వారు యెహోవా చిత్తాన్ని చేశారు
పౌలు అధికారుల ముందు ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు
ఆ పురుషులిద్దరి మధ్యగల తేడా ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరు కిరీటం ధరించి ఉంటే మరొకరు బంధకాల్లో ఉన్నారు. ఒకరు రాజు; మరొకరు ఖైదీ. అపొస్తలుడైన పౌలు చెరసాలలో రెండేళ్లు గడిపిన తర్వాత, ఇప్పుడు యూదుల పరిపాలకుడైన రెండవ హేరోదు అగ్రిప్ప ఎదుట నిలబడివున్నాడు. రాజూ ఆయన ఉంపుడుగత్తె బెర్నీకే “మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణమందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశిం”చారు. (అపొస్తలుల కార్యములు 25:23) “అక్కడ బహుశ వందలాదిమంది ఉండివుంటారు” అని ఈ విషయానికి సంబంధించిన ఒక పుస్తకం చెబుతోంది.
అధిపతిగా క్రొత్తగా నియుక్తుడైన ఫేస్తు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అతనికి ముందు అధిపతిగా ఉన్న ఫేలిక్సు, పౌలు చెరసాలలో మగ్గిపోయేందుకు వదిలేశాడు. అయితే ఫేస్తు మాత్రం పౌలుకు విరుద్ధంగా చేయబడిన ఆరోపణల సత్యత్వాన్ని ప్రశ్నించాడు. అంతెందుకు, పౌలు తాను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎంతో పట్టుబట్టి, తన విషయం కైసరు ఎదుట విన్నవించుకుంటానని కోరాడు! పౌలు కేసు రాజైన అగ్రిప్ప ఆసక్తిని రేకెత్తించింది. “ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరుచున్నా”నని ఆయన అన్నాడు. ఈ అసాధారణమైన ఖైదీని గురించి రాజు ఏమనుకుంటాడా అని ఆలోచిస్తూ ఫేస్తు త్వరత్వరగా ఏర్పాట్లు చేసివుండవచ్చు.—అపొస్తలుల కార్యములు 24:27–25:22.
ఆ మర్నాడు, పౌలు అధికారుల పెద్ద సమూహం ఎదుట నిలబడి ఉన్నాడు. “తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక . . . నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొనుచున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను” అని ఆయన అగ్రిప్పకు విన్నవించుకున్నాడు.—అపొస్తలుల కార్యములు 26:2, 3.
ధైర్యంతో కూడిన పౌలు ప్రతివాదన
గతంలో తాను క్రైస్తవులను ఎలా హింసించాననేది పౌలు అగ్రిప్పకు మొదట వివరించాడు. తర్వాత ఆయనిలా కొనసాగించాడు, “వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని . . . యతర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని.” పౌలు తాను ఒక గణనీయమైన దర్శనాన్ని ఎలా చూసిందీ వివరించడం కొనసాగించాడు, ఆ దర్శనంలో పునరుత్థానుడైన యేసు ఆయననిలా అడిగాడు: ‘నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము.’a—అపొస్తలుల కార్యములు 26:4-14.
తర్వాత, “నీవు నన్ను చూచియున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు [“చూపబోయే,” పరిశుద్ధ బైబల్] సంగతినిగూర్చియు” అన్ని జనాంగాల ప్రజలకూ సాక్ష్యమిచ్చేందుకు నిన్ను నియమిస్తున్నానని యేసు సౌలుకు చెప్పాడు. తాను తన నియామకాన్ని నెరవేర్చేందుకు తీవ్రంగా కృషి చేశానని పౌలు చెప్పాడు. అయినప్పటికీ, “ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి” అని ఆయన అగ్రిప్పకు చెప్పాడు. యూదా మతంలో అగ్రిప్పకున్న ఆసక్తిని మనస్సులో ఉంచుకుని, పౌలు తన సాక్ష్యపు పనిలో మెస్సీయ మరణ పునరుత్థానాల గురించి “ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు” ఇమిడి లేవని నొక్కి చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 26:15-23.
ఫేస్తు మధ్యలో అంతరాయం కలిగిస్తాడు. “అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని” అతడు గట్టిగా అంటాడు. పౌలు ఇలా సమాధానమిస్తాడు: “మహా ఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.” పౌలు తర్వాత అగ్రిప్ప గురించి ఇలా చెబుతాడు: “రాజు ఈ సంగతు లెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు.”—అపొస్తలుల కార్యములు 26:24-26.
తర్వాత పౌలు సూటిగా అగ్రిప్పతోనే మాట్లాడతాడు. “అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా?” నిస్సందేహంగా ఈ ప్రశ్న అగ్రిప్పకు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు. ఎంతైనా ఆయన తన స్థానాన్ని కాపాడుకోవలసి ఉంది, అంతేగాక పౌలు మాటలతో ఏకీభవించడం, ఫేస్తు ‘వెఱ్ఱితనమని’ పిలిచినదాని పక్షం వహించినట్లవుతుంది. బహుశ అగ్రిప్ప సంశయించడాన్ని గ్రహించిన పౌలు తన ప్రశ్నకు తానే సమాధానమిచ్చాడు. “నమ్ముచున్నారని నేనెరుగుదును” అని ఆయన అన్నాడు. [ఇటాలిక్కులు మావి.] అగ్రిప్ప ఇప్పుడు మాట్లాడతాడు, అయితే ఆయన తన మాటల ద్వారా తన అభిప్రాయమూ, భావాలూ వ్యక్తం కాకుండా జాగ్రత్త వహిస్తాడు. “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే” అని పౌలుతో అన్నాడు.—అపొస్తలుల కార్యములు 26:27, 28.
మాటల్లో పట్టుబడకుండా ఉండేందుకు అగ్రిప్ప చేసిన వ్యాఖ్యానాన్ని, ఒక శక్తివంతమైన విషయాన్ని చెప్పేందుకు పౌలు ఎంతో నైపుణ్యవంతంగా ఉపయోగించుకున్నాడు. “సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక” అని ఆయన అన్నాడు.—అపొస్తలుల కార్యములు 26:29.
పౌలు మరణించేందుకు లేక ఖైదు చేయబడేందుకూ తగిన తప్పేమీ చేయలేదని అగ్రిప్ప, ఫేస్తులు గ్రహించారు. అయినప్పటికీ, కైసరుకు తన విషయాన్ని విన్నవించుకుంటానని పౌలు చేసిన విన్నపాన్ని కూడా వారు నిరాకరించలేరు. అందుకే, అగ్రిప్ప “ఈ మనుష్యుడు—కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చు”నని ఫేస్తుతో అంటాడు.—అపొస్తలుల కార్యములు 26:30-32.
మనకొక పాఠం
అధికారుల ఎదుట పౌలు సాక్ష్యమిచ్చిన పద్ధతి మనకు ఎంతో గణనీయమైన మాదిరినుంచుతుంది. రాజైన అగ్రిప్పతో మాట్లాడేటప్పుడు, పౌలు వివేచనను ఉపయోగించాడు. అగ్రిప్ప, బెర్నీకేలను గురించి ప్రచారంలో ఉన్న విషయాలు ఆయనకు తెలుసనడంలో సందేహంలేదు. వాస్తవానికి, బెర్నీకే అగ్రిప్ప స్వంత సహోదరి గనుక వాళ్లది వావివరసలు తప్పి పెట్టుకున్న సంబంధం. అయితే ఈ సందర్భంలో పౌలు నైతికత గురించి ప్రసంగించడానికి ఎంపిక చేసుకోలేదు. బదులుగా, తానూ అగ్రిప్పా నమ్మిన అంశాలను ఆయన నొక్కి చెప్పాడు. అంతే కాకుండా, సంపూర్ణ జ్ఞానంగల పరిసయ్యుడైన గమలీయేలు వద్ద తాను ఉపదేశం పొందినప్పటికీ, అగ్రిప్ప యూదా మతాచారాల్లో నిపుణుడని ఆయన అంగీకరించాడు. (అపొస్తలుల కార్యములు 22:3) అగ్రిప్పకున్న వ్యక్తిగత నైతిక విలువలు ఏవైనప్పటికీ, అగ్రిప్ప అధికార స్థానంలో ఉన్నాడు గనుక పౌలు ఆయనను మర్యాదపూర్వకంగా సంబోధించాడు.—రోమీయులు 13:7.
మనం మన నమ్మకాల గురించి ధైర్యంగా ప్రకటిస్తాం, అయితే అదే సమయంలో, మన శ్రోతల అపరిశుభ్రమైన ఆచారాలను బహిర్గతం చేయడం లేక ఖండించడం మన లక్ష్యం కాదు. బదులుగా, వాళ్లు సత్యాన్ని అంగీకరించడాన్ని సులభతరం చేసేందుకు, మనమూ వాళ్లూ కలిగున్న ఒకే విధమైన నిరీక్షణల వైపుకు అవధానాన్ని మళ్ళిస్తూ, మనం సువార్త యొక్క అనుకూల అంశాలను నొక్కి చెప్పాలి. మనకంటే పెద్ద వారితో లేక అధికారంలో ఉన్నవారితో మాట్లాడేటప్పుడు, మనం వారి స్థానాన్ని గుర్తించాలి. (లేవీయకాండము 19:32) ఆ విధంగా, “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను” అని చెప్పిన పౌలును మనం అనుకరించగలుగుతాం.—1 కొరింథీయులు 9:22.
[అధస్సూచీలు]
a “మునికోలలకు ఎదురు తన్నుట” అనే వ్యక్తీకరణ, ఎద్దును నడిపించేందుకూ ముందుకు తోలేందుకూ ఉపయోగించే పదునైన మొనతేలిన కర్రను అది తన్నడానికి ప్రయత్నించడాన్ని సూచిస్తుంది. అదే విధంగా, క్రైస్తవులను హింసించడం ద్వారా, సౌలు దేవుని మద్దతుగల ప్రజలకు విరుద్ధంగా పోరాడుతున్నాడు గనుక ఆయన తనకే హాని కలిగించుకుంటాడు.