క్రీడలకున్న స్థానము
మహా సృష్టికర్తను బైబిలు “ఆనందభరితుడగు దేవుడు” అని వర్ణిస్తుంది, తాను సృజించిన ప్రాణులు ఆనందంగా వుండాలని ఆయన కోరుచున్నాడు. (1 తిమోతి 1:11, NW) గనుక ఆటలాడుకొని ఆనందించే సామర్థ్యముతో మానవులను ఆయన సృజించెననుటలో ఆశ్చర్యములేదు. ది న్యూ ఎన్‌సైక్లొపీడియా బ్రిటానికా ఇట్లు తెల్పుచున్నది: “క్రీడల, ఆటల చరిత్ర మానవ చరిత్రలో భాగమైయున్నది.”
ఆటల చరిత్రలో బంతి ప్రవేశం అతి ప్రాముఖ్యతను సంతరించుకున్నదని భావించబడుతుంది. “జంతువులు ఆటవస్తువులతో ఆటలాడుకొనుట సూచించునదేమనగా అవి బంతివంటి దాని వెంట పరుగెత్తుట, విసిరివేయుటవంటి సమయం వాటికి లేకుండ పోలేదు,” అని పైన పేర్కొనబడిన ఎన్‌సైక్లోపిడియా తెల్పుచున్నది.
ఆసక్తికరమైన విషయమేమంటే, బంతిని కొట్టుటకు దీర్ఘకాలంగా ఏదొక ఉపకరణము వుపయోగించబడినది. “పర్షియనులు, గ్రీకులు, మరియు అమెరికన్ ఇండియన్స్ కర్రతో ఆడిన ఆటలుండెను” అని బ్రిటానికా తెల్పుతుంది. “పోలో, టిబెట్ దేశ మూలమునుండి వచ్చిన యీ పదము, దర్యావేషు కాలములో (సా.శ.పూ. 522-486 పాలించిన రాజు) పర్షియనులకు ఏదోక రూపములో సుపరిచితమే. నవీనకాలపు ఆట, గోల్ఫ్, స్కాట్‌ల్యాండ్‌లో ఆరంభమైందని అనుకుంటున్నప్పటికి, యీ గోల్ఫ్‌నకు రోమీయుల కాలములోను అనేక యూరపు దేశాలలోను బహు జనాదరణ వుండేది.”
ఆటలకు తొలి ఆదరణ
హెబ్రీ లేఖనముల (పాతనిబంధన) వ్రాత పూర్తియగుటకు కొన్ని వందల సంవత్సరాల ముందే, క్రమపద్ధతిలో క్రీడలను నిర్వహించుట సర్వసాధారణమై యుండెను. ఉదాహరణకు, ప్రాచీన గ్రీసులోని ఒలంపియాలో ప్రతి నాలుగు సంవత్సరాల కొకసారి ఆటలు నిర్వహించబడేవి. బ్రిటానికా ఇలా నివేదిస్తుంది: “సా.శ.పూ. 776 నుండి సా.శ. 217 వరకు లేక దాదాపు వెయ్యి సంవత్సరాలు ఒలింపియాలో చాంపియన్లు వున్నట్లు దాఖలాలున్నవి. ఒలింపిక్ క్రీడలు గ్రీకుల జనజీవనంలో ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్నవంటే నాలుగు సంవత్సరాల కొకసారి జరిగే ఆ క్రీడల మధ్యకాలాన్ని ఒలింపియాడ్ (క్రీడోత్సవము) అని పిలుస్తూ ఆ కాలాన్ని కొలిచేవారు. ఆ విధంగా, కాలాన్ని కొలిచే ఆ తొలి పద్ధతి ప్రకారం యేసుక్రీస్తు 194వ ఒలింపియాడ్ (క్రీడోత్సవకాలం)లో జన్మించాడు.
హెబ్రీ లేఖనములు క్రమబద్ధమైన క్రీడల విషయమేమి చెప్పడంలేదు గానీ “ఆ పట్టణపు (యెరూషలేము) వీధులు ఆటలాడు మగపిల్లలతోను ఆడుపిల్లలతోను నిండియుండునని” ప్రవక్తలలో ఒకరంటున్నారు. (జెకర్యా 8:5) యేసు జన్మమునకు ఒక వంద సంవత్సరాలకు ముందే ఇశ్రాయేలీయులలో గ్రీకు క్రీడా పోటీలు ప్రవేశ పెట్టబడినవి. యెరూషలేమునందొక వ్యాయామశాల నెలకొల్పబడింది, ఆటలలో పాల్గొనుటకు కొందరు యాజకులు వారి విధులనుకూడ అలక్ష్యం చేశారు.—2 మాకబీస్ 4:12-15.
యేసు జన్మించిన కాలములోవున్న రోమా చక్రవర్తియగు ఆగస్టస్ సీజర్ క్రీడలు, ఆటలంటే మక్కువ గలవాడని రోమాలో ప్రసిద్ధిచెందెను. అయిననూ, రోమా పౌరులు పోరాటములంటేనే, అనగా ముష్టియుద్ధం, కుస్తీలంటేనే నిజమైన ఆసక్తి కనబరచేవారు. ఈ “క్రీడలు” తరచు హింసాయుతంగా మారి ఒకరినొకరు లేదా జంతువులను చంపేంతవరకు, రక్తం ఏరులైపారు వరకు ఆ పోటీల్లో పాల్గొనేవారు.
“క్రొత్త నిబంధన”లో క్రీడలు
అయితే క్రీడలనుగూర్చి అటువంటి భయంకర నిందల యొక్క భావం, ఆటలాడుట తప్పనికాదు. యేసుగాని ఆయన అనుచరులుగాని క్రీడలను లేక ఆటలాడుటను ఖండించినట్లు మనమెక్కడ చదవము. కాని అపొస్తలులు బోధనా పద్ధతులను వివరించుటకై వీటిని తరచు వుపయోగించారు.
ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ప్రోత్సహించినపుడు, ఒలింపిక్ ఆటలలోని పరుగు పందెములు నిశ్చయంగా ఆయన మనస్సులో వుండెను: “పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.” ఆయనింకా ఇట్లన్నాడు: “మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.”—1 కొరింథీయులు 9:24, 25.
మరో సందర్భంలో పౌలు, క్రైస్తవ జీవమును బహుమానముగా పొందు దృఢ సంకల్పముతోనే పరుగెత్తవలెనని అన్నాడు. “దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను.” (ఫిలిప్పీయులు 3:14) ఇంకను, నైతిక జీవిత నియమాలకు హత్తుకొనివుండు అవసరతను గూర్చి ఉదహరిస్తూ, పౌలు తిమోతికి ఇలా జ్ఞాపకం చేశాడు: “జెట్టియైనవాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.” (2 తిమోతి 2:5) తమ బాధ్యతలను నెరవేర్చే క్రైస్తవులు “వాడబారని మహిమా కిరీటము” పొందుదురని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు.—1 పేతురు 5:4.
క్రీడల యందు ఆనందించిన యౌవన క్రైస్తవులను కాయుటలో యౌవనస్థుడైన తిమోతి నిశ్చయంగా భాగం కల్గియుండవచ్చును. అందుకే పౌలు ఆయనకు వ్రాస్తూ “శరీర సంబంధమైన సాధకము (వ్యాయామ నిపుణునివలె) కొంచెము మట్టుకే ప్రయోజనకరము” అని గ్రీకులు చేసిన వ్యాయామ సంబంధమగు కఠోర అభ్యాసములు కొంత ఉపయోగకరమాయెనని అంగీకరించెను. “కాని” అని అంటూ పౌలు వెంటనే “దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోను ప్రయోజనకరమై యున్నది.”—1 తిమోతి 4:8; ది కింగ్‌డం ఇంటర్లీనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది గ్రీక్ స్క్రిప్చ్‌ర్స్ ను చూడుము.
వ్యాయామమునకు సరియైన స్థానం
గనుక శరీర వ్యాయామము, జీవితములో సరియైన స్థానం కల్గియుండగలదని లేఖనములు తెల్పుచున్నవి. అయినను, సమతుల్యత, సహేతుకతల అవసరమున్నది. “మీ సహనమును (సహేతుకతను, NW) సకల జనులకు తెలియబడనియ్యుడి,” అని పౌలు వ్రాశాడు. (ఫిలిప్పీయులు 4:5) ఇటువంటి సమతుల్యత కనుగొనుట ఎంత కష్టమోగదా!
తొలి గ్రీకులు ఆటలకు అతి ప్రాముఖ్యతనిచ్చారు, మరి రోమీయులైతే ఇటు క్రీడలలో పాల్గొన్నవారికి, అటు రక్తపాత క్రీడలను తిలకించే వారికి హాని కల్గించే వాటిని చూచి ఆనందించేవారు. మరోవైపు చూస్తే, మతం పేరిట కొందరు వాటిని అణగద్రొక్కి—ఆటల జోలికే పోలేదు. ది న్యూ ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ఇట్లు తెల్పింది: “17వ శతాబ్దములోని కఠోర మత నియమాలతో కూడిన అభిప్రాయాలు అమెరికా, ఐరోపాలలో ఆటలలోను క్రీడలలోను తమాషాను తగ్గించినవి.”
క్రీడలు ఇటీవలి కాలంలో, బహుశా చరిత్రలో ఎన్నడు లేనంతగా, పునరుజ్జీవించినవి. “వాతావరణము తర్వాత ప్రజలు బహుశా మరే ఇతర విషయం కంటెకూడ ఎక్కువగా క్రీడలను గూర్చియే మాట్లాడుకుంటున్నారని” ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లొపీడియా చెబుతుంది. క్రీడలు జనములకు మత్తువంటివి” అనికూడ పిలువబడుచున్నవి.”
క్రీడల యెడలగల తీవ్రతను సృష్టించిన కొన్ని సమస్యలేమిటి? నీవు గాని నీ కుటుంబముగాని తత్ఫలితంగా దుష్ఫలితాలను అనుభవిస్తున్నారా? క్రీడలను నీవెట్లు వాటి సరియైన స్థానమందుంచగలవు? (g91 8/22)