కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 11/15 పేజీలు 21-25
  • యెహోవా నియమించిన కాపరులకు లోబడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా నియమించిన కాపరులకు లోబడండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచి కాపరి ఉపకాపరులను దయచేశాడు
  • మంచి కాపరి గొర్రెలను మేపుతాడు, సంరక్షిస్తాడు
  • ఉపకాపరుల పొరపాట్లను మనం ఎలా దృష్టించాలి?
  • ‘ఒక్క మంద, ఒకే కాపరి’
  • కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యెహోవా అమూల్యమైన గొర్రెలను మృదువుగా కాయుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ‘మీ మధ్యనున్న దేవుని మందను కాయండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ప్రేమగల కాపరులకు వినయంగా లోబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 11/15 పేజీలు 21-25

యెహోవా నియమించిన కాపరులకు లోబడండి

‘మీపైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయుచున్నారు. కాబట్టి వారి మాట విని, వారికి లోబడియుండుడి.’—హెబ్రీ. 13:17.

మీ జవాబు ఏమిటి?

  • సంఘ పెద్దలు దేవుని గొర్రెలను ఎలా కాస్తారు?

  • ఉపకాపరుల మాట గొర్రెలు ఎందుకు వినాలి?

  • ఉపకాపరులు ఇచ్చే లేఖనాధార సలహాలను పెడచెవినబెట్టడానికి వాళ్ల అపరిపూర్ణత ఎందుకు కారణం కాదు?

1, 2. యెహోవా తనను ఒక కాపరితో ఎందుకు పోల్చుకుంటున్నాడు?

యెహోవా తనను ఒక కాపరితో పోల్చుకుంటున్నాడు. (యెహె. 34:11-14) యెహోవా ఎలాంటి వ్యక్తో ఆ పోలికను బట్టి మనకు అర్థమౌతుంది. ఒక ప్రేమగల మానవ కాపరి తన మందలోని గొర్రెలు సజీవంగా, సురక్షితంగా ఉండేలా చూసుకునే పూర్తి బాధ్యతను తనమీద వేసుకుంటాడు. ఆయన వాటిని పచ్చికబయళ్ల వద్దకు, నీళ్ల వద్దకు తీసుకెళతాడు. (కీర్త. 23:1, 2) రాత్రనకపగలనక వాటిని కాపలా కాస్తాడు. (లూకా 2:8) క్రూర జంతువుల బారినుండి కాపాడతాడు. (1 సమూ. 17:34, 35) అప్పుడే పుట్టిన వాటిని జాగ్రత్తగా మోస్తాడు. (యెష. 40:11) తప్పిపోయిన వాటిని వెదుకుతాడు, గాయపడిన వాటికి కట్టుకట్టి ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు.—యెహె. 34:16.

2 ప్రాచీన కాలంలో చాలామంది యెహోవా ప్రజలు గొర్రెల కాపరులు, వ్యవసాయదారులు కాబట్టి, యెహోవా తనను ఓ ప్రేమగల కాపరితో ఎందుకు పోల్చుకున్నాడో వాళ్లు అర్థంచేసుకున్నారు. గొర్రెలు ఆరోగ్యంగా పెరగాలంటే వాటికి కాపరి శ్రద్ధ, అవధానం అవసరమని వాళ్లకు తెలుసు. ఒక విధంగా, ప్రజల విషయంలో కూడా అది నిజం. (మార్కు 6:34) మంచి ఆధ్యాత్మిక శ్రద్ధ, నడిపింపు లేకపోతే ప్రజలు ఎంతో వేదన అనుభవిస్తారు. “కాపరిలేని గొఱ్ఱెలు” చెదిరిపోయినట్లే, వాళ్లు కూడా శత్రువులకు ఎర అయ్యి, నైతికంగా తప్పిపోతారు. (1 రాజు. 22:17) అయితే, యెహోవా తన ప్రజల బాగోగులను ప్రేమగా చూసుకుంటున్నాడు.

3. మనం ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

3 యెహోవా ఎలా ఒక కాపరిలా ఉన్నాడో మనం కూడా అర్థంచేసుకున్నాం. గొర్రెల్లాంటి తన ప్రజల అవసరాలను యెహోవా ఇప్పటికీ తీరుస్తున్నాడు. ఈ రోజుల్లో ఆయన తన గొర్రెలను నడిపిస్తూ, వాటి అవసరాలు ఎలా తీరుస్తున్నాడో ఇప్పుడు చూద్దాం. అలాగే యెహోవా నడిపింపుకు, శ్రద్ధకు ఆయన గొర్రెలు ఎలా స్పందించాలో కూడా పరిశీలిద్దాం.

మంచి కాపరి ఉపకాపరులను దయచేశాడు

4. దేవుని గొర్రెల అవసరాలు తీర్చడంలో యేసు పాత్ర ఏమిటి?

4 యెహోవా, క్రైస్తవ సంఘ శిరస్సుగా యేసును నియమించాడు. (ఎఫె. 1:22, 23) ‘మంచి కాపరిగా’ యేసు తన తండ్రి ఆసక్తులను, సంకల్పాలను, లక్షణాలను ప్రతిబింబించాడు. యేసు ఆఖరికి తన ‘గొఱ్ఱెలకొరకు ప్రాణము’ కూడా అర్పించాడు. (యోహా. 10:11, 15) క్రీస్తు విమోచన క్రయధనం మానవజాతికి ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా! (మత్త. 20:28) యేసు “యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము” పొందాలనేదే యెహోవా ఉద్దేశం.—యోహా. 3:16.

5, 6. (ఎ) తన గొర్రెల బాగోగులు చూసుకోవడానికి యేసు ఎవరిని నియమించాడు? ఆ ఏర్పాటు నుండి ప్రయోజనం పొందాలంటే గొర్రెలు ఏమి చేయాలి? (బి) సంఘ పెద్దలకు ఇష్టంగా లోబడివుండడానికి అత్యంత ప్రాముఖ్యమైన కారణం ఏమిటి?

5 మంచి కాపరియైన యేసుక్రీస్తు నడిపింపుకు గొర్రెలు ఎలా స్పందిస్తాయి? “నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును” అని యేసు చెప్పాడు. (యోహా. 10:27) మంచి కాపరియైన యేసు స్వరాన్ని వినడమంటే, అన్ని విషయాల్లో ఆయనిచ్చే నిర్దేశాన్ని పాటించడమని అర్థం. ఆయన నియమించిన ఆధ్యాత్మిక ఉపకాపరులకు సహకరించడం కూడా దానిలో భాగమే. తన అపొస్తలులు, శిష్యులు తను ప్రారంభించిన పనిని కొనసాగిస్తారని యేసు వివరించాడు. వాళ్లు యేసుకు చెందిన ‘గొర్రె పిల్లలకు బోధించాలి,’ వాటిని ‘మేపాలి.’ (మత్త. 28:20; యోహాను 21:15-17 చదవండి.) సువార్త వ్యాప్తి చెందుతూ, శిష్యుల సంఖ్య పెరిగే కొద్దీ సంఘంలోని వాళ్లను కాయడానికి యేసు పరిణతి చెందిన క్రైస్తవులను నియమించాడు.—ఎఫె. 4:11, 12.

6 మొదటి శతాబ్దపు ఎఫెసులోని పెద్దలతో మాట్లాడుతూ, ‘దేవుని సంఘాన్ని కాయడానికి’ వాళ్లను పరిశుద్ధాత్మ నియమించిందని అపొస్తలుడైన పౌలు నొక్కిచెప్పాడు. (అపొ. 20:28) నేటి క్రైస్తవ పెద్దల విషయంలో కూడా అది వాస్తవం. ఎందుకంటే వాళ్లు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించిన లేఖన అర్హతల ఆధారంగానే నియమితులయ్యారు. కాబట్టి క్రైస్తవ పెద్దలకు లోబడినప్పుడు మనం గొప్ప కాపరులైన యెహోవాకు, యేసుకు గౌరవం చూపిస్తాం. (లూకా 10:16) పెద్దలకు ఇష్టంగా లోబడివుండడానికి అత్యంత ప్రాముఖ్యమైన కారణం అదే. అయితే, అలా లోబడివుండడం జ్ఞానయుక్తమని చెప్పడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి.

7. మీరు యెహోవాతో మంచి సంబంధం కలిగివుండేలా పెద్దలు ఎలా సహాయం చేస్తారు?

7 పెద్దలు లేఖనాలను లేదా లేఖన సూత్రాలను ఉపయోగించి తోటి విశ్వాసులను ప్రోత్సహిస్తారు, వాళ్లకు సలహాలిస్తారు. అయితే తోటి సహోదరుల జీవితాలను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పెద్దలు అలాంటి నిర్దేశం ఇవ్వరు. (2 కొరిం. 1:24) బదులుగా సరైన నిర్ణయాలు తీసుకునేలా తోటి క్రైస్తవులకు సహాయం చేయడానికి, సంఘంలో క్రమాన్ని, సమాధానాన్ని పెంపొందించడానికే వాళ్లలా చేస్తారు. (1 కొరిం. 14:33, 39-40) పెద్దలు “ఆత్మలను కాయుచున్నారు” అని బైబిలు చెబుతుంది. సంఘంలోని ప్రతీ ఒక్కరు యెహోవాతో మంచి సంబంధం కలిగివుండేలా సహాయం చేయాలనే కోరిక పెద్దలకు ఉందని ఆ మాటల భావం. అలా వాళ్లు ఒక సహోదరుడు గానీ సహోదరి గానీ ‘తప్పిదములో చిక్కుకోబోతున్నారని’ లేదా అప్పటికే చిక్కుకున్నారని గ్రహిస్తే, వెంటనే సహాయం అందిస్తారు. (గల. 6:1, 2; యూదా 22) ‘నాయకులుగా ఉన్నవాళ్ల మాట విని, వారికి లోబడివుండడానికి’ ఇవి సరైన కారణాలు కావంటారా?—హెబ్రీయులు 13:17 చదవండి.

8. దేవుని మందను పెద్దలు ఎలా కాపాడతారు?

8 ఆధ్యాత్మిక కాపరియైన అపొస్తలుడైన పౌలు కొలొస్సయిలోని తోటి సహోదరులకు ఇలా రాశాడు: “ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.” (కొలొ. 2:8) పెద్దలు ఇచ్చే లేఖన సలహాలకు లోబడడానికి మరో మంచి కారణం పైనున్న ఆ హెచ్చరికలో ఉంది. తోటి సహోదరుల విశ్వాసాన్ని నీరుగార్చాలని ప్రయత్నించే వాళ్ల విషయంలో సహోదరులను అప్రమత్తుల్ని చేయడం ద్వారా వాళ్లు మందను కాపాడతారు. తప్పుడు మార్గంలో వెళ్లేలా ‘అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పడానికి’ ప్రయత్నించే ‘అబద్ధప్రవక్తలు, అబద్ధబోధకుల’ గురించి అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. (2 పేతు. 2:1, 14) ఇప్పుడున్న పెద్దలు కూడా అవసరమైనప్పుడు అలాంటి హెచ్చరికలు ఇవ్వాలి. పరిణతి కలిగిన పురుషులుగా వాళ్లు జీవితంలో అనుభవం గడించారు. పైగా వాళ్లు పెద్దలుగా నియమితులవ్వకముందే, తమకు లేఖనాల పట్ల స్పష్టమైన అవగాహన ఉందని, హితబోధ చేయడానికి తాము అర్హులమని నిరూపించుకున్నారు. (1 తిమో. 3:2, 3; తీతు 1:9) వాళ్లకున్న పరిణతి, సమతుల్యం, బైబిలు ఆధారిత జ్ఞానంవల్ల వాళ్లు మందకు సరైన నిర్దేశం ఇవ్వగలుగుతారు.

[23వ పేజీలోని చిత్రం]

కాపరి తన మందను కాపాడినట్లే, దేవుడు అప్పగించిన గొర్రెలను పెద్దలు కాపాడతారు (8వ పేరా చూడండి)

మంచి కాపరి గొర్రెలను మేపుతాడు, సంరక్షిస్తాడు

9. యేసు క్రైస్తవ సంఘాన్ని నేడు ఎలా నిర్దేశిస్తూ, పోషిస్తున్నాడు?

9 యెహోవా తన సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీలకు ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా దయచేస్తున్నాడు. లేఖనాధార సలహాలు చాలావరకు ప్రచురణల ద్వారానే మనకు అందుతున్నాయి. వాటితోపాటు, సంస్థ అప్పుడప్పుడు ఉత్తరాల ద్వారా, ప్రయాణ పర్యవేక్షకులు అందించే ఉపదేశాల ద్వారా సంఘ పెద్దలకు నేరుగా నిర్దేశం ఇస్తుంది. అలాంటి విధానాల్లో మందకు స్పష్టమైన నిర్దేశం అందుతోంది.

10. మంద నుండి దూరమైనవాళ్ల విషయంలో ఆధ్యాత్మిక కాపరులకు ఏ బాధ్యత ఉంది?

10 గొర్రెలను కాపాడుతూ, వాటి బాగోగులు చూసుకునే బాధ్యత శ్రద్ధగల కాపరులకు ఉంది. క్రైస్తవ పెద్దలు ముఖ్యంగా, విశ్వాసంలో బలహీనమైనవాళ్ల విషయంలో, గంభీరమైన పాపాలు చేసినవాళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. (యాకోబు 5:14, 15 చదవండి.) కొంతమంది బహుశా మంద నుండి దూరంగా వెళ్లివుండవచ్చు, క్రైస్తవ కార్యకలాపాలు మానేసివుండవచ్చు. ఆ పరిస్థితుల్లో, శ్రద్ధగల ఒక పెద్ద తప్పిపోయిన ప్రతీ గొర్రెను వెదికి, మందకు అంటే సంఘానికి తిరిగిరావాలని వాళ్లను అభ్యర్థించడానికి తాను చేయగలిగినదంతా చేస్తాడు! “ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు” అని యేసు వివరించాడు.—మత్త. 18:11-14.

ఉపకాపరుల పొరపాట్లను మనం ఎలా దృష్టించాలి?

11. పెద్దలు ఇచ్చే నిర్దేశాల్ని పాటించడం కొంతమందికి ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

11 యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఇద్దరూ పరిపూర్ణమైన కాపరులే. అయితే సంఘ బాగోగులు చూసుకోవడానికి వాళ్లు ఉపయోగించే మానవ కాపరులు మాత్రం పరిపూర్ణులు కారు. అందుకే పెద్దలు ఇచ్చే నిర్దేశాల్ని పాటించడం కొంతమందికి కష్టంగా అనిపిస్తుంది. ‘పెద్దలు కూడా మాలాంటి అపరిపూర్ణులే కదా, అలాంటప్పుడు వాళ్లిచ్చే సలహాలు మేమెందుకు వినాలి?’ అని వాళ్లు అనుకోవచ్చు. నిజమే, పెద్దలు అపరిపూర్ణులే. అయితే వాళ్ల పొరపాట్ల విషయంలో, బలహీనతల విషయంలో మనం సరైన దృష్టితో ఉండాలి.

12, 13. (ఎ) గతంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న దేవుని సేవకులు ఎలాంటి తప్పులు చేశారు? (బి) బాధ్యతలున్న పురుషులు చేసిన తప్పులు బైబిల్లో ఎందుకు నమోదయ్యాయి?

12 యెహోవా తన ప్రజలను నడిపించడానికి గతంలో ఎవరినైతే ఉపయోగించుకున్నాడో, ఆయా వ్యక్తులు చేసిన పొరపాట్లను బైబిల్లో నిజాయితీగా రాయించాడు. ఉదాహరణకు, దావీదు ఇశ్రాయేలు జనాంగానికి అభిషిక్తుడైన రాజు, నాయకుడు. అయినా శోధనకు లొంగిపోయి వ్యభిచారానికి పాల్పడ్డాడు, నరహత్య కూడా చేశాడు. (2 సమూ. 12:7-9) అపొస్తలుడైన పేతురు విషయం కూడా గమనించండి. క్రైస్తవ సంఘంలో ఎన్నో పెద్దపెద్ద బాధ్యతలున్నా పేతురు గంభీరమైన తప్పులు చేశాడు. (మత్త. 16:18, 19; యోహా. 13:38; 18:27; గల. 2:11-14) ఆదాము, హవ్వ తర్వాత వచ్చిన మనుషుల్లో యేసు తప్ప పరిపూర్ణులు ఎవ్వరూ లేరు.

13 వాళ్లు చేసిన పొరపాట్లను యెహోవా బైబిల్లో ఎందుకు రాయించాడు? ఒక కారణమేమిటంటే, తన ప్రజలను నడిపించడానికి తాను అపరిపూర్ణ మనుషులను ఉపయోగించగలనని ఆయన చూపించాలనుకున్నాడు. నిజానికి ఆయన అన్నిసార్లూ అపరిపూర్ణులనే ఉపయోగించుకున్నాడు. కాబట్టి, నేడు మనమీద నాయకులుగా ఉన్నవాళ్ల పొరపాట్లను సాకుగా చేసుకుని వాళ్లమీద సణగకూడదు, వాళ్ల అధికారాన్ని తిరస్కరించకూడదు. మనం అలాంటి సహోదరులను గౌరవించాలని, వాళ్లకు లోబడాలని యెహోవా కోరుకుంటున్నాడు.—నిర్గమకాండము 16:2, 8 చదవండి.

14, 15. దేవుడు గతంలో తన ప్రజలకు నిర్దేశాలను అందించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

14 ప్రస్తుతం మనమీద నాయకులుగా ఉన్నవాళ్లకు లోబడడం చాలా ప్రాముఖ్యం. గతంలో, విపత్కర పరిస్థితుల్లో యెహోవా తన ప్రజలకు ఎలా ఉపదేశాలు అందించాడో ఆలోచించండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు వాళ్లకు దేవుని ఆదేశాలు మోషే, అహరోనుల ద్వారా అందాయి. పదవ తెగులును తప్పించుకోవాలంటే ఇశ్రాయేలీయులు కొన్ని ఆదేశాలకు లోబడాల్సివుంది. ఆ ఆదేశాల్లో ప్రత్యేక భోజనాన్ని తినడం, ఒక గొర్రెను వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకు పూయడం ఉన్నాయి. ఆ విషయాలను దేవుడే నేరుగా ప్రజలకు చెప్పాడా? చెప్పలేదు, బదులుగా మోషే ఆ నిర్దేశాలను ఇశ్రాయేలు పెద్దలకు చెబితే, ఆ పెద్దలు వాటిని ప్రజలకు తెలియజేశారు. (నిర్గ. 12:1-7, 21-23, 29) ఆ పరిస్థితుల్లో మోషే, ఇతర పెద్దలు యెహోవా నిర్దేశాలను ప్రజలకు చేరవేశారు. క్రైస్తవ పెద్దలు నేడు అలాంటి ప్రాముఖ్యమైన పాత్రనే పోషిస్తున్నారు.

15 అలాగే బైబిలు చరిత్రలో యెహోవా జీవరక్షక నిర్దేశాల్ని మనుషులద్వారా లేదా దేవదూతలద్వారా చేరవేసిన సందర్భాల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఈ సందర్భాలన్నిటిలో దేవుడు ఇతరులకు కొంత అధికారాన్ని ఇచ్చాడు. ఆయన నామం పేరిట మాట్లాడిన ఆ ప్రతినిధులు, ఒకానొక విపత్తునుండి బయటపడాలంటే ఏమి చేయాలో ప్రజలకు తెలియజేశారు. యెహోవా హార్‌మెగిద్దోను సమయంలో కూడా తన ప్రతినిధుల ద్వారా తన ప్రజలకు నిర్దేశమిస్తాడని మనం నమ్మవచ్చు. అయితే నేడు యెహోవాకు, ఆయన సంస్థకు ప్రాతినిధ్యం వహించే బాధ్యతగల పెద్దలు దేవుడు తమకు అప్పగించిన అధికారాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.

‘ఒక్క మంద, ఒకే కాపరి’

16. ఏ ‘శబ్దాన్ని’ మనం శ్రద్ధగా వినాలి?

16 యెహోవా ప్రజలు ‘ఒకే కాపరియైన’ యేసుక్రీస్తు నాయకత్వంలో ‘ఒకే మందగా’ ఉన్నారు. (యోహా. 10:16) తాను “యుగసమాప్తి వరకు సదాకాలము” తన శిష్యులతో కూడా ఉంటానని యేసు హామీ ఇచ్చాడు. (మత్త. 28:20) సాతాను లోకం నాశనమవ్వడానికి ముందు జరగబోయే సంఘటనలన్నీ పరలోక రాజైన యేసు నియంత్రణలో ఉన్నాయి. దేవుని సంస్థతో ఐక్యంగా ఉంటూ, దానిలో సురక్షితంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? బైబిలు ఇలా జవాబిస్తుంది: “ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” ఆ ‘శబ్దంలో’ బైబిలు ద్వారా యెహోవా మనకు బోధిస్తున్న విషయాలు, తాము నియమించిన ఉపకాపరుల ద్వారా యెహోవా, యేసు చెబుతున్న మాటలు ఉన్నాయి.—యెషయా 30:21; ప్రకటన 3:22 చదవండి.

[25వ పేజీలోని చిత్రం]

ఒంటరి తల్లి లేదా తండ్రి ఉన్న కుటుంబాలను హానికరమైన సహవాసం నుండి కాపాడడానికి పెద్దలు ప్రయత్నిస్తారు (17, 18 పేరాలు చూడండి)

17, 18. (ఎ) మందకు ఏ ప్రమాదం పొంచివుంది? కానీ మనం ఏ విషయంలో నమ్మకంతో ఉండవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

17 సాతాను “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని బైబిలు చెబుతుంది. (1 పేతు. 5:8) సాతాను క్రూరమైన భయంకరమైన జంతువులా మాటేసి మందనే గమనిస్తూ, అజాగ్రత్తగా ఉన్నవాళ్లమీద లేదా మందనుండి దూరంగా వెళ్లిపోయిన వాళ్లమీద పంజా విసరడానికి అదను కోసం చూస్తున్నాడు. మిగతా మందకూ, మన ‘ఆత్మల కాపరియు, అధ్యక్షుడునైన’ యెహోవాకూ మరింత దగ్గరగా ఉండడానికి అదే ప్రాముఖ్యమైన కారణం. (1 పేతు. 2:25) మహాశ్రమలను తప్పించుకున్న వాళ్ల గురించి ప్రకటన 7:17 ఇలా చెబుతుంది: “గొఱ్ఱెపిల్ల [యేసు] వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకును వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” అంతకన్నా అద్భుతమైన వాగ్దానం ఇంకేదైనా ఉంటుందా?

18 సంఘపెద్దలకు సంఘాన్ని కాసే చాలా ప్రాముఖ్యమైన బాధ్యత ఉంది. అయితే, యేసుకు చెందిన గొర్రెలను తాము సరైన విధంగానే కాస్తున్నామని ఈ నియమిత పురుషులు ఎలా నిర్ధారించుకోవచ్చు?తర్వాతి ఆర్టికల్‌లో ఈ ప్రశ్నకు జవాబు చూద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి