భూదిగంతముల వరకూ దేవుని జ్ఞానాన్ని తీసుకువెళ్లడం
[Note: Synchronization will not work because this article has not been made available in the English Watchtower Library]
అండమాన్ నికోబార్ ద్వీపాలు, భారతదేశపు తూర్పు కోస్తాకు 1,200 కిలోమీటర్ల దూరాన ఉన్న హిందూ మహాసముద్రంలో సర్వసుందరమైన ద్వీపపుంజముగా ఉన్నాయి. అక్కడ 572 ద్వీపాలు, చిన్న దీవులు, దిబ్బలు మరియు కొండలు ఉన్నాయి, అవి మొత్తం 8,249 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాయి, అయితే కేవలం 38 ద్వీపాల్లోనే ప్రజలు నివసిస్తున్నారు.
కొన్ని శతాబ్దాల వరకూ, ఈ ప్రాంత నివాసులు అటునుండి వెళ్లే ప్రయాణికులకు ఆతిథ్యమివ్వలేదు. ద్వీపాల్లో స్థావరాన్ని ఏర్పరచుకునేందుకు అనేక యూరప్ దేశాలు విఫలప్రయత్నం చేసిన తర్వాత, బ్రిటీష్‌వారే ద్వీపాల్లో మొదట స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. భారతదేశం బ్రిటీష్‌వారి పరిపాలన క్రింద ఉన్నప్పుడు, అత్యంత ప్రఖ్యాతి గాంచిన ద్వీపాల్లో ఒకటైన దక్షిణ అండమాన్ ద్వీపాన్ని బ్రిటీష్‌వారు నేరస్థుల స్థావరంగా ఉపయోగించి, 19వ శతాబ్దంలో అందులో స్థావరం ఏర్పరచుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ వారు కొంతకాలం ఆధిపత్యం చేసిన తర్వాత, ఆ ద్వీపాలు భారతదేశపు రిపబ్లిక్ అధికారం క్రిందకు వచ్చాయి. నౌక, విమానం ద్వారా చేరగల ఈ ప్రాంతం నేడు 3,00,000 మంది ప్రజలకు అంటే, ఆదిమ వాసులైన స్వల్ప జనాభాకు, మరియు భారతదేశపు తూర్పు కోస్తా ప్రాంతాలనుండి వచ్చిన మిగతా వారికి అది నివాస స్థలం.
బెంగాలీ, తమిళం మరియు తెలుగు అధికంగా మాట్లాడే భాషలు. మలయాళం మాట్లాడే జనాభా కూడా కొంత అక్కడ ఉంది, అయితే ద్వీపాల వ్యావహారిక భాష మాత్రం హిందీయే. ఈ సుదూర భూభాగంలో యెహోవాసాక్షుల నాలుగు సంఘాలు అలాగే రెండు ఐసొలేటెడ్ గుంపులు ఉన్నాయి, వీటితోపాటు దూరానున్న ద్వీపాల్లో అక్కడక్కడా కొంతమంది సాక్షులు ఉన్నారు. అన్ని విధాలైన ప్రజలను చేరాలన్న వారి కోరికను ప్రతిబింబిస్తూ, ఈ సంవత్సరపు మూలాంశ లేఖనాన్ని ద్వీపాల్లోని రెండు అతి పెద్ద సంఘాల రాజ్యమందిరాల్లో ఐదు భాషల్లో ప్రదర్శించారు. అది ఇలా చదువబడుతుంది: “వాక్య ప్రకారం చేసేవారై ఉండండి.”—యాకోబు 1:22, NW.
1995-96లో భారతదేశమందు జరిగిన “ఆనందమయ స్తుతికర్తలు” అనే 16 జిల్లా సమావేశాల్లో ఒకటి, అధికారిక రాజధానియైన పోర్ట్ బ్లేర్లో డిశంబరు 22 నుండి 24 వరకు జరిగింది. శిఖరాగ్ర హాజరు 290కి చేరింది, 11 మంది యెహోవాకు తాము చేసుకున్న సమర్పణను బహిరంగంగా ప్రకటించారు. సమావేశానికి హాజరైన వారు, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని కేవలం ఆంగ్లంలోనే కాక హిందీలో అలాగే ప్రాంతీయంగా ఉపయోగింపబడే ముఖ్య భాషలన్నింటిలో అందుకుని ఎంతో ఆనందించారు. ఆంగ్ల భాష సంచికతోపాటు తొమ్మిది భారతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేయబడిన పుస్తకాల్లో ఇదే మొదటిది.
ప్రభుత్వ సెలవు దినమైన ఆ మరుసటి దినాన, యెహోవా యొక్క 60 మంది ఆనందమయ స్తుతికర్తలు ఆ ద్వీపాల్లో ఒకదానికి వెళ్లి ఇతరులతో దేవుని రాజ్యసువార్తను పంచుకునేందుకు అందులోని సుదూర ప్రాంతానికి ప్రయాణించారు. సాక్షులు చిన్న గుంపులుగా విడిపోయి అంత స్పష్టంగా కనిపించని దుమ్ముగల కాలిబాటల్లో, పొలాల గుండా మరియు మిట్టలపై నుండి నడుచుకుంటూ వెళ్లారు. సుదూర పల్లెటూళ్లలోని మరియు చెట్లు దట్టంగా ఉన్న ప్రాంతాల్లోని దీనులైన రైతులను కనుగొనాలన్నదే వారి సంకల్పం. వారి స్వభాషలో ఒకటి లేక రెండు లేఖనాలను వారికి చదివి వినిపించిన తర్వాత ఓ కరపత్రాన్నో, ఓ పత్రికనో లేక వారి స్వంత భాషలో జ్ఞానము అనే పుస్తకాన్నో అందించారు. సముద్ర తీరాన పిక్నిక్ తరహాలో భోజనం చేసిన తర్వాత సాక్షులు తమ ఇళ్లకు తిరిగివచ్చారు. ‘భూదిగంతాల్లో’ ఒక ప్రాంతానికి దేవుని జ్ఞానాన్ని తీసుకెళ్లి, యెహోవా సేవలో తమ సమయాన్ని, శక్తిని వెచ్చించగలిగినందుకు వారెంతో సంతోషించారు.—అపొస్తలుల కార్యములు 1:8.