మన సాహిత్యాలను నీవు విలువైనవిగా ఎంచుదువా?
1 రత్నాలు, ఇతర మణులు అందాన్నిబట్టే కాకుండా, వాటిని కనుగొని, త్రవ్వివెలికి తీయడంలో కలిగే అధికవ్యయం కారణంగా కూడ అవి వెలగలవై ఉంటాయి. యెహోవాను, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము వీటన్నింటికంటె మరెంతో ఉన్నతమైన విలువను కలిగివుంది, మరియు ప్రపంచమంతటిలో కేవలము మన సాహిత్యములు మాత్రమే యీ ఆత్మీయ సిరులను దైవిక జ్ఞానముతో లోతుగా వివరిస్తున్నాయి. (రోమా. 11:33; ఫిలి. 3:8) మన సాహిత్యముల యెడల నిజమైన మెప్పుదలను మనమెట్లు ప్రదర్శించగలము?
2 అనేకమంది వ్యక్తులు, ఆయాకుటుంబముల గుంపులు క్రమంగా కొంత చందాను ప్రక్కకుతీసి, దాన్ని రాజ్యమందిరానికి తీసుకువెళ్లి అక్కడున్న చందాపెట్టెలలో ఒకదానిలో వేస్తున్నారు. ప్రజలకందించే మన సాహిత్యాలకు మనం తీసుకునే చందా వాటి ఉత్పత్తికయ్యే మొత్తం ఖర్చుకు ఏ మాత్రం సరిపోదు. కాబట్టి రాజ్యపని కొరకు ఆయావ్యక్తులు, సంఘాలు సొసైటికి చందా ఇచ్చినప్పుడు, అది మరిన్ని సాహిత్యాలు ఉత్పత్తిచేయుటకు సహాయం చేస్తుంది.
3 విలువైన మన సాహిత్యాల యెడల మెప్పుదలను ప్రదర్శించుటకు మరొక మార్గమేదనగా, మనము అందుకొనిన వెంటనే వాటిని చదివి, పఠించుటయే. భవిష్యత్తులో ఒక దినము కొరకు దాచిపెట్టకండా వెంటనే తీసుకోవాల్సిన జీవానుగ్రహ ఆత్మీయాహారాన్ని మన పుస్తకాలు, పత్రికలు కలిగివున్నాయి. సంఘంలో పఠించు సమయము వరకు వేచియుండుటకు బదులు, కావలికోట పత్రికను సాధ్యమైనంత త్వరగా చదువుటకు కృషిచేయవచ్చును. సాహిత్యంతో మనమెంత ఎక్కువ పరిచయాన్ని కలిగివుంటే, దాన్ని గృహస్థులకు అందించడానికి మనమంత సిద్ధహస్తులమై ఉంటాము. నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసునిద్వారా యెహోవా దయచేస్తున్న సాహిత్యాన్ని మనం మెచ్చుకొంటున్నామని చూపించే మూడవ మార్గమేదనగా, మన గృహాలలో దాన్ని సరిగ్గా భద్రపరచి, జాగ్రత్తగా సేవా ప్రాంతానికి తీసుకెళ్లుటయే. (మత్త. 24:45) మన సాహిత్యాన్ని మూసివుండే బీరువాలో లేదా కనీసం పొడిగావుండే స్థలంలోపెట్టి దాన్ని మన గృహాలలో శుభ్రంగా ఉంచుదుమా? పరిచర్య కొరకు మన బ్యాగులను సర్దుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటున్నామా, సాహిత్యాన్ని, పత్రికల్ని బ్యాగులో పెట్టుకునేటప్పుడు లేదా బయటకు తీసేటప్పుడు చినిగిపోకుండా మురికికాకుండా మనం జాగ్రత్తపడుతున్నామా? అలాచేయడం మనమన్ని వేళలా చక్కని, పరిశుభ్రమైన సాహిత్యాన్ని కలిగియుండి, యెహోవా పరిచారకులుగా మనల్నిమనం చక్కగా పరిచయం చేసుకునేందుకు దోహదపడుతుంది.
4 రాజ్యమందిరపు బీరువాలో లేదా మీ గృహమందు వదిలివేయబడిన సాహిత్యం దాని సంకల్పాన్ని నెరవేర్చదు, పైగా దాని విలువ గుర్తింపబడదు. పాత పత్రికలను, బ్రోషూర్లను, బౌండు పుస్తకాలను, కరపత్రాల్ని సహితం మంచిగా ఉపయోగించాలి. ఇప్పటికే మన దగ్గరున్న సాహిత్యాల జాబితాను చివరిసారి మనం ఎప్పుడు తీశాం? అవి ఎంతగా పేరుకుపోయాయో కనుగొంటే మనం ఆశ్చర్యపడవచ్చు. మన దగ్గరున్న సాహిత్యం పేజీలు రంగు వెలిసిపోకుండ, చిరిగిపోకుండా, మురికి కాకుండా మంచి స్థితిలో ఉన్నదా? అట్లయిన, వాటిని ప్రాంతీయ పరిచర్యలో అందించుటకు మనం ప్రతి ప్రయత్నం చేయాలి. పాడైపోయిన సాహిత్యాల్ని వ్యక్తిగత ఉపయోగం కొరకు ఉంచుకోవచ్చు లేదా అవసరంలేనివి తీసివేయవచ్చు. ప్రస్తుత సాహిత్య అందింపుపై మనం ప్రాథమికంగా దృష్టి నిలుపుచున్నను, వేరొక సాహిత్యాన్ని ఉపయోగించడానికి మనం కొన్నిసార్లు నిర్ణయించుకోవచ్చును.
5 అందించడానికి నిజానికి మీకెంత సాహిత్యం కావాలో అన్ని సమయాల్లో జాగ్రత్తగా ఆలోచించాలి. దీనికి మంచి వివేచన అవసరం. తగినన్ని సాహిత్యాలు అవసరమైనను, ప్రత్యేకంగా నీవు పయినీర్ సేవచేస్తున్నట్లయితే, రాజ్యమందిరంలో కూటములకు ముందు ఆ తర్వాత వాటిని ఎక్కువగా తీసుకోగల అవకాశంవుంది గనుక, వ్యక్తిగత సరఫరా క్రింద ఎక్కువ సంఖ్యలో సాహిత్యాన్ని ఉంచుకోనవసరం లేదు. ఆ నెలలో ప్రారంభించడానికి కావల్సినంత సాహిత్యాన్ని కలిగియుంటూ, అది అయిపోయే కొలది మరిన్ని తీసుకోండి.
6 దేవుని సత్యవాక్యాన్ని ప్రశంసించే ప్రజల కందించినప్పుడు మన సాహిత్యాలు మరింత విలువైనవిగా యుండును. మన సాహిత్యాల విలువను మనమెంత ఉన్నతంగా ఎంచుచున్నామో చూపించుటకుగాను, మనకందించబడుచున్న దానిని ఉపయోగించుటలో మనమందరము జ్ఞానులుగా, వివేకులుగా ఉందాము.