ప్రశ్నా భాగము
◼ బాప్తిస్మములకు హాజరగువారు ఎట్లు సంతోషమును వ్యక్తపరచగలరు?
బాప్తిస్మము ఒక సంతోషదాయక సందర్భము. తమ విశ్వాసమును బహిరంగముగా ప్రదర్శించుచు, క్రొత్తవారు యెహోవా పక్షమున నిలుచుటను చూచుటకు మనము ఆనందింతుము. (కీర్త. 40:8) ఇది పరలోకమందు గొప్ప సంతోషమునకు కారణమని యేసు చెప్పెను. (లూకా 15:10) క్రొత్తవారు ఈ ఆవశ్యకమైన చర్యను తీసికొనుటను చూచుటలో బాప్తిస్మము తీసికొనువారితో పఠనముచేసిన ప్రచారకులు మరియు కుటుంబసభ్యులు ప్రత్యేకముగా సంతోషింతురు. అయితే అటువంటి సంతోషమును సరియైన రీతిలో ఎట్లు వ్యక్తము చేయవచ్చును?
ఈనాటి క్రైస్తవ బాప్తిస్మములకు యేసు బాప్తిస్మము ఒక మాదిరినుంచినది. తాను గైకొనబోవు చర్య గంభీరమైనది, పవిత్రమైనదని ఆయన గుణగ్రహించెను. బాప్తిస్మము తీసికొనుచుండగా ఆయన ప్రార్థించెను. (లూకా 3:21, 22) బాప్తిస్మపు సమయము ధ్యానము మరియు యుక్త తలంపునకు తగిన సమయమని ఆయన ఎరిగియుండెను. ఆయన శిష్యులును బాప్తిస్మపు గంభీరతను గుర్తించిరి. సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత, ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మము పొందిరి. ఆ సంఘటనను కళ్లారాచూసిన శిష్యుల ప్రతిస్పందన ఏమైయుండెను. “వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.” (అపొ. 2:41, 42) శిష్యులు ఆత్మీయ సంగతులను ధ్యానించి ఒకరితోనొకరు ఆతిథ్యము పంచుకొనిరి.
ఆధునిక కాలములలో క్రైస్తవ సమావేశములలో బాప్తిస్మములు ఉన్నతాంశాలుగా ఉన్నవి. యెహోవా పక్షమున నిలుచుటకు ఆయావ్యక్తులు చర్యగైకొనుటను మనము చూసినప్పుడు, కరతాళ ధ్వనులు మరియు మెచ్చుకొనుటద్వారా మన సంతోషమును వ్యక్తపర్చుట నిశ్చయముగా యుక్తమే. అయితే, అదుపులేని సంతోషమును ప్రదర్శించుట, ఈలలువేయుట, చేతులుపైకిత్తి ఊపుట, పేర్లుపెట్టి పిలుచుట సరియైన పనికాదు. అటువంటి ప్రవర్తన విశ్వాసమును వ్యక్తపరచు ఈ సంఘటనయొక్క గంభీరత మరియు పవిత్రత యెడల ప్రశంస లేకపోవుటను చూపించును. ఆలాగే బాప్తిస్మము తీసికొని కొలనునుండి బయటకు వచ్చునప్పుడు వారికి డంబముగా పూలగుచ్ఛములను లేక ఇతర బహుమానములను ఇచ్చుటకూడ సరియైన పనియైయుండదు. క్రైస్తవుడు రక్షణకొరకు చేయు పరుగుపందెపు ఆరంభమును బాప్తిస్మము గుర్తించును. బాప్తిస్మము పొందువారికి, బాప్తిస్మము యెహోవాతో సన్నిహిత సంబంధమునకు ద్వారము తెరచునని వారు మెచ్చుకొనుటకు సహాయముచేయుట ద్వారా మనము ఆనందించగలము మరియు వారికి ప్రోత్సాహకరముగా ఉండగలము.
నవ్వులాటలకు, ఆటలకు, ఈతకొట్టుటకు లేక సందర్భముయొక్క గంభీరతను పాడుచేయు ఇతరత్రా ప్రవర్తనకు బాప్తిస్మపు స్థలము సరియైన ప్రదేశము కాదు. మన సంతోషమును ఘనమైన రీతిలో వ్యక్తపరచవలెను. మన క్రమము మరియు గంభీరత హాజరైయున్న వారందరి సంతోషమునకు దోహదపడును.