ఓర్పుకు ప్రతిఫలం లభిస్తుంది
1 “మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.” (లూకా 21:19) ఆ మాటలు, యేసు “యుగసమాప్తి” గురించి ప్రవచిస్తున్నప్పుడు అన్నవి. మన యథార్థతను కాపాడుకోవడంలో మనం అనేక శోధనలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆ మాటలు స్పష్టీకరిస్తున్నాయి. అయినా యెహోవా ఇచ్చే బలంతో మనలో ప్రతి ఒక్కరం, “అంతమువరకు సహించి” ‘రక్షించబడవచ్చు.’—మత్త. 24:3, 13; ఫిలి. 4:13.
2 హింస, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక కృంగుదల వంటివి ప్రతి దినమును ఒక శోధనగా చేయవచ్చు. అయితే యెహోవా పట్ల మన యథార్థతను భంగపరిచేందుకు సాతాను ప్రయత్నిస్తున్నాడనే విషయాన్ని మనం ఎన్నడూ మరచిపోకూడదు. మనం మన తండ్రికి విశ్వసనీయంగా ఉన్న ప్రతి దినం, నిందించువాని సవాలుకు జవాబివ్వడంలో పాలు పంచుకున్న వారమవుతాం. శోధనలు ఎదురైనప్పుడు మనం కార్చే “కన్నీళ్లు” మరువబడవని తెలుసుకోవడం ఎంత ఓదార్పునిస్తుందో కదా! అవి యెహోవాకు అమూల్యమైనవి, మన యథార్థత ఆయన హృదయాన్ని సంతోషపరుస్తుంది!—కీర్త. 56:8; సామె. 27:11.
3 శోధనల చేత శుద్ధి: మనకు కలిగే బాధ, మనలో ఉన్న విశ్వాస బలహీనతను లేక గర్వం, అసహనం వంటి వ్యక్తిత్వ లోపాలను వెల్లడిచేయవచ్చు. లేఖన విరుద్ధ మార్గాల్లో శోధనల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా, దేవుని వాక్యం చెబుతున్న “ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి” అనే ఉపదేశాన్ని మనం పాటించాలి. ఎందుకు? ఎందుకంటే శోధనలు కలిగినప్పుడు నమ్మకంగా ఉంటూ సహించడం, మనం ‘సంపూర్ణులుగా, ఏ విషయములోనైనను కొదువలేనివారిగా’ ఉండడానికి దోహదపడుతుంది. (యాకో. 1: 2-4) సహేతుకత, తదనుభూతి, కరుణ వంటి అమూల్యమైన లక్షణాలను పెంపొందించుకునేందుకు ఓర్పు మనకు సహాయపడుతుంది.—రోమా. 12:15.
4 పరీక్షకు నిలిచిన విశ్వాసం: మనం శోధనలను సహించినప్పుడు పరీక్షకు నిలిచిన విశ్వాసాన్ని సంపాదించుకుంటాం, అది దేవుని దృష్టిలో చాలా అమూల్యమైనది. (1 పేతు. 1:6, 7) అలాంటి విశ్వాసం, భవిష్యత్తులో ఎదురయ్యే శోధనల సమయంలో దృఢంగా నిలిచేందుకు మనల్ని సిద్ధం చేస్తుంది. అంతేకాక మనకు దేవుని ఆమోదం ఉందని మనం గ్రహిస్తాము, అది మన నిరీక్షణను బలపరచి దాన్ని మనకు మరింత వాస్తవంగా చేస్తుంది.—రోమా. 5:3-5.
5 ఓర్పు వల్ల కలిగే అత్యుత్తమ ప్రతిఫలం యాకోబు 1:12 లో ఇలా నొక్కిచెప్పబడింది: “శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.” కాబట్టి మనం యెహోవాకు చేసే ఆరాధనలో స్థిరంగా ఉంటూ ఆయన “తన్ను ప్రేమించువారి”ని మెండుగా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉందాం.