మెరుపులు—పెద్దవి మరియు చిన్నవి (రెండవభాగము)
“నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము.”—కీర్తన 36:9.
1. ప్రకటన పుస్తకంలోని సూచనను అర్థంచేసుకునే విషయంలో ఏ తొలి ప్రయత్నించడం జరిగింది?
బైబిలు పుస్తకమైన ప్రకటన తొలి కాలంనుండీ కూడా క్రైస్తవుల ఆసక్తిని రేపుతూనే ఉంది. సత్యాన్ని గూర్చిన మెరుపు మరింత ప్రకాశిస్తూ ఉంటుందన్న విషయంపై చక్కని ఉదాహరణను అందిస్తుంది. ముగిసిన మర్మము (ఆంగ్లం) అనే పుస్తకంలో ప్రకటనను గూర్చి ఓ వివరణను యెహోవా ప్రజలు 1917 నందు ప్రచురించారు. క్రైస్తవమత సామ్రాజ్యపు మత మరియు రాజకీయ నాయకులను అది ధైర్యంగా బయల్పర్చింది, కానీ దాని వివరణల్లో వివిధ ఆధారాలనుండి తీసుకొనబడినవే. అయినప్పటికీ, ముగిసిన మర్మము (ఆంగ్లం) యెహోవా ఉపయోగించుకుంటున్న దృశ్యమైన మాధ్యమం ఎడల బైబిలు విద్యార్థుల యథార్థతను పరీక్షించడానికి దోహదపడింది.
2. ప్రకటన పుస్తకంపై “జనాంగ ఉద్భవము” అనే శీర్షిక ఏ వెలుగును ప్రసరింపజేసింది?
2 మార్చి 1, 1925లో వెలువడిన కావలికోటలో (ఆంగ్లం) “జనాంగం ఉద్భవించడం” అనే శీర్షిక ప్రచురణ ద్వారా ప్రకటన పుస్తకంపై మిరుమిట్లుగొలిపే మెరుపు ప్రకాశించింది. మగ శిశువు కాథోలిక్ మతాధికారానికి సూచనగా ఉండి, అన్యమతం మరియు రోమా పోపు మధ్య జరిగే యుద్ధాన్ని ప్రకటన 12వ అధ్యాయం వివరిస్తోందని భావించబడేది. అయితే ప్రకటన 11:15-18, దేవుని రాజ్య ఉద్భవాన్ని సూచిస్తూ, 12వ అధ్యాయపు భావంపై ఆ శీర్షిక చూపించింది.
3. ఏ ప్రచురణలు ప్రకటనపై అధిక వెలుగు ప్రసరింపజేశాయి?
3 రెండు సంపుటిలలో 1930 నందు వెలువడిన వెలుగు (ఆంగ్లం) అనే ప్రచురణతో, ఇదంతా కూడా ప్రకటనను గూర్చి స్పష్టమైన అవగాహనను పొందేందుకు నడిపించింది. అంతకంటే ఎక్కువ మార్పులు “మహా బబులోను కూలిపోయింది!” దేవుని రాజ్యము పరిపాలిస్తుంది! (ఆంగ్లం) (1963) మరియు “దేవుని మర్మము అప్పుడు ముగిసింది” (ఆంగ్లం) (1969) కనిపించాయి. అయినప్పటికీ, ప్రవచనార్థక ప్రకటన పుస్తకాన్ని గూర్చి తెలుసుకోవల్సింది ఇంకా ఎంతో ఉంది. అవును, 1988 నందు ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! (ఆంగ్లం) అన్న ప్రచురణ వెలువడడంతో కాంతివంతమైన వెలుగు ప్రకాశించింది. పందొమ్మిదివందల పద్నాలుగు నందు ప్రారంభమైన “ప్రభువు దినము”నకు ప్రకటనలోని ప్రవచనం అన్వయించబడుతుందన్న వాస్తవమే పురోగమమిస్తున్న ఈ జ్ఞానానికి మూలం అని చెప్పవచ్చు. వీటన్నింటికీ మూలం, ప్రకటనల ప్రవచనాలు “ప్రభువు దినము”కు అన్వయించబడతాయని చెప్పవచ్చు. (ప్రకటన 1:10) కనుక, ఆ దినం సమీపించేకొలది ప్రకటన పుస్తకం మరింత స్పష్టంగా అర్థంచేసుకోబడుతుంది.
“ఉన్నతాధికారులు” స్పష్టంచేయబడ్డాయి
4, 5. (ఎ) రోమీయులు 13:1ని బైబిలు విద్యార్థులు ఎలా దృష్టించారు? (బి) “ఉన్నతాధికారుల” విషయంలో లేఖనాధార స్థానమేమని తర్వాతి గ్రహించడం జరిగింది?
4 రోమీయులు 13:1 సంబంధంగా 1962 నందు ప్రకాశవంతమైన మెరుపు చూడడం జరిగింది. అది ఇలా చెప్పింది: “ప్రతి ఒక్కరూ ఉన్నతాధికారులకు లోబడివుండాలి [“పై అధికారులు” నూతన లోక అనువాదం].” (కింగ్ జేమ్స్ వర్షన్) అక్కడ ప్రస్తావించిన “ఉన్నతాధికారులు” లౌకికాధికారులను సూచిస్తోందని తొలి బైబిలు విద్యార్థులు అర్థంచేసుకున్నారు. ఓ క్రైస్తవుడు యుద్ధ సమయంలో చేర్చుకొనబడినట్లైతే, అతను యూనిఫార్మ్ వేసుకుని, తుపాకి చేతబుచ్చుకుని యుద్ధపంక్తిలో నిలుచునేలా చేయబడతాడనే అర్థాన్ని ఈ లేఖనం ఇస్తుందని భావించారు. ఓ క్రైస్తవుడు తన తోటివానిని చంపలేడు కనుక, పరిస్థితి మరీ విషమిస్తే తుపాకిని గాలిలోకి పేల్చేందుకు బలవంతం చేయబడతారని వారు భావించారు.a
5 నవంబరు 15 మరియు డిశంబరు 1, 1962 కావలికోటలు (ఆంగ్లం), మత్తయి 22:21 నందున్న విషయాన్ని చర్చించేటప్పుడు స్పష్టమైన వెలుగును ప్రసరింపజేశాయి: “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి.” అపొస్తలుల కార్యములు 5:29 నందు అపొస్తలుని మాటలు సమంజసమైనవే: ‘మనుష్యులకు కాదు దేవునికే మనం లోబడాలి.’ క్రైస్తవులు ‘ఉన్నతాధికారియైన’ కైసరుకు లోబడివుండాలి—అది, క్రైస్తవులు దేవుని విధికి విరుద్ధంగా వెళ్లనంతవరకు మాత్రమే. కైసరుకు లోబడివుండడం పాక్షికమైనదే, సంపూర్ణమైనది కాదు. దేవుడు కోరేవాటికి విరుద్ధమైనవి కానంతమట్టుకు క్రైస్తవులు కైసరువి కైసరుకు చెల్లించాలి. ఆ అంశంపై స్పష్టమైన అవగాహనను పొందడం ఎంత సంతృప్తికరంగా ఉంటుందో కదా!
వ్యవస్థీకరణ విషయాలపై మెరుపులు
6. (ఎ) క్రైస్తవమత సామ్రాజ్యమందు వ్యాప్తిలోనున్న ఆచారాధిపత్య విధానంనుండి వైదొలగేందుకుగాను ఏ సూత్రం గైకొనబడింది? (బి) సంఘాన్ని పర్యవేక్షించేపనిగల వారిని ఎన్నుకోవడానికి ఏ మార్గం సరైనదని చివరికి కనుగొన్నారు?
6 సంఘాల్లో పెద్దలుగానూ గురువులుగానూ ఎవరు పనిచేస్తారన్న విషయాన్ని గూర్చిన ప్రశ్న ఉత్పన్నమైంది. క్రైస్తవమత సామ్రాజ్యంలో ప్రఖ్యాతిగాంచిన ఆచారాధిపత్య పద్ధతిని నివారించేందుకు, ప్రతి సంఘంలోని సభ్యులు వోటు వేసి ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా వారు ఎన్నుకోబడాలని నిర్ణయించబడింది. అయితే సెప్టెంబరు 1 మరియు అక్టోబరు 15, 1932 కావలికోటల్లోని (ఆంగ్లం) అధికమైన వెలుగు, పెద్దలు ఎన్నుకోబడటాన్ని గూర్చి లేఖనాలు ఏ ఆధారాన్ని ఇవ్వడంలేదని చూపాయి. కనుక వీరికి బదులుగా సేవా కమిటీలు నియమించబడ్డాయి మరియు సేవా నిర్దేశకుని సొసైటి ఎన్నుకుంది.
7. సంఘంలో సేవకులు నియమించబడాల్సిన పద్ధతిలో అభివృద్ధి సాధించేందుకు మెరుపు ఎలా ఫలించింది?
7 జూన్ 1 మరియు జూన్ 15, 1938 కావలికోటల్లో, (ఆంగ్లం) సంఘంలోని సేవకులను ఎన్నుకోకూడదు, కానీ వారిని నియమించాలని అంటే దైవపరిపాలనా విధానాన్నిబట్టి నియమించాలనే మెరుపును కల్గివుంది. ప్రతి సంఘం కేవలం ఒక సంఘ సేవకునితో మాత్రమే నడిపించబడదని మరో మెరుపు 1971 నందు చూపించింది. బదులుగా, ప్రతి దానికీ యెహోవాసాక్షుల పరిపాలక సభ నియమించిన పెద్దల సభ, లేక అధ్యక్షుల సభ ఉండాలి. కనుక సుమారు 40 సంవత్సరాలుగా వెలుగు అధికమవ్వడం ద్వారా, పెద్దలు మరియు పరిచారకులని నేడు పిలవబడే నిర్దేశకుని మరియు పెద్దలు, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” పరిపాలక సభ ద్వారా నియమించబడాలని స్పష్టమైంది. (మత్తయి 24:45-47) ఇదంతాకూడా అపొస్తలుల సమయంలో జరిగినదానికి పోలివుంది. తిమోతి మరియు తీతు వంటి పురుషులు మొదటి శతాబ్దపు పరిపాలక సభ ద్వారా అధ్యక్షులుగా నియమించబడ్డారు. (1 తిమోతి 3:1-7; 5:22; తీతు 1:5-9) ఇదంతా యెషయా 60:17 నందున్న వాటి యొక్క సరైన నెరవేర్పే: “నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.”
8. (ఎ) సంస్థ పనిచేసే విధానంలో అధికమౌతున్న సత్యం ఎలాంటి అభివృద్ధిని తెచ్చింది? (బి) పరిపాలక సభలోని కమిటీలు ఏవి, మరియు వారి వారి కార్యక్రమ, లేక పర్యవేక్షణా పద్ధతులేవి?
8 వాచ్‌టవర్ సొసైటి పని చేసే విధానం కూడా ఇందులో ఇమిడివుంది. అనేక సంవత్సరాల వరకు యెహోవాసాక్షుల పరిపాలక సభ, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ పెన్సిల్వేనియాతో సమానార్థకంగా ఉండేది మరియు విషయాలన్నీ ముఖ్యంగా అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఉండేవి. పరిపాలక సభ, 1977 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఆంగ్లం) (258-9 పేజీలు) నందు చూపించబడినట్లుగా ఆరు కమిటీలతో పనిచేయడం ప్రారంభించింది, వాటిలో ప్రతొక్కటీ ప్రపంచవ్యాప్త పనిలో కొన్ని విషయాల ఎడల శ్రద్ధవహించేందుకు నియమించబడ్డాయి. సిబ్బంది వ్యవహారాల కమిటీ, బేతేలు కుటుంబంలో సేవచేసే వారి అవసరతతో సహా వ్యక్తిగత విషయాలతో వ్యవహరిస్తుంది. ప్రచారక కమిటీ, సంపత్తి మరియు ముద్రణ వంటి లౌకిక మరియు న్యాయ సంబంధమైన విషయాలన్నింటినీ చూసుకుంటుంది. సేవాకమిటీ సాక్ష్య పని విషయంలో శ్రద్ధ వహిస్తుంది, మరియు ప్రయాణకాపరులు, పయినీర్లు మరియు సంఘంలోని ప్రచారకుల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. బోధనా కమిటీ సంఘ కూటాలకు, ప్రత్యేక దిన సమావేశాలకు, ప్రాంతీయ సమావేశాలకు, జిల్లా మరియు అంతర్జాతీయ సమావేశాలకు అలాగే దేవుని ప్రజల ఆత్మీయ విద్యకొరకు వివిధ పాఠశాలలను నిర్వహించే బాధ్యతను వహిస్తుంది. రచనా కమిటీ, అన్నీ లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని నిర్థారిస్తూ అన్ని విధాలోన్ని ప్రచురణను సిద్ధపర్చడాన్ని మరియు అనువాదించే విషయాలను పర్యవేక్షిస్తుంది. అధ్యక్షుని కమిటీ అత్యవసరత మరియు ఇతర ఆవశ్యక విషయాలను చూసుకుంటారు.b అంతేకాకుండ 1970వ పడిలో, వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి కార్యాలయాలు ఒక అధ్యక్షునివల్ల కాకుండా ఓ కమిటీవల్ల పనిచేయడం ప్రారంభించారు.
క్రైస్తవ ప్రవర్తనకు సంబంధించిన వెలుగు
9. లోక ప్రభుత్వాలతో క్రైస్తవుల సంబంధాన్ని సత్యాన్ని గూర్చిన మెరుపు ఎలా ప్రభావం చేసింది?
9 క్రైస్తవ ప్రవర్తనకు చెందిన మెరుపులెన్నో ఉన్నాయి. ఉదాహరణకు, తటస్థత విషయాన్ని పరిగణించండి. నవంబరు 1, 1939 కావలికోటలో (ఆంగ్లం) కనిపించిన “తటస్థత” అనే శీర్షికలో ఈ విషయంపై కాంతివంతమైన మెరుపు ప్రకాశించింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన అది రావడం ఎంత సమయోచితంగా ఉంది! ఆ శీర్షిక తటస్థతను నిర్వచించింది మరియు క్రైస్తవులు రాజకీయ విషయాల్లో లేక రాజ్యాల మధ్య యుద్ధాల్లో పాల్గొనకూడదని చూపించింది. (మీకా 4:3, 5; యోహాను 17:14, 16) వారు అన్ని రాజ్యాల ద్వారా ద్వేషించబడేందుకు ఇది కారణమౌతుంది. (మత్తయి 24:9) మత్తయి 26:52 నందు యేసు స్పష్టపర్చినట్లుగా ప్రాచీన ఇశ్రాయేలు క్రైస్తవులకు ఏ ముంగుర్తును ఇవ్వడంలేదు. అంతేకాకుండ, ఏ ఒక్క రాజకీయ సంబంధ దేశం కూడా ప్రాచీన ఇశ్రాయేలులా నేడు దైవపరిపాలన కాదు, అంటే దేవునివల్ల పరిపాలించబడడం లేదు.
10. క్రైస్తవులు రక్తాన్ని ఎలా దృష్టించాలన్న విషయాన్ని గూర్చి మెరుపులు ఏమని బయల్పర్చాయి?
10 రక్తం యొక్క పవిత్రత విషయంలో కూడా వెలుగు ప్రకాశించింది. అపొస్తలుల కార్యములు 15:28, 29 నందు నిషేధించబడిన రక్తం ముఖ్యంగా యూదా క్రైస్తవులకు మాత్రమేనని బైబిలు విద్యార్థులు భావించారు. అయితే, అపొస్తలుల కాలంలో విశ్వాసులైన అన్యులకు కూడా అన్వయించబడిందని అపొస్తలుల కార్యములు 21:25 చూపుతోంది. కనుక జూలై 1, 1945 కావలికోట (ఆంగ్లం) నందు చూపించబడినట్లుగా రక్త పవిత్రత క్రైస్తవులందరికీ అన్వయించబడుతుంది. దాని భావం, రక్తంతో చేసిన సాసేజ్‌లా కేవలం జంతు రక్తాన్ని తీసుకోవడం విసర్జించడమే కాకుండ, రక్త మార్పిడి విషయంలోలా మానవ రక్తంనుండి కూడా వైదొలగాలి.
11. పొగాకు ఉపయోగం గూర్చిన క్రైస్తవ దృక్పథం విషయంలో ఏమి గ్రహించడం జరిగింది?
11 అధిక వెలుగు ఫలితంగా, మొదట ఊరికే తృణీకరించబడిన అలవాట్లు తర్వాత సరైన ఏహ్యభావంతో వ్యవహరించబడ్డాయి. దీనిలోని ఒక ఉదాహరణ పొగాకు ఉపయోగానికి సంబంధించింది. ఆగస్టు 1, 1895 జాయన్స్ వాచ్‌టవర్ (ఆంగ్లం) నందు సహోదరుడైన రస్సల్ 1 కొరింథీయులు 10:31 మరియు 2 కొరింథీయులు 7:1 వచనాలపైకి అవధానాన్ని మరల్చి ఇలా వ్రాశాడు: “ఏ క్రైస్తవుడైనా, పొగాకును ఏ విధంలో ఉపయోగించడమైనప్పటికీ, దేవుని మహిమకూ మరియు తన స్వంత ప్రయోజనానికి అది ఎలా పనిచేస్తుందో నేను గ్రహించలేను.” పొగాకును ఉపయోగించే ఏ వ్యక్తీ యెహోవాసాక్షి కాలేడని 1973 నుండి స్పష్టంగా అర్థంచేసుకోబడింది. జూదంలో ఏ యెహోవాసాక్షైనా పనిచేస్తూ, సంఘం ఎదుట మంచి పేరుగల్గి ఉండలేడని 1976 నందు స్పష్టం చేయబడింది.
ఇతర వికాసాలు
12. (ఎ) పేతురుకు అప్పగించిన రాజ్య తాళపు చెవులనేకాలను గూర్చి మెరుపు ఏమి బయల్పర్చింది? (బి) పేతురు ప్రతి తాళపు చెవిని ఉపయోగించిన సందర్భాలేమేమిటి?
12 యేసు పేతురుకు ఇచ్చిన సూచనార్థక తాళపు చెవులన్నిటిపైన కూడా అధిక వెలుగు కుమ్మరించబడింది. రాజ్య వారసులయ్యేలా ప్రజలకు త్రోవను తెరచిన రెండు తాళపు చెవులను పేతురు పొందాడని బైబిలు విద్యార్థులు విశ్వసించారు—వాటిలో ఒకటి సా.శ. 33 పెంతెకొస్తు నాడు యూదులకు మరియు మరొకటి అన్యమతస్థులకు, దీన్ని మొదటిసారిగా సా.శ. 36 నందు పేతురు కొర్నేలికి ప్రకటించినప్పుడు ఉపయోగించాడు. (అపొస్తలుల కార్యములు 2:14-41; 10:34-48) ఈ మధ్యకాలంలో అక్కడ ఒక మూడవ గుంపు ఉందని గ్రహించారు—అదే సమరయులు. వారికి రాజ్య అవకాశాన్ని తెరచినప్పుడు పేతురు రెండవ తాళపు చెవిని ఉపయోగించాడు. (అపొస్తలుల కార్యములు 8:14-17) ఆ విధంగా పేతురు కొర్నేలికి ప్రకటించినప్పుడు మూడవ తాళపు చెవి ఉపయోగించబడింది.—కావలికోట (ఆంగ్లం) అక్టోబరు 1, 1979, 16-22, 26 పేజీలు.
13. యోహాను 10 నందు ప్రస్తావించిన గొఱ్ఱెలమందను గూర్చిన వెలుగు కిరణాలు వేటిని బయల్పర్చాయి?
13 యేసు కేవలం రెండు మందలను మాత్రమేకాదు మూడింటిని సూచించాడని మరో మెరుపు ద్వారా తెలిసింది. (యోహాను 10వ అధ్యాయం) ఇవి (1) బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారపాలకునిగా ఉన్న యూదా గొఱ్ఱెలమంద (2) అభిషక్త రాజ్యవారసుల మంద మరియు (3) భూనిరీక్షణగల “వేరే గొఱ్ఱెల” మంద.—యోహాను 10:2, 3, 15, 16; కావలికోట, ఫిబ్రవరి 15, 1984, (ఆంగ్లం) 10-20 పేజీలు.
14. అసలు సునాదకాల ప్రారంభాన్ని గూర్చిన విషయాన్ని అధిక వెలుగు ఎలా స్పష్టపర్చింది?
14 మూల సునాదకాలమును గూర్చి స్పష్టీకరణను పొందారు. ధర్మశాస్త్రం క్రింద, ప్రతి 50వ సంవత్సరం ఓ మహా సునాదకాలం, మరి అందులో ఎవరి వస్తువులను వాటి యజమానులకు తిరిగిచ్చేవారు. (లేవీయకాండము 25:10) ఇది క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనను సూచిస్తోందని ఎంతో కాలంగా అర్థంచేసుకోబడింది. అయితే, ఆధునిక కాలంలో, కుమ్మరించబడిన పరిశుద్ధాత్మను పొందుతున్నవారు మోషే ధర్మశాస్త్ర బంధకంనుండి విడిపించబడినప్పుడు, మూల సునాదకాలం సా.శ. 33 పెంతెకొస్తునందు ప్రారంభమైందని గమనించబడింది.—కావలికోట జనవరి 1, 1987, (ఆంగ్లం) 18-28 పేజీలు.
పరిభాష విషయంలో అధిక వెలుగు
15. “యోజన” అనే పదం ఉపయోగంపైన ఏ వెలుగు ప్రకాశించింది?
15 “ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.” (ప్రసంగి 12:10) ఈ మాటలు మన ప్రస్తుత అంశానికి సరిగ్గా సరిపోతాయి, ఎందుకంటే సిద్ధాంతాలూ ప్రవర్తన వంటి ప్రాముఖ్యమైన విషయాలేకాదు కానీ, క్రైస్తవ పరిభాష విషయంలోను మరియు దాని సరైన అర్థం విషయంలోనూ వీటిని అన్వయించవచ్చు. ఉదాహరణకు, బైబిలు విద్యార్థులకు అతి ప్రీతిపాత్రమైన ప్రచురణ, లేఖనాల నుండి పఠనం నందలి యుగాల దైవిక యోజన (ఆంగ్లం) అనే మొదటి సంపుటి. అయితే, మానవులు మాత్రమే యోజనలను చేసినట్లుగా బైబిలు మాట్లాడుతుందని ఈ మధ్య కాలంలో గ్రహించడం జరిగింది. (సామెతలు 19:21) లేఖనాలు ఎక్కడా కూడా యెహోవా యోజనలను చేస్తున్నట్లుగా మాట్లాడం లేదు. ఆయన పథకం వేసుకోనవసరం లేదు. “కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పము చొప్పున . . . నిర్ణయించుకొనెను” అని ఎఫెసీయులు 1:9, 10 నందు ఉన్నట్లుగా, ఆయన అపారమైన జ్ఞానము శక్తులవల్ల ఆయన ఏది సంకల్పించినా అది తప్పకుండా సఫలమౌతుంది. కనుక “సంకల్పము” అనే పదం యెహోవాను సూచించేటప్పుడు ఎంతోసమంజసమని కనుగొనడం జరిగింది.
16. లూకా 2:14ను గూర్చిన సరైన అవగాహన ఏదని క్రమంగా గ్రహించడం జరిగింది?
16 ఆ తర్వాత లూకా 2:14ను గూర్చిన స్పష్టమైన అవగాహనను పొందే విషయమెచ్చింది. కింగ్ జేమ్స్ వర్షన్ నందు ఇలా ఉంది: “ఉన్నతంగా ఉన్న దేవునికి మహిమచెందునుగాక మరియు భూమికి శాంతియు మనుష్యులకు మంచియునుండునుగాక.” దేవుని మంచితనం దుష్టులకు వ్యక్తపర్చబడదు కనుక, ఇది సరైన భావాన్ని వ్యక్తపర్చడం లేదని గ్రహించడం జరిగింది. కాబట్టి, దేవుని ఎడల మంచిని కనపర్చే ప్రజలకు శాంతిని కలుగజేసే విషయమని సాక్షులు దాన్ని దృష్టించారు. కనుక బైబిలునందు ఆసక్తిగలవారిని మంచితనం గల వ్యక్తులుగా సూచిస్తూ వచ్చారు. అయితే మరలా, మంచి అన్నది మనుష్యుల పక్షంలోనిది కాదుగానీ దేవుని పక్షంలోనిదని అర్థంచేసుకోవడం జరిగింది. ఆ విధంగా, “ఆయన [దేవుడు] అంగీకరించే వ్యక్తులను” గూర్చి నూతన లోక అనువాదంలో (ఆంగ్లం) లూకా 2:14 అథఃస్సూచి చెబుతోంది. తమ సమర్పణకు తగినట్లుగా నడుచుకునే క్రైస్తవులందరికి దేవుని అనుగ్రహం ఉంది.
17, 18. యెహోవా దేన్ని నిరూపిస్తాడు, మరి దేన్ని పరిశుద్ధపరుస్తాడు?
17 అదే విధంగా, యెహోవా నామాన్ని నిరూపించడాన్ని గూర్చి సాక్షులు మాట్లాడేవారు. కానీ సాతాను యెహోవా నామంపై అపనమ్మకాన్ని వ్యక్తపర్చాడా? ఈ విషయానికొస్తే యెహోవాకు ఆ నామంపై ఏ హక్కు లేదనట్లుగా సాతాను ప్రతినిధులెవరైన అలా చేశారా? చేయనే లేదు. అక్కడ సవాలు చేయబడింది మరియు నిరూపించబడాల్సింది యెహోవా నామం కాదు. అందుకనే వాచ్‌టవర్ సొసైటి ఇటీవలి ప్రచురణలు యెహోవా నామాన్ని నిరూపించడాన్ని గూర్చి మాట్లాడటం లేదు. యెహోవా సర్వాధిపత్యం నిరూపించబడడాన్ని గూర్చి మరియు నామం పరిశుద్ధపర్చబడడాన్ని గూర్చి వారు మాట్లాడుతారు. అది “నీ నామము పరిశుద్ధపరచబడుగాక” అని ప్రార్థించమని యేసు మనకు చెప్పినదానికి అనుగుణంగా ఉంది. (మత్తయి 6:9) ఇశ్రాయేలీయులు సవాలు చేయలేదుకానీ అపవిత్రపర్చిన తన నామమును యెహోవా పరిశుద్ధపర్చుకోబోతున్నానని అనేక మార్లు చెప్పాడు.—యెహెజ్కేలు 20:9, 14, 22; 36:23.
18 ఆసక్తికరంగా, “నేనే యెహోవానని జనులు తెలుసుకుంటారు—అదెలా?” (ఆంగ్లం) అని 1971 నందు వెలువడిన పుస్తకం ఈ తేడాను చూపింది: “యెహోవా విశ్వాధిపత్యాన్ని నిరూపించేందుకు మరియు యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చేందుకు యేసుక్రీస్తు పోరాడుతాడు.” (364-5 పేజీలు) వెయ్యేండ్ల దేవుని పరిపాలన సమీపించింది (ఆంగ్లం) అన్న పుస్తకం 1973 నందు ఇలా చెప్పింది: “రాబోయే ‘మహా శ్రమలు,’ సర్వశక్తిమంతుడైన దేవుడు తన విశ్వాధిపత్యాన్ని నిరూపించుకుని మరియు ఆయన మహిమార్థమైన నామం పరిశుద్ధపర్చుకునే సమయమే.” (409వ పేజీ) తర్వాత 1975 నందు, లోక వేదననుండి మానవుని విముక్తి సమీపించింది! అన్న పుస్తకం ఇలా పేర్కొంది: “విశ్వచరిత్రలోనే గొప్ప సంఘటనలైన యెహోవా విశ్వసర్వాధిపత్యాన్ని నిరూపించడం ఆయన పవిత్రమైన నామాన్ని పరిశుద్ధతయైన అప్పుడు నెరవేరుతుంది.—281వ పేజీ.
19, 20. దేదీప్యమానమవుతున్న వెలుగు ఎడల మనం మన మెప్పును ఎలా చూపించగలము?
19 ఈ ఆత్మీయ వెలుగంతటిలోనూ యెహోవా ప్రజలు చలికాచుకోవడం ఎంత ఆశీర్వాదకరమోకదా! దానికి పూర్తి విరుద్ధంగా, క్రైస్తవమత సామ్రాజ్యంలోని మత నాయకులు తాము ఉన్నట్లుగా కనుగొన్న ఆత్మీయ అంధకారానికి ప్రతీకే, ఓ మతనాయకుడు చెప్పిన ఈ మాటలు: “పాపమెందుకు ఉంది? బాధలెందుకున్నాయి? అపవాది ఎందుకున్నాడు? నేను పరలోకానికి వెళ్లిన తర్వాత ప్రభువును ఈ ప్రశ్నలనడగాలని అనుకుంటున్నాను.” అయితే వీటి కారణాలను యెహోవాసాక్షులు అతనితో చెప్పగలరు: దాని కారణం, యెహోవా సర్వాధిపత్య హక్కు విషయంలోని వివాదాంశం మరియు అపవాది వ్యతిరేకత ఉన్నప్పటికీ మానవులు దేవుని ఎడల తమ యథార్థతను కాపాడుకోగలరా లేదానన్న ప్రశ్న.
20 సంవత్సరాలుగా, పెద్దవి మరియు చిన్న మెరుపులు యెహోవా సమర్పిత సేవకుల మార్గాన్ని వెలిగింపజేస్తూనే ఉన్నాయి. ఇది కీర్తన 97:11 మరియు సామెతలు 4:18 వంటి లేఖనాల నెరవేర్పే. అయితే, వెలుగులో నడవడం అంటే, దేదీప్యమానమవుతున్న వెలుగు ఎడల మెప్పుకల్గివుండడం మరియు దానికి అనుగుణంగా నడుచుకోవడం అని ఎన్నడూ మరవకుందాము. మనం చూసినట్లుగా, దేదీప్యమానమౌతున్న ఈ వెలుగులో మన ప్రవర్తన మరియు ప్రకటించే మన ఆజ్ఞ చేరివున్నాయి.
[అధస్సూచీలు]
a ఈ దృక్పథానికి ప్రతిస్పందిస్తూ, జూన్ 1 మరియు 15, 1929 కావలికోట, (ఆంగ్లం) “ఉన్నతాధికారులు” అంటే యెహోవా దేవుడ మరియు యేసుక్రీస్తు అని బావీకరించింది. ప్రాముఖ్యంగా 1962 నందు ఈ పరిస్థితిని సరిచేయడం జరిగింది.
b ఎజ్రా దినాల్లోని నెతీనీయులకు అనుగుణంగా, ఏప్రిల్ 15, 1992 కావలికోట, “వేరే గొఱ్ఱెల్లోని” ఎన్నుకోబడిన సహోదరులు పరిపాలక సభ కమిటీలకు సహాయంచేసేందుకు నియమించబడ్డారని ప్రకటించింది.—యోహాను 10:16; ఎజ్రా 2:58.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ ‘ఉన్నతాధికారికి’ విధేయులుగా ఉండడం విషయంలో ఏ వెలుగు ప్రకాశించబడింది?
◻ మెరుపు ఫలితంగా వ్యవస్థాపరమైన వికాసం సంభవించింది?
◻ అధిక వెలుగు క్రైస్తవ ప్రవర్తనను ఎలా ప్రభావితం చేసింది?
◻ కొన్ని లేఖనాధార విషయాలపై మన అవగాహనను మెరుగుపర్చేందుకు ఆత్మీయ మెరుపు ఏ శుద్ధీకరణను తెచ్చింది?
[25వ పేజీలోని చిత్రసౌజన్యం]
Keys on page 24: Drawing based on photo taken in Cooper-Hewitt, National Design Museum, Smithsonian Institution