తికమకపెట్టే ప్లాటిపస్
ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
శాస్త్రజ్ఞులు మొట్ట మొదట ప్లాటిపస్‌ను చూసినప్పుడు దానిని ఏ విధంగా వర్గీకరించాలో వారికి అర్థం కాలేదు. ఒక కిలోగ్రాము బరువు తూగే ఈ జంతువు వారి విజ్ఞానశాస్త్ర నమ్మకాలలో కొన్నింటిని తలక్రిందులుగా చేసిన పరస్పర విరుద్ధమైన, వైరుధ్యమైన లక్షణాలను కలిగివుంది. ఈ విశిష్టమైన చిన్ని ఆస్ట్రేలియా వాసిని—ఆకర్షణీయమైన, సిగ్గుపడే స్నేహపాత్రమైన ఈ ప్రాణిని కలవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అయితే మొదట మనం మొట్టమొదటి ప్లాటిపస్ చర్మం బ్రిటిష్ శాస్త్రజ్ఞుల దృష్టిలో పడ్డప్పుడు అది సృష్టించిన కలకలాన్ని చూడడానికి 1799వ సంవత్సరానికి వెనక్కి వెళ్దాం.
బ్రిటిష్ మ్యూజియమ్ యొక్క నాచురల్ హిస్టరీ విభాగంలోని అసిస్టెంట్ కీపర్ అయిన డా. షా గురించి, “ఆయన నిజంగా [తన కళ్లను తనే] నమ్మలేకపోయాడు” అని ఒక ఎన్‌సైక్లోపీడియా అంటుంది. ఆయన “ఒక [నాలుగుకాళ్ల జంతువు] శరీరానికి బాతు ముక్కును ఎవరో అంటుగట్టారని” అనుమానించాడు. “ఆయన ముక్కును [తీసి] వేయడానికి ప్రయత్నించాడు, నేడు ఆయన చేసిన కత్తెర గుర్తులను ఇంకా ఆ అసలైన చర్మంపైన చూడవచ్చు.”
చర్మం అసలైనదే అని కనుగొన్నప్పటికీ శాస్త్రజ్ఞులు కలవరపడ్డారు. “చదునైన పాదములు గలది” అని అర్థంగల ప్లాటిపస్‌కు చాలామట్టుకు పక్షివంటి ప్రత్యుత్పత్తి ఏర్పాటు ఉంది కానీ స్తన గ్రంథులు లేదా పాల గ్రంథులు కూడా ఉన్నాయి. పరస్పర విరుద్ధమని అనిపించే ఇది ఈ ప్రశ్నను లేవనెత్తింది: ఈ అసంభావ్య ప్రాణి గ్రుడ్లు పెట్టిందా, లేక పెట్టలేదా?
ప్లాటిపస్ నిజంగా గ్రుడ్లు పెట్టిందని సంవత్సరాల తరబడి జరిగిన వివాదం తర్వాత కనుగొనబడింది. కానీ ఏదైనా విషయం క్రొత్తగా కనుగొన్న ప్రతీసారి చిక్కు సమస్య మరింత క్లిష్టమౌతూ వచ్చింది. (1) అది గ్రుడ్లు పెడుతుంది కానీ స్తన గ్రంథులున్నాయి; (2) బొచ్చు ఉంది కానీ బాతు ముక్కు ఉంది; (3) శీతల రక్తమున్న సరీసృపం లక్షణాలుగల అస్తిపంజరం ఉంది కానీ అది వెచ్చని రక్తంగలది. ఇటువంటి ప్రాణిని మీరు ఏ విధంగా వర్గీకరిస్తారు?
సమయం గడిచే కొలది శాస్త్రజ్ఞులు ప్లాటిపస్ మోనోట్రమాటా క్రమంలోని క్షీరదం అని అంగీకరించారు. సరీసృపంలాగా మోనోట్రమ్‌కు గ్రుడ్లు, శుక్రకణము, మలము, మూత్రము బయటికి రావడానికి ఒక ద్వారం లేదా రంధ్రం ఉంటుంది. ఉనికిలో ఉన్న మరొక మోనోట్రమ్ ఎకిడ్నా మాత్రమే. ప్లాటిపస్‌కు ఇవ్వబడిన శాస్త్రీయ నామం ఆర్నిథోరింకస్ అనాటినస్, దీనర్థం “పక్షి ముట్టె ఉన్న బాతు వంటి జంతువు.”
మనం ఒక ప్లాటిపస్‌ను కలుద్దాం
మనం ఒక జంతు ప్రదర్శనశాలకు వెళ్లవచ్చు, కానీ మర్మమైన ప్లాటిపస్‌ను అరణ్యంలోనే కనుగొనడం ఒక విశిష్టమైన అనుభవంగా ఉండగలదు—ఎంతోమంది ఆస్ట్రేలియావారు కూడా ఈ అనుభవాన్ని పొంది ఉండరు. మన అన్వేషణ తూర్పు ఆస్ట్రేలియాలో సిడ్నీకి పశ్చిమాన బ్లూ మౌంటెన్స్‌లో మొదలౌతుంది, అయితే ఆస్ట్రేలియాకు తూర్పువైపున అనేకమైన మంచినీటి నదులు, కాలువలు, సరస్సులలో కూడా ప్లాటిపస్‌లు కనబడతాయి.
సూర్యోదయానికి ముందు గాజులాంటి నది మీదుగా ఉన్న ఒక పాత చెక్క వంతెన మీదికి మనం చేరుకుంటాము, నదికి ఇరువైపులా యూకలిప్టస్ చెట్లున్నాయి. పైభాగం మాత్రమే కన్పించే స్థూలరూపం నీటిమీదుగా ప్రత్యక్షమవ్వడాన్ని చూసేందుకు మనం ఓర్పుతోను, నిశ్శబ్దంగాను ఎదురు చూస్తాము. త్వరలోనే మనకు ఫలితం దక్కుతుంది. నదికి ఎగువన దాదాపు 50 మీటర్ల దూరంలో ఒక ఆకారం మన వైపు వస్తూ కన్పిస్తుంది. మనం ఏమాత్రం కదలకుండా ఉండిపోవాలి.
దాని ముక్కు నుండి వెలువడుతున్న చిన్న అలల సమూహం అది ప్లాటిపస్ అని రూఢిపరుస్తుంది. ప్లాటిపస్ నది అడుగున ఆహారాన్వేషణలో తన బుగ్గల్లోని సంచుల్లో కూర్చుకున్న ఆహారాన్ని నములుతూ ఉండడంవల్ల ఆ అలలు ఏర్పడతాయి. దాని ఆహారం ఋతువులకు అనుగుణంగా మారుతున్నప్పటికీ ప్రాథమికంగా పురుగులు, కీటకాల డింభకాలు, మంచినీటి రొయ్యల వంటి వాటిని అది తింటుంది.
ప్లాటిపస్‌కున్న చిన్న శరీరం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందా? అనేకమంది ఆశ్చర్యపడతారు. ప్లాటిపస్ దాదాపు బీవర్ లేక ఆటర్ శరీర పరిమాణంలో ఉంటుందని వారు అనుకుంటారు. కానీ మీరు చూస్తున్నట్లుగా అది ఇంట్లో పెరిగే సగటు పిల్లికంటే కూడా చిన్నగా ఉంది. మగవి 45 నుండి 60 సెంటీమీటర్ల పొడవుండి, ఒకటి నుండి రెండున్నర కిలోగ్రాముల బరువుంటాయి. ఆడువి కాస్త చిన్నగా ఉంటాయి.
వ్రేళ్ల మధ్య పలుచని పొర ఉన్న ముందరి పాదాలతో ఒక పాదం తర్వాత మరొక పాదంతో తెడ్డు వేస్తూ ముందుకు వెళ్తుంది. వంతెన క్రిందికి వచ్చేసరికి అది నిశ్శబ్దంగా లోపలికి మునిగి ఒకటి రెండు నిమిషాలు లోపలే ఉంటుంది. పలుచని పొర పాక్షికంగా ఉన్న వెనక పాదాలు దాన్ని ముందుకు త్రోయడంలో ఉపయోగించబడవు కానీ అది ఈదేటప్పుడు మార్గాన్ని మళ్లించేందుకు దాని తోకతోపాటు పని చేస్తాయి. అది భూమిలో కన్నం వేసేటప్పుడు దాని శరీరాన్ని దృఢంగా లంగరు వేసినట్లుగా ఉంచడానికి అవి ఉపయోగపడతాయి.
ప్లాటిపస్‌కు భంగం కల్గిస్తే అది బుడుంగుమని నీట్లోనికి దుముకుతుంది, దానర్థం ఇక వీడ్కోలు అనే! కాబట్టి మనం అది మునిగి ఉన్నప్పుడే మాట్లాడుకుంటాం. “అంత చిన్నది వెచ్చగా ఎలా ఉండగలుగుతుంది” మీరు గుసగుసలాడతారు, “ముఖ్యంగా శీతాకాలంలోని మంచుగడ్డలాంటి నీటిలోను?” ప్లాటిపస్ చక్కగా రాణించగల్గేందుకు తోడ్పడే రెండు సహాయకాలు: దానిని లోపలి నుండి వెచ్చబరుస్తూ త్వరితగతిన శక్తిని ఉత్పత్తి చేసే జీవక్రియ మరియు వేడిని లోపలే ఉంచే దట్టమైన బొచ్చు.
అద్భుతమైన ఆ ముక్కు
మెత్తని, రబ్బరు వంటి ప్లాటిపస్ ముక్కు చాలా సంక్లిష్టమైనది. స్పర్శ గ్రాహకాలతో, ఎలక్ట్రికల్ చర్య గ్రాహకాలతో అది కప్పబడి ఉంది. నది అడుగున ప్లాటిపస్ సున్నితంగా తన ముక్కును ఇటు అటు తిప్పుతూ పరిశీలిస్తూ, చివరికి దాని వేట యొక్క కండరాలు ముడుచుకోవడం ద్వారా సృష్టించబడే చిన్న ఎలక్ట్రిక్ క్షేత్రాలను కూడా పసిగడుతుంది. ప్లాటిపస్ మునిగి ఉండగా, మిగతా ప్రపంచంతో ఏకైక సంబంధం దాని ముక్కే, ఎందుకంటే దాని కళ్లు, చెవులు, ముక్కుపుటాలు గట్టిగా మూసుకుని ఉంటాయి.
ఆ వాడిగల మొనలను చూసుకోండి!
మన చిన్ని స్నేహితుడు మగవాడైతే వాని వెనక కాళ్లలోని రెండు వాడిగల మొనలతో సాయుధుడై ఉంటాడు, అవి తొడ ప్రాంతంలోని రెండు విషయుక్తమైన గ్రంథులకు జతచేయబడి ఉంటాయి. గుర్రపు రౌతు తన గుర్రం ఎగిరేలా చేయడానికి తన బూట్లకు అమర్చివుండే లోహపు ముళ్ళ సాధనంతో డొక్కల్లో తన్నినట్లుగానే అది బలంగా దాని రెండు మొనలను దాడిచేసిన వాని శరీరంలోనికి గుచ్చుతుంది. తొలి విఘాతం తర్వాత బాధితుడు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తాడు, గుచ్చుకున్న ప్రాంతంలో వాపు వస్తుంది.
అయితే నిర్బంధంలో ఉన్నప్పుడు మాత్రం ప్లాటిపస్ చిన్న కుక్కపిల్లంత సాధువుగా ఉండగలదు. విక్టోరియాలోని హీల్స్‌విల్ సాంక్చురీ ఈ జంతువులను దశాబ్దాలుగా ఉంచింది, ఒక తొలి ప్లాటిపస్ “సందర్శకులు తన పొట్టను గోకేందుకు దొర్లుతూ వారిని గంటల తరబడి వినోదపర్చేది . . . వేలాదిమంది సందర్శకులు ఈ అసాధారణమైన జంతువును చూడడానికి తండోపతండాలుగా వచ్చేవారు.”
మనకు తూర్పున పర్వత పంక్తుల్లోనుండి సూర్యుడు తొంగి చూస్తుండగా మన ప్లాటిపస్ ఆరోజు కొరకు ఆఖరిసారిగా మునక వేస్తుంది. రాత్రంతా అది దాని బరువులో ఐదవ వంతు కన్న ఎక్కువ ఆహారాన్ని తిన్నది. అది నీట్లోనుండి పైకి ఎక్కుతుండగా దాని బలమైన గోళ్లు బయటికి వస్తుండగా ముందు పాదాలలోని పలచని చర్మం ముడుచుకుంటుంది. అదిప్పుడు తనకున్న అనేకమైన బొరియల్లో ఒకదానివైపు వెళ్తుంది, ఈ బొరియలు భూమి కోతను తప్పించుకోవడానికి, కూలిపోకుండా ఉండడానికి చెట్ల వ్రేళ్లలో జ్ఞానయుక్తంగా త్రవ్వబడ్డాయి. అది నివసించే బొరియ సాధారణంగా దాదాపు ఎనిమిది మీటర్ల పొడవుంటుంది, కానీ ఇతర బొరియలు ఒక మీటరు నుండి దాదాపు ముప్ఫై మీటర్ల పొడవు ఉండవచ్చు, వీటికి అనేక శాఖలు కూడా ఉండవచ్చు. ఈ బొరియలు ఆడువి తమ పిల్లలను పెంచడానికి అనువుగా వెచ్చగా ఉంటాయి. హెచ్చైన ఉష్ణోగ్రతలనుండి రక్షణను కూడా అందిస్తాయి.
గ్రుడ్లు పెట్టే సమయం
వసంత ఋతువులో ఆడది చాలా లోతుగావున్న తన బొరియల్లో అటు ఇటు పచ్చని మొక్కలున్న గదిలోనికి వెళ్లి బొటనవ్రేలి పరిమాణంలో ఒకటి నుండి మూడు (సాధారణంగా రెండు) గ్రుడ్లు పెడుతుంది. అది తన శరీరంతోను, క్రొవ్వుతోనున్న తోకతోను తన గ్రుడ్లపై కూర్చుని వాటిని పొదుగుతుంది. పది రోజుల్లోగా పిల్లలు కొంచెం పారదర్శకంగా ఉన్న గ్రుడ్డు గుల్లలనుండి బయటికి వచ్చి, తల్లియొక్క రెండు స్తన గ్రంథులనుండి వచ్చే పాలపైన జీవిస్తాయి. మరో మాట, ఆడ ప్లాటిపస్ తన పిల్లలను ఒంటరిగా పెంచుతుంది; ఈ క్షీరదాలు దీర్ఘకాలికంగా ఒకే జతతో కలిసి ఉన్నట్లు ఆధారమేమీ ఇవ్వడంలేదు.
ఫిబ్రవరికల్లా మూడున్నర నెలలపాటు పెరుగుదల వేగంగా జరిగిన తర్వాత చిన్నపిల్లలు నీట్లోనికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, నీటి కొలను కొన్ని జంతువులకు మాత్రమే సరిపోతుంది గనుక పిల్లలు చివరికి తక్కువ జనాభా ఉన్న నీటి కొలనుల కొరకు వెదుకుతాయి, చివరికి అలా చేయడానికిగాను ప్రమాదకరమైన భూభాగాన్ని దాటుతాయి కూడాను.
నిర్బంధంలో ఉన్నప్పుడు ప్లాటిపస్‌లు 20 సంవత్సరాలకు పైగా జీవించాయి, కానీ అరణ్యంలో అనేకం అంతకాలం జీవించవు. అనావృష్టి, వరదల వలన, గోయాన్నాలు (పెద్ద మానిటర్ బల్లులు), నక్కలు, వేటాడే పెద్ద పక్షులు, అలాగే సుదూర ఉత్తర క్వీన్స్‌లాండ్‌లోని మొసళ్లు వంటి పరభక్షుల బారిన పడుతున్నాయి. అయితే, ప్లాటిపస్‌లకు అత్యంత పెద్ద ప్రమాదం మానవునినుండి వస్తుంది, వాటిని ఉద్దేశపూర్వకంగా చంపడం మూలంగా కాదు (ప్లాటిపస్‌లను చంపడం ఇప్పుడు చట్టపరంగా నిషేధించబడింది), కానీ వాటి నివాసాలను నిర్విరామంగా ఆక్రమించుకోవడం ద్వారా వస్తుంది.
మీరెప్పుడైనా ఆస్ట్రేలియాకు వస్తే, దాని సహజ నివాస స్థలంలో ఎన్నో లక్షణాల సమ్మేళనాలతో బాతు ముక్కుగల విశిష్టమైన ఈ చిన్ని జంతువును మీరు గమనించగలరు, ఎందుకంటే ప్రపంచంలో మరెక్కడా అరణ్యాలలో మీరు ప్లాటిపస్‌ను చూడలేరు. ప్లాటిపస్ మూలంగా మీరు సృష్టికర్త యొక్క అవధుల్లేని కల్పనా శక్తిని—దానితోపాటు హాస్యరసం యొక్క మరొక దృక్కోణాన్ని ఆనందించగలరు.
[17వ పేజీలోని చిత్రం]
వ్రేళ్ల మధ్య పలుచని పొర ఉన్న తన పాదాలతో ప్లాటిపస్ తనను తాను ముందుకు తోసుకుంటుంది
[క్రెడిట్ లైను]
Courtesy of Taronga Zoo
[17వ పేజీలోని చిత్రం]
ఇంట్లో పెరిగే సగటు పిల్లి కన్నా చిన్నదైన ప్లాటిపస్ ఒకటి నుండి రెండున్నర కిలోగ్రాములు బరువుంటుంది
[క్రెడిట్ లైను]
Courtesy of Dr. Tom Grant
[17వ పేజీలోని చిత్రం]
ఎంతో సునిశితమైన తన ముక్కును నీటి క్రింద తన వేటను కనుగొనడానికి ఉపయోగిస్తుంది. (ఈ ప్లాటిపస్ హీల్స్‌విల్ సాంక్చురీలో ఉంది)
[క్రెడిట్ లైను]
Courtesy of Healesville Sanctuary
[16వ పేజీలోని చిత్రసౌజన్యం]
ఛాయచిత్రం: Courtesy of Dr. Tom Grant