మానవులను ఎవరు శాంతికి నడుపగలరు?
మానవులు శాంతిని తేలేరు అన్నంత మాత్రమున మనమిక ఎన్నటికి శాంతిని చూడలేమని దీని భావమా? కాదు. సాతాను ఎలాగైతే మనకంటే శక్తిమంతుడై, భూమిమీద శాంతి రాకుండుటకు విఘాతంగా ఉన్నాడో, ఆలాగే సాతానుకంటే ఎక్కువ శక్తిమంతుడై మానవులను తుదకు శాంతికి నడుపగలిగే ఒకవ్యక్తి ఉన్నాడు. సాతానుని గూర్చి పేర్కొనిన బైబిలు, అతనిని గూర్చి కూడ చెప్పుచున్నది. అది ఇట్లనుచున్నది: “ఆయన భుజముమీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.” (యెషయా 9:6, 7) ఈ సమాధానకర్తయగు అధిపతి ఎవరు? ఆయన ఎవరోకాదు యేసుక్రీస్తే, ఆయన మనకంటే ఎంతో శక్తిమంతుడు గనుక ఆయన శాంతిని తేగలడు. ఏ విధముగా ఆయన మనకంటే శక్తిమంతుడు?
మానవుని అరక్షతలకుమించినవి
ఒకటి ఏమంటే, యేసు చావునకు లోనగు మర్త్యమైన వాడు కాదు. ఆయన మానవునిగా నివసించి, బలిత్యాగియై మరణించెననుట నిజమే. కాని పిమ్మట ఆయన అమర్త్యమైన పరలోక జీవమునకు పునరుత్థానుడయ్యెను, ఈ స్థానమందుండే ఆయన సమాధానకర్తయగు అధిపతియగును. అందుకే ఒక ప్రవచనమిట్లనుచున్నది: “ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” (లూకా 1:32, 33) తూర్పుదేశపు చక్రవర్తియైన అశోకునివలెకాక, తానుచేసిన మంచి కార్యమును తన తరువాత తనకంటే తక్కువ సామర్థ్యముగల వానిచే పాడుచేయబడకుండా చూచుటకు యేసు అనంతకాలము జీవించును.
అంతేకాదు, యేసు పాప కళంకము లేనివాడు. ఆయన పాలన దైవజ్ఞానము, సరియైన సూత్రములపై ఆధారపడినదై యున్నది. ప్రవక్తయైన యెషయా యిలా ప్రవచించెను: “యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద వచ్చును . . . కంటిచూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు దీనులైన వారికి యథార్థముగా విమర్శచేయును.” (యెషయా 11:2-4) గతకాలమందలి యూరోపియన్లవలె స్వదేశములో శాంతికొరకు పాటుపడి విదేశములలో యుద్ధము చేయుటకు యేసు తలపడడు. ఆయన ఆధ్వర్యముక్రింద, శాంతి విశ్వవ్యాప్తంగా ఉంటుంది.
ఇంకాచూస్తే, శాంతిని తెచ్చుటకు యేసుకు శక్తికూడ ఉన్నది. ప్రవచనము ఇట్లనుచున్నది: “యెహోవా ఆత్మ . . . ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ,” అతనిమీద ఉన్నది. ఈ విశ్వమంతటి సృష్టి వెనుకను ఆలాగే బైబిలులో పేర్కొనబడిన యథార్థవంతమగు శక్తిమంతమైన అన్నిపనుల వెనుక ఈ ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మయొక్క, శక్తిని జయప్రదముగా ఎదుర్కొనగల ఆయుధములు గొప్ప విరోధియైన సాతానువద్దకూడ లేవు.
శాంతి కొరకు చర్యలు
యేసు మానవులను ఎలా శాంతిలోనికి నడుపును? ఆయన దానిని ఇప్పటికే ప్రారంభించెనని తెలిసికొనుటకు నీవు ఆశ్చర్యపోవచ్చును. పరలోక రాజ్యములో యేసు, దేవునినుండి రాజ్యాధికారమును స్వీకరించుటను ప్రవచనాత్మక పుస్తకమైన ప్రకటనలో చూడగలము. (ప్రకటన 11:15) బైబిలు ప్రవచనములను బహు సన్నిహితముగా పరిశీలించి, మన శతాబ్దమందలి సంఘటనలతో పోల్చినట్లయితే, యేసు పరలోకములో రాజుగా సింహాసనాసీనుడగుట 1914లో జరిగినట్లు మనము చూడగలము. (మత్తయి 24:3-42) భూమికి సమాధానమును తెచ్చుటలో అది ఒక ప్రాముఖ్యమైన మెట్టు.
అయితే, అదే నిజమైన యెడల, 1914లో మొదటి ప్రపంచ యుద్ధము ఎందుకు చెలరేగింది? చరిత్రలో మరి ఏ శతాబ్దములో చూడనన్ని అధ్వానమైన యుద్ధాలను మన శతాబ్దము ఎందుకు ఎదుర్కొన్నది? ఎందుకంటే, పరలోక రాజుచేసిన మొదటి చర్య ఏమనగా, సాతానును పరలోకమునుండి శాశ్వతముగా పారద్రోలి భూపరిధికి అతనిని క్రిందికి పడద్రోసెను. ఫలితమేమిటి? ప్రవచనమిట్లనుచున్నది: “భూమి, సముద్రమా, మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.” (ప్రకటన 12:7-12) మన శతాబ్దమందలి పెద్ద యుద్ధములు సాతాను క్రోధమునకు సంబంధించినవే. కాని, గమనించండి: సాతాను క్రోధము “కొంచెము కాలమే.” ఈ సంక్షోభము త్వరలో అంతమగును!
అయినను, దానికంటేముందు ఈ సమాధానకర్తయగు అధిపతి శాంతికి సంబంధించి తదితర ప్రాముఖ్యమైన ఏర్పాట్లను చేయును. మొదటిగా, క్రీస్తుద్వారా శాంతిని తెచ్చుటలో దేవుని సంకల్పమునుగూర్చి మానవులు తెలిసికొనవలెను. తదనుగుణ్యంగా, మన కాలంలో “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట ప్రకటింపబడును,” అని యేసు ప్రవచించెను. (మత్తయి 24:14) దీని నెరవేర్పుగా, నేడు యెహోవా సాక్షులచే భూగోళముయొక్క ప్రతి ప్రాంతములో సువార్త ప్రకటించబడుచున్నది.
అట్లయిన, యథార్థ హృదయులందరూ శాంతి మార్గములందు విద్యనభ్యసించవలెను. బైబిలు వాగ్దానమిస్తున్నది: “నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” (యెషయా 54:13) యథార్థ హృదయులైన లక్షలాదిమంది ఇప్పుడుకూడ అట్టి విద్యను అభ్యసించుచున్నారు.
తదుపరి చర్య
శాంతిని నెలకొల్పుటలో భాగంగా మరొక నిశ్చయమైన చర్యను గైకొనుటకు ఇది సమయమైయున్నది. ఏమిటాచర్య? అనేకులకు దాని పేరు తెలుసుగాని దాని నిజసంకల్పము కొందరికే తెలియును. “సర్వోన్నతుడైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము,” లేదా హర్మగేదోను అని బైబిలు దానిని పిలుచుచున్నది. (ప్రకటన 16:14, 16) హర్మగేదోను అనగా నాగరికతను నాశనముచేయు పరమాణు యుద్ధమని అనేకులు తలంచుదురు. ప్రతిగా, అది సమాధానకర్తయగు అధిపతియైన యేసుచేత శాంతికి ఆవశ్యమగు చర్యలు గైకొనుటలో చేయబడు ప్రత్యక్షచర్య.
మొదటగా, శాంతికి ఉన్న మానవ ప్రతిబంధకాలన్నింటిని హార్‌మెగిద్దోను నిర్మూలించును. కీర్తన 37:10 నందలి ప్రవచనము ఇట్లనుచున్నది: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీంచినను వారు కనబడకపోవుదురు.” అవును, “దుష్టులను”—యుద్ధమును చెలరేపువారు, నేరస్థులు, ఉగ్రవాదులు, మరియు గొప్ప సమాధానకర్తయగు అధిపతిని అంగీకరించుటకు నిరాకరించు వారినికూడ—యేసు భూమిపైనుండకుండ నిర్మూలించును. ఈ గ్రహముపై జీవించుటకు వారికి ఇక హక్కు ఉండదు.—ప్రకటన 19:19-21.
రెండవదిగా, హర్మగేదోనునందు దానియేలు యొక్క ఈ ప్రవచనము నెరవేరును: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దానిపొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల పర్యంతము నిలుచును.” (దానియేలు 2:44) తరచు యుద్ధములకు నడుపుచున్న జాతీయ విభాగములు అంతమొనర్చబడును. చివరకు, మనము నమ్మదగిన పాలకుని క్రింద ఒకే ప్రపంచ ప్రభుత్వము ఉంటుంది!
హర్మగేదోను ఎప్పుడు వస్తుంది? బైబిలు చెప్పుటలేదు. అది అతి త్వరలో రానైయున్నదని ప్రవచన నెరవేర్పు సంబంధమైన ప్రపంచ సంఘటనలు చూపుచున్నవి. బావిసూచకమైన ఒక సంఘటననుగూర్చి బైబిలు ముందుగా తెల్పినది. అపొస్తలుడైన పౌలు ఇట్లనెను: “లోకులు-నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా, ఆకస్మికముగా నాశనము తటస్థించును.” (1 థెస్సలొనీకయులు 5:3) అటు తరువాత, ఆకస్మిక నాశనానంతరము హర్మగేదోను తారాస్థాయికి చేరి, శాంతికిగల గొప్ప విఘాతము తీసివేయబడును. సాతానుయొక్క “కొద్ది సమయము” ముగియును, ఇక భూమిపై ఎన్నటికి సమస్యలను సృష్టించని స్థితిలో అతడు పెట్టబడును. (ప్రకటన 20:1-3) ఎంతటి ఉపశమనము!
శాంతితో కూడిన లోకము
ఆ కాలమందుండు పరిస్థితిని చిత్రీకరించుము. కీర్తనల గ్రంథకర్త ప్రవచించెను: “దీనులు భూమిని స్వతంత్రించు కొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:11) ఆహ్లాదమైన యెషయా ప్రవచన నెరవేర్పునందు ఈ దీనులు కొనసాగుచుందురు: “వారు తమ ఖడ్గములను నాగటినక్కులుగాను, తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధముచేయ నేర్చుకొనుట ఇకమానిపోవును.”—యెషయా 2:4.
చిట్టచివరకు, ఏదెనునందలి పరిస్థితి అనంతరము మొదటిసారిగా జీవించు మానవులందరు యెహోవా దేవుని ఆశీర్వాదములను అనుభవింతురు, మరియు ఆయన తన వాగ్దానమును నెరవేర్చును: “ఇదిగో! దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది. ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలైయుందురు. దేవుడుతానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:3, 4.
దృఢమైన నిరీక్షణ
అట్లయితే, మానవులను శాంతికి నడుపునదెవరు? నియమిత సమాధానకర్తయగు అధిపతియైన యేసుక్రీస్తు. నేడు మనకిది ఆచరణాత్మక నిరీక్షణయేనా? బైబిలు వాగ్దానములు నమ్మదగినవి కాకపోతే, శాంతికొరకు నిజమైన నిరీక్షణ ఉండజాలదు. మానవులు పోరాటములలో కొనసాగుచు, ఒకరినొకరు చంపుకొనుచుందురు, దానికిక అంతముండదు. అయితే, బైబిలు నమ్మదగినది, క్రీస్తు ఆధ్వర్యమున దేవుని రాజ్యము శాంతిని తెచ్చును. యెహోవా సాక్షులు మీ గృహములకు తెచ్చుచున్న రాజ్య సువార్తను విని మీ యంతట మీరే గమనించాలని మిమ్మును ప్రోత్సహించుచున్నాము. పిమ్మట, ఆ కాలము వచ్చినప్పుడు, దీనులు భూమిని స్వతంత్రించుకొని సమృద్ధియైన శాంతితో ఉల్లసించువారితో మీరును ఉండవచ్చును. (w90 4/1)
ఈ శీర్షికలో చర్చించబడిన శాంతి నిరీక్షణ బైబిలులోనిది. ఈనాడు అనేకులు బైబిలునందు నమ్మికయుంచుటలేదు, కావున ఈ నిరీక్షణ అభ్యాససిద్ధమైనదేనాయని బహుశ మీరు ప్రశ్నించవచ్చు. అయితే యెహోవా సాక్షులు అది అవునని ధృఢముగా నమ్ముచున్నారు. బైబిలును వారు దేవుని ప్రేరేపిత వాక్యమని, అందునుబట్టి అది పూర్తిగా నమ్మదగినదని అంగీకరింతురు. 1989లో వారు ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అను పుస్తకమును ప్రచురించిరి. అది ఈ వాస్తవము సంబంధముగా అనేక రుజువులను అందించుచున్నది. ఆ పుస్తకములోని కొంత సమాచారము తర్వాతి రెండు శీర్షికలలో చర్చించబడినది, దానిని మీరు చదువవలెనని మేము మిమ్మును ఆహ్వానించుచున్నాము.
శాంతిని గూర్చిన బైబిలు వాగ్దానము యొక్క మరింత సమాచారము “లోక శాంతి—నిజముగా దాని భావమేమి? అను శీర్షికలో వచ్చును, ఇది నవంబరు 1, 1991 కావలికోట సంచికలో ప్రచురింపబడును.
[8వ పేజీలోని బాక్సు]
మానవులను శాంతికి నడుపు అర్హతలను కేవలం యేసు మాత్రమే కలిగియున్నాడు
[9వ పేజీలోని బాక్సు]
నేడు, రాజ్యసువార్త భూగోళముయొక్క ప్రతి మూల ప్రకటించబడుచున్నది