అధ్యాయం 4
“యెహోవా . . . మహాబలం గలవాడు”
1, 2. ఏలీయా తన జీవితంలో ఏ అద్భుతాలు చూశాడు? కానీ హోరేబు పర్వతం మీదున్న గుహలో ఉన్నప్పుడు ఏ అసాధారణ సంఘటనలు చూశాడు?
ఏలీయా తన జీవితంలో చాలా అద్భుతాలు చూశాడు. ప్రతీరోజు పొద్దున, సాయంత్రం కాకులు ఆయన దాక్కున్న చోటికి ఆహారం తీసుకురావడం ఆయన చూశాడు. చాలాకాలం పాటు కరువు ఉన్నా గానీ జాడీలో పిండి, బుడ్డిలో నూనె అయిపోకుండా ఉండడం చూశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగిరావడం కూడా చూశాడు. (1 రాజులు 17, 18 అధ్యాయాలు) కానీ, ఇలాంటిది మాత్రం ఏలీయా ఎప్పుడూ చూడలేదు.
2 ఏలీయా హోరేబు పర్వతం మీదున్న గుహ ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, వరుసగా కొన్ని అసాధారణ సంఘటనల్ని చూశాడు. ముందుగా, చెవులు చిల్లులు పడే శబ్దంతో గాలి హోరున వీచింది. అది ఎంత బలంగా వీచిందంటే దాని దెబ్బకి పర్వతాలు, బండలు పగిలిపోయాయి. తర్వాత, ఒక భారీ భూకంపం నేలను చీల్చుకుంటూ వచ్చింది. తర్వాత అగ్నిజ్వాలలు వచ్చాయి. అవి ఆ ప్రాంతమంతా వ్యాపిస్తున్నప్పుడు, బహుశా ఏలీయాకు ఆ వేడి సెగ తగిలి ఉంటుంది.—1 రాజులు 19:8-12.
3. ఏలీయా దేవునికున్న ఏ లక్షణానికి రుజువులు చూశాడు? ఆ రుజువుల్ని మనం ఎక్కడ చూడవచ్చు?
3 ఏలీయా చూసిన ఆ వేర్వేరు సంఘటనల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అవన్నీ యెహోవా దేవుని గొప్ప శక్తికి రుజువులుగా ఉన్నాయి. అయితే, దేవునికి శక్తి ఉందని తెలుసుకోవడానికి మనకు అద్భుతాలేమీ అవసరంలేదు. అది మన కళ్ల ముందే ఉంది. యెహోవాకున్న “శాశ్వత శక్తి, దైవత్వం” సృష్టిలో కనిపిస్తున్నాయని బైబిలు చెప్తుంది. (రోమీయులు 1:20) కళ్లు చెదిరే మెరుపుల్ని, దడ పుట్టించే ఉరుముల గర్జనను, ఎత్తు నుండి కిందకి దూకే పెద్ద జలపాతాన్ని, అంచులులేని ఆకాశంలో ఆరబోసినట్లు ఉండే తారల్ని ఒకసారి ఊహించుకోండి! వాటిలో మీకు దేవుని శక్తి కనిపించట్లేదా? కానీ, ఈరోజుల్లో కొంతమందే దేవుని శక్తిని గుర్తిస్తున్నారు. అందులో కూడా చాలా కొద్దిమందే దాన్ని సరైన దృష్టితో చూస్తున్నారు. యెహోవాకున్న ఈ లక్షణాన్ని, అంటే శక్తిని పరిశీలిస్తే మనం ఆయనకు ఇంకాఇంకా దగ్గరౌతాం. ఈ సెక్షన్‌లో, యెహోవాకున్న సాటిలేని శక్తి గురించి వివరంగా చూస్తాం.
“ఇదిగో! యెహోవా ఏలీయా పక్కనుండి వెళ్లాడు”
యెహోవాకున్న ఒక ముఖ్యమైన లక్షణం
4, 5. (ఎ) యెహోవా పేరును బైబిలు ఎలా వర్ణిస్తుంది? (బి) యెహోవా తన శక్తికి గుర్తుగా ఎద్దును ఉపయోగించడం ఎందుకు సరైనది?
4 ఈ విశ్వంలో యెహోవాకన్నా శక్తిమంతులు ఇంకెవ్వరూ లేరు. యిర్మీయా 10:6 ఇలా చెప్తుంది: “యెహోవా, నీలాంటివాళ్లు ఎవ్వరూ లేరు. నువ్వు గొప్పవాడివి, నీ పేరు గొప్పది, బలమైనది.” గమనించండి, ఇక్కడ యెహోవా పేరు గొప్పది, బలమైనది లేదా శక్తివంతమైనది అని బైబిలు వర్ణిస్తుంది. ఆయన పేరుకు బహుశా “ఆయన అయ్యేలా (జరిగేలా) చేస్తాడు” అనే అర్థం ఉందని చూశాం కదా. ఆయన ఏది కావాలనుకుంటే అది సృష్టించేలా, ఎలా కావాలనుకుంటే అలా మారేలా ఆయనకు ఏది సహాయం చేస్తుంది? ఒకటి, ఆయన శక్తి. అవును, యెహోవా ఏది అనుకుంటే అది చేయగలడు, ఆయన శక్తికి హద్దులు లేవు. ఆయనకున్న ముఖ్యమైన లక్షణాల్లో అదొకటి.
5 మనం యెహోవాకున్న శక్తిని ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం. అందుకే, మనకు అర్థం కావడానికి యెహోవా కొన్ని ఉదాహరణలు ఉపయోగిస్తున్నాడు. మనం ముందటి అధ్యాయంలో చూసినట్లుగా, ఆయన తన శక్తికి గుర్తుగా ఎద్దును ఉపయోగించాడు. (యెహెజ్కేలు 1:4-10) అది సరైనదే. ఎందుకంటే, ఇళ్లల్లో పెంచుకునే ఎద్దు సైతం భారీగా, బలంగా ఉంటుంది. అప్పట్లో పాలస్తీనా ప్రజలు అంతకన్నా బలమైన జంతువును చూసి ఉండరు. అయితే వాళ్లు అడవిఎద్దు గురించి వినేవుంటారు, అది ఇంకా భయంకరంగా ఉండేది. ఇప్పుడైతే అక్కడ అది అంతరించిపోయింది. (యోబు 39:9-12) ఈ ఎద్దులు దగ్గరదగ్గర ఏనుగు అంత సైజులో ఉంటాయని, “వాటి బలానికి గానీ, వేగానికి గానీ తిరుగులేదు” అని రోమా పరిపాలకుడైన జూలియస్ సీజర్ రాశాడు. అలాంటి ఒక జీవి ముందు నిలబడి ఉన్నప్పుడు మీరు ఎంత చిన్నగా, బలహీనంగా కనిపిస్తారో ఆలోచించండి!
6. యెహోవా మాత్రమే “సర్వశక్తిమంతుడు” అని ఎందుకు చెప్పవచ్చు?
6 అదేవిధంగా, శక్తిమంతుడైన యెహోవా ముందు మనం చాలా చిన్నగా, బలహీనంగా ఉంటాం. ఆయనకు, పెద్దపెద్ద దేశాలు సైతం త్రాసు మీద ఉండే దుమ్ముతో సమానం. (యెషయా 40:15) వేరే ఏ ప్రాణి కన్నా యెహోవాకు అపరిమితమైన శక్తి ఉంది. ఎందుకంటే, బైబిలు ఆయన్ని మాత్రమే “సర్వశక్తిమంతుడు” అని పిలుస్తుంది.a (ప్రకటన 15:3) యెహోవాకు “అపారమైన శక్తి, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే బలం” ఉన్నాయి. (యెషయా 40:26) ఆయనే శక్తికి మూలం. ఆయన దగ్గర శక్తి పుష్కలంగా ఉంటుంది, అది ఎప్పుడూ అయిపోదు. ఆయన బలం కోసం వేరే దేనిమీదా ఆధారపడడు, ఎందుకంటే “బలం దేవునికే చెందుతుంది.” (కీర్తన 62:11) ఇంతకీ యెహోవా దేని ద్వారా తన శక్తిని ఉపయోగిస్తాడు?
యెహోవా తన శక్తిని ఎలా ఉపయోగిస్తాడు?
7. పవిత్రశక్తి అంటే ఏంటి? దానికోసం బైబిల్లో ఉపయోగించిన హీబ్రూ, గ్రీకు పదాల నుండి మనం ఏం అర్థం చేసుకోవచ్చు?
7 పవిత్రశక్తి యెహోవా నుండి ఎంతంటే అంత, ఎప్పుడూ ఉబుకుతూ ఉంటుంది. అది పని చేస్తున్న దేవుని శక్తి. నిజానికి, ఆదికాండం 1:2 దాన్ని “దేవుని చురుకైన శక్తి” అని పిలుస్తుంది. “పవిత్రశక్తి” కోసం బైబిల్లో ఉపయోగించిన హీబ్రూ, గ్రీకు పదాల్ని వేరే సందర్భాల్లో “గాలి,” “ఊపిరి,” “వేగంగా వచ్చిన గాలి” అని అనువదించవచ్చు. కొంతమంది పండితులు చెప్తున్నట్టు, ఆ పదాలు పనిలో ఉన్న ఒక అదృశ్య శక్తిని చూపిస్తున్నాయి. గాలిని మనం ఎలాగైతే చూడలేమో అలాగే పవిత్రశక్తిని కూడా చూడలేం. కానీ దాని ఫలితాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి.
8. బైబిల్లో పవిత్రశక్తిని దేనితో పోల్చారు? అలా పోల్చడం ఎందుకు సరైనది?
8 యెహోవా అనుకున్నది చేయడానికి పవిత్రశక్తిని ఎలా కావాలంటే అలా ఉపయోగించగలడు. అందుకే బైబిలు పవిత్రశక్తిని దేవుని “వేలితో,” “బలమైన చేతితో,” లేదా “చాచిన బాహువుతో” పోలుస్తుంది. అది సరైనదే. (లూకా 11:20; ద్వితీయోపదేశకాండం 5:15; కీర్తన 8:3) ఎందుకంటే, మనం చేతుల్ని ఉపయోగించి రకరకాల పనులు చేస్తుంటాం. కొన్ని పనులకు బలం ఉపయోగించాలి, కొన్నిటికి నైపుణ్యం ఉపయోగించాలి. పనికి తగ్గట్టు, ఎలా కావాలంటే అలా మన చేతుల్ని వాడతాం. అలాగే దేవుడు కూడా, తను అనుకున్నది చేయడానికి ఎలా కావాలంటే అలా తన పవిత్రశక్తిని ఉపయోగించగలడు. అంటే అతిచిన్న పరమాణువును (atom) సృష్టించడానికైనా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికైనా, లేదా మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు భాషలు మాట్లాడే సామర్థ్యాన్ని ఇవ్వడానికైనా, ఇలా దేనికైనా ఆయన పవిత్రశక్తిని ఉపయోగించగలడు.
9. యెహోవా తన శక్తిని ఉపయోగించే ఇంకో విధానం ఏంటి?
9 యెహోవా విశ్వ సర్వాధిపతి. ఈ విశ్వాన్ని ఏలే విధానంలో కూడా ఆయన శక్తి కనిపిస్తుంది. మీరు చిటికేస్తే, మీ కోసం పనిచేసే బుద్ధి, బలం ఉన్న కోటానుకోట్ల సేవకులు మీకు ఉన్నారా? యెహోవాకు అలా ఉన్నారు. మనుషుల్లో ఆయనకు సేవకులు ఉన్నారు, బైబిలు వాళ్లను తరచూ ఒక సైన్యంతో పోలుస్తుంది. (కీర్తన 68:11; 110:3) అయితే, మనిషి కన్నా బలమైన సేవకులు యెహోవాకు ఉన్నారు, వాళ్లే దేవదూతలు. ఉదాహరణకు, అష్షూరీయులు ఒకసారి దేవుని ప్రజల మీద దాడి చేసినప్పుడు, ఒక దేవదూత ఒక్క రాత్రిలోనే 1,85,000 మంది శత్రు సైనికుల్ని చంపేశాడు! (2 రాజులు 19:35) నిజంగానే దేవదూతలు “శక్తిమంతులు.”—కీర్తన 103:19, 20.
10. (ఎ) బైబిలు యెహోవాను సైన్యాలకు అధిపతి అని ఎందుకు పిలుస్తుంది? (బి) యెహోవా చేసిన సృష్టి మొత్తంలో ఎవరికి ఎక్కువ శక్తి ఉంది?
10 మొత్తం ఎంతమంది దేవదూతలు ఉన్నారు? దానియేలు ప్రవక్త ఒక దర్శనంలో, యెహోవా సింహాసనం ముందు 10 కోట్ల కన్నా ఎక్కువమంది దేవదూతలు నిలబడి ఉండడం చూశాడు. అయితే ఆయన దేవదూతలందర్నీ చూశానని చెప్పట్లేదు. (దానియేలు 7:10) కాబట్టి, ఎన్నో వందల కోట్లమంది దేవదూతలు ఉండి ఉంటారు. అందుకే బైబిలు యెహోవాను సైన్యాలకు అధిపతి అని పిలుస్తుంది. ఇంతమంది శక్తిమంతులైన దూతల్ని శాసిస్తూ, క్రమపద్ధతిలో నడిపించే సైన్యాధిపతిగా యెహోవాకున్న ఉన్నతమైన స్థానాన్ని ఆ బిరుదు గుర్తుచేస్తుంది. యెహోవా, ‘మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడైన’ తన ప్రియ కుమారుణ్ణి ఈ దేవదూతలందరి మీద అధికారిగా నియమించాడు. (కొలొస్సయులు 1:15) ప్రధానదూతైన యేసు దేవదూతలందరి మీద, సెరాపుల మీద, కెరూబుల మీద అధికారి. ఆయన యెహోవా చేసిన సృష్టి మొత్తంలో ఎక్కువ శక్తి గలవాడు.
11, 12. (ఎ) దేవుని వాక్యం ఎలా శక్తివంతంగా పనిచేస్తుంది? (బి) యెహోవాకు ఎంత శక్తి ఉందని యేసు చెప్పాడు?
11 యెహోవా ఇంకో విధంగా కూడా తన శక్తిని చూపిస్తాడు. హెబ్రీయులు 4:12, అధస్సూచి ఇలా చెప్తుంది: “దేవుని వాక్యం సజీవమైనది, శక్తివంతంగా పనిచేస్తుంది.” దేవుడు ప్రేరేపించి రాయించిన వాక్యానికి, అంటే బైబిలుకు ఎంత గొప్ప శక్తి ఉందో మీరు రుచి చూశారా? అది మనల్ని బలపరుస్తుంది, మన విశ్వాసాన్ని పెంచుతుంది, మన వ్యక్తిత్వాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి సహాయం చేస్తుంది. ఘోరంగా దిగజారిపోయిన వాళ్లకు దూరంగా ఉండమని అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవుల్ని హెచ్చరించాడు. అయితే ఆయన ఈ మాట కూడా అన్నాడు: “మీలో కొందరు ఒకప్పుడు అలాంటివాళ్లే.” (1 కొరింథీయులు 6:9-11) అవును, “దేవుని వాక్యం” వాళ్లమీద శక్తివంతంగా పనిచేసి వాళ్ల జీవితాన్ని మార్చేసింది.
12 యెహోవాకు ఎంత అపారమైన శక్తి ఉందంటే, ఆయన దాన్ని ఎంత నైపుణ్యంగా ఉపయోగిస్తాడంటే, ఏదీ ఆయన్ని ఆపలేదు. “దేవునికి అన్నీ సాధ్యమే” అని యేసు అన్నాడు. (మత్తయి 19:26) ఇంతకీ యెహోవా తన శక్తిని ఉపయోగించి చేసే కొన్ని పనులు ఏంటి?
యెహోవా ఒక ఉద్దేశంతో తన శక్తిని ఉపయోగిస్తాడు
13, 14. (ఎ) యెహోవా ఏ ఫీలింగ్స్ లేకుండా, శక్తిని మాత్రమే పుట్టించే ఒక యంత్రం కాదని ఎలా చెప్పవచ్చు? (బి) యెహోవా తన శక్తిని ఏయే విధాలుగా వాడతాడు?
13 యెహోవా పవిత్రశక్తి, ఈ విశ్వంలో ఉన్న ఏ శక్తి కన్నా చాలా గొప్పది. అయితే, యెహోవా ఏ ఫీలింగ్స్ లేకుండా శక్తిని మాత్రమే పుట్టించే యంత్రం కాదు. ఆయనకు ఫీలింగ్స్ ఉన్నాయి. పైగా, ఆయనకున్న శక్తి ఎప్పుడూ ఆయన అదుపులోనే ఉంటుంది. ఇంతకీ, దేన్నిబట్టి ఆయన శక్తిని ఉపయోగిస్తాడు?
14 మనం ఈ సెక్షన్‌లో చూడబోతున్నట్టు, దేవుడు తన శక్తిని సృష్టించడానికి, నాశనం చేయడానికి, కాపాడడానికి, చక్కదిద్దడానికి ఉపయోగిస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, తన పరిపూర్ణ సంకల్పాల్ని నెరవేర్చడానికి ఎలా కావాలంటే అలా తన శక్తిని వాడతాడు. (యెషయా 46:10) ఆయన ఎలాంటివాడు, మన నుండి ఏం కోరుతున్నాడు లాంటి ముఖ్యమైన విషయాల్ని చెప్పడానికి యెహోవా కొన్నిసార్లు తన శక్తిని ఉపయోగిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆ శక్తిని వాడతాడు. అదేంటంటే, మెస్సీయ రాజ్యం ద్వారా తన పేరును పవిత్రపర్చుకొని, తన పరిపాలనా విధానమే సరైనదని నిరూపించడం. అది జరగకుండా ఏదీ అడ్డుకోలేదు.
15. యెహోవా తన సేవకుల కోసం శక్తిని ఎలా ఉపయోగిస్తాడు? ఆయన ఏలీయా విషయంలో దాన్ని ఎలా చూపించాడు?
15 యెహోవా మనలో ఒక్కొక్కరికి సహాయం చేయడానికి కూడా తన శక్తిని ఉపయోగిస్తాడు. 2 దినవృత్తాంతాలు 16:9 ఏం చెప్తుందో గమనించండి: “ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా ఉంటుందో వాళ్ల తరఫున తన బలం చూపించడానికి యెహోవా కళ్లు భూమంతటా సంచరిస్తూ ఉన్నాయి.” దానికి, ఈ అధ్యాయం మొదట్లో చూసిన ఏలీయా ఉదాహరణ చక్కగా సరిపోతుంది. యెహోవా ఏలీయాకు సంభ్రమాశ్చర్యాలు పుట్టించే రీతిలో తన శక్తిని ఎందుకు చూపించాడు? ఎందుకంటే, చెడ్డ రాణి అయిన యెజెబెలు ఏలీయాను చంపేస్తానని శపథం చేసింది. దాంతో ఏలీయా ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. ఆయన ఒంటరివాడిని అయిపోయాను అనుకున్నాడు, బెదిరిపోయాడు, ఇక తన కష్టమంతా వృథా అయిపోయింది అనుకుని నిరుత్సాహపడ్డాడు. బాధతో కుమిలిపోతున్న ఏలీయాను ఓదార్చడానికి యెహోవా అద్భుతరీతిలో తన శక్తిని గుర్తుచేశాడు. అప్పుడు వచ్చిన గాలి, భూకంపం, అగ్ని ఈ విశ్వంలోనే అత్యంత శక్తిమంతుడు ఏలీయాతో ఉన్నాడని గుర్తుచేశాయి. సర్వశక్తిగల దేవుడే తన పక్కన ఉన్నప్పుడు, ఏలీయా ఇంక యెజెబెలుకు ఎందుకు భయపడాలి?—1 రాజులు 19:1-12.b
16. యెహోవాకున్న గొప్ప శక్తి గురించి ఆలోచిస్తే మనకు ఎందుకు ధైర్యంగా ఉంటుంది?
16 యెహోవా ఏలీయా కాలంలో లాగే ఇప్పుడు అద్భుతాలు చేయకపోయినా, ఆయనైతే మారలేదు. (1 కొరింథీయులు 13:8) తనను ప్రేమించేవాళ్ల కోసం తన శక్తిని వాడడానికి ఆయన అప్పుడు ఎంత తపించాడో, ఇప్పుడూ అంతే తపిస్తున్నాడు. నిజమే, ఆయన చాలా ఎత్తులో అంటే పరలోకంలో ఉంటాడు. కానీ ఆయన మనకు దూరంగా ఉండడు. ఆయనకు అంతులేని శక్తి ఉంది కాబట్టి, దూరం అనేది పెద్ద విషయమేం కాదు. పైగా “తనకు మొరపెట్టే వాళ్లందరికీ యెహోవా దగ్గరగా ఉన్నాడు” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 145:18) ఒకసారి దానియేలు ప్రవక్త సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తున్నప్పుడు, ఇంకా కళ్లు తెరవకముందే ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు! (దానియేలు 9:20-23) యెహోవా ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్లకు సహాయం చేయకుండా, వాళ్లను బలపర్చకుండా ఏదీ ఆయన్ని ఆపలేదు.—కీర్తన 118:6.
అంత శక్తి ఉన్న దేవునికి భయపడి మనం దూరం జరగాలా?
17. యెహోవాకున్న శక్తి మనలో ఎలాంటి భయాన్ని పుట్టిస్తుంది? ఎలాంటి భయాన్ని పుట్టించదు?
17 దేవుడు అంత శక్తిమంతుడు కాబట్టి మనం ఆయనకు భయపడాలా? దానికి అవును అని చెప్పవచ్చు, కాదు అని కూడా చెప్పవచ్చు. అవును అని ఎందుకు చెప్పవచ్చంటే, ఈ లక్షణం మనలో దైవభయాన్ని పుట్టిస్తుంది. దైవభయం అంటే దేవుని మీద ఉండే ప్రగాఢమైన భక్తి, గౌరవం అని ముందటి అధ్యాయంలో చూశాం. అలాంటి భయం “తెలివికి ఆరంభం” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 111:10) మరి, కాదు అని ఎందుకు చెప్పవచ్చంటే, దేవుడు శక్తిమంతుడైన మాత్రాన మనం ఆయన్ని చూసి గజగజ వణికిపోవాల్సిన అవసరం లేదు. అలాగే, ఆయన నుండి దూరం జరిగిపోవాల్సిన అవసరం లేదు.
18. (ఎ) అధికారంలో ఉన్నవాళ్లను చాలామంది ఎందుకు నమ్మరు? (బి) ఎంత అధికారం ఉన్నా, యెహోవా అవినీతి జోలికి వెళ్లడని ఎలా చెప్పవచ్చు?
18 “అధికారంలో ఉన్నవాళ్లు అవినీతిగా మారే అవకాశం ఉంది; ఎంత ఎక్కువ అధికారం ఉంటే, ఆ అవకాశం అంత ఎక్కువ ఉంటుంది” అని 1887 లో లార్డ్ యాక్టన్ అనే ఇంగ్లీషు రచయిత రాశాడు. ఆ మాటల్ని జనం పదేపదే తలుచుకుంటూ ఉంటారు, ఎందుకంటే అది అక్షరాలా నిజం. చాలావరకు, అపరిపూర్ణ మనుషులు అధికారాన్ని తప్పుగా ఉపయోగిస్తారు. చరిత్ర చాలాసార్లు దాన్ని రుజువు చేసింది. (ప్రసంగి 4:1; 8:9) అందుకే చాలామంది అధికారంలో ఉన్నవాళ్లను నమ్మలేక, వాళ్ల నుండి దూరం జరిగిపోతారు. యెహోవాకు పూర్తి అధికారం ఉందని మనం చూశాం. మరి దాన్ని చూసుకుని ఆయన అవినీతిగా మారాడా? లేదు! ముందటి అధ్యాయాల్లో చూసినట్టు, ఆయన పవిత్రుడు, ఆయనలో అవినీతిగా మారే అవకాశం రవ్వంత కూడా లేదు. యెహోవా ఈ అవినీతి లోకంలోని అధికారమున్న స్త్రీ పురుషుల్లా కాదు. ఆయన ఎప్పుడూ తన అధికారాన్ని తప్పుగా ఉపయోగించలేదు, ఉపయోగించడు కూడా.
19, 20. (ఎ) యెహోవా ఒకవైపు శక్తిని ఉపయోగిస్తూనే, ఇంకా ఏ లక్షణాల్ని కూడా కలిపి చూపిస్తాడు? అది ఎందుకు మనకు భరోసాను ఇస్తుంది? (బి) యెహోవాకున్న నిగ్రహాన్ని ఏ ఉదాహరణతో చెప్పవచ్చు? అది మీకు ఎందుకు నచ్చింది?
19 గుర్తుంచుకోండి, యెహోవాకున్న లక్షణం శక్తి ఒక్కటే కాదు. ఇంకా మనం ఆయన న్యాయం, తెలివి, ప్రేమ గురించి చూడాలి. యెహోవా ఏదో యాంత్రికంగా, ఒక్క సందర్భానికి ఒక్క లక్షణాన్నే చూపించే వ్యక్తి కాదు. బదులుగా, తర్వాతి అధ్యాయంలో మనం చూడబోతున్నట్లు, యెహోవా ఎప్పుడూ శక్తితో పాటు న్యాయాన్ని, తెలివిని, ప్రేమను కూడా కలిపి చూపిస్తాడు. దేవునికున్న ఇంకో లక్షణం గురించి ఆలోచించండి. అది ఇప్పుడున్న నాయకుల్లో భూతద్దం పెట్టి వెతకాల్సిందే. అదే నిగ్రహం.
20 బాగా కండలు తిరిగి, భారీగా ఉన్న వ్యక్తిని మీరు కలిసినట్టు ఊహించుకోండి. ఆయన ముందు మీకు కాస్త భయంగా అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా, ఆయన సౌమ్యుడని మీకు అర్థమైంది. అంతేకాదు ప్రజల్ని, మరిముఖ్యంగా దిక్కులేనివాళ్లను, బలహీనుల్ని కాపాడడానికి, సహాయం చేయడానికి తన శక్తిని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలా అని ఆయన ఎదురుచూస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ తన శక్తిని తప్పుగా ఉపయోగించడు. అలాంటి ఆయన మీద లేనిపోని నిందలు వేసినా ఆయన స్థిరంగా, ప్రశాంతంగా, దయగా ఉన్నాడు. అంత శక్తి ఉన్న వ్యక్తి అంత సౌమ్యంగా, అన్నీ అణచుకొని ఉండడం మీకు ఆశ్చర్యంగా అనిపించడం లేదా! అలాంటి వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు తనకు దగ్గరవ్వాలని మీకు అనిపించదా? సర్వశక్తిమంతుడైన యెహోవాకు దగ్గరవ్వడానికి అంతకన్నా మంచి కారణం ఉంది. ఈ అధ్యాయం అంశం గమనించారా, “యెహోవా . . . మహాబలం గలవాడు.” అయితే, దాని ముందున్న మాట గమనించండి: “యెహోవా కోప్పడే విషయంలో నిదానిస్తాడు.” (నహూము 1:3, అధస్సూచి) ప్రజల మీద, ఆఖరికి చెడ్డవాళ్ల మీద తన శక్తిని ఉపయోగించడానికి యెహోవా ఎప్పుడూ తొందరపడడు. ఆయన సౌమ్యుడు, దయగలవాడు. ఎంత రెచ్చగొట్టినా గానీ ఆయన “కోప్పడే విషయంలో నిదానిస్తాడు” అని ఇప్పటికే చాలాసార్లు రుజువు చేశాడు.—కీర్తన 78:37-41.
21. యెహోవా తనకు నచ్చింది చేసేలా ప్రజల్ని ఎందుకు బలవంతపెట్టడు? దాన్నుండి మనం ఆయన గురించి ఏం నేర్చుకోవచ్చు?
21 యెహోవాకున్న నిగ్రహాన్ని ఇంకో కోణం నుండి చూడండి. మీకు అంతులేని శక్తి ఉంది అనుకోండి, కొన్నిసార్లు మీకు నచ్చిన పనిని వేరేవాళ్లతో చేయించుకోవాలని అనిపిస్తుంది కదా? కానీ యెహోవాకు అంత శక్తి ఉన్నా, తన సేవ చేయమని ప్రజల్ని బలవంతపెట్టడు. శాశ్వత జీవితం సంపాదించడానికి దేవుని సేవ ఒక్కటే మార్గం, అయినా యెహోవా ఎప్పుడూ దాన్ని చేయమని మనల్ని బలవంతపెట్టడు. బదులుగా, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇవ్వడం ద్వారా ఆయన దయ చూపిస్తున్నాడు, మనల్ని గౌరవిస్తున్నాడు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే వచ్చే నష్టాలేంటో, మంచి నిర్ణయం తీసుకుంటే వచ్చే లాభాలేంటో చెప్తున్నాడు తప్ప, నిర్ణయాల్ని మాత్రం మన చేతుల్లోనే వదిలేశాడు. (ద్వితీయోపదేశకాండం 30:19, 20) బలవంతంగా గానీ, ఆయనకున్న గొప్ప శక్తిని చూసి గజగజ వణికిపోయి గానీ సేవచేస్తే యెహోవాకు నచ్చదు. తన మీద ప్రేమతో మనసారా తనను సేవిస్తే ఆయనకు ఇష్టం.—2 కొరింథీయులు 9:7.
22, 23. (ఎ) వేరేవాళ్లకు బలాన్ని ఇవ్వడమంటే యెహోవాకు చాలా ఇష్టమని ఎందుకు చెప్పవచ్చు? (బి) తర్వాతి అధ్యాయంలో ఏం చూస్తాం?
22 సర్వశక్తిగల యెహోవాకు మనం ఎందుకు భయపడాల్సిన అవసరం లేదో చివరి కారణాన్ని ఇప్పుడు చూద్దాం. అధికారంలో ఉన్నవాళ్లు వేరేవాళ్లతో అధికారాన్ని పంచుకోవాలంటే భయపడతారు. కానీ యెహోవా మాత్రం తన నమ్మకమైన ఆరాధకులకు శక్తిని ఇవ్వడానికి సంతోషిస్తాడు. ఆయన యేసుకు, ఇతరులకు కొంత అధికారాన్ని ఇచ్చాడు. (మత్తయి 28:18) ఆయన ఇంకో విధంగా కూడా తన సేవకులకు శక్తిని ఇస్తాడు. దాని గురించి బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా, గొప్పతనం, బలం, తేజస్సు, వైభవం, ఘనత నీకే చెందుతాయి. ఎందుకంటే ఆకాశంలో, భూమ్మీద ఉన్న ప్రతీది నీదే. . . . శక్తి, బలం నీ చేతిలో ఉన్నాయి, నీ చెయ్యి ఎవరినైనా గొప్ప చేయగలదు, అందరికీ బలాన్ని ఇవ్వగలదు.”—1 దినవృత్తాంతాలు 29:11, 12.
23 అవును, మీకు బలాన్ని ఇవ్వడమంటే యెహోవాకు చాలా ఇష్టం. తనను సేవించాలనుకునే వాళ్లకు ఆయన “అసాధారణ శక్తి” కూడా ఇస్తాడు. (2 కొరింథీయులు 4:7) తన శక్తిని అంత ప్రేమగా, దయగా ఉపయోగించే శక్తిమంతుడైన దేవునికి దగ్గరవ్వాలని మీకు అనిపించట్లేదా? యెహోవా సృష్టిని చేయడానికి తన శక్తిని ఎలా ఉపయోగించాడో తర్వాతి అధ్యాయంలో చూస్తాం.
a “సర్వశక్తిమంతుడు” అని అనువదించిన గ్రీకు పదానికి, “అన్నిటిమీద రాజు; ఏదైనా చేసే శక్తి ఉన్నవాడు” అని అర్థం.
b “యెహోవా ఆ గాలిలో లేడు . . . , ఆ భూకంపంలో లేడు . . . , ఆ అగ్నిలో కూడా లేడు” అని బైబిలు చెప్తుంది. కొంతమంది గాలి దేవుడు, అగ్ని దేవుడు, వాన దేవుడు అంటూ ప్రకృతిని పూజిస్తుంటారు. కానీ యెహోవా సేవకులు మాత్రం ఆ ప్రకృతిలో యెహోవా కోసం చూడరు. ఎందుకంటే ఆయన సృష్టించిన దేంట్లోనూ ఆయన సరిపోడు. వాటన్నిటికన్నా యెహోవా చాలా ఉన్నతమైనవాడు.—1 రాజులు 8:27.