యెహోవా ఏర్పాటు చేసిన ‘విశాలమైన లోయలో’ సురక్షితంగా ఉండండి
“అప్పుడు యెహోవా . . . యుద్ధకాలమున యుద్ధము చేయురీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.”—జెక. 14:3.
1, 2. ఏ యుద్ధం ముంచుకొస్తోంది? ఈ యుద్ధంలో దేవుని సేవకులు ఏమి చేయాల్సిన అవసరం లేదు?
1938 అక్టోబరు 30న అమెరికాలోని లక్షలాది ప్రజలు ప్రేక్షకాదరణ పొందిన ఓ రేడియో నాటకాన్ని వింటున్నారు. అది ద వార్ ఆఫ్ వరల్డ్స్ అనే సైన్స్-ఫిక్షన్ నవల ఆధారంగా రూపొందింది. అందులో న్యూస్ రీడర్ల పాత్ర పోషించిన నటీనటులు, అంగారక గ్రహం నుండి వచ్చిన వాళ్లు భూమ్మీద దాడి చేస్తున్నారని, దాని వల్ల వినాశనం చోటుచేసుకుంటుందని వివరించారు. ఆ రేడియో కార్యక్రమం ఓ నాటకమేనని ప్రకటన చేసినా దాన్ని వింటున్న చాలామంది నిజంగానే, గ్రహాంతరవాసులు దాడి చేస్తున్నారనుకొని భయకంపితులయ్యారు. కొంతమందైతే ఆ భ్రమలో తమను తాము కాపాడుకోవడానికి చర్యలు కూడా తీసుకున్నారు.
2 అయితే ఇప్పుడు ఒక నిజమైన యుద్ధం ముంచుకొస్తోంది. కానీ, చాలామంది ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. దానిగురించి ఏ సైన్స్-ఫిక్షన్ నవలో కాదుగానీ దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలు చెబుతోంది. సాతాను దుష్టలోకాన్ని నిర్మూలం చేసే ఆ యుద్ధం హార్మెగిద్దోను. (ప్రక. 16:14-16) ఈ యుద్ధంలో దేవుని సేవకులు గ్రహాంతరవాసులతో పోరాడాల్సిన అవసరం లేదు. అయితే, వాళ్లు ఆ సమయంలో జరిగే అనూహ్యమైన సంఘటనలను, భీతిగొల్పే దేవుని శక్తిని చూసి ఆనందాశ్చర్యాలకు లోనౌతారు.
3. మనం ఏ ప్రవచనాన్ని పరిశీలిస్తాం? ఎందుకు?
3 బైబిల్లో జెకర్యా పుస్తకంలోని 14వ అధ్యాయంలో, హార్మెగిద్దోను యుద్ధానికి నేరుగా సంబంధమున్న ఓ ప్రవచనం ఉంది. 2,500 సంవత్సరాల క్రితం రాయబడిన ఆ ప్రవచనం ఇప్పుడు కూడా మన జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. (రోమా. 15:4) ఆ ప్రవచనంలోని చాలా విషయాలు, 1914లో మెస్సీయ రాజ్యం పరలోకంలో స్థాపించబడిన సమయం నుండి దేవుని ప్రజలకు ఎదురైన పరిస్థితుల గురించి, అలాగే సమీప భవిష్యత్తులో జరగబోయే ఉత్తేజకరమైన సంఘటనల గురించి తెలియజేస్తున్నాయి. ఆ ప్రవచనంలో ప్రాముఖ్యంగా ఓ “విశాలమైన లోయ” గురించి, “జీవజలములు” ప్రవహించడం గురించి ఉంది. (జెక. 14:4, 8) దేవుని సేవకుల్ని కాపాడే విషయంలో ఆ లోయ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జీవజలముల వల్ల కలిగే ప్రయోజనాలను మనం అర్థంచేసుకుంటే వాటిని తాగాల్సిన అవసరం ఉందని గుర్తిస్తాం, తప్పక తాగాలని కోరుకుంటాం. కాబట్టి ఆ ప్రవచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనం మరింత ప్రయోజనం పొందుతాం.—2 పేతు. 1:19, 20.
“యెహోవాకు చెందిన ఒక దినము” ఆరంభమైంది
4. (ఎ) “యెహోవాకు చెందిన ఒక దినము” ఎప్పుడు ఆరంభమైంది? (బి) 1914కి కొన్ని దశాబ్దాల క్రితమే యెహోవా ఆరాధకులు ఏమని ప్రకటించారు? దానికి లోక నాయకులు ఎలా స్పందించారు?
4 జెకర్యా 14వ అధ్యాయం ఈ మాటలతో మొదలౌతోంది: “ఇదిగో యెహోవా దినము [“యెహోవాకు చెందిన ఒక దినము,” NW] వచ్చుచున్నది.” (జెకర్యా 14:1, 2 చదవండి.) ఏమిటా దినం? అది “ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును” అయినప్పుడు మొదలైన “ప్రభువు దినము.” (ప్రక. 1:10; 11:15) 1914లో పరలోకంలో మెస్సీయ రాజ్యం స్థాపితమవ్వడంతో ఆ దినం ఆరంభమైంది. “అన్యజనముల కాలములు” 1914లో ముగుస్తాయని, లోకం మునుపెన్నడూ చూడని శ్రమలను అనుభవిస్తుందని అప్పటికి కొన్ని దశాబ్దాల క్రితమే యెహోవా ఆరాధకులు ప్రకటించారు. (లూకా 21:24) మరి లోక నాయకులు దానికి ఎలా స్పందించారు? రాజకీయ నాయకులు, మత నాయకులు సమయానుకూలమైన ఆ హెచ్చరికలను వినే బదులు ఉత్సాహవంతులైన అభిషిక్తులను ద్వేషించారు, హింసించారు. “పరలోకపు యెరూషలేమునకు” అంటే మెస్సీయ రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాని రాయబారులు, వారసులు అయిన అభిషిక్తుల్ని హింసించడం ద్వారా లోక నాయకులు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణే అపహాస్యం చేశారు.—హెబ్రీ. 12:22, 28-29.
5, 6. (ఎ) జెకర్యా ప్రవచించినట్లుగా విరోధులు “పట్టణము” మీద, దాని ‘పౌరుల’ మీద ఎలాంటి దాడులు చేశారు? (బి) “శేషించువారు” ఎవరు?
5 లోక నాయకులు అప్పుడు ఏమి చేస్తారో చెబుతూ, “[యెరూషలేము] పట్టణము పట్టబడును” అని జెకర్యా ముందుగానే ప్రవచించాడు. ఈ “పట్టణము” దేవుని మెస్సీయ రాజ్యాన్ని సూచిస్తుంది. ఆ రాజ్య పౌరులైన అభిషిక్తుల్లో శేషించినవాళ్లు భూమ్మీద దానికి ప్రాతినిధ్యం వహిస్తారు. (ఫిలి. 3:20) మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, యెహోవా సంస్థలోని ప్రముఖులు ‘పట్టబడ్డారు’ లేదా నిర్బంధించబడ్డారు. ఆ తర్వాత వాళ్లను అమెరికాలోని జార్జీయా రాష్ట్రంలో ఉన్న అట్లాంటా కారాగారంలో వేశారు. ఆ సమయంలో అభిషిక్తుల్ని అన్యాయంగా హింసించారు, వాళ్ల ప్రచురణలను నిషేధించారు, వాళ్ల ప్రకటనాపనిని అడ్డుకున్నారు. ఆ విధంగా వాళ్లు ‘పట్టణంలోని ఇళ్లను కొల్లపెట్టారు’ లేదా క్రూరంగా దోచుకున్నారు.
6 విరోధులు దేవుని ప్రజలను అణగద్రొక్కినా, తప్పుగా చిత్రీకరించినా, వ్యతిరేకించినా, హింసల పాలు చేసినా వాళ్లు సత్యారాధనను మాత్రం తుడిచిపెట్టలేకపోయారు. “శేషించువారు” అంటే మిగిలిన అభిషిక్తులు ‘నిర్మూలం కాకుండా పట్టణంలో నిలిచారు.’
7. నేటి సత్యారాధకులకు అభిషిక్తులు ఎలాంటి మాదిరిని ఉంచారు?
7 మొదటి ప్రపంచయుద్ధం ముగిసే సమయానికి ఈ ప్రవచనం పూర్తిగా నెరవేరిందా? లేదు. ఆ తర్వాతి కాలంలో భూమ్మీద మిగిలిన అభిషిక్తుల మీద, భూనిరీక్షణ ఉన్న నమ్మకమైన వాళ్ల సహవాసుల మీద దేశాలు తమ దాడుల్ని తీవ్రతరం చేశాయి. (ప్రక. 12:17) రెండవ ప్రపంచ యుద్ధమే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. అవిశ్వాసులైన బంధువుల నుండి, సహోద్యోగుల నుండి లేదా మన నమ్మకాల్ని చులకన చేసే తోటి విద్యార్థుల నుండి వ్యతిరేకత లాంటి కష్టాలు ఎన్ని ఎదురైనా తట్టుకోవడానికి నేటి దేవుని సేవకులకు నమ్మకమైన అభిషిక్తులు ఉంచిన మాదిరి సహాయం చేస్తుంది. (1 పేతు. 1:6, 7) సత్యారాధకులు ఏ దేశంలో ఉన్నా, ‘ఏక మనస్సుగలవారిగా నిలిచివుంటూ’ తమను ‘ఎదిరించువారికి బెదరకుండా’ ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. (ఫిలి. 1:27, 28) యెహోవా ప్రజల మీద ద్వేషాన్ని వెళ్లగ్రక్కే ఈ లోకంలో వాళ్లకు భద్రత ఎక్కడ దొరుకుతుంది?—యోహా. 15:17-19.
యెహోవా “విశాలమైన లోయను” ఏర్పాటు చేశాడు
8. (ఎ) లేఖనాల్లో పర్వతాలు లేక కొండలు దేన్ని సూచిస్తున్నాయి? (బి) ‘యెరూషలేము ఎదుట ఉన్న ఒలీవ కొండ’ దేన్ని సూచిస్తోంది?
8 యెరూషలేము “పట్టణము” పైనున్న యెరూషలేముకు సూచనగా ఉంది కాబట్టి, ‘యెరూషలేము ఎదుట ఉన్న ఒలీవ కొండ’ కూడా దేనికో సూచనగా ఉండాలి. ఇంతకీ అది దేన్ని సూచిస్తుంది? అది “నడిమికి విడిపోయి” ఎలా రెండు కొండలుగా మారింది? యెహోవా వాటిని “నా కొండలు” [NW] అని ఎందుకు సంబోధించాడు? (జెకర్యా 14:3-5 చదవండి.) లేఖనాల్లో కొన్నిసార్లు కొండలు లేక పర్వతాలు రాజ్యాలను లేదా ప్రభుత్వాలను సూచిస్తాయి. అంతేకాదు బైబిలు, దేవుని పర్వతాన్ని లేదా కొండను ఆయన ఆశీర్వాదాలకు, ఆయనిచ్చే రక్షణకు ముడిపెడుతోంది. (కీర్త. 72:3; యెష. 25:6, 7) దేవుడు తన ‘పాదాలు ఉంచిన’ కొండ అంటే “యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండ” ఆయన విశ్వసర్వాధిపత్యాన్ని సూచిస్తోంది.
9. ‘ఒలీవకొండ నడిమికి విడిపోవడం’ దేన్ని సూచిస్తోంది?
9 ఒలీవకొండ ‘నడిమికి విడిపోయి’ రెండు కొండలుగా ఏర్పడడం దేన్ని సూచిస్తోంది? అది యెహోవా ఓ ప్రత్యేకమైన పని కోసం ఒక సహాయక రాజ్యాన్ని ఏర్పాటు చేయడాన్ని సూచిస్తోంది. ఈ రాజ్యం యేసుక్రీస్తు ఆధ్వర్యంలోని మెస్సీయ రాజ్యం. అందుకే, ఒలీవకొండ ‘నడిమికి విడిపోయి’ రెండుగా ఏర్పడిన కొండలను యెహోవా “నా కొండలు” [NW] అని సంబోధించాడు. (జెక. 14:4) అవును, ఆ రెండు కొండలూ ఆయనవే.
10. రెండు కొండల మధ్య ఏర్పడిన “విశాలమైన లోయ” దేన్ని సూచిస్తోంది?
10 ఒలీవ కొండ సగం ఉత్తర దిక్కుకు, మిగతా సగం దక్షిణ దిక్కుకు విడిపోయినా ఆ రెండు కొండల మీద యెహోవా ‘తన పాదాలను ఉంచాడు.’ ఆయన పాదాలను ఉంచిన ఆ కొండల మధ్య “విశాలమైన లోయ” ఒకటి ఏర్పడింది. ఈ విశాలమైన లోయ యెహోవా విశ్వసర్వాధిపత్యం కింద, మెస్సీయ రాజ్యం కింద దేవుని ప్రజలు అనుభవించే కాపుదలను సూచిస్తుంది. సత్యారాధన పూర్తిగా లేకుండా పోయే పరిస్థితిని యెహోవా ఎన్నడూ రానివ్వడు. ఇంతకీ ఆ ఒలీవ కొండ ఎప్పుడు రెండుగా విడిపోయింది? అన్యజనుల కాలాలు సమాప్తమైన 1914లో మెస్సీయ రాజ్యం ఉనికిలోకి వచ్చినప్పుడు అది జరిగింది. మరి, సత్యారాధకులు సూచనార్థకమైన ఆ లోయలోకి ‘పారిపోవడం’ ఎప్పుడు మొదలైంది?
లోయలోకి ‘పారిపోవడం’ మొదలైంది
11, 12. (ఎ) సూచనార్థకమైన లోయలోకి ‘పారిపోవడం’ ఎప్పుడు మొదలైంది? (బి) యెహోవా “బాహుబలము” తన ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని ఎలా చెప్పవచ్చు?
11 “మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు” అని యేసు తన శిష్యులను హెచ్చరించాడు. (మత్త. 24:9) 1914 నుండి మొదలైన ఈ అంత్యదినాల్లో లోక నాయకులు చూపించే ద్వేషం మరింత ఎక్కువైంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులు అభిషిక్తుల మీద తీవ్రమైన దాడులు చేసినప్పటికీ, వాళ్లను పూర్తిగా నిర్మూలం చేయలేకపోయారు. 1919లో వాళ్లు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను చెర నుండి విడుదల పొందారు. (ప్రక. 11:11, 12)a ఆ లోయలోకి పారిపోవడం మొదలైంది అప్పుడే.
12 ఆ లోయ 1919 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యారాధకులకు కాపుదలను ఇస్తూనే ఉంది. గడిచిన దశాబ్దాల్లో ప్రపంచంలోని చాలా దేశాల్లో యెహోవాసాక్షుల పరిచర్యను, వాళ్ల సాహిత్యాలను నిషేధించారు, ఆంక్షలు విధించారు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో అలాంటి ఆంక్షలు ఉన్నాయి. దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, సత్యారాధనను రూపుమాపడం వాళ్ల వల్ల కాదు. యెహోవా “బాహుబలము” తన ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది.—ద్వితీ. 11:2.
13. కాపుదలను ఇచ్చే యెహోవా లోయలో మనమెలా ఉండవచ్చు? ఆ లోయలో ఉండడం ముందుకన్నా ఇప్పుడు ఎందుకు చాలా ప్రాముఖ్యం?
13 మనం యెహోవాకు నమ్మకంగా ఉంటూ సత్యంలో స్థిరంగా నిలబడితే యెహోవా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటారు. అంతేకాక ‘తన చేతిలోనుండి మనలను అపహరించడానికి’ యెహోవా ఎవ్వరినీ అనుమతించడు. (యోహా. 10:28, 29) తన విశ్వసర్వాధిపత్యానికి లోబడి ఉండేందుకు, మెస్సీయ రాజ్యానికి నమ్మకమైన పౌరులుగా ఉండేందుకు మనకు కావాల్సిన సహాయాన్ని అందించడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ సహాయం అందుకోవడానికి మనం దేవుడు ఏర్పాటు చేసిన విశాలమైన లోయలో ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే, అతి వేగంగా సమీపిస్తోన్న మహాశ్రమల కాలంలో సత్యారాధకులకు అది గొప్ప కాపుదలను ఇస్తుంది.
“యుద్ధ కాలము” సమీపించింది
14, 15. యెహోవా ‘యుద్ధ కాలంలో’ విశాలమైన లోయలో ఉండని వాళ్ల గతేమిటి?
14 ఈ దుష్టవిధానాంతం సమీపిస్తుండగా, యెహోవా సేవకుల మీద సాతాను తన దాడులను తీవ్రతరం చేస్తాడు. అప్పుడు, యెహోవా “యుద్ధ కాలము” వస్తుంది. సాతాను చివరిసారిగా దేవుని ప్రజల మీద దాడి చేస్తాడు. విశ్వసర్వాధిపతి అయిన యెహోవా తాను ఇంతకుముందు చేసిన యుద్ధాలన్నిటిలో కన్నా ఆ హార్మెగిద్దోను ‘యుద్ధంలో’ మహాగొప్ప యుద్ధశూరునిగా నిరూపించుకుంటాడు.—జెక. 14:3.
15 యెహోవా యుద్ధ కాలంలో, కాపుదల దొరికే విశాలమైన లోయలో ఉండనివాళ్ల పరిస్థితేమిటి? దైవానుగ్రహం అనే ‘ప్రకాశమానమైన వెలుగు’ అలాంటి వాళ్లపై ప్రకాశించదు. ఆ యుద్ధ సమయంలో, “గుఱ్ఱముల మీద కంచరగాడిదల మీద ఒంటెలమీద గార్దభములమీద, దండుపాళెములో ఉన్న పశువులన్నిటిమీద” ప్రభావం పడుతుంది, అంటే దేశాల యుద్ధ సామాగ్రి ఎందుకూ పనికిరాకుండా పోతుంది. వాళ్ల ఆయుధాలు ‘సంకుచితమై’ పోతాయి లేదా మొరాయిస్తాయి. యెహోవా “తెగుళ్లు” కూడా తీసుకువస్తాడు. ఆ తెగుళ్లు అక్షరార్థమైనవైనా కాకపోయినా అవి శత్రువుల బెదిరింపుల్ని ఆపుతాయి. అప్పుడు, ‘వారి కన్నులు, నాలుకలు కుళ్లిపోతాయి’ అంటే శత్రువులు గుడ్డిగా పోరాడతారు, ప్రగల్భాలు పలికిన వాళ్ల నోళ్లు పడిపోతాయి. (జెక. 14:6, 7, 12, 15) ఆ యుద్ధంలో “భూరాజులును, వారి సేనలును” సాతాను పక్షం వహిస్తారు. కానీ దేవుని శత్రువులు భూమ్మీద ఎక్కడున్నా తప్పించుకోలేరు. (ప్రక. 19:19-21) ఆ యుద్ధంలో “యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు.”—యిర్మీ. 25:32, 33.
16. యెహోవా యుద్ధం సమీపిస్తుండగా మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి? మనమేమి చేయడం ప్రాముఖ్యం?
16 సాధారణంగా ఓ యుద్ధంలో గెలిచినవాళ్లతో సహా అందరూ బాధపడతారు. మహాశ్రమల కాలంలో మనకు ఆహార కొరత ఏర్పడవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు. జీవన ప్రమాణాలు దిగజారవచ్చు, మనం వ్యక్తిగత స్వేచ్ఛను కూడా కోల్పోవచ్చు. అలాంటి కష్టాలు ఎదురైతే మనమెలా స్పందిస్తాం? వాటికి భయపడతామా? కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని వదులుకుంటామా? దిక్కు తోచక నిరాశానిస్పృహలకు లోనౌతామా? మహాశ్రమలప్పుడు యెహోవా రక్షణ శక్తి మీద విశ్వాసం ఉంచడం, ఆయన ఏర్పాటు చేసిన లోయలో ఉండడం ఎంతో ప్రాముఖ్యం.—హబక్కూకు 3:17, 18 చదవండి.
‘జీవజలములు ప్రవహిస్తాయి’
17, 18. (ఎ) ‘జీవజలాలు’ అంటే ఏమిటి? (బి) “తూర్పు సముద్రము”, “పడమటి సముద్రము” వేటికి సూచనగా ఉన్నాయి? (సి) మీరు ఏమని తీర్మానించుకున్నారు?
17 హార్మెగిద్దోను యుద్ధం తర్వాత, మెస్సీయ రాజ్యం ద్వారా “జీవజలములు” నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఆ ‘జీవజలాలు’ మనం నిత్యజీవం పొందేందుకు యెహోవా చేసిన ఏర్పాట్లను సూచిస్తున్నాయి. “తూర్పు సముద్రము” మృత సముద్రాన్ని సూచిస్తోంది. “పడమటి సముద్రము” మధ్యధరా సముద్రాన్ని సూచిస్తోంది. ఆ రెండు సముద్రాలూ ప్రజలను సూచిస్తున్నాయి. ఇప్పటికే చనిపోయి సమాధుల్లో ఉన్నవాళ్లకు మృత సముద్రము సూచనగా ఉంది. జీవరాసులతో కళకళలాడే మధ్యధరా సముద్రము హార్మెగిద్దోనును తప్పించుకునే ‘గొప్పసమూహానికి’ సూచనగా ఉంది. (జెకర్యా 14:8, 9 చదవండి; ప్రక. 7:9-15) ఆ రెండు వర్గాల ప్రజలు, సూచనార్థక ‘జీవజలాలు పారే నదిలోని’ నీటిని తాగుతూ పాపమరణాల నుండి విడుదల పొందుతారు.—ప్రక. 22:1, 2.
యెహోవా కాపుదల ఇచ్చే లోయలో ఉండాలని గట్టిగా తీర్మానించుకోండి
18 యెహోవా కాపుదల కింద మనం సాతాను దుష్ట వ్యవస్థ అంతం నుండి తప్పించుకుని దేవుని నూతనలోకంలోకి అడుగుపెడతాం. లోకం మనల్ని ద్వేషిస్తున్నా, నమ్మకమైన రాజ్య పౌరులుగా యెహోవా కాపుదల ఇచ్చే లోయలో నిలిచి ఉండాలని గట్టిగా తీర్మానించుకుందాం.
a ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకంలోని 169-170 పేజీలు చూడండి.