కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 7/15 పేజీలు 15-19
  • కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు కొద్దిమందిని ఎంచుకున్నాడు
  • పెంతెకొస్తు మొదలుకొని ఎంతోమందికి ఆధ్యాత్మిక పోషణ
  • గురుగులు ఎక్కువగా, గోధుమ వెన్నులు తక్కువగా ఉన్న కాలం
  • కోతకాలంలో ఎవరు ఆధ్యాత్మిక పోషణను చూసుకుంటారు?
  • కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ‘ఇదిగో నేను సదాకాలము మీతో కూడ ఉన్నాను’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యేసు వేలమందికి ఆహారం పెట్టాడు
    నా బైబిలు పుస్తకం
  • “మీలో నాయకత్వం వహిస్తున్నవాళ్లను గుర్తుచేసుకోండి”
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 7/15 పేజీలు 15-19

కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణ

“[యేసు] ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి.”—మత్త. 14:19.

మీరెలా జవాబిస్తారు?

  • జనసమూహాలకు ఆహారాన్ని పెట్టినప్పుడు యేసు ఏ పద్ధతిని ఉపయోగించాడు?

  • యెరూషలేములోని అపొస్తలులను, పెద్దలను యేసు ఎలా ఉపయోగించుకున్నాడు?

  • ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచిపెట్టేందుకు క్రీస్తు ఓ మాధ్యమాన్ని నియమించాల్సిన సమయం ఎప్పుడు వచ్చింది?

1-3. బేత్సయిదా పరిసర ప్రాంతంలో ఓ పెద్ద జనసమూహానికి యేసు ఎలా ఆహారం పెట్టాడో వివరించండి. (ఆర్టికల్‌ ప్రారంభ చిత్రం చూడండి.)

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. (మత్తయి 14:14-21 చదవండి.) సా.శ. 32 పస్కాకు కొన్నిరోజుల ముందు గలిలయ సముద్రానికి ఉత్తర తీరాన బేత్సయిదా పరిసర ప్రాంతంలోని అరణ్య ప్రదేశంలో జరిగిన సంఘటన అది. అప్పుడు యేసు, ఆయన శిష్యులతో పాటు స్త్రీలు, పిల్లలే కాక ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నారు.

2 యేసు ఆ సమూహాన్ని చూసినప్పుడు వాళ్లమీద కనికరపడి వాళ్లలో ఉన్న రోగుల్ని స్వస్థపర్చాడు, దేవుని రాజ్యం గురించి వాళ్లకు ఎన్నో విషయాలు బోధించాడు. చీకటిపడుతుండగా శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, సమీపంలోని గ్రామాలకు వెళ్లి తినడానికి ఏమైనా కొనుక్కునేందుకు వీలుగా ప్రజల్ని పంపించేయమని అడిగారు. కానీ యేసు, “మీరే వారికి భోజనము పెట్టుడి” అని తన శిష్యులకు చెప్పాడు. అప్పుడు తమ దగ్గర ఉన్నదల్లా ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలే కాబట్టి అంత పెద్ద జనసమూహానికి ఆహారం ఎలా పెట్టాలి అనే అయోమయంలో వాళ్లు పడివుంటారు.

3 అప్పుడు కనికరంతో యేసు ఓ అద్భుతం చేశాడు. నలుగురు సువార్త రచయితలూ ప్రస్తావించిన అద్భుతం అదొక్కటే. (మార్కు 6:35-44; లూకా 9:10-17; యోహా. 6:1-13) పచ్చిక మీద 50 మంది చొప్పున, 100 మంది చొప్పున గుంపులుగా కూర్చోమని యేసు తన శిష్యులతో ప్రజలకు చెప్పించాడు. ఆ తర్వాత ఆయన చేపలను, రొట్టెలను చేతపట్టుకొని ఆశీర్వదించాక వాటిని విరిచాడు. వాటిని తనే స్వయంగా ప్రజలకు పంచిపెట్టే బదులు ‘ప్రజలకు వడ్డించుటకు తన శిష్యులకిచ్చాడు.’ ఆశ్చర్యం ఏంటంటే, ప్రజలు తిన్న తర్వాత కూడా ఎంతో ఆహారం మిగిలింది. ఒక్కసారి ఆలోచించండి: ఆ సందర్భంలో యేసు, కొద్దిమందైన తన శిష్యుల చేతుల మీదుగా వేలమందికి ఆహారం పెట్టాడు.a[1]

4. (ఎ) ఎలాంటి ఆహారం పెట్టడం గురించి యేసు ఎక్కువగా ఆలోచించాడు? ఎందుకు? (బి) మనం ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

4 అయితే, తన అనుచరులకు ఆధ్యాత్మిక ఆహారం పెట్టడం గురించే యేసు ఎక్కువగా ఆలోచించాడు. దేవుని వాక్యంలోని సత్యాలు ఉన్న ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటే వాళ్లు నిత్యజీవం పొందుతారని యేసుకు తెలుసు. (యోహా. 6:26, 27; 17:3) పెద్ద జనసమూహానికి రొట్టెను, చేపను పంచిపెట్టడానికి ప్రేరేపించిన అదే కనికరం వల్ల యేసు తన శిష్యులకు వ్యక్తిగతంగా బోధించడానికి ఎన్నో గంటలు వెచ్చించాడు. (మార్కు 6:34) అయితే, భూమ్మీద తాను కొద్దికాలమే ఉంటానని, ఆ తర్వాత పరలోకానికి వెళ్లిపోతానని యేసుకు తెలుసు. (మత్త. 16:21; యోహా. 14:12) మరి యేసు పరలోకానికి వెళ్లాక, భూమ్మీద ఉన్న తన అనుచరులకు ఆధ్యాత్మికంగా చక్కని పోషణను ఎలా ఇస్తాడు? అంతకుముందులానే అంటే, కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి ఆహారం పెట్టడం ద్వారా యేసు ఆ పోషణను ఇస్తాడు. ఇంతకీ ఆ కొద్దిమంది ఎవరు? మొదటి శతాబ్దంలో ఎంతోమంది అభిషిక్త అనుచరులను ఆధ్యాత్మికంగా పోషించడానికి యేసు ఎలా కొద్దిమందిని ఉపయోగించుకున్నాడో ఇప్పుడు పరిశీలిద్దాం. తర్వాతి ఆర్టికల్‌లో, మనలో ప్రతీ ఒక్కరం ఆలోచించాల్సిన ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నను పరిశీలిస్తాం: ‘నేడు మనల్ని ఆధ్యాత్మికంగా పోషించడానికి క్రీస్తు ఉపయోగించుకుంటున్న కొద్దిమందిని మనమెలా గుర్తుపట్టవచ్చు?’

కొద్దిమంది చేతుల మీదుగా వేలమందికి పోషణ లభించింది (4వ పేరా చూడండి)

యేసు కొద్దిమందిని ఎంచుకున్నాడు

5, 6. (ఎ) మరణానంతరం, తన అనుచరులకు చక్కని ఆధ్యాత్మిక పోషణ ఇచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి యేసు ఏ ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు? (బి) తన మరణానంతరం ఓ కీలకమైన బాధ్యతను చేపట్టడానికి వీలుగా తన అపొస్తలులను యేసు ఎలా సిద్ధం చేశాడు?

5 బాధ్యతగల కుటుంబ శిరస్సు తన మరణానంతరం తన కుటుంబానికి ఏలోటూ రాకుండా ఉండేందుకు ముందుగానే కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. అలాగే, పరలోకానికి వెళ్లాక క్రైస్తవ సంఘ శిరస్సు కానున్న యేసు కూడా తన మరణానంతరం తన శిష్యులకు ఆధ్యాత్మికంగా ఏలోటూ రాకుండా ఉండేందుకు ముందుగానే కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. (ఎఫె. 1:22) ఉదాహరణకు, తన మరణానికి సుమారు రెండు సంవత్సరాల ముందు యేసు ఓ ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తులో ఎంతోమందిని ఆధ్యాత్మికంగా పోషించడానికి తాను ఉపయోగించుకోనున్న కొద్దిమందిలో మొదటి గుంపును యేసు ఎంపిక చేసుకున్నాడు. ఆ సందర్భంలో ఏమి జరిగిందో చూడండి.

6 రాత్రంతా ప్రార్థించిన తర్వాత, యేసు తన శిష్యులను పిలిచి, వాళ్లలో 12 మంది అపొస్తలులను ఎంచుకున్నాడు. (లూకా 6:12-16) ఆ తర్వాతి రెండు సంవత్సరాల్లో, ప్రత్యేకించి ఆ 12 మందితో ఆయన సన్నిహితంగా ఉంటూ వాళ్లకు తన మాటల ద్వారా, మాదిరి ద్వారా బోధించాడు. వాళ్లు ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉందనే విషయం యేసుకు తెలుసు. నిజానికి వాళ్లకు, “శిష్యులు” అనే పేరు అలాగే కొనసాగింది. (మత్త. 11:1; 20:17) ఆయన వాళ్లలో ప్రతీ ఒక్కరికి అమూల్యమైన ఉపదేశాల్ని ఇచ్చాడు, పరిచర్యలో విస్తృతంగా శిక్షణను ఇచ్చాడు. (మత్త. 10:1-42; 20:20-23; లూకా 8:1-3; 9:52-55) మరణానంతరం తాను పరలోకానికి తిరిగి వెళ్లాక, తన శిష్యులు చేపట్టబోయే కీలకమైన బాధ్యతకు యేసు అప్పుడు వాళ్లను సిద్ధం చేశాడని స్పష్టమౌతోంది.

7. తన అపొస్తలులు ముఖ్యంగా ఏ పని చేస్తారని యేసు తన మాటల్లో సూచించాడు?

7 ఇంతకీ అపొస్తలుల బాధ్యత ఏమిటి? సా.శ. 33 పెంతెకొస్తు దగ్గరపడుతుండగా, అపొస్తలులు “పర్యవేక్షణ చేసే స్థానంలో” సేవ చేస్తారనే విషయం స్పష్టమైంది. (అపొ. 1:20, NW) వాళ్లు ముఖ్యంగా ఏ పని చేస్తారు? యేసు తన పునరుత్థానం తర్వాత అపొస్తలుడైన పేతురుతో జరిపిన సంభాషణలో, ఆ పనేంటో సూచించాడు. (యోహాను 21:1, 2, 15-18 చదవండి.) కొందరు ఇతర అపొస్తలుల సమక్షంలో యేసు పేతురుకు ఇలా చెప్పాడు: “నా గొఱ్ఱె పిల్లలను మేపుము.” అలా, భవిష్యత్తులో ఎంతోమందిని ఆధ్యాత్మికంగా పోషించడానికి తాను ఉపయోగించుకోనున్న కొద్దిమందిలో అపొస్తలులు ఉంటారని యేసు సూచించాడు. తన “గొఱ్ఱె పిల్లల” గురించి తానెలా భావిస్తున్నాడో చూపించడానికి యేసు చెప్పిన ఆ మాటలు మనల్ని ఎంతో స్పృశిస్తాయి.b[2]

పెంతెకొస్తు మొదలుకొని ఎంతోమందికి ఆధ్యాత్మిక పోషణ

8. క్రీస్తు ఉపయోగించుకుంటున్న మాధ్యమాన్ని తాము స్పష్టంగా గుర్తించామని పెంతెకొస్తు రోజున కొత్తగా విశ్వాసులైన వాళ్లు ఎలా చూపించారు?

8 పునరుత్థానం చేయబడిన క్రీస్తు సా.శ. 33 పెంతెకొస్తు మొదలుకొని తన అపొస్తలులను మాధ్యమంగా ఉపయోగించుకుంటూ ఇతర అభిషిక్త శిష్యులను ఆధ్యాత్మికంగా పోషించాడు. (అపొస్తలుల కార్యములు 2:41, 42 చదవండి.) అపొస్తలులే ఆ మాధ్యమం అని అప్పటి ఆత్మాభిషిక్త క్రైస్తవులైన యూదులు, యూదామత ప్రవిష్టులు స్పష్టంగా గుర్తించారు. నిస్సంకోచంగా, వాళ్లు ‘అపొస్తలుల బోధయందు ఎడతెగక యుండిరి.’ ఓ విద్వాంసుని ప్రకారం “ఎడతెగక యుండిరి” అని అనువాదమైన గ్రీకు క్రియాపదానికి “స్థిరంగా ఉండడం, ఏక దృష్టితో ఫలానా పనికి నమ్మకంగా హత్తుకొని ఉండడం” అనే అర్థం కూడా ఉంది. కొత్తగా విశ్వాసులైన వాళ్లు ఆధ్యాత్మిక ఆహారం కోసం ఎంతగానో తపించారు. అంతేకాక, అది ఎక్కడ దొరుకుతుందో కూడా వాళ్లకు తెలుసు. యేసు ఏమి బోధించాడో, ఏమి చేశాడో తెలుసుకోవడానికి, అలాగే యేసు గురించి చెబుతున్న లేఖనాల అర్థాన్ని గ్రహించడానికి వాళ్లు సడలని విశ్వసనీయతతో అపొస్తలులపై ఆధారపడ్డారు.c[3]—అపొ. 2:22-36.

9. యేసు గొర్రెల పోషణను చూసుకోవాల్సిన తమ బాధ్యతను స్పష్టంగా మనసులో ఉంచుకున్నామని అపొస్తలులు ఎలా చూపించారు?

9 యేసు గొర్రెల పోషణను చూసుకోవాల్సిన తమ బాధ్యతను అపొస్తలులు స్పష్టంగా మనసులో ఉంచుకున్నారు. ఉదాహరణకు, కొత్తగా ఏర్పడిన సంఘంలో విభజనలు సృష్టించగల ఓ సున్నితమైన సమస్యను వాళ్లు ఎలా పరిష్కరించారో చూడండి. ఆ సమస్య ముఖ్యంగా భౌతిక ఆహారానికి సంబంధించినది. అప్పట్లో, హెబ్రీ భాష మాట్లాడే విధవరాండ్రకు అనుదిన ఆహారం క్రమంగా అందింది కానీ, గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రకు సరిగ్గా అందలేదు. అపొస్తలులు ఆ చిక్కును ఎలా పరిష్కరించారు? “పండ్రెండుగురు అపొస్తలులు,” ఆహారాన్ని పంచిపెట్టే అత్యవసరమైన “పనికి” ఏడుగురు అర్హులైన సహోదరులను నియమించారు. ఆ 12 మంది అపొస్తలుల్లో ఎక్కువమంది అంతకుముందు యేసు అద్భుతరీతిలో ఆహారాన్ని పెడుతున్నప్పుడు, దాన్ని జనసమూహాలకు పంచిపెట్టే పనిలో పాల్గొన్నవాళ్లే. అయితే, భౌతిక పోషణను చూసుకోవడం కన్నా ఆధ్యాత్మిక పోషణను చూసుకోవడం ఇంకా ప్రాముఖ్యమని అపొస్తలులు గుర్తించారు. అందుకే, వాళ్లు ‘వాక్య పరిచర్యకు’ అంకితమయ్యారు.—అపొ. 6:1-6.

10. యెరూషలేములోని అపొస్తలులను, పెద్దలను క్రీస్తు ఎలా ఉపయోగించుకున్నాడు?

10 సా.శ. 49 నాటికి, ఇంకా జీవించి ఉన్న అపొస్తలులకు అర్హులైన ఇతర పెద్దలు తోడయ్యారు. (అపొస్తలుల కార్యములు 15:1, 2 చదవండి.) అప్పుడు ‘యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలు’ పరిపాలక సభగా సేవచేశారు.సిద్ధాంతపరమైన సమస్యల్ని పరిష్కరించడానికి, అలాగే ప్రకటనా పనినీ బోధనా పనినీ పర్యవేక్షిస్తూ తగిన నిర్దేశాలివ్వడానికి సంఘ శిరస్సైన క్రీస్తు అర్హులైన ఆ చిన్న గుంపును ఉపయోగించుకున్నాడు.—అపొ. 15:6-29; 21:17-19; కొలొ. 1:18.

11, 12. (ఎ) మొదటి శతాబ్దంలోని సంఘాలను పోషించడానికి తన కుమారుడు ఉపయోగించుకున్న మాధ్యమాన్ని యెహోవా ఆశీర్వదించాడని ఏది చూపిస్తోంది? (బి) ఆధ్యాత్మిక పోషణ కోసం క్రీస్తు ఉపయోగించుకున్న మాధ్యమాన్ని స్పష్టంగా గుర్తించడం ఎలా వీలైంది?

11 మొదటి శతాబ్దంలోని సంఘాలను పోషించడానికి తన కుమారుడు ఉపయోగించుకున్న మాధ్యమాన్ని యెహోవా ఆశీర్వదించాడా? నిశ్చయంగా! అలాగని మనమెందుకు నమ్మవచ్చు? అపొస్తలుల కార్యముల పుస్తకం ఇలా నివేదిస్తోంది: “వారు [అపొస్తలుడైన పౌలు, అతని ప్రయాణ సహచరులు] ఆయా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.” (అపొ. 16:4, 5) యెరూషలేములోని పరిపాలక సభ ఇచ్చిన నిర్దేశాలకు నమ్మకంగా కట్టుబడి ఉండడం వల్ల సంఘాలు అభివృద్ధి చెందాయని గమనించండి. సంఘాలను పోషించడానికి తన కుమారుడు ఉపయోగించుకున్న మాధ్యమాన్ని యెహోవా ఆశీర్వదించాడనడానికి అది రుజువు కాదా? యెహోవా మెండుగా ఆశీర్వదిస్తేనే ఆధ్యాత్మిక అభివృద్ధి సాధ్యమౌతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం.—సామె. 10:22; 1 కొరిం. 3:6, 7.

12 మనం ఇప్పటివరకు చూసినట్లుగా, తన అనుచరులను పోషించడానికి యేసు ఈ పద్ధతిని ఉపయోగించుకున్నాడు: ‘ఆయన కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందిని పోషించాడు.’ ఆధ్యాత్మిక పోషణ కోసం ఆయన ఉపయోగించుకున్న మాధ్యమం స్పష్టంగా గుర్తించడానికి వీలైంది. అన్నిటికన్నా ముఖ్యంగా, పరలోకం నుండి సహాయం అందుతుందని పరిపాలక సభలో మొదటి సభ్యులైన అపొస్తలులు నిరూపించారు. “ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహత్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను” అని అపొస్తలుల కార్యములు 5:12 చెబుతోంది.d[4] కాబట్టి, ‘తన గొర్రెలకు కావాల్సిన పోషణను క్రీస్తు నిజంగా ఎవరి ద్వారా ఇస్తున్నాడు?’ అని క్రైస్తవులుగా మారిన వాళ్లు చింతించాల్సిన అవసరం అప్పట్లో లేనేలేదు. కానీ, మొదటి శతాబ్దం చివరికల్లా పరిస్థితి మారిపోయింది.

మొదటి శతాబ్దంలో, సంఘాన్ని పోషించడానికి యేసు ఎవరిని ఉపయోగించుకుంటున్నాడో స్పష్టమైంది (12వ పేరా చూడండి)

గురుగులు ఎక్కువగా, గోధుమ వెన్నులు తక్కువగా ఉన్న కాలం

13, 14. (ఎ) యేసు ఏ హెచ్చరిక చేశాడు? ఆయన మాటలు ఎప్పుడు నెరవేరనారంభించాయి? (బి) ఏ రెండు గుంపుల నుండి దాడి వస్తుందని లేఖనాలు ముందుగానే చెప్పాయి? (అధస్సూచి చూడండి.)

13 క్రైస్తవ సంఘం మీద దాడి జరుగుతుందని యేసు ముందుగానే ప్రవచించాడు. గోధుమలు, గురుగుల గురించిన ప్రవచనాత్మక ఉపమానంలో కొత్తగా విత్తిన గోధుమల [అభిషిక్త క్రైస్తవులు] మధ్య గురుగులు [నకిలీ క్రైస్తవులు] విత్తబడతాయని యేసు హెచ్చరించినట్లు గుర్తుచేసుకోండి. అయితే కోతకాలమైన “యుగసమాప్తి” వరకూ గోధుమల, గురుగుల తరగతులు రెండూ కలిసి ఎదిగేందుకు అనుమతించబడతాయని ఆయన చెప్పాడు. (మత్త. 13:24-30, 36-43) కొంతకాలానికే యేసు చెప్పిన మాటలు నెరవేరనారంభించాయి.e[5]

14 మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలోకి మతభ్రష్టత్వం జొరబడింది, కానీ అబద్ధ బోధల వల్ల సంఘం కలుషితం కాకుండా యేసు నమ్మకమైన అపొస్తలులు దాన్ని ‘అడ్డగించారు.’ (2 థెస్స. 2:3, 6, 7) అయితే, అపొస్తలుల్లో చివరి వ్యక్తి మరణించిన తర్వాత మతభ్రష్టత్వం వేళ్లూనుకొని, ఎన్నో శతాబ్దాల కాలంలో పెరిగి విస్తరించింది. అదనంగా, ఆ కాలమంతటిలో గురుగుల సంఖ్య ఎంతగానో పెరిగింది, కానీ గోధుమలు మాత్రం కొద్దిగానే ఉన్నాయి. ఆ సంవత్సరాల్లో, ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచిపెట్టడానికి ఓ వ్యవస్థీకృత మాధ్యమం ఉనికిలో లేదు. అయితే ఆ పరిస్థితి మెల్లగా మారింది. కానీ ప్రశ్నేమిటంటే, ఎప్పుడు?

కోతకాలంలో ఎవరు ఆధ్యాత్మిక పోషణను చూసుకుంటారు?

15, 16. బైబిలు విద్యార్థులు లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయి? మనకు ఏ ప్రశ్న వస్తుంది?

15 కోతకాలం దగ్గరపడుతుండగా, కొందరు బైబిలు సత్యం విషయంలో గొప్ప ఆసక్తి చూపించారు. చర్చీల్లో, క్రైస్తవమత సామ్రాజ్యంలోని ఇతర శాఖల్లో ఉన్న నకిలీ క్రైస్తవులైన గురుగుల నుండి వేరుగా 1870వ దశకంలో యథార్థవంతులైన సత్యాన్వేషకులు ఓ చిన్న గుంపుగా ఒకచోట చేరి బైబిలు తరగతులు ఏర్పర్చుకున్నారని గుర్తుచేసుకోండి. బైబిలు విద్యార్థులు అనే పేరుపెట్టుకున్న ఆ కొద్దిమంది వినయ హృదయంతో, మంచి మనసుతో లేఖనాలను జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా పరిశోధించారు.—మత్త. 11:25.

16 బైబిలు విద్యార్థులు లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. బైబిలు సంబంధిత సాహిత్యాన్ని ప్రచురించి, దూరదూరాల్లో ఉన్న ప్రజలకు అందజేస్తూ ఆ నమ్మకమైన స్త్రీపురుషులు అబద్ధ సిద్ధాంతాల్ని బట్టబయలు చేశారు, ఆధ్యాత్మిక సత్యాల్ని వ్యాప్తి చేశారు. వాళ్లు చేసిన పని, ఆధ్యాత్మిక సత్యాల కోసం ఆకలిదప్పులు కలిగిన ప్రజల మనసుల్ని, హృదయాల్ని గెల్చుకుంది. అదంతా చూస్తుంటే, మనకు ఓ ఆలోచింపజేసే ప్రశ్న వస్తుంది: ‘1914 వరకున్న సంవత్సరాల్లో ఉన్న బైబిలు విద్యార్థుల గుంపు, తన గొర్రెల పోషణను చూసుకోవడానికి క్రీస్తు ఏర్పర్చుకున్న మాధ్యమమేనా?’ కాదు. వాళ్లు ఇంకా ఎదుగుతున్న కాలంలోనే ఉన్నారు, ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచిపెట్టే మాధ్యమానికి కావాల్సిన ఏర్పాటు అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటోంది. గురుగుల్లాంటి నకిలీ క్రైస్తవులను గోధుమల్లాంటి నిజక్రైస్తవుల నుండి వేరు చేసే సమయం అప్పటికింకా రాలేదు.

17. ఏ ప్రాముఖ్యమైన సంఘటనలు 1914లో జరగనారంభించాయి?

17 మనం ముందటి ఆర్టికల్‌లో నేర్చుకున్నట్లుగా, కోతకాలం 1914లో ఆరంభమైంది. ఆ సంవత్సరంలో, ఎన్నో ప్రాముఖ్యమైన సంఘటనలు జరగనారంభించాయి. యేసు రాజుగా సింహాసనాసీనుడయ్యాడు, అంత్యదినాలు మొదలయ్యాయి. (ప్రక. 11:15) 1914 నుండి 1919 తొలి భాగం వరకు యేసు తన తండ్రితో కలిసి ఆధ్యాత్మిక ఆలయానికి అత్యవసరమైన తనిఖీని, శుద్ధిచేసే పనిని చేసేందుకు వచ్చాడు.f[6] (మలా. 3:1-4) ఆ తర్వాత, 1919తో మొదలైన కాలమే గోధుమల్ని కూర్చే సమయం. చివరకు, ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచిపెట్టే మాధ్యమాన్ని క్రీస్తు ఎంచుకోవడానికి సరైన సమయం అదేనా? నిశ్చయంగా అదే!

18. దేన్ని నియమిస్తానని యేసు ముందుగానే చెప్పాడు? అంత్యదినాలు మొదలౌతున్న సమయంలో ఏ ప్రశ్న తలెత్తింది?

18 అంత్యకాలం గురించి చెప్పిన ప్రవచనంలో, “తగినవేళ” ఆధ్యాత్మిక “అన్నము పెట్టుటకు” ఓ మాధ్యమాన్ని నియమిస్తానని యేసు ముందుగానే చెప్పాడు. (మత్త. 24:45-47) ఆయన ఏ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటాడు? మొదటి శతాబ్దంలోలాగే, ఆయన మళ్లీ కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణను ఇస్తాడు. కానీ, అంత్యదినాలు అప్పుడప్పుడే మొదలౌతున్న తరుణంలో, ఓ క్లిష్టమైన ప్రశ్న తలెత్తింది: ‘ఆ కొద్దిమంది ఎవరు?’ యేసు చెప్పిన ప్రవచనానికి సంబంధించిన ఆ ప్రశ్నకు, మరితర ప్రశ్నలకు మనం తర్వాతి ఆర్టికల్‌లో జవాబు చూస్తాం.

a 3వ పేరా: [1] ఆ తర్వాతి సందర్భంలో స్త్రీలు, పిల్లలు కాక 4,000 మంది పురుషులకు అద్భుతరీతిలో ఆహారాన్ని పెట్టినప్పుడు యేసు మళ్లీ ఆహారాన్ని “తన శిష్యులకిచ్చెను, శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి.”—మత్త. 15:32-38.

b 7వ పేరా: [2] పేతురు జీవించిన కాలంలో, ఆధ్యాత్మిక పోషణను అందుకున్న వాళ్లంతా పరలోక నిరీక్షణ గల వ్యక్తులే.

c 8వ పేరా: [3] కొత్తగా విశ్వాసులైన వాళ్లు ‘అపొస్తలుల బోధయందు ఎడతెగక యుండిరి’ అనే దాన్నిబట్టి చూస్తే, అపొస్తలులు క్రమంగా బోధించేవాళ్లని తెలుస్తోంది. అపొస్తలులు చేసిన కొన్ని బోధలు ప్రేరేపిత క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఇప్పుడు భాగంగా ఉన్నాయి.

d 12వ పేరా: [4] అపొస్తలులేకాక ఇతరులు కూడా అద్భుతమైన ఆత్మ వరాలు పొందినప్పటికీ, వాళ్లలో చాలామంది ఒక అపొస్తలుడి ద్వారానో, ఒక అపొస్తలుడి సమక్షంలోనో వాటిని పొందారని తెలుస్తోంది.—అపొ. 8:14-18; 10:44, 45.

e 13వ పేరా: [5] రెండు గుంపుల నుండి సంఘం మీద దాడి జరుగుతుందని అపొస్తలుల కార్యములు 20:29, 30 వచనాల్లో నమోదైన అపొస్తలుడైన పౌలు మాటలు చూపిస్తున్నాయి. ఒకటి, నకిలీ క్రైస్తవులు (“గురుగులు”) ‘వాళ్లలో ప్రవేశిస్తారు.’ రెండు, నిజక్రైస్తవుల ‘మధ్యలో నుండే వంకర మాటలు పలుకు’ కొందరు మతభ్రష్టులు పుట్టుకొస్తారు.

f 17వ పేరా: [6] ఈ సంచికలో ఉన్న ‘ఇదిగో నేను సదాకాలము మీతో కూడ ఉన్నాను’ అనే ఆర్టికల్‌లోని 6వ పేరాను చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి