రాజ్య సందేశాన్ని అంగీకరించడానికి ఇతరులకు సహాయం చేయండి
“అగ్రిప్ప—ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.”—అపొస్తలుల కార్యములు 26:28.
1, 2. గవర్నరు ఫేస్తు మరియు రాజైన హేరోదు అగ్రిప్ప II సమక్షానికి అపొస్తలుడైన పౌలు ఎందుకు తేబడ్డాడు?
రాజైన హేరోదు అగ్రిప్ప II, అతని చెల్లెలు బెర్నీకే రోమా గవర్నరైన పోర్కియు ఫేస్తును కలవడానికి సా.శ. 58లో కైసరయకు వెళ్లారు. గవర్నరు ఫేస్తు ఆహ్వానం మేరకు వారు ‘మిక్కిలి ఆడంబరముతో, సహస్రాధిపతులతోను పట్టణమందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించారు.’ ఫేస్తు ఆజ్ఞాపించినప్పుడు, క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వారి సమక్షానికి తేబడ్డాడు. యేసుక్రీస్తు అనుచరుడైన ఇతడు గవర్నరు ఫేస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే పరిస్థితి ఎలా వచ్చింది?—అపొస్తలుల కార్యములు 25:13-23.
2 ఫేస్తు తన అతిథులకు చెప్పిన దానినుండి ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. అతనిలా చెప్పాడు: “అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్తజనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరు—వీడు ఇక బ్రదుక తగడని కేకలువేయుచు అతనిమీద నాతో మనవి చేసికొనిరి. ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి యున్నాను. ఇతనిగూర్చి మన యేలినవారిపేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించియున్నాను. ఖయిదీమీద మోపబడిన నేరములను వివరింపకుండ అతని పంపుట యుక్తముకాదని నాకు తోచుచున్నది.”—అపొస్తలుల కార్యములు 25:24-27.
3. మతనాయకులు పౌలుకు వ్యతిరేకంగా ఎందుకు ఆరోపణలు చేశారు?
3 మరణ శిక్షకు తగిన నేరానికి అంటే రాజద్రోహానికి పాల్పడ్డాడనే ఆరోపణలు పౌలుపై మోపబడ్డాయని ఫేస్తు మాటలు సూచిస్తున్నాయి. (అపొస్తలుల కార్యములు 25:11) నిజానికి, పౌలు నిర్దోషి. ఆ ఆరోపణలు యెరూషలేములోని మతనాయకుల ఈర్ష్యవల్ల కలిగినవి. రాజ్య ప్రచారకునిగా పౌలుచేస్తున్న పనిని వ్యతిరేకిస్తూ, యేసు క్రీస్తు అనుచరులయ్యేందుకు అతడు ఇతరులకు సహాయం చేస్తున్నాడని తీవ్ర కోపం పెంచుకున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో యెరూషలేము నుండి పౌలును కైసరయ రేవు పట్టణానికి తీసుకువచ్చారు. అక్కడాయన కైసరుకు వినతి చేసుకున్నాడు. అక్కడనుండి ఆయన రోమాకు తీసుకెళ్లబడతాడు.
4. అగ్రిప్ప రాజు ఆశ్చర్యకరమైన ఏ వ్యాఖ్యానం చేశాడు?
4 రోమా సామ్రాజ్యపు ప్రముఖ ప్రాంత పాలకునితోపాటు ఓ గుంపు ఎదుట గవర్నరు భవనంలో పౌలు నిలబడడాన్ని ఊహించండి. అగ్రిప్ప రాజు పౌలువైపు తిరిగి, “నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనది” అన్నాడు. పౌలు ఇంకా మాట్లాడుతుండగా ఒక అసాధారణ సంగతి అంటే పౌలు మాటలు రాజుపై ప్రభావం చూపడం ఆరంభించాయి. నిజానికి అగ్రిప్ప రాజు, “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే” అన్నాడు.—అపొస్తలుల కార్యములు 26:1-28.
5. అగ్రిప్పతో పౌలు మాట్లాడిన మాటలు ఎందుకంత కార్యసాధకంగా ఉన్నాయి?
5 ఒక్కసారి ఆలోచించండి! పౌలు తన తరఫున ప్రావీణ్యతతో మాట్లాడిన ఆ మాటల కారణంగా, దూసుకుపోయే దేవుని వాక్య శక్తి ఒక పరిపాలకుణ్ణే ప్రభావితం చేసింది. (హెబ్రీయులు 4:12) పౌలు తన పక్షాన మాట్లాడిన మాటకు అంత ప్రభావం చేకూర్చినదేమిటి? శిష్యులను చేసే పనిలో మనకు సాయపడగల ఏ విషయాన్ని మనం పౌలు నుండి నేర్చుకోవచ్చు? ఆయన తన పక్షాన చేసిన వాదనను మనం విశ్లేషిస్తే, ముఖ్యమైన రెండు విషయాలు స్పష్టమౌతాయి: (1) పౌలు తన వాదనలో ఒప్పించే విధంగా మాట్లాడాడు. (2) ప్రావీణ్యతగల పనివాడు ఒక పనిముట్టును కార్యసాధకంగా ఉపయోగించినట్లే ఆయన దేవుని వాక్య జ్ఞానాన్ని నైపుణ్యంగా ఉపయోగించాడు.
ఒప్పింపజేసే కళను ఉపయోగించండి
6, 7. (ఎ) బైబిల్లో ఉపయోగించబడినట్లుగా, “ఒప్పింపజేయడం” అంటే ఏమిటి? (బి) బైబిలు బోధను అంగీకరించేందుకు ఇతరులకు సహాయం చేయడంలో ఒప్పింపజేయడం ఏ పాత్రవహిస్తుంది?
6 అపొస్తలుల కార్యములు పుస్తకంలో, ఒప్పింపజేయడానికి వాడే గ్రీకు పదాలు పదేపదే పౌలుకు సంబంధించి ఉపయోగించబడ్డాయి. శిష్యులనుచేసే మన పనికి దీనికి సంబంధమేమిటి?
7 ఆదిమ క్రైస్తవ గ్రీకు లేఖనాల భాషలో, “ఒప్పింపజేయడం” అంటే “గెలవడం” లేదా “తర్క ప్రభావంతో లేక నైతిక పర్యాలోచనల ద్వారా మనస్సులో మార్పు తీసుకురావడం” అని వైన్ యొక్క ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్‌మెంట్ వర్డ్స్ చెబుతోంది. ప్రాథమిక అర్థాన్ని పరిశీలించడం మరింత అంతర్దృష్టినిస్తుంది. అది నమ్మకం ఉంచడమనే తలంపును అందిస్తోంది. అందువల్ల బైబిలు బోధనను అంగీకరించేందుకు ఒక వ్యక్తిని మీరు ఒప్పింపజేసినప్పుడు, అతని నమ్మకాన్ని మీరు చూరగొంటారు, కాబట్టే ఆ బోధ సత్యసంధతను అతడు విశ్వసిస్తాడు. దీనినిబట్టి ఒక వ్యక్తి నమ్మడానికీ, ఆ ప్రకారమే ప్రవర్తించడానికీ కేవలం బైబిలు చెప్పేదేమిటో వివరిస్తే సరిపోదని స్పష్టమౌతోంది. మీ శ్రోతలు పిల్లలైనా, పొరుగువారైనా, తోటి పనివారైనా, తోటి విద్యార్థులైనా లేదా బంధువులైనా మీరు చెప్పేది సత్యమని వారు నమ్మించబడాలి.—2 తిమోతి 3:14, 15.
8. ఒక వ్యక్తిని ఒక లేఖన సత్యం గురించి నమ్మించడంలో ఏమి ఇమిడివుంది?
8 దేవుని వాక్యం నుండి మీరు ప్రకటిస్తున్నది సత్యమని ఒక వ్యక్తిని మీరు ఎలా నమ్మించవచ్చు? పౌలు న్యాయంగా తర్కించడం ద్వారా, సరిగా వాదించడం ద్వారా, మనఃపూర్వకంగా వేడుకోవడం ద్వారా తాను మాట్లాడిన వ్యక్తుల మనస్సులో మార్పు తీసుకురావడానికి కృషిచేశాడు.a అందువల్ల, ఇదే సత్యమని ప్రకటించడానికి బదులు అలా చెప్పడానికి మద్దతుగా సంతృప్తికరమైన రుజువులు చూపాలి. దీనినెలా చేయవచ్చు? మీ మాటలు వ్యక్తిగత అభిప్రాయంపై కాదుగాని దేవుని వాక్యంపై స్థిరంగా ఆధారపడి ఉండేలా చూసుకోండి. అలాగే మీ హృదయపూర్వక లేఖన వ్యాఖ్యలను బలపరచుకునేందుకు అదనంగా రుజువులు చూపించండి. (సామెతలు 16:23) ఉదాహరణకు, విధేయతగల మానవాళి పరదైసు భూమిపై జీవితం అనుభవిస్తారని మీరు సూచిస్తుంటే, మీ మాటలకు మద్దతుగా లూకా 23:43 లేదా యెషయా 65:21-25 వంటి లేఖన నివేదికలను చూపించండి. మీ లేఖనాంశానికి అదనంగా మీరెలా రుజువు చూపించవచ్చు? మీ శ్రోత అనుభవంలోని ఉదాహరణలు మీరు పేర్కొనవచ్చు. చూడముచ్చటైన సూర్యాస్తమయం, పువ్వుల పరిమళం, ఫల మాధుర్యం లేదా తల్లిపక్షి తన పిల్లలకు ఆహారం పెడుతుండగా చూసినప్పుడు కలిగే సంతోషం వంటి సామాన్యమైన, ఉచితంగా లభించే ఆహ్లాదకరమైన విషయాలను అతనికి గుర్తుచేయవచ్చు. అలాంటి ఆనందానుభూతులు మనం భూమిపై జీవితాన్ని ఆనందించాలని సృష్టికర్త కోరుకుంటున్నాడనే దానికి రుజువని గ్రహించేందుకు అతనికి సహాయం చేయండి.—ప్రసంగి 3:11, 12.
9. మన ప్రకటనా పనిలో తార్కిక విధానాన్ని మనమెలా ప్రదర్శించవచ్చు?
9 ఒకానొక బైబిలు బోధను అంగీకరించేలా ఒక వ్యక్తిని ఒప్పింపజేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతని హృదయం, మనస్సు మూసుకుపోయేలా మీ ఉత్సాహం మీరు అసహేతుకంగా మాట్లాడుతున్నట్లు అనిపించేలా చేయకుండా జాగ్రత్తపడండి. పరిచర్య పాఠశాల పుస్తకం హెచ్చరికగా ఇలా చెబుతోంది: “అవతలి వ్యక్తి ఎంతోకాలంగా అపురూపంగా ఎంచుతూ వచ్చిన ఒక నమ్మకం తప్పని బహిర్గతం చేసే ఒక సత్యాన్ని మీరు తెగేసినట్లు చెబితే, దానికి మద్దతుగా లేఖనాల పొడవాటి లిస్టు అప్పజెప్పినా ఆ వ్యక్తి సాధారణంగా దాన్ని స్వీకరించడు. ఉదాహరణకు, ప్రజలందరు చేసుకునే ఒకానొక పండుగలోని ఆచారాలు నిజానికి అన్యమతాల్లో ప్రారంభమయ్యాయని ఆక్షేపించి ఊరుకుంటే, వాటి గురించి ప్రజలు ఎలా భావిస్తారన్నదాన్ని అది మార్చకపోవచ్చు. సాధారణంగా తార్కిక విధానంతో ఎక్కువ విజయం లభిస్తుంది.” తార్కిక విధానంతో మాట్లాడేందుకు మనమెందుకు పరస్పర అంగీకారంగల ప్రయత్నం చేయాలి? ఆ బోధిని ఇలా చెబుతోంది: “తార్కిక విధానం చర్చను ప్రోత్సహిస్తుంది, అటు తర్వాత ఆలోచించడానికి మెదడుకు మేతనిస్తుంది, భవిష్యత్తులో సంభాషణలకు మార్గాన్ని తెరుస్తుంది. అది ఒప్పించడానికి శక్తిమంతమైన పద్ధతి.”—కొలొస్సయులు 4:6.
హృదయాన్ని పురికొల్పేలా ఒప్పింపజేయడం
10. అగ్రిప్ప ఎదుట పౌలు తన పక్షాన చేసిన వాదనను ఏ విధంగా పరిచయం చేశాడు?
10 మనమిప్పుడు అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో పౌలు తన పక్షాన మాట్లాడిన మాటలను నిశితంగా పరిశీలిద్దాం. ఆయన తన ప్రసంగాన్ని ఎలా ఆరంభించాడో గమనించండి. పౌలు తన ప్రసంగాంశాన్ని పరిచయం చేయడానికి, అగ్రిప్పకు తన చెల్లెలు బెర్నీకేతో అనుచిత సంబంధమున్నా, ఆ రాజుని మెచ్చుకోవడానికి తగిన ఆధారాన్ని చూశాడు. పౌలు ఇలా అన్నాడు: “అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొనుచున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను.”—అపొస్తలుల కార్యములు 26:2, 3.
11. అగ్రిప్పతో పౌలు మాట్లాడిన మాటలెలా గౌరవం చూపిస్తున్నాయి, ఫలితంగా ఏ ప్రయోజనం కలిగింది?
11 అగ్రిప్పరాజా అని సంబోధిస్తూ పౌలు అతని ఉన్నతాధికారాన్ని గుర్తించడం మీరు గమనించారా? ఇది గౌరవం చూపింది అలాగే జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకున్న పదాలతో పౌలు అగ్రిప్పను సన్మానించాడు. (1 పేతురు 2:17) తన ప్రజలైన యూదుల సంశ్లిష్టమైన ఆచారాలు నియమాలు అగ్రిప్పకు బాగాతెలుసని పౌలు గుర్తించి, అలాంటి జ్ఞానియగు పాలకుని ఎదుట తన పక్షాన వాదన వినిపించడానికి వీలైనందుకు సంతోషిస్తున్నానని ఆయన అన్నాడు. ఒక క్రైస్తవునిగా పౌలు క్రైస్తవుడైనప్పటికీ, క్రైస్తవేతరుడైన అగ్రిప్పకంటే తను అధికుడన్నట్లు ప్రవర్తించలేదు. (ఫిలిప్పీయులు 2:3) బదులుగా, పౌలు తానుచెప్పేది తాల్మితో వినాలని రాజును యాచించాడు. అలా, అగ్రిప్పతోపాటు ఇతర శ్రోతలూ తాను చెప్పేది అంగీకరించే అవకాశం ఎక్కువగావున్న వాతావరణాన్ని పౌలు కలిగించాడు. అందరికీ ఆమోదంగావున్న విషయంపై తన వాదనకు ఆయన పునాది వేస్తున్నాడు.
12. రాజ్య ప్రకటనా పనిలో మన శ్రోతల హృదయాలను మనమెలా పురికొల్పవచ్చు?
12 అగ్రిప్ప ఎదుట పౌలు మాట్లాడినట్లుగానే, రాజ్య సందేశాన్ని మనం అందించేటప్పుడు ఆద్యంతాలు మన శ్రోతల హృదయాలను పురికొల్పుదాం. మనం ప్రకటించే వారిపట్ల యథార్థ గౌరవాన్ని ప్రదర్శిస్తూ, ప్రత్యేకంగా అతని లేదా ఆమె నేపథ్యంపై, ఆలోచనా సరళిపై నిజమైన శ్రద్ధచూపిస్తూ మనమలా చేయవచ్చు.—1 కొరింథీయులు 9:20-23.
దేవుని వాక్యాన్ని నైపుణ్యవంతంగా ఉపయోగించండి
13. పౌలు వలెనే మీరూ మీ శ్రోతలను ఎలా పురికొల్పవచ్చు?
13 సువార్తకు తగిన విధంగా ప్రవర్తించేలా తన శ్రోతలను పురికొల్పాలని పౌలు కోరుకొన్నాడు. (1 థెస్సలొనీకయులు 1:5-7) ఆ మేరకు ఆయన పురికొల్పుకు పీఠమైన వారి అలంకారార్థ హృదయాన్ని పురికొల్పాడు. అగ్రిప్ప ఎదుట పౌలు తన పక్షాన చేసిన వాదన కొనసాగించినప్పుడు, మోషే మరియు ఇతర ప్రవక్తలు చెప్పిన సంగతులు పేర్కొంటూ పౌలు ఎలా ‘దేవుని వాక్యమును సరిగా ఉపదేశించాడో’ గమనించండి.—2 తిమోతి 2:15.
14. అగ్రిప్ప ఎదుట ఉన్నప్పుడు ఒప్పింపజేసే పద్ధతిని పౌలు ఎలా ఉపయోగించాడో వివరించండి.
14 అగ్రిప్ప నామకార్థ యూదుడని పౌలుకు తెలుసు. యూదా మతం గురించి అగ్రిప్పకు తెలిసిన వాటిని గురించి అతనిని ఆలోచింపజేస్తూ, నిజానికి తాను చేస్తున్న ప్రకటనా పనిలో మెస్సీయ మరణ పునరుత్థానాల గురించి ‘ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పడం లేదని’ పౌలు తర్కించాడు. (అపొస్తలుల కార్యములు 26:22, 23) అగ్రిప్పను సూటిగా సంబోధిస్తూ పౌలు ఇలా అడిగాడు: “అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా?” అగ్రిప్ప సందిగ్ధంలో పడ్డాడు. ప్రవక్తలను తిరస్కరిస్తున్నానని చెబితే, యూదా విశ్వాసిగా తనకున్న పేరు పాడవుతుంది. పౌలు తర్కంతో ఏకీభవిస్తే, తాను పౌలు పక్షం వహిస్తున్నానని బహిరంగంగా ఒప్పుకున్నట్లు అవుతుంది దానితో ఆయనకు క్రైస్తవుడనే ముద్రపడే ప్రమాదముంది. పౌలు జ్ఞానయుక్తంగా ఆ ప్రశ్నకు తానే జవాబిస్తూ ఇలా అన్నాడు: ‘నమ్ముచున్నారని నేనెరుగుదును.’ ఏమని సమాధానమిచ్చేందుకు అగ్రిప్ప హృదయం అతడిని పురికొల్పింది? అతడు, “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే” అన్నాడు. (అపొస్తలుల కార్యములు 26:27, 28) అగ్రిప్ప క్రైస్తవునిగా మారకపోయినా, పౌలు తన సందేశంతో అతని హృదయాన్ని కొంతమేరకు ప్రభావితం చేశాడని స్పష్టమవుతోంది.—హెబ్రీయులు 4:12.
15. థెస్సలొనీకలో పౌలు ఒక సంఘాన్ని ఎలా ఆరంభించగలిగాడు?
15 పౌలు సువార్తను అందించడంలో అటు ప్రకటించడం ఇటు ఒప్పించడం ఉన్నట్లు మీరు గమనించారా? ‘దేవుని వాక్యమును సరిగా ఉపదేశించడానికి’ పౌలు ఆ విధమైన పద్ధతి ఉపయోగించాడు కాబట్టే ఆయన మాటలు విన్న కొందరు వినువారిగా మాత్రమే ఉండిపోక విశ్వాసులయ్యారు. థెస్సలొనీకలో అదే జరిగింది, పౌలు అక్కడి సమాజమందిరంలో భక్తిపరులగు యూదులకు, అన్యులకు ప్రకటించాడు. అపొస్తలుల కార్యములు 17:2-4లోని వృత్తాంతమిలా చెబుతోంది: ‘పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి—క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమని లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడు విశ్రాంతిదినములు తర్కించుచుండెను. వారిలో కొందరు ఒప్పుకొనిరి.’ పౌలు ఒప్పించే సామర్థ్యం గలవాడు. యేసే ఎంతోకాలం క్రితం వాగ్దానం చేయబడిన మెస్సీయ అని ఆయన వారితో తర్కించాడు, వివరించాడు మరియు లేఖనాల ద్వారా నిరూపించాడు. ఫలితం? అక్కడ విశ్వాసుల సంఘం ఒకటి స్థాపించబడింది.
16. రాజ్య ప్రకటనలో మీరు మరింత ఆనందాన్నెలా పొందవచ్చు?
16 దేవుని వాక్యాన్ని వివరించేటప్పుడు ఒప్పింపజేసే కళలో మీరు మరింత నైపుణ్యం సాధించగలరా? అలాగైతే, దేవుని రాజ్యాన్ని గురించి ప్రజలకు ప్రకటించి బోధించే పనిలో మీరు మరింత వ్యక్తిగత సంతృప్తిని, సంతోషాన్ని పొందుతారు. ప్రకటనా పనిలో బైబిలును మరి ఎక్కువగా ఉపయోగించాలని ఇవ్వబడే సూచనలను అన్వయించుకున్న సువార్త ప్రచారకులకు ఈ అనుభవమే కలుగుతోంది.
17. మన పరిచర్యలో బైబిలును ఉపయోగించడం ఎలా ప్రయోజనకరమైనదో చూపించడానికి ఒక వ్యక్తిగత అనుభవమో ఈ పేరాలో ఇవ్వబడిన అనుభవ సారాంశమో చెప్పండి.
17 ఉదాహరణకు, యెహోవాసాక్షుల ప్రయాణ పైవిచారణకర్త ఒకరు ఇలా వ్రాశారు: “ఇంటింటా సాక్ష్యమిస్తున్నప్పుడు అనేకమంది సహోదర సహోదరీలు ప్రస్తుతం చేతిలో బైబిలు తీసుకెళుతున్నారు. అది ప్రచారకులు తాము కలుసుకునే అనేకమంది ప్రజలకు ఒక లేఖనం చూపడానికి సహాయం చేసింది. అది, మన పరిచర్యకు కేవలం పత్రికలతో పుస్తకాలతోనే కాదు గానీ బైబిలుతోనూ సంబంధం ఉందని గ్రహించడానికి అటు ఇంటివారికి ఇటు ప్రచారకులకు దోహదపడింది.” మనం ప్రకటిస్తున్న సమయంలో బైబిలు కనబడేటట్లు పట్టుకోవాలా వద్దా అనేది స్థానిక ఆచారాలతోసహా వివిధ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, రాజ్య సందేశం అంగీకరించేలా ఇతరులను ఒప్పించడానికి దేవుని వాక్యాన్ని నైపుణ్యవంతంగా ఉపయోగించేవారనే పేరు తెచ్చుకోవాలని మనం కోరుకోవాలి.
పరిచర్య విషయంలో దేవుని దృక్కోణంతో ఉండండి
18, 19. (ఎ) మన పరిచర్యను దేవుడెలా పరిగణిస్తున్నాడు, ఆయన దృక్కోణాన్ని మనమెందుకు అలవరచుకోవాలి? (బి) విజయవంతంగా పునర్దర్శనాలు చేయడానికి మనకేది సహాయం చేస్తుంది? (16వ పేజీలోవున్న “విజయవంతంగా పునర్దర్శనాలు చేయడం” అనే బాక్సు చూడండి.)
18 మన శ్రోతల హృదయం చేరడానికి మరో మార్గం, దేవుని దృక్కోణంనుండి పరిచర్యను చూస్తూ ఓపిక ప్రదర్శించడం. సమస్త ప్రజలు “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండడమే దేవుని ఇచ్ఛ. (1 తిమోతి 2:3, 4) మన కోరిక కూడా అదే కాదా? యెహోవా ఓపికమంతుడు, అలాగే ఆయనచూపే ఓపిక అనేకులు మారుమనస్సు పొందడానికి అవకాశాలనిస్తోంది. (2 పేతురు 3:9) కాబట్టి, రాజ్య సందేశం వినడానికి మొగ్గుచూపే వారిని మనం కలిసినప్పుడు, వారి ఆసక్తిని పెంపొందింపజేయడానికి వారిని మళ్లీ మళ్లీ సందర్శించడం అవసరం కావచ్చు. సత్య బీజాలు మొలకెత్తడం చూడాలంటే దానికి సమయం ఓపిక కావాలి. (1 కొరింథీయులు 3:6) అలాంటి ఆసక్తిని వృద్ధిచేయడానికి దీనికి అనుబంధంగా ఇవ్వబడిన “విజయవంతంగా పునర్దర్శనాలు చేయడం” అనే బాక్సు తగిన సూచనలిస్తోంది. ప్రజల జీవితాలు అంటే వారి సమస్యలు, పరిస్థితులు తదేకంగా మారుతుంటాయని గుర్తుంచుకోండి. వారిని ఇంటివద్ద కలుసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించడం అవసరం కావచ్చు, అయితే అది వృధాప్రయాస కాదు. దేవుని రక్షణ సందేశం వినే అవకాశం వారికివ్వాలన్నది మన కోరిక. అందువల్ల, రాజ్య సందేశాన్ని అంగీకరించడానికి ఇతరులకు సహాయంచేసే మీ పనిలో ఒప్పింపజేసే మీ నైపుణ్యాలను వృద్ధిచేసుకొనే జ్ఞానమిమ్మని యెహోవా దేవునికి ప్రార్థించండి.
19 రాజ్య సందేశాన్ని మరియెక్కువ వినాలని కోరుకొనే వ్యక్తిని ఒకసారి కనుగొన్న తర్వాత, క్రైస్తవ పనివారిగా మనం ఇంకా ఏమి చేయవచ్చు? మన తర్వాతి ఆర్టికల్ దానికి తగిన సూచనలిస్తోంది.
[అధస్సూచీలు]
a ఒప్పింపజేయడంపై మరింత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకంలోని 48, 49 అధ్యయనాలు చూడండి.
మీకు గుర్తున్నాయా?
• అగ్రిప్ప రాజు ఎదుట పౌలుచేసిన తన పక్షాన చేసిన వాదనను ఏది కార్యసాధకం చేసింది?
• మన సందేశం హృదయాన్ని ఎలా పురికొల్పగలదు?
• హృదయాన్ని చేరడానికి దేవుని వాక్యాన్ని ప్రభావవంతంగా ఉపయోగించడానికి మనకేది సహాయం చేస్తుంది?
• పరిచర్యను మనం దేవుని దృక్కోణం నుండి ఎలా చూడవచ్చు?
[16వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
విజయవంతంగా పునర్దర్శనాలు చేయడం
• ప్రజలపట్ల నిజమైన వ్యక్తిగత శ్రద్ధచూపండి.
• చర్చకు ఆకర్షణీయంగావుండే బైబిలు అంశాన్ని ఎన్నుకోండి.
• ప్రతి సందర్శనం కోసం గృహస్థులను సిద్ధం చేయండి.
• వచ్చేసిన తర్వాతకూడా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉండండి.
• ఆసక్తి సన్నగిల్లకముందే అంటే ఒకటి రెండు రోజుల్లోనే వారిని మళ్లీ సందర్శించండి.
• గృహ బైబిలు అధ్యయనం ఆరంభించాలన్నది మీ ఉద్దేశమని మనస్సులో ఉంచుకోండి
• వారి ఆసక్తిని వృద్ధిచేయుమని యెహోవాకు ప్రార్థించండి.
[15వ పేజీలోని చిత్రం]
గవర్నరు ఫేస్తు రాజైన అగ్రిప్పల ఎదుట ఉన్నప్పుడు పౌలు ఒప్పింపజేసేలా మాట్లాడాడు