కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 4/8 పేజీలు 22-24
  • నేను క్రీడల జట్టులో చేరాలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను క్రీడల జట్టులో చేరాలా?
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏది ఏమైనా గెలవాల్సిందేనా?
  • నైతికంగా రాజీపడడం
  • శారీరక శిక్షణా లేక శారీరక గాయమా?
  • పరిగణించాల్సిన ఇతర విషయాలు
  • జ్ఞానయుక్తమైన నిర్ణయాన్ని చేసుకోండి
  • జట్టు క్రీడలు అవి నాకు సరైనవేనా?
    తేజరిల్లు!—1996
  • క్రీడలతో ఈనాడున్న సమస్యలు
    తేజరిల్లు!—1992
  • క్రీడలను వాటి స్థానంలోనే ఉంచుట
    తేజరిల్లు!—1992
  • ఆటల గురించి నేనేమి తెలుసుకోవాలి?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 4/8 పేజీలు 22-24

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

నేను క్రీడల జట్టులో చేరాలా?

“ఓ జట్టులో ఉండడంలో గొప్పతనం ఏముంది?” అని సెవెంటీన్‌ అనే పత్రిక ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు జవాబుగా ఆ శీర్షిక ఇలా జవాబిచ్చింది: “మీరు ఒకే గమ్యం కొరకు కలిసి పని చేస్తున్నారు కనుక మీరు ఎంతో సన్నిహితులౌతారు. మీరు ప్రజలతో వ్యవహరించాల్సిన విధానాన్ని నేర్చుకుంటారు అంటే, ఓ గుంపులోని సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారి మంచి చెడ్డలను ఎలా తెలుసుకోవడం మరియు మెత్తగా ఎలా ఉండాలి మరియు రాజీపడడం ఎలా అన్న వాటిని నేర్చుకుంటారు.”

ఆ విధంగా, సంఘటిత క్రీడలను ఆడడంలో ప్రయోజనాలున్నట్లు కనిపిస్తుంది, ఎంత లేదన్నా అవి సరదాగానూ మరియు వ్యాయామంగానూ అనిపిస్తాయి.a జట్టు క్రీడలను ఆడడం ద్వారా ఒకరు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపర్చుకునేందుకు సహాయపడుతుందని కూడా కొందరు చెబుతుంటారు. అందువల్ల, ఓ యువ బేస్‌బాల్‌ సమాఖ్య, “వ్యక్తిత్వం, ధైర్యం, యథార్థత” అనే దీక్షావాక్యాన్ని కల్గివుంది.

సమస్యేమిటంటే, సంఘటిత క్రీడలు ఎల్లప్పుడూ తమ ఉన్నత ఆశయాలకు తగినట్లుగా ఉండవు. కిడ్‌స్పోర్ట్స్‌ పుస్తకం ఇలా చెబుతోంది: “కొన్ని సందర్భాల్లో ఇతరులను ముగ్ధులను చేసే యౌవనస్థులు, ఇతరులను తిట్టడం, మోసం చేయడం, వారితో పోట్లాడడం, బెదిరించడం మరియు గాయపర్చడం నేర్చుకుంటారు.”

ఏది ఏమైనా గెలవాల్సిందేనా?

సెవెంటీన్‌ పత్రికలోని ఓ శీర్షిక ఇలా అంగీకరించింది: “గెలవడంపైనే ప్రజలు అధిక విలువనివ్వడం క్రీడలకున్న మరొక ఘోరమైన విషయం.” ఇది, “ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము” అన్న బైబిలు మాటలకు పూర్తి విరుద్ధంగా ఉంది. (గలతీయులు 5:26) స్నేహంతోకూడిన కొంత పోటీ ఆటను ఆసక్తిదాయకం చేసి ఆహ్లాదకరం చేస్తుంది, కానీ మితిమీరిన పోటీ స్వభావం శత్రుత్వాన్ని పెంచుతుంది, అలా మరి అది ఆటలో ఉన్న సరదాను తీసివేస్తుంది.

ఓ ఉన్నత పాఠశాల మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడైన జాన్‌ ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “మరీ ఉన్మాదియైన కోచ్‌ మాకు ఉండేవాడు; ఎప్పుడూ మాపై అరుస్తూ, కేకలేస్తూ ఉండేవాడు . . . ప్రాక్టీసు చేసేందుకు వెళ్ళడానికి నాకు మహా భయంగా ఉండేది . . . నేనేదో నిర్బంధ శిబిరంలో ఉన్నట్లు భావించేవాణ్ణి.” అయితే కోచ్‌లందరూ దుర్భాషనుపయోగించరు కానీ అనేకులు గెలవడంపై అధిక ప్రాముఖ్యతను మోపుతారు. ఓ రచయిత ఇలా ఓ నిర్ణయానికొచ్చాడు: “అనేకమంది క్రీడాకారులు . . . విజయం సాధించాలనే భరించలేని భారాన్నిబట్టి పోటీవలనకలిగే ఆనందాన్ని పొందలేకపోతున్నారు.” దాని ఫలితమేమైయుండవచ్చు?

కాలేజీ ఫుట్‌బాల్‌ బాస్కెట్‌బాల్‌ ఆటగాళ్ళలో “12 శాతంమంది, మానసిక వేదన, శారీరక బాధ, మాదకద్రవ్యాలూ లేక మద్యం ఉపయోగాన్ని మానుకోవడంలో ఇబ్బందిని, మానసిక మరియు శారీరక దౌర్జన్యం మరియు సరిగ్గా చదవకపోవడం అనే ఐదు రంగాల్లో కనీసం రెండింటితో తమకు సమస్యలున్నాయని బయల్పర్చిన సర్వేక్షణపై సైన్స్‌ న్యూస్‌ నివేదించింది. అదే విషయంపై ఆన్‌ ద మార్క్‌ అనే పుస్తకం ఇలా నివేదిస్తోంది: “సంఘటిత క్రీడలతో సంబంధమున్న సుమారు అందరూ, క్రీడల్లోని అన్ని రంగాల్లోనూ మాదకద్రవ్య దురుపయోగపు పెద్ద సమస్య ఉందని అంగీకరిస్తారు.”

నైతికంగా రాజీపడడం

గెలవాలనే ఒత్తిడి, ఓ యౌవనుడు నీతి న్యాయాల విషయంలో సరైనవైన సూత్రాలతో రాజీపడేలా చేయవచ్చు. క్రీడలలో మీ బిడ్డ అనే పుస్తకం ఇలా అభిప్రాయపడింది: “ఆధునిక క్రీడా ప్రపంచంలో గెలవడం మంచిది మాత్రమే కాదు; అది మాత్రమే అంగీకరించదగినది. ఓడిపోవడం కేవలం చెడ్డదేకాదు, క్షమార్హమైనది కూడా కాదు.”

మరో కఠోరమైన సత్యం: తమ వ్యతిరేకులను గాయపర్చమని, కోచ్‌లు తమ ఆటగాళ్ళను తరచూ ఎంతో ఒత్తిడి చేస్తారు. సైకాలజీ టుడేలోని ఒక శీర్షిక ఇలా అంది: “మీరు క్రీడల్లో మంచిగా ఉండాలంటే చెడుగా కూడా ఉండాల్సిందే. లేక అనేకమంది క్రీడాకారులూ కోచ్‌లూ క్రీడా ప్రేమికులు అలానే నమ్ముతున్నారు.” వృత్తిపర ఫుట్‌బాల్‌ ఆటగాడు తనను గూర్చి తాను “నమ్రతగా మాట్లాడేవాడనని, ఇతరుల మంచి చెడులను చూసేవాడని మరియు స్నేహశీలుడని” వర్ణించుకున్నాడు. అయితే క్రీడామైదానంలో మాత్రం, ఆయన జెకిల్‌-హైడ్‌ రూపాంతరాన్ని పొందుతాడు. ఆ మైదానంలోని తన వ్యక్తిత్వం గూర్చి ఆయన ఇలా చెబుతున్నాడు: “అప్పుడు నేను ఎంతో నీచమైనవాడనూ, దుష్టుడనూ అవుతాను. . . . నేనెంతో కుళ్ళుపడతాను. నేను ఎదుర్కొనబోయే వ్యక్తంటే నాకు పరమ అగౌరవం.” కోచ్‌లు సాధారణంగా అలాంటి ప్రవర్తనను ప్రోత్సహిస్తారు.

బైబిలు క్రైస్తవులను ఇలా ప్రోత్సహాన్నిస్తుంది: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:12) మీ విరోధులను గాయపర్చమని, అణగద్రొక్కమని, వికలాంగులను చేయమనే భావోద్రేకపరమైన ప్రసంగాలను ప్రతి రోజూ వింటున్నట్లయితే అలాంటి లక్షణాలను మీరు అలవర్చుకొనగలరా? “నేను సంఘటిత క్రీడలను ఆడాను. గెలుపు మీదైనంత వరకూ మీరు ఎవరిని గాయపరుస్తున్నారో పట్టించుకోరు” అని పదహారేళ్ళ రాబర్ట్‌ అంగీకరించాడు. ఇప్పుడు ఆయన బాప్తిస్మము తీసుకున్న క్రైస్తవుడు కనుక ఆయన దృక్పథాలు మారిపోయాయి. “నేను ఇక దానిలోకి ఎన్నడు పోను” అని అంటున్నాడు.

శారీరక శిక్షణా లేక శారీరక గాయమా?

దాని శారీరక అపాయాలను పట్టించుకోకుండా ఉండలేము. నిజమే, స్నేహితులతో కేవలం సరదాకి ఆడినప్పటికీ క్రీడల్లో అపాయాలు తప్పవు. అయితే యౌవనులు, వృత్తిపరంగా ఆడేవారిలా ఆడేందుకు శిక్షణను పొందినప్పుడు ఈ అపాయాలు మరింత అధికమౌతాయి.

క్రీడలలో మీ బిడ్డ అనే పుస్తకం ఇలా అభిప్రాయపడింది: “వృత్తి రీత్యా ఆటగాళ్ళైన వారు గాయపడతారు. అయితే వారు మహా నిపుణులూ, శారీరకారోగ్యంగలవారు, ఇష్టపూర్వకంగానే గాయపడేందుకు సిద్ధమైనా అలా చేసేందుకు బత్తెమును పుచ్చుకుంటున్న వయోజనులు వారు. అంతేకాకుండా, సర్వసాధారణంగా వారికి శ్రేష్ఠమైనవి, ఎంతో నిపుణత గల శిక్షణ, శ్రేష్ఠమైన పరికరాలూ, మరి అతి సన్నిహితమైన మరియు శ్రేష్ఠమైన వైద్యం లభిస్తాయి. . . . పాఠశాలలో చదివేవారికి ఆ సదుపాయాలుండవు.” తమ శరీరములను ‘దేవునికి పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా అర్పించాల్సివుంది’ అని క్రైస్తవులకు చెప్పబడింది. (రోమీయులు 12:1) మీరు మీ శరీరమును అనవసరంగానూ లేక అయోగ్యంగానూ ప్రమాదంలో పెట్టాలా వద్దా అని మీరు అలోచించరా?

పరిగణించాల్సిన ఇతర విషయాలు

ఆరోగ్య అపాయాలు తక్కువగా అనిపించినప్పటికి, సంఘటిత క్రీడలు సమయాన్ని ఎంతగానో తినేస్తాయి. అభ్యాస తరగతులు మీ సాంఘిక జీవనాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా, పఠనం మరియు హోమ్‌వర్కుల సమయాన్ని కూడా ఎంతో తినేస్తాయి. విద్యేతర కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకన్నా కళాశాల క్రీడాకారులు సాధారణంగా “తక్కువ గ్రేడులను” పొందుతున్నారని సైన్స్‌ న్యూస్‌ నివేదిస్తోంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, ఓ జట్టులో చేరడం వల్ల బైబిలు చెప్పే “శ్రేష్ఠమైన కార్యములను” అంటే ఆత్మీయ ఆసక్తులను వెంబడించడాన్ని కష్టతరం చేస్తుంది. (ఫిలిప్పీయులు 1:10) మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను జట్టులో చేరితే క్రైస్తవ కూటాలను మానుకోవల్సి వస్తుందా, లేక అది నా ప్రకటన పనిలో నా భాగాన్ని తగ్గిస్తుందా?’

అంతేకాకుండా, నైతికత, శుద్ధమైన మాటలూ లేక పోటీ విషయాల్లో మీ దృక్పథాన్ని పంచుకోని యౌవనులూ, వయోజనులతో అధిక సమయం గడపడం వల్ల వచ్చే ఫలితాలను జాగ్రత్తగా తూచి చూసుకోవాలి. “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరపును” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 15:33) ఉదాహరణకు, ద న్యూయార్క్‌ టైమ్స్‌ అనే వార్తాపత్రిక ప్రత్యేక శీర్షిక చెప్పేదాన్ని పరిశీలించండి: “దుస్తులను మార్చుకునే గది . . . స్త్రీల శరీరాలను లజ్జాకరమైన శృంగారపదాలతో పురుషులు చర్చించుకునే స్థలమే, అక్కడ వారు ‘గెలిచామని’ గొప్పలు చెప్పుకుంటారు మరి స్త్రీలను కొట్టడాన్ని గూర్చి తమాషాగా చెప్పుకుంటారు.” అలాంటి వాతావరణంలో మీరు ఉండేందుకు మీరెన్నుకున్నట్లయితే ఆత్మీయంగా మీరెలా ఉంటారు?—యాకోబు 3:18 పోల్చండి.

జ్ఞానయుక్తమైన నిర్ణయాన్ని చేసుకోండి

క్రీడల జట్టులో చేరాలని మీరు తలస్తున్నారా? అప్పుడు బహుశ ముందటి విషయాలు మీరు దాని మూల్యాన్ని ఎంచేందుకు మీకు సహాయపడగలదు. మీ నిర్ణయాన్ని చేసుకునేటప్పుడు ఇతరుల మనస్సాక్షిని పరిగణనలోకి తీసుకోండి. (1 కొరింథీయులు 10:24, 29, 32) నిస్సందేహంగా, కచ్చితమైన నియమాలను చేయడానికి లేదు, ఎందుకంటే ప్రపంచంలో పరిస్థితులన్ని వేరు వేరుగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేవారై ఉండాలనే అర్హతను కూడా కల్గి ఉండవచ్చు. అయితే, మీకేదైనా అనుమానం ఉంటే మీ తలిదండ్రులతో లేక ఓ పరిపక్వత గల క్రైస్తవునితో మాట్లాడండి.

అనేకమంది క్రైస్తవ యౌవనులు, జట్టు క్రీడల్లో పాల్గొనకూడదనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మీరు క్రీడాకారులై, క్రీడలంటే ఎంతో ఇష్టపడేవారైతే అది అంత సులభం కాదు సుమా! ఉపాధ్యాయులూ, కోచ్‌లూ మరియు తలిదండ్రులూ కలతను అధికం చేయగలరు. యువకుడైన జిమ్మి ఇలా అంగీకరించాడు: “ఆడకుండా ఉండేందుకు నాతో నేనే పోరాటం చేయాలి. తన ఉన్నత పాఠశాల విద్య సమయంలో విశ్వాసంలో లేని మా నాన్నగారు గొప్ప క్రీడాకారుడు. కొన్నిసార్లు జట్టులో చేరకుండా ఉండడం నాకు చాలా కష్టంగా ఉంటుంది.” అయినప్పటికీ, పరిపక్వత గల, విశ్వాసంలోనున్న తలిదండ్రులు, అలాగే సంఘంలోని ఇతర క్రైస్తవులూ మీరు మీ నిర్ణయానికి హత్తుకుని ఉండేలా సహాయపడేందుకు ఎంతో చేయగలరు. “మా అమ్మకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. కొన్నిసార్లు క్రీడల్లో పాల్గొనాలనే ఒత్తిడివల్ల నేను ఎంతో కృంగిపోతుంటాను. అయితే, నా జీవితంలోని నిజమైన గమ్యాలను జ్ఞాపకం చేసేందుకు ఆమె ఎల్లప్పుడూ ఉండేది” అని జిమ్మి చెబుతున్నాడు.

ఆడేవారికి సహకారాన్ని సమస్యల పరిష్కారాన్ని జట్టు క్రీడలు నేర్పగలవు. అయితే క్రైస్తన సంఘంలో పని చేయడం ద్వారా అలాంటి విషయాలను నేర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. (ఎఫెసీయులు 4:16 పోల్చండి.) జట్టు క్రీడలు సరదాగా ఉండవచ్చు కానీ, వాటిని ఆనందించేందుకు మీరు అందులోనే చేరనవసరంలేదు. కొన్ని క్రీడలను ఇంటి పెరట్లోగానీ స్థానిక మైదానంలోగానీ ఆడుతున్నప్పుడు ఆనందించవచ్చు. కుటుంబమంతా కలిసి బైటికి వెళ్ళడం మంచి ఆటకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది. “మీ సంఘంలో ఉన్న వారితో ఆడడం ఎంతో ఉత్తమం అది సరదాకే, మరి మీరు మీ స్నేహితులతో ఉన్నారు!” అని 16 ఏళ్ళ గ్రెగ్‌ చెబుతున్నాడు.

అది నిజమే, గెలిచే జట్టుతో ఆడేంత ఉత్సాహాన్ని బహుశ స్నేహితులతో ఆడడం ఇవ్వదు. అయితే, “శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి . . . అన్ని విషయములలోనూ ప్రయోజనకరమవును” అనే విషయం మర్చిపోవద్దు. (1 తిమోతి 4:8) దైవ భక్తిని పెంచుకోండి, అప్పుడు దేవుని దృష్టిలో మీరు నిజమైన విజయులై ఉంటారు!

[అధస్సూచి]

a 1996 మార్చి 8వ సంచికలోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . జట్టు క్రీడలు—అవి నాకు సరైనవేనా?” అనే శీర్షికను చూడండి.

[23వ పేజీలోని చిత్రం]

“మాకు మరీ ఉన్మాదియైన కోచ్‌ ఉండేవాడు; ఎప్పుడూ మాపై అరుస్తూ కేకలేస్తూ ఉండేవాడు . . . అభ్యసించేందుకు వెళ్ళడానికి నాకు మహా భయంగా ఉండేది”

[24వ పేజీలోని చిత్రం]

అది ఇతరులను గాయపర్చినా సరే ఎల్లప్పుడూ కోచ్‌లు గెలవడంపైనే అధిక ప్రాముఖ్యతను మోపుతారు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి