ఆమోసు
8 సర్వోన్నత ప్రభువైన యెహోవా నాకు దర్శనంలో వేసవికాల పండ్ల గంప ఒకటి చూపించాడు. 2 తర్వాత ఆయన నన్ను, “ఆమోసూ, నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. అందుకు నేను, “వేసవికాల పండ్ల గంప కనిపిస్తోంది” అని చెప్పాను. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయుల అంతం వచ్చేసింది. నేనిక వాళ్లను క్షమించను.+ 3 ‘ఆ రోజు, ఆలయంలో పాడే పాటలు ఏడ్పులుగా మారతాయి,+ ప్రతీచోట శవాలు కుప్పలుగా పడివుంటాయి,+ అంతటా నిశ్శబ్దం ఆవరిస్తుంది!’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
4 పేదల్ని అణగదొక్కుతున్న వాళ్లారా,
దేశంలోని సాత్వికుల్ని అంతం చేస్తున్న వాళ్లారా,+ ఈ మాట వినండి.
5 మీరు ఇలా అంటున్నారు: ‘మనం ధాన్యం అమ్ముకునేలా అమావాస్య పండుగ ఎప్పుడు అయిపోతుందో?+
ధాన్యాన్ని అమ్మకానికి పెట్టేలా విశ్రాంతి రోజు*+ ఎప్పుడు ముగుస్తుందో?
అప్పుడు మనం ఈఫా* కొలతను చిన్నది చేసి,
షెకెల్* బరువును పెంచి,
దొంగత్రాసుతో మోసం చేయవచ్చు;+
6 అవసరంలో ఉన్నవాళ్లను వెండితో,
పేదవాళ్లను ఒక జత చెప్పులతో కొనవచ్చు.+
పనికిరాని ధాన్యాన్ని అమ్ముకోవచ్చు.’
7 యాకోబు వైభవమైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి+ ఇలా అంటున్నాడు:
‘వాళ్లు చేసిన ఏ పనినీ నేను ఎప్పటికీ మర్చిపోను.+
దేశమంతా నైలు నదిలా ఉప్పొంగుతుంది,
పోటెత్తే ఐగుప్తు దేశపు నైలు నదిలా అల్లకల్లోలంగా మారుతుంది.’+
9 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
‘ఆ రోజు నేను మిట్టమధ్యాహ్నమే సూర్యుడు అస్తమించేలా చేస్తాను,
పట్టపగలే దేశాన్ని చీకటిమయం చేస్తాను.+
10 మీ పండుగల్ని దుఃఖించే రోజులుగా,+
మీ పాటలన్నిటినీ శోకగీతాలుగా మారుస్తాను.
నేను వాళ్లందరి నడుముకు గోనెపట్ట కడతాను, ప్రతీ తలను బోడి చేస్తాను;
ఆ దుఃఖం, ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినప్పుడు కలిగే దుఃఖంలా ఉంటుంది,
అది చాలా బాధాకరమైన రోజుగా ముగుస్తుంది.’
11 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
‘ఇదిగో! నేను దేశం మీదికి కరువు రప్పించే రోజులు వస్తున్నాయి,
అది ఆహారం కోసమో, నీళ్ల కోసమో తపించే కరువు కాదు,
యెహోవా మాటలు వినడం కోసం తపించే కరువు.+
12 వాళ్లు సముద్రం నుండి సముద్రం వరకు,
ఉత్తరం నుండి తూర్పు* వరకు ఆయాసపడుతూ తిరుగుతారు.
వాళ్లు యెహోవా మాటల కోసం వెదుకుతూ అటూఇటూ తిరుగుతారు, కానీ అవి వాళ్లకు దొరకవు.
13 ఆ రోజు అందమైన కన్యలు, అలాగే యువకులు
దాహంతో మూర్ఛపోతారు;
14 సమరయ అపరాధం+ మీద ప్రమాణం చేసి,
“దానూ! నీ దేవుని జీవం తోడు,”+
“బెయేర్షెబా మార్గం+ తోడు!”
అని చెప్పేవాళ్లు పడిపోతారు, వాళ్లు మళ్లీ లేవరు.’ ”+