జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారికి మనమెలా సహాయం చేయవచ్చు?
1 ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది 2008 మార్చి 22వ తేదీన ఒక శక్తివంతమైన సాక్ష్యాన్ని పొందుతారు. ఆ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారు మానవజాతి కోసం విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేయడంలో యెహోవా చూపించిన గొప్ప ప్రేమను గురించిన విషయాలు వింటారు. (యోహా. 3:16) వారు రాజ్యం గురించి, యెహోవా భూమంతటిపై తన చిత్తాన్ని నెరవేర్చడానికి దానిని ఎలా ఉపయోగిస్తాడనే దాని గురించి కూడా తెలుసుకుంటారు. (మత్త. 6:9, 10) దేవుని ప్రజల మధ్యవున్న ప్రేమ, ఐక్యతలను స్వయంగా చూడడమే కాక మన స్నేహశీలతను కూడా చవిచూస్తారు.—కీర్త. 133:1.
2 బైబిలు విద్యార్థులు: ఆ ఆచరణకు హాజరైనవారిలో మనం ఈమధ్యే బైబిలు అధ్యయనం ఆరంభించినవారు కూడా ఉంటారు. వారిని సహోదర సహోదరీలకు పరిచయం చేయండి. వారంలో జరిగే కూటాల గురించి, రాజ్యమందిర విశేషాల గురించి వివరించండి. ప్రసంగీకుడు తన ప్రసంగంలో ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలని వారిని ప్రోత్సహిస్తారు. ఆ ప్రసంగంలోని అంశాలను ఉపయోగించి మీరు మీ విద్యార్థులను ప్రోత్సహించవచ్చు.
3 నిష్క్రియులు: హాజరైనవారిలో నిష్క్రియులు కూడా ఉంటారు. చొరవ తీసుకొని వారిని ప్రేమపూర్వకంగా పలకరించండి. వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడం గానీ, అలాంటి మాటలు మాట్లాడడం గానీ చేయకండి. జ్ఞాపకార్థ ఆచరణ జరిగిన కొన్ని రోజుల తర్వాత సంఘ పెద్దలు వారిని కలిసి, హాజరవడానికి వారు చేసిన ప్రయత్నాలను మెచ్చుకొని, తర్వాతి సంఘ కూటానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు.
4 కొత్తవారు: హాజరైనవారిలో మనం వ్యక్తిగతంగా ఆహ్వానించిన పరిచయస్థులు లేదా కుటుంబ సభ్యులు కూడా ఉండవచ్చు. అంతేకాక ప్రత్యేక ప్రచార కార్యక్రమం ద్వారా ఆహ్వానపత్రికను అందుకొని వచ్చినవారు కూడా ఉండవచ్చు. అపరిచితులెవరైనా కనబడితే మీరే చొరవతీసుకొని వారిని పలకరించి, పరిచయం చేసుకోండి. వారు కూటానికి హాజరవడం ఇదే మొదటిసారికావచ్చు. కాబట్టి మాటల మధ్యలో వారిని తిరిగి ఎలా కలవాలో మీరు తెలుసుకోవచ్చు. జ్ఞాపకార్థ ఆచరణ జరిగిన కొన్ని రోజుల తర్వాత మీరు వారిని కలిసి లేదా ఫోన్లో మాట్లాడి ఇంకా ఎక్కువ నేర్చుకోమనీ, బైబిలు అధ్యయనం ఆరంభించమనీ వారిని ప్రోత్సహించవచ్చు.
5 పునర్దర్శనంలో బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని పరిచయం చేయడానికి జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగంలో ఇవ్వబడిన సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగాన్నిచ్చిన ప్రసంగీకుడు యెషయా 65:21-23 చదువుతారు. పునర్దర్శనం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ “విమోచన క్రయధనంవల్ల కలిగే ఇతర ఆశీర్వాదాలేమిటో మీకు వివరిస్తాను” అని చెప్పండి. ఆ తర్వాత బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని 4-5 పేజీలు చర్చించండి. లేదా మీరిలా చెప్పవచ్చు, “యెషయా ప్రవచన నెరవేర్పును మనమెప్పుడు చూస్తామా అని చాలామంది అనుకుంటుంటారు.” 9వ అధ్యాయం, 1-3 పేరాలను చర్చించండి. లేదా జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగాన్నిచ్చిన ప్రసంగీకుడు చెప్పిన విషయాలను ప్రస్తావించి, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని పరిచయం చేసి, బైబిలు అధ్యయనం ఎలా చేస్తామో చూపిస్తే సరిపోతుంది.
6 హాజరైన బైబిలు విద్యార్థులకు, నిష్క్రియులకు, కొత్తవారికి సహాయం చేయడానికి మనలో ప్రతీ ఒక్కరం అవకాశాలకోసం ఎదురుచూద్దాం. (లూకా 22:19) మనం రాజ్యసేవలో ఏ కాస్త ఎక్కువ చేసినా, యెహోవా ఆ సేవను తప్పకుండా ఆశీర్వదిస్తాడు.
[అధ్యయన ప్రశ్నలు]
1. 2008 మార్చి 22న ఎలాంటి శక్తివంతమైన సాక్ష్యమివ్వబడుతుంది?
2. హాజరైన బైబిలు విద్యార్థులకు మనమెలా సహాయం చేయవచ్చు?
3. హాజరైన నిష్క్రియులను మనమెలా ప్రోత్సహించవచ్చు?
4. మనలో ప్రతీ ఒక్కరం కొత్తవారికి ఎలా సహాయం చేయవచ్చు?
5. బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి మనం ఏమి చెప్పవచ్చు?
6. తన మరణ జ్ఞాపకార్థ ఆచరణ ఆచరించాలనే యేసు ఆజ్ఞను పాటిస్తుండగా మనకెలాంటి అవకాశాలు లభిస్తాయి?