పయినీరు సేవ—గొప్ప దీవెనలను తెచ్చు సేవ
1 మనము సంతోషించవలెనని, కష్టించి పనిచేసిదానికి మంచిని అనుభవించవలెనని యెహోవా ఇచ్ఛయించుచున్నాడు. (ప్రసం. 5:18) మనము పాల్గొని చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏదనగా రాజ్యమును ప్రకటించుట మరియు శిష్యులను చేయుట. పౌలు తిమోతికి ఇట్లు ఉద్బోధించెను: “సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.” (2 తిమో. 4:5) ఆయన తిమోతిని ప్రోత్సహించెను, మరియు పౌలు మాటలు ఈనాడు మనమును మన పరిచర్యయందు పూర్ణాత్మగలవారమై యుండుటకు ప్రోత్సహించుచున్నవి. కొంతమందికి, పూర్ణాత్మసేవలో క్రమపయినీరుగా సేవచేయుట ఇమిడియుండవచ్చును. పూర్తికాల పరిచర్యను చేపట్టుటకు మీ వ్యక్తిగత పరిస్థితులు అనుమతించునా అని ఎందుకు ప్రార్థనాపూర్వకముగా ఆలోచించకూడదు?
2 అనుకూల చర్య అవసరము: పయినీరు పనిలో చేరుటకు మన ప్రార్థనల కనుగుణ్యముగా నిర్ణయాత్మక చర్యలు చేపట్టుట అవసరము. ప్రజల కొరకైన ప్రేమతోపాటు, యెహోవా సేవకొరకు హృదయపూర్వక కోరికను పెంపొందించుకొనుము. ప్రాంతీయసేవలో మీ కార్యఫలమును ఎక్కువచేయుము, పునర్దర్శనములను బైబిలు పఠనములను వృద్ధిపర్చుము. అభ్యాససిద్ధమైన సమయపట్టికను వేసికొనుటకు పనిచేయుము, వాస్తవికముగా ఉండుము. పెద్దలనుండి పయినీర్లనుండి సలహాలను గైకొనుము. ప్రకటించు పనిలో భాగమువహించుటకు బహుగా ఆలోచించి చేపట్టిన వాడుకకు హత్తుకొనియుండుము. స్వయం-క్రమశిక్షణ, చొరవ, మరియు స్థిరనిర్ణయము అవసరము. (1 కొరిం. 9:23, 25, 27) ఇటీవల నెలలలో సేవలో చేరిన అనేకులు చేపట్టిన అనుకూల చర్యలలో ఇవి కలవు.
3 మన శక్తిసామర్థ్యాలను మరింత నిర్మలపరచుకొనుచు, ఖచ్ఛితమైన గురులను పెట్టుకొని వాటివిషయమై పట్టుదలతో పనిచేయుట ప్రకటించు పనిలో మనము ప్రగతి సాధించుటకు మనలను శక్తిమంతులను చేయును. మన ఉపోద్ఘాతములను లేక అభ్యంతరములతో వ్యవహరించు విధానములో మనము అభివృద్ధి సాధించగలమా? లభ్యమగు సాహిత్యములన్నిటిని మనము పూర్తిగా ఉపయోగింతుమా? మనము ప్రగతిదాయకమైన బైబిలు పఠనమును నిర్వహించుచున్నామా? ఆ తర్వాత క్రమపయినీరు సేవయొక్క ఆలోచనతో ఇప్పుడు మనము సహాయ పయినీరు సేవను ప్రారంభించగలమా? గురులు అభ్యాససిద్ధమై యుండవలెను మరియు వాటిని మనము నెరవేర్చగలదాని ప్రకారము ఏర్పరచుకొనుము. అటువంటి గురులను సాధించుట మన ప్రభావశీలతను మెరుగుపర్చును మరియు మనకెంతో సంతృప్తినిచ్చును.—1 తిమో. 4:15, 16.
4 ప్రతిఫలదాయకమైన జీవన విధానము: సరియైన ఉద్దేశ్యముతోచేయు పయినీరు సేవ మరియు ఆత్మీయ అభివృద్ధి సాధించవలెనను కోరిక అనేక ప్రయోజనములు తెచ్చును. మనము యెహోవాపై మరింత బలముగా ఆధారపడుటను వృద్ధిచేసికొందుము. పరిచర్యలో క్రమముగా ఉపయోగించుట వలన దేవుని వాక్యమును బహు నైపుణ్యముగా ఉపయోగించుట వచ్చును. సంఘముపై యోగ్యమైన ప్రభావముండును, మరియు మన ఆసక్తిపూర్వకమైన మాదిరి పరిచర్యలో మరియెక్కువగా పాల్గొనుటకు ఇతరులను ప్రోత్సహించవచ్చును. జీవితముపై మరింత ఆత్మీయ దృక్పథమును కలిగియుండుటకు పయినీరు సేవ మనకు సహాయపడగలదు మరియు లోక చింతలు, కోరికలు, సహవాసములనుండి మనలను కాపాడుటకు పనిచేయును.
5 యేసు తన అనుచరులకు ఇట్లు చెప్పెను: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక, తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.” (మత్త. 9:37, 38) యేసు కాలముకంటే పనివారి అవసరము ఈనాడు మరియెక్కువ కలదు. ఈ అత్యవసరమైన, జీవరక్షణ పనిలో సంపూర్ణముగా పాల్గొనుటకు పయినీరు సేవ మనకు అవకాశమునిచ్చును. మన మహాగొప్ప సృష్టికర్తయొక్క పూర్తికాల సేవలో ఒకని జీవితమును ఉపయోగించుటనుండి కలుగు సంతుష్టి మరియు సంతృప్తికి ఏదియు సాటిరాదు.—సామె. 10:22.