బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లకోసం ప్రశ్నలు
1వ భాగం: క్రైస్తవ నమ్మకాలు
మీరు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ద్వారా సత్యాన్ని తెలుసుకున్నారు. మీరు నేర్చుకున్న విషయాలు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగివుండడానికి ఖచ్చితంగా మీకు సహాయం చేసివుంటాయి. అంతేకాదు, అవి భవిష్యత్తు జీవితం గురించి, దేవుని రాజ్యం కింద భూపరదైసులో ఉండే ఆశీర్వాదాల గురించి మీలో నిరీక్షణను కలిగించివుంటాయి. దేవుని వాక్యం మీద మీకున్న విశ్వాసం బలపడింది, అలాగే క్రైస్తవ సంఘంతో సహవసించడం వల్ల మీరు ఇప్పటికే ఎన్నో ఆశీర్వాదాలు పొందారు. నేడు యెహోవా తన ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నాడో మీరు అర్థంచేసుకున్నారు.—జెక. 8:23.
మీరు బాప్తిస్మానికి సిద్ధపడుతుండగా, సంఘ పెద్దలు మీతో నిర్వహించే ప్రాథమిక క్రైస్తవ నమ్మకాల పునఃసమీక్ష నుండి మీరు ప్రయోజనం పొందుతారు. (హెబ్రీ. 6:1-3) యెహోవాను తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నిటినీ ఆయన ఆశీర్వదించాలని, ఆయన వాగ్దానం చేసిన బహుమానాన్ని మీరు పొందాలని మేము కోరుకుంటున్నాం.—యోహా. 17:3.
1. మీరు బాప్తిస్మం తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు?
2. యెహోవా ఎవరు?
• “పైన ఆకాశంలో, కింద భూమ్మీద యెహోవాయే సత్యదేవుడు . . . ఆయన తప్ప వేరే దేవుడు లేడు.”—ద్వితీ. 4:39.
• “యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే భూమంతటి పైన మహోన్నతుడివి.”—కీర్త. 83:18.
3. మీరు దేవుని పేరు ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యం?
• “కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.’”—మత్త. 6:9.
• “యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.”—రోమా. 10:13.
4. యెహోవాను వర్ణించడానికి బైబిల్లో ఎలాంటి కొన్ని పదాలు ఉపయోగించబడ్డాయి?
• “దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నందుకు బాధలు పడుతున్నవాళ్లు, మంచి చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమను తాము అప్పగించుకుంటూ ఉండాలి.”—1 పేతు. 4:19.
• “పరలోకంలో ఉన్న మా తండ్రీ.”—మత్త. 6:9.
• “దేవుడు ప్రేమ.”—1 యోహా. 4:8.
5. యెహోవా దేవునికి మీరేమి ఇవ్వగలరు?
• “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.”—మార్కు 12:30.
• “నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి. ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి.”—లూకా 4:8.
6. యెహోవాకు మీరు ఎందుకు విశ్వసనీయంగా ఉండాలని అనుకుంటున్నారు?
• “నా కుమారుడా, తెలివిని సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు, అప్పుడు నన్ను నిందించేవాడికి నేను జవాబివ్వగలుగుతాను.”—సామె. 27:11.
7. మీరు ఎవరికి ప్రార్థిస్తారు, ఎవరి పేరున ప్రార్థిస్తారు?
• “మీరు నా [యేసు] పేరున తండ్రిని ఏది అడిగినా ఆయన దాన్ని మీకు ఇస్తాడని నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను.”—యోహా. 16:23.
8. మీరు ఏయే విషయాల గురించి ప్రార్థించవచ్చు?
• “కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి. నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి. మాకు ఈ రోజుకు అవసరమైన ఆహారం ఇవ్వు; మాకు అప్పుపడిన వాళ్లను మేము క్షమించినట్టే, మా అప్పులు కూడా క్షమించు. మమ్మల్ని ప్రలోభానికి లొంగిపోనివ్వకు, దుష్టుని నుండి మమ్మల్ని కాపాడు.’”—మత్త. 6:9-13.
• “మనకున్న నమ్మకం ఏమిటంటే, మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.”—1 యోహా. 5:14.
9. ఒక వ్యక్తి ప్రార్థనను యెహోవా ఎందుకు వినకపోవచ్చు?
• “ఆ సమయంలో వాళ్లు సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తారు, కానీ ఆయన వాళ్లకు జవాబివ్వడు. వాళ్ల చెడ్డపనుల్ని బట్టి . . . తన ముఖాన్ని తిప్పుకుంటాడు.”—మీకా 3:4.
• “యెహోవా కళ్లు నీతిమంతుల్ని చూస్తూ ఉంటాయి, ఆయన చెవులు వాళ్ల ప్రార్థనల్ని వింటాయి. అయితే యెహోవా ముఖం చెడ్డపనులు చేసేవాళ్లకు వ్యతిరేకంగా ఉంది.”—1 పేతు. 3:12.
10. యేసుక్రీస్తు ఎవరు?
• “సీమోను పేతురు, ‘నువ్వు క్రీస్తువి, జీవంగల దేవుని కుమారుడివి’ అన్నాడు.”—మత్త. 16:16.
11. యేసు భూమ్మీదకు ఎందుకు వచ్చాడు?
• “మానవ కుమారుడు . . . ఇతరులతో సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ ఇతరులకు సేవచేయడానికి, ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు.”—మత్త. 20:28.
• “నేను [యేసు] మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు.”—లూకా 4:43.
12. యేసు అర్పించిన బలికి మీరెలా కృతజ్ఞత చూపించవచ్చు?
• “బ్రతికున్నవాళ్లు ఇకమీదట తమకోసం జీవించకుండా, తమకోసం చనిపోయి బ్రతికించబడిన వ్యక్తి కోసం జీవించాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.”—2 కొరిం. 5:15.
13. యేసుకు ఏ అధికారం ఉంది?
• “పరలోకంలో, భూమ్మీద నాకు పూర్తి అధికారం ఇవ్వబడింది.”—మత్త. 28:18.
• “దేవుడు ఆయన్ని హెచ్చించి, అంతకుముందు కన్నా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు, దయతో అన్నిటికన్నా శ్రేష్ఠమైన పేరును ఆయనకు ఇచ్చాడు.”—ఫిలి. 2:9.
14. యెహోవాసాక్షుల పరిపాలక సభే యేసు నియమించిన “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” అని మీరు నమ్ముతున్నారా?
• “తన ఇంట్లోని సేవకులకు తగిన సమయంలో ఆహారం పెట్టేలా యజమాని వాళ్లమీద నియమించిన నమ్మకమైన, బుద్ధిగల దాసుడు నిజంగా ఎవరు?”—మత్త. 24:45.
15. పవిత్రశక్తి ఒక వ్యక్తా?
• ‘అప్పుడు దేవదూత ఇలా అన్నాడు: “పవిత్రశక్తి నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందుకే పుట్టబోయే బిడ్డ పవిత్రుడని, దేవుని కుమారుడని పిలవబడతాడు.”’—లూకా 1:35.
• “మీరు చెడ్డవాళ్లయినా మీ పిల్లలకు మంచి బహుమతుల్ని ఇవ్వడం మీకు తెలుసు, అలాంటిది పరలోకంలో ఉన్న తండ్రి తనను అడిగేవాళ్లకు ఇంకెంతగా పవిత్రశక్తిని ఇస్తాడో కదా!”—లూకా 11:13.
16. పవిత్రశక్తిని యెహోవా ఎలా ఉపయోగిస్తాడు?
• “యెహోవా మాటతో ఆకాశం చేయబడింది, ఆయన నోటి ఊపిరితో దానిలోని ప్రతీది చేయబడింది.”—కీర్త. 33:6.
• “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు; అప్పుడు . . . భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.”—అపొ. 1:8.
• “లేఖనాల్లో ఏ ప్రవచనం సొంత ఆలోచనల నుండి పుట్టదు . . . ఎందుకంటే ప్రవచనం ఎప్పుడూ మనిషి ఇష్టాన్ని బట్టి కలగలేదు కానీ మనుషులు పవిత్రశక్తితో ప్రేరేపించబడి, దేవుని నుండి వచ్చిన విషయాలు మాట్లాడారు.”—2 పేతు. 1:20, 21.
17. దేవుని రాజ్యం అంటే ఏమిటి?
• “ఆ రాజుల కాలాల్లో పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది ఎప్పటికీ నాశనం కాదు. ఆ రాజ్యం వేరే ఏ ప్రజల చేతుల్లోకి వెళ్లదు. అది ఆ రాజ్యాలన్నిటినీ నలగ్గొట్టి నాశనం చేస్తుంది, అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది.”—దాని. 2:44.
18. దేవుని రాజ్యం మీకు ఎలాంటి ప్రయోజనాల్ని తెస్తుంది?
• “వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”—ప్రక. 21:4.
19. త్వరలోనే ఈ భూమ్మీద రాజ్య ఆశీర్వాదాలు అనుభవిస్తామని మీకు ఎలా తెలుసు?
• “శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చి, ‘ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటి? మాతో చెప్పు’ అని అడిగారు. అప్పుడు యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: . . .‘ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, భూకంపాలు వస్తాయి. అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.’”—మత్త. 24:3, 4, 7, 14.
• “చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: తమను తాము ప్రేమించుకునేవాళ్లు, డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, దూషించేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, విశ్వసనీయంగా ఉండనివాళ్లు, మమకారం లేనివాళ్లు, మొండివాళ్లు, లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు, నమ్మకద్రోహులు, మూర్ఖులు, గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు, పైకి దైవభక్తి ఉన్నట్టు కనిపించినా, దానికి తగ్గట్టు జీవించనివాళ్లు.”—2 తిమో. 3:1-5.
20. మీరు రాజ్యాన్ని ముఖ్యమైనదిగా ఎంచుతున్నారని ఎలా చూపిస్తారు?
• “కాబట్టి మీరు ఆయన రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి.”—మత్త. 6:33.
• “అప్పుడు యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: ‘ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను ఇక తన కోసం తాను జీవించకుండా, తన హింసాకొయ్యను మోస్తూ నన్ను అనుసరిస్తూ ఉండాలి.’”—మత్త. 16:24.
21. సాతాను, చెడ్డదూతలు ఎవరు?
• “మీ తండ్రి అపవాది. . . . మొదటి నుండి అతను హంతకుడు.”—యోహా. 8:44.
• “దాంతో ఆ మహాసర్పం కిందికి పడేయబడింది. అది మొదటి సర్పం. దానికి అపవాది, సాతాను అనే పేర్లు ఉన్నాయి. అతను లోకమంతటినీ మోసం చేస్తున్నాడు. అతను భూమ్మీద పడేయబడ్డాడు, అతని దూతలు కూడా అతనితోపాటు పడేయబడ్డారు.”—ప్రక. 12:9.
22. సాతాను యెహోవాను, ఆయన్ని ఆరాధించేవాళ్లను ఏమని నిందించాడు?
• “స్త్రీ ఆ సర్పంతో ఇలా అంది: ‘మేము ఈ తోటలోని చెట్ల పండ్లను తినొచ్చు. కానీ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల గురించి దేవుడు, “మీరు దాని పండ్లను తినకూడదు, అసలు దాన్ని ముట్టకూడదు; లేకపోతే మీరు చనిపోతారు” అని చెప్పాడు.’ అందుకు సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: ‘మీరు చావనే చావరు. మీరు దాని పండ్లను తిన్న రోజునే మీ కళ్లు తెరుచుకుంటాయని, మీకు మంచిచెడులు తెలిసి మీరు దేవునిలా అవుతారని దేవునికి తెలుసు.’”—ఆది. 3:2-5.
• “సాతాను యెహోవాతో ఇలా అన్నాడు: ‘చర్మానికి బదులుగా చర్మాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకున్నవన్నీ మనిషి ఇచ్చేస్తాడు.’”—యోబు 2:4.
23. సాతాను వేసిన నిందలు తప్పని మీరెలా రుజువు చేస్తారు?
• “సంపూర్ణ హృదయంతో . . . [దేవుణ్ణి] సేవించు.”—1 దిన. 28:9.
• “చనిపోయేంతవరకు నా యథార్థతను విడిచిపెట్టను!”—యోబు 27:5.
24. ప్రజలు ఎందుకు చనిపోతున్నారు?
• “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.”—రోమా. 5:12.
25. చనిపోయినవాళ్ల స్థితి ఎలా ఉంటుంది?
• “బ్రతికున్నవాళ్లకు తాము చనిపోతామని తెలుసు, కానీ చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు.”—ప్రసం. 9:5.
26. చనిపోయిన వాళ్లకు ఎలాంటి నిరీక్షణ ఉంది?
• “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు తిరిగి బ్రతికిస్తాడు.”—అపొ. 24:15.
27. యేసుతో పరిపాలించడానికి ఎంతమంది పరలోకానికి వెళ్తారు?
• “ఇదిగో! ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉంది. ఆయన పేరు, ఆయన తండ్రి పేరు నొసళ్ల మీద రాయబడిన 1,44,000 మంది ఆయనతో పాటు ఉన్నారు.”—ప్రక. 14:1.