కుటుంబ సంతోషానికిగల రహస్యమును ఇతరులతో పంచుకోవడం
1 కుటుంబమనేది మానవ సమాజపు ప్రాథమిక విభాగం, కుటుంబం ద్వారా గ్రామాలూ, నగరాలూ, రాష్ట్రాలూ, మరియు మొత్తం దేశాలూ రూపొందుతాయి. నేడు కుటుంబ విభాగం మునుపెన్నటికన్నా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. కుటుంబ జీవితపు ఉనికికే ప్రమాదాన్ని కలుగజేసే శక్తివంతమైన ప్రభావాలు పని చేస్తున్నాయి. మనం కుటుంబ సంతోషాన్ని పొందగల్గేలా కుటుంబ ఏర్పాటుకు రూపకర్త అయిన యెహోవా కావలసిన ఉపదేశాలను అనుగ్రహించినందున మనం ఎంత కృతజ్ఞులమో గదా! ఆయన మార్గదర్శకసూత్రాలను అనుసరించే వారు, అలా చేయడంవల్ల సమస్యలు తగ్గుతాయనీ విజయవంతమైన కుటుంబ విభాగం ఏర్పడుతుందనీ తెలుసుకుంటారు. సెప్టెంబరులో కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకమును ఇతరులకు పంచిపెట్టే ఆధిక్యత మనకుంది. కుటుంబ జీవితాంశంతో ప్రజలను సమీపించేందుకు చొరవ తీసుకోండి. స్నేహపూర్వకంగా ఉండండి, అనుకూలదృక్పథం మరియు వివేచన కలిగి ఉండండి. మీరేం చెప్పవచ్చు?
2 మీరిలా ప్రశ్నించడం ద్వారా ప్రారంభించవచ్చు:
◼ “జీవిత ఒత్తిడులను సహించడం అనేక కుటుంబాలకు కష్టతరంగా ఉండడాన్ని మీరు గమనించారా? [ప్రతిస్పందించనివ్వండి.] అనేకమంది ప్రజలు గృహంలో కష్టాలనుభవిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. కుటుంబాలు అధిక స్థిరత్వాన్ని మరియు సంతోషాన్ని కనుగొనడానికి ఏది సహాయం చేస్తుందని మీరు అనుకుంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] కుటుంబ ఏర్పాటును దేవుడు నెలకొల్పాడు గనుక, ఆయన ఇచ్చిన మార్గదర్శకసూత్రాలను పరిశీలించడం సహేతుకం కాదంటారా? [2 తిమోతి 3:16, 17 చదవండి.] కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే ఈ పుస్తకంలో అలాంటి ప్రయోజనకరమైన ఉపదేశం సంక్షిప్తంగా ఇవ్వబడింది.” తరువాత సాధారణమైన ఒక కుటుంబ సమస్యగా ఆయన ఏ సమస్యను పరిగణిస్తున్నాడో అడిగి, ఆ సమస్యను చర్చించే అధ్యాయమును చూపించి, ఆ పుస్తకమును ప్రతిపాదించండి.
3 పునర్దర్శనంలో, బైబిలు పఠనాన్ని ప్రారంభించే లక్ష్యంతో ఇలా చెప్పవచ్చు:
◼ “కుటుంబ జీవితం అనే అంశం మీద మీరు చెప్పిన దానిగురించి నేను ఆలోచించాను, మీరు చదవడానికి ఇష్టపడతారని నేననుకున్న ఓ బ్రోషూరును తెచ్చాను. [దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరును చూపించి, 16వ పేజీకి తిప్పి, పైన ఉన్న ఆరు ప్రశ్నలను చదవండి.] స్పష్టంగా, కుటుంబ సంతోషానికి దోహదపడేందుకు కుటుంబంలోని ప్రతి ఒక్కరు తమ వంతు నిర్వర్తించాలి. మీరు కొన్ని నిమిషాలు వెచ్చించగలిగితే, మీరు ఈ సమాచారం నుండి ఎక్కువ ప్రయోజనం ఎలా పొందవచ్చో నేను చూపించగలను.” ఆ తరువాత పాఠం 8 పఠించనారంభించండి.
4 చర్చను ప్రారంభించటానికి మరో మార్గం ఏమిటంటే ఒక సమస్యను ప్రస్తావించడం, బహుశా ఇలా చెప్పవచ్చు:
◼ “సంతుష్టినీ, సంతృప్తినీ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకున్నప్పటికీ, అనేక కుటుంబాలు ఈ విషయంలో నిజంగా సఫలం కానట్టు అనిపిస్తుంది. వారు నిజమైన సంతోషాన్ని పొందడానికి వారికేది సహాయం చేస్తుందని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] కుటుంబాల్లో నేడు ఎటువంటి సమస్యలను చూస్తామో చాలాకాలం క్రితమే బైబిలు తెలియజేసింది. [2 తిమోతి 3:1-3 చదవండి.] అయితే, ఈ సమస్యలను పరిష్కరించుకుని, నిత్య సంతోషాన్ని పొందడానికి ఏమి చేయాలో కూడా బైబిలు కుటుంబాలకు తెలియజేస్తుంది. కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే ఈ పుస్తకంలో దాని సూత్రాలు ఇవ్వబడ్డాయి.” సముచితమైన ఓ అధ్యాయం చివరలో ఉన్న పునఃసమీక్షా బాక్సును చూపించి, దాన్ని చదివి, పుస్తకాన్ని ప్రతిపాదించండి.
5 పునర్దర్శనంలో, పఠనాన్ని ప్రారంభించడానికి “దేవుడు కోరుతున్నాడు” బ్రోషూర్ను ఉపయోగించండి. మీరిలా చెప్పవచ్చు:
◼ “కుటుంబ జీవితానికి వర్తించే బైబిలు సూత్రాలను పరిశీలించడానికి మీరు సుముఖత చూపినందుకు నేను సంతోషిస్తున్నాను. బైబిల్లోవున్న ఆచరణాత్మకమైన ఉపదేశాన్ని అనుసరించడం వల్ల మంచి ఫలితాలు సాధించబడినట్లు అనుభవం చూపించింది. ఎందుకలా జరుగుతుందో తెలియజేసే సరళమైన వివరణ ఇక్కడ ఇవ్వబడింది.” దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్నందలి పాఠం 1లోని మొదటి పేరాను, అలాగే కీర్తన 1:1-3 లేక యెషయా 48:17, 18 చదవండి. వీలైతే, పాఠంలోని మిగిలిన భాగాన్ని పరిశీలించండి. తరువాతి పాఠాన్ని కలిసి పఠించేందుకు వస్తానని చెప్పండి.
6 దృఢ విశ్వాసం ఉన్నప్పటికీ, బైబిలు సలహా ఎడల బహుశా మెప్పు లేని ప్రజలతో మాట్లాడేటప్పుడు, మీరు క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు:
◼ “అనేకమంది ప్రజలు తమ మతపరమైన విశ్వాసం ఏదైనప్పటికీ, నేడు కుటుంబాలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని అంగీకరిస్తారు. కొంతమంది సలహా కొరకు తమ పవిత్ర గ్రంథాలను ఆశ్రయిస్తారు, కాని దుఃఖకరంగా చాలామంది యౌవనస్థులు నేడు మతపరమైన గ్రంథాలను అసంబద్ధమైనవిగా దృష్టిస్తారు. మన జీవితాలను ఎంత శ్రేష్ఠంగా గడపవచ్చుననేదాని గురించి మన సృష్టికర్త ఏవైనా ఉపదేశాలను ఇచ్చివుంటాడని మీరనుకుంటున్నారా? కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో కూడా దేవుడిని, మతాన్ని పరిగణనలోకి తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఈ ప్రచురణ చూపిస్తుంది.” పుస్తకాన్ని ప్రతిపాదించండి.
7 లేదా మీరు సరళంగా ఇలా చెప్పవచ్చు:
◼ “ప్రపంచవ్యాప్తంగా, కుటుంబ సమస్యలు అధికమౌతున్నాయి, సమాజంలోని బాధ్యతగల సభ్యులు దీని గురించి ఎంతో కలత చెందివున్నారు. తమ కుటుంబ ప్రయోజనం కొరకు కొన్ని విశ్వజనీన సూత్రాలను అన్వయించుకోవడానికి ఈ ప్రచురణ ప్రజలకు సహాయం చేస్తుంది గనుక, ప్రపంచమంతటా ప్రయోజనకరమైనదని నిరూపించబడిన ఈ ప్రచురణను మీరు తీసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. దాని వ్యాఖ్యానాలు ఒక మతానికో లేదా ఒక సాంప్రదాయానికో చెందిన ప్రజల కొరకు మాత్రమే ఉద్దేశించబడినవి కావు, కాబట్టి మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఏవైనప్పటికీ కూడా ఈ పుస్తకంలో మీరు ఆచరణయోగ్యమైన సలహాలను కనుగొంటారని నేను విశ్వసిస్తున్నాను.”
8 కుటుంబ సంతోషానికి గల రహస్యమును అంటే దేవుని వాక్యంలో పొందుపర్చబడిన ఉపదేశాలను అనుసరించడమనే రహస్యమును ఇతరులతో పంచుకోవడానికి మనకు సాధ్యమైనంతగా కృషిచేద్దాము.—కీర్త. 19:7-10.