దేవుని పిల్లలకు త్వరలో మహిమకరమైన స్వాతంత్ర్యం
“సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.”—రోమీయులు 8:20, 21.
1. యేసు అర్పించిన బలికి ప్రాయశ్చిత్తార్థ దినాన అర్పించిన బలి ఎలా సాదృశ్యంగా ఉంది?
యెహోవా తన జనితైక కుమారుణ్ణి విమోచన క్రయధన బలిగా ఇవ్వగా, 1,44,000 మంది మానవులు పరలోక జీవితాన్ని పొందేందుకూ, మానవజాతిలోని ఇతరులు భూసంబంధమైన నిత్య ఉత్తరాపేక్షల్ని పొందేందుకూ మార్గం తెరవబడింది. (1 యోహాను 2:1, 2) ముందు శీర్షికలో గమనించినట్లుగా, వార్షిక ప్రాయశ్చిత్తార్థ దినాన ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు తన కొరకూ, తన ఇంటివారి కొరకూ, లేవీ గోత్రం కొరకూ కోడెను అర్పించడం ఆత్మజనిత క్రైస్తవుల కొరకు యేసు అర్పించిన బలికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు బలి సామాన్య మానవాళికి ప్రయోజనాన్ని చేకూర్చబోతున్నట్లుగానే, అదే రోజున మిగిలిన ఇశ్రాయేలీయులందరికీ ప్రయోజనాన్ని చేకూర్చేందుకు ప్రధాన యాజకుడు ఒక మేకను పాపప్రాయశ్చిత్తంగా అర్పించేవాడు. బ్రతికివున్న మరొక మేక అరణ్యంలోకి కనుమరుగైపోతూ, గత సంవత్సరంలో ప్రజల పాపాల్ని సమిష్టిగా సూచనార్థకంగా మోసుకుపోయేది.a—లేవీయకాండము 16:7-15, 20-22, 26.
2, 3. రోమీయులు 8:20, 21 నందు రాయబడివున్న పౌలు వ్యాఖ్యాన భావమేమిటి?
2 ‘దేవుని పరలోక కుమారులు’ కాబోయే మానవుల నిరీక్షణను క్లుప్తంగా చర్చించిన తర్వాత, అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.” (రోమీయులు 8:14, 17, 19-21) ఈ వ్యాఖ్యాన భావమేమిటి?
3 మన పితరుడైన ఆదాము పరిపూర్ణ మానవునిగా సృష్టించబడినప్పుడు, అతడు ‘దేవుని కుమారుడు [లేక పిల్లవాడు]’ అయ్యాడు. (లూకా 3:38) అతడు పాపం చేసినందువల్ల ‘నాశనానికిలోనగు దాస్యానికిలోనై,’ ఈ దాస్యపుస్థితిని మానవజాతికి సంక్రమింపజేశాడు. (రోమీయులు 5:12) వారసత్వంగా వచ్చిన తమ అపరిపూర్ణతనుబట్టి మానవులు ‘వ్యర్థత్వంతో’ పుట్టడానికి దేవుడు అనుమతించాడు, అయితే ‘సంతానమైన’ యేసుక్రీస్తు ద్వారా ఆయన నిరీక్షణను దయచేశాడు. (ఆదికాండము 3:15; 22:18; గలతీయులు 3:16) ‘మరణం, దుఃఖం, ఏడ్పు, వేదనల్లేని’ కాలాన్ని ప్రకటన 21:1-4 వచనాలు సూచిస్తున్నాయి. ఇది ‘మనుష్యులందరికి’ చేయబడిన వాగ్దానం గనుక, రాజ్యపాలన క్రింద జీవించే మానవుల భూసంబంధమైన క్రొత్త సమాజం, మనస్సూ దేహం పూర్ణ ఆరోగ్యంతో పునరుద్ధరించబడి ‘దేవుని భూసంబంధమైన పిల్లలుగా’ నిత్య జీవాన్ని అనుభవిస్తుందని ఈ వాగ్దానం మనకు అభయాన్నిస్తోంది. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో, విధేయులైన మానవులు ‘నాశనానికి లోనైన దాస్యం నుండి’ విడిపించబడతారు. చివరి పరీక్షాకాలంలో యెహోవా ఎడల యథార్థతను నిరూపించుకొన్న తర్వాత, వాళ్లు వారసత్వంగా వచ్చిన పాప మరణాలనుండి శాశ్వతంగా స్వతంత్రులౌతారు. (ప్రకటన 20:7-10) అప్పుడు భూమిపై ఉన్నవారు ‘దేవుని పిల్లలు పొందబోవు మహిమకరమైన స్వాతంత్ర్యాన్ని పొందుతారు.’
వాళ్లు “రమ్ము” అని చెబుతున్నారు!
4. ‘జీవజలమును ఉచితముగా పుచ్చుకొనడం’ అంటే అర్థమేమిటి?
4 మానవాళి ఎదుట ఎంతటి మహిమాన్విత నిరీక్షణ ఉంచబడిందో కదా! ఇప్పటికీ భూమిపైవున్న ఆత్మజనిత క్రైస్తవులు, ఇతరులకు ఆ నిరీక్షణను గురించి తెలియజేయడంలో ఎంతో ఆసక్తితో నాయకత్వం వహిస్తున్నారన్నది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు! అభిషిక్త శేషం, మహిమపర్చబడిన గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు యొక్క ‘పెండ్లికుమార్తెలో’ భాగస్థులవ్వబోయే వారిగా ఈ ప్రవచనాత్మక మాటల నెరవేర్పులో చేరివున్నారు: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రకటన 21:2, 9; 22:1, 2, 17) యేసు విమోచన క్రయధన బలి ప్రయోజనాలు 1,44,000 మంది అభిషిక్తులకు మాత్రమే పరిమితం కాదు. “రమ్ము” అని చెప్పడంలో భూమిపై ఉన్న పెండ్లికుమార్తె తరగతిలోని శేషించబడినవారి ద్వారా దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది. నీతికొరకు దప్పికగలిగి, విను వారెవరైనా సరే రక్షణ కొరకు యెహోవా చేసిన విస్తారమైన ఏర్పాటు నుండి తాముగా ప్రయోజనం పొందుతూ, “రమ్ము” అని పిలిచేందుకు ఆహ్వానించబడుతున్నారు.
5. తమ మధ్య ఎవరున్నందుకు యెహోవాసాక్షులు సంతోషిస్తున్నారు?
5 యేసుక్రీస్తు ద్వారా దేవుడు జీవం కొరకు చేసిన ఏర్పాటులో యెహోవాసాక్షులకు విశ్వాసం ఉంది. (అపొస్తలుల కార్యములు 4:12) దేవుని సంకల్పాల్ని గూర్చి తెలుసుకోవాలనీ, ఆయన చిత్తాన్ని చేయాలనీ కోరుకొనే యథార్థహృదయులు తమ మధ్య ఉన్నందుకు వాళ్లు సంతోషిస్తున్నారు. ఈ ‘అంత్యకాలంలో’ ‘జీవజలాల్ని ఉచితంగా పుచ్చుకోవాలని’ అభిలషించే వారందరి కొరకూ వారి రాజ్యమందిర ద్వారాలు తెరవబడి ఉన్నాయి.—దానియేలు 12:4.
కాలక్రమంలో వచ్చిన మార్పులు
6. వివిధ కాలాల్లో యెహోవా సేవకులపై దేవుని పరిశుద్ధాత్మ ఎలా పనిచేసింది?
6 తన సంకల్పాల్ని నెరవేర్చేందుకు దేవునికొక సమయముంది, మానవులతో ఆయనకుగల వ్యవహారాలనిది ప్రభావితం చేస్తుంది. (ప్రసంగి 3:1; అపొస్తలుల కార్యములు 1:7) క్రైస్తవ పూర్వ కాలాల్లోని దేవుని సేవకులపైకి ఆయన ఆత్మ వచ్చినప్పటికీ, వాళ్లు ఆయన ఆధ్యాత్మిక కుమారులుగా ఆత్మజనితులుగా చేయబడలేదు. అయితే, పరలోక వారసత్వాన్ని పొందేలా సమర్పిత పురుషులనూ స్త్రీలనూ ఆత్మజనితుల్ని చేసేందుకు పరిశుద్ధాత్మను ఉపయోగించడానికి యెహోవా సమయం వచ్చింది. ఆ సమయం యేసును అభిషేకించడంతో ఆరంభమైంది. మరి మన కాలం విషయమేమిటి? యేసు ‘వేరే గొఱ్ఱెలపై’ అదే ఆత్మ పనిచేస్తోంది, కానీ అది వారిలో పరలోక జీవం కొరకైన నిరీక్షణనూ కోరికనూ కలిగించడం లేదు. (యోహాను 10:16) దేవుడు తమకు అనుగ్రహించిన పరదైసు భూమిపై నిరంతరం జీవించే ఉత్తరాపేక్షతో, పాత లోకానికి బదులు దేవుని నీతియుక్త క్రొత్త లోకం వచ్చే ఈ పరివర్తన కాలంలో సాక్ష్యమివ్వడంలో వారు అభిషిక్త శేషానికి సంతోషంగా మద్దతునిస్తారు.—2 పేతురు 3:5-13.
7. ఏ కోతపనిపై బైబిలు విద్యార్థులు శ్రద్ధచూపించేవారు, అయినా పరదైసును గురించి వారికి ఏమి తెలుసు?
7 సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మను కుమ్మరించడంతో దేవుడు ‘అనేకులైన కుమారులను మహిమలోనికి తేవడం’ ప్రారంభించాడు. ‘దేవుని’ ఆధ్యాత్మిక ‘ఇశ్రాయేలైన’ 1,44,000 మందిని సమకూర్చే పనిని ముగించడానికి ఆయన ఒక సమయాన్ని నిర్ణయించాడన్న విషయం స్పష్టమౌతుంది. (హెబ్రీయులు 2:10; గలతీయులు 6:16; ప్రకటన 7:1-8) 1879లో ఆరంభమైన, అభిషిక్త క్రైస్తవులు చేరివున్న ఒక కోతపని ఈ పత్రికలో తరచూ ప్రస్తావించబడింది. కానీ పరదైసు భూమిపై నిత్యజీవ నిరీక్షణను లేఖనాలు వివరిస్తున్నాయని కూడా బైబిలు విద్యార్థులకు (ఇప్పుడు యెహోవాసాక్షులని పిలువబడుతున్నారు) తెలుసు. ఉదాహరణకు, కావలి కోట (ఆంగ్లం) 1883 జూలై సంచిక ఇలా చెప్పింది: “యేసు తన రాజ్యాన్ని స్థాపించడం, అపవాదిని నాశనం చేయడం వంటివాటిని చేసినప్పుడు, ఈ భూమి ఒక పరదైసు అవుతుంది . . . సమాధుల్లో ఉన్నవారంతా దానిలోనికి వస్తారు. దాని చట్టాలకు విధేయత చూపించడం ద్వారా వాళ్లు దానిలో నిరంతరమూ జీవించవచ్చు.” సమయం గడుస్తుండగా, అభిషిక్తులను సమకూర్చే కోతపని తగ్గుముఖం పట్టింది. పరలోక నిరీక్షణలేని వ్యక్తులు క్రమంగా యెహోవా సంస్థలోనికి రావడం మొదలయ్యింది. ఈలోగా, మరలా జన్మించిన క్రైస్తవులైన తన అభిషిక్త సేవకులకు దేవుడు గమనార్హమైన అంతర్దృష్టిని అనుగ్రహించాడు.—దానియేలు 12:3; ఫిలిప్పీయులు 2:15; ప్రకటన 14:15, 16.
8. భూ నిరీక్షణను గూర్చిన అవగాహన 1930ల తొలికాలంలో ఎలా పురోభివృద్ధి చెందింది?
8 భూ నిరీక్షణను కలిగివున్న వాళ్లు విశేషంగా 1931 నుండీ క్రైస్తవ సంఘంతో సహవసిస్తూవున్నారు. యెహెజ్కేలు 9వ అధ్యాయం, దేవుని నూతన లోకంలోనికి రక్షించబడేందుకు గురుతువేయబడిన ఈ భూసంబంధమైన తరగతిని సూచిస్తుందని గ్రహించేందుకు శేషించబడిన ఆత్మజనిత క్రైస్తవులకు యెహోవా ఆ సంవత్సరం పూర్తి అవగాహననిచ్చాడు. 1932లో, అలాంటి ప్రస్తుతదిన గొఱ్ఱెల్లాంటి వాళ్లకు యెహూ సహవాసియైన యోనాదాబు (యెహోనాదాబు) ముంగుర్తుగా ఉన్నాడని నిర్ధారించబడింది. (2 రాజులు 10:15-17) ‘యోనాదాబులు’ దేవునికి తమను తాము “ప్రతిష్టించు”కోవాలనే విషయం లేక సమర్పించుకోవాలనే విషయం 1934లో స్పష్టంచేయబడింది. పరలోకంలో క్రీస్తు పెండ్లికుమార్తె భవిష్యద్ ‘చెలికత్తెలుగా’ ఉండబోయే ఆధ్యాత్మిక రెండవ తరగతియని మునుపు తలంచబడిన “గొప్పసమూహము” 1935లో భూ నిరీక్షణకల్గివున్న వేరేగొఱ్ఱెలని గుర్తించబడింది. (ప్రకటన 7:4-15; 21:2, 9; కీర్తన 45:14, 15) పరదైసు భూమిపై నిరంతరం జీవించేందుకు ఎదురుచూస్తున్న నీతిమంతులైన ప్రజలను అన్వేషించడం విశేషంగా 1935 నుండీ ఆరంభమైంది.
9. పందొమ్మిది వందల ముప్ఫై ఐదు తర్వాత, ప్రభురాత్రి భోజన చిహ్నాల్లో పాలుపంచుకోవడాన్ని కొంతమంది క్రైస్తవులు ఎందుకు మానుకున్నారు?
9 ప్రభురాత్రి భోజనంలో రొట్టె ద్రాక్షారసంలో పాలుపంచుకుంటున్న కొంతమంది క్రైస్తవులు 1935 తర్వాత నుండి పాలుపంచుకోవడం మానేశారు. ఎందుకు? ఎందుకంటే తమ నిరీక్షణ భూ సంబంధమైనదేగానీ పరలోక సంబంధమైనదికాదని వారు గ్రహించారు. 1930లో బాప్తిస్మం తీసుకున్న ఒక స్త్రీ ఇలా అన్నది: “[పాలుపంచుకోవడం] సరియైనదిగా పరిగణించబడినప్పటికీ, మరి విశేషంగా ఆసక్తిపరులైన పూర్తికాల పరిచారకుల విషయంలో అలా పరిగణించబడినప్పటికీ, నాకు పరలోక నిరీక్షణవుందని నాకెప్పుడూ నమ్మకం కుదరలేదు. తర్వాత, భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణతో గొప్ప సమూహం సమకూర్చబడుతుందని మాకు 1935లో స్పష్టం చేయబడింది. మేము ఆ గొప్ప సమూహంలోని భాగమని గ్రహించగల్గినందుకు మాలో అనేకులం ఆనందించాం, చిహ్నాల్లో భాగం వహించడం మానివేశాం.” క్రైస్తవ ప్రచురణలు కూడా వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. అంతకు మునుపటి సంవత్సరాల్లోని ప్రచురణలు ప్రధానంగా యేసు ఆత్మజనిత అనుచరుల కొరకు రూపొందించబడగా, 1935 నుండి, ‘నమ్మకమైన దాసుని’ కావలికోట మరితర సాహిత్యాలు అభిషిక్తుల అవసరాలకూ, భూ నిరీక్షణగల వారి సహవాసుల అవసరాలకూ సరిపడే ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించాయి.—మత్తయి 24:45-47.
10. తన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయిన అభిషిక్తుని స్థానమెలా భర్తీచేయబడుతుండవచ్చు?
10 బహుశా ఒక అభిషిక్తుడు తన విశ్వాసాన్ని కాపాడుకోలేదనుకుందాం. అతని స్థానాన్ని ఎవరైనా భర్తీచేస్తారా? సూచనార్థక ఒలీవ చెట్టును గూర్చిన తన చర్చలో పౌలు దీన్ని సూచించాడు. (రోమీయులు 11:11-32) ఆత్మజనితుని స్థానం భర్తీ కావలసి ఉంటే, అనేక సంవత్సరాలుగా దేవునికి పవిత్రసేవను చెల్లించడంలో మాదిరికరమైన విశ్వాసాన్ని కనబర్చిన వ్యక్తికి దేవుడు పరలోక పిలుపునివ్వవచ్చు.—పోల్చండి లూకా 22:28, 29; 1 పేతురు 1:6, 7.
కృతజ్ఞులై ఉండడానికి అనేక కారణాలు
11. మన నిరీక్షణ ఏదైనప్పటికీ, దేన్ని గురించి యాకోబు 1:17 మనకు అభయాన్నిస్తోంది?
11 మనం యెహోవా సేవ విశ్వాసంతో ఎక్కడుండి చేసినప్పటికీ, ఆయన మన అవసరాల్నీ, నీతియుక్తమైన కోరికల్నీ తీరుస్తాడు. (కీర్తన 145:16; లూకా 1:67-74) మనకు యథార్థమైన పరలోక నిరీక్షణవున్నా లేక మన ఉత్తరాపేక్ష భూసంబంధమైనదైనా, దేవునికి కృతజ్ఞులమై ఉండడానికి మనకు ఎన్నో మంచి కారణాలున్నాయి. ఆయన ఏది చేసినా, తనను ప్రేమించేవారి శ్రేయస్సు కొరకే చేస్తాడు. “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి” అయిన యెహోవా దేవుని “యొద్దనుండి వచ్చును” అని శిష్యుడైన యాకోబు చెప్పాడు. (యాకోబు 1:17) ఈ ఈవుల్లో, ఆశీర్వాదాల్లో కొన్నింటిని మనం పరిశీలిద్దాం.
12. యెహోవా తన నమ్మకమైన సేవకుల్లో ప్రతి ఒక్కరికీ అద్భుతమైన నిరీక్షణను అనుగ్రహించాడని మనమెందుకు చెప్పగలం?
12 యెహోవా తన నమ్మకమైన సేవకుల్లో ప్రతి ఒక్కరికీ ఒక అద్భుతమైన నిరీక్షణను అనుగ్రహించాడు. ఆయన కొంతమందిని పరలోకంలో జీవించేందుకు పిలిచాడు. భూమిపై నిత్యజీవాన్ని పొందేందుకు దివ్యమైన పునరుత్థాన నిరీక్షణను యెహోవా క్రైస్తవకాలానికి ముందున్న తన సాక్షులకు అనుగ్రహించాడు. ఉదాహరణకు, అబ్రాహాము పునరుత్థానమందు నిరీక్షణనుంచి, “పునాదులుగల ఆ పట్టణము” కొరకు అంటే భూమిమీద జీవించేందుకు తాను ఏ పరలోక రాజ్యం క్రింద పునరుత్థానుడౌతాడో ఆ పరలోక రాజ్యం కొరకు వేచివున్నాడు. (హెబ్రీయులు 11:10, 17-19) ఈ అంత్య కాలంలో మరోసారి, పరదైసు భూమి మీది నిత్యజీవ నిరీక్షణను దేవుడు లక్షలాదిమందికి అనుగ్రహిస్తున్నాడు. (లూకా 23:43; యోహాను 17:3) నిజంగా, అలాంటి దివ్యమైన నిరీక్షణను యెహోవా ఎవరికైతే అనుగ్రహించాడో వాళ్లు దాని విషయంలో ఎంతో కృతజ్ఞులైవుండాలి.
13. దేవుని పరిశుద్ధాత్మ ఆయన ప్రజలపై ఎలా పనిచేసింది?
13 యెహోవా తన పరిశుద్ధాత్మను తన ప్రజలకు ఒక ఈవిగా ఇస్తున్నాడు. పరలోక నిరీక్షణ అనుగ్రహించబడిన క్రైస్తవులు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. (1 యోహాను 2:20; 5:1-4, 18) అయితే, భూ సంబంధమైన ఉత్తరాపేక్షల్ని కల్గివున్న దేవుని సేవకులు పరిశుద్ధాత్మ సహాయాన్నీ నడిపింపునూ కల్గివున్నారు. తనకు మద్దతునిచ్చేందుకు నియమించబడిన 70మంది పురుషులవలే యెహోవా ఆత్మను కల్గివున్న మోషే వీరిలో ఉన్నాడు. (సంఖ్యాకాండము 11:24, 25) పరిశుద్ధాత్మ ప్రభావంక్రింద, ఇశ్రాయేలు గుడారానికి సంబంధించిన పనిలో బెసలేలు నిపుణుడైన శిల్పకారునిగా పనిచేశాడు. (నిర్గమకాండము 31:1-11) గిద్యోను, యెఫ్తా, సమ్సోను, దావీదు, ఏలీయా, ఎలీషా మరితరులపైకీ దేవుని ఆత్మ వచ్చింది. ప్రాచీన కాలంలోని ఈ వ్యక్తులు పరలోక మహిమలోనికి ఎన్నటికీ తేబడకపోయినప్పటికీ, యేసు వేరే గొఱ్ఱెలు నేడు పరిశుద్ధాత్మచే నడిపించబడి, సహాయాన్ని పొందుతున్నట్టుగానే వాళ్లూ పొందారు. కాబట్టి, దేవుని ఆత్మను కల్గివుండడమంటే మనకు తప్పకుండా పరలోక పిలుపు ఉందని కాదు. అయితే, యెహోవా ఆత్మ నడిపింపును దయచేస్తుంది, ప్రకటించడానికీ, దేవుడనుగ్రహించిన ఇతర నియామకాల్ని నెరవేర్చేందుకూ మనకు సహాయపడుతుంది, అసాధారణమైన శక్తినిస్తుంది, మరి దాని ఫలాలైన ప్రేమనూ, సంతోషాన్నీ, సమాధానాన్నీ, దీర్ఘశాంతాన్నీ, దయాళుత్వాన్నీ, మంచితనాన్నీ, విశ్వాసాన్నీ, సాత్వికాన్నీ, ఆశానిగ్రహాన్నీ మనలో ఉత్పన్నం చేస్తుంది. (యోహాను 16:13; అపొస్తలుల కార్యములు 1:8; 2 కొరింథీయులు 4:7-10; గలతీయులు 5:22, 23) దేవుని నుండి వచ్చే ఈ గొప్ప ఈవి విషయంలో మనం కృతజ్ఞులమై ఉండవద్దా?
14. దేవుని ఈవులైన జ్ఞానం నుండీ, బుద్ధినుండీ మనమెలా ప్రయోజనాన్ని పొందుతాం?
14 మన నిరీక్షణ పరలోక సంబంధమైనదైనా లేక భూసంబంధమైనదైనా సరే, జ్ఞానమూ బుద్ధీ దేవుని నుండి వచ్చిన ఈవులు గనుక వాటినిబట్టి మనం కృతజ్ఞులమై ఉండాలి. యెహోవాను గూర్చిన కచ్చితమైన జ్ఞానం ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారమగుటకూ,’ “అన్ని విషయములలో ప్రభువును [“యెహోవాను,” NW] సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొ[నేందుకూ]” మనకు సహాయపడుతుంది. (ఫిలిప్పీయులు 1:9-11; కొలొస్సయులు 1:9, 10) దైవికబుద్ధి జీవితంలో కాపుదలగా, నడిపింపుగా పనిచేస్తుంది. (సామెతలు 4:5-7; ప్రసంగి 7:12) నిజమైన జ్ఞానమూ, బుద్ధీ దేవుని వాక్యంపై ఆధారపడివున్నాయి, మరి శేషించబడిన కొద్దిమంది అభిషిక్తులూ తమ పరలోక నిరీక్షణను గురించి దేవుని వాక్యం చెబుతున్న దానివైపుకు విశేషంగా ఆకర్షించబడ్డారు. అయితే, దేవుని వాక్యం ఎడల ప్రేమా, దాని గురించి మంచి అవగాహనా ఉన్నంత మాత్రాన పరలోక జీవానికి మనం పిలువబడ్డామని దేవుడు సూచిస్తున్నాడని దాని భావం కాదు. మోషే, దానియేలులాంటి వ్యక్తులు బైబిల్లోని కొన్ని భాగాల్ని రాశారు కూడా, అయినప్పటికీ వాళ్లు భూమిపై జీవించేందుకే పునరుత్థానం చేయబడతారు. మన నిరీక్షణ పరలోకసంబంధమైనదైనా లేక భూసంబంధమైనదైనా, యెహోవా అంగీకరించిన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా మనమంతా ఆధ్యాత్మికాహారాన్ని పొందుతున్నాం. (మత్తయి 24:45-47) ఆ విధంగా సంపాదించిన జ్ఞానాన్నిబట్టి మనమంతా ఎంత కృతజ్ఞులమై ఉన్నామో కదా!
15. దేవుని అత్యంత గొప్ప ఈవుల్లో ఒకటేమిటి, మీరు దాన్నెలా దృష్టిస్తారు?
15 దేవుని అత్యంత గొప్ప ఈవుల్లో ఒకటేమిటంటే మనం పరలోక ఉత్తరాపేక్షను కల్గివున్నా లేక భూ నిరీక్షణను కల్గివున్నా మనకు ప్రయోజనాన్ని చేకూర్చే ప్రేమపూర్వక ఏర్పాటైన యేసు విమోచనక్రయధన బలియే. దేవుడు మానవాళిని “ఎంతో” ప్రేమించెను. “కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా [జనితైక కుమారునిగా] పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు” యేసుకున్న ప్రేమే ఆయనను ప్రేరేపించింది. (మత్తయి 20:28) అపొస్తలుడైన యోహాను వివరించినట్లుగా, యేసుక్రీస్తు “మన పాపములకు [అభిషిక్తుల పాపములకు] శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు.” (1 యోహాను 2:1, 2) అందుకే, నిరంతరం జీవించేలా రక్షించబడేందుకు చేయబడిన ఈ ప్రేమపూర్వక ఏర్పాటునుబట్టి మనమంతా ఎంతో కృతజ్ఞులమై ఉండాలి.b
మీరు హాజరౌతారా?
16. ఏప్రిల్ 11, 1998 సూర్యాస్తమయం తర్వాత ఏ ప్రాముఖ్యమైన సంఘటన జ్ఞాపకం చేసుకోబడుతుంది, మరి ఎవరు హాజరుకావాలి?
16 దేవుడు తన కుమారుని ద్వారా అనుగ్రహించిన విమోచన క్రయధనం ఎడల కృతజ్ఞత, ఏప్రిల్ 11, 1998 సూర్యాస్తమయం తర్వాత క్రీస్తు మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి యెహోవాసాక్షులు సమకూడే రాజ్యమందిరాల్లో లేక ఇతర స్థలాల్లో మనం హాజరై ఉండేందుకు మనల్ని కదిలించాలి. యేసు తన భూ జీవితంలోని చివరిరాత్రి తన నమ్మకమైన అపొస్తలులతో ఈ ఆచరణను ప్రారంభించి, “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” చెప్పాడు. (లూకా 22:19, 20; మత్తయి 26:26-30) యేసు యొక్క పాపరహితమైన మానవ శరీరానికి ప్రాతినిధ్యం వహించే పులియని రొట్టెలోనూ, బల్యర్పణలో చిందించబడిన ఆయన రక్తాన్ని సూచిస్తున్న ఘాటులేని ఎర్రని ద్రాక్షారసంలోనూ, మిగిలివున్న కొద్దిమంది అభిషిక్తులు పాలుపంచుకుంటారు. ఆత్మజనిత క్రైస్తవులు క్రొత్త నిబంధనలోనూ, రాజ్య నిబంధనలోనూ ఉన్నారు గనుకా, వాళ్లది పరలోకసంబంధమైన నిరీక్షణయని దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చిన నిరాకరించలేని రుజువును వాళ్లు కల్గివున్నారు గనుకా వాళ్లు మాత్రమే పాలుపంచుకోవాలి. నిరంతర జీవాన్ని సాధ్యంచేసే యేసు బల్యర్పణ సంబంధంగా దేవుడూ, క్రీస్తూ చూపించిన ప్రేమనుబట్టి కృతజ్ఞులైవున్న లక్షలాదిమంది ఇతరులు గౌరవపూర్వకంగా గమనించేవారిగా ఆ జ్ఞాపకార్థకానికి హాజరౌతారు.—రోమీయులు 6:23.
17. ఆత్మాభిషేకాన్ని గురించి మనమేం గుర్తుంచుకోవాలి?
17 మునుపటి మత నమ్మకాలూ, ప్రియమైనవారి మరణం మూలంగా ఉత్పన్నమైన బలమైన భావోద్వేగాలూ, ప్రస్తుత భూ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలూ, లేక యెహోవానుండి ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందామనే భావనా తమకు పరలోక పిలుపు ఉందని పొరబడేందుకు కొంతమందిని నడిపించవచ్చు. అయితే క్రీస్తు విమోచన క్రయధన బలి ఎడలగల మన కృతజ్ఞతను చూపించేందుకు జ్ఞాపకార్థ చిహ్నాల్లో పాలుపంచుకోవాలని లేఖనాలు మనకు ఆజ్ఞాపించడంలేదనే విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి. అంతేగాక, “పొందగోరువాని వలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే,” అంటే తన ఆధ్యాత్మిక కుమారునిగా యేసును ఆత్మజనితునిగా చేసిన, 1,44,000 మంది ఇతర కుమారులను మాత్రమే మహిమలోనికి తెచ్చే దేవుని వలననే ఆత్మాభిషేకం జరుగుతుంది.—రోమీయులు 9:16; యెషయా 64:8.
18. నేడు యెహోవా సేవచేస్తున్న అనేకుల కోసం, ఏ ఆశీర్వాదాలు వేచివున్నాయి?
18 ఈ అంత్యదినాల్లో యెహోవా సేవచేస్తున్న మానవుల్లో అధిక సంఖ్యాకులకు దేవుడు అనుగ్రహించిన నిరీక్షణ పరదైసు భూమిపై నిత్యజీవమే. (2 తిమోతి 3:1-5) త్వరలోనే, వాళ్లు ఈ అద్భుతమైన పరదైసులో ఆనందిస్తారు. అప్పుడు అధికారులు పరలోకపాలన క్రింద భూసంబంధమైన వ్యవహారాల్ని చూసుకుంటారు. (కీర్తన 45:16) భూ నివాసులు దేవుని చట్టాలకు అనుగుణ్యంగా జీవిస్తూ, యెహోవా మార్గాల గురించి మరింత నేర్చుకుంటుండగా శాంతియుతమైన పరిస్థితులు నెలకొంటాయి. (యెషయా 9:6, 7; ప్రకటన 20:12) గృహాల్ని నిర్మించడం, భూమిని సుందరంగా చేయడం, అలా ఎంతో పని ఉంటుంది. (యెషయా 65:17-25) మృతులు తిరిగి సజీవులై కుటుంబాలు మళ్ళీ ఏకమైనప్పుడు ఆ కుటుంబాలు పొందే సంతోషాన్ని ఊహించండి! (యోహాను 5:28, 29) చివరి పరీక్ష తర్వాత, దుష్టత్వమంతా గతించిపోతుంది. (ప్రకటన 20:7-10) అటు తర్వాత, ‘నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందే నిరీక్షణగల’ పరిపూర్ణ మానవులతో భూమి ఎల్లప్పుడూ నింపబడుతుంది.
[అధస్సూచీలు]
a లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, పేజీలు 225-6 చూడండి.
b కావలికోట, మార్చి 15, 1991 (ఆంగ్లం) పేజీలు 19-22 చూడండి.
మీరెలా జవాబిస్తారు?
◻ ‘జీవజలమును ఉచితముగా పుచ్చుకొనడం’ అంటే అర్థమేమిటి?
◻ మన నిరీక్షణ పరలోకసంబంధమైనదైనా లేక భూసంబంధమైనదైనా, దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మనకే కారణాలు ఉన్నాయి?
◻ ఏ వార్షిక ఆచరణకు మనమంతా హాజరుకావాలి?
◻ యెహోవా ప్రజల్లో అనేకమంది కోసం భవిష్యత్తులో ఏమి వేచివుంది?
[18వ పేజీలోని చిత్రం]
లక్షలాదిమంది ‘జీవజలాల్ని ఉచితంగా పుచ్చుకొనడం’ ప్రారంభించారు, వారిలో మీరూ ఉన్నారా?