“దేవుని సమాధానము” మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి
“యెహోవా తన ముఖమును నీవైపు త్రిప్పి నీకు సమాధానము కలుగజేయును గాక.”—సంఖ్యాకాండము 6:26.
1. తాను మరణించుటకు కొంచెము ముందు, పౌలు తిమోతికి ఏమి వ్రాసెను, ఇది దేనిని వెల్లడిచేయుచున్నది?
సామాన్య శకము 65వ సంవత్సరమున అపొస్తలుడైన పౌలు రోములో ఖైదీగాయున్నాడు. త్వరలో తాను రోమీయుల శిరశ్ఛేదకునిచేతిలో బలవంతముగా చంపబడనైయున్నను ఆయన సమాధానముతో నిండికొనియుండెను. ఆయన తన యౌవన స్నేహితుడైన తిమోతికి వ్రాసిన మాటలలో ఈ విధముగా చెప్పుటను బట్టి అది వెల్లడియగుచున్నది. “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకు. . .అనుగ్రహించును.”—2 తిమోతి 4:7, 8.
2. కార్యసాధకమైన తన జీవితమంతటిలో, మరణము వరకు పౌలు హృదయమును కాపాడినదేమిటి?
2 మరణమును ఎదుర్కొనబోవు ఆ స్థితిలో పౌలు ఎట్లు అంతటి నెమ్మది గలిగియుండగలిగెను? ఎందుకనగా “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము” ఆయన హృదయమునకు కావలిగాయున్నది. (ఫిలిప్పీయులు 4:7) తాను మొదట క్రైస్తవత్వములోకి మారిననాటనుండి పనిలో నిమగ్నమైయున్న సంవత్సరములన్నిటిలో ఈ సమాధానమే ఆయనను కాపాడినది. అల్లరిమూకలు దొమ్మిగా ముట్టడించినప్పుడు, చెరసారలలో వేయబడినప్పుడు, కొరడాలతో మరియు రాళ్లతో కొట్టబడినప్పుడు ఇది ఆయనను సహించునట్లుచేసినది. మతభ్రష్టత్వము మరియు యూదా మత విధానములోకి మళ్లించు ప్రభావములతో పోరాడునప్పుడు ఇది ఆయనను బలపరచినది. మరియు అది అదృశ్యపు దయ్యపు శక్తులతోను పోరాడునట్లు ఆయనకు సహాయముచేసెను. నిశ్చయముగా కడమట్టుకును ఆయనను అది బలపరచినది.—2 కొరింథీయులు 10:4, 5; 11:21-27; ఎఫెసీయులు 6:11, 12.
3. దేవుని సమాధానమునుగూర్చి ఏ ప్రశ్నలు ఉత్పన్నమాయెను?
3 ఈ సమాధానమును పౌలు ఎంతటి బలమైన శక్తిగా కనుగొనెను! అది ఏమైయున్నదో ఈనాడు మనము నేర్చు కొనగలమా? కష్టతరము మరియు “అపాయకరమైన ఈ కాలములో” “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుటకు” మన హృదయములకు కావలిగాయుండి మనలను బలపరచుటకు అది సహాయముచేయునా?—1 తిమోతి 6:12; 2 తిమోతి 3:1.
దేవునితో సమాధానము—ఎట్లు పోయెను
4. బైబిలులో “సమాధానము” అను పదమునకు కొన్ని అర్థములేవి?
4 బైబిలులో “సమాధానము” అను మాట అనేక అర్థములను కలిగియున్నది. ది న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్‌మెంట్ థియోలజి చూపునట్లు వాటిలో కొన్ని క్రిందచూపబడినవి: “పాతన నిబంధన యంతటిలో [షా.లోమ్’] (సమాధానము) ఆ పదముయొక్క విశాలభావములో క్షేమమును తెలియజేస్తుంది (న్యాయా. 19:20); చివరకు భక్తిహీనుల సంబంధముగా మాట్లాడునప్పుడు కూడ వృద్ధి అనుభావమును తెలుపుతుంది (కీర్త. 73:3); శరీర ఆరోగ్యము (యెష. 57:18[, 19]; కీర్త. 38:3; సంతుష్టి. . .(ఆది. 15:15 మొదలగునవి.); జనాంగములు మరియు మనుష్యుల మధ్య మంచి సంబంధము ( . . .న్యాయా. 4:17; 1 దిన. 12:17, 18); రక్షణ ( . . .యిర్మీ. 29:11; యిర్మీ. 14:13).” వీటన్నిటికంటే అతిప్రాముఖ్యమైనవి యెహోవాతో సమాధానకరమైన సంబంధములు. అవి లేనిదే ఏ ఇతర సమాధానమైనను, ఎంత బాగున్నను తాత్కాలికమైనది మరియు పరిమితమైనదే.—2 కొరింథీయులు 13:11.
5. దేవుని సృష్టియొక్క సమాధానము తొలుత ఎట్లు భంగము చేయబడినది?
5 మొట్టమొదట, సృష్టి యావత్తు యెహోవాతో పూర్ణ సమాధానమును కలిగియుండెను. మంచి కారణముతోనే దేవుడు, తన సృష్టికార్యములన్నిటిని చాలామంచివిగా ప్రకటించెను. నిజమునకు, పరలోక దూతలు వాటిని చూచి జయధ్వనులు చేసినవి. (ఆదికాండము 1:31; యోబు 38:4-7) అయితే అసంతోషకరంగా, ఆ విశ్వ శాంతి నిలువలేదు. ప్రస్తుతము సాతానుగా పిలువబడు ఆత్మీయప్రాణి దేవుని తెలివిగల ప్రాణులలో అతి క్రొత్తదైన హవ్వను దేవునికి విధేయతచూపుటనుండి తొలగిపోవునట్లు ప్రేరేపించుటతో అది ముక్కలైనది. హవ్వ భర్తయైన ఆదాము ఆమెను అనుసరించినప్పుడు మొత్తము తిరుగుబాటుదారులైన ముగ్గురితో విశ్వములో పరస్పర విరోధము మొదలాయెను.—ఆదికాండము 3:1-6.
6. దేవునితో సమాధానమును పోగొట్టుకొనుటవలన మానవజాతికి కలిగిన ఫలితమేమి?
6 దేవునితో సమాధానమును పోగొట్టుకొనుట ఆదాము హవ్వలకు వినాశనకరముగా మారెను. అది నిదానముగా వారి శరీరములను క్షీణింపజేసి, వారి మరణమునకు దారితీసినది. పరదైసులో సమాధానమును అనుభవించుటకు బదులుగా, పెరుగుచున్న తన కుటుంబమును పోషించుటకు ఆదాము ఏదెనుకు వెలుపల సేద్యపరచబడని భూమితో పోరాడవలసివచ్చెను. పరిపూర్ణమైన మానవజాతికి సంతృప్తితో తల్లియగుటకు బదులు, హవ్వ అసంపూర్ణులైన సంతానమును వేదన, మరియు బాధతో కనెను. దేవునితో సమాధానమును పోగొట్టుకొనుట మానవుల మధ్య అసూయ బలత్కారమునకు నడిపినది. కయీను తన సహోదరుడైన హేబెలును చంపాడు. తదుపరి జలప్రళయ సమయమునకు భూమియంతయు బలత్కారముతో నిండిపోయెను. (ఆదికాండము 3:7–4:16; 5:5; 6:11, 12) మన మొదటి తల్లిదండ్రులు మరణించినపుడు వారు నిశ్చయముగా అనేక సంవత్సరముల తర్వాత అబ్రాహాము “క్షేమముగా” (సమాధానముతో NW) వెళ్లినట్లు, సంతృప్తిగలవారై సమాధులలోనికి వెళ్లలేదు.—ఆదికాండము 15:15.
7. (ఎ) సంపూర్ణ సమాధానమును పునరుద్ధరించుటను సూచించు ఏ ప్రవచనమును దేవుడు పలికెను? (బి) దేవుని శత్రువైన సాతాను ఎంత ప్రభావశాలి యాయెను?
7 ఆదాము హవ్వలు, సమాధానమును పోగొట్టుకొన్న తరువాత, మొట్టమొదట బైబిలులో వైరము ప్రస్తావించబడుటను మనము కనుగొందుము. దేవుడు సాతానుతో మాట్లాడి: “మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు” అని చెప్పెను. (ఆదికాండము 3:15) కాలము గడిచినకొలది సాతాను ప్రభావము అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పవలసినంత స్థితికి పెరిగినది. అదేమనగా: “లోకమంతయు దుష్టునియందున్నది.” (1 యోహాను 5:19) సాతాను క్రిందయున్నలోకము నిశ్చయముగా దేవునితో సమాధానము కలిగిలేదు. అందువలన యుక్తమైన రీతిలో శిష్యుడైన యాకోబు క్రైస్తవులను ఇట్లు హెచ్చరించెను: “యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా?”—యాకోబు 4:4.
వైరముతో నిండిన లోకములో సమాధానముతో యుండుట
8, 9. ఆదాము పాపముచేసిన తరువాత, మానవులు దేవునితో ఎట్లు సమాధానముతో ఉండగలిగిరి?
8 ఏదెనులో మొదట దేవుడు “వైరము” అను మాటను ప్రస్తావించినపుడు, సంపూర్ణ సమాధానము సృష్టికి తిరిగి స్థాపించబడుననియు ఆయన ముందుగనే ప్రవచించెను. దేవుని స్త్రీయొక్క సంతానము సమాధానమును భంగముచేసిన మొట్టమొదటివాని తలను చితక త్రొక్కును. ఏదెను నుండి, ఆ వాగ్దానమందు విశ్వాసమును కనపరచిన వారు దేవునితో సమాధానకర సంబంధములను అనుభవించిరి. అబ్రాహామునకు ఇది స్నేహముగా మారెను.—2 దినవృత్తాంతములు 20:7; యాకోబు 2:23.
9 మోషేకాలములో అబ్రాహాము మనుమడైన ఇశ్రాయేలు పిల్లలను యెహోవా ఒక జనాంగముగా ఏర్పరచెను. ఈ జనాంగమునకు ఆయన అందించిన సమాధానము ప్రధానయాజకుడైన అహరోను వారిపై ప్రకటించిన ఆశీర్వాదములలో చూడబడుతుంది. అదేమనగా: “యెహోవా నిన్ను ఆశీర్వాదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా (నీ వైపు తన ముఖమును త్రిప్పి NW) నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.” (సంఖ్యాకాండము 6:24-26) యెహోవా సమాధానము విస్తారమైన దీవెనలనిస్తుంది. అయితే అది షరతులపైన అందించబడినది.
10, 11. ఇశ్రాయేలీయులకు దేవునితో సమాధానము ఏ షరతుపై ఆధారపడియున్నది, మరియు అది ఏ ఫలితమునిచ్చును?
10 యెహోవా ఆ జనాంగముతో ఇట్లు చెప్పెను: “మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములలో చెట్లు ఫలించును. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు.” (లేవీయకాండము 26:3, 4, 6, 12.) తమ శత్రువులబారినుండి భద్రత మరియు వస్తుసంబంధమైనవాటిని విస్తారముగా కలిగియుండుటద్వారా, యెహోవాతో సన్నిహిత సంబంధముండుటద్వారా ఇశ్రాయేలీయులు సమాధానమును అనుభవించగలిగిరి. అయితే ఇది వారు యెహోవా ధర్మశాస్త్రమునకు హత్తుకొనియుండుటపై ఆధారపడియుండును.—కీర్తనలు 119:165.
11 ఆ జనాంగపు చరిత్రయంతటిలో, యెహోవా శాసనములను నమ్మకముగా గైకొనుటకు ప్రయత్నించినవారు ఆయనతో సమాధానమును అనుభవించిరి. తరచు అది వారికి అనేక ఆశీర్వాదములను తెచ్చినది. సొలొమోను పరిపాలన తొలి సంవత్సరములలో దేవునితోగల వారి సమాధానము వారికి వస్తుసంబంధమైన సమృద్ధి కలుగజేయుటయేగాక ఇశ్రాయేలు పొరుగువారితో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసినది. ఆ కాలమును వర్ణించుచు బైబిలిట్లు చెప్పుచున్నది: “సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షా చెట్లక్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.” (1 రాజులు 4:25) చివరకు పొరుగు జనాంగములతో వైరము ఏర్పడినను నమ్మకమైన ఇశ్రాయేలీయులు, నిజముగా అవసరమైనదానిని అనగా దేవునితో సమాధానమును కలిగియుండిరి. ఆ విధముగా, పేరుగాంచిన యుద్ధశూరుడగు దావీదు రాజు ఇట్లు వ్రాసెను: “యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.”—కీర్తన 4:8.
సమాధానమునకు శ్రేష్టమైన ఆధారము
12. చివరకు ఇశ్రాయేలు దేవునితో సమాధానమును ఎట్లు తిరస్కరించినది?
12 చివరకు, సంపూర్ణ సమాధానమును తిరిగి స్థాపించు సంతానము యేసు అను వ్యక్తిగా వచ్చినప్పుడు, ఆయన పుట్టుక సమయములో దేవదూతలు “సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగును గాక” అని పాడిరి. (లూకా 2:14) యేసు ఇశ్రాయేలీయులలో ప్రత్యక్షమాయెను. అయితే వారు దేవుని నిబంధన క్రింద ఉన్నను, ఒక జనాంగముగా వారు ఆయనను తృణీకరించి, చంపబడునట్లు ఆయనను రోమీయులకు అప్పగించిరి. ఆయన మరణమునకు కొద్దికాలమునకు ముందు యేసు యెరూషలేమును గూర్చి యేడ్చి, ఇట్లనెను: “నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగుచేయబడియున్నవి.” (లూకా 19:42; యోహాను 1:11) యేసును తృణీకరించినందున ఇశ్రాయేలీయులు సంపూర్తిగా దేవునితోగల తమ సమాధానమును కోల్పోయిరి.
13. ఆయనతో మానవుడు సమాధానమును పొందుటకు యెహోవా ఏ నూతన మార్గమును ఏర్పరచెను?
13 అయినను, దేవుని సంకల్పములు భగ్నము చేయబడలేదు. యేసు మృతులలోనుండి లేపబడి, తన పరిపూర్ణ ప్రాణపు విలువను సరియైన హృదయముగల మానవుల నిమిత్తమై విమోచన క్రయధనముగా యెహోవాకు అర్పించెను. (హెబ్రీయులు 9:11-14) యేసు బలి మానవులకు అనగా—సహజమైన ఇశ్రాయేలీయులకు అలాగే అన్యులకు—దేవునితో సమాధానమును కనుగొనుటకు నూతనమైన మరియు శ్రేష్టమైన మార్గమాయెను. రోములోని క్రైస్తవులకు వ్రాసిన తన పత్రికలో పౌలు ఇట్లు చెప్పెను: “ఏలయనగా శత్రువులమైయుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి” యున్నాము. (రోమీయులు 5:10) మొదటి శతాబ్దములో, ఈ విధముగా సమాధానమును ఏర్పరచుకొనినవారు దేవుని కుమారులుగా దత్తతు తీసికొనబడి, “దేవుని ఇశ్రాయేలు” అని పిలువబడిన నూతన ఆత్మీయ జనాంగములో సభ్యులుగా యుండునట్లు పరిశుద్ధాత్మచే అభిషేకించబడిరి.—గలతీయులు 6:16; యోహాను 1:12, 13; 2 కొరింథీయులు 1:21, 22; 1 పేతురు 2:9.
14, 15. దేవుని సమాధానమును వర్ణించుము, సాతానుయొక్క శత్రుత్వమునకు గురియైనప్పుడును క్రైస్తవులను అది ఎట్లు సంరక్షించునో వివరించుము.
14 ఈ నూతన ఆత్మీయ ఇశ్రాయేలీయులు సాతాను మరియు వాని లోకపు వైరమునకు గురిగా ఉందురు. (యోహాను 17:14) ఏమైనను, “తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియు” వారు సమాధానమును కలిగియుందురు. (2 తిమోతి 1:2) యేసు వారితో, “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.”—యోహాను 16:33.
15 పౌలు మరియు ఆయన తోటిక్రైస్తవులకు వారు ఎదుర్కొనిన సమస్త కష్టములను సహించుటకు ఈ సమాధానమే సహాయపడినది. అది దేవునితో యేసు బలిద్వారా సాధ్యపరచబడిన నిమ్మళమైన మరియు అనుగుణ్యమైన సంబంధమును ప్రతిబింబించును. యెహోవా శ్రద్ధను తాను ఎరుగుకొలది దానిని కలిగియున్నవానికి అది నిశ్చలమైన సమాధానపు మనస్సును అనుగ్రహించును. ఒక ప్రేమగల తండ్రి చేతులలో ఒదిగిన పిల్లవాడు అలాంటి సమాధానమును కలిగియుండును. అది తనను గూర్చి శ్రద్ధవహించే ఒకరి వలన తాను కాయబడుచున్నానను సంశయములేని నిశ్చయతయై యున్నది. పౌలు ఫిలిప్పీయులను ఇట్లు ప్రోత్సహించెను: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతివిషయములోను ప్రార్థన విజ్ఞాపనలచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును.”—ఫిలిప్పీయులు 4:6, 7.
16. దేవునితో గల సమాధానము మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఒకరితోఒకరికి గల సంబంధముపై ఎట్లు ప్రభావము చూపినది?
16 మానవుడు దేవునితో సమాధానమును పోగొట్టుకొనినందున కలిగిన ఒక ఫలితమేమనగా ద్వేషము మరియు అనానుగుణ్యత. మొదటి శతాబ్దపు క్రైస్తవులు దేవునితో సమాధానమును పొందినందున దాని ఫలితము పూర్తి భిన్నముగా ఉండెను. అదేమనగా “ఐక్యమును కాపాడు. . .సమాధానమను బంధము” అని పౌలు పిలిచినట్లు వారి మధ్య వారు సమాధానము మరియు ఐక్యతను కలిగియుండిరి. (ఎఫెసీయులు 4:3) వారు “ఏక మనస్సుగలవారై, సమాధానముగా జీవించిరి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు వారికి తోడైయుండెను.” అంతేగాక, వారు “సమాధానకరమైన సువార్తను” ప్రకటించిరి. ప్రాముఖ్యముగా సువార్తకు ప్రత్యుత్తరమిచ్చు, ‘సమాధాన పాత్రులకు’ అది రక్షణ సువార్తగా ఉండెను.—2 కొరింథీయులు 13:11; అపొస్తలుల కార్యములు 10:36; లూకా 10:5, 6.
సమాధానకరమైన నిబంధన
17. మనదినములలో దేవుడు తన ప్రజలతో ఏమి చేసెను?
17 అటువంటి సమాధానము ఈనాడు కనుగొనబడగలదా? అవును, కనుగొనబడగలదు. మహిమపరచబడిన యేసుక్రీస్తు ఆధ్వర్యము క్రింద 1914లో దేవుని రాజ్యము స్థాపించబడిననాటనుండి, దేవుని ఇశ్రాయేలీయులలో మిగిలియున్నవారిని ఈ లోకమంతటినుండి యెహోవా సమకూర్చి ఒక సమాధానకరమైన నిబంధనను వారితోచేసెను. ఆవిధముగా ఆయన ప్రవక్తయైన యెహెజ్కేలుద్వారా చేసిన వాగ్దానమును నెరవేర్చాడు. అదేమనగా: “నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను.” (యెహెజ్కేలు 37:26) యెహోవా ఈ నిబంధనను, తమ తొలిశతాబ్దపు సహోదరులవలెనె యేసు బలియందు విశ్వాసమును కనపరచిన అభిషక్త క్రైస్తవులతో చేసెను. వారు తమ ఆత్మీయ కల్మషమునుండి శుద్ధిచేయబడినవారై, తమ్మును తాము తమ పరలోకపు తండ్రికి సమర్పించుకొని, ఆయన ఆజ్ఞలను గైకొనుటకు పోరాడుదురు. ఎక్కువ గుర్తించదగిన రీతిగా, స్థాపించబడిన దేవుని రాజ్యసువార్తను ప్రపంచ వ్యాప్తముగా ప్రకటించుటలో ముందడుగు వేయుటద్వారా వారు ఇలా చేయుచున్నారు.—మత్తయి 24:14.
18. దేవుని నామము దేవుని ఇశ్రాయేలుపై యున్నదని గ్రహించినపుడు అన్యజనులలోని కొందరు ఎట్లు ప్రతిస్పందించిరి?
18 ఆ ప్రవచనము ఇంకను ఈలాగున్నది: “నా మందిరము వారికి పైగానుండును, నేను వారి దేవుడనైయుందును, వారు నా జనులైయుందురు. . .మరియు యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలిసికొందురు.” (యెహెజ్కేలు 37:27, 28) ఇందుకు అనుగుణ్యముగా “అన్యజనుల” లోని వందల వేలకొలది, అవును, లక్షలమంది దేవుని ఇశ్రాయేలుపైన యెహోవా నామమున్నదని గుర్తించియున్నారు. (జెకర్యా 8:23) సమస్త అన్యజనులలోనుండి ఆ ఆత్మీయ జనాంగముతో పాటు యెహోవాను సేవించుటకు గుమికూడి, ప్రకటనలో ముందుగా చూడబడిన “గొప్ప సమూహము” గా ఏర్పడుచున్నారు. వారు “తమ వస్త్రములను గొఱ్ఱెపిల్ల రక్తములో ఉదుకుకొని” న వారై మహాశ్రమలను తప్పించుకొని సమాధానకరమైన నూతనలోకములోకి వెళ్లుదురు.—ప్రకటన 7:9, 14.
19. ఏ సమాధానమును దేవుని ప్రజలు ఈనాడు అనుభవించుచున్నారు?
19 ఆ దేవుని ఇశ్రాయేలు మరియు గొప్పసమూహము కలసి యేకముగా, రాజైన సొలొమోను కాలములో ఇశ్రాయేలీయులు అనుభవించిన సమాధానమునకు పోల్చదగిన ఆత్మీయ సమాధానమును అనుభవించుచున్నారు. వారిని గూర్చి మీకా ఇట్లు ప్రవచించెను: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండ ప్రతివాడును తన ద్రాక్ష చెట్టుక్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.” (మీకా 4:3, 4; యెషయా 2:2-4) దీనికనుగుణ్యముగా యుద్ధము మరియు జగడమునకు వారు తమ వీపు త్రిప్పి, సూచనార్థముగా తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ యీటెలను మచ్చుకత్తులనుగాను సాగగొట్టుచున్నారు. ఆవిధముగా వారు తమ అంతర్జాతీయ సమాజమంతటిలో వారి దేశమేదైనను, భాష, జాతి లేక సాంఘికమూలమేమైనను సమాధానకరమైన సహోదరత్వమును అనుభవించుచున్నారు. మరియు వారిపై యెహోవా అనుగ్రహించు సురక్షితమైన శ్రద్ధయొక్క నిశ్చయతయందు ఆనందించెదరు. వారు ‘ఎవరి భయము లేకుండయున్నారు.’ నిజముగా “యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించియున్నాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించియున్నాడు.”—కీర్తన 29:11.
20, 21. (ఎ) దేవునితోగల మన సమాధానమును కాపాడుకొనుటయందు మనమెందుకు పనిచేయవలెను? (బి) దేవుని ప్రజల సమాధానమును బ్రద్దలుచేయుటకు సాతానుచేయు ప్రయత్నములనుగూర్చి మనమేమి చెప్పగలము?
20 ఏమైనను, సా.శ. మొదటి శతాబ్దములోవలెనే, దేవుని సేవకుల సమాధానము సాతానుయొక్క వైరమును ఉద్రేకపరచినది. 1914లో దేవుని రాజ్యము స్థాపించబడిన తరువాత పరలోకమునుండి పడద్రోయబడినదై, అప్పటినుండి సాతాను “[ఆ స్త్రీ] సంతానములో శేషించినవారిపై యుద్ధము” చేసియున్నది. (ప్రకటన 12:17) చివరకు తన దినములలో సహితము పౌలు ఇట్లు హెచ్చరించెను: “మనము పోరాడునది శరీరులతో కాదుగాని. . .ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము.” (ఎఫెసీయులు 6:12) సాతాను భూపరిసరమునకు మాత్రమే పరిమితమైయున్న ఈ సమయములో ఆ హెచ్చరిక ఎంతో అత్యవసరమైనది.
21 సాతాను దేవుని ప్రజల సమాధానమును నాశనముచేయు ప్రయత్నములో తనకు అందుబాటులోయున్న ప్రతి కుతంత్రమును ఉపయోగించెనుగాని, విఫలమాయెను. ఒకనాడు 1919లో దేవునిని నమ్మకముగా ఆరాధించుటకు 10,000 మంది కూడా లేరు. ఈనాడు లోకమును తమ విశ్వాసముతో జయించువారు నలభైలక్షలమందికి పైగా ఉన్నారు. (1 యోహాను 5:4) సాతాను మరియు అతని సంతానపు శత్రుత్వమును సహించుచున్నను, దేవునితో సమాధానము, ఒకరియెడల ఒకరితో సమాధానము వీరికి వాస్తవమైనదైయున్నది. ఈ శత్రుత్వపు కారణంగా, మన స్వంత అసంపూర్ణత, మనము జీవించవలసిన “అపాయకర కాలములను” బట్టియు, మన సమాధానమును కాపాడుకొనుటకు పట్టుదలతో పనిచేయవలసియున్నాము. (2 తిమోతి 3:1) తదుపరి సంచికలో ఇందు ఏమి ఇమిడియున్నదో మనము చూచుదుము. (w91 3/1)
మీరు వివరించ గలరా?
◻ మొదట మానవుడు దేవునితో సమాధానమును ఎందుకు కోల్పోయెను?
◻ ఇశ్రాయేలుకు దేవునితో సమాధానము ఎట్లు షరతుగా యుండెను?
◻ ఈనాడు దేవునితో సమాధానము దేనిపై ఆధారపడినది?
◻ మన హృదయములకు కావలియుండు దేవుని సమాధానమేమి?
◻ దేవునితో మనము సమాధానము కలిగియున్నట్లయిన ఏ ఎక్కువ ఆశీర్వాదములను అనుభవించెదము?