మా పాఠకుల నుండి
నిరంతరం జీవించడం “జీవితం ఎందుకింత కొద్దిపాటిదై ఉంది?—అదెన్నడైనా మారుతుందా?” (నవంబరు 8, 1995) అనే పరంపర విషయమై మీకు కృతజ్ఞతలు. ఈ శీర్షికలు, పరదైసు భూమిపై పరిపూర్ణ మానవునిగా జీవించగల ఉత్తరాపేక్షను నేను సరిగ్గా అర్థం చేసుకునేందుకు సహాయం చేయడమే కాకుండా విజ్ఞానశాస్త్ర తరగతుల్లో కూడా నాకు సహాయం చేశాయి. సరిగ్గా ఈ శీర్షికలు ప్రచురించబడినప్పుడే, కణం మరియు దాని భాగాలు, పనులు అనే విషయంపై మాకు పరీక్ష జరిగింది. మీరు దాన్ని ఎంత స్పష్టంగా వివరించారో! మంచి మార్కుల విషయమై మరియు సరైన సమయంలో ఆత్మీయ ఆహారాన్ని అందించినందుకు వందనాలు.
బి. ఎమ్., అమెరికా
పోటీ “బైబిలు ఉద్దేశము: క్రీడల్లో పోటీ తప్పా?” (జనవరి 8, 1996) అనే శీర్షిక నా పదేళ్ల కుమారునికి ఆదరణనిచ్చింది. కొందరు పెద్ద అబ్బాయిలు బంతి ఆడేందుకు వాన్ని పిలిచారు. వాడు చాలా కృంగిపోయేలా వాళ్లు వాడిని వెక్కిరించారు. మేము ఆ శీర్షిక చదివి, క్రైస్తవులు క్రీడల విషయంలో సమతూక దృక్పథాన్ని కలిగి ఉండాలని మరియు క్రీడలు సేదదీర్చేవిగా ఉండాలి కానీ కృంగదీసేవిగా ఉండకూడదని తెలుసుకుని ఆదరణ పొందాము. మన యౌవనులందరూ ఈ శీర్షికను చదువుతారని నేను అపేక్షిస్తున్నాను ఎందుకంటే కొన్ని క్రీడలు మరీ దౌర్జన్యపూరితంగా తయారయ్యాయి.
ఎస్. హెచ్., అమెరికా
పాఠశాలలోని ఒక క్రీడల జట్టులో చేరే విషయంలో నేను ఓ నిర్ణయం తీసుకునేందుకు ఈ శీర్షిక నాకు వాస్తవంగా మద్దతునిచ్చింది. ఆ శీర్షికలో వ్యక్తపరచబడిన లేఖనాలు నిజంగా ఎంతో సూటిగా ఉన్నాయి. సాధారణంగా కోచ్‌లు మీరు కష్టపడి ఆడి గెలవాలని చెబుతారు గనుక, ప్రాముఖ్యంగా ఈ జట్టులో చేరడం ఎంతో పోటి పడవలసి వచ్చేది. జ్ఞానోదయాన్ని కలిగించిన ఆ శీర్షిక విషయమై మీకు వందనాలు, మంచి నిర్ణయం తీసుకునేందుకు అది ఇతర యౌవనులకు కూడా సహాయం చేస్తుందని నేను అపేక్షిస్తున్నాను.
ఎల్. ఎమ్., అమెరికా
ఎగిరే శిలలు కేవలం కొన్ని దినాల క్రితమే, దూసుకుపోయే తారకు, ఓ ఉల్కాశకలానికి ఉన్న తేడా గురించి నేను ఆలోచించాను. సరిగ్గా ఈ విషయాన్నే వివరించిన “ఎగిరే శిలలు” (జనవరి 8, 1996) అనే శీర్షికను నేను చదివినప్పుడు నాకు కలిగిన ఆశ్చర్యాన్ని ఊహించండి. యెహోవా సృష్టితో మాకు పరిచయాన్ని పెంచే శీర్షికలను ప్రచురిస్తున్నందుకు మీకు వందనాలు.
ఆర్. పి., స్విట్జర్లాండ్
ఆండ్రూ నుండి నేర్చుకోవడం డౌన్స్ సిండ్రోమ్ ఉన్న యౌవనుని గూర్చినదైన “ఆండ్రూ నుండి మేము నేర్చుకున్నది” (జనవరి 8, 1995) అనే శీర్షికను నేను ఇందాకే చదివాను. మానసిక వైకల్యంగల బాలుడు మాకు కూడా ఉన్నాడు, ఆండ్రూ తలిదండ్రులు చేసిన చాలా వ్యాఖ్యానాలు, మేమెలా భావిస్తున్నామనే దాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మానసిక వైకల్యంగల పిల్లవాన్ని కలిగి వుండటం ద్వారా వచ్చే ప్రత్యేక ఇబ్బందులను మరియు కుటుంబానికి కలిగే భావోద్రేక ఒత్తిడులను గుణగ్రహించడం మన క్రైస్తవ సహోదరులకు తరచూ కష్టం. కాబట్టి ఆ శీర్షిక విషయమై వందనాలు.
జె. బి., ఇంగ్లాండు
మీరు ప్రచురించిన ఎంతో అందమైన మరియు సూక్ష్మమైన శీర్షికల్లో ఇది ఒకటని నేను భావిస్తున్నాను. కేవలం మూడు పేజీల్లోనే, వైకల్యాలుగల వారిని మనం ఎలా దృష్టించాలి అనే విషయాన్ని గూర్చిన పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి. మానవ సంబంధాలను గురించి అది లోతైన పాఠాన్ని అందజేసింది.
ఎమ్. ఎల్., స్పెయిన్
ఈ సంవత్సరం తొలి భాగంలో నా భార్య డౌన్స్ సిండ్రోమ్ ఉన్న బాబుకు జన్మనిచ్చింది. ఆండ్రూ తలిదండ్రుల వలెనే, తమ బిడ్డకు అంగ వైకల్యం ఉందని తెలుసుకున్నప్పుడు అనేకమంది తలిదండ్రులకు కలిగే బాధ మరియు దుఃఖం మాకు కూడా కలిగాయి, అలాగే వర్తమానం మరియు భవిష్యత్తును గురించిన ప్రశ్నలు కూడా మాలో తలెత్తాయి. మా విషయానికైతే మేము, మా బిడ్డ అంగ వైకల్యాన్ని అంగీకరించగలిగాము. వాడికి త్వరలో ఆరు నెలలు నిండుతాయి, వాడు చక్కగా అభివృద్ధి చెందుతున్నాడు. వాడు పుట్టిన మర్నాడు, మన క్రైస్తవ సహోదరసహోదరీలు అనేకమంది దర్శించడంతో నా భార్య ఎంతో ఆనందించింది. ఓ ఆత్మీయ కుటుంబాన్ని కలిగి ఉండటమంటే ఏమిటో మేము వాస్తవంగా అనుభవించాము. మన సహోదరసహోదరీల ప్రేమతోపాటు యెహోవా కూడా ఉన్నాడు. ఈ శీర్షిక విషయమై మీకు వందనాలు.
జి. కి., ఫ్రాన్స్