కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w21 అక్టోబరు పేజీలు 14-17
  • యెహోవాతో మీ స్నేహాన్ని బాగు చేసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాతో మీ స్నేహాన్ని బాగు చేసుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి?
  • చేరుకోగల లక్ష్యాలు పెట్టుకోండి
  • మీ ప్రయత్నాల్ని ఆపకండి!
  • ‘పెద్దల్ని పిలవండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • నేడు దేవుని కనికరమును అనుకరించుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • పెద్దలారా—అపొస్తలుడైన పౌలును అనుకరిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
w21 అక్టోబరు పేజీలు 14-17
పాడైన తన ఇంటిని తిరిగి కట్టడానికి ఎంత సమయం, కృషి అవసరమౌతాయో అని ఆలోచిస్తూ ఒక సహోదరుడు ఆందోళనపడుతున్నాడు.

యెహోవాతో మీ స్నేహాన్ని బాగు చేసుకోండి

ప్రతీ సంవత్సరం అమూల్యమైన గొర్రెల్లాంటి ఎంతోమంది క్రైస్తవ సంఘంలోకి తిరిగి చేర్చుకోబడుతున్నారు. వాళ్లలో ప్రతీఒక్కరు సంఘానికి తిరిగి వచ్చినప్పుడు పరలోకంలో ‘ఎంత సంతోషం’ కలుగుతుందో ఊహించుకోండి! (లూకా 15:7, 10) మీరు సంఘంలోకి తిరిగి చేర్చుకోబడ్డారా? అలాగైతే మీరు మళ్లీ సత్యం వైపు నిలబడినందుకు దేవదూతలు, యేసు, యెహోవా ఎంతో సంతోషించి ఉంటారనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. అయితే యెహోవాతో మీ స్నేహాన్ని బాగు చేసుకుంటుండగా, మీకు కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు. ఏంటా సవాళ్లు? వాటిని దాటడానికి మీరేం చేయవచ్చు?

మీకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి?

సంఘానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా చాలామంది అపరాధ భావాలతో నలిగిపోతుంటారు. బహుశా దావీదు రాజుకు అనిపించినట్టే వాళ్లకు అనిపించవచ్చు. తన పాపాలు క్షమించబడిన తర్వాత కూడా ఆయన ఇలా అన్నాడు: “నా తప్పులు నన్ను ముంచెత్తుతున్నాయి.” (కీర్త. 40:12; 65:3) ఒక వ్యక్తి యెహోవా దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత కూడా, తప్పు చేసినందుకు సిగ్గుపడుతూ అపరాధ భావాలతో చాలా సంవత్సరాలు నలిగిపోయే అవకాశం ఉంది. ఈషా అనుభవం పరిశీలించండి.a ఆమె 20 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత సంఘంలోకి తిరిగి చేర్చుకోబడింది. ఆమె ఇలా అంటుంది: “యెహోవా నన్ను క్షమించగలడు అని నమ్మడం నాకు చాలా కష్టమైంది.” అలా నిరుత్సాహపడితే, మీరు మళ్లీ ఆధ్యాత్మికంగా బలహీనపడే అవకాశం ఉంది. (సామె. 24:10) అలా జరగకుండా చూసుకోండి.

ఇంకొంతమంది యెహోవాతో తమకున్న స్నేహాన్ని బాగు చేసుకోవాలంటే చాలా కృషి అవసరం అని భయపడుతుండవచ్చు. సంఘానికి తిరిగి చేర్చుకోబడిన తర్వాత ఆనంద్‌ ఇలా అన్నాడు: “యెహోవాసాక్షిగా నేను నేర్చుకున్నవి, చేసినవి అన్నీ మర్చిపోయినట్టు నాకు అనిపించింది.” అలాంటి ఆలోచనల వల్ల, కొంతమంది ఆధ్యాత్మిక పనుల్లో పూర్తిగా పాల్గొనడానికి వెనకడుగు వేస్తుండవచ్చు.

ఉదాహరణకు, ఒకతను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు తుఫాను వల్ల బాగా పాడైపోయింది అనుకోండి. దాన్ని తిరిగి కట్టడానికి ఎంత సమయం, కృషి అవసరమౌతాయో అని ఆలోచించి అతను ఆందోళనపడవచ్చు. అదేవిధంగా ఘోరమైన పాపం చేయడం వల్ల యెహోవాతో మీ స్నేహం పాడైనప్పుడు, దాన్ని బాగు చేసుకోవాలంటే చాలా కృషి అవసరం అని మీరు భయపడవచ్చు. కానీ భయపడకండి, మీరు ఒంటరివాళ్లు కాదు.

యెహోవా ఇలా ఆహ్వానిస్తున్నాడు: “రండి, మన మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుందాం.” (యెష. 1:18) ‘వివాదాన్ని పరిష్కరించుకోవడానికి’ మీరు ఇప్పటికే ఎంతో కృషిచేశారు. అలా కృషి చేసినందుకు యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి: యెహోవా తన దగ్గరికి తిరిగి వచ్చిన మిమ్మల్ని చూపించి, సాతాను వేస్తున్న నిందలకు జవాబు ఇవ్వగలుగుతాడు!—సామె. 27:11.

మీరు సంఘానికి తిరిగి రావడం ద్వారా ఇప్పటికే యెహోవాకు దగ్గరయ్యారు, కాబట్టి తాను కూడా మీకు దగ్గరౌతానని ఆయన మాటిస్తున్నాడు. (యాకో. 4:8) ఇతరులు మిమ్మల్ని మళ్లీ సంఘంలో ఒకరిగా చూడడం మంచిదే, కానీ అదొక్కటే సరిపోదు. మీ తండ్రి, స్నేహితుడు అయిన యెహోవా మీద మీ ప్రేమను పెంచుకుంటూ ఉండాలి. దాన్ని మీరు ఎలా చేయవచ్చు?

చేరుకోగల లక్ష్యాలు పెట్టుకోండి

మీరు చేరుకోగల లక్ష్యాల్ని పెట్టుకుంటూ ఉండండి. మీ ఆధ్యాత్మిక పునాది అంటే యెహోవా గురించి, ఆయన వాగ్దానాల గురించి మీకున్న జ్ఞానం బహుశా పాడయ్యి ఉండకపోవచ్చు. కానీ మీరు ఇంటిని తిరిగి కట్టాలి, అందుకోసం మీరు మంచివార్త ప్రకటిస్తూ, సహోదర సహోదరీలతో సహవసిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఈ లక్ష్యాల గురించి ఆలోచించండి.

యెహోవాతో ఎక్కువగా మాట్లాడండి. అపరాధ భావాలతో నలిగిపోవడం వల్ల, ప్రార్థన చేయడం మీకు కష్టంగా ఉండవచ్చని మీ పరలోక తండ్రి అర్థం చేసుకుంటాడు. (రోమా. 8:26) ప్రార్థించడం కష్టంగా ఉన్నా, మీరు ఆయన స్నేహాన్ని ఎంతగా కోరుకుంటున్నారో చెప్తూ “పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండండి.” (రోమా. 12:12) అనిల్‌ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “తప్పు చేసినందుకు సిగ్గుతో, అపరాధ భావాలతో నేను నలిగిపోయేవాణ్ణి. కానీ ప్రార్థన చేసిన ప్రతీసారి ఆ భావాలు తగ్గి, మనశ్శాంతిగా అనిపించేది.” దేని గురించి ప్రార్థించాలో మీకు తెలియకపోతే, దావీదు రాజు పశ్చాత్తాపపడుతూ చేసిన ప్రార్థనల్ని పరిశీలించండి. అవి 51 వ కీర్తనలో, 65 వ కీర్తనలో ఉన్నాయి.

బైబిల్ని క్రమంగా అధ్యయనం చేయండి. దానివల్ల మీకు ఆధ్యాత్మిక పోషణ అందుతుంది, యెహోవా మీద మీకున్న ప్రేమ పెరుగుతుంది. (కీర్త. 19:7-11) ఫిలిప్‌ ఇలా చెప్తున్నాడు: “బైబిలు చదవడాన్ని నిర్లక్ష్యం చేసినందు వల్లే నేను బలహీనపడ్డాను, యెహోవాను బాధపెట్టాను. నేను ఆ తప్పు రెండోసారి చేయాలనుకోవట్లేదు. అందుకే బైబిల్ని క్రమంగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాను.” మీరు కూడా అదే చేయవచ్చు. మీరు ఏ అంశాలు అధ్యయనం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి, పరిణతిగల స్నేహితుల సహాయం తీసుకోవచ్చు.

సహోదర సహోదరీలతో మీకున్న స్నేహాన్ని తిరిగి బలపర్చుకోండి. సంఘానికి తిరిగి వచ్చిన కొంతమంది, ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని కంగారు పడుతుండవచ్చు. లత ఇలా చెప్పింది: “తప్పు చేసినందుకు నాకు చాలా సిగ్గేసింది, సంఘానికి ద్రోహం చేసినట్టు అనిపించింది. ఆ ఆలోచనలు చాలాకాలంపాటు నన్ను వెంటాడాయి.” యెహోవాతో మీకున్న స్నేహాన్ని బాగు చేసుకోవడానికి పెద్దలు, పరిణతిగల స్నేహితులు మీకు సహాయం చేయాలనుకుంటున్నారు, కాబట్టి ధైర్యంగా ఉండండి. (“పెద్దలు ఏం చేయవచ్చు?” అనే బాక్సు చూడండి.) మీరు తిరిగి వచ్చినందుకు వాళ్లు సంతోషిస్తున్నారు, అంతేకాదు మీరు ఆనందంగా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు!—సామె. 17:17.

మీరెలా సంఘానికి మరింత దగ్గరవ్వచ్చు? సహోదర సహోదరీలు చేస్తున్న పనుల్లో పూర్తిగా పాల్గొనండి. అంటే క్రమంగా మీటింగ్స్‌కి, పరిచర్యకు వెళ్లండి. దానివల్ల ఉపయోగం ఏంటి? పవన్‌ ఇలా అంటున్నాడు: “నేను తిరిగి రావాలని సంఘంలో వాళ్లు చాలా ఎదురుచూశారు. వాళ్లు నాకు విలువ ఇస్తున్నట్టు అనిపించింది. వాళ్లందరూ చేసిన సహాయం వల్ల నేను మళ్లీ సంఘంలో ఒకడిని అయ్యానని, యెహోవా నన్ను క్షమించాడని, నేను ఆయన సేవలో కొనసాగవచ్చని నమ్మకం కుదిరింది.”—“మీరేం చేయవచ్చు?” అనే బాక్సు చూడండి.

మీరేం చేయవచ్చు?

మీ ఆధ్యాత్మిక ఇంటిని తిరిగి నిర్మించుకోండి.

యెహోవా దగ్గరికి తిరిగి వచ్చిన సహోదరుడిని కలిసి, ఒక సంఘ పెద్ద ప్రార్థన చేస్తున్నాడు.

యెహోవాతో ఎక్కువగా మాట్లాడండి

మీరు తన స్నేహాన్ని ఎంతగా కోరుకుంటున్నారో యెహోవాకు చెప్పండి. పెద్దలు మీ కోసం ప్రార్థిస్తారు, మీతో కలిసి ప్రార్థిస్తారు.

ఆ సంఘ పెద్ద “యెహోవాకు సన్నిహితమవండి” పుస్తకంతో ఆ సహోదరునికి స్టడీ ఇస్తున్నాడు.

బైబిల్ని క్రమంగా అధ్యయనం చేయండి

మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా పోషించుకుంటూ ఉండండి, దానివల్ల యెహోవా మీద మీకున్న ప్రేమ పెరుగుతుంది.

ఆ సహోదరుడు సంఘంలోని ఇతరులతో కలిసి మాట్లాడుతూ, సరదాగా సమయం గడుపుతున్నాడు.

సంఘంలోని వాళ్లతో మీ స్నేహాన్ని బలపర్చుకోండి

సంఘంలోని వాళ్లతో కలిసి మీటింగ్స్‌లో, పరిచర్యలో పూర్తిగా పాల్గొనండి.

మీ ప్రయత్నాల్ని ఆపకండి!

యెహోవాతో మీ స్నేహాన్ని బాగు చేసుకుంటుండగా, సాతాను మిమ్మల్ని బలహీనపర్చడానికి తుఫాను లాంటి పరీక్షల్ని తెస్తూనే ఉంటాడు. (లూకా 4:13) కాబట్టి ఇప్పుడే మీ ఆధ్యాత్మిక ఇంటిని పటిష్ఠం చేసుకుని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.

యెహోవా తన గొర్రెల గురించి ఇలా మాటిస్తున్నాడు: “నేను తప్పిపోయిన దాన్ని వెదుకుతాను, దారితప్పిన దాన్ని వెనక్కి తీసుకొస్తాను, గాయపడిన దానికి కట్టుకడతాను, బలహీనంగా ఉన్నదాన్ని బలపరుస్తాను.” (యెహె. 34:16) తనతో ఉన్న స్నేహాన్ని బాగు చేసుకునేలా యెహోవా చాలామందికి సహాయం చేశాడు. తనతో బలమైన స్నేహాన్ని కలిగి ఉండేలా ఆయన మీకు కూడా సహాయం చేయాలనుకుంటున్నాడు అనే నమ్మకంతో ఉండండి.

పెద్దలు ఏం చేయవచ్చు?

పాడైన తన ఇంటిని తిరిగి కట్టుకోవడానికి ఆ సంఘ పెద్ద సహోదరునికి సహాయం చేస్తున్నాడు.

సంఘంలోకి తిరిగి చేర్చుకోబడిన వాళ్లు యెహోవాతో తమకున్న స్నేహాన్ని బాగు చేసుకోవడానికి పెద్దలు ఎంతో సహాయం చేస్తారు. పెద్దలు ఎలా సహాయం చేయవచ్చో గమనించండి.

భరోసా ఇవ్వండి. పశ్చాత్తాపపడిన వ్యక్తి ‘తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయే’ అవకాశం ఉందని అపొస్తలుడైన పౌలుకు తెలుసు. (2 కొరిం. 2:7) ఆ వ్యక్తి సిగ్గుతో, అపరాధ భావాలతో నలిగిపోయే అవకాశం ఉంది. అందుకే పౌలు సంఘానికి ఈ సలహా ఇచ్చాడు: “దయతో అతన్ని క్షమించి ఓదార్చండి.” తిరిగి చేర్చుకోబడిన వాళ్లకు యెహోవా, తోటి విశ్వాసులు తమను ఎంతో ప్రేమిస్తున్నారు అనే భరోసా అవసరం. వాళ్లను మెచ్చుకుంటూ, అవసరమైన సహాయం చేస్తూ ఉంటే వాళ్లు నిరుత్సాహంలో కూరుకుపోకుండా ఉండగలుగుతారు.

కలిసి ప్రార్థించండి. “నీతిమంతుడు పట్టుదలగా చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది.” (యాకో. 5:16) ముందు చెప్పిన లత ఇలా అంటుంది: “నా సందేహాలు, భయాల గురించి పెద్దలతో మాట్లాడాను. వాళ్లు నాకోసం ప్రార్థన చేశారు. సంఘ పెద్దలు నా మీద కోపంగా లేరు గానీ, యెహోవాతో నా స్నేహాన్ని బాగు చేసుకునేలా సహాయం చేయాలనుకుంటున్నారు అని అప్పుడు నాకు అర్థమైంది.” థామస్‌ ఇలా అంటున్నాడు: “పెద్దలు చేసిన ప్రార్థనల వల్ల, యెహోవా నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని నమ్మకం కుదిరింది; యెహోవా నా తప్పుల్నే కాదు, నాలో ఉన్న మంచిని కూడా చూస్తున్నాడని అర్థంచేసుకున్నాను.”

స్నేహం చేయండి. తిరిగి చేర్చుకోబడిన వాళ్లకు సంఘంలో స్నేహితులు అవసరం. జాన్సన్‌ అనే సంఘ పెద్ద ఇలా చెప్తున్నాడు: “ఏ అవకాశం దొరికినా, మీతో కలిసి పరిచర్య చేయడానికి వాళ్లను ఆహ్వానించండి. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లను పలకరించండి. వాళ్లకు స్నేహితులవ్వడం చాలాచాలా ప్రాముఖ్యం!” హర్ష అనే సంఘ పెద్ద ఇలా చెప్తున్నాడు: “తిరిగి చేర్చుకోబడిన వాళ్లతో పెద్దలు స్నేహం చేసినప్పుడు, అది చూసి సంఘంలోని మిగతావాళ్లు కూడా స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారు.”

అధ్యయనం చేసే విషయంలో సహాయం చేయండి. తిరిగి చేర్చుకోబడిన వాళ్లు క్రమంగా బైబిల్ని అధ్యయనం చేసేలా పరిణతిగల స్నేహితులు సహాయం చేయవచ్చు. దిలీప్‌ అనే సంఘ పెద్ద ఇలా చెప్తున్నాడు: “నా వ్యక్తిగత అధ్యయనంలో కనుగొన్న రత్నాల్ని పంచుకోవడం అంటే నాకు ఇష్టం. బైబిల్ని అధ్యయనం చేయడం నాకు ఎంత ఇష్టమో వాళ్లకు ఉత్సాహంగా చెప్తుంటాను. అంతేకాదు, వాళ్లతో కలిసి కొంత సమాచారాన్ని అధ్యయనం చేసేలా కూడా ఏర్పాటు చేసుకుంటాను.” కార్తీక్‌ అనే సంఘ పెద్ద ఇలా చెప్తున్నాడు: “వాళ్ల లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న బైబిల్లోని వ్యక్తుల గురించి అధ్యయనం చేయమని నేను చెప్తుంటాను.”

మంచి కాపరిగా ఉండండి. తిరిగి చేర్చుకోబడిన వాళ్లు సంఘ పెద్దల్ని న్యాయమూర్తులుగా చూసుంటారు. కానీ ఇప్పుడు వాళ్లు సంఘ పెద్దల్ని కాపరులుగా చూడడం చాలా ప్రాముఖ్యం. (యిర్మీ. 23:4) వినడానికి, మెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. వాళ్లతో తరచూ మాట్లాడండి. మనోజ్‌ అనే సంఘ పెద్ద తాను కాపరి సందర్శనాలు ఎలా చేస్తాడో చెప్తున్నాడు: “మేము లేఖనాల నుండి ఒక విషయం చెప్తాం, వాళ్లను మెచ్చుకుంటాం, వాళ్లు తిరిగి రావడానికి కృషి చేస్తున్నందుకు మేము అలాగే యెహోవా గర్వపడుతున్నామని చెప్తాం. వెళ్లిపోయేటప్పుడు మళ్లీ కలిసే తేదీని కూడా వాళ్లకు చెప్తాం.”

a అసలు పేర్లు కావు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి