కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 7/15 పేజీలు 24-27
  • యెహోవా అమూల్యమైన గొర్రెలను మృదువుగా కాయుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా అమూల్యమైన గొర్రెలను మృదువుగా కాయుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిర్భయ కాపరియగు దావీదు
  • లెక్క ఒప్పజెప్పుట
  • కాపరిగా మోషే ఏమి నేర్చుకున్నాడు
  • యెహోవా గొర్రెలన్నియు అమూల్యమైనవే
  • కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యెహోవా నియమించిన కాపరులకు లోబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • వారు గొర్రెపిల్లలను కనికరముతో కాయుదురు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ‘మీ మధ్యనున్న దేవుని మందను కాయండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 7/15 పేజీలు 24-27

యెహోవా అమూల్యమైన గొర్రెలను మృదువుగా కాయుట

ఆ పెద్దలు మిక్కిలి శ్రద్ధతో విన్నారు. అపొస్తలుడైన పౌలిచ్చే ఉపదేశాలను పొందడానికి వారు ఎఫెసునుండి మిలేతుకు 50 కిలోమీటర్లు ప్రయాణంచేసి వచ్చారు. ఆయన్ని చూడ్డం ఇదే చివరిసారని విన్నప్పుడు వారు దుఃఖాక్రాంతులయ్యారు. కాబట్టి వారు ఆ తర్వాత వినబోవు మాటలు అత్యంత ప్రాముఖ్యమైనవని వారికి తెలుసు: “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.”—అపొస్తలుల కార్యములు 20:25, 28, 38.

పౌలుచేసిన క్లుప్త సూచన నిశ్చయంగా ఆ ఎఫెసు పెద్దలకు ఎంతో విలువైన సమాచారాన్ని అందజేసింది. వారి చుట్టుప్రక్కల పల్లెల్లో గొర్రెలుకాసే పని వారికి తెలుసు. ఆలాగే హెబ్రీ లేఖనాల్లో గొర్రెల కాపరులను గూర్చి చెప్పబడిన అనేక వచనాలు కూడ వారికి పరిచయమే. తన ప్రజల కాపరిగా యెహోవా తనను పోల్చుకోవడం వారికి తెలుసు.—యెషయా 40:10, 11.

“మందకు” “అధ్యక్షులని,” “సంఘానికి” “కాపరులని” పౌలు వారినిగూర్చి మాట్లాడాడు. “అధ్యక్షులనే” మాట వారి నియామక మేమిటో సూచిస్తుండగా, “కాపరి” అనే మాట వారు తమ పర్యవేక్షణను ఎలా నిర్వహించాలో వర్ణిస్తున్నది. అవును, గొర్రెల కాపరి తన మందనెలా కాస్తాడో అదేరీతిలో అధ్యక్షులు సంఘమందలి ప్రతిసభ్యున్ని ప్రేమతో చూడాలి.

ఈనాడు, కేవలం కొంతమంది పెద్దలు మాత్రమే అక్షరార్థకంగా గొర్రెల్ని కాసిన అనుభవాన్ని కలిగియున్నారు. అయితే బైబిలు ప్రత్యేకంగా అలంకార భావమందు ఎన్నోసార్లు గొర్రెలను, కాపరులను గూర్చి మాట్లాడుతున్నది, కాబట్టి పౌలు మాటల అన్వయింపుకు కాలపరిమితి లేదు. ఆలాగే ప్రాచీన కాలాల్లో దేవుడనుగ్రహించిన కాపరులను గూర్చిన వృత్తాంతముల నుండి ఎంతో నేర్చుకోవచ్చును. దేవుని సంఘాన్ని కాయుటకు తాము ఏ లక్షణాల్ని వృద్ధిచేసుకోవాలో చూచుటకు గమనార్హమైన వారి మాదిరులు ఆధునిక దిన పెద్దలకు సహాయపడగలవు.

నిర్భయ కాపరియగు దావీదు

బైబిలు కాలాల్లోని కాపరులను గూర్చి మనమాలోచించినప్పుడు, మనకు దావీదు ఎక్కువ గుర్తొస్తాడు, ఎందుకంటె ఆయన గొర్రెలకాపరిగానే తన జీవితాన్ని ఆరంభించాడు. దావీదు జీవితాన్నుండి మనం నేర్చుకొనే మొదటి పాఠమేమనగా, కాపరంటే అదొక హోదా కాదు. వాస్తవానికి, ఇశ్రాయేలీయులపై రాజుగా ఉండుటకు యెష్షయి కుమారుల్లో ఒకని అభిషేకించడానికి ప్రవక్తయైన సమూయేలు వచ్చినప్పుడు, బాలుడైన దావీదును మొదట ఎవరూ పట్టించుకోలేదు. యెహోవా ఆయన ఏడుగురు అన్నలను తిరస్కరించిన తర్వాతనే, బయట పొలాల్లో “గొఱ్ఱెలను కాయుచున్న” దావీదు పేరు ప్రస్తావనకు వచ్చింది. (1 సమూయేలు 16:10, 11) అయితే, కాపరిగా దావీదు గడిపిన సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని కాసే గట్టిపనికి ఆయనను సిద్ధం చేశాయి. “[యెహోవా] తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలోనుండి . . . తన ప్రజలైన యాకోబును, . . . మేపుటకై అతనిని రప్పించెను” అని కీర్తన 78:70, 71 చెబుతున్నది. సరియైన రీతిలోనే, దావీదు “యెహోవా నా కాపరి” అనే ప్రారంభపు మాటలతో శ్రావ్యమైన, ప్రఖ్యాత 23వ కీర్తన రచించాడు.

దావీదు వలెనే, క్రైస్తవ సంఘమందలి పెద్దలు అసమాన్య ప్రాధాన్యత కొరకు ప్రయత్నించకుండా వినయంగల ఉపకాపరులుగా సేవచేయాలి. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినట్లు, ఈ కాపరి బాధ్యతకు అర్హులగువారు ప్రాధాన్యత కొరకు కాదుగాని ‘దొడ్డ పనిని అపేక్షిస్తున్నారు.’—1 తిమోతి 3:1.

అక్షరార్థమైన కాపరిగా దావీదు పని అల్పమైననూ, కొన్నిసార్లు దానికి బహు ధైర్యం అవసరమైయుండెను. ఉదాహరణకు, తన తండ్రి గొర్రెల్లోనుండి ఒకదాన్ని ఒకసారి సింహము, మరోసారి ఎలుగుబంటి ఎత్తుకుపోయినప్పుడు, దావీదు నిర్భయంగా వాటినెదుర్కొని ఆ క్రూరమృగాల్ని చంపాడు. (1 సమూయేలు 17:34-36) సింహం తనకంటే పరిమాణంలో పెద్దవైన జంతువుల్ని సహితం చంపగలదు గనుక ఇది అసాధారణ ధైర్యసాహస చర్యే. ఆలాగే పాలాస్తీనా ప్రాంతమందుండే సిరియా దేశపు గోధుమవర్ణపు ఎలుగుబంటి దాదాపు 140 కిలోల బరువుండి తన బలమైన ఒకేఒక పంజాదెబ్బతో జింకను చంపగలదు.

తన తండ్రి గొర్రెల కొరకు దావీదుకున్న ధైర్యంతోకూడిన శ్రద్ధ క్రైస్తవ సంఘ కాపరులకు శ్రేష్ఠమైన మాదిరైయుంది. “మందను కనికరింపని” “క్రూరమైన తోడేళ్లను” గూర్చి అపొస్తలుడైన పౌలు ఎఫెసు పెద్దలను హెచ్చరించాడు. (అపొస్తలుల కార్యములు 20:29) ఆధునిక కాలాల్లో సహితం, యెహోవా గొర్రెల ఆత్మీయ క్షేమాన్ని కాపాడుటకు క్రైస్తవ కాపరులు ధైర్యం ప్రదర్శించాల్సిన సందర్భాలు ఉత్పన్నమౌతాయి.

ధైర్యంతో గొర్రెల్ని కాపాడాల్సివున్ననూ, ప్రేమగల కాపరియగు దావీదు, మంచి కాపరియగు యేసుక్రీస్తులను పోలి వారినెంతో కనికరంతో చూడాలి. (యోహాను 10:11) గొర్రెలు యెహోవాకు చెందినవని తెలుసుకొని, “దేవుని స్వాస్థ్యముగానున్న వారిపై ప్రభువులైనట్టు” పెద్దలెన్నడూ గొర్రెలతో కఠినంగా వ్యవహరించకూడదు.—1 పేతురు 5:2, 3; మత్తయి 11:28-30; 20:25-27.

లెక్క ఒప్పజెప్పుట

పితరుడైన యాకోబు మరో పేరుగాంచిన గొర్రెల కాపరి. శ్రద్ధచూపాలని తనకప్పగింపబడిన ప్రతి గొర్రె విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యుడని ఆయన పరిగణించాడు. ఆయన తన మామయగు లాబాను గొర్రెల్ని ఎంత శ్రద్ధగా కాసాడంటే, తన 20 సంవత్సరాల సేవ తర్వాత యాకోబు ఇట్లు చెప్పగల్గాడు: “నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి. నేను ఈలాగుంటిని.”—ఆదికాండము 31:38, 39.

మన ఆత్మల కాపరియగు, యెహోవా దేవుడు “తన స్వరక్తమిచ్చి సంపాదించిన” మందయెడల క్రైస్తవ అధ్యక్షులు మరియెక్కువ శ్రద్ధ కనబరుస్తారు. (అపొస్తలుల కార్యములు 20:28; 1 పేతురు 2:25; 5:4) సంఘమందు నాయకత్వం వహించే పురుషులు “లెక్క ఒప్పచెప్పవలసిన వారివలె మీ ఆత్మలను కాయుచున్నారని” హెబ్రీ క్రైస్తవులకు గుర్తుచేసినప్పుడు పౌలు ఈ బరువైన బాధ్యతను నొక్కితెల్పాడు.—హెబ్రీయులు 13:17.

కాపరి పనికి కాలపరిమితి లేదని కూడ యాకోబు మాదిరి చూపిస్తున్నది. అది దివారాత్రముండే వ్యవహారమై యుండి తరచు అది స్వయం త్యాగాన్ని కోరుతుంది. ఆయన లాబానుతో ఇట్లన్నాడు: “పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.”—ఆదికాండము 31:40.

ఈ క్రింది అనుభవం ఉదహరిస్తున్నట్లుగా, నేడు ప్రేమగల అనేకమంది క్రైస్తవ పెద్దల విషయంలో ఇది నిజమైయుంది. మెదడు కంతిలోని చిన్నముక్కను పరీక్షకొరకు తీయడంవల్ల కలిగిన చిక్కుల కారణంగా ఒక సహోదరున్ని ఇన్‌టెన్సివ్‌ కేర్‌ వైద్య విభాగంలో చేర్చారు. రాత్రిపగలు కుటుంబం ఆయన దగ్గరే ఉండే ఏర్పాటుచేశారు. వారికి అవసరమైన నైతిక మద్దతు, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, ప్రతిరోజు ఆ రోగిని, అతని కుటుంబాన్ని సందర్శించడానికి వీలగునట్లు ఒక స్థానిక పెద్ద తనకుండే రోజువారీ పనిరద్దీలోనే సమయాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. వైద్యశాలలో అతనికి అత్యంత జాగ్రత్తగా వైద్యంచేస్తున్నందున, అన్ని సమయాల్లో ఆయనకు పగలు సందర్శించడానికి వీలుకాకపోయేది. అందువల్ల ఆ పెద్ద తరచు చాలా ప్రొద్దుపోయిన తర్వాత వైద్యశాలకు వెళ్లాల్సివచ్చేది. అయితే ఆయన ప్రతిరాత్రి సంతోషంగా అక్కడికి వెళ్లేవాడు. “నాకు అనుకూలమైనప్పుడు కాదుగాని, రోగికి అనుకూలంగావున్న సమయంలో సందర్శించాలని నేను గ్రహించానని” ఆ పెద్ద చెప్పారు. వైద్యశాలలో మరో విభాగానికి మార్చ వీలగునంతగా ఆ సహోదరుడు కోలుకున్నప్పుడు సహితం ఆ పెద్ద ప్రతిదినం వెళ్లి ఆయన్ని ప్రోత్సహించడం మానలేదు.

కాపరిగా మోషే ఏమి నేర్చుకున్నాడు

బైబిలు మోషేను “భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు” అని వర్ణిస్తున్నది. (సంఖ్యాకాండము 12:3) అయితే, అన్నిసమయాల్లో ఆయనట్లుండలేదని చరిత్ర చూపిస్తున్నది. యువకునిగా ఉన్నప్పుడాయన తోటి ఇశ్రాయేలీయుని కొట్టాడని ఒక ఐగుప్తీయున్ని చంపాడు. (నిర్గమకాండము 2:11, 12) నిశ్చయంగా అది ఒక సాత్వికుడు చేయాల్సిన పనికాదు. అయిననూ, దేవుడు ఆ తర్వాత లక్షలసంఖ్యలోగల జనాంగమును వాగ్దాన దేశానికి నడిపించుటకు మోషేను ఉపయోగిస్తాడు. అనగా మోషేకు భవిష్యత్తునందు నిశ్చయంగా శిక్షణ అవసరమై యుండెను.

మోషే అప్పటికే లోకరీత్యా “ఐగుప్తీయుల సకల విద్య” నభ్యసించినను, యెహోవా మందను కాయడానికి ఆయనకు అంతకంటే ఎక్కువ కావల్సియుండెను. (అపొస్తలుల కార్యములు 7:22) ఈ అదనపు శిక్షణ బహుశ ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది? మిద్యాను అరణ్యమందు దాదాపు 40 సంవత్సరాలపాటు దీనుడైన గొర్రెల కాపరిగా సేవచేయునట్లు దేవుడు మోషేను అనుమతించాడు. తన మామయగు యిత్రో మందలు కాయుచున్న సమయంలో దీనత్వం, వినయం, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశానిగ్రహము వంటి లక్షణాల్ని వృద్ధిచేసుకున్నాడు. యెహోవాపై ఆధారపడ్డాన్ని కూడ ఆయన నేర్చుకున్నాడు. అవును, అక్షరార్థమైన గొర్రెల్ని మేపడం ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని సమర్థవంతంగా కాసే కాపరిగా అర్హత మోషే సంపాదించాడు.—నిర్గమకాండము 2:15–3:1; అపొస్తలుల కార్యములు 7:29, 30.

నేడు దేవుని ప్రజలయెడల శ్రద్ధ చూపడానికి ఒక పెద్దకు ఉండాల్సిన లక్షణాలివే కావా? అవును, “ప్రభువుయొక్క దాసుడు . . . అందరియెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెనని” పౌలు తిమోతికి గుర్తుచేశాడు.—2 తిమోతి 2:24, 25.

ఈ లక్షణాల్ని సంపూర్ణంగా వృద్ధిచేసుకోవడం తనకు కష్టంగా ఉన్నందున ఒక పెద్ద కొన్ని సమయాల్లో నిరాశచెందవచ్చు. అయినప్పటికిని, ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకొనకూడదు. మోషే విషయంలో వలెనే, మంచి కాపరయ్యే లక్షణాల్ని పూర్తిగా వృద్ధిచేసుకొనుటకు దీర్ఘకాలం పట్టవచ్చు. అయితే యుక్తకాలమందు, చిత్తశుద్ధితో చేసే అటువంటి ప్రయత్నానికి ప్రతిఫలముంటుంది.—1 పేతురు 5:10 పోల్చండి.

పెద్దగా, బహుశ మిమ్మల్ని ఇతరులంత ఎక్కువగా ఉపయోగించక పోతుండవచ్చు. మోషేకు వలెనే బహుశ కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాల్ని వృద్ధిచేసుకోవడానికి యెహోవా మిమ్మల్ని అనుమతిస్తున్నాడేమో? యెహోవా “మిమ్మునుగూర్చి చింతించుచున్నాడని” ఎన్నడూ మర్చిపోవద్దు. అయితే, ‘దేవుడు అహంకారుల నెదిరించి దీనులకు కృప ననుగ్రహిస్తాడు గనుక మనం దీనత్వాన్ని ధరించుకొనే’ అవసరత ఉందని కూడా మనం మనస్సులో ఉంచుకోవాలి. (1 పేతురు 5:5-7) యెహోవా యిచ్చే శిక్షణను అంగీకరించి, నీకు దాన్ని అన్వయించుకొంటే, మోషే వలెనే నీవును ఆయనకు మరింత ఉపయోగపడగలవు.

యెహోవా గొర్రెలన్నియు అమూల్యమైనవే

బైబిలు కాలాల్లో నమ్మదగిన, ప్రేమగల కాపరులు ప్రతి గొర్రెయెడల తమకు బాధ్యత కలదనే భావాన్ని కలిగియుండిరి. ఆత్మీయ కాపరుల విషయంలో సహితం అది నిజమై యుండాలి. ఇది పౌలు చెప్పిన ఈ మాటలనుండి తేటపడుతున్నది: “ఆ యావత్తుమందను గూర్చి . . . జాగ్రత్తగా ఉండుడి.” (అపొస్తలుల కార్యములు 20:28) ఆ “మందలో” ఎవరెవరు ఇమిడియుందురు?

వంద గొర్రెలున్ననూ దానిలో ఒక గొర్రె తప్పిపోతే వెంటనే దాన్ని వెదకడానికి వెళ్లిన ఒక మనుష్యుని గూర్చిన ఉపమానాన్ని యేసు చెప్పాడు. (మత్తయి 18:12-14; లూకా 15:3-7) అదే ప్రకారం అధ్యక్షుడైన వ్యక్తి సంఘమందలి ప్రతివ్యక్తి యెడల శ్రద్ధ కలిగియుండాలి. పరిచర్యలో లేదా క్రైస్తవ కూటాలకు హాజరుకావడానికి మందగిస్తే ఆ గొర్రె మందలో ఇక లేనట్లేనని భావం కాదు. అతడింకను పెద్దలు యెహోవాకు “లెక్క ఒప్పచెప్పవలసిన” “యావత్తుమందలో” భాగమై యున్నాడు.

సంఘంతో సహవసించి క్రమేపి చురుకుదనం కోల్పోయిన వారి విషయంలో ఒక సంఘ పెద్దల కూటమి ఎంతో శ్రద్ధచూపారు. వారు ఈ వ్యక్తులందరి పేర్ల పట్టిక తయారుచేసి, వారిని సందర్శించి యెహోవా మందకు వారు తిరిగివచ్చునట్లు సహాయంచేయడానికి ప్రత్యేక ప్రయత్నంచేయ తలపెట్టారు. ఈ పెద్దలు రెండున్నర సంవత్సరాల కాలంలోనే దాదాపు 30 మంది వ్యక్తులు తిరిగి యెహోవా సేవలో చురుకుగా పాల్గొనేటట్లు సహాయం చేయగల్గినందుకు దేవునికి ఈ పెద్దలెంతగా కృతజ్ఞులైయున్నారు! అలా సహాయం చేయబడిన వారిలో ఒకవ్యక్తి దాదాపు 17 సంవత్సరాలనుండి చురుకుగా లేడు.

‘దేవుడు ‘తన స్వంత కుమారుని రక్తమిచ్చి’ ఈ గొర్రెల్ని కొన్నాడనే వాస్తవాన్నిబట్టి ఈ బరువైన బాధ్యత అధ్యక్షులపై మరింత గట్టి ప్రభావం చూపుతుంది. (అపొస్తలుల కార్యములు 20:28) గొర్రెల కొరకు ఇంతకంటే అధిక మూల్యం చెల్లించడం కుదరదు. గొర్రెవంటి ప్రతివ్యక్తిని కనుగొని, సహాయం చేయడానికి పరిచర్యలో గడిపిన సమయం, చేసిన కృషినంతటిని గూర్చి ఆలోచించండి. వారినందరిని దేవుని గొర్రెల మందలో ఉంచడానికి అదే విధమైన కృషిచేయవద్దా? నిశ్చయముగా, సంఘమందలి ప్రతి గొర్రె అమూల్యమే.

మందలోని ఒక సభ్యుడు గంభీరమైన తప్పిదములో చిక్కుకొన్ననూ, పెద్దల బాధ్యతయందు మార్పు రాదు. ఏ మాత్రం సాధ్యమైనా ఆ తప్పిదస్థున్ని కాపాడుటకు మృదువుగా, సాధుస్వభావంలో కృషిచేస్తూ వారింకను శ్రద్ధగల కాపరులుగానే ఉంటారు. (గలతీయులు 6:1, 2) విశాదకరమేమంటే, కొన్ని సందర్భాల్లో తానుచేసిన గంభీరమైన పాపం విషయంలో ఒక్కో సభ్యుడు దైవిక విచారం కనబర్చడం లేదని రుజువౌతుంది. అలాంటప్పుడు మందలోని మిగతావారిపై ఈ కలుషిత ప్రభావం పడకుండా కాపాడే లేఖనానుసారమైన బాధ్యత ప్రేమగల ఈ కాపరులకు ఉంటుంది.—1 కొరింథీయులు 5:3-7, 11-13.

అయినప్పటికిని, తప్పిపోతున్న గొర్రెలయెడల కనికరం చూపడంలో యెహోవా దేవుడు పరిపూర్ణమైన మాదిరినుంచాడు. మన కనికరంగల కాపరి ఇలా చెబుతున్నాడు: “తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును.” (యెహెజ్కేలు 34:15, 16; యిర్మీయా 31:10) ఈ సర్వోన్నత మాదిరి ననుసరించి, ఆధునిక దిన ఆత్మీయ కాపరులు తామిచ్చే సహాయానికి స్పందించే బహిష్కృత వ్యక్తులను సందర్శించే ప్రేమగల ఏర్పాటుచేయబడింది. అలా తప్పిపోయిన గొర్రెలను బలపరిచే కనికరంగల ఈ ప్రయత్నాలు చక్కని ఫలితాల్నిచ్చాయి. యిలా పునరుద్ధరింపబడిన ఒక సహోదరి యిలాచెప్పింది: “పెద్దలు సందర్శించినప్పుడు తిరిగిరావడానికి అవసరమైన ప్రోత్సాహం నాకు లభించింది.”

మిలేతునందలి ఎఫెసు పెద్దలకు, ఈనాటి అధ్యక్షులకు పౌలు మాటలు నిస్సందేహంగా ఎంతో అర్థాన్ని కలిగివున్నాయి. కాపరులను గూర్చి ఆయన చెప్పినమాటలు, కాపరిగా రాజుగా ఉండిన దావీదు మాదిరి చూపినట్లు వినయం, ధైర్యం; రాత్రింబగలు యాకోబు చేసిన సేవ రుజువు పర్చినట్లు వ్యక్తిగత బాధ్యత, సంరక్షణా శ్రద్ధ; మోషే చూపినట్లు ఓపికతో మరింత శిక్షణ నంగీకరించుటకు ఇచ్ఛయించుట వంటి కోరదగిన లక్షణాలు అధ్యక్షుల్లో ప్రస్ఫుటంగా కన్పించాలని గుర్తుచేస్తున్నవి. ‘దేవుడు తన స్వంత కుమారుని రక్తమిచ్చి కొన్న మందను’ మృదువుగా కాయుటకు కావలసిన లక్షణాలను సంఘ పెద్దలు వృద్ధిచేసుకొని, వాటిని కనబరచుటకు ఈ బైబిలు ఉదాహరణలు నిజంగా వారికి సహాయం చేస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి