సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. దావీదు బత్షెబతో+ వ్యభిచారం చేసిన తర్వాత నాతాను ప్రవక్త అతని దగ్గరికి వచ్చినప్పటిది.
51 దేవా, నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నా మీద దయ చూపించు.+
నీ గొప్ప కరుణను బట్టి నా అపరాధాల్ని తుడిచేయి.+
2 నా తప్పును పూర్తిగా కడిగేయి,+
నా పాపం పోయేలా నన్ను శుభ్రం చేయి.+
3 నా అపరాధాలు నాకు బాగా తెలుసు,
నా పాపం ఎప్పుడూ నా ఎదుటే ఉంది.+
4 నీకు వ్యతిరేకంగా, ముఖ్యంగా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను;+
నీ దృష్టికి చెడ్డపని చేశాను.+
కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు నీతిమంతునిగా ఉంటావు,
తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతునిగా ఉంటావు.+
5 నేను పుట్టడమే దోషంతో పుట్టాను,
పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది.+
6 నువ్వు అంతరంగంలోని సత్యాన్ని చూసి సంతోషిస్తావు;+
నా హృదయానికి నిజమైన తెలివిని నేర్పించు.
7 నేను పవిత్రుణ్ణి అయ్యేలా హిస్సోపుతో నా పాపాన్ని శుద్ధి చేయి,+
మంచుకన్నా తెల్లగా అయ్యేలా నన్ను కడుగు.
8 నువ్వు నలగ్గొట్టిన ఎముకలు సంతోషించేలా,+
ఆనంద ధ్వనుల్ని, ఉల్లాస ధ్వనుల్ని నాకు వినిపించు.
9 నా పాపాల నుండి నీ ముఖాన్ని పక్కకు తిప్పుకో,+
నా తప్పులన్నిటినీ తుడిచేయి.+
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించు,
స్థిరంగా ఉండే కొత్త మనోవైఖరిని నాకు ఇవ్వు.+
11 నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు;
నీ పవిత్రశక్తిని నా నుండి తీసేయకు.
12 నీ రక్షణవల్ల వచ్చే ఆనందాన్ని మళ్లీ నాలో కలగజేయి;
నీకు లోబడాలనే కోరికను నాలో రేపు.
13 అప్పుడు, పాపులు నీ దగ్గరికి తిరిగొచ్చేలా,
అపరాధాలు చేసేవాళ్లకు నీ మార్గాల్ని బోధిస్తాను.+
14 దేవా, నా రక్షకుడివైన దేవా,+ నా నాలుక సంతోషంగా నీ నీతిని ప్రకటించేలా,+
రక్తాపరాధం నుండి నన్ను కాపాడు.
15 యెహోవా, నా నోరు నిన్ను స్తుతించేలా+
నా పెదాలు తెరువు.
16 నువ్వు బలిని కోరుకోవు, లేదంటే నేను ఇచ్చేవాణ్ణే;+
సంపూర్ణ దహనబలి నిన్ను సంతోషపెట్టదు.+
17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి;
దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.+
18 నీ దయతో సీయోనుకు మేలు చేయి;
యెరూషలేము ప్రాకారాల్ని పటిష్ఠం చేయి.
19 అప్పుడు నీతిమంతులు అర్పించే బలుల్ని,
దహనబలుల్ని, సంపూర్ణ బలుల్ని చూసి నువ్వు సంతోషిస్తావు;
నీ బలిపీఠం మీద ఎద్దులు అర్పించబడతాయి.