క్రీడలను వాటి స్థానంలోనే ఉంచుట
ప్రజలు, తమకు ప్రియమైన ఆటలు ఆడితే తమ శరీరాలు వాటికి స్పందించి, నైపుణ్యం లేదా సహనంతో కూడిన వీర కృత్యమును చేసినపుడు ఆనందంతో కేరింతలు కొడతారు. శారీరకంగా పనిచేస్తూ సంతోషించునట్లు దేవుడు మనలను సృజించాడు. బహుశ ఇతరులు ఆడుతూవుంటే చూచి ఆనందించేవారు అనేకులున్నారు. గనుక క్రీడలను వాటి స్థానమందుంచితే అవి ఇతర అనేకమైన మంచివాటివలననే వుండును.
ఉదహరించుటకు: సముద్రతీరానికి వెళ్లి సూర్యుని వెచ్చదనాన్ని పొంది ఆనందించాలని అనుకున్నవారు ఆ సూర్యరశ్మిని అధికంగా పొందితే ఏమౌతుంది? వారికి వేడిపొక్కులు వచ్చి బాధపడతారు, మంచి సమయం వృధా అవుతుంది. ఇంకా తీవ్ర ఇబ్బందులకు గురౌతారు. క్రీడలుకూడ అంతే. కొంచెమైతే ఉత్తమమే గాని అధికం హానికరమే.
క్రీడలు మంచి విశ్రాంతినిచ్చి, తమాషాగా వుంటాయి గానీ అవే ఒక గురిగా వుండకూడదు. అవి నిజమైన సంతృప్తిని లేదా చిరకాల సంతోషాన్నివ్వలేవు. ఒకరు దీన్ని గ్రహించ లేకపోవుట కొన్నిసార్లు విచారకరంగా వుంటుంది. “నేను సంపాదించిన మెడల్స్, ట్రోఫీలకు నేనేమి ప్రాధాన్యత ఇవ్వడంలేదు” అని వంతెన పైనుండి దూకి శరీరం చచ్చుపడిపోయిన మేరి వాజ్‌టర్ అనే క్రీడాకారిణి వివరిస్తోంది.
“జీవితాన్ని గూర్చి నేనెన్నో వాస్తవాలను నేర్చుకున్నాను” అని ఆమె అన్నది. “ఒకటేమనగా, అనేకమంది ప్రజలు సంపూర్ణత, కార్యసాధన కొరకు చేసే మార్గాల ద్వారా నిజమైన సంతృప్తి లభించదు. నేను ఉన్నతస్థాయి విద్యార్ధినిగా వున్నందున, పరుగులో రాష్ట్రస్థాయి ఛాంపియన్ అయినందున, లేక అందం వున్నందు వలన నాకు సంతృప్తి కలుగలేదు.”
విషయాలను కొంచెం కఠినంగానే బయలుపరస్తూ, సాంఘిక శాస్త్రవేత్త జాన్ విట్‌వర్త్ ఇలా తెల్పాడు: “ఆట ముగిసినప్పుడు నీకున్నదల్లా గణాంక వివరాలే. అదంతా పైపైకే. అయిననూ ఇది మన సమాజానికి సరిపోతుంది.” ఈనాడు క్రీడలకిచ్చే అనవసరమైన ప్రాముఖ్యత ప్రతిదాన్ని పారద్రోలుతుంది.
హెన్రీ కార్ 1964 ఒలంపిక్స్‌లో 200 మీటర్ల పరుగుపందెంలో గెలుపొందిన తర్వాత ఇలా వివరించాడు: “ఒలంపిక్ ప్రాంతాలకు నేను తిరిగి వెళ్లినపుడు మొదటిసారి నేను నా బంగారు పథకాన్ని నిజమైన దృష్టితో చూశాను. . . . నన్ను నేనే యిలా ప్రశ్నించుకున్నాను: ‘ఏముందీ లోకంలో! ఇన్ని సంవత్సరాలనుండి నేను ఎంతో కష్టపడితే, ఇదేనా నాకొచ్చే బహుమతి?’ నేను సంతోషించవలసిన సమయంలో నాకు పిచ్చికోపం వచ్చింది. ఇదెంతో నిరాశాజనకంగా వుండెను.” పందొమ్మిది వందల ఎనభై ఏడులో వర్ల్‌డ్ బాక్సింగ్ అసోషియేషన్ వెల్టర్‌వెయిట్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత మార్లన్ స్టార్లింగ్ కూడ అలాగే ఉద్దేశపడ్డాడు. “‘నాన్నా నీవంటే నాకెంతో ఇష్టం’ అని చెప్పిన నా కుమారుని మాటకు “ఆ బహుమతి” సమానం కాదు.”
కావున ఓ ముఖ్య గుణపాఠాన్ని నేర్చుకోవచ్చును: ఫలవంతమైన పని, కుటుంబం మరి విశేషంగా దైవారాధన, ఇవి సరిగ్గా ప్రధమ స్థానం వహించాలి. బైబిలు ఇలా తెలిపినపుడు అది సరియైనదే: “శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమై యున్నది.” (1 తిమోతి 4:8) దాన్నిబట్టి క్రీడలకు మనం సరియైన స్థానము యివ్వవలెనని అది సూచిస్తున్నది. అది రెండవ స్థానం వహించాలి. క్రీడలు ఎంతో ఆకర్షిస్తవి గనుక, అంతకంటె ముఖ్యమైనవాటిని అలక్ష్యం చేయకుండ ఎల్లప్పుడూ జాగ్రత్త కల్గివుండాలి.
గనుక నీవు క్రీడలనుగూర్చి అధికంగా మాట్లాడుచున్నావని, చూస్తున్నావని లేదా ఆడుచున్నావని నీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తూవుంటే లక్ష్యపెట్టుట వివేకం. తన భర్త క్రీడల విషయంలో చేసికున్న మార్పులనుగూర్చి ఒక స్త్రీ కృతజ్ఞతతో ఇట్లన్నది: “ఆయనిప్పుడు నాతోను పిల్లలతోను ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. కొన్నిసార్లు మా కుటుంబం దూరదర్శినిలో ఒక ఆటను చూస్తాము, గానీ సాయంకాలం పూట ఎక్కువగా మేమంతా కలిసి అలా షికారుగా నడిచి వెళ్తూవుంటాము, ఆ రోజు జరిగిన విషయాలనుగూర్చి మాట్లాడుకుంటూ వుంటాము. ఇదెంతో హాయిగా వున్నది, మేము సంతోషంగా వుండునట్లు సహాయం చేస్తుంది.”
సంభవింపనైయున్న సమస్యల దృష్ట్యా, నేను క్రీడలపై అవసరమైన దానికంటె అధిక అవధానాన్ని నిలిపి సమయాన్ని వ్యయపరచు చున్నానా? అనే ప్రశ్నను యథార్థంగా ఎందుకు నీవు పరిశీలించకూడదు? అయినను, క్రీడలను వాటి సరియైన స్థానమందుంచుటను గూర్చిన ఇతర అంశాలు కూడ వున్నవి.
పోటీ విషయమేమిటి?
ఆటలు హానికరం కాకుండా ప్రయోజనకరంగా వుండాలంటే పోటీ విషయంలో సరియైన దృక్పథాన్ని కల్గివుండుట ప్రధానం. “క్రీడా శిక్షకులు, వ్యాయామ శిక్షణనిచ్చువారు, తలిదండ్రులు, మరి పిల్లలతో సహా గెలుపుమీదనే ధ్యానముంచుతూ, క్రీడల యొక్క అసలు ఉద్దేశమేమిటో మరచి పోతున్నారు,” అని ఒక హాకీ టీమ్ యొక్క వైద్యుడు విచారం వ్యక్తం చేశాడు. క్రీడల ఉద్దేశం, “టీం కృషి, శిక్షణ, శరీర అర్హత మరియు అన్నిటికంటె ముఖ్యంగా తమాషాను వృద్ధిచేయడానికే” అయివుండాలి అని ఆయన అన్నాడు.
అయితే, గెలవాలి అనే పట్టుదలే, చాలామంది కోరుకునే తమాషాను దెబ్బతీస్తుందనుట విచారకరం. క్రీడా మనస్తత్వ శాస్త్రవేత్త బూస్ ఓజిల్వి ఇలా అంటున్నాడు: “ఒకసారి నేను బేస్ బాల్‌కు సంబంధించిన 10 పెద్ద శిక్షణా కేంద్రాలలోని ప్రథమ సంవత్సరపు ఆటగాళ్లను ఇంటర్వూ చేస్తే అందులో 87 శాతం చెప్పిందేమనగా తమాషాగా ఉండవలసిన ఆటను యిక మేమెన్నటికి ఆడబోము.” అసలు సమస్యేమిటంటే అత్యధిక పోటీ స్వభావం మూలంగా అధికంగా దెబ్బలు తగులుచున్నవి.
బైబిలు, మార్గదర్శక నియమాలను అందిస్తూ ఇలా చెబుతుంది: “ఒకరినొకరము వివాదమునకు రేపకయు (పోటీ పడకయు, NW) ఒకరియందొకరము అసూయపడకయు, వృథాగా అతిశయపడకయు ఉందము.” (గలతీయులు 5:26) గ్రీకు—ఇంగ్లీషు నిఘంటువుల ప్రకారం ఇచ్చట అనువదించబడిన గ్రీకుపదము యొక్క భావమేమనగా, “రమ్మని ఉసిగొల్పుట” “ఎదుటి వ్యక్తిని పోరాటమునకు లేక పోటీకి రమ్మని సవాలుచేయుట.” అలా ఒక అమెరికన్ ట్రాన్స్‌లేషన్ దీనిని ఇలా అనువదించింది: “మనం వృథాగా ఒకరినొకరము సవాలు చేసుకొనకూడదు.” మరి న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ అథస్సూచి దీన్ని మరోరకంగా అంటే: “ఒకరినొకరు పోటీకి (పోట్లాడుటకు) రమ్మని బలవంతం చేసికొనుట” అని తెలియజేస్తుంది.
గనుక పోటిని పురికొల్పుట నిజంగా అజ్ఞానమే. అది సత్సంబంధాలను నెలకొల్పదు. నీవు బలవంతంగా పోటీలో పాల్గొని ఓడిపోతే, గెలిచినవాడు అతిశయిస్తే అట్టి అనుభవం అవమానకరంగా వుండగలదు. తీవ్రమైన పోటీ స్వభావం ప్రేమలేనిదై వుంటుంది. (మత్తయి 22:39) అదే సమయంలో పోటీ స్నేహపూర్వకంగా, మంచి స్వభావంతో కూడినదైతే ఆట రక్తిగాను, ఆనందదాయకంగాను ఉండగలదు.
పోటీ స్వభావాన్ని తగ్గించే పద్ధతిలో క్రీడలు ఆడే మార్గాలను వెదకవలెనని కొందరు కోరుకొనవచ్చును. పదమూడు, 14 సంవత్సరాల వరకు క్రీడా దృష్టితోనే క్రీడల్లో పాల్గొనాలని నా గట్టి నమ్మకం అని ఇంగ్లీషు ఫుట్‌బాల్ క్రీడా శిక్షకుడు అన్నాడు. ఫలితాలను గానీ టీం సాధించిన వాటిని రికార్డుచేసి పెట్టకూడదనియు—“సంపాదించే స్థానాలు ఉండకూడదు, ఫైనల్స్ (తుది, చివరి ఆటలంటూ) వుండకూడదు” అని ఆయన సిఫారసు చేశాడు. అవును, గెలవాలి అనే పట్టుదలను వీలున్నంత వరకు తగ్గించుకోవాలి లేదా పూర్తిగా తీసివేసుకోవాలి.
క్రీడాకారుల యెడల దృక్పథం
క్రీడలను వాటి సరియైన స్థానమందుంచుటలో, ప్రసిద్ధి చెందిన, నిపుణులైన క్రీడాకారుల ఎడల చూపు మన దృక్పథం కూడ యిమిడివున్నది. వారి అద్భుత క్రీడా పటిమ కౌశల్యములను మనం ప్రశంసించ వచ్చుననుట సహజమే. అయితే వారిని పూజించ వచ్చునా? యువకులు వారి గదులలో అటువంటి క్రీడాకారుల చిత్రాలను గోడలమీద అంటించుకుని వుండుట గమనిస్తాము. అట్టి వ్యక్తులు సాధించిన ఘనకార్యాలు, నిజంగా వారిని పూజార్హులుగా చేస్తున్నవా? బహుశా అలా చేయడంలేదు.
నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ ఛాంపియన్‌షిప్ టీంలో క్రొత్తగా చేరిన ఆటగాడు తన తోటి ఆటగాళ్లను మొదట ఎంతో అభినందనా పూర్వకంగా చూశాడు. అయితే వారి ప్రవర్తన స్వభావములు, “వారిఎడల అతనికున్న గౌరవ మర్యాదలన్నిటిని పూర్తిగా గాలికి ఎగురగొట్టినవి” అని అతడన్నాడు. ఆయనిలా వివరించాడు: “ఉదాహరణకు, వారిలా అంటారు: ‘అరేయ్, పోయిన వారం నేను, నా భార్యతో కాక యింకా ఐదుగురు అమ్మాయిలతో పోయానురా?’ అప్పుడు నేను అతనివైపు చూచి, నాలో నేను ఇలా అనుకున్నాను: ‘ఓహో ఇతన్నేనా నేను పూజించింది.’”
నిజానికి, ఏ మానవున్ని పూజించిన తప్పే, మరియు ఏ కొద్దో లేక ఏ కొంచెమో ప్రయోజనమున్నదని బైబిలు చెప్పే అట్టి ఘనకార్యములను సాధించే వారిని గూర్చి యిది యింకా వాస్తవమే. దేవుని సేవకులు “విగ్రహారాధనకు దూరంగా ఉండుడని,” నొక్కి తెలుపబడి యున్నారు.—1 కొరింథీయులు 10:14.
క్రీడలు ఎలా ప్రయోజనకరమైయున్నవి
మనం గమనించిన రీతిగా, క్రీడలలో వున్నటువంటి, శారీరక శిక్షణ “కొంచెం కాలం మట్టుకే ప్రయోజనకరము.” (1 తిమోతి 4:8) ఏ యే పద్ధతులలో ఇది ప్రయోజనకరం? క్రీడల నుండి నీవెట్లు ప్రయోజనం పొందగలవు?
రోమా చక్రవర్తి మార్క్స్ యూరిలియస్ స్వంత వైద్యుడును రెండవ శతాబ్దపు గ్రీకు వైద్యుడైన గేలెన్, సాధారణ ఆరోగ్యం కొరకు వ్యాయామం ఎంతో ప్రాముఖ్యమని నొక్కి తెలియజేశాడు. ఆయన బంతి ఆటలు ఆడవలెనని సిఫారసు చేశాడు. ఇవి తమాషాగా కూడ వుంటవి గనుక ఒకడు మరో విధమైన వ్యాయామము చేసే బదులు బహుశా యీ ఆటలను ఆడుటకు యిష్టపడ వచ్చును.
క్రీడల నుండి పొందే వ్యాయామము వారు ఆరోగ్యంగా వున్నట్లు వారిని స్ఫురింపజేస్తుంది. కష్టమైన మంచి పనిని లేక ఆటను ఆడిన తర్వాత వారు పునరుజ్జీవం లేక నూతనోత్సాహం పొందినట్లు భావిస్తున్నారు. అయిననూ ఇది మనల్ని ఆశ్చర్యపరచకూడదు, ఎందుచేత నంటే, డాక్టర్. దోర్తి హారిస్ గారు చెప్పినట్లు “వ్యాయామము, సహజ సృష్టిలో ఉపశమనము నిచ్చేదే.”
మామూలు వ్యాయామములు, మెల్లిగా పరుగెత్తుట, మరియు ఆటల వంటివి అందించే శరీర వ్యాయామము యీనాడు మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తుందని అందరు సర్వసాధారణంగా ఒప్పుకుంటున్నారు. “మంచి ఆరోగ్యవంతులు ఏ అలసట లేకుండానే సాధారణంగా వారి పనులు వారు సులభంగా చేసుకుంటు వుంటారు, ఇంకా ఇతర కార్యములకు కూడ శక్తిని కల్గివుంటారు,” అని ది వరల్డ్‌బుక్ ఎన్‌సైక్లొపీడియా తెలుపుతుంది. “శరీరకంగా బలహీనులైన వారికంటె ఎక్కువగా వీరు వయస్సు పైబడుట మూలంగా వచ్చే దుష్ప్రభావములను సమర్థవంతముగా ఎదుర్కొనగలరు.”
క్రీడలు, ఒకరిని ఎంత మంచి శరీర ఆరోగ్యవంతునిగా వుండునట్లు సహాయపడినను, ఆ ప్రయోజనం పరిమితమైనదే. వృద్ధాప్యమును, మరణమును మానవ ప్రయత్నాలు రూపు మాపలేవు. అయిననూ “శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజకరమవును,” అని చెప్పిన తర్వాత బైబిలు ఇలా తెల్పుతుంది: “దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతోకూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.”—1 తిమోతి 4:8.
మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు మాత్రమే మనకు జీవమును ప్రసాదించగలడు. గనుక “దైవభక్తి” కంటె, అనగా దేవున్ని ఘనపరచి, ఆరాధించి, సేవించుట కన్న అతి ప్రాముఖ్యమైనదేదియు లేదు. కావున దైవభక్తి నభ్యసించువారు దేవుని చిత్తాన్ని చేయుటే పరమార్థముగా పెట్టుకొని యున్నారు. వారు దేవుని సేవలో కాలాన్ని వ్యయపరచుదురు. యేసుక్రీస్తు చేసినట్లే వారును వారి యువశక్తిని వినియోగిస్తారు, దేవున్ని ఆయన రాజ్యాన్ని గూర్చిన మంచి విషయాలను ఇతరులకు తెలియజేస్తారు.
అవును దేవుని విషయాలకు ప్రథమ స్థానమిచ్చుట ద్వారా మానవులు ఆయన అనుగ్రహాన్ని పొందగలరు మరియు ఆయనయొక్క నీతియుక్తమైన నూతన లోకంలో నిరంతర జీవమును సంపాదించుకొనగలరు. అచ్చట శ్రీమంతుడగు దేవుడైన యెహోవా, వారికి నిజమైన చిరకాల సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చును. (g91 8/22)