విశ్వాసం వలన నడవండి
1 కోట్లాది మంది ప్రజలు మూఢంగా సంపద యొక్క వంచనాత్మక శక్తిని నమ్ముతూ తమ జీవితాలను వస్తు సంపదల చుట్టూ నిర్మించుకుంటున్నారు. (మత్త. 13:22) వారు తమ సంపదను కోల్పోయినప్పుడు లేదా అది దొంగిలించబడినప్పుడు లేదా ఏ మాత్రం ప్రయోజనం లేనిదిగా నిరూపించబడినప్పుడు కష్టతరమైన పాఠాన్ని నేర్చుకుంటున్నారు. ఆత్మీయ నిక్షేపాల కోసం వెదుకుతూ జ్ఞానపూర్వకమైన మార్గాన్ని వెంబడించాలని మనం బోధించబడుతున్నాం. (మత్త. 6:19, 20) ఇలా చేయడంలో “విశ్వాసము వలన నడుచు”కోవడం ఇమిడి ఉంది.—2 కొరిం. 5:6.
2 ఆత్మవిశ్వాసం, నమ్మకం, దృఢ నిశ్చయత అనే ఆలోచనను తెలిపే గ్రీకు పదం నుండి “విశ్వాసము” అనే పదం అనువదించబడింది. విశ్వాసము వలన నడవడం అంటే మన త్రోవలను నడిపే ఆయన సామర్థ్యంలోను మన అవసరాలను తేర్చేందుకు ఆయనకు గల సంసిద్ధతలోను నమ్మకముంచుతూ దేవునిమీది విశ్వాసంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అని భావం. యేసు పరిపూర్ణ మాదిరినుంచాడు; నిజంగా ప్రాముఖ్యమైనదేదో దానిపై ఆయన అవధానాన్ని కేంద్రీకరించాడు. (హెబ్రీ. 12:2) అలాగే, అదృశ్యమైన విషయాలపై మన హృదయాలను కేంద్రీకరించవలసిన అవసరం మనకుంది. (2 కొరిం. 4:18) మన ప్రస్తుత జీవితం అనిశ్చయమైనదని మనం ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకునేవారమై ఉండాలి మరియు యెహోవాపై మనకు గల పరిపూర్ణ ఆశ్రయాన్ని గుర్తించాలి.
3 యెహోవా మనల్ని ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ నిర్దేశం క్రింద తన దృశ్య సంస్థ ద్వారా నడుపుతున్నాడని కూడా మనం గట్టిగా నమ్మేవారమై ఉండాలి. (మత్త. 24:45-47) మనం సంఘంలో ‘నాయకులుగా ఉన్నవారికి లోబడి’ ఉండడం ద్వారా మనం మన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాము. (హెబ్రీ. 13:17) దైవపరిపాలనా ఏర్పాటుతో వినయంగా పనిచేయడం యెహోవా యందలి మన నమ్మకాన్ని కనబరుస్తుంది. (1 పేతు. 5:6) చేయడానికి సంస్థకు ఇవ్వబడిన చెయ్యవలసిన పనికి పూర్ణహృదయంతో మద్దతునిచ్చేందుకు మనం ప్రేరేపించబడాలి. ఇది ప్రేమ ఐక్యతల దృఢమైన బంధంలో మన సహోదరులతో మనలను మరింత సన్నిహితులను చేస్తుంది.—1 కొరిం. 1:10.
4 మన విశ్వాసాన్ని ఎలా బలపరచుకోవాలి: మన విశ్వాసం అభివృద్ధి రహితమవ్వడానికి మనం అనుమతించకూడదు. మనం దానిని పెంచుకునేందుకు కఠిన పోరాటమే చేయవలసి ఉంది. పఠనంలోను ప్రార్థనలోను కూటాలకు హాజరు కావడంలోను క్రమము గలవారమై ఉండడం యెహోవా సహాయంతో ఎటువంటి పరీక్షనైనా ఎదుర్కొనగలిగేలా మన విశ్వాసాన్ని బలపరచుకునేందుకు సహాయపడుతుంది. (ఎఫె. 6:16) ప్రతిదినం బైబిలును చదివేందుకు మరియు కూటాలకు హాజరయ్యేందుకు మీరు మంచి దినచర్యను ఏర్పాటు చేసుకున్నారా? మీరు నేర్చుకున్న దానిని మీరు తరచూ ధ్యానిస్తారా, యెహోవాను ప్రార్థనలో సమీపిస్తారా? అన్ని కూటాలకు హాజరవ్వడం, అవకాశం కలిగినప్పుడెల్లా వాటిలో పాల్గొనడం మీకు అలవాటేనా?—హెబ్రీ. 10:23-25.
5 బలమైన విశ్వాసం మంచి పనుల చేత నిరూపించబడుతుంది. (యాకో. 2:26) మన విశ్వాసాన్ని కనబరచే శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటి మన నిరీక్షణను ఇతరులకు ప్రకటించడమే. సువార్తను పంచుకునే అవకాశాల కొరకు మీరు వెదుకుతారా? పరిచర్యలో మరింత చేయగలిగేందుకు మీరు మీ పరిస్థితులను సర్దుబాట్లు చేసుకోగలరా? మన పరిచర్య నాణ్యతను, ఫలవంతాన్ని మెరుగుపరచుకునేందుకు మనకు లభించే సలహాలను మీరు అన్వయిస్తారా? మీరు వ్యక్తిగత లక్ష్యాలను పెట్టుకుని వాటిని చేరుకునేందుకు కఠిన యత్నం చేస్తున్నారా?
6 దైనందిన జీవన కార్యాల్లో అమితంగా ఇమిడి పోవడాన్ని గూర్చి మరియు వస్తుసంపద సంబంధమైన లేదా స్వార్థపరమైన ఆసక్తులు మన ఆత్మీయ ఉత్తరాపేక్షను మందగింపజేయడాన్ని గూర్చి యేసు హెచ్చరించాడు. (లూకా 21:34-36) మన విశ్వాస సంబంధమైన ఓడ నాశనమై పోవడాన్ని నివారించేందుకు మనమెలా నడుస్తున్నామనే దానిని గూర్చి మనం బాగా పరిశీలించుకోవలసిన అవసరం ఉంది. (ఎఫె. 5:15; 1 తిమో. 1:19) ‘మంచి పోరాటం పోరాడాం, మన పరుగు తుద ముట్టించాం, విశ్వాసాన్ని కాపాడుకున్నాం’ అని మనమందరం తుదకు చెప్పుకోగలమని నిరీక్షించుదాం.—2 తిమో. 4:7.