బోధకుడిగా మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోండి
బోధకుడిగా మీ లక్ష్యమేమిటి? మీరు ఇటీవలే రాజ్య ప్రచారకుడైనట్లయితే, యేసు తన అనుచరులకు శిష్యులను చేసే నియామకాన్నిచ్చాడు కనుక, గృహ బైబిలు అధ్యయనం నిర్వహించడమెలాగో నేర్చుకోవాలన్న కోరిక మీకుందనడంలో సందేహం లేదు. (మత్త. 28:19, 20) ఈ కార్యకలాపంలో మీకు ఇప్పటికే అనుభవమున్నట్లయితే, మీరు సహాయం చేయాలనుకుంటున్నవారి హృదయాలను మరింత సమర్థంగా చేరుకోవాలన్నదే మీ లక్ష్యం కావచ్చు. మీరు తల్లి గానీ తండ్రి గానీ అయితే, తమ జీవితాలను దేవునికి సమర్పించుకునేలా మీ పిల్లలను ప్రేరేపించగల బోధకులుగా మీరు ఉండాలని నిశ్చయంగా కోరుకుంటారు. (3 యోహా.4) మీరు సంఘంలో ఒక పెద్ద అయినా పెద్ద అవ్వాలని ప్రయత్నిస్తున్నా, మీ శ్రోతలకు యెహోవా మీదా ఆయన మార్గాల మీదా లోతైన కృతజ్ఞతను కలిగించగల బహిరంగ ప్రసంగీకుడిగా ఉండాలని మీరు కోరుకుంటుండవచ్చు. మీరు ఈ లక్ష్యాలను ఎలా సాధించవచ్చు?
ప్రావీణ్యముగల బోధకుడైన యేసుక్రీస్తు నుండి ఒక పాఠం నేర్చుకోండి. (లూకా 6:40) యేసు, కొండ ప్రక్కన పెద్ద జనసమూహముతో గానీ దారిలో నడుస్తుండగా కొందరు వ్యక్తులతో గానీ మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలూ ఆయన మాట్లాడిన విధానమూ వారి హృదయాలపై చెరగని ముద్రను వేశాయి. యేసు తన శ్రోతల మనస్సులకు హృదయాలకు చైతన్యం కలిగించాడు, వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఆచరణాత్మకంగా అన్వయించాడు. మీరూ అదే విధంగా చేయగలరా?
యెహోవాపై ఆధారపడండి
తన పరలోక తండ్రియైన దేవునితో తనకున్న సన్నిహిత సంబంధమూ దేవుని ఆత్మ ఆశీర్వాదమూ యేసు బోధనా సామర్థ్యాన్ని మరింత అధికం చేశాయి. మీరు ఒక గృహ బైబిలు అధ్యయనాన్ని సమర్థవంతంగా నిర్వహించగలగాలని యెహోవాకు హృదయపూర్వకంగా ప్రార్థిస్తారా? మీరొక తల్లో తండ్రో అయితే, మీరు మీ పిల్లలకు బోధించడంలో దైవిక మార్గనిర్దేశాన్నివ్వమని క్రమంగా ప్రార్థిస్తారా? ప్రసంగాలకు సిద్ధపడేటప్పుడు లేదా కూటాలను నిర్వహించేందుకు సిద్ధపడేటప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థిస్తారా? అలా ప్రార్థనాపూర్వకంగా యెహోవాపై ఆధారపడడం, మీరు మరింత ప్రావీణ్యముగల బోధకుడయ్యేందుకు మీకు సహాయపడుతుంది.
మనం యెహోవాపై ఆధారపడుతున్నామన్నది మనం ఆయన వాక్యమైన బైబిలుపై ఆధారపడడం ద్వారా కూడా వెల్లడవుతుంది. పరిపూర్ణుడైన ఒక మానవునిగా యేసు తన జీవితపు చివరి రాత్రి తన తండ్రికి చేసిన ప్రార్థనలో “వారికి నీ వాక్యమిచ్చి యున్నాను” అని అన్నాడు. (యోహా. 17:14) తనకు ఎంతో విస్తృతమైన అనుభవమున్నప్పటికీ ఆయన తనంతట తానే ఎన్నడూ మాట్లాడలేదు. తన తండ్రి తనకు ఏమి నేర్పాడో ఎల్లప్పుడు అదే మాట్లాడాడు. ఆ విధంగా మనం అనుసరించడానికి ఒక మాదిరినుంచాడు. (యోహా. 12:49,50) బైబిలులో భద్రపరచబడిన దేవుని వాక్యానికి ప్రజలపై ప్రభావం చూపే శక్తి ఉంది. అది ప్రజల చర్యలను, అంతరంగ తలంపులను, భావాలను సహితం ప్రభావితం చేయగలదు. (హెబ్రీ. 4:12) మీరు దేవుని వాక్యపు పరిజ్ఞానంలో ఎదుగుతూ దానిని మీ పరిచర్యలో చక్కగా ఉపయోగించడం నేర్చుకొంటుండగా ప్రజలను దేవునికి సన్నిహితులుగా చేసే బోధనా సామర్థ్యాన్ని మీరు అలవరచుకుంటారు.—2 తిమో. 3:16,17.
యెహోవాను ఘనపరచండి
క్రీస్తును అనుకరిస్తున్న ఒక బోధకునిగా ఉండడమంటే, ఒక ఆసక్తికరమైన ప్రసంగం ఇవ్వగలగడం మాత్రమే కాదు. అవును, యేసు చెప్పిన “మనోహరమైన మాటలు” విని ప్రజలు ఆశ్చర్యపోయారు. (లూకా 4:22, NW) ఆ విధంగా మాట్లాడడంలో యేసుకున్న లక్ష్యమేమిటి? ప్రజలను తన వైపుకు కాదు గానీ యెహోవావైపుకు ఆకర్షింపజేయాలన్నదే ఆయన ఉద్దేశం. (యోహా. 7:16-18) “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అని ఆయన తన అనుచరులకు ఉద్బోధించాడు. (ఇటాలిక్కులు మావి.) (మత్త. 5:16) ఆ ఉపదేశం, మన బోధనా విధానంపై ప్రభావం చూపాలి. ఆ లక్ష్యానికి ఆటంకం కలిగించే దేనినైనా నివారించుకోవాలన్నది మన ఉద్దేశమై ఉండాలి. కాబట్టి మనం ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నది ఆలోచించుకుంటున్నప్పుడు, ‘ఇది యెహోవా పట్ల కృతజ్ఞతను ప్రగాఢం చేస్తుందా, లేక ఇది వారి ఆలోచనలను మళ్ళిస్తుందా?’ అని మనలను మనమే ప్రశ్నించుకోవడం మంచిది.
ఉదాహరణకు, సమర్థవంతమైన బోధనలో ఉపమానాలు నిజ జీవిత ఉదాహరణలు ఉపయోగించవచ్చు. అయితే, పొడవైన ఉపమానాన్ని చెప్పినప్పుడు లేదా అధిక వివరాలతో ఒక అనుభవాన్ని చెప్పినప్పుడు ఉపదేశం యొక్క అసలు విషయం అస్పష్టంగా తయారుకావచ్చు. అలాగే, కేవలం వినోదం కలిగించే కథలు చెప్పడం కూడా మన పరిచర్య ఉద్దేశానికి భంగం కలిగిస్తుంది. ఆ విధంగా చేయడం ద్వారా బోధకుడు దైవపరిపాలనా విద్య యొక్క నిజమైన లక్ష్యాన్ని సాధించే బదులు తన వైపుకు శ్రద్ధనాకర్షించినట్లవుతుంది.
“వేరుచేయుటకు”
ఒక వ్యక్తి నిజంగా శిష్యుడు అవ్వాలంటే, బోధించబడుతున్నదాన్ని ఆయన స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన సత్యాన్ని విని, అది ఇతర మతాల నుండి ఎలా భిన్నంగా ఉందో తప్పకుండా గ్రహించాలి. వాటి మధ్యవున్న వ్యత్యాసాలను చూపించడం ఈ లక్ష్యసాధనకు సహాయపడుతుంది.
పవిత్రమైన దానిని అపవిత్రమైనదానిని ‘వేరుచేయ’వలెనని యెహోవా తన ప్రజలకు మళ్ళీ మళ్ళీ బోధించాడు. (లేవీ. 10:8-11) తన గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలో సేవచేసేవారు “పవిత్ర వస్తువులకు, పవిత్ర వస్తువులు కాని వాటికి మధ్య వ్యత్యాసాన్ని” ప్రజలకు బోధించాలని ఆయన వారికి చెప్పాడు. (యెహె. 44:23, ఈజీ-టు-రీడ్ వర్షన్) సామెతల గ్రంథం, నీతికీ భక్తిహీనతకూ, జ్ఞానానికీ మూఢత్వానికీ గల వ్యత్యాసాలతో నిండివుంది. పరస్పర విరుద్ధం కాని వాటిని కూడా ఒకదాని నుండి మరొక దానిని వేరుగా గుర్తించవచ్చు. రోమీయులు 5:7 లో ఉన్నట్లు, అపొస్తలుడైన పౌలు నీతిమంతుడికీ మంచివాడికీ గల వ్యత్యాసాన్ని చూపించాడు. క్రీస్తు చేసే ప్రధాన యాజకుని సేవ అహరోను చేసిన సేవ కన్నా ఎంత ఉన్నతమైనదో ఆయన హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో తెలియజేశాడు. నిజానికి 17వ శతాబ్దపు విద్యావేత్తయైన యోహాన్ ఆమోస్ కోమినీయస్, “బోధించడం అంటే, వివిధ విషయాలు, వాటి ఉద్దేశాల్లోనూ రూపాల్లోనూ ఆవిర్భావాల్లోనూ పరస్పరం ఎలా భిన్నంగా ఉన్నాయన్నది చూపించడాన్ని మించి మరేమీ కాదు. . . . కనుక, వ్యత్యాసాలను చక్కగా చూపించేవాడు చక్కగా బోధిస్తాడు” అని వ్రాశాడు.
ఉదాహరణకు, దేవుని రాజ్యం గురించి ఎవరికైనా బోధించే విషయమే తీసుకోండి. రాజ్యం అంటే ఏమిటో ఆయనకు అర్థం కాకపోతే, ఒక వ్యక్తి హృదయస్థితే రాజ్యం అన్న తలంపుకు భిన్నంగా బైబిలు ఏమి చెబుతోందో మీరు చూపించవచ్చు. లేదా ఈ రాజ్యం, మానవ ప్రభుత్వాల నుండి ఎలా భిన్నంగా ఉంటుందో మీరు చూపించవచ్చు. అయితే, ఈ ప్రాథమిక సత్యాలు తెలిసినవారికి, మీరు ఇంకా లోతైన వివరాలను చెప్పవచ్చు. కీర్తన 103:19 వర్ణిస్తున్న దేవుని సొంత విశ్వాధిపత్యానికి, లేదా కొలొస్సయులు 1:13 లో పేర్కొనబడిన ‘ఆయన ప్రేమించిన ఆయన కుమారునియొక్క రాజ్యానికి’ లేదా ఎఫెసీయులు 1:8-10 లో చెప్పబడిన ‘సమకూర్పుకు’ మెస్సీయ రాజ్యం ఎలా భిన్నంగా ఉందో మీరు చూపించవచ్చు. వ్యత్యాసాలను చూపించడం, మీ శ్రోతలు ఈ ప్రాముఖ్యమైన బైబిలు బోధనను స్పష్టంగా గ్రహించడానికి సహాయపడగలదు.
ఈ బోధనా పద్ధతిని యేసు మళ్ళీ మళ్ళీ ఉపయోగించాడు. మోషే ధర్మశాస్త్రం గురించి ప్రజల్లో ప్రబలివున్న అవగాహనకూ ధర్మశాస్త్రపు నిజమైన ఉద్దేశానికీ గల వ్యత్యాసాన్ని చూపించాడు. (మత్త. 5:21-48) నిజమైన దైవభక్తికీ పరిసయ్యుల వేషధారణతో కూడిన చర్యలకూ గల తేడాను చూపించాడు. (మత్త. 6:1-18) “అధికారము చేయు”వారి స్ఫూర్తికీ తన శిష్యులు చూపవలసిన స్వయంత్యాగ పూరిత స్ఫూర్తికీ గల వ్యత్యాసాన్ని చూపించాడు. (మత్త. 20:25-28) మత్తయి 21:28-32 లో వ్రాయబడినట్లు, స్వనీతిపరత్వానికీ నిజమైన పశ్చాత్తాపానికీ గల తేడాను తమంతట తామే గ్రహించేలా మరొక సందర్భంలో యేసు తన శ్రోతలను ప్రోత్సహించాడు. మంచి బోధన యొక్క మరొక విలువైన పార్శ్వాన్ని మనకు చూపిస్తుందది.
ఆలోచించమని శ్రోతలను ప్రోత్సహించండి
మత్తయి 21:28 లో “మీకేమి తోచుచున్నది?” అనే ప్రశ్నతో యేసు తన ఉపమానాన్ని మొదలుపెట్టడాన్ని మనం చదువుతాం. ప్రతిభావంతుడైన ఒక బోధకుడు వాస్తవాలను కేవలం చెప్పుకుంటూ పోవడమో జవాబులను ఇస్తుండడమో చేయడు. బదులుగా, ఆలోచనా సామర్థ్యాన్ని అలవరచుకునేందుకు తన శ్రోతలను ప్రోత్సహిస్తాడు. (సామె. 3:21; రోమా. 12:1) ప్రశ్నలు అడగడం ద్వారా కొంతమేరకు అలా చేయవచ్చు. మత్తయి 17:25 లో కనిపిస్తున్నట్లు, “సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలు చేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా?” అని యేసు అడిగాడు. (ఇటాలిక్కులు మావి.) యేసు అడిగిన ఆలోచనను రేకెత్తించే ప్రశ్నలు ఆలయ పన్ను చెల్లించడం గురించి స్వయంగా సరైన నిర్ధారణకు రావడానికి పేతురుకు సహాయపడ్డాయి. ‘నా పొరుగువాడెవడు?’ అని అడిగిన వ్యక్తికి ప్రత్యుత్తరమిస్తూ సమరయుడి ప్రవర్తన యాజకుని లేవీయుని ప్రవర్తనకు ఎలా భిన్నంగా ఉందో యేసు చూపించాడు. ఆ తర్వాత, ఆయన, ‘దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది?’ అని అడిగాడు. (లూకా 10:29-36) ఆ శ్రోత కోసం తనే ఆలోచించే బదులు, ఆయన ప్రశ్నకు ఆయననే సమాధానమివ్వమని యేసు చెప్పాడు.—లూకా 7:41-43.
హృదయాన్ని చేరుకోండి
దేవుని వాక్యపు భావాన్ని గ్రహించే బోధకులు, సత్యారాధన అంటే కొన్ని వాస్తవాలను గుర్తుంచుకొని, కొన్ని నియమాలను పాటించడం మాత్రమే కాదని గ్రహిస్తారు. యెహోవాతో మంచి సంబంధం, ఆయన మార్గాల గురించిన అవగాహనే సత్యారాధనకు పునాది. అలాంటి ఆరాధనలో హృదయానికి పాత్ర ఉంది. (ద్వితీ. 10:12,13; లూకా 10:25-27) లేఖనాల్లో “హృదయము” అన్న పదం తరచూ కోరికలు, ఇష్టాలు, అనుభూతులు, ప్రేరణలతో సహా పూర్తి అంతరంగ వ్యక్తిని సూచిస్తుంది.
మానవులు బాహ్యరూపాన్ని లక్ష్యపెడతారు కానీ, దేవుడు హృదయాన్ని లక్ష్యపెడతాడని యేసుకు తెలుసు. (1 సమూ. 16:7) మనం దేవునికి చేసే సేవ, ఆయనపై మనకున్న ప్రేమచేత పురికొల్పబడాలే గాని, తోటి మానవులను ముగ్ధులను చేయాలన్న తపనచేత కాదు. (మత్త. 6:5-8) అయితే పరిసయ్యులు, ఎన్నో పనులను ఇతరులకు చూపడానికే చేసేవారు. ధర్మశాస్త్రం చెప్పినట్లు ఉండాలనీ, స్వయంగా వాళ్ళు రూపొందించిన నియమాలను పాటించాలనీ చాలా నొక్కి చెప్పేవారు. కానీ తాము ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకున్నారో, ఆ దేవుని ప్రజలను గుర్తింపజేసే లక్షణాలను తమ జీవితాల్లో చూపించలేకపోయారు. (మత్త. 9:13; లూకా 11:42) దేవుడు కోరేవాటికి విధేయత చూపించడం ప్రాముఖ్యం, కానీ ఆ విధేయత ఎంత విలువైనదన్నది హృదయంలో ఏముందన్న దాన్ని బట్టే నిర్ధారించబడుతుందని యేసు బోధించాడు. (మత్త. 15:7-9; మార్కు 7:20-23; యోహా. 3:36) మనం యేసు మాదిరిని అనుకరిస్తే, మన బోధ అత్యధిక మేలును చేకూరుస్తుంది. దేవుడు తమ నుండి ఏమి కోరుతున్నాడో తెలుసుకునేందుకు మనం ప్రజలకు సహాయపడడం ప్రాముఖ్యం. అయితే, వారు యెహోవాను ఒక వ్యక్తిగా తెలుసుకొని, ఆయనను ప్రేమించడం కూడా చాలా ముఖ్యం. అలా, వారు సత్య దేవునితో తమకున్న అంగీకృతమైన సంబంధానికి ఇచ్చే విలువను వారి ప్రవర్తన ప్రతిబింబిస్తుంది.
నిజమే, అటువంటి బోధన నుండి ప్రయోజనం పొందేందుకు, ప్రజలు తమ సొంత హృదయాల్లో ఉన్నదాన్ని అధిగమించవలసిన అవసరం ఉంది. ప్రజలు తమ ఉద్దేశాలను విశ్లేషించుకోవాలనీ తమ భావాలను పరిశీలించుకోవాలనీ యేసు ప్రోత్సహించాడు. యేసు తన శ్రోతల తప్పుడు దృక్కోణాన్ని సరిదిద్దేటప్పుడు, వారు ఎందుకు అలా ఆలోచించారో, ఎందుకు అలా అన్నారో, ఎందుకు అలా చేశారో వారిని అడిగేవాడు. అయితే, అలా అడిగి వదిలేసే బదులు తన ప్రశ్నలతోపాటు వాళ్ళు విషయాలను సరైన విధంగా దృష్టించేలా ప్రోత్సహించే మాటలు పలకడంగానీ ఉపమానం చెప్పడం గానీ ప్రోత్సాహకరమైనది ఏదైనా చేయడం గానీ చేసేవాడు. (మార్కు 2:8; 4:40; 8:17; లూకా 6:41, 46) అలా మనం కూడా మన శ్రోతలకు సహాయం చేయవచ్చు. ఎలాగంటే, ‘ఈ విధమైన చర్య నన్ను ఎందుకంత ఆకట్టుకుంది? సాధారణంగా నేనీ పరిస్థితిలో ఎందుకు అలా ప్రతిస్పందిస్తాను?’ అని వారు తమను తాము ప్రశ్నించుకోవాలని వారికి సూచించడం ద్వారా మనం వారికి సహాయం చేయవచ్చు. ఆ తర్వాత, యెహోవా దృక్కోణంలో విషయాలను దృష్టించేలా వారికి ప్రేరణనివ్వండి.
అన్వయింపును తెలపండి
‘జ్ఞానము ముఖ్యాంశము’ అని మంచి బోధకుడికి తెలుసు. (సామె. 4:7) సమస్యలను పరిష్కరించుకోవడానికీ ప్రమాదాలను నివారించుకోవడానికీ లక్ష్యాలను సాధించడానికీ ఇతరులకు సహాయపడడానికీ పరిజ్ఞానాన్ని విజయవంతంగా అన్వయించుకునే సామర్థ్యమే జ్ఞానము. బోధకుని బాధ్యత, అలా చేయడాన్ని నేర్చుకోవడానికి విద్యార్థికి సహాయపడడమే గాని, వారి కోసం నిర్ణయాలు చేయడం మాత్రం కాదు. వివిధ బైబిలు సూత్రాలను చర్చించేటప్పుడు, విద్యార్థి తర్కించుకునేందుకు సహాయపడండి. దైనందిన జీవితంలోని ఒక పరిస్థితిని ఉదాహరణగా తీసుకొని, మీ విద్యార్థికి అలాంటి పరిస్థితే ఎదురైతే ప్రస్తుతం అధ్యయనం చేస్తున్న బైబిలు సూత్రం ఎలా సహాయపడుతుందో ఆయనను అడగండి.—హెబ్రీ. 5:14.
అపొస్తలుడైన పేతురు, సా.శ. 33, పెంతెకొస్తు రోజున ఇచ్చిన ప్రసంగంలో, లేఖనాల నిజమైన అన్వయింపుకు ఒక ఉదాహరణనిచ్చాడు. ఆ అన్వయింపు ప్రజల జీవితాలనే ప్రభావితం చేసింది. (అపొ. 2:14-36) పేతురు, జనసమూహం నమ్ముతున్నట్లు చెప్పుకుంటున్న మూడు లేఖన భాగాలను చర్చించిన తర్వాత, వారు అప్పటికే చూసిన సంఘటనల వెలుగులో వాటిని అన్వయించాడు. దాని ఫలితంగా, జనసమూహం తాము విన్న దానికి అనుగుణంగా చర్య తీసుకోవలసిన అవసరముందని గ్రహించింది. మీ బోధ కూడా ప్రజలపై అలాంటి ప్రభావమే చూపిస్తోందా? విషయాలు అలా ఎందుకున్నాయో అర్థం చేసుకోవడంలో ప్రజలకు సహాయం చేసేందుకు మీరు వాస్తవాలను మళ్ళీ మళ్ళీ కేవలం చెప్పడం కన్నా ఎక్కువే చేస్తారా? తాము నేర్చుకొంటున్న విషయాలు తమ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపాలన్నది ఆలోచించుకొనేలా మీరు వారిని ప్రోత్సహిస్తారా? “మేమేమి చేతుమని” పెంతెకొస్తు రోజున ఆ జనసమూహం అన్నట్లు వాళ్ళు బిగ్గరగా అడగకపోవచ్చు, కానీ మీరు లేఖనాలను సరిగ్గా అన్వయిస్తే, వాళ్ళు సరైన చర్యలను తీసుకోవడం గురించి ఆలోచించేలా కదిలించబడవచ్చు.—అపొ. 2:37.
తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలతో కలిసి బైబిలు చదివేటప్పుడు, బైబిలు సూత్రాలను ఆచరణాత్మకంగా ఎలా అన్వయించుకోవచ్చో ఆలోచించడానికి వారికి శిక్షణనిచ్చే చక్కని అవకాశం మీకుంది. (ఎఫె. 6:4) ఉదాహరణకు, ప్రస్తుత వారానికి పట్టిక వేయబడిన బైబిలు పఠన భాగంలోని కొన్ని వచనాలను ఎంపిక చేసుకొని, వాటి భావాన్ని చర్చించి, ‘ఇది మనకు మార్గదర్శనాన్ని ఎలా ఇస్తుంది? పరిచర్యలో మనం ఈ వచనాలను ఎలా ఉపయోగించవచ్చు? యెహోవా గురించీ ఆయన కార్య విధానం గురించీ ఇవి మనకు ఏమి వెల్లడి చేస్తున్నాయి, వెల్లడైన విషయాలు, ఆయన గురించి మనకున్న అవగాహనను ఎలా పెంచుతున్నాయి?’ వంటి ప్రశ్నలను వేయండి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో బైబిలు ఉన్నతాంశాలు చర్చించబడేటప్పుడు ఈ విషయాలపై వ్యాఖ్యానించమని మీ కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. వాళ్ళు ఏ వచనాలపై వ్యాఖ్యానిస్తారో వాటిని గుర్తుంచుకునే అవకాశం ఉంది.
మంచి మాదిరిని ఉంచండి
మీరు మీ మాటల ద్వారానే గాక క్రియల ద్వారా కూడా బోధించండి. మీ క్రియలు, మీరు చెప్పిన మాటలను ఎలా అన్వయించుకోవచ్చన్నదానికి ఆచరణాత్మక మాదిరిగా ఉంటాయి. పిల్లలు నేర్చుకునేది ఆ విధంగానే. వాళ్ళు తమ తల్లిదండ్రులను అనుకరిస్తున్నప్పుడు, తాము తమ తల్లిదండ్రుల్లా ఉండాలని కోరుకుంటున్నారన్నది అర్థమవుతుంది. తమ తల్లిదండ్రులు చేస్తున్నట్లు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని వాళ్ళు కోరుకుంటారు. అలాగే, ‘మీరు క్రీస్తును పోలి నడుచుకొంటున్న ప్రకారం’ మీరు బోధిస్తున్నవారు ‘మిమ్మల్ని పోలి నడుచుకుంటు’న్నప్పుడు యెహోవా మార్గాల్లో నడవడం వల్ల వచ్చే ఆశీర్వాదాలను వాళ్ళూ అనుభవించడం మొదలుపెడతారు. (1 కొరిం. 11:1) దేవుడు వారితో వ్యవహరించడం వారి అనుభవాల్లో భాగమవుతుంది.
ఇది, సరైన మాదిరి ఉంచవలసిన ప్రాముఖ్యత గురించి ఆలోచింపజేసే జ్ఞాపిక. ‘మనం పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారమై’ ఉంటే, మనం ఎవరికైతే బోధిస్తున్నామో వారికి బైబిలు సూత్రాలను ఆచరించడమెలాగన్నదానికి సజీవ ఉదాహరణగా ఉండేందుకు దోహదపడుతుంది. (2 పేతు. 3:11,12) దేవుని వాక్యాన్ని క్రమంగా చదవమని మీరు మీ బైబిలు విద్యార్థిని ప్రోత్సహిస్తున్నట్లయితే, అలా చదవడానికి మొదట మీరు శ్రద్ధగలవారై ఉండండి. మీ పిల్లలు బైబిలు సూత్రాలను పాటించడం నేర్చుకోవాలని మీరు కోరుకుంటే, మీ క్రియలు దేవుని చిత్తానుసారంగా ఉన్నాయని వారు గ్రహించేలా చూడండి. పరిచర్యలో అత్యధిక ఆసక్తితో ఉండాలని మీరు సంఘానికి ఉపదేశిస్తున్నట్లయితే, మీరు ఆ పనిలో సాధ్యమైనంత మేరకు భాగం వహించేలా కృషి చేయండి. మీరు బోధించిన దానిని ఆచరించినప్పుడు, మీరు ఇతరులను పురికొల్పేందుకు ఇంకాస్త మెరుగైన స్థానంలో ఉంటారు.—రోమా. 2:21-23.
మీరు మీ బోధను మెరుగుపరుచుకోవాలనే దృష్టితో ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఉపదేశించేటప్పుడు వినేవారి వైఖరుల్లో గానీ మాటల్లో గానీ క్రియల్లో గానీ మార్పు వచ్చే విధంగా ఇస్తున్నానా? విషయాలు మరింత స్పష్టంగా ఉండేందుకు, నేను ఒక తలంపుకు మరొక తలంపుకు గల తేడాను, ఒక ప్రవర్తనకు మరొక ప్రవర్తనకు గల తేడాను చూపిస్తున్నానా? నేను చెప్పిన దానిని గుర్తుంచుకునేలా నా విద్యార్థులకు, నా పిల్లలకు లేదా కూటంలో హాజరైవున్న ప్రేక్షకులకు సహాయపడడానికి నేనేమి చేస్తాను? తాము నేర్చుకొంటున్నవాటిని ఎలా అన్వయించుకోవాలన్నది నా శ్రోతలకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నానా? వాళ్ళు దానిని నా మాదిరి ద్వారా చూడగలరా? చర్చించబడుతున్న దానికి వారు చూపే ప్రతిస్పందన, వారికి యెహోవాతో గల సంబంధంపై ఎలా ప్రభావం చూపగలదో వారు గ్రహిస్తున్నారా?’ (సామె. 9:10) మీరు బోధకుడిగా మీ సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఈ విషయాలకు శ్రద్ధనివ్వండి. “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.”—1 తిమో. 4:16.