అధ్యాయం 10
శక్తిని ఉపయోగించే విషయంలో దేవుణ్ణి “అనుకరించండి”
1. అపరిపూర్ణ మనుషులు ఏ వలలో ఈజీగా చిక్కుకుంటారు?
“ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ల చుట్టూ ఆపద పొంచి ఉంటుంది” అని 19వ శతాబ్దం నాటి కవయిత్రి ఒక చేదు నిజాన్ని చెప్పింది. ఆమె చెప్పిన ఆపద ఏంటంటే, అధికారాన్ని తప్పుగా ఉపయోగించడం. బాధాకరంగా, అపరిపూర్ణ మనుషులందరూ ఆ వలలో తేలిగ్గా చిక్కుకుంటారు. చరిత్రను తిరగేస్తే, ‘మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకోవడం’ మనం చూడవచ్చు. (ప్రసంగి 8:9) కొంతమంది తమ అధికారాన్ని ప్రేమ లేకుండా ఉపయోగించడం వల్ల, మనుషులు చెప్పలేనన్ని బాధలు పడ్డారు.
2, 3. (ఎ) శక్తిని ఉపయోగించే విషయంలో మనుషులకు, యెహోవాకు ఉన్న తేడా ఏంటి? (బి) మన శక్తిలో ఏమేం ఉన్నాయి? మనం వాటిని ఎలా ఉపయోగించాలి?
2 కానీ, అంతులేని శక్తి ఉన్న యెహోవా దేవుడు, తన శక్తిని ఎప్పుడూ తప్పుగా ఉపయోగించడు అని తెలుసుకోవడం ఆశ్చర్యంగా లేదా? మనం ముందటి అధ్యాయాల్లో చూసినట్టు, యెహోవా తన శక్తిని, అంటే అది సృష్టించే శక్తి అయినా, నాశనం చేసే శక్తి అయినా, కాపాడే శక్తి అయినా, చక్కదిద్దే శక్తి అయినా, ఇంకేదైనా ఆయన ప్రేమగానే ఉపయోగిస్తాడు. ఆయన తన శక్తిని ఎలా ఉపయోగిస్తాడో ఆలోచించినప్పుడు, ఆయనకు దగ్గరవ్వకుండా ఉండలేం. అలాగే, శక్తిని ఉపయోగించే విషయంలో ‘ఆయన్ని అనుకరించాలి’ అనిపిస్తుంది. (ఎఫెసీయులు 5:1) ఇంతకీ మట్టి మనుషులైన మనకు ఏ శక్తి ఉంది?
3 దేవుడు మనల్ని “తన స్వరూపంలో,” తన పోలికలో సృష్టించాడని గుర్తుంచుకోండి. (ఆదికాండం 1:26, 27) కాబట్టి ఆయనంత కాకపోయినా, మనకు కూడా కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తిలో ఏమేం ఉండవచ్చంటే: పనులు చేసే సామర్థ్యం, కండ బలం, వేరేవాళ్ల మీద అధికారం, చుట్టూవున్న వాళ్లను మరిముఖ్యంగా మనల్ని ఇష్టపడేవాళ్లను కదిలింపజేసే శక్తి, లేదా ఆస్తిపాస్తులు. యెహోవా గురించి కీర్తనకర్త ఇలా అన్నాడు: “నీ దగ్గర జీవపు ఊట ఉంది.” (కీర్తన 36:9) కాబట్టి మనకున్న ఏ శక్తి అయినా, అది యెహోవా ఇచ్చిందే లేదా ఆయన అనుమతించడం వల్ల వచ్చిందే. అందుకే, మనం ఆయన్ని సంతోషపెట్టే విధంగా దాన్ని ఉపయోగించాలనుకుంటాం. దాన్ని ఎలా చేయవచ్చు?
కిటుకంతా ప్రేమలోనే ఉంది
4, 5. (ఎ) శక్తిని సరిగ్గా ఉపయోగించడానికి కిటుకు ఏంటి? దేవుడు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు? (బి) ప్రేమ ఉంటే మనం శక్తిని ఎలా ఉపయోగిస్తాం?
4 మనం శక్తిని సరిగ్గా ఉపయోగించాలంటే, కిటుకంతా ప్రేమలోనే ఉంది. దేవుని ఉదాహరణే తీసుకోండి. మనం 1వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నామో గుర్తుందా? అక్కడ మనం దేవునికున్న నాలుగు ముఖ్యమైన లక్షణాల గురించి చూశాం. అవేంటంటే శక్తి, న్యాయం, తెలివి, ప్రేమ. ఆ నాలుగిటిలో ఏది ఎక్కువ ముఖ్యమైనది? ప్రేమ. “దేవుడు ప్రేమ” అని 1 యోహాను 4:8 చెప్తుంది. అవును, యెహోవాలో అణువణువూ ఉండేది ప్రేమే. ఆయన ఏది చేసినా ప్రేమతోనే చేస్తాడు. కాబట్టి ఆయన ఎప్పుడు శక్తిని ఉపయోగించినా, దాని వెనక ఉండేది ప్రేమే. అంతేకాదు, ఆయన ఏం చేసినా తనను ప్రేమించేవాళ్ల మంచి కోసమే చేస్తాడు.
5 శక్తిని సరిగ్గా ఉపయోగించడానికి, మనకు కూడా ప్రేమే సహాయం చేస్తుంది. ఉదాహరణకు, ప్రేమ “దయ చూపిస్తుంది . . . సొంత ప్రయోజనం మాత్రమే చూసుకోదు” అని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 13:4, 5) కాబట్టి మనకు ప్రేమ ఉంటే, మనకు ఎవరి మీదైతే కొంత అధికారం ఉంటుందో వాళ్లతో దురుసుగా, కఠినంగా ఉండం. బదులుగా, ఎదుటివాళ్లను గౌరవిస్తాం. అలాగే మనకేం కావాలి, మనకెలా అనిపిస్తుంది అనేవాటి కన్నా వాళ్లకేం కావాలి, వాళ్లకెలా అనిపిస్తుంది అనే ఎక్కువగా ఆలోచిస్తాం.—ఫిలిప్పీయులు 2:3, 4.
6, 7. (ఎ) దైవభయం అంటే ఏంటి? అధికారాన్ని తప్పుగా ఉపయోగించకుండా ఉండేలా అది మనల్ని ఎలా ఆపుతుంది? (బి) దేవునికి భయపడడానికి, ఆయన్ని ప్రేమించడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఒక ఉదాహరణతో చెప్పండి.
6 ప్రేమతో ముడిపడి ఉన్న ఇంకో లక్షణం, దైవభయం. అధికారాన్ని లేదా శక్తిని తప్పుగా ఉపయోగించకుండా ఉండేలా అది మనల్ని ఆపుతుంది. ఆ లక్షణం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? సామెతలు 16:6 ఇలా చెప్తుంది: “యెహోవాకు భయపడడం వల్ల ఒక వ్యక్తి చెడు నుండి దూరంగా వెళ్తాడు.” మనం అలా దూరంగా ఉండాల్సిన చెడు పనుల్లో ఒకటి, అధికారాన్ని తప్పుగా ఉపయోగించడం. దైవభయం ఉంటే, మనకు ఎవరి మీదైతే అధికారం ఉందో వాళ్లతో కఠినంగా ఉండం. ఎందుకు? ఒక కారణం ఏంటంటే, మనం వాళ్లతో అలా ప్రవర్తిస్తే, తర్వాత దేవునికి లెక్క అప్పచెప్పాలని మనకు తెలుసు. (నెహెమ్యా 5:1-7, 15) అయితే, దైవభయం అంటే ఊరికే భయపడడం కాదు. బైబిల్లో “దైవభయం” అని అనువదించిన పదాలకు ప్రగాఢ గౌరవం, భక్తి అనే అర్థాలు ఉన్నాయి. అందుకే బైబిలు దైవభయాన్ని, దేవుణ్ణి ప్రేమించడంతో ముడిపెడుతుంది. (ద్వితీయోపదేశకాండం 10:12, 13) కాబట్టి, దైవభయం అంటే ఆయనేదో శిక్షిస్తాడని గజగజ వణికిపోవడం కాదుగానీ, ఆయన మీద నిజమైన ప్రేమతో ఆయన్ని బాధపెట్టే పనేదీ చేయకపోవడం.
7 ఉదాహరణకు ఒక తండ్రికి, పిల్లాడికి మధ్య ఉండే అనుబంధమే తీసుకోండి. వాళ్ల నాన్న తనను చాలా ప్రేమిస్తున్నాడని, పట్టించుకుంటున్నాడని ఆ పిల్లాడికి అర్థమౌతుంది. తను ఎలా ఉంటే వాళ్ల నాన్నకు నచ్చుతుందో, ఏం చేస్తే కోపం వస్తుందో ఆ బాబుకు తెలుసు. అలాగని, వాళ్ల నాన్నంటే గజగజ వణికిపోతాడా? లేదు. నిజానికి, ఆ బాబు వాళ్ల నాన్నను ప్రాణంగా ప్రేమిస్తాడు. వాళ్ల నాన్న మొహంలో చిరునవ్వు చూడడానికి ఎన్నో మురిపించే పనులు చేస్తాడు. దేవునికి భయపడడం కూడా అంతే. మనం మన పరలోక తండ్రి అయిన యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి, ఆయన మనసును విరిచేసే పని చేయాలంటే భయపడతాం. (ఆదికాండం 6:6) అలాగే, ఆయన హృదయాన్ని గెలిచే పనులు చేయాలని పరితపిస్తాం. (సామెతలు 27:11) అందుకే మనకున్న శక్తిని సరిగ్గా ఉపయోగించాలనుకుంటాం. దాన్ని ఎలా చేయవచ్చో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం.
కుటుంబంలో
8. (ఎ) భర్తకు కుటుంబంలో ఏ అధికారం ఉంది? ఆయన దాన్ని ఎలా ఉపయోగించాలి? (బి) భర్త తన భార్యను గౌరవిస్తున్నానని ఎలా చూపించవచ్చు?
8 మొదటిగా, కుటుంబంలో చూద్దాం. “భర్త . . . తన భార్యకు శిరస్సు” అని ఎఫెసీయులు 5:23 చెప్తుంది. దేవుడు ఇచ్చిన ఆ అధికారాన్ని ఒక భర్త ఎలా ఉపయోగించాలి? భర్తలు తమ భార్యల్ని ‘అర్థంచేసుకుంటూ కాపురం చేయాలని, వాళ్లు సున్నితమైన పాత్ర లాంటివాళ్లు కాబట్టి వాళ్లకు గౌరవం ఇవ్వాలని’ బైబిలు చెప్తుంది. (1 పేతురు 3:7) “గౌరవం” అని అనువదించిన గ్రీకు పదానికి “ఖరీదు, విలువ, మర్యాద” అనే అర్థాలు ఉన్నాయి. ఆ పదాన్ని వేరే లేఖనాల్లో “బహుమతులు,” “అమూల్యం” అని అనువదించారు. (అపొస్తలుల కార్యాలు 28:10; 1 పేతురు 2:7) భార్యను గౌరవించే భర్త ఆమె మీద ఎప్పుడూ చేయిచేసుకోడు, ఆమెకు విలువ లేదని అనిపించేలా ఆమెను అవమానించడు లేదా చులకనగా మాట్లాడడు. బదులుగా, ఆమె విలువను గుర్తించి గౌరవిస్తాడు. ఆయన నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా తన మాటల్లో, పనుల్లో ఆమె తనకు చాలా విలువైనదని చూపిస్తాడు. (సామెతలు 31:28) అలాంటి భర్త తన భార్య ప్రేమను, గౌరవాన్ని సంపాదించుకోవడంతో పాటు యెహోవా హృదయాన్ని కూడా గెలుచుకుంటాడు.
భార్యాభర్తలు ప్రేమ, గౌరవం ఇచ్చి పుచ్చుకున్నప్పుడు తమకున్న శక్తిని సరిగ్గా ఉపయోగిస్తారు
9. (ఎ) భార్యకు కుటుంబంలో ఏ అధికారం ఉంది? (బి) భార్య తనకున్న సామర్థ్యాల్ని తన భర్తకు మద్దతివ్వడానికి ఎలా ఉపయోగించవచ్చు? దానివల్ల ఏం జరుగుతుంది?
9 భార్యకు కూడా కుటుంబంలో కొంత అధికారం ఉంటుంది. దేవునికి భయపడే కొంతమంది స్త్రీలు, ఒకపక్క భర్త శిరస్సత్వానికి లోబడుతూనే, ఇంకోపక్క సరైనది చేసేలా తమ భర్తలకు సహాయం చేశారని, ఘోరమైన తప్పులు జరగకుండా ఆపారని బైబిలు చెప్తుంది. (ఆదికాండం 21:9-12; 27:46–28:2) భార్యకు తన భర్త కన్నా ఎక్కువ తెలివితేటలు ఉండవచ్చు, లేదా ఆయనకు లేని కొన్ని సామర్థ్యాలు ఆమెకు ఉండవచ్చు. అయినప్పటికీ, ఆమె ఆయన మీద “ప్రగాఢ గౌరవం” చూపించాలి, ‘ప్రభువుకు లోబడివున్నట్టే భర్తకు లోబడివుండాలి.’ (ఎఫెసీయులు 5:22, 33) దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునే భార్య తనకున్న సామర్థ్యాల్ని తన భర్తకు మద్దతివ్వడానికి ఉపయోగించాలని అనుకుంటుంది. అంతేగానీ, ఆయన్ని చులకన చేయడానికి లేదా ఆయనపై పెత్తనం చెలాయించడానికి కాదు. “నిజంగా తెలివిగల” అలాంటి స్త్రీ తన భర్తతో కలిసి కుటుంబాన్ని కడుతుంది, అలా దేవునితో తనకున్న స్నేహాన్ని కాపాడుకుంటుంది.—సామెతలు 14:1.
10. (ఎ) దేవుడు తల్లిదండ్రులకు ఏ అధికారాన్ని ఇచ్చాడు? (బి) “క్రమశిక్షణ” అనే పదానికి అర్థం ఏంటి? దాన్ని ఎలా ఇవ్వాలి? (అధస్సూచి కూడా చూడండి.)
10 దేవుడు తల్లిదండ్రులకు కూడా కొంత అధికారాన్ని ఇచ్చాడు. బైబిలు ఇలా చెప్తుంది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి; బదులుగా యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని ఇస్తూ వాళ్లను పెంచండి.” (ఎఫెసీయులు 6:4) బైబిల్లో ఉపయోగించిన “క్రమశిక్షణ” అనే పదానికి “పెంచడం, శిక్షణ ఇవ్వడం, ఉపదేశించడం” అనే అర్థాలు ఉన్నాయి. పిల్లలకు క్రమశిక్షణ అవసరమే. వాళ్లు ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అని చెప్పే కొన్ని నియమాలు, హద్దులు పెట్టినప్పుడు వాళ్లు పెరిగి ప్రయోజకులు అవుతారు. బైబిలు అలాంటి క్రమశిక్షణను లేదా ఉపదేశాన్ని ప్రేమతో ముడిపెడుతుంది. (సామెతలు 13:24) కాబట్టి, ‘క్రమశిక్షణ అనే బెత్తాన్ని’ పిల్లల శరీరం కమిలిపోయేలా, వాళ్ల మనసు కుమిలిపోయేలా ఎప్పుడూ ఉపయోగించకూడదు.a (సామెతలు 22:15; 29:15) ప్రేమ లేకుండా పిల్లలకు కఠినంగా క్రమశిక్షణ ఇస్తే, తల్లిదండ్రులు తమకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని తప్పుగా ఉపయోగించినట్టు అవుతుంది. అలాగే, పిల్లాడి మనసు ముక్కలౌతుంది. (కొలొస్సయులు 3:21) అలా కాకుండా సరైన విధంగా తగినంత క్రమశిక్షణ ఇస్తే, తల్లిదండ్రులు తనను ప్రేమిస్తున్నారని, తను మంచివాడిగా అవ్వాలన్నదే వాళ్ల కోరిక అని పిల్లాడు అర్థం చేసుకుంటాడు.
11. పిల్లలు తమకున్న శక్తిని ఎలా సరిగ్గా ఉపయోగించవచ్చు?
11 మరి పిల్లల సంగతేంటి? వాళ్లు తమకున్న శక్తిని ఎలా సరిగ్గా ఉపయోగించవచ్చు? “యౌవనుల బలమే వాళ్లకు అలంకారం” అని సామెతలు 20:29 చెప్తుంది. వాళ్ల శక్తిని, బలాన్ని “మహాగొప్ప సృష్టికర్త” కోసం ఉపయోగించడం కన్నా మంచి మార్గం ఇంకొకటి లేదు. (ప్రసంగి 12:1) వాళ్ల పనులు తల్లిదండ్రుల్ని సంతోషపెట్టవచ్చు లేదా బాధపెట్టవచ్చు అని పిల్లలు గుర్తుంచుకోవాలి. (సామెతలు 23:24, 25) పిల్లలు దైవభయం ఉన్న తమ తల్లిదండ్రులకు లోబడుతూ సరైన మార్గంలో నడిస్తే, తల్లిదండ్రుల హృదయం సంతోషంతో నిండిపోతుంది. (ఎఫెసీయులు 6:1) అలాంటి ప్రవర్తన “ప్రభువుకు ఇష్టం.”—కొలొస్సయులు 3:20.
సంఘంలో
12, 13. (ఎ) సంఘంలో తమకున్న అధికారాన్ని పెద్దలు ఎలా చూడాలి? (బి) పెద్దలు మందలోని వాళ్లతో ఎందుకు మృదువుగా ఉండాలో ఉదాహరణతో చెప్పండి.
12 క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహించడానికి యెహోవా పెద్దల్ని ఇచ్చాడు. (హెబ్రీయులు 13:17) అర్హులైన ఈ పురుషులు దేవుడిచ్చిన అధికారాన్ని మందకు సహాయం చేయడానికి, వాళ్ల బాగోగులు చూసుకోవడానికి ఉపయోగించాలి. వాళ్లు తమకున్న స్థానాన్ని బట్టి, తోటి బ్రదర్స్‌సిస్టర్స్ మీద పెత్తనం చెలాయించాలా? కానేకాదు! పెద్దలు వినయంగా ఉంటూ, యెహోవా తమ నుండి ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి. (1 పేతురు 5:2, 3) పెద్దలకు బైబిలు ఇలా చెప్తుంది: ‘దేవుని సంఘాన్ని కాయండి, దేవుడు ఆ సంఘాన్ని తన సొంత కుమారుడి రక్తంతో కొన్నాడు.’ (అపొస్తలుల కార్యాలు 20:28) దీన్నిబట్టి, వాళ్లు మందలోని ప్రతీ గొర్రెతో ఎంత మృదువుగా ప్రవర్తించాలో అర్థమౌతుంది.
13 దాన్ని అర్థం చేసుకోవడానికి ఇలా ఆలోచించండి: మీ ప్రాణ స్నేహితుడు తనకు బాగా ఇష్టమైన వస్తువును చూసుకోమని మీకు ఇచ్చాడనుకోండి. అసలే ఆయన దాన్ని బోలెడు డబ్బులు పోసి కొన్నాడు. మీరు దాన్ని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి చూసుకోరా? అదేవిధంగా, దేవుడు కూడా తనకెంతో విలువైనదాన్ని అంటే సంఘాన్ని పెద్దల చేతుల్లో పెట్టాడు. సంఘంలోని వాళ్లను గొర్రెలతో పోల్చవచ్చు. (యోహాను 21:16, 17) ఆ గొర్రెలు యెహోవాకు చాలా ఇష్టం. ఎంతగా అంటే, యెహోవా తన దగ్గరున్న వాటిలో అన్నిటికన్నా విలువైనదాన్ని ఇచ్చి వాళ్లను కొన్నాడు. అదే, తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రాణం. వినయంగల పెద్దలు ఈ విషయాన్ని మనసులో ఉంచుకుని, యెహోవా గొర్రెల్ని జాగ్రత్తగా చూసుకుంటారు.
“నాలుకకు ఉన్న శక్తి”
14. నాలుకకు ఏ శక్తి ఉంది?
14 “జీవమరణాలు నాలుక అధీనంలో ఉన్నాయి” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 18:21) నాలుక చేసే హాని అంతా ఇంతా కాదు. ముందూవెనక ఆలోచించకుండా లేదా చులకనగా మాట్లాడిన మాట, ఎప్పుడైనా మీ మనసుకు గుచ్చుకుందా? అయితే, నాలుకకు నయం చేసే శక్తి కూడా ఉంది. “తెలివిగలవాళ్ల మాటలు గాయాల్ని నయం చేస్తాయి” అని సామెతలు 12:18 చెప్తుంది. అవును, బలపర్చే మంచి మాట, మన మనసుకు తగిలిన గాయానికి ఆయింట్‌మెంట్ పూసినట్టు చల్లగా, హాయిగా ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చూడండి.
15, 16. వేరేవాళ్లను ప్రోత్సహించడానికి మన నాలుకను ఎలా ఉపయోగించవచ్చు?
15 “కృంగినవాళ్లతో ఊరటనిచ్చేలా మాట్లాడండి” అని 1 థెస్సలొనీకయులు 5:14 చెప్తుంది. అవును, నమ్మకమైన యెహోవా సేవకులకు కూడా అప్పుడప్పుడు నిరుత్సాహంగా అనిపిస్తుంది. మనం వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు? వాళ్లలో మీకు నచ్చే విషయం గురించి చెప్తూ, మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. యెహోవాకు వాళ్లు చాలా విలువైనవాళ్లని గుర్తుచేయండి. బైబిల్లో ఉన్న బలపర్చే మాటల్ని చూపించి, ‘విరిగిన హృదయంగల వాళ్లను, నలిగిన మనస్సుగల వాళ్లను’ యెహోవా పట్టించుకుంటాడని, వాళ్లను ప్రేమిస్తూనే ఉంటాడని చెప్పండి. (కీర్తన 34:18) మనం మన నాలుకను, వేరేవాళ్లను ఓదార్చడానికి ఉపయోగించిన ప్రతీసారి “కృంగిపోయిన వాళ్లకు ఊరటనిచ్చే” యెహోవాను అనుకరిస్తాం.—2 కొరింథీయులు 7:6.
16 మన నాలుకకు ఉన్న శక్తిని వేరేవాళ్లను ప్రోత్సహించడానికి కూడా ఉపయోగించవచ్చు. మీ తోటి బ్రదర్ లేదా సిస్టర్ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? అయితే శ్రద్ధ, పట్టింపు ఉందని చూపించే మీ మాటలు, బాధతో బరువెక్కిన వాళ్ల గుండెను తేలిక చేస్తాయి. వయసుపైబడిన వాళ్లు ఇక తాము సంఘానికి ఉపయోగపడం అని అనుకుంటున్నారా? అలాగైతే ఆలోచించి మాట్లాడే మాట వాళ్లు విలువైనవాళ్లని, ముఖ్యమైనవాళ్లని అనిపించేలా చేస్తుంది. ఎవరైనా చాలాకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా? అయితే వాళ్లకు ఫోన్ చేసి, లెటర్ రాసి, లేదా ఇంటికి వెళ్లి దయగా మాట్లాడితే వాళ్ల ప్రాణం లేచొస్తుంది. “బలపర్చే మంచి మాటలు” మాట్లాడినప్పుడు, మన నాలుకకు శక్తిని ఇచ్చిన యెహోవాను సంతోషపెడతాం!—ఎఫెసీయులు 4:29.
17. మన నాలుకకు ఉన్న శక్తిని ఉపయోగించడానికి అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం ఏంటి? మనం దాన్ని ఎందుకు చేయాలి?
17 నాలుకకు ఉన్న శక్తిని ఉపయోగించి, మనం దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించవచ్చు. అదే అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం. “మేలు చేయడం నీకు చేతనైనప్పుడు, దాన్ని పొందాల్సిన వాళ్లకు ఆ మేలు చేయకుండా ఉండకు” అని సామెతలు 3:27 చెప్తుంది. కాబట్టి, ప్రాణాల్ని కాపాడే ఈ మంచివార్తను వేరేవాళ్లకు చెప్పాల్సిన బాధ్యత మనమీద ఉంది. యెహోవా పెద్ద మనసు చేసుకుని ఈ వార్తను మనకు చెప్పాడు, దాన్ని మన వరకే ఉంచుకోవడం కరెక్ట్ కాదు. (1 కొరింథీయులు 9:16, 22) అయితే, మనం ఎలా ప్రీచింగ్ చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?
మన శక్తిని ఉపయోగించడానికి ఒక చక్కని మార్గం, మంచివార్త ప్రకటించడమే
“పూర్తి బలంతో” యెహోవాను సేవిద్దాం
18. యెహోవా మన నుండి ఏం కోరుకుంటున్నాడు?
18 మనకు యెహోవా మీద ప్రేమ ఉంటే, పరిచర్యలో చేయగలిగినదంతా చేస్తాం. ఈ విషయంలో యెహోవా మన నుండి ఏం కోరుకుంటున్నాడు? “మీరు ఏమి చేసినా, మనుషుల కోసం చేస్తున్నట్టు కాకుండా, యెహోవా కోసం చేస్తున్నట్టు మనస్ఫూర్తిగా, మీ పూర్తి శక్తితో (లేదా ప్రాణం పెట్టి) చేయండి” అని ఆయన చెప్తున్నాడు. మన పరిస్థితి ఎలాంటిదైనా ఇది మనందరం చేయగలిగేదే. (కొలొస్సయులు 3:23) అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ గురించి చెప్తూ, యేసు ఇలా అన్నాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.” (మార్కు 12:30) అవును, మనలో ప్రతీ ఒక్కరం నిండు ప్రాణంతో తనను ప్రేమించాలని, సేవించాలని యెహోవా కోరుకుంటున్నాడు.
19, 20. (ఎ) ప్రాణంలోనే హృదయం, మనసు, బలం కూడా వచ్చేస్తుంటే, మార్కు 12:30 లో వాటిని విడివిడిగా ఎందుకు చెప్పారు? (బి) యెహోవాను నిండు ప్రాణంతో సేవించడం అంటే అర్థం ఏంటి?
19 దేవుణ్ణి నిండు ప్రాణంతో సేవించడం అంటే అర్థం ఏంటి? ప్రాణం అనే మాటలో ఒక పూర్తి వ్యక్తి, అంటే అతని కండబలం, బుద్ధిబలం అన్నీ వస్తాయి. ప్రాణంలోనే హృదయం, మనసు, బలం కూడా వచ్చేస్తుంటే, మార్కు 12:30 లో వాటిని విడివిడిగా ఎందుకు చెప్పారు? ఈ ఉదాహరణ చూడండి. బైబిలు కాలాల్లో, ఒక వ్యక్తి తనను తాను (తన ప్రాణాన్ని) బానిసగా అమ్మేసుకోవచ్చు. అయినా, అతను తన యజమానికి నిండు హృదయంతో పని చేయకపోవచ్చు, తన పూర్తి బలాన్ని పెట్టి లేదా మనసు పెట్టి పని చేయకపోవచ్చు. (కొలొస్సయులు 3:22) అందుకే, మనం దేన్నీ పోనివ్వకుండా దేవుని సేవలో పూర్తిగా, చేయగలిగినదంతా చేయాలని నొక్కిచెప్పడానికి యేసు వాటిని విడివిడిగా చెప్పాడు. దేవుణ్ణి నిండు ప్రాణంతో సేవించడం అంటే మనల్ని మనం పూర్తిగా ఇచ్చేసుకుంటూ, మన శక్తిని, బలాన్ని ఆయన సేవలో సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించడం అని అర్థం.
20 నిండు ప్రాణంతో సేవించడమంటే, మనందరం పరిచర్యలో ఒకేలా సమయాన్ని, శక్తిని పెట్టాలనా? కాదు. ఒక్కొక్కరి పరిస్థితులు, సామర్థ్యాలు ఒక్కోలా ఉంటాయి కాబట్టి అందరూ పరిచర్యను ఒకేలా చేయడం సాధ్యం కాదు. ఉదాహరణకు, ఒంట్లో శక్తి లేని పెద్దవయసు వ్యక్తితో పోలిస్తే మంచి ఆరోగ్యం, బలం ఉన్న యౌవనుడు పరిచర్య ఎక్కువగా చేయగలడు. అలాగే కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తితో పోలిస్తే, పెళ్లికాని వ్యక్తి ఎక్కువ పరిచర్య చేయగలడు. ఒకవేళ ఎక్కువ పరిచర్య చేయడానికి మన ఆరోగ్యం, పరిస్థితులు సహకరిస్తే, దాన్నిబట్టి మనం ఎంత సంతోషించాలో కదా! అంతేగానీ ఈ విషయంలో మనం వేరేవాళ్లతో పోల్చుకోకూడదు, వాళ్లను తక్కువగా చూడకూడదు. (రోమీయులు 14:10-12) బదులుగా, మనకున్న శక్తిని వేరేవాళ్లను ప్రోత్సహించడానికి ఉపయోగించాలి.
21. మన శక్తిని ఉపయోగించడానికి అన్నిటికన్నా ముఖ్యమైన, మెరుగైన మార్గం ఏంటి?
21 శక్తిని సరిగ్గా ఉపయోగించడంలో యెహోవా పరిపూర్ణ ఆదర్శం ఉంచాడు. అపరిపూర్ణ మనుషులుగా మనం మన శక్తిమేరకు యెహోవాను అనుకరించాలని కోరుకుంటాం. మనకు ఎవరి మీదైతే కొంత అధికారం ఉందో వాళ్లను గౌరవిస్తూ, మన అధికారాన్ని లేదా శక్తిని సరిగ్గా ఉపయోగించవచ్చు. దాంతోపాటు, యెహోవా మనకు ప్రాణాల్ని కాపాడే పనిని అప్పగించాడు కాబట్టి దాన్ని నిండు ప్రాణంతో చేయాలనుకుంటాం. (రోమీయులు 10:13, 14) గుర్తుంచుకోండి, మీరు మీ నిండు ప్రాణంతో ఎంత చేయగలరో అంత చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. ఇంత అర్థం చేసుకునే, ప్రేమగల దేవుణ్ణి సేవించడానికి శాయశక్తులా కృషిచేయాలని మీకు అనిపించట్లేదా? మీ శక్తిని ఉపయోగించడానికి ఇంతకన్నా ముఖ్యమైన, మెరుగైన మార్గం ఇంకొకటి లేదు.
a బైబిలు కాలాల్లో, “దుడ్డుకర్ర” అని అనువదించిన హీబ్రూ పదానికి, కర్ర లేదా చేతికర్ర అనే అర్థాలు ఉన్నాయి. అలాంటి చేతికర్రను ఒక గొర్రెల కాపరి తన గొర్రెల్ని సరైన దారిలో నడిపించడానికి ఉపయోగించేవాడు. (కీర్తన 23:4) అదేవిధంగా, ఇక్కడ “బెత్తం” అనే పదం తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమగా నడిపించాలనే చెప్తుంది కానీ, వాళ్లను కొట్టమనో చితకబాదమనో కాదు.