ఇండియాలో పరిచారకుల శిక్షణా పాఠశాల మొదటి తరగతి
1 లొనావ్లాలో జరిగిన పరిచారకుల శిక్షణా పాఠశాల మొదటి తరగతికి సిక్కిమ్తో సహా ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి మరియు నేపాల్ నుండి వచ్చిన 23 మంది విద్యార్థులు, ఇద్దరు పరిశీలకులు హాజరయ్యారు. విద్యార్థుల్లో ఇద్దరు పెద్దలు, మిగతా అందరూ పరిచారకులు. వారిలో ఏడుగురు ప్రత్యేక పయినీర్లు, తొమ్మిదిమంది క్రమ పయినీర్లు, మిగిలినవారు సంఘ ప్రచారకులు. పందొమ్మిదివందల తొంభై ఐదు మే 22 నుండి జూలై 16 వరకు అంటే ఎనిమిది వారాలు ఇద్దరు ఉపదేశకులు విద్యార్థులకు బోధించారు. తరగతిగదిలో మొత్తం దాదాపు 270 గంటల ఉపదేశం ఇవ్వబడింది, హోమ్‌వర్క్ మరియు పఠన పథకాలకు సిద్ధపడుతూ విద్యార్థులు మరనేక గంటలు గడిపారు. ఇక్కడ బేతేలులో పనిచేయడంలో వారు కొంత ఆచరణాత్మక అనుభవాన్ని కూడా పొందారు.
2 ఆదివారం జూలై 16న బేతేలు రాజ్యమందిరంలో చక్కగా సంస్థీకరించబడిన స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమ ముగింపులో విద్యార్థులకు వారి నియామకాలు అందజేయబడ్డాయి. వారిలో, మరో స్థలానికి వెళ్లడానికి తమ పరిస్థితులు అనుమతించిన ఆరుగురు ప్రత్యేక పయినీర్లుగా నియమించబడ్డారు. మిగతావారు తమ తమ సొంత సంఘాలకు తిరిగి వెళ్లారు, అక్కడే వాళ్లు క్రమ పయినీర్లుగా లేదా సంఘ ప్రచారకులుగా సేవచేయడంలో కొనసాగుతారు.
3 విద్యార్థులు పొందిన ఉపదేశం ఎంతగానో మెచ్చుకోబడింది. వారు తమకై తాము ఆత్మీయంగా సంసిద్ధులై ఉండడానికే కాకుండా, వారు సహవసించే సంఘానికి సహాయం చేయడానికి కూడా అలాంటి బోధ దోహదపడగలదని మేము విశ్వసిస్తున్నాము. అలాంటి శిక్షణ అవసరత చెప్పుకోదగినంత ఉంది గనుక, 23 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సులోవున్న, కనీసం రెండు సంవత్సరాలు పరిచారకులుగా ఉన్న అనేకమంది సహోదరులు, భవిష్యత్తులో జరుగబోయే తరగతులకు తమ పేర్లను నమోదు చేసుకుంటారని నిరీక్షించబడుతోంది.
4 ఇండియాలో ప్రతి సంవత్సరం పరిచారకుల శిక్షణా పాఠశాల యొక్క ఒక తరగతి నిర్వహించాలని మేము ఉద్దేశిస్తున్నాము. కాబట్టి, తర్వాతి తరగతికి అర్హులయ్యేందుకు సహోదరులు కృషిచేయవచ్చు. ఉదాహరణకు, ఆంగ్ల భాషాపరిజ్ఞానం అవసరం గనుక, ఇతర విషయాల్లో అర్హులై ఆంగ్ల భాష సరిగ్గా రాని వారు ఆంగ్ల భాషను బాగా నేర్చుకొనేందుకు సహాయపడే తరగతులకు వెళ్లవచ్చు. తర్వాతి తరగతిలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరుకునే సహోదరులు జిల్లా కాపరిని కలవాలని, అలాగే తమ తర్వాతి సర్క్యూట్ సమావేశంలో భవిష్యత్తులో విద్యార్థులు కాగల వారికొరకు జరిగే కూటానికి హాజరు కావాలని కోరబడుతున్నారు. ఆ కూటమిలో వాళ్లు ఒక ప్రారంభ వినతి పత్రాన్ని పొంది, వెంటనే దాన్ని నింపి జిల్లా కాపరికి తిరిగి ఇవ్వాలి, ఆయన దాన్ని మాకు పంపిస్తారు. అర్హులైన విద్యార్థులను సంస్థ సంప్రదిస్తుంది.