“సమయోచిత సహాయము”
1 సరిగ్గా మనకు సహాయం అవసరమున్న సమయంలోనే సహాయం లభిస్తే ఎంత సేదదీర్చేదిగా ఉంటుందో కదా! (హెబ్రీ. 4:16) “దైవిక శాంతి సందేశకులు” అన్న జిల్లా సమావేశంలో సమయోచిత సహాయంగా రెండు ప్రత్యేక సహాయకాలను మనకు ఇచ్చినప్పుడు మనం ఆనందించాము.
2 కుటుంబ సంతోషానికిగల రహస్యం అనే కొత్త పుస్తకం సరైన సమయంలో వచ్చింది. ఆనందమయమైన కుటుంబ జీవితాన్ని ఇచ్చే అవశ్యకమైన నాలుగు విషయాలపై అది శ్రద్ధను కేంద్రీకరించింది: (1) ఆత్మనిగ్రహం, (2) శిరసత్వాన్ని గుర్తించడం, (3) మంచి పరస్పర సంభాషణ, (4) ప్రేమ. కుటుంబ సంతోషం పుస్తకంలో ఇవ్వబడిన ఉద్బోధను అన్వయించుకునే కుటుంబాలన్నీ దైవిక శాంతిని కనుగొనేందుకు ఇది సహాయపడుతుంది. ఈ కొత్త పుస్తకాన్ని జాగ్రత్తగా చదివేందుకూ కుటుంబమంతా కలిసి పఠించేందుకూ సమయాన్ని కేటాయించండి. మార్చి నెలలో మొట్టమొదటిసారిగా దాన్ని ప్రజలకు ప్రభావవంతంగా అందించేందుకు సిద్ధపడివుండేందుకుగాను దానిలోని విషయాలను బాగా తెలుసుకోండి.
3 దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? అనే కొత్త బ్రోషూరు శిష్యులను చేసే మన పనిని వేగిరపర్చేందుకు సరైన సమయంలో వచ్చింది. ప్రత్యేకంగా, ఎక్కువగా చదువుకోనివారికి సహాయంచేసేందుకు దాన్ని ఉపయోగించినప్పటికీ చదువుకున్న అనేక వయోజనులూ చిన్నపిల్లలు కూడా దానిలోని మూల బైబిలు బోధల సరళమైన వివరణలనుండి ప్రయోజనం పొందగలరు. జ్ఞానము పుస్తకంలో పఠనాన్ని ప్రారంభించేందుకు మొదటి మెట్టుగా అవసరమైంది సరిగ్గా ఇదే కావచ్చు. దేవుడు తమ నుండి కోరేవాటిని చేసేందుకు ఈ ఏర్పాటు అనేకమందికి తప్పక సహాయం చేస్తుంది.
4 ‘తనకు లేమి లేదనీ, తన ప్రాణము సేదదీర్పును పొందిందనీ తన గిన్నె నిండి పొర్లుచున్నదనీ’ దావీదు వ్యక్తపర్చినప్పుడు ఆయన మన భావాలను పరిపూర్ణంగా వ్యక్తపర్చాడు. (కీర్త. 23:1, 3, 5) దేవుడైన యెహోవాను తెలుసుకుని, ఆయన్ను సేవించాలని యథార్థంగా కోరుకునే అనేకులకు ఈ అద్భుతమైన ఆత్మీయ సహాయాన్ని ఇచ్చేందుకు మనం ఆనందంగా ఎదురు చూస్తాము.