‘ఫలవంతమైన సేవ చేయడానికి గొప్ప అవకాశాన్ని’ మీరు వినియోగించుకోగలరా?
1. ‘ఫలవంతమైన సేవ చేసే’ ఏ ‘గొప్ప అవకాశం’ మనందరికీ ఉంది?
1 అపొస్తలుడైన పౌలుకు ‘ఫలవంతమైన సేవ చేసే గొప్ప అవకాశం’ లభించినప్పుడు, ఆయనను ఎంతోమంది వ్యతిరేకించినా ప్రకటనా పనిలో కొనసాగడానికి ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. (1 కొరిం. 16:9, ఈజీ-టు-రీడ్-వర్షన్) నేడు దాదాపు 6,42,000 మంది రాజ్య ప్రచారకులు క్రమ పయినీరు సేవ చేయడంద్వారా ఫలవంతమైన సేవ చేసే గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.
2. మనం ఎప్పటికప్పుడు మన పరిస్థితులను బేరీజు వేసుకోవడం ఎందుకు మంచిది?
2 పరిస్థితులు మారతాయి: ప్రస్తుతం మనకున్న వ్యక్తిగత పరిస్థితుల కారణంగా మనం పరిచర్యలో ఎక్కువగా పాల్గొనలేకపోవచ్చు, అయితే ఆ పరిస్థితులు మారతాయి. కాబట్టి, మనం అనుకూలమైన పరిస్థితులు వచ్చేవరకు వేచివుండే బదులు ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిస్థితులను బేరీజు వేసుకోవడం మంచిది. (ప్రసం. 11:4) మీరు ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేయబోతున్న యౌవనస్థులా? మీ పిల్లలు త్వరలో స్కూలుకు వెళ్లడం మొదలుపెడతారా? మీ రిటైర్మెంట్ దగ్గరపడిందా? అయితే అలాంటి మార్పులవల్ల మీకు ఎక్కువ ఖాళీ సమయముండి మీరు పయినీరు సేవ చేసేందుకు వీలుపడవచ్చు. గతంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న ఒక సహోదరి, తన 89వ ఏట పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకు? సంవత్సరం మొత్తంలో ఒక్కసారైనా ఆమె ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం రాలేదు కాబట్టి పయినీరు సేవ చేయడానికి తన ఆరోగ్యం అనుమతిస్తుందని ఆ సహోదరికి అనిపించింది.
3. క్రమ పయినీరు సేవను చేయడానికి కొంతమంది ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు?
3 పౌలు మొదట కొరింథులోని తన సహోదరులను కలుసుకోవాలనుకున్నాడు. కానీ ఆయన సువార్త నిమిత్తం తన ప్రణాళికల్లో సర్దుబాట్లు చేసుకున్నాడు. నేడు క్రమ పయినీరు సేవ చేస్తున్నవారు కూడా దాని కోసం ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాల్సివచ్చింది. కొంతమంది తమ జీవితాలను ఎంత నిరాడంబరం చేసుకున్నారంటే, వారికుండే కొద్దిపాటి ఖర్చుల కోసం వారు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తే సరిపోతుంది. వారు తమ సేవాధిక్యతనుబట్టి ఎంతో ఆనందిస్తున్నారు. (1 తిమో. 6:6-8) కొంతమంది వివాహ దంపతుల్లో కేవలం భర్త మాత్రమే ఉద్యోగం చేసేలా తమ జీవన విధానంలో సర్దుబాట్లు చేసుకోవడంతో భార్య పయినీరు సేవను ప్రారంభించగలిగింది.
4. నియమిత గంటలను పూర్తి చేయలేమని మనకనిపిస్తే మనం ఏమి చేయవచ్చు?
4 నియమిత గంటల్ని పూర్తి చేయలేమనే భయంతో పయినీరు సేవ చేయాలనే మీ ఆలోచనను మానుకోకండి. రోజుకు రెండు గంటలకన్నా కొంచెం ఎక్కువ సమయం వెచ్చిస్తే చాలు. అలా చేయలేమని మీకనిపిస్తే, 70 గంటలు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఒకటి, రెండు నెలలు సహాయ పయినీరు సేవ చేయడానికి ప్రయత్నించండి. ఇది పయినీరు సేవ చేయడంలో ఉన్న ఆనందాలను మీరు రుచి చూసేలా చేస్తుంది. (కీర్త. 34:8) ప్రస్తుతం పయినీరు సేవ చేస్తున్న వారితో మాట్లాడండి. వారు మీరు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళనే అధిగమించివుండవచ్చు. (సామె. 15:22) మీ పరిచర్యను విస్తృతపరుచుకునేందుకు మీరు చేసే ప్రయత్నాలను ఆశీర్వదించమని యెహోవాను కోరండి.—1 యోహా. 5:14.
5. క్రమ పయినీరు సేవ ఎందుకు ప్రయోజనకరమైన పని?
5 ప్రయోజనకరమైన పని: క్రమ పయినీరుగా సేవచేయడం ఎన్నో ఆశీర్వాదాలను తెస్తుంది. ఎక్కువగా ఇవ్వడంవల్ల కలిగే అధిక సంతోషాన్ని మీరు చవిచూస్తారు. (అపొ. 20:35) పయినీరు సేవ దేవుని వాక్యపు సత్యాన్ని సరిగ్గా ఉపయోగించే విషయంలో మీ సామర్థ్యానికి పదును పెడుతుంది. (2 తిమో. 2:15) యెహోవా మీకిచ్చే మద్దతును చవిచూసే మరిన్ని అవకాశాలని అది మీకు ఇస్తుంది. (అపొ. 11:21; ఫిలి. 4:11-13) పయినీరు సేవ సహనం వంటి ఆధ్యాత్మిక లక్షణాలను వృద్ధి చేసుకోవడానికి, యెహోవాకు సన్నిహితమయ్యేందుకు కూడా మీకు సహాయం చేస్తుంది. (యాకో. 4:8) మీరు కూడా ఫలవంతమైన సేవ చేయడానికి ఉన్న గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని క్రమ పయినీరు సేవ చేయగలరా?