మా పాఠకుల నుండి
‘చాలా దూరం’ అంటే ఎంతదూరం? “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ‘చాలా దూరం’ అంటే ఎంత దూరం?” (ఫిబ్రవరి 8, 1994) అనే శీర్షికకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను యౌవనస్థుడైన ఒక క్రైస్తవ పురుషునితో డేటింగ్ చేస్తున్నాను. మా దేశంలో ముద్దుపెట్టుకోవడం కౌగిలించుకోవడం అనేవి సాధారణమే అయినప్పటికీ, మేము మొదటి నుండి పరస్పరం పరిమితులను పెట్టుకున్నాము. యెహోవా యొక్క నీతి ప్రమాణాలను అనుసరించడం సులభమేమీ కాదు, ఈ శీర్షిక నిశ్చయంగా అనేకులకు సహాయపడుతుందని నాకు నమ్మకమే.
పి. ఎస్. ఎఫ్., బ్రెజిల్
మీ విశ్వాసము గల సభ్యులను కలిసినప్పుడెల్లా, నేను తేజరిల్లు! పత్రికను తీసుకుంటాను. ఫిబ్రవరి 8, 1994 సంచిక విషయం కూడా అంతే. అనైతికతను గూర్చిన ఆ శీర్షిక నన్నెంతగానో ఆకర్షించింది. నా స్వంత ఇవాంజెలికల్ లూథరన్ చర్చి ప్రచురణలు ఇలాంటి విషయాలను చర్చించవు గానీ, పురుషసంయోగులను, స్త్రీసంయోగులను ఇంకా ప్రోత్సహిస్తాయి. అనేకులు నిషేధించిన విషయాలను మీ పత్రికల్లో చర్చించనారంభించారు, మీ ధైర్యాన్ని, దృఢ విశ్వాసాన్ని ప్రశంసిస్తున్నాను.
హెచ్. ఎస్., జర్మనీ
నాకు 26 ఏండ్లున్నా, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .” శీర్షికలు నాకు ఎంతో విలువైనవి. ఈ ప్రత్యేక సమస్యతో నేనెంతగానో పోరాడుతూ వస్తున్నాను. ఈ శీర్షిక చాలా దూరం అంటే ఎంత దూరమో కచ్ఛితంగా, మరియు స్పష్టంగా చెబుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను!
వి.వి., బెల్జియమ్
యౌవనస్థురాలైన క్యాన్సర్ రోగి కేథీ రోబర్‌సన్ చెప్పిన “జీవితం సులభతరం కానప్పుడు,” అనే (సెప్టెంబరు 8, 1994) శీర్షికను ఇప్పుడే చదివాను, అది నిజంగా నా హృదయాన్ని ఆకర్షించిందని ఒప్పుకోవాలి. ఇలాంటి చక్కని శీర్షిక యెడల నాకు గల మెప్పును రాసి తెలపాలనుకున్నాను. నాకు 14 ఏండ్లు, నేను ఒక యెహోవాసాక్షిని కాబట్టి, పాఠశాలలో శ్రమలను అనుభవించాను. నా పరిస్థితి కేథీ రోబర్‌సన్ పరిస్థితంత బాధాకరంగా లేదు, అయితే యెహోవా ఆమెను ఎలా కాపాడాడో చూడడం, ఉత్తేజకరంగా ఉంది.
సి. జి., అమెరికా
ఎంత గొప్ప శీర్షిక! నేను కూడా తొమ్మిదేండ్లప్పుడు రోగినయ్యాను, చివరికి ఎన్నో నెలలు ఆసుపత్రిలో ఉన్నాను. అయితే, నేను ఉన్నత పాఠశాలకు వెళ్ళే సమయానికెల్లా, నా ఆరోగ్యం బాగుపడింది. కేథీ రోబర్‌సన్ మళ్ళీ మళ్ళీ వ్యాధిని ఎదుర్కోవలసి వస్తున్నందువల్ల, తనకు చాలా కష్టంగా ఉండి ఉండవచ్చు. ఆమె దృక్పథం, శక్తి నేను మరింత అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి నాకు తోడ్పడింది.
డి. వి., అమెరికా
తల్లి పాలివ్వడం మూడు నెలల్లోగా నేను మా రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. సెప్టెంబరు 8, 1994, తేజరిల్లు! సంచిక అందుకొని, “పాలిచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు,” అనే శీర్షికను చూసి నేను చాలా సంతోషించాను. నిజంగా దాన్ని చదవడం ఎంతో ఉత్తేజకరంగా ఉంది, అది ప్రాణదాతకు చెందవలసిన ఘనతను, స్తుతిని ఇచ్చింది. తల్లి తన బిడ్డకు పాలిచ్చేవిధంగా ఎలా సంసిద్ధం చేయబడిందో ఆలోచించినప్పుడు జ్ఞానియైన, ప్రేమగల సృష్టికర్త ఉన్నాడన్న విషయాన్ని ఎవరైనా ఎలా తిరస్కరించగలరో నాకు అర్థం కాలేదు.
ఎల్. కె., అమెరికా
మీకు ఈ శీర్షికను బట్టి కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నో ఉత్తరాలు వస్తాయని నాకు నమ్మకమే. వెనక్కి తిరిగి చూస్తే, మా ముగ్గురు పిల్లలకు నా పాలు త్రాగించడం ఎంత ఆశీర్వాదకరమును, ఆచరణాత్మకమైన ఎంపికయునైయున్నదో నేను గ్రహిస్తున్నాను. ఈ శీర్షిక తల్లులను, కాబోయే తల్లులను ప్రోత్సహిస్తుందని నాకు తెలుసు.
సి. ఎస్., అమెరికా
ఆకర్షణీయమైన చిత్రం నేను జూన్ 8, 1994వ సంచికలోని పునరుత్థాన చిత్రాన్ని చూసినప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయింది. అద్భుతమైన పునరుత్థాన నిరీక్షణను గూర్చి నాకున్న మెప్పు మరింత ఎక్కువయ్యింది. భవిష్యత్తు పరదైసులో నా చెల్లెల్ని నేను చూడగలిగేటప్పటి నా సంతోషాన్ని మాటల్లో వెలిబుచ్చలేను.
ఎమ్. యు., జపాన్