9వ అధ్యాయం
మంచివార్త ప్రకటించే పద్ధతులు
ఉత్సాహంగా మంచివార్త ప్రకటించే విషయంలో యేసు తన అనుచరులకు చక్కని ఆదర్శం ఉంచాడు. ఆయనే స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ల ఇళ్లల్లో, బహిరంగ స్థలాల్లో ప్రకటించాడు, బోధించాడు. (మత్త. 9:35; 13:36; లూకా 8:1) ఆయన కొంతమందితో వ్యక్తిగతంగా మాట్లాడాడు, శిష్యులకు ఏకాంతంగా బోధించాడు, వేలమంది ప్రజలకు కూడా బోధించాడు. (మార్కు 4:10-13; 6:35-44; యోహా. 3:2-21) ప్రజలకు ప్రోత్సాహాన్ని, నిరీక్షణను ఇచ్చే సందేశాన్ని ప్రకటించడానికి ఆయన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. (లూకా 4:16-19) విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో కూడా, ఆయన మంచివార్త ప్రకటించే అవకాశాల్ని వదులుకోలేదు. (మార్కు 6:30-34; యోహా. 4:4-34) యేసు పరిచర్య గురించి బైబిల్లో చదివినప్పుడు, మనం ఆయన్ని అనుకరించాలని కోరుకోమా? ఖచ్చితంగా కోరుకుంటాం. ఆయన అపొస్తలులు కూడా అలాగే కోరుకున్నారు.—మత్త. 4:19, 20; లూకా 5:27, 28; యోహా. 1:43-45.
2 దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, యేసు మొదలుపెట్టిన ప్రకటనా పనిలో పాల్గొనడానికి క్రైస్తవులకు నేడు ఎలాంటి అవకాశాలున్నాయో పరిశీలించండి.
ఇంటింటి పరిచర్య
3 ఒక క్రమపద్ధతిలో ఇంటింటికి వెళ్లి రాజ్య సువార్త ప్రకటించడం ఎంత ముఖ్యమో యెహోవాసాక్షులమైన మనకు తెలుసు. మనం ఇంటింటి పరిచర్యను ఎంత విస్తృతంగా చేస్తున్నామంటే, అది మనకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. తక్కువ సమయంలో లక్షలమందికి మంచివార్తను ప్రకటించడానికి ఈ పద్ధతి బాగా పనిచేసిందని వచ్చిన ఫలితాల్ని బట్టి తెలుస్తోంది. (మత్త. 11:19; 24:14) యెహోవా మీద, మన పొరుగువాళ్ల మీద ప్రేమ చూపించడానికి ఇంటింటి పరిచర్య ఓ చక్కని మార్గమని రుజువైంది.—మత్త. 22:34-40.
4 ఇంటింటి పరిచర్య యెహోవాసాక్షులు కొత్తగా కనిపెట్టింది కాదు. అపొస్తలుడైన పౌలు, తాను ప్రజల ఇళ్లలో బోధించానని చెప్పాడు. తాను చేసిన పరిచర్య గురించి ఎఫెసులోని పర్యవేక్షకులకు వివరిస్తూ పౌలు ఇలా చెప్పాడు: “నేను ఆసియా ప్రాంతంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి . . . మీకు మంచి చేసే దేన్నీ నేను మీకు చెప్పకుండా ఉండలేదు, మీకు . . . ఇంటింటా బోధించకుండా ఉండలేదు.” ఈ పద్ధతిలో అలాగే ఇతర పద్ధతుల్లో పౌలు, “పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగమని, మన ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచమని యూదులకు, గ్రీసు దేశస్థులకు పూర్తిస్థాయిలో” సాక్ష్యమిచ్చాడు. (అపొ. 20:18, 20, 21) అప్పట్లో రోమా చక్రవర్తులు విగ్రహారాధనను ప్రోత్సహించేవాళ్లు, అంతేకాదు చాలామందికి “దైవభక్తి ఎక్కువ” ఉండేది. కాబట్టి వాళ్లు “లోకాన్ని, అందులో ఉన్న వాటన్నిటినీ చేసిన” దేవుణ్ణి వెదకడం చాలా అవసరమైంది. ఎందుకంటే ఆ సమయంలో, “ప్రజలందరూ పశ్చాత్తాపపడాలని ఆయన ప్రకటిస్తున్నాడు.”—అపొ. 17:22-31.
5 ఇతరులకు మంచివార్త ప్రకటించాల్సిన అవసరం అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువుంది. ఈ దుష్ట వ్యవస్థ అంతం వేగంగా దగ్గరపడుతోంది. కాబట్టి ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మనం ఇంకా ఎక్కువ కృషి చేయాలనుకుంటాం. సత్యం కోసం అలమటిస్తున్న ప్రజల్ని వెదకడానికి, ఇంటింటి పరిచర్య కన్నా మెరుగైన పద్ధతి మరొకటి లేదని ఎన్నో సంవత్సరాలుగా రుజువౌతూ వచ్చింది. ఇంటింటి పరిచర్య యేసు కాలంలో, అపొస్తలుల కాలంలో ఎంత సమర్థవంతంగా పనిచేసిందో, ఇప్పుడు కూడా అంతే సమర్థవంతంగా పనిచేస్తోంది.—మార్కు 13:10.
6 ఇంటింటి పరిచర్యలో మీరు పూర్తిగా పాల్గొంటున్నారా? అయితే, యెహోవా మీ విషయంలో సంతోషిస్తున్నాడనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. (యెహె. 9:11; అపొ. 20:35) కొన్నిసార్లు, ఇంటింటి పరిచర్య చేయడం మీకు కష్టంగా ఉండవచ్చు. బహుశా మీకు శారీరక పరిమితులు ఉండివుంటాయి, లేదా మీ క్షేత్రంలోని చాలామంది ప్రజలు మంచివార్త వినడానికి ఇష్టపడకపోవచ్చు. వాటికితోడు, ప్రభుత్వ ఆంక్షలు ఉండవచ్చు. బహుశా మీరు బిడియస్థులు అవ్వడం వల్ల పరిచయంలేని వాళ్లతో సంభాషణ మొదలుపెట్టడం చాలా కష్టంగా ఉండవచ్చు. కాబట్టి ఇంటింటి పరిచర్యకు వెళ్లిన ప్రతీసారి మీకు కాస్త కంగారుగా ఉంటుంది. కానీ నిరుత్సాహపడకండి. (నిర్గ. 4:10-12) చాలా దేశాల్లోని సహోదరసహోదరీలు మీలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
7 యేసు తన శిష్యులకు ఇలా మాటిచ్చాడు: “ఇదిగో! ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.” (మత్త. 28:20) శిష్యుల్ని చేసే పనిలో పాల్గొనేలా ఆ మాటలు మనల్ని బలపరుస్తాయి. మనం కూడా, “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను” అని చెప్పిన అపొస్తలుడైన పౌలులాగే భావిస్తాం. (ఫిలి. 4:13) ఇంటింటి పరిచర్యకు సంబంధించి సంఘం చేసిన ఏర్పాట్లను పూర్తిగా వినియోగించుకోండి. ఇతరులతో కలిసి పరిచర్య చేసినప్పుడు మీరు ప్రోత్సాహాన్ని, వ్యక్తిగత సహాయాన్ని పొందుతారు. మీకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా, వాటిని ఎదిరించేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి, మంచివార్తను ఉత్సాహంగా ప్రకటించడానికి మీ శక్తిని ధారపోయండి.—1 యోహా. 5:14.
8 మీరు ఇతరులకు మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు, ‘మీ నిరీక్షణకు’ కారణాన్ని చెప్పే అవకాశాలు మీకు దొరుకుతాయి. (1 పేతు. 3:15) అంతేకాదు, రాజ్య నిరీక్షణ ఉన్నవాళ్లకు, లేనివాళ్లకు మధ్య తేడా మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. (యెష. 65:13, 14) అలాగే, ‘మీ వెలుగును ప్రకాశింపనివ్వండి’ అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడుతున్నారనే సంతృప్తి మీకుంటుంది. అంతేకాదు యెహోవా గురించి, శాశ్వత జీవానికి నడిపించే సత్యం గురించి ఇతరులు తెలుసుకునేలా సహాయం చేసే గొప్ప అవకాశం కూడా మీకు దొరకవచ్చు.—మత్త. 5:16; యోహా. 17:3; 1 తిమో. 4:16.
9 వారాంతాల్లో, అలాగే వారం మధ్యలో ఇంటింటి పరిచర్య కోసం ఏర్పాట్లు చేయబడతాయి. ఉదయం పూట ఎక్కువమంది ప్రజలు ఇళ్లల్లో ఉండని ప్రాంతాల్లో, కొన్ని సంఘాలు సాయంకాల పరిచర్యను ఏర్పాటు చేసుకుంటాయి. సాధారణంగా ప్రజలు ఉదయం కన్నా, మధ్యాహ్నం దాటిన తర్వాత గానీ, సాయంత్రాలు గానీ ఎవరైనా తమతో మాట్లాడడానికి వస్తే, వినడానికి ఎక్కువ ఇష్టపడతారు.
అర్హుల్ని వెదకడం
10 ఎవరు యోగ్యులో ‘వెదకమని’ యేసు తన శిష్యులకు చెప్పాడు. (మత్త. 10:11) అర్హుల్ని వెదికే పనిని ఆయన కేవలం ఇంటింటి పరిచర్యకే పరిమితం చేయలేదు. బదులుగా అవకాశం దొరికిన ప్రతీసారి ఇంటింటా లేదా అనియతంగా సాక్ష్యం ఇచ్చాడు. (లూకా 8:1; యోహా. 4:7-15) అపొస్తలులు కూడా వేర్వేరు ప్రాంతాల్లో ప్రజలకు సాక్ష్యమిచ్చారు.—అపొ. 17:17; 28:16, 23, 30, 31.
వీలైతే ప్రతీఒక్కరికి రాజ్య సందేశాన్ని ప్రకటించాలన్నదే మన లక్ష్యం
11 నేడు కూడా, వీలైతే ప్రతీఒక్కరికి రాజ్య సందేశాన్ని ప్రకటించాలన్నదే మన లక్ష్యం. అంటే, శిష్యుల్ని చేసే పనిలో యేసు, అపొస్తలుల విధానాన్ని మనం అనుకరించాలి. అలాగే మారుతున్న కాలాన్ని బట్టి, మన క్షేత్రంలో మారుతున్న ప్రజల పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు మన పరిచర్య పద్ధతుల్ని మార్చుకోవాలి. (1 కొరిం. 7:31) ఉదాహరణకు, వ్యాపార స్థలాల్లో ప్రకటించడం వల్ల ప్రచారకులకు మంచి ఫలితాలు వచ్చాయి. చాలా దేశాల్లో, వీధి సాక్ష్యం వల్ల అలాగే పార్కుల్లో, పార్కింగ్ స్థలాల్లో లేదా ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకటించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. కొన్ని సంఘాలు సాక్ష్యమివ్వడానికి తమ క్షేత్రంలోనే టేబుళ్లను లేదా కార్టులను ఏర్పాటు చేశాయి. వీటితోపాటు కొన్ని నగరాల్లో ప్రజలు ఎక్కువగా నడిచే స్థలాల్లో ప్రత్యేక మెట్రోపోలిటన్ బహిరంగ సాక్ష్యాన్ని ఇచ్చే ఏర్పాటును బ్రాంచి కార్యాలయం చేయవచ్చు. దీనికోసం వేర్వేరు సంఘాల వాళ్లను ఉపయోగించుకోవచ్చు. ఈ ఏర్పాటువల్ల, ఇంటింటి పరిచర్యలో కలవలేని వాళ్లను కలిసి మంచివార్త ప్రకటించడం వీలౌతుంది.
12 బైబిలు సందేశం పట్ల ఆసక్తి చూపించేవాళ్లను బహిరంగ స్థలాల్లో కలిసినప్పుడు, వాళ్లకు సరిపోయే ప్రచురణను ఇవ్వవచ్చు. వాళ్లలో ఆసక్తిని పెంచడానికి మీ వివరాలిచ్చి, పునర్దర్శనం కోసం ఏర్పాట్లు చేసుకోవచ్చు, jw.org వెబ్‌సైట్ చూడమని చెప్పవచ్చు లేదా దగ్గర్లో జరిగే సంఘ కూటాల అడ్రస్ ఇవ్వవచ్చు. బహిరంగ స్థలాల్లో ప్రజల్ని కలిసి సాక్ష్యమివ్వడం, సంతోషంగా మన పరిచర్యను విస్తృతం చేసుకునే ఒక పద్ధతి.
13 అయితే, క్రైస్తవులుగా మనకు అప్పగించబడిన పనిలో ఇతరులకు మంచివార్త ప్రకటించడం మాత్రమే లేదు. శాశ్వత జీవానికి నడిపించే సత్యాన్ని హత్తుకునేలా ఇతరులకు సహాయం చేయాలంటే, ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీమళ్లీ కలవాలి. అప్పుడే వాళ్లు పరిణతిగల క్రైస్తవులుగా ప్రగతి సాధించగలుగుతారు.
పునర్దర్శనాలు చేయడం
14 యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.” (అపొ. 1:8) అయితే, ఆయన వాళ్లకు ఇలా కూడా చెప్పాడు: “కాబట్టి, మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి; . . . నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.” (మత్త. 28:19, 20) పునర్దర్శనాలు చేయడం ద్వారా మనం యెహోవా సేవను ఆనందించవచ్చు. మంచివార్త పట్ల ఆసక్తి చూపించిన ప్రజల్ని మళ్లీ కలవడానికి వెళ్లినప్పుడు, వాళ్లు మిమ్మల్ని చూసి సంతోషించవచ్చు. మీరు వాళ్లతో ఇంకొన్ని బైబిలు విషయాలు చర్చిస్తే, దేవుని మీద వాళ్లకున్న విశ్వాసం బలపర్చగలుగుతారు. తమ ఆధ్యాత్మిక అవసరాన్ని వాళ్లు గుర్తించడానికి మీరు సహాయం చేయగలుగుతారు. (మత్త. 5:3) మీరు బాగా సిద్ధపడి, వాళ్లకు అనుకూలమైన సమయంలో పునర్దర్శనాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఓ బైబిలు అధ్యయనాన్ని మొదలుపెట్టగలుగుతారు. సాధారణంగా, బైబిలు అధ్యయనాలను మొదలుపెట్టాలన్న ఉద్దేశంతోనే మనం పునర్దర్శనాలు చేస్తాం. అలా మనం సత్యపు విత్తనాన్ని నాటడం మాత్రమే కాదు, నీళ్లు కూడా పోస్తాం.—1 కొరిం. 3:6.
15 పునర్దర్శనాలు చేయడం కొంతమందికి కష్టంగా ఉండవచ్చు. మీరు ఇంటి వ్యక్తితో క్లుప్తంగా మాట్లాడి మంచివార్త ప్రకటించడంలో నైపుణ్యం సాధించి ఉండవచ్చు, అలా చేయడాన్ని మీరు ఆనందిస్తుండవచ్చు. కానీ, వాళ్లను మళ్లీ కలిసి బైబిలు గురించి చర్చించాలంటే మాత్రం మీకు ఓ పెద్ద సవాలుగా అనిపించవచ్చు. మంచి సిద్ధపాటు ఉంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారం మధ్యలో జరిగే కూటంలో నేర్చుకున్న మంచి సలహాల్ని పాటించేలా చూసుకోండి. కావాలనుకుంటే, మీతోపాటు అనుభవంగల ప్రచారకుణ్ణి తీసుకెళ్లవచ్చు.
బైబిలు అధ్యయనాలు నిర్వహించడం
16 మంచివార్త ప్రచారకుడైన ఫిలిప్పు, దేవుని వాక్యం చదువుతున్న ఒక యూదామత ప్రవిష్టునితో మాట్లాడుతూ ఇలా అడిగాడు: “నువ్వు చదువుతున్నది నీకు అర్థమౌతోందా?” దానికి ఆ వ్యక్తి, “ఎవరో ఒకరు విడమర్చి చెప్పకపోతే నాకెలా అర్థమౌతుంది?” అని అన్నాడు. ఫిలిప్పు, అతను చదువుతున్న లేఖన భాగంతో సంభాషణ మొదలుపెట్టి, “యేసు గురించిన మంచివార్త అతనికి ప్రకటించాడు” అని అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చెప్తుంది. (అపొ. 8:26-36) ఫిలిప్పు అతనితో ఎంతసేపు మాట్లాడాడో మనకు తెలీదుగానీ, అతను విశ్వాసియై బాప్తిస్మం తీసుకుంటానని అడిగేంతగా అతనికి మంచివార్తను వివరించాడు. అలా అతను యేసుక్రీస్తు శిష్యుడయ్యాడు.
17 నేడు చాలామందికి బైబిలు గురించి తెలీదు. కాబట్టి, వాళ్లు విశ్వాసాన్ని పెంపొందించుకొని, బాప్తిస్మానికి అర్హులవ్వాలంటే మనం వాళ్లను చాలాసార్లు కలవాల్సివుంటుంది. కొన్ని వారాలు, నెలలు, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు బైబిలు అధ్యయనం చేయాల్సివుంటుంది. యథార్థ హృదయంగల వాళ్లు శిష్యులయ్యేలా మీరు ఓపిగ్గా, ప్రేమతో సహాయం చేసినప్పుడు చక్కని ఫలితాలు వస్తాయి. అంతేకాదు యేసు చెప్పినట్లు, “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొ. 20:35.
18 బైబిలు అధ్యయనాలు చేయడానికి రూపొందించిన ప్రచురణల్లో ఒకదాన్ని ఉపయోగించి మీరు అధ్యయనం నిర్వహించవచ్చు. వారం మధ్యలో జరిగే కూటంలోని నిర్దేశాల్ని పాటించినప్పుడు, సంఘంలో అనుభవంగల బోధకులతో కలిసి పనిచేసినప్పుడు, మీరు కూడా ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించగలుగుతారు. యేసుక్రీస్తు శిష్యులయ్యేలా ఇతరులకు సహాయం చేయగలుగుతారు.
19 బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి, వాటిని నిర్వహించడానికి మీకు సహాయం అవసరమైతే, పర్యవేక్షకుల్లో ఒకరితో గానీ బైబిలు అధ్యయనాలు బాగా చేసే తోటి సాక్షితో గానీ మాట్లాడండి. క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌లో వచ్చే సలహాలు, కూటంలో చూపించే ప్రదర్శనలు కూడా మీకు సహాయం చేస్తాయి. కాబట్టి యెహోవాపై ఆధారపడుతూ, బైబిలు అధ్యయనం చేయాలనే మీ కోరిక గురించి ప్రార్థించండి. (1 యోహా. 3:22) సాధ్యమైతే, మీ కుటుంబ సభ్యులతో చేసే బైబిలు అధ్యయనమే కాక, ఇంకొక బైబిలు అధ్యయనం చేయాలనే లక్ష్యం పెట్టుకోండి. బైబిలు అధ్యయనాలు చేయడంవల్ల పరిచర్యలో మీ ఆనందం రెట్టింపు అవుతుంది.
ఆసక్తి చూపించినవాళ్లను యెహోవా సంస్థ వైపుకు నడిపించడం
20 ప్రజలు యెహోవా గురించి తెలుసుకుని యేసుక్రీస్తు శిష్యులయ్యేలా మనం సహాయం చేసినప్పుడు, వాళ్లు సంఘంలో ఒక భాగమౌతారు. బైబిలు విద్యార్థులు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తూ పరిణతి చెందాలంటే, వాళ్లు యెహోవా సంస్థను గుర్తించి, దానికి సహకరించాలి. అదెలా చేయాలో మీరు వాళ్లకు నేర్పించడం చాలా ప్రాముఖ్యం. కొన్ని వీడియోలను అలాగే నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు? అనే బ్రోషుర్‌ను ప్రత్యేకంగా దానికోసమే రూపొందించారు. ఈ పుస్తకంలోని 4వ అధ్యాయంలో ఉన్న సమాచారం కూడా మీకు సహాయకరంగా ఉండవచ్చు.
21 నేడు భూమ్మీద ప్రకటనా పని జరిగించడానికి యెహోవా ఒక సంస్థను ఉపయోగిస్తున్నాడనే విషయాన్ని, అధ్యయనం మొదలుపెట్టినప్పటి నుండే మీ విద్యార్థికి చెప్పండి. బైబిలు అధ్యయనం కోసం రూపొందించిన మన ప్రచురణలు ఎంత విలువైనవో చెప్పండి. అంతేకాదు, దేవుని సమర్పిత స్వచ్ఛంద సేవకులు వాటిని ఎలా తయారుచేసి, ప్రపంచవ్యాప్తంగా పంచిపెడుతున్నారో కూడా వివరించండి. రాజ్యమందిరంలో జరిగే కూటాలకు మీతోపాటు రమ్మని మీ బైబిలు విద్యార్థిని ఆహ్వానించండి. కూటాలు ఎలా జరుగుతాయో అతనికి వివరించండి, అక్కడ మీ స్నేహితులకు అతన్ని పరిచయం చేయండి. అంతేకాదు ప్రాంతీయ, ప్రాదేశిక సమావేశాల్లో ఇతర సహోదరసహోదరీలకు కూడా మీరు అతన్ని పరిచయం చేయవచ్చు. ఈ సందర్భాల్లో అలాగే ఇతర సందర్భాల్లో, నిజక్రైస్తవుల గుర్తింపు చిహ్నమైన ప్రేమను యెహోవా ప్రజలు ఎలా చూపిస్తున్నారో, మీ బైబిలు విద్యార్థిని స్వయంగా గమనించనివ్వండి. (యోహా. 13:35) అలా అతనికి యెహోవా సంస్థపై కృతజ్ఞత పెరిగేకొద్దీ, యెహోవాకు ఇంకా దగ్గరౌతాడు.
బైబిలు సాహిత్యాన్ని ఉపయోగించడం
22 తొలి క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ప్రచురించే పనిని ఉత్సాహంగా చేశారు. వాళ్లు తమకోసం, అలాగే సంఘాల్లో అధ్యయనం చేయడం కోసం లేఖనాల ప్రతుల్ని తయారుచేశారు. దేవుని వాక్యంలోని సత్యాన్ని ఇతరులకు పరిచయం చేశారు. అప్పట్లో, వాళ్లు చేతితో రాసుకున్న ప్రతులు కొన్ని మాత్రమే ఉండేవి, కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా భద్రపర్చేవాళ్లు. (కొలొ. 4:16; 2 తిమో. 2:15; 3:14-17; 4:13; 1 పేతు. 1:1) నేడు, యెహోవాసాక్షులు ఆధునిక ముద్రణ పద్ధతుల్ని ఉపయోగించి లక్షలాది బైబిళ్లను, కోట్ల సంఖ్యలో బైబిలు అధ్యయన ప్రచురణల్ని ఉత్పత్తి చేస్తున్నారు. వందల భాషల్లో ముద్రించబడే కరపత్రాలు, బ్రోషుర్లు, పుస్తకాలు, పత్రికలు అందులో ఉన్నాయి.
23 మీరు మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు, యెహోవా సంస్థ రూపొందించిన బైబిలు అధ్యయన ప్రచురణల్ని ఉపయోగించండి. యెహోవాసాక్షుల ప్రచురణల్ని చదవడంవల్ల, అధ్యయనం చేయడంవల్ల మీరు ఎంత ప్రయోజనం పొందారో ఆలోచిస్తే, వాటిని ప్రజలకు అందించాలని మీరు అంత ఎక్కువగా కోరుకుంటారు.—హెబ్రీ. 13:15, 16.
24 నేడు చాలామంది ప్రజలు, సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. అందుకే బైబిలు సాహిత్యంతో పాటు, మంచివార్తను సమర్థవంతంగా ప్రకటించడానికి మన అధికారిక వెబ్‌సైట్ jw.org ఒక మంచి పనిముట్టు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ కంప్యూటర్లను ఉపయోగించి ఆ వెబ్‌సైట్‌లో వందల భాషల్లో అందుబాటులో ఉన్న బైబిళ్లను, బైబిలు ప్రచురణల్ని చదవవచ్చు లేదా ఆడియో రికార్డింగులను వినవచ్చు. మనతో మాట్లాడడానికి సంకోచించేవాళ్లు, లేదా యెహోవాసాక్షుల్ని కలిసే అవకాశంలేని ప్రాంతాల్లోని ప్రజలు, ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించి తమ ఇళ్లలోనే మన నమ్మకాల గురించి తెలుసుకోగలుగుతున్నారు.
25 అందుకే, సరైన అవకాశం దొరికిన ప్రతీసారి మనం jw.org గురించి ఇతరులకు చెప్తాం. మన నమ్మకాల గురించి గృహస్థుడు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, మనం ఫోన్‌లో లేదా ట్యాబ్‌లో అక్కడికక్కడే జవాబు చూపించవచ్చు. ఒకవేళ మనం పరిచర్యలో వేరే భాష మాట్లాడేవాళ్లను, లేదా సంజ్ఞా భాష మాట్లాడేవాళ్లను కలిస్తే, మన వెబ్‌సైట్‌లో వాళ్ల భాషలో ఉన్న బైబిల్ని, బైబిలు ప్రచురణల్ని చూడమని చెప్పవచ్చు. చాలామంది ప్రచారకులు మన వెబ్‌సైట్‌లోని వీడియోల్లో ఒకదాన్ని ఉపయోగించి బైబిలు చర్చలను ప్రారంభించారు.
అనియత సాక్ష్యం
26 తన మాటల్ని వింటున్నవాళ్లతో యేసు ఇలా అన్నాడు: “మీరు లోకానికి వెలుగు లాంటివాళ్లు. . . . మీ వెలుగును మనుషుల ముందు ప్రకాశించనివ్వండి, అప్పుడు వాళ్లు మీ మంచిపనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరుస్తారు.” (మత్త. 5:14-16) శిష్యులు, “నేను లోకానికి వెలుగును” అని చెప్పిన యేసును అనుకరిస్తూ తమ జీవితంలో దేవుని మార్గాల్ని పాటించారు. వినే వాళ్లందరి ప్రయోజనం కోసం, “జీవాన్నిచ్చే వెలుగు” ప్రకాశింపజేసే విషయంలో యేసు క్రైస్తవులకు ఆదర్శాన్ని ఉంచాడు.—యోహా. 8:12.
27 అపొస్తలుడైన పౌలు కూడా మనకు ఆదర్శం ఉంచాడు. (1 కొరిం. 4:16; 11:1) ఆయన ఏథెన్సులో ఉన్నప్పుడు ప్రతీరోజు, సంతవీధుల్లో ఉన్నవాళ్లందరికీ సాక్ష్యమిచ్చేవాడు. (అపొ. 17:17) ఫిలిప్పీలోని క్రైస్తవులు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అందుకే, “లోకంలో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న మీరు, కుటిలమైన, వక్ర తరం మధ్య” జీవిస్తున్నారని పౌలు వాళ్లకు రాయగలిగాడు. (ఫిలి. 2:15, అధస్సూచి) నేడు మనం కూడా, మంచివార్త ప్రకటించే అవకాశం దొరికిన ప్రతీసారి మన మాటల ద్వారా, చేతల ద్వారా రాజ్య సత్యాన్ని ప్రకాశింపజేయవచ్చు. నిజమే, నీతి నిజాయితీగల మన ప్రవర్తనే మనం లోకానికి భిన్నంగా ఉన్నామని ప్రజలకు చూపిస్తుంది. కానీ మంచివార్త గురించి ప్రజలతో మాట్లాడినప్పుడు మనం ఎందుకు అలా భిన్నంగా ఉన్నామో వాళ్లు అర్థం చేసుకుంటారు.
28 యెహోవా ప్రజల్లో చాలామంది ఉద్యోగ స్థలంలో, స్కూల్లో, ప్రయాణంలో లేదా రోజువారీ పనుల కోసం వెళ్తున్నప్పుడు మంచివార్త ప్రకటిస్తారు. మనం ప్రయాణిస్తున్నప్పుడు, సాధారణంగా మన తోటి ప్రయాణికులతో మాట్లాడుతుంటాం. అయితే, ఆ సందర్భాన్ని సాక్ష్యమిచ్చే అవకాశంగా మార్చుకోవడానికి మనం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి అనుకూలమైన ప్రతీ సందర్భంలో ఇతరులకు సాక్ష్యమివ్వడానికి సిద్ధపడి ఉందాం.
29 అలా చేయడం ద్వారా మనం సృష్టికర్తను స్తుతిస్తామనీ ఆయన నామానికి ఘనత తెస్తామనీ గుర్తుంచుకుంటే, సాక్ష్యమిచ్చే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. అంతేకాదు, యథార్థ హృదయంగల వాళ్లు యెహోవాను తెలుసుకుని, ఆయన్ని సేవించేలా సహాయం చేస్తాం. అలాగే, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే శాశ్వత జీవితం అనే నిరీక్షణను పొందేలా సహాయం చేయగలుగుతాం. మనం చేసే అలాంటి కృషిని బట్టి యెహోవా సంతోషిస్తాడు, దాన్ని పవిత్రమైన సేవగా పరిగణిస్తాడు.—హెబ్రీ. 12:28; ప్రక. 7:9, 10.
క్షేత్రం
30 పట్టణాల్లో, పల్లెల్లో, ప్రపంచవ్యాప్తంగా రాజ్య సువార్త ప్రకటించబడాలన్నదే యెహోవా ఇష్టం. అందుకే సంఘాలకు అలాగే మారుమూల ప్రాంతాల్లో సేవచేస్తున్న సహోదరసహోదరీలకు బ్రాంచి కార్యాలయం క్షేత్రాన్ని నియమిస్తుంది. (1 కొరిం. 14:40) ఈ పద్ధతి, మొదటి శతాబ్దంలో దేవుని నిర్దేశం కింద జరిగిన ఏర్పాటుకు అనుగుణంగా ఉంది. (2 కొరిం. 10:13; గల. 2:9) ఈ చివరి రోజుల్లో రాజ్య పని వేగంగా జరుగుతోంది కాబట్టి సంఘాలు, తమకు నియమించిన క్షేత్రంలో క్రమ పద్ధతిగా పరిచర్య చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
31 క్షేత్రాన్ని క్రమ పద్ధతిగా చేసే పని సేవా పర్యవేక్షకుని నిర్దేశం కింద జరుగుతుంది. క్షేత్రాన్ని నియమించే పనిని ఒక సంఘ పరిచారకుడు చేయవచ్చు. క్షేత్రాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి గుంపు క్షేత్రం, మరొకటి వ్యక్తిగత క్షేత్రం. సంఘానికి తక్కువ క్షేత్రం ఉన్నప్పుడు, తమ గుంపులోని ప్రచారకులు పనిచేసేలా గుంపు పర్యవేక్షకుల దగ్గర గుంపు క్షేత్రాలు ఉంటాయి. మరోవైపు, ఒకవేళ సంఘానికి ఎక్కువ క్షేత్రం ఉంటే, ప్రచారకులు వ్యక్తిగత క్షేత్రం తీసుకోవచ్చు.
32 అప్పుడప్పుడు క్షేత్రసేవా కూటం లేనప్పుడు లేదా పరిచర్య కోసం గుంపును కలవడం అస్సలు కుదరనప్పుడు, ఓ ప్రచారకుడు పరిచర్య చేయడానికి వ్యక్తిగత క్షేత్రం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, కొంతమంది ప్రచారకులు తమ ఉద్యోగ స్థలానికి దగ్గర్లో ఒక క్షేత్రాన్ని అడిగి తీసుకుని, భోజన విరామ సమయంలో లేదా ఆఫీసు అయిపోయాక వెళ్లి పరిచర్య చేస్తారు. మరికొంతమంది సాయంకాలాల్లో పరిచర్య చేయడానికి వీలుగా, తాము నివసిస్తున్న ప్రాంతానికి దగ్గర్లో క్షేత్రాన్ని తీసుకుంటారు. ఒక ప్రచారకునికి తనకు అనుకూలమైన ప్రాంతంలో ఓ వ్యక్తిగత క్షేత్రం ఉండడంవల్ల పరిచర్యలో ఎక్కువ సమయం గడపడం వీలౌతుంది. వ్యక్తిగత క్షేత్రంలో గుంపంతా కలిసి కూడా పరిచర్య చేయవచ్చు. మీకు ఓ వ్యక్తిగత క్షేత్రం కావాలనుకుంటే, టెరిటరీ సర్వెంటును అడిగి తీసుకోవచ్చు.
33 గుంపు క్షేత్రాన్ని తీసుకున్న గుంపు పర్యవేక్షకుడైనా, వ్యక్తిగత క్షేత్రాన్ని తీసుకున్న ప్రచారకుడైనా తమ క్షేత్రంలోని ప్రతీ ఇంట్లో కనీసం ఒక్కరితోనైనా మాట్లాడడానికి తగిన కృషి చేయాలి. క్షేత్రాన్ని పూర్తి చేయడానికి చేసే ఏర్పాట్లు, వాటికి వర్తించే డేటా ప్రొటెక్షన్ నియమాలకు అనుగుణంగా ఉండాలి. క్షేత్రాన్ని తీసుకున్న గుంపు పర్యవేక్షకుడు లేదా ప్రచారకుడు నాలుగు నెలల్లోపే దాన్ని పూర్తి చేయడానికి కృషి చేయాలి. వాళ్లు క్షేత్రాన్ని పూర్తిచేసిన తర్వాత ఆ విషయాన్ని టెరిటరీ సర్వెంటుకు చెప్పాలి. పరిస్థితుల్ని బట్టి, గుంపు పర్యవేక్షకుడు లేదా ప్రచారకుడు, మళ్లీ పరిచర్య చేయడానికి ఆ క్షేత్రాన్ని తమ దగ్గరే ఉంచుకోవచ్చు లేదా దాన్ని టెరిటరీ సర్వెంటుకు తిరిగి ఇచ్చేయవచ్చు.
34 సంఘంలోని వాళ్లందరూ సహకరిస్తే క్షేత్రాన్ని సమగ్రంగా పూర్తి చేయవచ్చు. ఒకే క్షేత్రంలో ఒకేసారి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది ప్రచారకులు పరిచర్య చేస్తూ, ఒక ప్రచారకుడు వెళ్లిన ఇంటికే మళ్లీ వేరే ప్రచారకుడు వెళ్తే గృహస్థులకు చిరాకు కలగవచ్చు, కాబట్టి అలా జరగకుండా చూసుకోవాలి. అలా చేయడం ద్వారా తోటి సహోదరసహోదరీల పట్ల, క్షేత్రంలోని ప్రజలపట్ల మనకు శ్రద్ధ ఉందని చూపిస్తాం.
అన్ని భాషల ప్రజలకు ప్రకటించేలా సహకరించడం
35 ప్రతీఒక్కరు యెహోవా గురించి, ఆయన కుమారుని గురించి, రాజ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. (ప్రక. 14:6, 7) అన్ని భాషల ప్రజలు యెహోవా పేరున ప్రార్థించి రక్షణ పొందేలా, కొత్త వ్యక్తిత్వం ధరించుకునేలా వాళ్లకు సహాయం చేయాలని మనం కోరుకుంటాం. (రోమా. 10:12, 13; కొలొ. 3:10, 11) అయితే, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాల్లో మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు ఎదురయ్యే కొన్ని సవాళ్లు ఏంటి? వీలైనంత ఎక్కువమందికి తమ సొంత భాషలో రాజ్య సందేశాన్ని వినే అవకాశం దొరికేలా ఆ సవాళ్లను ఎలా అధిగమించాలి?—రోమా. 10:14.
36 ప్రతీ సంఘానికి క్షేత్రాన్ని భాష ఆధారంగా నియమిస్తారు. కాబట్టి, వేర్వేరు భాషలవాళ్లు ఉన్న ప్రాంతాల్లో, వేర్వేరు సంఘాల ప్రచారకులు ఒకే క్షేత్రంలో పని చేస్తారు. అలాంటి సందర్భాల్లో, ప్రతీ సంఘంలోని ప్రచారకులు తమ భాష మాట్లాడే ప్రజలకు ప్రకటించడం మీదే దృష్టిపెట్టడం మంచిది. ప్రతీ సంవత్సరం ఆహ్వాన ప్రతుల్ని పంచిపెట్టే ప్రచార కార్యక్రమానికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే బహిరంగ సాక్ష్యం, అనియత సాక్ష్యం ఇస్తున్నప్పుడు మాత్రం, ప్రచారకులు ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఏ భాషా ప్రచురణనైనా ఇవ్వవచ్చు.
37 కొన్ని సందర్భాల్లో, దూరంగా ఉన్న క్షేత్రాల్ని వేరే-భాషా సంఘాలు క్రమంగా పూర్తి చేయడం కష్టంగా ఉండవచ్చు. అలాంటప్పుడు, ఒకే క్షేత్రంలో పని చేస్తున్న వేర్వేరు భాషా సంఘాల సేవా పర్యవేక్షకులు ఆ క్షేత్రాన్ని ఎలా పూర్తి చేయాలో కలిసి చర్చించుకోవాలి. ఆ క్షేత్రాన్ని పూర్తి చేయడానికి వాళ్లందరికీ అనువైన ఓ పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి. అలా చేస్తే, క్షేత్రంలోని ప్రతీఒక్కరికి రాజ్య సందేశం వినే అవకాశం దొరుకుతుంది. అంతేకాదు, వేర్వేరు భాషా సంఘాలవాళ్లు, వెళ్లిన ఇంటికే మళ్లీ వెళ్లకుండా ఉండగలుగుతారు.—సామె. 15:22.
38 మనం ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు, వేరే భాష మాట్లాడే ప్రజలు ఎదురైతే ఏమి చేయాలి? ఆ భాష మాట్లాడే ప్రచారకులు వచ్చి వాళ్లతో మాట్లాడతారని మనం అనుకోకూడదు. కొంతమంది ప్రచారకులు, తమ క్షేత్రంలో ఏ భాష మాట్లాడే ప్రజలు తరచూ ఎదురౌతారో ఆ భాషలో ఒక చిన్న అందింపును ఇవ్వడం నేర్చుకున్నారు. మన అధికారిక వెబ్‌సైట్ jw.org నుండి తమ భాషలో ఉన్న ఓ ప్రచురణను ఎలా చదవాలో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో గృహస్థునికి చూపించవచ్చు లేదా అతని భాషలో ప్రచురణల్ని తెచ్చి ఇస్తామని చెప్పవచ్చు.
39 ఆ వ్యక్తి నిజంగా ఆసక్తి చూపిస్తే, అతని భాష వచ్చిన సహోదరసహోదరీలు దగ్గర్లో ఎక్కడున్నారో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అంతేకాదు అతని భాషలో కూటాలు దగ్గర్లో ఎక్కడ జరుగుతాయో అతనికి చెప్పవచ్చు. తన భాష మాట్లాడే వాళ్లెవరైనా వచ్చి తనను కలవాలని ఇష్టపడితే, తన చిరునామాను jw.orgలో ఎలా నింపాలో మనం అతనికి చూపించవచ్చు. అప్పుడు బ్రాంచి కార్యాలయం, అతనికి మరింత సహాయం చేయగల ఒక ప్రచారకుడు, గుంపు లేదా సంఘం దగ్గర్లో ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
40 తన భాష మాట్లాడే ప్రచారకులు తనను కలిశారని ఆ వ్యక్తి చెప్పేంతవరకు మనం అతన్ని కలుస్తూనే ఉండాలి. ఒకవేళ ఆ భాష మాట్లాడే ప్రచారకులెవరూ దగ్గర్లో లేకపోతే, బ్రాంచి కార్యాలయం ఆ విషయాన్ని పెద్దలకు తెలియజేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో, గృహస్థుని ఆసక్తిని పెంచడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. వీలైతే, తన భాషలో ఉన్న ఓ ప్రచురణను ఉపయోగించి మనమే అతనితో బైబిలు అధ్యయనం చేయవచ్చు. ఆ ప్రచురణలో ఉన్న చిత్రాల్ని చక్కగా ఉపయోగిస్తూ, అక్కడ ఇవ్వబడిన లేఖనాల్ని అతనితో చదివిస్తే, బైబిల్లోని కొన్ని విషయాల్ని అతను అర్థం చేసుకోగలుగుతాడు. ఒకవేళ అతని కుటుంబంలో స్థానిక భాష తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే, అధ్యయనంలో చర్చిస్తున్న విషయాల్ని అనువదించడానికి వాళ్లు సుముఖంగా ఉండవచ్చు.
41 ఆ వ్యక్తిని యెహోవా సంస్థ వైపు నడిపించాలంటే అతన్ని మన కూటాలకు ఆహ్వానించాలి. అక్కడ చర్చించే విషయాలు అతనికి పూర్తిగా అర్థం కాకపోయినా సరే మనం ఆహ్వానించాలి. కూటాల్లో లేఖనాలు చదువుతున్నప్పుడు, ఒకవేళ అతని భాషలో బైబిలు ఉంటే, ఆ లేఖనాల్ని తన బైబిల్లో చూసేలా మనం అతనికి సహాయం చేయవచ్చు. సంఘంలోని ఇతరులతో సహవసించడం వల్ల అతను ప్రోత్సాహం పొందుతాడు, ఆధ్యాత్మికంగా ఇంకా ప్రగతి సాధిస్తాడు.
42 ప్రీగ్రూప్‌లు: ప్రతీవారం కూటాలు నిర్వహించడానికి అర్హుడైన ఒక సంఘ పెద్దగానీ సంఘ పరిచారకుడుగానీ లేకపోయినా, సంఘం భాష కాకుండా వేరే భాషలో పరిచర్య చేస్తున్న ప్రచారకులు తగినంతమంది ఉంటే, దాన్ని ప్రీగ్రూప్ అంటారు. ప్రీగ్రూప్‌ని చూసుకోవడానికి ఈ కింది అర్హతలు సాధించిన సంఘాన్ని బ్రాంచి కార్యాలయం ఏర్పాటు చేయవచ్చు:
(1) సంఘం భాష కాకుండా వేరే భాష మాట్లాడే ప్రజలు ఆ క్షేత్రంలో ఎక్కువమంది ఉండాలి.
(2) కనీసం కొంతమంది ప్రచారకులకైనా ఆ భాష వచ్చి ఉండాలి, లేదా ఆ భాష నేర్చుకోవడానికి సుముఖంగా ఉండాలి.
(3) ఆ భాషలో పరిచర్య ఏర్పాట్లకు నాయకత్వం వహించడానికి పెద్దల సభ సుముఖంగా ఉండాలి.
ఒకవేళ పెద్దల సభ ప్రీగ్రూప్‌ని చూసుకోవడానికి ఇష్టపడితే, పెద్దలు ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి సంప్రదిస్తారు. ఆ భాష మాట్లాడే ప్రజలకు ప్రకటించడానికి అప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఇతర సంఘాల గురించి ఆయనకు తెలిసి ఉండవచ్చు, కాబట్టి ఏ సంఘం ప్రీగ్రూప్‌ని చూసుకునే స్థితిలో ఉందో నిర్ధారించడానికి కావాల్సిన విలువైన సమాచారం ఆయన ఇవ్వవచ్చు. ఒక్కసారి సంఘం నిర్ధారించబడ్డాక, ప్రీగ్రూప్‌ని చూసుకునే సంఘంగా గుర్తించబడడానికి ఆమోదం కోరుతూ పెద్దలు బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాస్తారు.
43 గ్రూపులు: బ్రాంచి కార్యాలయం ఒక సంఘాన్ని, గ్రూపును చూసుకునే సంఘంగా గుర్తించాలంటే అది ఈ కింది అర్హతలు చేరుకోవాలి:
(1) ఆ భాషా క్షేత్రంలోని ప్రజలకు మంచివార్త పట్ల తగిన ఆసక్తి ఉండాలి, ఆ భాషా క్షేత్రం అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉండాలి.
(2) ఆ భాష తెలిసిన లేదా నేర్చుకుంటున్న ప్రచారకులు కనీసం కొంతమందైనా ఉండాలి.
(3) ఆ భాషా గ్రూపుకు నాయకత్వం వహిస్తూ వారానికి ఒక్క కూటాన్నైనా లేదా కూటంలోని ఒక భాగాన్నైనా అంటే బహిరంగ ప్రసంగం లేక కావలికోట అధ్యయనం ఆ భాషలో చేయడానికి అర్హుడైన ఓ సంఘ పెద్దగానీ సంఘ పరిచారకుడుగానీ అందుబాటులో ఉండాలి.
ఈ అర్హతలు అవసరమైన మేరకు చేరుకుంటే, పెద్దల సభ పూర్తి వివరాల్ని బ్రాంచి కార్యాలయానికి పంపించి, ఆ భాషా గ్రూపును తమ సంఘం చూసుకుంటుందనే అధికారిక గుర్తింపును ఇవ్వమని కోరుతుంది. ఒక సంఘ పెద్ద ఈ గ్రూపుకు నాయకత్వం వహిస్తే, అతన్ని “గుంపు పర్యవేక్షకుడు” అని పిలుస్తారు. ఒకవేళ సంఘ పరిచారకుడు ఆ బాధ్యతను చూసుకుంటుంటే అతన్ని “గుంపు సేవకుడు” అని పిలుస్తారు.
44 ఒక్కసారి ఆ గ్రూపు స్థాపించబడ్డాక, దాన్ని చూసుకునే సంఘ పెద్దల సభ, ఆ భాషలో జరిగే కూటాల్లో ఇతర భాగాలను ఏమైనా చేర్చాలో లేదో నిర్ధారిస్తుంది. అంతేకాదు, నెలలో ఎంత తరచుగా కూటాలు జరగాలో నిర్ణయిస్తుంది. ఆ గ్రూపు కోసం క్షేత్రసేవా కూటాల్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. ఆ గ్రూపులో వాళ్లందరూ ఆ గ్రూపును చూసుకుంటున్న సంఘంలోని పెద్దల సభ పర్యవేక్షణ కింద పనిచేస్తారు. పెద్దలు వాళ్లకు కావాల్సిన నిర్దేశాలిస్తూ, గ్రూపు అవసరాలపట్ల శ్రద్ధ చూపించడానికి చొరవ తీసుకుంటారు. ప్రాంతీయ పర్యవేక్షకుడు గ్రూపును చూసుకుంటున్న సంఘాన్ని సందర్శిస్తున్నప్పుడు, ఆ వారంలో గ్రూపులోని వాళ్లతో కూడా పరిచర్య చేస్తాడు. తర్వాత, ఆ గ్రూపు సాధిస్తున్న అభివృద్ధి గురించి, దాని అవసరాల గురించి క్లుప్తంగా ఒక రిపోర్టును బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాడు. కొంతకాలానికి ఆ గ్రూపు ఒక సంఘంగా అయ్యే అవకాశం ఉండవచ్చు. వేరే భాషా క్షేత్రాల్లో పరిచర్య చేసేవాళ్లు, దానికి మద్దతిచ్చేవాళ్లు సంస్థ ఇస్తున్న నిర్దేశాల్ని పాటిస్తే యెహోవా సంతోషిస్తాడు.—1 కొరిం. 1:10; 3:5, 6.
గుంపుతో కలిసి సాక్ష్యమివ్వడం
45 యెహోవాకు సమర్పించుకున్న క్రైస్తవులుగా, ఇతరులకు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మనలో ప్రతీఒక్కరికి ఉంది. ప్రకటించడానికి ఎన్నో పద్ధతులు ఉన్నా, ఇతరులతో కలిసి పరిచర్య చేయడాన్ని మనలో చాలామందిమి ఇష్టపడతాం. (లూకా 10:1) అందుకే వారాంతాల్లో, అలాగే వారం మధ్యలో క్షేత్ర పరిచర్య చేయడం కోసం సంఘం కలుసుకుంటుంది. గుంపుగా పరిచర్య చేయడానికి సెలవు రోజులు మంచి అవకాశాన్నిస్తాయి, ఎందుకంటే ఉద్యోగం చేసే చాలామంది సహోదరులకు ఆ రోజు కుదురుతుంది. సంఘ సేవా కమిటీ ప్రచారకులకు అనుకూలమైన సమయాల్లో, స్థలాల్లో, ఉదయం లేదా సాయంత్ర వేళల్లో క్షేత్రసేవా కూటాల్ని ఏర్పాటు చేస్తుంది.
46 గుంపుతో కలిసి పరిచర్య చేయడం వల్ల ప్రచారకులు కలిసి పనిచేయగలుగుతారు, ‘ఒకరి విశ్వాసం వల్ల ఒకరు ప్రోత్సాహం’ పొందుతారు. (రోమా. 1:12) పరిచర్యలో నైపుణ్యం, అనుభవం ఉన్న ప్రచారకులతో కలిసి పని చేయడంవల్ల కొత్త ప్రచారకులు శిక్షణ పొందవచ్చు. కొన్ని ప్రాంతాల్లో, భద్రత కోసం ఇద్దరు లేదా ముగ్గురు ప్రచారకులు కలిసి పరిచర్యకు వెళ్లడం మంచిది. మీరు ఒంటరిగా పరిచర్య చేయాలని అనుకున్నా, గుంపుతో కలవడం వల్ల అందరూ ప్రోత్సాహం పొందుతారు. మీరు చేస్తున్న క్షేత్రంలో వేరే సహోదరసహోదరీలు కూడా పరిచర్య చేస్తున్నారని తెలిసినప్పుడు, మీరు ఇంకా ధైర్యంగా ఉంటారు. పయినీర్లు, ఇతర ప్రచారకులు క్షేత్రసేవా కూటాల్లో ప్రతీదానికి ముఖ్యంగా అవి ప్రతీరోజు జరుగుతుంటే, వాటికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా, వారంలో కనీసం కొన్నిసార్లయినా వెళ్లడానికి కృషి చేయవచ్చు.
47 మనందరం యేసు, ఆయన అపొస్తలుల పద్ధతిని పాటిద్దాం! రాజ్య సువార్తను ప్రకటించే ముఖ్యమైన పనిలో మనం పూర్తిగా భాగం వహించడానికి చేసే కృషిని యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—లూకా 9:57-62.