స్వచ్ఛమైన భాషచే ఐక్యముకండి
“అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను.”—జెఫన్యా 3:9.
1. యెహోవా దేవుడు మాట్లాడుట ప్రజలెప్పుడైన విన్నారా?
యెహోవా దేవుని భాష స్వచ్ఛమైనది. కాని ఆయన మాట్లాడటం ప్రజలెప్పుడైన విన్నారా? అవును! 19 శతాబ్దముల క్రితం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు భూమిపై ఉన్నప్పుడు అది జరిగింది. ఉదాహరణకు యేసు బాప్తిస్మం పొందినప్పుడు దేవుడిట్లు చెప్పుట వినబడెను: “ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.” (మత్తయి 3:13-17) అది మానవ భాషలో యేసు మరియు బాప్తిస్మమిచ్చు యోహాను వినిన స్వచ్ఛమైన సత్య వాక్కు.
2. “దేవదూతల . . . భాష” అని అపొస్తలుడైన పౌలు ఉదహరించుట ఏమి సూచించుచున్నది?
2 కొన్ని సంవత్సరముల తర్వాత క్రైస్తవ అపొస్తలుడైన పౌలు “మనుష్యుల భాష—దేవ దూతల భాష” గురించి మాట్లాడెను. (1 కొరింథీయులు 13:1) ఇది ఏమి సూచించుచున్నది? మానవులేకాక ఆత్మీయ ప్రాణులు కూడా భాష మరియు మాటలు కలిగియున్నారని ఇది ఎందుకు చూపుచున్నది! కాని మనకు వినిపించు, అర్థమగు స్వరాలు మరియు భాషద్వారా దేవుడు మరియు దేవదూతలు ఒకరినొకరు సంభాషించుకొనరు. ఎందుకు? ఎందుకనగా మానవులు విని, అర్థము చేసికొనగల కంఠధ్వని తరంగములు ప్రసారమగుటకు భూమిచుట్టు ప్రక్కల ఉన్నటువంటి వాతావరణము అవసరము.
3. మానవ భాష ఎట్లు పుట్టెను?
3 మానవభాష ఎట్లు ఉద్భవించెను? ఘుర్రు ఘుర్రు మను చప్పుళ్లు, మూలుగుల ద్వారా మన పూర్వికులు ఒకరితోనొకరు సంభాషించుకొనుటకు ప్రయాసపడిరని కొందరందురు. ఎవల్యూషన్ అను పుస్తకము (లైఫ్ నేచర్ లైబ్రరి) ఇట్లనుచున్నది: “దాదాపు పది లక్షల సంవత్సరముల పూర్వము ఒక నరవానరం . . . బహుశ కొన్ని భాష ధ్వనులను నేర్చుకొనెను”. కానీ ప్రఖ్యాతిగాంచిన శబ్దకోశకారుడగు, లడ్‌విగ్ కోహ్లర్ ఇట్లనుచున్నాడు: “మానవ భాష ఒక మర్మము. అది దైవిక బహుమానము, అద్భుతము.” అవును, మొదటి మానవుడైన ఆదాముకు దేవుడు ఒక భాషను ఇచ్చెను. సాక్ష్యములనుబట్టి చివరకు అది హెబ్రీ అని పిలువబడినది. ఆ భాషనే ఓడను నిర్మించిన నోవహు కుమారుడైన షేము వంశపువాడు, నమ్మకస్థుడైన పితరుడు, “హెబ్రీయుడైన అబ్రాము” సంతతివారైన ఇశ్రాయేలీయులు మాట్లాడారు. (ఆదికాండము 11:10-26; 14:13; 17:3-6) షేముకు దేవుడిచ్చిన ప్రవచనార్థక దీవెన దృష్ట్యా, 43 శతాబ్దముల క్రితం యెహోవా దేవుడు అద్భుతరీతిగా చేసినదానివల్ల అతని భాష ప్రభావితం కాలేదని సహేతుకముగా చెప్పవచ్చును.—ఆదికాండము 9:26.
4. నిమ్రోదు ఎవరు, మరియు అతను అపవాది అగు సాతానుచేత ఎట్లు ఉపయోగింపబడెను?
4 ఆ కాలమందు “భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.” (ఆదికాండము 11:1) అప్పుడు “యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన” నిమ్రోదను వ్యక్తి జీవించుచుండెను. (ఆదికాండము 10:8, 9) మానవజాతియొక్క అదృశ్య, ప్రధాన శత్రువైన సాతాను తన సంస్థయొక్క భూసంబంధమైన భాగాన్ని స్థాపించుకొనుటకు ప్రత్యేకంగా నిమ్రోదును ఉపయోగించుకొనెను. నిమ్రోదు తనకైతాను ఒక గొప్ప పేరును సంపాదించుకొన గోరాడు. షీనారు ప్రాంతమందు ప్రత్యేక నిర్మాణపని ప్రారంభించిన ఆయన అనుచరులకు కూడ అదే అహంకార దృక్పథము వ్యాపించెను. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనము ప్రకారం వారు “మనము భూమి యందంతట చెదరి పోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరముగల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనిరి.” తిరుగుబాటుచేసిన వారి భాషను యెహోవా తారుమారుచేయుటతో ‘భూమిని నిండించుమని’ దేవుడిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకముగా చేసిన సాహసం ముగిసెను. “ఆలాగు” బైబిలు వృత్తాంతమిట్లు చెప్పుచున్నది, “యెహోవా అక్కడనుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుటమానిరి.” (ఆదికాండము 9:1, 11:2-9) ఆ పట్టణమునకు బాబెలు లేక బబులోను (అర్థం తారుమారు) అని పేరుపెట్టబడెను. “ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను.”—బైయింగ్‌టన్.
5. మానవజాతియొక్క భాషను దేవుడు తారుమారుచేసినప్పుడు ఏమి నిరోధించబడెను? (బి) నోవహు మరియు షేము భాషను గురించి మనమేమి చెప్పగలము?
5 ఆ అద్భుతం—ఒక్కటైన మానవ భాషయొక్క తారుమారు—దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన విధంగా భూమంతా నింపబడుటకు దారితీసెను. మరియు భూమికి, ఆకాశానికి సార్వభౌమాధిపతిని ఎదిరించిన మానవులద్వారా తనయొక్క ఐక్యమైన అపరిశుభ్ర ఆరాధనను నెలకొల్పుటకు సాతాను వేసుకొనిన పథకమును అడ్డగించినది. నిజమే, ఏవిధంగానైనా అబద్ధమతమును పాటించుట ద్వారా ప్రజలు అపవాదికి బలియైరి. మరియు వారు దేవుండ్లను మరియు దేవతలను చేసుకొని వారివారి భాషలలో వాటికి పేర్లుపెట్టి, వాటిని ఆరాధించునప్పుడు, దయ్యములను సేవించుచుండిరి. (1 కొరింథీయులు 10:20) కాని అద్వితీయ సత్యదేవుడు బాబెలునందు తీసుకొనిన చర్య సాతాను పొందాలని ఆశపడిన ఆరాధననిచ్చే ఒకే ఐక్యమైన అబద్ధమతము రూపొందకుండ ఆటంకపరచినది. అయితే, షీనారు మైదానములో అకస్మికంగా కలిగిన ఆ పతనకరమైన మార్పులో నీతిమంతుడైన నోవహు, ఆయనకుమారుడైన షేము మిళితము కాలేదు. కావున ఏదెను వనములో మానవుడైన ఆదాముతో దేవుడు మాట్లాడిన భాషయు, నమ్మకస్తుడైన అబ్రాము (అబ్రాహాము) భాషయు ఒకటేనని సహేతుకముగా ముగించవచ్చును.
6. సా.శ. 33 పెంతెకొస్తు దినమున తాను భాషలలో మాట్లాడగల సామర్ధ్యమును ఇవ్వగలనని యెహోవా ఎట్లుచూపెను?
6 మానవజాతియొక్క మూలభాషను తారుమారుచేసిన యెహోవాయే భాషలు మాట్లాడు శక్తిని కూడ ఇవ్వగలడు. ఎందుకు, సామాన్యశకములో 33వ సంవత్సరము పెంతెకొస్తు దినమందు ఆయన ఆ పనినేచేసెను. అపొస్తలుల కార్యములు 2:1-11 ప్రకారం యెరూషలేములోని మేడగదిలో యేసుక్రీస్తుయొక్క 120 మంది అనుచరులు సమావేశమైయుండిరి. (అపొస్తలుల కార్యములు 1:13, 15) అకస్మాత్తుగా, “ఆకాశమునుండి వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని” వచ్చెను. “అగ్నిజ్వాలలవంటి నాలుకలు” విభాగింపబడినట్లుగా వారికి కనబడి ఒక్కొక్కరికి పంచబడెను. దానితో శిష్యులు “పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మవారికి వాక్ శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాట్లాడసాగిరి.” దైవికంగా ఇవ్వబడిన ఆ భాషలలో వారు “దేవుని గొప్ప కార్యములను” గూర్చి మాట్లాడిరి. అది ఎంత అద్భుతము. వేరువేరు భాషలవారు, యూదా మత ప్రవిష్టులు, మెసొపొతమియ, ఐగుప్తు, లిబియ మరియు రోమావంటి దూరప్రాంతములనుండి వచ్చినవీరంతా జీవమునిచ్చు సందేశమును అర్థముచేసికొన గలిగిరి.
ఈనాడు దేవుడిచ్చిన భాష!
7. ప్రపంచవ్యాప్తంగా ఒకే భాష మాటలాడబడి మరియు అర్థము చేసుకొనబడినట్లైన ఏమి ఉత్తరాపేక్షలు ఉండును?
7 అద్భుత రీతిగా అనేక భాషలను దేవుడు ఇవ్వగలడు గనుక ప్రపంచవ్యాప్తంగా ఒకే భాషను మాట్లాడి మరియు అర్థము చేసికొనుటను ఆయన సాధ్యముచేసినయెడల అది అద్భుతమైయుండదా? అది మానవ కుటుంబములో గొప్ప అన్యోన్యతను పెంపొందించగలదు. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపిడియా చెప్పుచున్న ప్రకారము, “ప్రజలందరు ఒకవేళ ఒకే భాష మాట్లాడినట్లైన దేశముల మధ్య మంచి సుహృద్భావము పెరుగును మరియు సాంస్కృతిక, ఆర్థిక సంబంధములు మరింత దగ్గరవును.” సంవత్సరాలుగా కనీసము 600 ప్రపంచ భాషలు ప్రతిపాదింపబడెను. వీటిలో 1887లో ఎస్పరెంటో ఎక్కువ ప్రభావాన్ని కలిగివుంది. ఎందుకనగా అది సృష్టింపబడినప్పటినుండి 1,00,00,000 మంది దానిని నేర్చుకొనిరి. అయినప్పటికీ మానవజాతిని ఒక్క ప్రపంచభాషచేత ఐక్యపరచాలను మానవ ప్రయత్నములు ఎన్నటికి సఫలము కాలేదు. నిజానికి “దుర్జనులు అంతకంతకు చెడిపోవుట” వలన ఈ ప్రపంచములో అనేక సమస్యలు, విభాగములు కలుగజేయబడుచున్నవి.—2 తిమోతి 3:13.
8. నేటి లోకములో, ఒకే ప్రపంచ భాషను అవలంబించినను, ఏవి ఇంకానిలిచి ఉంటాయి, మరియు ఎందుకు?
8 మతపరంగా మాట్లాడిన దానిలో గొప్ప గందరగోళమున్నది. బైబిల్‌లోని ప్రకటన గ్రంథము అబద్ధమత సామ్రాజ్యాన్ని “మహాబబులోనుగా” పిలుచుచున్నందున, మనము దీనిని అపేక్షించకూడదా? (ప్రకటన 18:2) అవును, “బబులోను” అనగా “గలి-బిలి” అని అర్థము. ఒక కల్పితమైన భాషయో లేక ఆంగ్లము, ఫ్రెంచి, జర్మను లేక రష్యను వంటి ఒక సహజభాషను ప్రపంచభాషగా నేటి ప్రపంచములో తీసుకొంటే, మతపరంగా మరియు ఇతరవిధంగా అనైక్యత ఇంకా నిలిచివుండును. ఎందుకు? ఎందుకనగా ‘లోకమంతయు దుష్టుడైన’ అపవాదియగు సాతాను క్రింద ఉన్నది. (1 యోహాను 5:19) అతడు స్వార్థముయొక్క సంక్షేపమైయున్నాడు. బబులోను గోపురము మరియు నిమ్రోదు దినములలో చేసినట్లే అతడు మానవజాతి అంతటిచే ఆరాధింపబడాలని మిక్కిలి ఆతురతతో ఆశించుచున్నాడు. ఎందుకు, పాపులైన మానవులు మాటలాడు ఒక ప్రపంచ భాష సాతానుకు, అపవాదియొక్క ఐక్యమైన ఆరాధన నెలకొల్పుటకు మంచి అవకాశమిచ్చును. కాని యెహోవా, దానినెన్నటికి అనుమతించడు; నిజముగా అపవాదిచే ప్రేరేపింపబడిన, అబద్ధమతమునకు ఆయన త్వరలో అంతము తెచ్చును.
9. అన్ని జనాంగముల మరియు తెగల ప్రజలు ఇప్పుడెట్లు ఐక్యపరచబడుచున్నారు?
9 అయినప్పటికీ ఒక అద్భుతమైన వాస్తవమేమనగా అన్ని జాతుల మరియు తెగల మంచి ప్రజలందరు ఇప్పుడే ఐక్యమగుచున్నారు. ఇది దేవుని మాటపై, ఆయన ఆరాధనకొరకై జరుగుచున్నది. ఈనాడు, భూమిపై ఉన్న ఒకేఒక స్వచ్ఛమైన భాషను మానవులు నేర్చుకొనుటకు, మాట్లాడుటకు దేవుడు సాధ్యము చేయుచున్నాడు. మరియు అది నిజంగా ఒక ప్రపంచ భాషయై ఉన్నది. నిజముగా యెహోవా దేవుడు భూమిపై సకల జనాంగములనుండి వచ్చు ప్రజలకు బోధించుచున్నాడు. తన సాక్షి మరియు ప్రవక్త అయిన జెఫన్యాచే దేవుడుచేసిన ప్రవచనార్థక వాగ్దానంయొక్క నెరవేర్పు ప్రకారము ఇది జరుగుతుంది: “అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేక మనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల (స్వచ్ఛమైన భాష NW) నిచ్చెదను.” (జెఫన్యా 3:9) ఈ స్వచ్ఛమైన భాష ఏమిటి?
స్వచ్ఛమైన భాష నిర్వచింపబడెను
10. స్వచ్ఛమైన భాష ఏమి?
10 స్వచ్ఛమైన భాష అనగా పరిశుద్ధలేఖనాలైన, తన స్వంత వాక్యమందు కనుగొబడిన దేవుని సత్యమే. అది ప్రత్యేకముగా మానవజాతికి శాంతిని మరియు ఇతర ఆశీర్వాదములను తెచ్చు దేవుని రాజ్యమునుగూర్చిన సత్యము. ఈ స్వచ్ఛమైన భాష మతపరమైన తప్పులను మరియు అబద్ధ ఆరాధనను తీసివేయును. జీవముగల నిజమైన, దేవుడైన యెహోవాను, స్వచ్ఛంగా, పరిశుభ్రంగా సంపూర్ణంగా ఆరాధించుటలో దానిని మాట్లాడు వారినందరిని అది ఐక్యపరచును. నేడు దాదాపు 3,000 భాషలు ఒకరినొకరు అర్థము చేసికొనుటకు ఆటంకముగా నిలిచివున్నవి. మరియు వందలాది అబద్ధమతములు మానవజాతిని గలిబిలి చేయుచున్నవి. కావున దేవుడు ప్రజలకు ఈ అద్భుతమైన, స్వచ్ఛమైన భాషను ఇచ్చుటను బట్టి మనకెంత ఆనందము!
11. అన్నిజనాంగముల మరియు జాతుల ప్రజల కొరకు స్వచ్ఛమైన భాష ఏమిచేసెను?
11 అవును, అన్నిజాతుల మరియు తెగల వారు స్వచ్ఛమైన భాషయందు ప్రవీణులగుచున్నారు. భూమిపైనున్న ఒకేఒక ఆత్మీయ స్వచ్ఛమైన భాషగా, అది బలవంతమైన ఐక్యపరచు శక్తిగా పనిచేయుచున్నది. దానిని మాట్లాడువారందరు “యెహోవా నామమును బట్టి, భుజములు కలిపి ఆయనను ఆరాధించునట్లు” లేక అక్షరార్థముగా “ఏకభుజముగా” ఆయనను ప్రార్థించునట్లు వారికి సహాయపడుతుంది. ఆవిధముగా వారు దేవున్ని “ఏక సమ్మతితో” “ఏకీభవించిన సమ్మతితో” మరియు ఒక్క ఏకీభవించిన భుజముతో సేవించుచున్నారు. (ది న్యూ ఇంగ్లీష్ బైబిల్, ది ఆమ్‌ప్లీఫైడ్ బైబిల్) స్టీవన్ టీ బైంగ్‌టన్ యొక్క తర్జుమా ఇట్లు చదువబడుచున్నది: “వారందరు యెహోవా నామమున మొరపెట్టునట్లు మరియు ఆయన పనియందు సహకరించునట్లు, అప్పుడు ప్రజలందరి పెదవులను నేను (యెహోవా దేవుడు) శుభ్రపరచెదను”. కేవలము యెహోవాసాక్షుల మధ్యనే దేవుని సేవయందు అటువంటి ప్రపంచ వ్యాప్తమైన వివిధ భాషల సహకారము ఉన్నది. నేడు 212 దేశములలో నలభై లక్షలకు పైగా రాజ్యప్రచారకులు అనేక మానవ భాషలలో సువార్త ప్రకటించుచున్నారు. అయినను, సాక్షులు “ఏకభావముతో మాటలాడుదురు” మరియు “యేక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను” ఉన్నారు. (1 కొరింథీయులు 1:10) ఇలా ఎందుకనగా వారు భూమిపై ఏ ప్రాంతమందున్నను తమ పరలోకపు తండ్రియొక్క స్తుతి మరియు మహిమకొరకై యెహోవాసాక్షులందరు ఒకే స్వచ్ఛమైన భాషను మాటలాడుదురు.
స్వచ్ఛమైన భాషను ఇప్పుడే నేర్చుకొనుము
12, 13. (ఎ) మీరు స్వచ్ఛమైన భాషను మాటలాడుటయందు ఎందుకు శ్రద్ధగలవారైయుండవలెను? (బి) జెఫన్యా 3:8, 9 నందలి మాటలు నేడు ఎందుకు ప్రాధాన్యతను కలిగియున్నవి?
12 స్వచ్ఛమైన భాషను మాట్లాడుటయందు మీరు ఎందుకు శ్రద్ధ గలవారైయుండవలెను? ఒక విషయమేమనగా దానిని నేర్చుకొని మరియు మాటలాడుటపై మీ జీవితము ఆధారపడియున్నది. ‘ప్రజలకు స్వచ్ఛమైన భాషను ఇచ్చెదనని’ వాగ్దానముచేయుటకు కొంచెము ముందు దేవుడిట్లు హెచ్చరించెను: “కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినముకొరకు కనిపెట్టియుండుడి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగుచేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్నిచేత భూమియంతయు కాలిపోవును.”—జెఫన్యా 3:8.
13 ప్రభువును, సైన్యముల కధిపతియగు యెహోవాచే మొదట ఆ మాటలు 26 శతాబ్దముల క్రితం యెరూషలేము రాజధానిగానున్న యూదాయందు పలుకబడెను. యెరూషలేము క్రీస్తుమత సామ్రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నందున ఆ వాక్కు అతి ప్రాముఖ్యముగా మన దినముకొరకై చెప్పబడెను. మరియు దేవుని పరలోక రాజ్యము, 1914లో స్థాపించబడినందున, అన్యజనులను పోగుచేయు మరియు రాజ్యములను సమకూర్చు యెహోవా దినము మనకాలమైయున్నది. గొప్ప సాక్ష్యపు పనిద్వారా ఆయన వారినందరిని సమకూర్చి తన ధ్యానము క్రిందకు తెచ్చెను. తత్ఫలితముగా ఇది వారిని ఆయన సంకల్పమునకు విరుద్ధముగా పురికొల్పెను. ఏమైనను, స్వచ్ఛమైన భాషను ఐక్యముగా మాట్లాడుటకు యెహోవా దేవుడు దయాపూర్వకముగా ఈ జనాంగములన్నింటిలోని ప్రజలను శక్తిమంతులను చేయుచున్నాడు. దానితో హార్‌మెగిద్దోనని సామాన్యముగా పిలువబడుచున్న “సర్వాధికారియైన దేవుని మహా దినమున జరుగు యుద్ధమున” దైవిక ఉగ్రతయొక్క తీవ్రమైన వెల్లడియందు జాతులన్నియు దహింపబడకమునుపే ఆయన వాగ్దానముచేసిన నూతన లోకమందు జీవమును కోరుకొను వారందరు ఆయనను ఐక్యముగా సేవించవలెను. (ప్రకటన 16:14, 16; 2 పేతురు 3:13) సంతోషకరముగా స్వచ్ఛమైన భాష మాట్లాడుచు మరియు ఐక్యపరచబడిన నిజమైన ఆరాధికులుగా విశ్వాసముతో యెహోవా నామమును కనిపెట్టుకొనువారు ప్రపంచ విపత్తుయొక్క తీక్షణసమయమందు దైవిక కాపుదలను ఆనందించెదరు. చివరిగా మానవజాతి పెదవులమీద కేవలము స్వచ్ఛమైన భాషమాత్రమే ఉండు నూతనలోకములోనికి దేవుడు వారిని క్షేమముగా తెచ్చును.
14. జెఫన్యా ద్వారా ఈ దుష్టవిధాంతమును తప్పించుకొనుటకు తక్షణచర్య గైకొనవలెనని దేవుడెట్లు చూపెను?
14 ప్రస్తుత దుష్టవిధానము యొక్క అంతమును తప్పించుకొన నిరీక్షించు వారందరు తక్షణచర్యగైకొనవలెనని తన ప్రవక్తయైన జెఫన్యా ద్వారా యెహోవా స్పష్టపరచుచున్నాడు. జెఫన్యా 2:1-3 ప్రకారం దేవుడిట్లు చెప్పెను: “సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టుగాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది విధినిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీమీదికి రాకమునుపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒక వేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.”
15. (ఎ) జెఫన్యా 2:1-3 యొక్క మొదటి నెరవేర్పు ఏమైయుండెను? (బి) యూదాపై దేవునియొక్క తీర్పుల అమలును ఎవరు తప్పించుకొనిరి మరియు మన కాలమందు ఈ తప్పించుకొనుట దేనికి సమాంతరమైయుండును?
15 ప్రాచీన యూదా మరియు యెరూషలేముపై ఆ మాటలు తమ ప్రప్రథమ నెరవేర్పును కలిగియున్నవి. పాపులైన యూదా ప్రజలు దేవుని విన్నపమునకు అనుకూలమైన ప్రత్యుత్తరమివ్వలేదని సా.శ.పూ 607లో బబులోనీయుల ద్వారా ఆయన తీర్పును అమలుచేయుటనుబట్టి స్పష్టమగుచున్నది. దేవునియెదుట యూదా ఏవిధముగా “సిగ్గుమాలిన జనము”గా నుండెనో అట్లే క్రీస్తుమత సామ్రాజ్యము కూడా యెహోవా యెదుట సిగ్గులేని జనాంగముగా నుండెను. ఏమైనను దేవుని మాట వినినందుకు కొంతమంది నమ్మకస్తులైన యూదులు మరియు ఇతరులు, వారిలో యెహోవా నమ్మకమైన ప్రవక్తయగు యిర్మీయా బ్రతికిరి. బ్రతికియున్నవారిలో ఎబెద్మెలెకను పేరుగల కూషీయుడు, యెహోనాదాబు సంతతివారు కొందరు బ్రతికిరి. (యిర్మీయా 35:18, 19; 39:11, 12, 16-18) అదేవిధముగా నేడును అన్ని జాతులనుండి పోగుచేయబడిన యేసుయొక్క “వేరేగొఱ్ఱెల” యొక్క “ఒక గొప్ప సమూహము” ఆర్మగెద్దోనును తప్పించుకొని దేవుని నూతన లోకములోనికి ప్రవేశించెదరు. (ప్రకటన 7:9; యెహాను 10:14-16) కేవలము స్వచ్ఛమైన భాషను నేర్చుకొని మాట్లాడువారే ఆనందముతో తప్పించుకొను ప్రజలైయుందురు.
16. “యెహోవాయొక్క ఉగ్రతదినమందు” దాచబడుటకు ఒకడేమి చేయవలెను?
16 యూదా మరియు యెరూషలేము తుడిచి పెట్టబడవలనని ఏవిధముగా యెహోవా కట్టడైయుండెనో అట్లే క్రీస్తుమతసామ్రాజ్యము కూడ నశించవలెను. వాస్తవానికి సమస్త అబద్ధమతమునకు నాశనము దగ్గరలో ఉన్నది. బ్రతుకనిచ్చయించు వారందరు తక్షణమే చర్యగైకొనవలెను. దాన్యమూర్చెడు కళ్లము మీద దాన్యము తూర్పారబట్టునప్పుడు పొట్టుగాలికి త్వరగా కొట్టుకుపోవునట్లు “సమయము గతించకమునుపే” వారట్లు చేయవలెను. దేవుని ఉగ్రతనుండి తప్పించుకొనుటకు మనము స్వచ్ఛమైన భాష మాటలాడుచు, యెహోవాయొక్క రగులుచున్న ఆగ్రహము మనపై రాకమునుపే దేవుని హెచ్చరికకు ప్రతిస్పందించవలెను. జెఫన్యా కాలములో మరియు నేడును దీనులు యెహోవాను వెదకి, వినయముగలవారై నీతిని అనుసరించెదరు. యెహోవాను వెదకుట అనగా ఆయనను పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణబలముతో ప్రేమించుటైయున్నది. (మార్కు 12:29, 20) అట్లు చేయువారు “ఒకవేళ ఆయన ఉగ్రత దినమున దాచిపెట్టబడుదురు.” అయితే ప్రవచనము “ఒక వేళ” అని ఎందుకు చెప్పుచున్నది? ఎందుకనగా, విశ్వాసము మరియు సహనముపైన రక్షణ ఆధారపడియున్నది. (మత్తయి 24:13) దేవుని నీతి కట్టడల ప్రకారము మార్చుకొని స్వచ్ఛమైన భాషను మాటలాడుచుండువారే యెహోవా ఉగ్రత దినమందు దాచబడుదురు.
17. మనము పరిశీలించుటకు ఏ ప్రశ్నలు గలవు?
17 యెహోవా ఉగ్రతదినము దగ్గరాయెను. రక్షణ స్వచ్ఛమైన భాష నేర్చుకొని దానిని ఉపయోగించుటపై ఆధారపడియున్నది గనుక దానిని పఠించుట మరియు మాట్లాడుటయందు గంభీరముగా ఇమిడియుండుటకు ఇదియే సమయము. కాని ఒక వ్యక్తి స్వచ్ఛమైన భాషనెట్లు నేర్చుకొనలడు? దానిని మాట్లాడుటవలన మీరెట్లు లాభముపొందగలరు? (w91 5/1)
మీరెట్లు జవాబిత్తురు
◻ మానవభాష ఎట్లు పుట్టెను?
◻ స్వచ్ఛమైన భాష ఏది?
◻ జెఫన్యా 3:8, 9 నందలి మాటలు నేడు ఎందుకు ప్రాధాన్యత కలిగివున్నవి?
◻ “యెహోవాయొక్క ఉగ్రత దినమందు” దాచబడుటకు మనమేమి చేయవలెను?
[17వ పేజీలోని చిత్రం]
బాబెలు యొద్ద వారి భాషను తారుమారు చేయుటద్వారా దేవుడు మానవజాతిని విస్తరింపజేసెను