అధ్యాయం 10
“యెహోవా వాక్యం వ్యాప్తి చెందుతూ వచ్చింది”
దేవదూత పేతురును విడిపించాడు, హింస ప్రకటనా పనిని ఆపలేకపోయింది
అపొస్తలుల కార్యాలు 12:1-25 ఆధారంగా
1-4. పేతురుకు ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చింది? మీరే ఆయన పరిస్థితిలో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది?
పేతురును చెరసాలలోకి తీసుకెళ్తుంటే ఆయన వెనకాల పెద్ద ఇనుప తలుపు గట్టిగా శబ్దం చేసుకుంటూ మూసుకుపోతోంది. ఇద్దరు రోమా సైనికులు పేతురుకు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నారు. తనకు ఏ శిక్ష పడుతుందో పేతురుకు ఇంకా తెలీదు. అది తెలుసుకోవడానికి ఆయనకు చాలా గంటలు, బహుశా రోజులు పట్టవచ్చు. ఇప్పుడు ఆయన కంటికి కనిపిస్తుందల్లా జైలు గోడలు, సంకెళ్లు, సైనికులు మాత్రమే.
2 పేతురుకు ఏ శిక్ష పడిందో ఇప్పుడు తెలిసిపోయింది. హేరోదు అగ్రిప్ప I ఆయనకు మరణ శిక్ష విధించాడు.a ప్రజల్ని సంతోషపెట్టడం కోసం హేరోదు పస్కా పండుగ ముగిసిన తర్వాత, పేతురును వాళ్ల ముందుకు తీసుకొచ్చి చంపాలనుకుంటున్నాడు. ఇది వట్టి బెదిరింపు కాదు, ఎందుకంటే అలా మరణశిక్ష వేసే అధికారం హేరోదుకు నిజంగానే ఉంది. పైగా ఈ మధ్యే, అపొస్తలుడైన యాకోబును హేరోదు చంపించాడు.
3 తెల్లారితే పేతురుకు మరణశిక్ష వేస్తారు. ఆ రోజు రాత్రి ఆయన జైల్లో కూర్చుని ఏం ఆలోచించి ఉంటాడు? యేసు కొంతకాలం క్రితం పేతురు మరణం గురించి మాట్లాడుతూ, పేతురుకు నచ్చని చోటుకు ఆయన్ని తీసుకెళ్లే ఒక రోజు వస్తుందని చెప్పాడు. బహుశా ఆ మాటలు ఆయనకు గుర్తొచ్చి ఉంటాయా? (యోహా. 21:18, 19) ఆ రోజు రానే వచ్చిందని ఆయన అనుకుని ఉండవచ్చు.
4 పేతురు పరిస్థితిలో మీరే ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలామందికి నిరుత్సాహంగా, ఇక ఏ ఆశా లేనట్టు అనిపించవచ్చు. అయితే, క్రీస్తును నిజంగా అనుసరించే వాళ్లకు ఏ ఆశా లేని పరిస్థితి ఎప్పుడైనా వస్తుందా? హింస ఎదురైనప్పుడు పేతురు, మిగతా క్రైస్తవులు ఏం చేశారు? వాళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.
‘సంఘం పట్టుదలగా ప్రార్థిస్తూ ఉంది’ (అపొ. 12:1-5)
5, 6. (ఎ) హేరోదు అగ్రిప్ప I రాజు క్రైస్తవ సంఘాన్ని ఎందుకు హింసించాడు, ఎలా హింసించాడు? (బి) యాకోబు చనిపోవడం క్రైస్తవ సంఘానికి పెద్ద కష్టాన్ని తీసుకొచ్చిందని ఎందుకు అనొచ్చు?
5 అన్యజనుడైన కొర్నేలి, ఆయన కుటుంబం యేసు శిష్యులుగా మారడం క్రైస్తవ సంఘంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ముందటి అధ్యాయంలో తెలుసుకున్నాం. అయితే, యూదా క్రైస్తవులు అన్యజనులతో కలిసి ఆరాధించడం యూదులకు అస్సలు మింగుడుపడలేదు.
6 జిత్తులమారి హేరోదు ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని యూదుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నాడు. అందుకే, క్రైస్తవుల్ని హింసించడానికి కుట్ర పన్నాడు. అపొస్తలుడైన యాకోబు యేసుకు మంచి స్నేహితుడు అని హేరోదుకు తెలిసే ఉంటుంది. కాబట్టి హేరోదు, “యోహాను సహోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు.” (అపొ. 12:2) సంఘానికి ఎంత కష్టం వచ్చి పడింది! యేసు రూపం మారిపోవడాన్ని, ఆయన చేసిన కొన్ని అద్భుతాల్ని చూసిన ముగ్గురు అపొస్తలుల్లో యాకోబు ఒకడు; వాటిని చూసే అవకాశం మిగతా అపొస్తలులకు దొరకలేదు. (మత్త. 17:1, 2; మార్కు 5:37-42) యాకోబులో, ఆయన సహోదరుడైన యోహానులో ఉరకలేసే ఉత్సాహాన్ని చూసి యేసు వాళ్లకు, “ఉరుము పుత్రులు” అని పేరు పెట్టాడు. (మార్కు 3:17) అపొస్తలుడైన యాకోబును సంఘం ఎంతో ప్రేమించింది. యాకోబు చనిపోయినప్పుడు ధైర్యం, విశ్వాసం ఉన్న ఒక గొప్ప సాక్షిని సంఘం కోల్పోయింది!
7, 8. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది?
7 అగ్రిప్ప అనుకున్నట్టుగానే యాకోబును చంపించడం యూదుల్ని సంతోషపెట్టింది. ఇప్పుడు హేరోదు చూపు పేతురు మీద పడింది. అందుకే ఆయన్ని చెరసాలలో వేయించాడు. అయితే ఈ పుస్తకంలోని 5వ అధ్యాయంలో చూసినట్టుగా, జైలు గోడలు అపొస్తలుల్ని బంధించి ఉంచలేవని అగ్రిప్పకు గుర్తొచ్చి ఉంటుంది. కాబట్టి హేరోదు, తప్పించుకునే అవకాశం లేకుండా పేతురుకు సంకెళ్లు వేసి ఇద్దరు సైనికుల మధ్య ఉంచాడు. అలాగే, పగలు-రాత్రి వంతుల వారీగా కాపలా కాయడానికి 16 మంది సైనికుల్ని పెట్టాడు. ఒకవేళ పేతురు తప్పించుకుంటే, పేతురుకు పడాల్సిన శిక్ష ఆ సైనికులకు పడుతుంది. అలాంటి కష్టమైన పరిస్థితిలో పేతురుకు సహాయం చేయడానికి మిగతా క్రైస్తవులు ఏం చేయగలరు?
8 ఏం చేయాలో సంఘానికి బాగా తెలుసు. అపొస్తలుల కార్యాలు 12:5లో ఇలా ఉంది: “పేతురును చెరసాలలోనే ఉంచారు. సంఘం మాత్రం అతని కోసం పట్టుదలగా దేవునికి ప్రార్థిస్తూ ఉంది.” అవును, ఆ క్రైస్తవులు పేతురు కోసం పట్టుదలగా, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నారు. యాకోబు చనిపోయిన తర్వాత వాళ్లు నిరాశలో కూరుకుపోలేదు; దేవునికి ప్రార్థన చేసినా ఏ ఫలితం ఉండదులే అని అనుకోలేదు. మన ప్రార్థనల్ని యెహోవా ఎంతో విలువైనదిగా చూస్తాడు. అవి ఆయన ఇష్టానికి తగ్గట్టుగా ఉంటే వాటికి జవాబు ఇస్తాడు. (హెబ్రీ. 13:18, 19; యాకో. 5:16) ఈ విషయాన్ని మనం కూడా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
9. పేతురు కోసం తోటి క్రైస్తవులు చేసిన ప్రార్థనల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
9 కష్టాల్లో ఉన్న తోటి క్రైస్తవుల గురించి మీకు తెలుసా? కొంతమంది క్రైస్తవులు హింసను, ప్రభుత్వ నిషేధాన్ని, ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ల కోసం మీరు ప్రార్థన చేయగలరా? కుటుంబ వ్యతిరేకతను, నిరుత్సాహాన్ని, విశ్వాసానికి సంబంధించిన పరీక్షల్ని ఎదుర్కొంటున్న కొంతమంది క్రైస్తవుల గురించి కూడా బహుశా మీకు తెలిసుండవచ్చు. ప్రార్థన చేసే ముందు మీరు కాస్త సమయం తీసుకుని అలాంటి కష్టాల్ని ఎదుర్కొంటున్న వాళ్ల గురించి ఆలోచిస్తే, వాళ్ల పేర్లు ఉపయోగించి ప్రార్థించవచ్చు. “ప్రార్థనలు వినే” యెహోవా వాటిని ఎంతో ఇష్టపడతాడు. (కీర్త. 65:2) మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, తోటి సహోదర సహోదరీలు మన గురించి అలాగే ప్రార్థించాలని కోరుకుంటాం కదా!
విశ్వాసం కారణంగా జైలుకు వెళ్లిన సహోదరుల కోసం మనం ప్రార్థిస్తాం
“నా వెంట రా” (అపొ. 12:6-11)
10, 11. దేవదూత పేతురును చెరసాల నుండి ఎలా విడిపించాడో వివరించండి.
10 తనకు వేసిన శిక్షను బట్టి పేతురు భయపడి ఉంటాడా? ఏమో మనకైతే తెలీదు. చెరసాలలో గడిపే ఆ చివరి రాత్రి, పేతురు ఏ దిగులూ లేకుండా, ఆ ఇద్దరు సైనికుల మధ్య ప్రశాంతంగా నిద్రపోయాడు. రేపు ఏం జరిగినా సరే, యెహోవా చేతుల్లో నేను భద్రంగా ఉంటాను అనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. (రోమా. 14:7, 8) కానీ, యెహోవా ఏం చేయబోతున్నాడో పేతురు అస్సలు ఊహించి ఉండడు. ఉన్నట్టుండి ఆ చెరసాల గదిలో ఒక గొప్ప వెలుగు వచ్చింది, అక్కడకి ఒక దేవదూత వచ్చాడు. కానీ సైనికులెవ్వరూ ఆ దేవదూతను చూడలేకపోయారు. వెంటనే ఆ దేవదూత పేతురును నిద్ర లేపాడు. పేతురు చేతులకున్న బలమైన సంకెళ్లు ఊడిపోయాయి!
‘వాళ్లిద్దరు నగరంలోకి దారితీసే చెరసాల ఇనుప ద్వారం దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ ద్వారం దానంతటదే తెరుచుకుంది.’—అపొస్తలుల కార్యాలు 12:10
11 పేతురు వెంటవెంటనే చేయాల్సిన పనుల్ని దేవదూత చెప్పాడు: “త్వరగా లే! . . . నీ నడుం కట్టుకుని చెప్పులు వేసుకో. . . . నీ పైవస్త్రం వేసుకో.” పేతురు వెంటనే దేవదూత చెప్పినట్టు చేశాడు. తర్వాత ఆ దూత, “నా వెంట రా” అని అనగానే పేతురు ఆయన వెంట వెళ్లాడు. వాళ్లు చడీ చప్పుడు చేయకుండా చెరసాల గదిని, కాపలా వాళ్లను దాటుకుంటూ చెరసాల తలుపు వైపు వెళ్లారు. ‘ఇదంతా సరే కానీ, ఆ పెద్ద ఇనుప తలుపును దాటుకుని ఎలా వెళ్లేది?’ అని పేతురు ఆలోచించి ఉంటాడు. ఆ ప్రశ్నకు కాసేపటికే జవాబు దొరికింది. వాళ్లు ఆ తలుపు దగ్గరకు వచ్చినప్పుడు, అది “దానంతటదే తెరుచుకుంది.” వాళ్లు వెంటనే ఆ తలుపును దాటుకుని వీధిలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దేవదూత మాయమైపోయాడు. ఆ వీధిలో పేతురు ఒక్కడే ఉన్నాడు. ఇదంతా ఒక దర్శనం కాదు, నిజంగానే జరుగుతుందని పేతురుకు అప్పుడు అర్థమైంది. ఆయన ఇప్పుడు బందీ కాదు!—అపొ. 12:7-11.
12. యెహోవా పేతురును కాపాడడం గురించి ఆలోచించినప్పుడు మనకు ఎందుకు ఓదార్పుగా అనిపిస్తుంది?
12 తన సేవకుల్ని కాపాడే విషయంలో యెహోవాకున్న అపారమైన శక్తి గురించి ఆలోచించినప్పుడు మనకు ఎంతో ఓదార్పుగా అనిపిస్తుంది. పేతురును చెరసాలలో వేసింది ఒక మామూలు రాజు కాదు, ఆ కాలంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వం మద్దతు ఆ రాజుకు ఉంది. అయినా పేతురు చాలా తేలిగ్గా ఆ చెరసాల నుండి బయటికి వచ్చేశాడు! అలాగని యెహోవా ప్రతీసారి తన సేవకుల కోసం అలాంటి అద్భుతాలు చేయడు. యెహోవా యాకోబును కాపాడలేదు; పేతురు విషయంలో యేసు చెప్పిన మాటలు నెరవేరే సమయం వచ్చినప్పుడు, పేతురును కూడా కాపాడలేదు. నేడు యెహోవా అద్భుతాలు చేసి తమను కాపాడాలని దేవుని సేవకులు అనుకోరు. అయితే, యెహోవా మార్పులేనివాడు అని మనం గుర్తుంచుకుంటాం. (మలా. 3:6) ఆయన త్వరలోనే తన కుమారుని ద్వారా, మరణం అనే జైలు గోడల్ని బద్దలు కొట్టి ఎన్నో కోట్లమందిని విడిపిస్తాడు. (యోహా. 5:28, 29) కష్టాల్లో ఉన్నప్పుడు, యెహోవా చేసిన అలాంటి వాగ్దానాల గురించి ఆలోచిస్తే మనకు ఎంతో ధైర్యం వస్తుంది.
వాళ్లు “అతన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయారు” (అపొ. 12:12-17)
13-15. (ఎ) పేతురు వచ్చినప్పుడు మరియ ఇంట్లో ఉన్న వాళ్లందరూ ఏం చేశారు? (బి) ఇక్కడ నుండి అపొస్తలుల కార్యాలు పుస్తకం ఎక్కువగా దేని గురించి మాట్లాడుతుంది, పేతురు ఆ తర్వాత కూడా ఏం చేసి ఉంటాడు?
13 చీకటిగా ఉన్న ఆ వీధిలో నిల్చున్న పేతురు ఎక్కడకి వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు. దగ్గర్లోనే మరియ అనే క్రైస్తవురాలి ఇల్లు ఉందని అప్పుడు ఆయనకు గుర్తుకొచ్చింది. ఆ మరియ విధవరాలు అయ్యుండవచ్చు. ఆమె కాస్త ధనవంతురాలే, సంఘంలోని వాళ్లందరూ పట్టేంత పెద్ద ఇల్లు ఆమెకు ఉంది. ఈమె మార్కు అనే పేరు కూడా ఉన్న యోహానుకు తల్లి. ఈ యోహాను గురించి అపొస్తలుల కార్యాలు పుస్తకంలో మొదటిసారిగా ఇక్కడే కనిపిస్తుంది. తర్వాతి రోజుల్లో ఈ యోహాను, పేతురుకు కుమారుడి లాంటివాడు అయ్యాడు. (1 పేతు. 5:13) ఆ రోజు అంత రాత్రైనా సరే, సంఘంలోని చాలామంది మరియ ఇంట్లో కలుసుకుని పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్లు ఖచ్చితంగా పేతురు విడుదలవ్వాలని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. అయితే, యెహోవా వాళ్ల ప్రార్థనలకు ఇలా జవాబు ఇస్తాడని వాళ్లు ఊహించి ఉండరు!
14 పేతురు ఆ మరియ ఇంటి వసారా ముందున్న గేటు దగ్గరికి వచ్చి దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు రొదే అనే పనమ్మాయి ఆ గేటు దగ్గరికి వచ్చింది. ఆమె పేరుకు గ్రీకు భాషలో “గులాబి పువ్వు” అని అర్థం. పేతురు స్వరం వినగానే ఆమె దాన్ని నమ్మలేకపోయింది. ఆమె ఆనందంలో తలుపు తీసే బదులు, ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి పేతురు వచ్చేశాడని అందరికీ చెప్తూ ఉంది. కానీ వాళ్లేమో, ఆమెకు పిచ్చి పట్టిందని అనుకున్నారు. అయినా ఆ అమ్మాయి ఊరుకోలేదు, పేతురు నిజంగానే వచ్చాడని ఆయన స్వరం విన్నానని వాళ్లకు చెప్తూ ఉంది. కాసేపటికి కొంతమంది ఆమె చెప్పేది నమ్మి, పేతురు తరఫున ఒక దేవదూత వచ్చుంటాడని అనుకున్నారు. (అపొ. 12:12-15) ఈ లోపు పేతురు, వాళ్లు వచ్చి ఆ గేటు తెరిచే వరకు దాన్ని కొడుతూనే ఉన్నాడు.
15 వాళ్లు గేటు దగ్గర పేతురును చూసి “ఆశ్చర్యంలో మునిగిపోయారు”! (అపొ. 12:16) ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాళ్లందరికీ పేతురు నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసి, తను ఎలా బయటికి వచ్చాడో వివరించాడు. ఆ విషయాన్ని శిష్యుడైన యాకోబుకు, మిగతా సహోదరులకు తెలియజేయమని అన్నాడు. తర్వాత హేరోదు సైనికులకు దొరకకుండా, పేతురు అక్కడ నుండి వెళ్లిపోయాడు. పేతురు ఏదో ఒక సురక్షితమైన చోటుకు వెళ్లి యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగాడు. పేతురు గురించి మనం మళ్లీ అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ సున్నతి గురించిన వివాదాన్ని పరిష్కరించడానికి పేతురు సహాయం చేశాడు. తర్వాత ఇక ఆయన గురించి అపొస్తలుల కార్యాలు పుస్తకంలో కనిపించదు. ఇక్కడ నుండి అపొస్తలుల కార్యాలు పుస్తకం ముఖ్యంగా అపొస్తలుడైన పౌలు పని గురించి, ఆయన చేసిన ప్రయాణాల గురించి మాట్లాడుతుంది. అయితే, పేతురు ఎక్కడకి వెళ్లినా సహోదర సహోదరీల విశ్వాసాన్ని బలపర్చి ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆయన మరియ ఇంటి దగ్గర నుండి సురక్షితంగా వెళ్లిపోయినప్పుడు, అక్కడున్న వాళ్లందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి.
16. భవిష్యత్తులో ఎన్నో ఆనందాలు మన సొంతమౌతాయని ఎందుకు చెప్పవచ్చు?
16 కొన్నిసార్లు తన సేవకులు ఊహించిన దాని కంటే యెహోవా ఎక్కువే చేస్తాడు, వాళ్లను సంతోషంలో ముంచెత్తుతాడు. ఆ రోజు రాత్రి సంఘంలోని సహోదర సహోదరీలకు కూడా అలాగే అనిపించి ఉంటుంది. నేడు యెహోవా దీవెనల్ని రుచి చూసినప్పుడు, మనకు కూడా అలానే అనిపిస్తుంది. (సామె. 10:22) భవిష్యత్తులో భూమంతటా యెహోవా వాగ్దానాలు నెరవేరడం మనం చూస్తాం. మనం ఊహించే దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ దీవెనల్ని ఆయన మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి యెహోవాకు నమ్మకంగా ఉంటే, ఆనందం మన సొంతం!
“యెహోవా దూత అతన్ని జబ్బుపడేలా చేశాడు” (అపొ. 12:18-25)
17, 18. ప్రజలు హేరోదును పొగడ్తలతో ఎందుకు ముంచెత్తారు?
17 పేతురు తప్పించుకున్నాడు అనే సంగతి విని హేరోదు ఆశ్చర్యపోయాడు. అతని కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే సైనికుల్ని పంపించి పేతురు కోసం వెతికించాడు, కాపలా వాళ్లను విచారణ చేశాడు. హేరోదు ఆ కాపలా వాళ్లను ‘శిక్షించమని ఆజ్ఞాపించాడు,’ బహుశా వాళ్లకు మరణశిక్ష వేసి ఉంటాడు. (అపొ. 12:19) హేరోదు అగ్రిప్ప జాలి, దయ లేని మనిషి. మరి ఇలాంటి క్రూరునికి శిక్షే లేదా?
18 పేతురు తప్పించుకునే సరికి, హేరోదుకు అవమానంగా అనిపించి ఉంటుంది. కానీ కొన్ని రోజులకే, అతను మళ్లీ ఒక సందర్భంలో గర్వంతో విర్రవీగాడు. అగ్రిప్ప శత్రువుల్లో కొంతమంది అతనితో శాంతి కుదుర్చుకోవడానికి వచ్చారు. అప్పుడు అతను ప్రజలందరి ముందు ఒక ప్రసంగం ఇచ్చాడు. ఆ రోజు హేరోదు, “రాజవస్త్రాలు వేసుకొని” వచ్చాడని లూకా రాశాడు. హేరోదు వెండితో నేసిన వస్త్రాన్ని వేసుకున్నాడని, దానివల్ల ఆ వస్త్రం మీద వెలుగు పడినప్పుడు అతను చాలా ప్రకాశవంతంగా కనిపించాడని యూదా చరిత్రకారుడైన జోసిఫస్ రాశాడు. గర్విష్ఠి అయిన హేరోదు ఒక ప్రసంగం ఇచ్చాడు. అప్పుడు ప్రజలు అతన్ని పొగుడుతూ, “ఇది దేవుని స్వరమే కానీ మనిషి స్వరం కాదు!” అని అరిచారు.—అపొ. 12:20-22.
19, 20. (ఎ) యెహోవా హేరోదును ఎందుకు శిక్షించాడు? (బి) అది మనకు ఎలా ఓదార్పునిస్తుంది?
19 అయితే, అలాంటి పొగొడ్తలకు దేవుడు మాత్రమే అర్హుడు. జరుగుతున్నదంతా దేవుడు చూస్తున్నాడు! అలా పొగుడుతున్నందుకు హేరోదు వాళ్లను గద్దించి ఉండాల్సింది, లేదా కనీసం దానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అలా చేసుంటే చాలా పెద్ద ప్రమాదాన్ని తప్పించుకునేవాడు, కానీ హేరోదు అలా చేయలేదు. దానివల్ల, “నాశనానికి ముందు గర్వం ఉంటుంది” అనే సామెతకు అతను ఒక ఉదాహరణగా మిగిలిపోయాడు. (సామె. 16:18) “వెంటనే యెహోవా దూత అతన్ని జబ్బుపడేలా చేశాడు.” దాంతో స్వార్థపరుడు, గర్విష్ఠియైన హేరోదుకు చాలా ఘోరమైన చావు వచ్చింది. అతను “పురుగులు పడి చనిపోయాడు.” (అపొ. 12:23) ప్రజల పొగడ్తల్ని అంగీకరించడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని అగ్రిప్ప గుర్తించాడని జోసిఫస్ రాశాడు. అతను హఠాత్తుగా జబ్బుపడి, ఐదు రోజుల్లో చనిపోయాడని కూడా జోసిఫస్ రాశాడు.b
20 చెడ్డవాళ్లు ఏం చేసినా చెల్లిపోతుంది, వాళ్లకు అసలు శిక్షే పడదని కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ దాన్ని చూసి మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే, “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది.” (1 యోహా. 5:19) అయినప్పటికీ, చెడ్డవాళ్లకు శిక్ష పడకపోవడం చూసి కొన్నిసార్లు దేవుని సేవకులకు కూడా బాధ కలగవచ్చు. అప్పుడు, బైబిల్లోని ఇలాంటి సంఘటనలు మనకు ఓదార్పునిస్తాయి. యెహోవా చర్య తీసుకుంటాడని, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడని అవి మనకు గుర్తు చేస్తాయి. (కీర్త. 33:5) ఇప్పుడైనా లేదా రాబోయే కాలంలోనైనా, యెహోవా న్యాయం తీరుస్తాడు.
21. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం ముఖ్యంగా ఏ విషయాన్ని చెప్తుంది? అది మనకు ఎందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది?
21 అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం ఇంతకన్నా ప్రోత్సాహకరమైన ఒక విషయంతో ముగుస్తుంది. అది ఏంటంటే, “యెహోవా వాక్యం వ్యాప్తి చెందుతూ వచ్చింది, చాలామంది విశ్వాసులయ్యారు.” (అపొ. 12:24) అది చదివినప్పుడు, ఈ రోజుల్లో కూడా యెహోవా ప్రకటనా పనిని దీవించడం మనకు గుర్తుకురావచ్చు. అవును, అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం ఒక అపొస్తలుడు చనిపోవడం, ఇంకో అపొస్తలుడు తప్పించుకోవడం గురించి మాత్రమే చెప్పట్లేదు. క్రైస్తవ సంఘాన్ని అణగదొక్కడానికి, ఉత్సాహంగా సాగుతున్న ప్రకటనా పనిని ఆపేయడానికి సాతాను చేసే ప్రయత్నాల్ని యెహోవా తిప్పి కొడతాడని ఈ అధ్యాయం తెలియజేస్తుంది. సాతాను చేసిన దాడులేవీ పని చేయలేదు, ప్రకటనా పనిని ఆపడానికి ఇంకెవరైనా ప్రయత్నిస్తే వాళ్లు కూడా ఓడిపోతారు. (యెష. 54:17) అయితే యెహోవా వైపు నిలబడేవాళ్లు, క్రీస్తును అనుసరించేవాళ్లు చేసే పనికి ఓటమి అనేదే ఉండదు. ఆ మాట మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ‘యెహోవా వాక్యాన్ని’ ప్రకటించే గొప్ప గౌరవం మనకు దొరికింది!
a “రాజైన హేరోదు అగ్రిప్ప I” అనే బాక్సు చూడండి.
b జోసిఫస్, అలాగే లూకా చెప్పిన వ్యాధి లక్షణాల్ని బట్టి, హేరోదు పేగుల్లో గుండ్రటి నులి పురుగులు ఎక్కువైపోవడం వల్లే అలా జరిగి ఉంటుందని రచయిత అయిన ఒక డాక్టరు రాశాడు. కొన్నిసార్లు అలాంటి పురుగులు వాంతి చేసుకున్నప్పుడు బయటికి వస్తాయి, లేదా రోగి చనిపోయిన తర్వాత రోగి శరీరంలో నుండి పాక్కుంటూ బయటికి వచ్చేస్తాయి. ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది: “లూకా ఒక వైద్యుడు అవ్వడం వల్ల [హేరోదుకు] ఎలాంటి ఘోరమైన చావు వచ్చిందో సరిగ్గా వివరించగలిగాడు.”