కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 9/8 పేజీలు 5-9
  • క్రీడలతో ఈనాడున్న సమస్యలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రీడలతో ఈనాడున్న సమస్యలు
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అమితమైన పోటీ స్వభావం
  • డబ్బు, దగా
  • ప్రేక్షకులకు సంబంధించిన సమస్యలు
  • నేను క్రీడల జట్టులో చేరాలా?
    తేజరిల్లు!—1996
  • జట్టు క్రీడలు అవి నాకు సరైనవేనా?
    తేజరిల్లు!—1996
  • క్రీడలను వాటి స్థానంలోనే ఉంచుట
    తేజరిల్లు!—1992
  • ఆటల గురించి నేనేమి తెలుసుకోవాలి?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 9/8 పేజీలు 5-9

క్రీడలతో ఈనాడున్న సమస్యలు

క్రీడలు నైతిక విలువలను పెంపొందించినవి గనుక అవి ప్రయోజనకరమైనవేనని ప్రజలు వాదించేవారు. కష్టించి పనిచేయుటను, క్రీడాసక్తిని మరియు ఆడే ఆనందాన్ని యీ ఆటలే అభినందింప జేసినవని వారన్నారు. అయితే అనేకులకు యీనాడు అటువంటి వాదనలు శూన్యంగాను, వేషధారణతో కూడినవిగాను కన్పిస్తున్నవి.

గెలవాలి అనే పట్టుదలే ప్రత్యేక సమస్య. సెవెన్‌టీన్‌ అనే పత్రిక దీన్ని “క్రీడల చెడుభాగం” అని పిలుస్తోంది. ఎందుకు? ఎంచేతనంటే, ఆ పత్రిక తెల్పినట్లు “యథార్థత, పాఠశాలపని, ఆరోగ్యం, ఆనందం మరియు జీవితంలోని ఇతర ముఖ్యభాగాలను గూర్చిన చింతను యీ గెలుపు అధిగమిస్తుంది. గెలుపే సమస్తం అవుతుంది.”

అమెరికాలోని ఓ కాలేజిలో పరుగుల రాణియైన కేతి ఓర్మెజ్‌బీ యొక్క అనుభవమే, క్రీడ ద్వారా సాధించే విషయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చుటవలన కలుగు దుఃఖకర ఫలితాలను గూర్చి వివరిస్తుంది. 10,000 మీటర్ల కాలి నడక పందెంలో స్త్రీల విభాగమందు జాతీయ రికార్డు నెలకొల్పిన కొన్ని వారముల తర్వాత అనగా 1986, జూన్‌ 4వ తేదీన కేతి యన్‌సిఎఎ (నేషనల్‌ కాలేజియేట్‌ అథ్లెటిక్‌ అసోషియేషన్‌) పోటీలలో పాల్గొనే సమయంలో మనస్సు మార్చుకొని, దగ్గర్లోవున్న ఒక వంతెన మీదికి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆత్మహత్య చేసికొనుటకై దానిమీదనుండి దూకింది. ఆమె బ్రతికి బయటపడింది గాని నడుము నుండి క్రింది భాగమంతా చచ్చు బడిపోయింది.

స్కాట్‌ పెంగిలీ, క్రీడాకారులకు చికిత్సచేసే మానసిక నిపుణుడు, కేతి ఒక్కతే ప్రత్యేకమేమి కాదన్నాడు. కేతి ఆత్మహత్యా ప్రయత్నానంతరం, పెంగిలీ ఇలా చెబుతున్నాడు: “‘నేను కేతిలాగనే చేయాలని అనుకుంటున్నానని’ నాకు ఫోన్‌ కాల్స్‌ వచ్చినవి.” మారథాన్‌—సగభాగపు నడకలో తన సమాన వయస్సుగల వారిలో జాతీయ రికార్డు స్థాపించిన జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయ క్రీడాకారిణియగు మేరి వాజ్‌టర్‌ కూడ వంతెనపైనుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది, జీవితాంతం ఆమె అవిటితనాన్ని అనుభవించ వలసివచ్చింది.

గెలవాలి అనే వత్తిడి, అనుకున్న దానికి తగినట్లుండాలి అనే ధోరణి భయంకరమైనవి కావచ్చు. అపజయ ఫలితాలు వినాశకరమైనవి కావచ్చు. కాలిఫోర్నియా ఏంజిల్స్‌ అని అనబడే బేస్‌బాల్‌ టీం నాయకుడు డోని మూర్‌ ఇక ఒక్కసారి గెలిస్తే 1986 ప్రపంచ సిరీస్‌లో పాల్గొని యుండేవాడు. గాని బోస్టన్‌ టీం ఆ పోటీని గెలిచినందున అమెరికన్‌ లీగ్‌లో గెలిచి ప్రపంచ సిరీస్‌లో పాల్గొనే అర్హత సంపాదించింది. అతని స్నేహితుల వివరణ ప్రకారం డోని తన వైఫల్యాలను తలపోసుకుని తుపాకితో పేల్చుకుని తననుతాను చంపుకున్నాడు.

అమితమైన పోటీ స్వభావం

క్రీడలలో గెలవాలనే ఒక పట్టుదలతో కూడిన సమస్య ఏమనగా అమితమైన పోటీ స్వభావం. పోటీదారులు భయంకరులుగా మారిపోతారేమోనని చెప్పుట అతిశయోక్తి కాదు. బాక్సింగ్‌ హెవీ వెయిట్‌ చాంపియన్‌ ల్యారి హోమ్స్‌, తాను రింగ్‌లో ప్రవేశించిన తర్వాత తన స్వభావాన్ని మార్చుకోవలసి వస్తుందని అన్నాడు. “నేను మంచితనము నంతటిని విడిచిపెట్టి, డాక్టర్‌. జెకిల్‌, మిస్టర్‌ హైడివలె చెడునంతటిని లోపలికి తీసికొనిరావాలి” (అంటే, రింగ్‌ బయట ఒక స్వభావం, లోపల ఒక స్వభావం రెండు గుణములు కల్గివుండాలి) అని అన్నాడు. సమాన సామర్థ్యంగల వారు తమను ఓడించకుండ అడ్డుకొనుటకు క్రీడాకారులు ఒక మొండి పట్టుదలతో నిండివుంటారు.

“నీలో ఆ రోషాగ్నివుండాలి, మరి ద్వేషాగ్ని దహించినట్లు మరేదియు దహించలేదు” అని ఫుట్‌బాల్‌ మాజీ కోచ్‌ ఒకాయన ఓసారి అన్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ఒకసారి ఒక కాలేజి టీమ్‌తో ఇలా అన్నట్లున్నది: “నీ పోటీ దారుని ఎడల నీకు స్వచ్ఛమైన ద్వేషంవుండవచ్చును. అది ఆటగాడు ధరించే జెర్సి కోటువంటి సాదృశ్యమైనదే గనుక అది (శుద్ధమైన) స్వచ్ఛమైన ద్వేషం.” పోటీదారుని ఎడల ద్వేషాన్ని పెంచుకొనుటకు ప్రయత్నించుట నిజంగా మంచిదేనా?

బోస్టన్‌ సెల్‌టిక్స్‌ తరపున ఆడిన మాజీ బాస్కెట్‌ బాల్‌ వీరుడు బాట్‌ కూజీ, లాస్‌ ఏంజిలస్‌ లాకర్స్‌ టీమ్‌ తరపున ఆడుతూ అధిక గోల్స్‌చేస్తున్న డిక్‌ బార్నెట్‌ను ఒక కంటకనిపెట్టి కాపుకాయవలెనని కోరబడిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు: “నేను ఉదయం నుండి రాత్రివరకు నా గదిలోనే కూర్చున్నాను,” “నేను చేసిందల్లా బార్నెట్‌ను గూర్చి ఆలోచించడమే, నామనస్సులో అతన్నెలా ఎదుర్కోవాలి, అతనిపై కొంత ద్వేషాన్ని కూడ పెంచుకున్నాను. నేను కోర్టులో అడుగుపెట్టేప్పటికి, నాలో ఎంత ద్వేషాన్ని పెంచుకున్నానంటే ఒక వేళ బార్నెట్‌ ‘హలో’ అని మాట వరసకు పలకరించినా నేనతని పండ్లూడగొట్టాలి అనేంత కోపం నాలో పెంచుకొన్నాను.”

సత్యమేమంటే క్రీడాకారులు తమ పోటీదారులను అసమర్ధులుగా చేయడానికి బుద్ధిపూర్వకంగా ప్రయత్నిస్తారు, అందుకు వారు బహుమతి పొందుచున్నారు. క్రీడావార్తలు వ్రాసే పత్రికా రచయిత ఈర బెర్‌కౌ చెప్పునదేమనగా, తన ప్రత్యర్థిని ఆటలో దెబ్బతగిలేంత గట్టిగా తన్నే ఫుట్‌బాల్‌ ఆటగాన్ని తన టీం లోని వారు అతడు చేసిన మంచిపనికి అతన్ని “కౌగలించుకొని, నొక్కివేస్తారు. అతడు అవసరమైనన్ని గట్టి దెబ్బలు కొడితే ఆటల సీజన్‌ అయిపోయిన తర్వాత అతనికి జీతం పెంచడంగానీ లేదా మామూలు ఆటగాళ్లయితే ఉద్యోగంలో ప్రమోషన్‌ పొందటం వంటిది గానీ జరుగుతుంది. అలా వారు సగర్వంగా వారి దుస్తుల మీద ఇంగ్లీషులో మీన్‌ (క్రూరుడు) జోగ్రీన్‌జాక్‌, (హంతకుడు) టాటమ్‌ మొదలైనవాటిని పరిహాస నామములుగా ధరిస్తారు.”—ది న్యూయార్క్‌ టైమ్స్‌, డిశంబరు 12, 1989.

సెయింట్‌ లూయిస్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌లో డిఫెన్స్‌ స్థానంలో ఆడే ఆటగాడు, ఫ్రెడ్‌ హేరన్‌ ఇలా తెల్పాడు: “(క్లేవ్‌ల్యాండ్‌ బ్రౌన్‌ టీమ్‌) లోని క్వార్టర్‌ బ్యాక్‌ స్థానంలో ఆడేవాడు మెడ నొప్పితో బాధపడుతున్నాడని కోచ్‌లు చెప్పారు. నాకు అవకాశం దొరికితే అతన్ని ఆటలో లేకుండ చేయడానికి ప్రయత్నించాలని వారు నాకు సలహా యిచ్చారు. గనుక నేను ఆట జరిగేటప్పుడు మధ్యన రక్షణ వలయాన్ని ఛేదించుకొని అతడు నిలుచున్న దగ్గరికి వెళ్లాను. నా చేతులతో అతని తలపట్టుకొని విరిచి వేయాలని ప్రయత్నించాను, అప్పుడతను తడబడి స్వాధీనం తప్పి బంతిని వదిలేశాడు. తోటి ఆటగాళ్లు నన్ను తెగమెచ్చు కుంటున్నారు. క్వార్టర్‌ బ్యాక్‌లో వున్న వ్యక్తి విపరీతమైన నొప్పితో నేలకొరిగాడు. అప్పుడు తక్షణమే నాలో నేనిలా అనుకున్నాను, ‘నేనేమైనా పశువుగా మారిపోయానా? ఇదొక ఆట, గానీ నేను ఎవరినో ఒకరిని అవిటివాన్ని చెయ్యాలని ప్రయత్నిస్తున్నానే’” అయినను హేరన్‌ ఇలా అంటున్నాడు: “ప్రేక్షక సమూహం నాకు జేజేలు పలికింది.”

అమితమైన పోటీ స్వభావం వలన తగిలే గాయాలు, యీనాటి క్రీడలతో వచ్చే పెద్ద సమస్యయని అనేకులు వాపోతున్నారు. విచారకరమైన విషయమేమంటే, యిటువంటి లక్షలాది గాయాలకు గురైన వారిలో, జీవితములోకి పసిప్రాయంలోనే అత్యంత పోటీగల ఆటలకు అలవాటు చేయబడిన పిల్లలున్నారు. అమెరికా కన్‌స్యూమర్‌ ప్రొడక్టు సేప్టి కమిషన్‌ ప్రకారం ప్రతి సంవత్సరం నలభై లక్షలమంది పిల్లలకు ఆసుపత్రిలోని అత్యవసర గదులలో క్రీడలవల్ల తగిలిన గాయాలకు చికిత్స చేస్తున్నారు. కుటుంబ వైద్యులు మరో ఎనభై లక్షల కంటె ఎక్కువమంది పిల్లలకు చికిత్స చేస్తున్నారు.

గడిచిన సంవత్సరాలలో అరుదుగా కనబడే గాయాలతో అనేకమంది పిల్లలు యీనాడు బాధపడుచున్నారు. ఆనాడు తమాషా కొరకు పిల్లలు ఆడేటప్పుడు దెబ్బ తాకితే వారింటికి వెళ్లి, ఆ పుండు మానేంత వరకు లేక ఆ నొప్పి తగ్గేంత వరకు మరల ఆట్లాడేవారు కాదు. అయితే అత్యంత పోటీ స్వభావంతో, క్రమబద్ధం చేయబడిన క్రీడలలో పిల్లలు తరచూ, అప్పటికే తగిలిన దెబ్బ లేక నొప్పితో బాధపడుచున్న శరీర భాగమును యింకా పాడుచేసుకుంటూ ఆడుతునే వుంటారు. బేస్‌బాల్‌ వీరుడైన రాబిన్‌ రాబర్ట్స్‌ చెప్పిన దానిప్రకారం, సమస్యకు కారకులు ముఖ్యంగా పెద్దవారే. “పిల్లలు ఆటలకు సిద్ధంగా లేని సమయానికి, చాలా ముందే వారి మీద—మానసికంగా శారీరకంగా—ఎంతో వత్తిడి తెస్తున్నారు.”

డబ్బు, దగా

క్రీడలతో వచ్చే మరో చిక్కేమిటంటే డబ్బు సంపాదనే ధ్యేయంగా తయారయ్యింది. క్రీడాస్ఫూర్తితో, న్యాయంగా ఆడుటకు బదులు ఇప్పుడు క్రీడలలో దురాశ అగ్రగామిగా వున్నది. “పందొమ్మిది వందల ఎనభైయవ దశాబ్దంలో క్రీడలలో నిర్దోషత్వము పూర్తిగా అదృశ్యమైందని చెబుతున్నాను, ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి,” అని ది డెన్వర్‌ పోస్ట్‌ విలేఖరి జాయ్‌ మారియట్‌ విచారం వ్యక్తం చేస్తున్నాడు. “ఆ క్రీడలు ఈ 90వ దశకములో ఠీవిగా మన సాంప్రదాయం లోనికి ఒక మహాశక్తిగా ప్రవేశిస్తున్నవి ఇదొక అతి పెద్ద సంఖ్య. కోటానుకోట్ల డాలర్ల వ్యాపారం, దీన్ని కొన్నిసార్లు (దుర్వ్యాపారం) దొంగ వ్యాపారమని వర్ణించుట ఉత్తమం.”

గత సంవత్సరం అమెరికాలోని 162 మంది బేస్‌బాల్‌ ఆటగాళ్లు—5 గురిలో ఒకరి కంటె ఎక్కువమంది—ఒక్కొక్కరు పది లక్షల డాలర్ల కంటె అధికంగా సంపాదించారు. కొందరికి అత్యధికంగా ముప్పయి లక్షల డాలర్లు జీతం వస్తుంది. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత, 120 ఆటగాళ్లకు ఒక్కొరికి యిరవై లక్షల డాలర్ల కంటె ఎక్కువ చెల్లిస్తారు. ఇందులోని 32 మంది, ఒక్కొక్కరు ముప్పయి లక్షల డాలర్లను పొందుతారు. పందొమ్మిది వందల తొంభైరెండు నుండి 1995 వరకు కనీసం ఒక్కరైనా యాభై లక్షల డాలర్లు ప్రతి ఏటా పొందుతూ వుంటారు. డబ్బు కొరకు అన్వేషణ, పెద్ద మొత్తాలలో జీతాలు పొందుటయనేది ఇతర క్రీడలలో కూడ సర్వసాధారణమయినది.

కాలేజీలో జరిగే క్రీడలలో కూడ తరచూ డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయపథానికి నడిపే కోచ్‌కి పుష్టిగా డబ్బు చెల్లిస్తున్నారు, వారు జీతాల రూపేణ, అలా ప్రజాసేవ నిమిత్తం స్వీకరించిన ఫీజుల మూలంగా సంవత్సరానికి పదిలక్షల డాలర్లు సంపాదిస్తున్నారు. అమెరికాలో సంవత్సరాంతమున జరిగే ఫుట్‌బాల్‌ ఆటలలో పాల్గొనే అర్హత సంపాదించిన పాఠశాలల టీమ్స్‌ అనేక లక్షల డాలర్ల వరకు—సంపాదిస్తున్నవి. “పుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ ఆడే టీములు డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలంటే వారు గెలిచి తీరాలి,” అని ఓ కాలేజి ప్రెసిడెంట్‌ వివరిస్తున్నాడు ఇదొక విషవలయమై గెలుపే వారిని ఆవరించి—ఘోర దుష్ఫలితాలకు కారణమౌతుంది.

వృత్తిరీత్య ఆడే వ్యక్తుల ఉద్యోగాలు వారి గెలుపు మీదనే ఆధారపడి యున్నందున గెలవడానికి తెగించి వారేదైనా చేస్తారు. “అది ఇక క్రీడ ఏమి కాదు,” అని మాజీ బేస్‌బాల్‌ వీరుడు రస్టీ స్టాబ్‌ అంటున్నాడు. “అదొక క్రూరమైన భౌతిక సంబంధమైన వ్యాపారం.” దగా, మోసం షరా మామూలే. “నీవు మోసం చెయ్యక పోతే నీవు గెలవడానికి ప్రయత్నించడం లేదు” అని బేస్‌ బాల్‌ ఆటగాడు చిలి డేవిస్‌ వివరిస్తున్నాడు. “చిక్కకుండ మోసం చేయగలిగితే నీవు చేయగలిగినంత మోసం చేయుము,” అని న్యూయార్క్‌ బేస్‌బాల్‌ టీమ్‌ ఆటగాడు హూవర్డ్‌ జాన్‌సన్‌ అంటున్నాడు.

ఆ విధంగా నైతిక సూత్రం అధోగతి పట్టింది, మరి కాలేజి క్రీడల్లోను ఇదొక పెద్ద సమస్య అయింది. “కోచ్‌లు, క్రీడా డైరెక్టర్లు మోసగిస్తున్నారు, ప్రెసిడెంట్స్‌, ట్రస్టీ లైతే బుద్ధిపూర్వకంగానే దీన్ని పట్టించు కోవడం లేదని” ఒహాయో స్టేట్‌ యూనివర్శిటీ మాజీ ప్రెసిడెంట్‌ హెరాల్డ్‌ యల్‌ ఎనార్సన్‌ ఒప్పుకుంటున్నాడు. ఈ మధ్య ఒక సంవత్సరంలో అమెరికాలోని 21 విశ్వవిద్యాలయాలకు, నేషనల్‌ కాలేజియేట్‌ అథ్లెటిక్‌ అసోషియేషన్‌ ఉల్లంఘనల నిమిత్తం జరిమాన విధించింది, ఇంకా 28 ఇతర విశ్వవిద్యాలయాలు నేర పరిశోధన క్రింద వున్నవి.

ఇలా యువ క్రీడాకారుల నైతిక విలువలు నాశనమౌతున్నాయనుటలో ఆశ్చర్యం లేదు, ఇది యీనాటి క్రీడలలో వున్న మరో పెద్ద సమస్య. క్రీడల్లో రాణించుటకు మత్తు పదార్ధముల వాడుక సర్వసాధారణమై పోయింది, గాని తరచు విద్యను సంపాదించుకొనుటలేదు. ఒక అధ్యయనములో తేలినదేమనగా ఆటగాళ్లు, చాలా క్రీడా కార్యక్రమాలు కలిగి, క్లాసులకు హాజరై, చదివేదానికంటె ఆ సీజన్‌లో జరిగే క్రీడలలో పాల్గొనుటకే ఎక్కువ సమయాన్ని వారు వ్యయపరుస్తున్నారు. అమెరికాలోని కాలేజీలలోను, విశ్వవిద్యాలయాలోని పురుషులకు బాస్కెట్‌ బాల్‌ కార్యక్రమాలు అధికంగా వున్నందు వలన మూడవ వంతు ఆటగాళ్లలో ఐదింట ఒక్కరుకంటె తక్కువ మంది కూడ పట్టభద్రులు కాలేక పోతున్నారని ప్రభుత్వ అధ్యయనములో తేలింది.

చివరికి క్రీడను వృత్తిపరంగా చేపట్టి, జీతాలు పొందే కొద్దిమంది విద్యార్ధి క్రీడాకారులు, సహితం తరచూ దీనావస్థకు దిగజారిన క్రీడా ప్రముఖులౌతున్నారు. వారు వారి డబ్బును సద్వినియోగం చేసుకొనలేని అసమర్ధు లౌతున్నారు; జీవితాన్ని వాస్తవంగా ఎదుర్కోలేక పోతున్నారు. 45 ఏండ్ల వయస్సులో తలదాచుకొనుటకైనా ఒక ఇల్లు లేకుండ పేదరికం లోనే గత ఫిబ్రవరిలో చనిపోయిన, ట్రావిస్‌ విలియమ్స్‌ దీనికొక ఉదాహరణ మాత్రమే. 1967 సం.లో అతడు గ్రీన్‌ బే పాకర్స్‌ ఫుట్‌బాల్‌ టీం తరపున ఆడుతూ అమెరికా వృత్తిపరంగా ఆడే ఫుట్‌బాల్‌ ఆటలో ఇప్పటికీ ఒక రికార్డే అయివుండేటట్లు ప్రత్యర్ధి జట్టు బంతిని సరాసరి 37.6 మీటర్లవరకు ఆడుకుంటూ వెళ్లి రికార్డు నెలకొల్పాడు. తాను కాలేజీలో చదివేటప్పుడు “అతడు క్లాసుకు ఎప్పుడూ వెళ్లలేదు. ప్రాక్టీసు కొరకు ఆటలకే పరిమితమై వుండేవాడు” అని ఒకసారి తానే బహిరంగముగా చెప్పాడు.

ప్రేక్షకులకు సంబంధించిన సమస్యలు

క్రీడల్లో పాల్గొనుటకంటె వాటిని చూడడం లోనే ప్రజలు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. తద్వారా ప్రాముఖ్యమైన సమస్యలు తలెత్తినవి. ఒకటేమిటంటే, ఆటలకు వెళ్లుట వలన ప్రేక్షకుల దురుసు ప్రవర్తన చెడుకు గురికావలసి వుంటుంది. కొన్ని క్రీడాసమయాలలో ఉద్రేకపూరిత పరిస్థితి మూలంగా కొట్లాటలు జరిగి వందలాదిమంది క్షతగాత్రులై, ప్రేక్షకులలో కొందరు చనిపోవుట సర్వసాధారణమై పోయింది.

అయితే యీనాడు అనేకులు క్రీడాస్థలాలకు వెళ్లకుండానే దూరదర్శిని ద్వారా వాటిని చూస్తున్నారు. అమెరికాలో 24 గంటలు క్రీడా విశేషాలు ప్రసారం చేసే ఛానల్‌, ఏ యితర కార్యక్రమాలకు వెచ్చించనంత కాలాన్ని క్రీడావిశేషాలను ప్రసారం చేయడానికే ప్రతిదినం వెచ్చిస్తుంది. అయితే ఒకడు ఇంటిలోనే కూర్చొని క్రీడలను తిలకించుట వలన సమస్య రాదా?

రాకుండా పోదు. “నా భర్తకు చాలా కాలం నుండి ప్రతి క్రీడాకారుడు తెలుసు,” అని ఒకావిడ వివరిస్తూ, “యీ విషయంలో ఆయనొక్కడేకాదు. క్రమంగా క్రీడలను చూడని స్నేహితులు ఆయనకు బహుతక్కువే. ఇలా తిలకించుటలో ఉన్న పెద్ద నేరమేమంటే పిల్లలమీద దాని ప్రభావమెంతవరకు వుంటుందనే విషయమే,”నని అంటుంది. ఆమె ఇంకను ఇలా అంటున్నది: “నన్ను నా పిల్లలను లక్ష్యపెట్టకుండా ఆయన తనకున్న తీరిక సమయంలో క్రీడలను చూడటమంటేనే నాకిష్టం.”

ఎక్కడో ఒకచోటనుండి వచ్చే ఫిర్యాదేనా ఇది? కానే కాదు. ప్రపంచం లోని అనేక కుటుంబాలలో వారి కుటుంబ సభ్యులను అలక్ష్యపరచి దూరదర్శినిలో అతిగా క్రీడలను తిలకించే వారున్నారు. బ్రెజిల్‌ దేశంలో ఓ గృహిణి దీనిమూలంగా వచ్చే దుష్ఫలితాన్ని గూర్చి ఇలా సూచించింది: “భార్యా భర్తల మధ్యనున్న ప్రేమ విశ్వాసం దెబ్బతింటుంది, వివాహమును అపాయస్థితికి తెస్తుంది.”

క్రీడాసక్తి గలవారు ఇంకా ఇతర మార్గాల్లోను అదుపు తప్పుతున్నారు. వారు సాధారణంగా క్రీడాకారులను ఆరాధించేంతగా అభిమానిస్తుంటారు. కొందరు క్రీడాకారులు దీన్నొక సమస్యగానే పరిగణిస్తున్నారు. “నేను మా స్వగ్రామానికి వెళ్లినప్పుడు ప్రజలు నావంకే తదేకంగా చూస్తూ పోపు నుండి ఆశీర్వాదం వస్తుందేమో అన్నట్లే నిల్చున్నారు,” అని టెన్నిస్‌ ఆటగాడు బోరిస్‌ బేకర్‌ వ్యాఖ్యానించాడు. “నేను నా అభిమానుల కళ్లలోనికి చూచినపుడు . . . నేనేవో వింత జంతువులను చూస్తున్నట్లే వుంది. నాకు, వారి చూపులు నిశ్చలంగా, నిర్జీవంగా ఉండేవి.”

దానికి సందేహం లేదు, క్రీడలు ఒక ఆకర్షణా శక్తియై ఉద్రేకాన్ని బలమైన అభిమానములను సృష్టించగలవు. ప్రజలు ఆటగాండ్ల టీం కృషిని వారి నైపుణ్యములను చూచి సమ్మోహితులగుటయే గాక ఆకస్మికంగా కలిగే ఫలితాల పరిణామము వలన కూడ వారు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఎవరు గెలుస్తారో వారికి తెలియదు. అంతేకాక, జీవితం నీరసంగా సాగుతుందని అనుకునే లక్షలాదిమందికి యీ క్రీడలు ఒక విధమైన ఉపశమనము నిస్తున్నవి.

అయినను, క్రీడలు ప్రజలకు సంతోషాన్నిస్తున్నవా? అవి అందించే నిజమైన ప్రయోజనాలేమైనా ఉన్నాయా? సమస్యల నెట్లు నీవు తొలగించుకోగలవు? (g91 8/22)

[9వ పేజీలోని బాక్సు]

క్రీడల మతం

ఐస్‌ మైదానం మీద ఆడే “హాకీ కెనాడాలో కేవలం ఒక ఆట మాత్రమే కాదు; అనేకులకు అదొక మతం వలె పని చేస్తుంది.” అని కెనడా దేశపు టామ్‌ సింక్లర్‌-ఫోక్నర్‌ వాదిస్తున్నాడు. అనేకమంది క్రీడాసక్తిగలవారు, ఎక్కడ జీవించిననూ, యిటువంటి అభిప్రాయమునే వ్యక్తం చేస్తున్నారు.

ఉదాహరణకు, అమెరికా దేశంలో క్రీడలు “అంగీకరించబడిన ఒక సాంఘిక మతముగా” పేర్కొనబడు చున్నవి. క్రీడల మనస్తత్వ శాస్త్రవేత్త డేవిడ్‌ కాక్స్‌ తెల్పిన దానిప్రకారం “క్రీడలకు, మతమును గూర్చి నిఘంటువు యిచ్చే నిర్వచనమునకు మధ్య చాలా సంబంధాలున్నవి.” కొందరు “క్రీడాకారులను దేవుళ్లగాను లేక పరిశుద్ధులుగాను పరిగణిస్తున్నారు,” అని కాక్స్‌ గారు యింకను తెలియజేశారు.

క్రీడా ఛాందసులు గొప్ప త్యాగాలు చేస్తుంటారు, తరచూ వారి కుటుంబ సభ్యులను బాధిస్తూ, తమ సమయాన్ని డబ్బును తగలేస్తుంటారు. అభిమానులు దూరదర్శినిలో క్రీడలను చూడటానికి లెక్కలేనన్ని గంటలు వ్యయపరుస్తారు. వారు ఆ టీం రంగున్న దుస్తులను సగర్వంగా ధరించి, బహిరంగముగా క్రీడా చిహ్నములను తగిలించుకుని తిరుగుతారు. వారి ప్రియమైన క్రీడకు భక్తులమని గుర్తించునట్లు వెర్రి ఉత్సాహంతో పెద్దగా గొంతెత్తి పాటలు పాడుతూ వుంటారు.

అనేకమంది క్రీడాకారులు ఆటకు ముందు దేవుని దీవెన కొరకు ప్రార్థిస్తారు. ఒక గోలు కొట్టిన తరువాత దేవునికి కృతజ్ఞతా ప్రార్థన చేస్తారు. పందొమ్మిది వందల ఎనభై ఆరు ప్రపంచ కప్పు ఆటలో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ వీరుడు, దేవుడే తనతో గోల్‌ చేయించాడని (తానుచేసిన గోల్‌కు కారకుడు దేవుడేనని) ఆయనకు అంటగట్టాడు. మతపిచ్చిగల కొందరు క్రీడా చాంధసులు, “పిడివాదపు మూల సిద్ధాంతీకు” లని పిలువబడుచున్నారు. ఈ ఛాందత్వమే రక్తపాతానికి, అభిమానుల మధ్య కొన్నిసార్లు ప్రాణహాని కల్గేంత తీవ్రమైన కొట్లాటలకు దారి తీసినవి.

అబద్ధ మతంవలె, క్రీడలనే “ఈ సాంఘిక మతం,” దాని దురాశాపరులగు అనుచరులకు “పరిశుద్ధులను,” పారంపర్యాచారములను, స్మారక చిహ్నములను, మతకర్మాచారములను ఇస్తుందేగాని వారి జీవితములకు నిజమైన లేక చిరకాల అర్థాన్ని ఇవ్వడంలేదు.

[7వ పేజీలోని చిత్రం]

ఆటగాళ్లు తరచూ అశక్తులుగా చేయబడుచున్నారు

[8వ పేజీలోని చిత్రం]

దూరదర్శినిలో క్రీడలను తిలకించుట వలన కుటుంబములో మనస్పర్థలేర్పడగలవు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి