దేవుని మందిరము యెడల మెప్పుదలను చూపండి
1 బైబిలు కాలాల్లో యెహోవా తన ప్రజలను తన మందిరములో క్రమంగా కూడుకోవాలని ఆజ్ఞాపించాడు. (లేవీ. 23:2) అలా కూడుకోవడం ధ్యానించుకోడానికి, సహవసించడానికి, యెహోవా ధర్మశాస్త్రాన్ని చర్చించడానికి సమయాన్నిస్తూ, దేవుని వాక్యంపై తమ మనస్సులను నిలపడానికి సహాయపడింది. వారి హృదయాలు దేవుని తలంపులతో నింపబడ్డాయి. అవి దేవుని ఆశీర్వాదాలను సమృద్ధిగా తెచ్చాయి. ఇవి నిజంగా సంతోషకరమైన సందర్భాలు. ఈ ఏర్పాటు ఐక్యతను, స్వచ్ఛమైన ఆరాధనను పెంపొందించింది. నేడు దేవుని మందిరములో కూడుకోవడం తక్కువ ప్రాముఖ్యమైనదేమీ కాదు.
2 మనకు కూటముల యెడల ప్పుదల గలదని ఎలా చూపించగలము? కొన్ని సంఘాలు కూటాలకు తక్కువ హాజరు ఉన్నట్లు నివేదిస్తున్నాయి. అప్పుడప్పుడు ఒక వ్యక్తి పరిస్థితి కూటమునకు హాజరు కాకుండా చేయవచ్చు. అయితే, మరీ చిన్న సమస్యలు, కూటాలకు క్రమంగా హాజరు కాకుండా మిమ్మల్ని అడ్డగించేందుకు మీరు అనుమతించారా? కొందరు తమకు చిన్న తలనొప్పి ఉన్నందువలన లేదా, పగలంతా ఎక్కువ పని చేయడం వలన అలసిపోయినందుకు యింట్లోనే ఉండాలని నిర్ణయించుకుంటారు. మరి కొందరు తమను సందర్శించబోయే అవిశ్వాసులైన బంధువులకు ఆతిథ్యమివ్వడానికి బద్ధులని భావించారు. కొందరు తమకు యిష్టమైన టి.వి. కార్యక్రమాన్ని లేదా వేరే ఏదో క్రీడా కార్యక్రమాన్ని తిలకించడానికోసం కూటాలకు హాజరు కావడం కూడా మానేశారు. కోరహు కుమారులు వ్యక్తపరచిన హృదయపూర్వక కోరికతో యీ పరిస్థితుల్లో ప్రదర్శించబడిన మెప్పుదల స్పష్టంగా సమానం కాదు: “యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది.”—కీర్త. 84:2.
3 కూటాల్లో ఆత్మీయ ఆహారం సమృద్ధిగా అందించబడుతున్నప్పటికీ, హాజరైనవారిలో కొందరికి శ్రద్ధ నిలపడానికి కష్టంగా ఉంది. వారు పగటి కలలు కంటున్నట్లు, దైనందిన ఆదుర్దాలను గూర్చి ఆలోచిస్తున్నట్లు, మగత నిద్రలో ఉంటున్నట్లు తెలుసుకుంటున్నారు. క్లుప్తంగా నోట్స్ రాసుకోవడం అప్రమత్తంగా ఉండడానికి, చెప్పబడుతున్న వాటిపై శ్రద్ధ నిలపడానికి సహాయపడుతుందని అనేకులు గ్రహించారు. విషయాలను రాసుకోవడం సమాచారాన్ని మనస్సులో పదిలంగా ఉంచుకోడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాక, ముందుగా సిద్ధపడడం పూర్తిగా ప్రయోజనం పొందడానికి కూడా సహాయకరంగా ఉంటుంది. మనం చక్కగా సిద్ధపడితే, మనం ‘విశేష శ్రద్ధ’ కలిగి ఉండగలుగుతాము.—హెబ్రీ. 2:1.
4 పిల్లలు, అలాగే పెద్దలు కూటాల్లో యివ్వబడే ఉపదేశాలను గ్రహించవలసిన అవసరముంది. తల్లిదండ్రులు పిల్లలకు ఆటబొమ్మలను, లేదా బొమ్మలకు రంగులు వేసుకునే పుస్తకాలను యిచ్చి వారు వాటిలో నిమగ్నమయ్యేలా, నిశ్శబ్దంగా ఉండేటట్లు చేస్తే, పిల్లలు చాలా పరిమితంగానే నేర్చుకుంటారు. ఆడుకోడానికి, మాట్లాడుకోడానికి, ఏడ్వడానికి, ప్రక్కన కూర్చున్నవారిని ఆటంకపరచే యితర పనులను చేయడానికి పిల్లలను అనుమతించారంటే, సరైన క్రమశిక్షణ లేదన్నమాట. తన తల్లిదండ్రులలో ఒకరు ఎప్పుడూ తన వెంట ఉంటారని బాబు తెలుసుకున్నప్పుడు, కూటాలు జరిగే సమయాల్లో నీళ్ళు త్రాగడానికి లేదా మరుగుదొడ్డికి తరచుగా, అనవసరంగా వెళ్ళడం సాధారణంగా తగ్గుతుంది.
5 సమయాన్ని పాటించడం ప్రాముఖ్యము: అప్పుడప్పుడు కూటాలకు సమయానికి హాజరు కావడాన్ని అడ్డగించే అనివార్య పరిస్థితులు ఉండవచ్చు, కాని అలవాటుగా ఆలస్యంగా—ప్రారంభ గీతము, ప్రార్థన తర్వాత—రావడం, కూటాల పవిత్ర సంకల్పము యెడల మరియు యితరులను ఆటంకపర్చకుండా ఉండవలసిన మన బాధ్యత యెడల గౌరవం లేకపోవడాన్ని సూచిస్తుంది. సంఘ కూటాల్లో మన సహోదరులతో కలిసి పాడడం, ప్రార్థించడమనేది మన ఆరాధనలో భాగమని గుర్తుంచుకోండి. అలవాటుగా ఆలస్యం చేయడమనేది, సరైన సంస్థీకరణ లేకపోవడం లేదా ముందుగా తయారు కాకపోవడం వలన కలిగే ఫలితమే. సమయాన్ని పాటించడమనేది మన కూటాల యెడల మనకు గల గౌరవాన్ని మెప్పుదలను చూపుతుంది.
6 ఆ దినము యింతకు ముందెన్నటికన్నా సమీపిస్తున్న కొలది, సమాజముగా కూడుకొనవలసిన అవసరం ఎక్కువే అవుతుంది. (హెబ్రీ. 10:24, 25) క్రమంగా హాజరౌతూ, ముందుగా సిద్ధపడుతూ, సమయాన్ని పాటిస్తూ, శ్రద్ధతో వింటూ, మనం నేర్చుకుంటున్న వాటిని అన్వర్తించుకుంటూ మన మెప్పుదలను చూపుదాము.