ప్రశ్నాభాగం
▪ అభివృద్ధి సాధిస్తున్న బైబిలు విద్యార్థులతో ఎంతకాలం అధ్యయనం నిర్వహించాలి?
అభివృద్ధి సాధిస్తున్న బైబిలు విద్యార్థులతో బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, ‘దేవుని ప్రేమలో నిలిచివుండండి’ అనే రెండు పుస్తకాలు పూర్తయ్యేంతవరకు అధ్యయనం చేయడం మంచిది. ఈ పుస్తకాలు పూర్తికాక ముందే విద్యార్థులు బాప్తిస్మం తీసుకున్నా సరే వాళ్లతో ఆ రెండు పుస్తకాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. వాళ్లు బాప్తిస్మం తీసుకున్నాక కూడా మనం సమయాన్ని, పునర్దర్శనాలను, అధ్యయనాన్ని రిపోర్టు చేయవచ్చు. అధ్యయనానికి మరో ప్రచారకుడు మనతో ఉంటే ఆయన కూడా సమయాన్ని రిపోర్టు చేయవచ్చు.—మార్చి 2009 మన రాజ్య పరిచర్య, 2వ పేజీ చూడండి.
బైబిలు విద్యార్థులతో అధ్యయనం చేయడం ఆపేసే ముందు సత్యం వాళ్ల మనసుల్లో చక్కగా నాటుకునేలా చూడడం ప్రాముఖ్యం. తమకు తప్పక ఎదురయ్యే కష్టాలను తట్టుకోవడానికి వాళ్లు క్రీస్తులో ‘వేరుపారి,’ ‘విశ్వాసంలో స్థిరపర్చబడాలి.’ (కొలొ. 2:6, 7; 2 తిమో. 3:12; 1 పేతు. 5:8, 9) అంతేకాదు, వాళ్లు ఇతరులకు సమర్థవంతంగా బోధించాలంటే వాళ్లు ‘సత్యం గురించిన అనుభవజ్ఞానం’ సంపాదించుకోవాలి. (1 తిమో. 2:4) మన విద్యార్థులతో రెండు పుస్తకాలను పూర్తి చేయడం ద్వారా, ‘జీవానికి పోయే దారి’ మీద స్థిరంగా ముందుకు వెళ్లేలా సహాయం చేస్తాం.—మత్త. 7:13, 14.
పెద్దలు ఎవరినైనా బాప్తిస్మానికి ఆమోదించే ముందు, విద్యార్థులు బైబిలు ప్రాథమిక బోధలను సరిగ్గా అర్థం చేసుకున్నారో లేదో, వాటి ప్రకారం నడుచుకుంటున్నారో లేదో చూడాలి. మొదటి పుస్తకం కూడా ఇంకా పూర్తిచేయని విద్యార్థిని బాప్తిస్మానికి ఆమోదించే ముందు పెద్దలు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. ఎవరైనా బాప్తిస్మానికి ఇంకా సిద్ధం కాకపోతే, బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులయ్యేలా పెద్దలు వాళ్లకు అవసరమైన వ్యక్తిగత సహాయం అందేలా చూస్తారు.—యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం, 217-218 పేజీలు చూడండి.
[2వ పేజీలోని బ్లర్బ్]
బైబిలు విద్యార్థుల మనసుల్లో సత్యం చక్కగా నాటుకునేలా చూడడం ప్రాముఖ్యం