సృష్టికి దేవుడైన వానిని స్తుతించుము
1 అందమైన పచ్చిక బయళ్లు, రమ్యమైన సూర్యాస్తమయాలు, చుక్కలతో నిండిన ఆకాశము, పక్షుల మధురమైన గీతాలు—ఇట్టి ఆహ్లాదకరమైన వాటన్నిటికి మీ రెవరిని ఘనపరచెదరు? అవును, ఈ సృష్టికి దేవుడైన వానిని స్తుతించుటకు మనము కదలింపబడి యున్నాము. ప్రకటన 4:11 నందు వ్యక్తపరచబడిన మాటలతో మనము హృదయపూర్వకంగా ఏకీభవించెదము. యెహోవా దేవుడు సమస్తమును సృజించినందున ఆయన మన స్తుతికి పాత్రుడైయున్నాడు.
2 దేవుని సృష్టి కార్యములకు నిదర్శనము ఉన్ననూ, జీవము యాదృచ్ఛికముగా లేక గ్రుడ్డిదైన పరిణామము వలన వచ్చిందను సిద్ధాంతమును మనుష్యులు వ్యాప్తిచేశారు. ఈ ఘోరమైన అబద్ధము మనుష్యులను నీచత్వానికి దిగజార్చి నీతిమాలిన వారిగా చేసింది. అది మన మహా సృష్టికర్తపై దేవదూషణకరమైన నిందగా ఉన్నది.—ప్రసం. 12:1; రోమీ. 1:20, 25.
3 యెహోవా యథార్థమైన సేవకులముగా, మన సృష్టికర్తను గూర్చి, ఆయన ఆశ్చర్యకార్యములను గూర్చి సత్యమును అందించే అవకాశము, మనకు అక్టోబరు మాసంలో కలదు. జీవోత్పత్తి, దాని సంకల్పమును గూర్చిన వాస్తవములను నేర్చుకొనుటకు నిజమైన ఆసక్తిగలవారందరికి లైఫ్—హౌ డిడ్ ఇట్ గెట్ హియర్? బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్? అను పుస్తకము అందించబడుతుంది. జీవోత్పత్తిని గూర్చిన సత్యమును నిర్భయముగా నిరూపించుటకు ఈ ప్రచురణ మనలను సంసిద్ధం చేస్తుంది.
4 ప్రత్యేక ప్రాంతాలు: ఇంటింటికి సాక్ష్యమిచ్చుటతో పాటు, పాఠశాలవద్ద, లేక మనం పనిచేసే చోట పరిణామమా లేక సృష్టియా అను అంశముపై నిర్దిష్టంగా ఆసక్తిగలవారితో మాట్లాడుటకు మనము విశేషంగా ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు పిల్లలైన సాక్షులు ఈ క్రియేషన్ పుస్తకమును వారి స్కూలు టీచర్లకు చూపించినప్పుడు దానిని అందించుటలో వారు మంచి విజయాన్ని పొందారు. ఒక సాక్షి యువతి ఈ క్రియేషన్ పుస్తకమును తన టీచరుకు ఇవ్వగా, ఆ టీచరు దానిని విపులంగా చదవడమేగాక, క్లాసులో బోధించడానికి టీచరు ఈ పుస్తకాన్ని ఆధారంగా తీసికొనటం గమనించి ఎంతో ఆశ్చర్య పోయింది. (w90 9/1 పేజి 32; w 86 10/1 పేజి. 32) ఈ మంచి ప్రచురణను చదవటానికి సంతోషిస్తారని మీరు తలంచే మీ టీచర్లనుగాని, మీ తోటి విద్యార్థులనుగాని ఎందుకు కలుసుకొనకూడదు?
5 మీ ప్రాంతములో జీవించే లేక పనిచేసే కాలేజి విద్యార్థులు, అధ్యాపకులను చేరుకొనుటకు ప్రత్యేక ప్రయత్నము చేయవచ్చును. లాయర్లు, డాక్టర్ల వంటి వృత్తిని చేపట్టినవారు క్రియేషన్ పుస్తకమునందలి లోతైన పరిశోధన, దాని రచనా విధానమును బట్టి దాని నెంతగానో మెచ్చుకున్నారు. (yb87 పేజి. 54) మీరు కలుసుకోబోయే వారు చక్కగా వివరించబడిన ఈ ప్రచురణను రెఫరెన్సు సాహిత్యంగా వాడుకొనటానికైనను ఇష్టపడవచ్చును.
6 వివేకముతో, మనము కలుసుకొనే ప్రతివారికి ఈ క్రియేషన్ పుస్తకమును ఇవ్వము. ఎందుకంటే, అనేకమందికి కేవలము ఈ అంశముపై ఆసక్తే ఉండదు. అలాంటి వారికి పత్రికలనుగాని, లేక వారికి బాగుంటుందని మీరు తలంచే వేరే ఇతర సాహిత్యాన్ని ఇవ్వవచ్చును. అయితే, విద్యావంతమైన మరియు సృష్టికర్తపై విశ్వాసమును నిర్మించే ఒకటి లేక అంతకన్నా ఎక్కువ నిర్దిష్టమైన అంశాలను ఈ పుస్తకములోనుండి చర్చించే కొలది, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనే ఆశగల, సరియైన మనస్సుగలవారిని మీరు కనుగొంటారు. అటువంటి వారికే మనము క్రియేషన్ పుస్తకమును ఇవ్వగోరుదుము.
7 ఈ మంచి సాధనము ఇంకా అనేకులకు పరిణామ సిద్ధాంతమెంత అయుక్తమైనదో గ్రహించేలా సహాయపడటమే గాక, జీవమను వరముపై మెప్పును పెంచుకొనుటకు వారికి సహాయపడవచ్చును, “భూమిని ఆకాశమును సృజించినవాడును” జీవదాతయైన వాని మహిమ నిమిత్తము నిరంతరం జీవించు కోరికను ఈ పుస్తకము వారిలో రేకెత్తించును.—కీర్త. 146:6.