సువార్తనందించుట—తెలివిగా ప్రచురణలను ఉపయోగించుటద్వారా
1 1991 సేవా సంవత్సరపు ప్రత్యేక దిన సమావేశ కార్యక్రమము “మన పరిచర్య—సాధారణమైనది కాదు, అది పరిశుద్ధమైనది” అను చర్చను కలిగియుండెను. మన పని పవిత్రమైనది కావున దానిని ధారాదత్తము చేయబడినదిగా తీసికొనకూడదని అని నొక్కి తెలియజేసెను. ముద్రిత సాహిత్యములను ఉపయోగించుట మన పరిచర్యలో ఒక ముఖ్యమైన భాగమైయున్నందున, దీనినికూడా గౌరవమైనదిగా ఎంచవలెను. ప్రచురణలను తెలివిగా ఉపయోగించుటద్వారా మనలో ప్రతివారము మనము భావించు లోతైన గౌరవమును ప్రదర్శించగలము.
2 1990 సేవా సంవత్సర కాలములో, ప్రపంచ వ్యాప్తముగా సొసైటి 678 దశలక్షల పత్రికలను 51 దశలక్షలకు పైగా బైబిళ్లు మరియు బౌండు పుస్తకములను ఉత్పత్తి చేసినది. సమయము, శక్తి, మరియు డబ్బుతో సహా సమర్పిత వనరుల అసమానమైన ఖర్చును ఇది సూచించుచున్నది. అనేకమంది స్వచ్ఛంద సేవకుల సమిష్టి కృషి ఫలితముగా వ్యక్తిగత ఉపయోగమునకు మరియు ప్రాంతీయసేవలో పంచుటకు నాణ్యతగల సాహిత్యములు ఉత్పత్తి చేయబడెను. నిష్కపటులైన వారికి రాజ్యవర్తమానమును తెలియజేయుచుండగా మన సాహిత్యముల కొరకు హృదయపూర్వక మెప్పుకోలును మనము ప్రతిబింబించగల్గుటకు కొన్ని మార్గములేమైయున్నవి?
3 వ్యక్తిగత మరియు కుటుంబ పఠనము: రోమీయులు 2:21లో అపొస్తులుడైన పౌలు ఇట్లనుచున్నాడు: “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?” చదువుటకు, పఠించుటకు మరియు బైబిలుపై ఆధారపడిన సాహిత్యములపై ప్రార్థనాపూర్వకముగా ధ్యానించుటకు మనము సమయమును తీసికొనినప్పుడు, తన గృహనిర్వాహకుని ద్వారా సమకూర్చబడుచున్న యెహోవాయొక్క సమయానుసారమైన ఆత్మీయాహారమును మనమెంతగా కొనియాడుచున్నామో వ్యక్తిగతముగా ప్రదర్శింతుము. (లూకా 12:42) వ్యక్తిగతముగా లేక కుటుంబ పఠనముద్వారా, బయల్పరచబడిన సత్యములను ఎప్పటికప్పుడు ఎరిగియుండుట మన శ్రద్ధకు యెహోవా అప్పగించిన సమస్తముయెడల ఉన్నతమైన గౌరవమును పెంపొందించుకొనుటకు మనలను శక్తిమంతులను చేయును. తమ సాహిత్యములపై ఇష్టమొచ్చినట్లు గీతలుగీయకుండా లేక పాడు చేయకుండా వాటియెడల తగిన శ్రద్ధ మరియు మెప్పు చూపుటకు పిల్లలకు కూడ సరియైన శిక్షణనివ్వవలెను. దానికితోడు, ప్రాంతీయసేవలో ఉపయోగించుటకు చక్కగా, శుభ్రముగా ఉండుటకు మన సాహిత్యములను సరియైనరీతిలో భద్రపరచవలెను.
4 వృథాచేయకుము: నిజమైన ప్రయోజనముగా ఉండుటకు, మన సాహిత్యములు సత్యమును వెదకువారి చేతులకు, అనగా మన వర్తమానమందు మరియు పనియందు నిజమైన ఆసక్తిగల వారికి చేరవలెను. (మత్త. 10:11) కావున మనము అసాధారణ పరిస్థితులలో మినహా, మన సాహిత్యములను ఊరకనే ఇచ్చివేయుటను విడనాడవలెను. పత్రికలు, పుస్తకములు, లేక ఇతర సాహిత్యములు ఇంటిలో పేరుకొనిపోవుటకు అనుమతించినను వృధా అగును.
5 పత్రికలకు తేదీలు వేయబడును గనుక, వాటిని ప్రస్తుత పత్రికలుగా అందించుటకు మనకు సమయము పరిమితముగా ఉండును. కావున పరిచర్య చేయ బయటకు వెళ్లుటకు మరియు ఆసక్తిగలవారికి ఈ పత్రికలు అందుబాటులో ఉండునట్లు చేయుటకు మనభాగమై తీర్మానపూర్వక కృషి అవసరము. ఇంకను పత్రికలు పేరుకుపోవు కారణమును మనము చూసినట్లయిన, బహుశ పత్రిక పనిలో ఎక్కువ సమయము గడుపుటకు మన సమయపట్టికను సవరించుకొనుట మంచిదైయుండును. లేక దీనిని సహేతుకముగా చేయుట కుదరకపోయినట్లయిన, మన ఆర్డరును సవరించవలెను. ఈ సలహాలను పాటించుటద్వారా, మనకై మనము దేవుని కృపకు నమ్మకమైన గృహనిర్వాహకులుగా చూపించుకొందుము.—1 కొరిం. 4:2; 1 పేతు. 4:10, 11; లూకా 16:1, 10 పోల్చుము.
6 తన నమ్మకమైన “గృహనిర్వాహకునికి” అధికారముగల “ఆస్తితో” సహా యెహోవా తన సమర్పిత ప్రజలకు ఒక బరువైన బాధ్యతను మరియు పనిని “అప్పగించుయున్నాడు.” (2 తిమో. 1:12; లూకా 12:42-44, 48 b; 1 తిమో. 6:20) దేవుని సేవలో మనకున్న ఆధిక్యతలయెడల లోతైన మెప్పుతో, మనము ఇతరులకు సువార్తనందించుటలో మన సాహిత్యములను తెలివిగా ఉపయోగించుదము గాక.