్సాక్షిని పొందాం. (హెబ్రీ. 10:19-23, 35, 36; ప్రక. 7:9, 10, 14) మనం చేసే ప్రతీ పని, ఇతరుల్ని అభ్యంతర పెట్టకూడదు గానీ దేవుణ్ణి మహిమపర్చాలని అపొస్తలుడైన పౌలు సలహా ఇచ్చాడు. మన చక్కని ప్రవర్తన చూసి, అవిశ్వాసులు సత్యంలోకి వచ్చే అవకాశం ఉందని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (1 కొరిం. 10:31, 33; 1 పేతు. 3:1) ఇతరులు మంచివార్త ప్రచారకులవ్వడానికి మీరెలా సహాయం చేయవచ్చు?
కొత్త ప్రచారకులు
5 ఆసక్తి చూపించిన వ్యక్తితో మీరు బైబిలు అధ్యయనం మొదలుపెట్టినప్పటి నుండి, తాను నేర్చుకుంటున్నవాటిని ఇతరులకు చెప్పమని అతన్ని ప్రోత్సహించండి. అతను బంధువులతో, స్నేహితులతో, తోటి ఉద్యోగస్థులతో మాట్లాడవచ్చు. అంతేకాదు, ఇతరులతో కూడా స్నేహపూర్వకంగా మాట్లాడవచ్చు. అలా మాట్లాడమని ప్రోత్సహించడం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే కొత్తవాళ్లు యేసుక్రీస్తును అనుసరిస్తూ మంచివార్త ప్రచారకులవ్వడానికి అది సహాయం చేస్తుంది. (మత్త. 9:9; లూకా 6:40) కొత్తవాళ్లు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తూ, తమకు పరిచయం ఉన్నవాళ్లకు సాక్ష్యమివ్వడంలో నైపుణ్యం సాధించాక, వాళ్లు ఇంటింటి పరిచర్యలో పాల్గొనాలని తప్పకుండా కోరుకుంటారు.
అర్హతలు సంపాదించడం
6 ఒక వ్యక్తిని మొదటిసారి ఇంటింటి పరిచర్యలో పాల్గొనడానికి ఆహ్వానించే ముందు, అతను కొన్ని అర్హతలు సంపాదించుకున్నాడో లేదో మీరు నిర్ధారించాలి. ఒక వ్యక్తి మనతోపాటు ఇంటింటి పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు ప్రజలు అతన్ని యెహోవాసాక్షుల్లో ఒకరిగా చూస్తారు. కాబట్టి అతను అప్పటికే తన జీవితాన్ని యెహోవా నీతి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాడని, బాప్తిస్మం తీసుకొనని ప్రచారకునిగా ఉండవచ్చని అర్థమౌతుంది.
7 మీరు ఒక వ్యక్తితో అధ్యయనం చేస్తూ బైబిలు సూత్రాల్ని చర్చిస్తున్నప్పుడు, అతని పరిస్థితులు ఏమిటో బహుశా మీకు తెలిసే అవకాశం ఉంది. తాను నేర్చుకున్నవాటి ప్రకారం అతను జీవిస్తున్నాడని మీరు గమనించి ఉండవచ్చు. అయితే, అతని జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల్ని పెద్దలు మీతో, మీ విద్యార్థితో కలిసి చర్చిస్తారు.
8 మీతో, మీ బైబిలు విద్యార్థితో ఆ విషయాల్ని చర్చించడానికి, పెద్దల సభ సమన్వయకర్త ఇద్దరు పెద్దలను (ఒకరు సంఘ సేవా కమిటీ సభ్యుడై ఉండాలి) ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ సంఘంలో పెద్దలు తక్కువమంది ఉంటే ఒక పెద్ద, అర్హుడైన ఒక సంఘ పరిచారకుడు వాటిని చర్చించవచ్చు. నియమించబడిన సహోదరులు వీలైనంత త్వరగా వెళ్లి విద్యార్థితో చర్చించడానికి కృషి చేయాలి. ఒకవేళ, మీ విద్యార్థి ఇంటింటి పరిచర్యలో పాల్గొనడానికి ఇష్టపడుతున్నాడని పెద్దలకు సంఘ కూటమప్పుడు తెలిస్తే, వాళ్లు కూటం అయిపోయాక వీలైతే మీతో, మీ విద్యార్థితో మాట్లాడవచ్చు. ఆ సమయంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒక విద్యార్థిని బాప్తిస్మం తీసుకొనని ప్రచారకునిగా ఆమోదించే ముందు ఈ విషయాలు నిర్ధారించుకోవాలి:
(1) బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని అతను నమ్ముతాడు.—2 తిమో. 3:16.
(2) అతనికి లేఖనాల్లోని ప్రాథమిక బోధలు తెలుసు, వాటిని అతను నమ్ముతాడు. దానివల్ల ఎవరైనా ప్రశ్నించినప్పుడు, బైబిలు ఆధారంగా జవాబిస్తాడే తప్ప అబద్ధమత బోధల ప్రకారం లేదా తన సొంత ఆలోచనల ప్రకారం జవాబివ్వడు.—మత్త. 7:21-23; 2 తిమో. 2:15.
(3) అతను కూటాలకు హాజరయ్యే స్థితిలో ఉంటే, యెహోవా ప్రజలతో సహవసించాలనే బైబిలు ఆజ్ఞను పాటిస్తాడు.—కీర్త. 122:1; హెబ్రీ. 10:24, 25.
(4) లైంగిక పాపం గురించి అంటే వ్యభిచారం, ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లిచేసుకోవడం, అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వంటివాటి గురించి బైబిలు ఏమి బోధిస్తుందో అతనికి తెలుసు. అంతేకాదు, అతను బైబిలు బోధల ప్రకారం జీవిస్తాడు. ఒకవేళ ఒకవ్యక్తి తన కుటుంబానికి చెందని భిన్న లింగ వ్యక్తితో కలిసి జీవిస్తుంటే వాళ్లిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకొని ఉండాలి.—మత్త. 19:9; 1 కొరిం. 6:9, 10; 1 తిమో. 3:2, 12; హెబ్రీ. 13:4.
(5) తాగుబోతుతనం గురించి బైబిలు చెప్తున్నదాన్ని అతను పాటిస్తాడు. అలాగే వైద్య కారణాలనుబట్టి కాకుండా వ్యసనంగా ఉపయోగించే మత్తుపదార్థాలకు, మెదడుపై ప్రభావం చూపించే కృత్రిమ పదార్థాలు లేదా సింథటిక్ పదార్థాలు (మందుల్ని కృత్రిమ రసాయనాలతో కలిపి తీసుకోవడం) వంటి వాటన్నిటికీ దూరంగా ఉంటాడు.—2 కొరిం. 7:1; ఎఫె. 5:18; 1 పేతు. 4:3, 4.
(6) చెడు స్నేహాలకు దూరంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకుంటాడు.—1 కొరిం. 15:33.
(7) ఒకవేళ అతనికి ఇంతకుముందు ఏదైనా అబద్ధమత సంస్థల్లో సభ్యత్వం ఉంటే, దానితో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటాడు. అతను వాళ్ల ఆరాధనకు హాజరవడం, వాళ్ల కార్యకలాపాల్లో భాగం వహించడం లేదా వాటికి మద్దతివ్వడం మానుకుంటాడు.—2 కొరిం. 6:14-18; ప్రక. 18:4.
(8) అతను ఈ లోక రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా పూర్తిగా బయటకు వచ్చేస్తాడు.—యోహా. 6:15; 15:19; యాకో. 1:27.
(9) దేశ పోరాటాల్లో ఎవ్వరి పక్షం వహించడు.—యెష. 2:4.
(10) అతను యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఉండాలని నిజంగా కోరుకుంటాడు.—కీర్త. 110:3.
9 ఈ విషయాల్లో దేని గురించైనా విద్యార్థి భావాలు పెద్దలకు అర్థంకాకపోతే, వాళ్లు అతన్ని అడగాలి. బహుశా అక్కడ ఇచ్చిన లేఖనాల్ని ఉపయోగించి చర్చించవచ్చు. యెహోవాసాక్షులతో కలిసి పరిచర్యలో పాల్గొనాలంటే, లేఖనాల ప్రకారం జీవించాలనే విషయం విద్యార్థి అర్థంచేసుకోవడం ప్రాముఖ్యం. తన నుండి ఏం కోరబడుతుందనేది విద్యార్థి అర్థం చేసుకున్నాడో లేదో, అతను పరిచర్యలో పాల్గొనడానికి కావాల్సిన అర్హతలు సంపాదించాడో లేదో నిర్ధారించుకోవడానికి విద్యార్థి ఇచ్చే జవాబులు పెద్దలకు సహాయం చేస్తాయి.
10 విద్యార్థి అర్హుడయ్యాడో లేదో పెద్దలు వెంటనే అతనికి చెప్పాలి, చాలా సందర్భాల్లో ఆ చర్చ ముగింపులోనే అలా చెప్తారు. ఒకవేళ అతను అర్హుడైతే, పెద్దలు అతన్ని ఓ ప్రచారకునిగా సాదరంగా ఆహ్వానించవచ్చు. (రోమా. 15:7) వీలైనంత త్వరగా పరిచర్యలో పాల్గొనమని, ఆ నెల చివర్లో క్షేత్రసేవా రిపోర్టు ఇవ్వమని పెద్దలు అతన్ని ప్రోత్సహించాలి. ఓ బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకొనని ప్రచారకునిగా అర్హత సాధించి, తన మొదటి క్షేత్రసేవా రిపోర్టును ఇచ్చినప్పుడు అతని పేరుతో సంఘ ప్రచారకుల రికార్డు రాసి, దాన్ని సంఘ ఫైల్లో పెడతారని పెద్దలు అతనికి వివరించవచ్చు. పెద్దలు ప్రచారకుని దగ్గర నుండి తీసుకునే ఈ వ్యక్తిగత సమాచారం వల్ల సంస్థ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యెహోవాసాక్షుల మతపరమైన కార్యకలాపాలను చూసుకోగలుగుతుంది. దానివల్ల ప్రచారకుడు కూడా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో భాగం వహించి, ఆధ్యాత్మిక మద్దతును పొందవచ్చు. అంతేకాదు ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని, jw.orgలో ఉన్న యెహోవాసాక్షుల గ్లోబల్ డేటా ప్రొటెక్షన్ పాలసీకి అనుగుణంగా ఉపయోగించబడుతుందని పెద్దలు కొత్త ప్రచారకులకు గుర్తుచేయవచ్చు.
11 మనం కొత్త ప్రచారకుని గురించి మరింత తెలుసుకుంటూ, అతను సాధిస్తున్న ప్రగతి విషయంలో శ్రద్ధ చూపిస్తే అతనిపై మంచి ప్రభావం ఉంటుంది. దానివల్ల, అతను క్షేత్రసేవా రిపోర్టులను క్రమంగా ఇవ్వాలనే పురికొల్పు, యెహోవా సేవలో ఇంకా ఎక్కువగా కృషి చేయాలనే ప్రోత్సాహం పొందుతాడు.—ఫిలి. 2:4; హెబ్రీ. 13:2.
12 బైబిలు విద్యార్థి పరిచర్యలో పాల్గొనడానికి అర్హుడని నిర్ణయించిన తర్వాత, పెద్దలు అతనికి యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ అనే పుస్తకాన్ని ఇస్తారు. అతను మొదటి క్షేత్రసేవా రిపోర్టును ఇచ్చిన తర్వాత, అతను బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడయ్యాడని సంఘంలో ఓ చిన్న ప్రకటన చేస్తారు.
పిల్లలకు సహాయం చేయడం
13 పిల్లలు కూడా మంచివార్త ప్రచారకులయ్యేలా అర్హత సంపాదించవచ్చు. యేసు చిన్న పిల్లల్ని దగ్గరికి తీసుకుని, వాళ్లను ఆశీర్వదించాడు. (మత్త. 19:13-15; 21:15, 16) పిల్లల విషయంలో బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులదే అయినా, సంఘంలోని ఇతర సహోదరసహోదరీలు కూడా ప్రకటనా పనిలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఇష్టపడే పిల్లలకు సహాయం చేయడానికి ముందుకురావచ్చు. మీరు తల్లిదండ్రులైతే, పరిచర్యలో మీరు ఉంచే మంచి ఆదర్శాన్ని చూసి మీ పిల్లలు కూడా ఉత్సాహంగా దేవుని సేవ చేయాలనే ప్రోత్సాహం పొందుతారు. మంచి ప్రవర్తన ఉన్న ఒక పిల్లవాడు తన విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటే, అతనికి ఇంకా ఎలా సహాయం చేయవచ్చు?
14 తమ పిల్లవాడు ప్రచారకుడవ్వడానికి అర్హుడా కాదా అనే విషయం గురించి చర్చించడానికి అతని తల్లి లేదా తండ్రి సంఘ సేవా కమిటీలోని ఒక పెద్దతో మాట్లాడడం మంచిది. అప్పుడు ఆ పిల్లవాడితో, సత్యంలో ఉన్న అతని తల్లితో లేదా తండ్రితో లేదా ఇద్దరితో, లేదా ఆ పిల్లవాణ్ణి పెంచుతున్నవాళ్లతో మాట్లాడడానికి పెద్దల సభ సమన్వయకర్త ఇద్దరు పెద్దలను (ఒకరు సంఘ సేవా కమిటీ సభ్యుడై ఉండాలి) ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ పిల్లవాడికి బైబిలు సత్యాలకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానం ఉండి, పరిచర్యలో పాల్గొనాలని కోరుకుంటుంటే, అతను ప్రగతి సాధిస్తున్నాడని అర్థం. ఈ విషయాల్ని, అలాగే పెద్దవాళ్లకు వర్తించే ఇతర విషయాల్ని పరిశీలించిన తర్వాత, ఆ పిల్లవాడు బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడయ్యేందుకు అర్హుడో కాదో ఆ ఇద్దరు పెద్దలు నిర్ణయించవచ్చు. (లూకా 6:45; రోమా. 10:10) అయితే, ఒక చిన్న పిల్లవాడితో కలిసి మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా పెద్దవాళ్లతో చర్చించే విషయాల్ని చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి పిల్లలకు వర్తించవు.
15 పెద్దలు ఆ పిల్లవాడితో కలిసి మాట్లాడుతున్నప్పుడు, అతను ప్రగతి సాధిస్తున్నందుకు మెచ్చుకోవాలి. బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోమని ప్రోత్సహించాలి. అతని హృదయంలో సత్యాన్ని నాటడానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎంతో కష్టపడివుంటారు, కాబట్టి వాళ్లను కూడా మెచ్చుకోవాలి. తమ పిల్లవాడికి ఇంకా ఎక్కువ సహాయం చేసేలా, ఈ పుస్తకంలోని 179-181 పేజీల్లో ఉన్న “క్రైస్తవ తల్లిదండ్రులకు ఒక సందేశం,” అనే అంశాన్ని చూడమని పెద్దలు తల్లిదండ్రులకు చెప్పాలి.
సమర్పణ, బాప్తిస్మం
16 మీరు దైవిక ప్రమాణాల్ని చేరుకోవడం ద్వారా, పరిచర్యలో భాగం వహించడం ద్వారా మీరు యెహోవాను తెలుసుకున్నారు, ఆయన్ని ప్రేమించారు. అయితే, యెహోవాతో మీ స్నేహాన్ని మీరు ఇంకా బలపర్చుకోవాలి. దాన్నెలా చేయవచ్చు? మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని, ఆ సమర్పణకు గుర్తుగా నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా అలా చేయవచ్చు.—మత్త. 28:19, 20.
17 సమర్పణ అంటే ఓ పవిత్రమైన సంకల్పం కోసం ప్రత్యేకంగా ఉండడమని అర్థం. దేవునికి సమర్పించుకోవడం అంటే, మన జీవితాన్ని ఆయన సేవకు అంకితం చేస్తామని, ఆయన మార్గాల్లోనే నడుస్తామని ప్రార్థనలో ప్రమాణపూర్వకంగా మాటివ్వడం. మరో మాటలో చెప్పాలంటే, ఎల్లప్పుడూ ఆయన మీద సంపూర్ణ భక్తిని చూపిస్తామని మాటివ్వడం. (ద్వితీ. 5:9) ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం, మీకు మాత్రమే సంబంధించిన విషయం. దాన్ని మీ బదులు వేరేవాళ్లు చేయలేరు.
18 అయితే, మీరు యెహోవాకు చెందినవాళ్లు అవ్వాలనుకుంటున్నారని కేవలం ప్రార్థనలో చెప్తే సరిపోదు. మీరు దేవునికి సమర్పించుకున్నారని ఇతరులకు చూపించాలి. కాబట్టి, మీరు యేసులా నీళ్లలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా అలా చూపిస్తారు. (1 పేతు. 2:21; 3:21) మీరు యెహోవాను సేవించాలని నిర్ణయించుకుని, బాప్తిస్మం తీసుకోవాలని కోరుకుంటుంటే, ఏమి చేయాలి? మీ కోరికను పెద్దల సభ సమన్వయకర్తకు చెప్పాలి. మీరు బాప్తిస్మం పొందడానికి తగిన అర్హతలు సాధించారో లేదో తెలుసుకునేలా, కొంతమంది పెద్దలు మీతో కలిసి చర్చించే ఏర్పాటు ఆయన చేస్తాడు. అదనపు సమాచారం కోసం, దయచేసి ఈ పుస్తకంలో 182-184 పేజీల్లో ఉన్న “బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులకు ఒక సందేశం” అనే అంశాన్ని, అలాగే 185-207 పేజీల్లో ఉన్న “బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లకోసం ప్రశ్నలు” అనే అంశాన్ని పరిశీలించండి.
మనం చేసిన పరిచర్యను రిపోర్టు చేయడం
19 ఎన్నో సంవత్సరాలుగా, స్వచ్ఛారాధన వృద్ధికి సంబంధించిన ప్రపంచవ్యాప్త నివేదికలు యెహోవా ప్రజలకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మంచివార్త ప్రపంచ నలుమూలలకు చేరుతుందని యేసుక్రీస్తు తన శిష్యులకు మొదటిసారి చెప్పినప్పటి నుండి, నిజక్రైస్తవులు ఆ పని ఎలా జరుగుతుందోనని ఆసక్తిగా కనిపెట్టుకొని ఉన్నారు.—మత్త. 28:19, 20; మార్కు 13:10; అపొ. 1:8.
20 ప్రకటనా పనికి సంబంధించిన మంచి నివేదికలు విని యేసు తొలి అనుచరులు సంతోషించారు. (మార్కు 6:30) సా.శ. 33 పెంతెకొస్తు రోజున శిష్యుల మీద పవిత్రశక్తి కుమ్మరించబడినప్పుడు, అక్కడ దాదాపు 120 మంది ఉన్నారని అపొస్తలుల కార్యాల పుస్తకం చెప్తుంది. అయితే, చాలా త్వరగా శిష్యుల సంఖ్య దాదాపు 3,000కు, ఆ తర్వాత దాదాపు 5,000కు చేరింది. “రక్షణ మార్గంలో ప్రవేశించినవాళ్లను యెహోవా ప్రతీరోజు వాళ్లతో చేరుస్తూ ఉన్నాడు” అనీ, “యాజకుల్లో కూడా చాలామంది విశ్వాసులయ్యారు” అనీ అపొస్తలుల కార్యాల పుస్తకం చెప్తుంది. (అపొ. 1:15; 2:5-11, 41, 47; 4:4; 6:7) అభివృద్ధికి సంబంధించిన ఈ నివేదికలు విని శిష్యులు ఎంత ప్రోత్సాహం పొందివుంటారో కదా! వాళ్లు యూదా మతనాయకుల వల్ల తీవ్రమైన హింసలు అనుభవిస్తున్నా, దేవుడు అప్పగించిన పనిలో ముందుకు సాగడానికి ఆ సంతోషకరమైన నివేదికలు వాళ్లను పురికొల్పి ఉంటాయి!
21 దాదాపు సా.శ. 60-61 లో పౌలు కొలొస్సయులకు ఉత్తరం రాస్తూ, “మంచివార్త ఫలించి ప్రపంచమంతటా” వ్యాపిస్తోందని, అది “ఆకాశం కింద ఉన్న సృష్టంతటికీ” ప్రకటించబడుతోందని నివేదించాడు. (కొలొ. 1:5, 6, 23) తొలి క్రైస్తవులు దేవుని వాక్యానికి లోబడి, సా.శ. 70 లో యూదా వ్యవస్థ అంతం కాకముందే పవిత్రశక్తి సహాయంతో విస్తృతంగా మంచివార్త ప్రకటించారు. ఆ పనికి సంబంధించిన నివేదికలు నమ్మకమైన క్రైస్తవులకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చివుంటాయో కదా!
అంతం రాకముందే పరిచర్య పూర్తిస్థాయిలో జరగడం చూడాలనే ఆసక్తి మీకుందా?
22 అదే విధంగా యెహోవా ఆధునిక సంస్థ, మత్తయి 24:14 లోని ప్రవచన నెరవేర్పుగా జరుగుతున్న భూవ్యాప్త ప్రకటనా పనికి సంబంధించిన నివేదికల్ని నమోదు చేయడానికి కృషిచేస్తోంది. ఆ లేఖనంలో ఇలా ఉంది: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.” దేవుని సమర్పిత సేవకులముగా మనం ఆ అత్యవసర పని చేయాల్సి ఉంది. అంతం రాకముందే పరిచర్య పూర్తిస్థాయిలో జరగడం చూడాలనే ఆసక్తి మనలో ప్రతీఒక్కరికి ఉండాలి. ఆ పని పూర్తయ్యేలా యెహోవా చూస్తాడు. అయితే మనం ఆ పనిలో పాల్గొంటే యెహోవా అనుగ్రహాన్ని పొందుతాం.—యెహె. 3:18-21.
మీ వ్యక్తిగత క్షేత్రసేవా రిపోర్టు
23 మనం వేటిని రిపోర్టు చేయాలి? మన సంస్థ తయారు చేసిన క్షేత్రసేవా రిపోర్టును పరిశీలిస్తే మనం వేటిని రిపోర్టు చేయాలో తెలుస్తుంది. అయితే, కింద ఇచ్చిన కొన్ని వివరాలు ఈ విషయంలో మనకు సహాయం చేస్తాయి.
24 క్షేత్రసేవా రిపోర్టులో, “అందించిన ప్రచురణలు (ప్రింటెడ్ కాపీలు, ఎలక్ట్రానిక్ కాపీలు)” అనే కాలమ్ ఉంటుంది. బాప్తిస్మం తీసుకొనని వ్యక్తులకు మీరు ప్రింటెడ్ కాపీలు లేదా ఎలక్ట్రానిక్ కాపీలు ఎన్ని ఇచ్చారో ఆ కాలమ్‌లో రాయాలి. “చూపించిన వీడియోలు” అనే కాలమ్‌లో మీరు మన వీడియోలు ఎన్ని చూపించారో రాయాలి.
25 సమర్పించుకొనని, బాప్తిస్మం తీసుకొనని వ్యక్తి చూపించిన ఆసక్తిని పెంచడానికి మీరు ఎన్నిసార్లు కలిశారో లెక్కించి వాటిని “పునర్దర్శనాలు” అనే కాలమ్‌లో రాయాలి. ఆసక్తిపరులను నేరుగా వెళ్లి కలవడం ద్వారా, ఉత్తరం రాయడం ద్వారా, ఫోన్ చేయడం ద్వారా, మెసేజ్ లేదా ఈ-మెయిల్ పంపించడం ద్వారా, ఏదైనా ప్రచురణను వాళ్ల ఇంటి దగ్గర పెట్టి రావడం ద్వారా కూడా పునర్దర్శనాలు చేయవచ్చు. అంతేకాదు, గృహ బైబిలు అధ్యయనం నిర్వహించిన ప్రతీసారి ఓ పునర్దర్శనాన్ని రిపోర్టు చేయవచ్చు. తల్లి లేదా తండ్రి తమ ఇంట్లో ఉన్న బాప్తిస్మం తీసుకొనని పిల్లలతో ప్రతీవారం కుటుంబ ఆరాధన చేసినప్పుడు, దాన్ని ఒక పునర్దర్శనంగా లెక్కించవచ్చు.
26 సాధారణంగా ఓ బైబిలు అధ్యయనాన్ని ప్రతీవారం నిర్వహించినా, నెలలో దాన్ని ఒక్క అధ్యయనంగానే రిపోర్టు చేయాలి. ఆ నెలలో మీరు మొత్తం ఎన్ని వేర్వేరు బైబిలు అధ్యయనాలు నిర్వహించారో వాటిని రాయాలి. సమర్పించుకొనని, బాప్తిస్మం తీసుకొనని వ్యక్తులతో మీరు చేసే అధ్యయనాల్ని రిపోర్టు చేయవచ్చు. సేవా కమిటీలోని ఓ సభ్యుడు ఇచ్చిన నిర్దేశం మేరకు, మీరు నిష్క్రియులైన ఓ సహోదరునితో లేదా సహోదరితో బైబిలు అధ్యయనం చేస్తుంటే దాన్ని కూడా ఓ అధ్యయనంగా రిపోర్టు చేయవచ్చు. కొత్తగా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో ఇంకా అధ్యయనం పూర్తి కాకపోతే, మీరు ఆ అధ్యయనాన్ని నిర్వహిస్తుంటే దాన్ని కూడా రిపోర్టు చేయవచ్చు.
27 మీరు ఎన్ని గంటలు చేశారో ఖచ్చితంగా అన్ని మాత్రమే “గంటలు” అనే కాలమ్‌లో రిపోర్టు చేయడం ప్రాముఖ్యం. ఇంటింటి పరిచర్యలో, పునర్దర్శనాలు చేయడంలో, బైబిలు అధ్యయనాలు చేయడంలో లేదా సమర్పించుకొనని, బాప్తిస్మం తీసుకొనని వ్యక్తులకు బహిరంగంగా లేదా అనియతంగా సాక్ష్యమివ్వడంలో మీరు గడిపిన సమయాన్ని రిపోర్టు చేయాలి. ఇద్దరు ప్రచారకులు కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు, ఆ సమయాన్ని ఇద్దరూ రిపోర్టు చేయవచ్చు. కానీ ఆ సమయంలో చేసిన పునర్దర్శనాలను లేదా బైబిలు అధ్యయనాలను వాళ్లలో ఒక్కరు మాత్రమే రిపోర్టు చేయాలి. కుటుంబ ఆరాధనలో తమ పిల్లలకు బోధించడంలో భాగం వహించిన తల్లిదండ్రులిద్దరూ వారానికి ఓ గంట వరకు రిపోర్టు చేయవచ్చు. సహోదరులు బహిరంగ ప్రసంగం ఇచ్చిన సమయాన్ని రిపోర్టు చేయవచ్చు. ఒకవేళ ఆ ప్రసంగాన్ని వేరే సహోదరుడు లేదా సహోదరి అనువదిస్తుంటే, వాళ్లు కూడా ఆ సమయాన్ని రిపోర్టు చేయవచ్చు. అయితే పరిచర్యకు రెడీ అవ్వడం, క్షేత్రసేవా కూటానికి హాజరవ్వడం, పరిచర్యకు వెళ్తూ దారిలో కొన్ని వ్యక్తిగత పనులు చేసుకోవడం వంటివి ముఖ్యమైన పనులే అయినా వాటికి వెచ్చించే సమయాన్ని మాత్రం లెక్కించకూడదు.
28 ఏ సమయాన్ని రిపోర్టు చేయాలనేది, ప్రతీ ప్రచారకుడు బైబిలు ద్వారా శిక్షణ పొందిన మనస్సాక్షిని బట్టి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించుకోవాలి. కొన్ని క్షేత్రాల్లో ఇళ్లు కిక్కిరిసి ఉంటాయి, మరికొన్ని క్షేత్రాల్లో ఇళ్లు తక్కువగా ఉండడంవల్ల, ఒక ఇంటి నుండి మరో ఇంటికి వెళ్లాలంటే ప్రచారకులు చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. క్షేత్రాలు వేరుగా ఉంటాయి; పరిచర్యలో ఎంత సమయాన్ని లెక్కించాలనే విషయంలో ప్రచారకులకు వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి, సమయాన్ని రిపోర్టు చేసే విషయంలో పరిపాలక సభ తమ మనస్సాక్షిని బట్టి అనిపించిన దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల మీద రుద్దట్లేదు. అంతేకాదు, ఈ విషయంలో ఇతరులకు తీర్పుతీర్చడానికి ఎవ్వర్నీ నియమించలేదు.—మత్త. 6:1; 7:1; 1 తిమో. 1:5.
29 పరిచర్యలో గడిపిన సమయాన్ని పూర్తి గంటలుగా రిపోర్టు చేయాలి. అయితే వయసు పైబడడం, ఇంట్లో నుండి కదల్లేకపోవడం, లేదా మరేదైనా కారణం వల్ల పరిచర్య చేయలేని ప్రచారకులకు ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. అలాంటి ప్రచారకులు పూర్తి గంటలుగా కాకుండా, 15 నిమిషాల చొప్పున అంటే 15, 30, 45 నిమిషాల చొప్పున రిపోర్టు ఇవ్వవచ్చు. ఒక నెలలో వాళ్లు కేవలం 15 నిమిషాలే పరిచర్య చేసినా, ఆ సమయాన్ని కూడా రిపోర్టు చేయాలి. అప్పుడు వాళ్లను కూడా క్రమమైన రాజ్య ప్రచారకులుగానే లెక్కిస్తారు. అలాగే తీవ్రమైన అనారోగ్యం వల్ల లేదా గాయపడడం వల్ల తాత్కాలికంగా అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నెలలు ఇంట్లో నుండి కదల్లేని ప్రచారకులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఏర్పాటు, పరిచర్య చేయలేని స్థితిలో ఉన్నవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే, ఓ ప్రచారకునికి ఈ ఏర్పాటు వర్తిస్తుందో లేదో సంఘ సేవా కమిటీ నిర్ణయిస్తుంది.
సంఘ ప్రచారకుల రికార్డు
30 ప్రతీనెల మీరు ఇచ్చే క్షేత్రసేవా రిపోర్టులోని వివరాల్ని సంఘ ప్రచారకుల రికార్డులో ఎక్కిస్తారు. ఈ రికార్డులు స్థానిక సంఘానికి చెందుతాయి. ఒకవేళ మీరు వేరే సంఘానికి మారుతుంటే, ఆ విషయాన్ని మీ పెద్దలకు చెప్పండి. కార్యదర్శి మీ రికార్డులన్నీ కొత్త సంఘానికి పంపే ఏర్పాట్లు చేస్తాడు. అలా చేయడంవల్ల, మీ కొత్త సంఘంలోని పెద్దలు మిమ్మల్ని ఆహ్వానించగలుగుతారు, మీకు అవసరమైన ఆధ్యాత్మిక మద్దతు ఇవ్వగలుగుతారు. ఒకవేళ మీరు మూడు నెలల కన్నా తక్కువ కాలం సంఘానికి దూరంగా ఉండాల్సివస్తే, దయచేసి మీ క్షేత్రసేవా రిపోర్టులను మీ సంఘానికే పంపించండి.
మనం ఎందుకు క్షేత్రసేవా రిపోర్టును ఇస్తాం?
31 మీరు కొన్నిసార్లు క్షేత్రసేవా రిపోర్టును ఇవ్వడం మర్చిపోతుంటారా? నిజమే, మనలో ప్రతీఒక్కరికి ఏదోక సమయంలో ఆ విషయం గుర్తుచేయాల్సి రావచ్చు. అయితే, క్షేత్రసేవా రిపోర్టు ఇచ్చే విషయంలో మనకు సరైన వైఖరి ఉండి, దాన్ని ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో అర్థంచేసుకుంటే అస్సలు మర్చిపోకుండా రిపోర్టు ఇవ్వగలుగుతాం.
32 “యెహోవా సేవలో నేను ఎంత చేస్తున్నానో ఆయనకు తెలుసు కదా, అలాంటప్పుడు దాన్ని సంఘానికి ఎందుకు రిపోర్టు చేయాలి?” అని కొంతమంది అడిగారు. నిజమే, మనం ఏం చేస్తున్నామో యెహోవాకు తెలుసు. మనం నిండు హృదయంతో చేస్తున్నామో లేదో ఆయనకు తెలుసు. అంతేకాదు మనం చేయగలిగినంత చేస్తున్నామా లేదా పైపైన సేవ చేస్తున్నామా అనేది కూడా ఆయనకు తెలుసు. అయితే, నోవహు ఓడలో ఉన్న రోజుల్ని, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణించిన సంవత్సరాల్ని యెహోవా నమోదు చేయించాడని గుర్తుంచుకోండి. ఎవరెవరు తనకు నమ్మకంగా ఉన్నారో, ఎవరెవరు అవిధేయత చూపించారో ఆయన రాయించి పెట్టాడు. అంతేకాదు, ఇశ్రాయేలీయులు క్రమక్రమంగా కనానును ఎలా స్వాధీనం చేసుకున్నారో, ఇశ్రాయేలులోని నమ్మకమైన న్యాయాధిపతులు ఏమేమి సాధించారో యెహోవా రాయించాడు. అవును, తన సేవకులు చేసిన పనులకు సంబంధించి చాలా వివరాల్ని ఆయన నమోదు చేయించాడు. ఈ వివరాలన్నిటినీ రాయించాడంటే, ఖచ్చితమైన వివరాల్ని నమోదు చేసే విషయంలో యెహోవా ఆలోచన ఏమిటో మనకు అర్థమౌతుంది.
33 బైబిల్లో నమోదైన చారిత్రక సంఘటనలు చూస్తే, యెహోవా ప్రజలు ఇచ్చిన నివేదికలు, వాళ్లు నమోదు చేసిన వివరాలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో తెలుస్తుంది. చాలా సందర్భాల్లో, నిర్దిష్టమైన సంఖ్యలు ప్రస్తావించకపోతే కొన్ని బైబిలు వృత్తాంతాలు ప్రభావవంతంగా ఉండవు. ఈ ఉదాహరణలు పరిశీలించండి: ఆదికాండం 46:27; నిర్గమకాండం 12:37; న్యాయాధిపతులు 7:7; 2 రాజులు 19:35; 2 దినవృత్తాంతాలు 14:9-13; యోహాను 6:10; 21:11; అపొస్తలుల కార్యాలు 2:41; 19:19.
34 యెహోవా సేవలో మనం చేసేవన్నీ మన క్షేత్రసేవా రిపోర్టుల్లో ఉండకపోయినా, ఆ రిపోర్టులు ఆయన సంస్థకు కొన్ని విధాలుగా ఉపయోగపడతాయి. మొదటి శతాబ్దంలో, అపొస్తలులు పరిచర్య చేసిన తర్వాత యేసు దగ్గరికి వచ్చి “తాము ఏమేం చేశారో, ఏమేం బోధించారో అన్నీ ఆయనకు తెలియజేశారు.” (మార్కు 6:30) కొన్నిసార్లు, క్షేత్రసేవా రిపోర్టులను చూస్తే పరిచర్యలో ఇంకా ఏయే రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, కొన్నిటిలో అభివృద్ధి సాధించినట్లు కనిపించవచ్చు కానీ ఇతర విషయాల్లో అంటే ప్రచారకుల పెరుగుదల కుంటుబడి ఉండవచ్చు. బహుశా ప్రచారకులకు ప్రోత్సాహం అవసరం కావొచ్చు లేదా సంఘంలో పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉండవచ్చు. కాబట్టి, బాధ్యతగల పర్యవేక్షకులు ఆ రిపోర్టులను పరిశీలించి, ప్రచారకుల లేదా సంఘ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పరిస్థితుల్ని సరిదిద్దడానికి కృషి చేస్తారు.
35 రిపోర్టుల వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని బట్టే, ఏ ప్రాంతాల్లో ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉందో సంస్థ తెలుసుకోగలుగుతుంది. ఏ ప్రాంతాల్లో ప్రకటనా పనికి ఎక్కువ ఫలితాలు వస్తున్నాయో, ఎక్కడ తక్కువ అభివృద్ధి జరుగుతుందో, ప్రజలు సత్యం తెలుసుకునేలా సహాయం చేయడానికి ఏ ప్రచురణలు అవసరమో కూడా ఈ రిపోర్టులను బట్టి తెలుస్తుంది. వాటిని బట్టే మన సంస్థ వేర్వేరు దేశాల్లో జరుగుతున్న ప్రకటనా పనికి ఎన్ని ప్రచురణలు అవసరమో అంచనా వేసి, ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది.
36 మనలో చాలామందికి రిపోర్టులు ప్రోత్సాహాన్నిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మంచివార్త ప్రకటించడానికి మన సహోదరసహోదరీలు చేస్తున్న కృషి గురించి విన్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. రిపోర్టుల్లో పెరుగుదలను గమనించినప్పుడు, యెహోవా సంస్థ ఎంత అభివృద్ధి సాధిస్తుందో తెలుస్తుంది. క్షేత్ర అనుభవాలు విన్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం, మరింత ఉత్సాహంగా పరిచర్య చేయాలనే ప్రోత్సాహం పొందుతాం. (అపొ. 15:3) క్షేత్రసేవా రిపోర్టులు ఇచ్చే విషయంలో మనం సహకరించడం ప్రాముఖ్యం. అలా చేయడంద్వారా, ప్రపంచవ్యాప్త సహోదరులపట్ల మనకు శ్రద్ధ ఉందని చూపిస్తాం. ఈ చిన్న పని చేయడం ద్వారా, యెహోవా సంస్థ చేసిన ఏర్పాటుకు మనం లోబడుతున్నామని చూపిస్తాం.—లూకా 16:10; హెబ్రీ. 13:17.
వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోవడం
37 మన క్షేత్రసేవా రిపోర్టును వేరేవాళ్ల రిపోర్టుతో పోల్చి చూసుకోవాల్సిన అవసరం లేదు. (గల. 5:26; 6:4) అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. కాబట్టి, మన పరిస్థితులకు సరిపోయే వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకుంటే ఎంతో ప్రయోజనం ఉండవచ్చు. దానివల్ల పరిచర్యలో మన ప్రగతిని తెలుసుకోవచ్చు. మనం పెట్టుకున్న లక్ష్యాలను చేరుకున్నప్పుడు, వాటిని పూర్తి చేశామన్న సంతృప్తి మనకు ఉంటుంది.
38 నిజానికి, “మహాశ్రమ” నుండి కాపాడబోయేవాళ్లను సమకూర్చే పనిని యెహోవాయే వేగవంతం చేస్తున్నాడని స్పష్టమౌతోంది. యెషయా చెప్పిన ఈ ప్రవచనం నెరవేరుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం: “మీలో అల్పుడు వెయ్యిమంది అవుతాడు, అందరికన్నా తక్కువవాడు బలమైన జనం అవుతాడు. యెహోవానైన నేనే తగిన సమయంలో ఈ పనిని త్వరపెడతాను.” (ప్రక. 7:9, 14; యెష. 60:22) ఉత్కంఠభరితమైన ఈ చివరి రోజుల్లో, మంచివార్త ప్రచారకులుగా ఉండడం ఎంత గొప్ప అవకాశమో కదా!—మత్త. 24:14.