కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 9/15 పేజీలు 20-23
  • వారు గొర్రెపిల్లలను కనికరముతో కాయుదురు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వారు గొర్రెపిల్లలను కనికరముతో కాయుదురు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని మందను కాయుట
  • నిజంగా శ్రద్ధచూపే కాపరులు
  • క్షేమాభివృద్ధికరమైన కాపరితనము
  • కాపరులారా—మీ బాధ్యతల్ని నెరవేర్చండి
  • యెహోవా అమూల్యమైన గొర్రెలను మృదువుగా కాయుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • దేవుని మందనుండి తప్పిపోయినవారికి సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యెహోవా నియమించిన కాపరులకు లోబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 9/15 పేజీలు 20-23

వారు గొర్రెపిల్లలను కనికరముతో కాయుదురు

మనిషికి అతి సన్నిహితంగా జీవించే అన్నిరకాల పశువుల్లో, ఏవియు పెంపుడు గొర్రెలవలె ఉండవు. అనేక జంతువులకు బలం, ఆహారం వెతుక్కునే జ్ఞానం, తమపైబడే జంతువుల బారినుండి తప్పించుకొనే జ్ఞానం ఉంటుంది, అయితే గొర్రె చాలా భిన్నంగా ఉంటుంది. ఊరకనే ఇవి కౄరజంతువుల బారినపడగలవు. కాపరిలేని గొర్రెలు భయంతో, నిస్సహాయంగా ఉంటాయి. మందనుండి వేరైతే అవి సులభంగా తప్పిపోతాయి. కాబట్టి పెంపుడు గొర్రెలు వాటి కాపరినే అంటిపెట్టుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అతడు లేకుండా అవి మనగల్గడం దాదాపు అసాధ్యమే. ఈ కారణాల్నిబట్టి, అమాయకులైన, పీడిత లేదా బలహీన ప్రజలను వర్ణించుటకు బైబిలు అలంకారార్థమందు గొర్రెలను ఉపయోగిస్తున్నది.

నిజం చెప్పాలంటే, కాపరికి లభించే ప్రతిఫలం కష్టార్జితమే. అతని జీవితం సులభమైనదేం కాదు. అతడు ఎండనక, చలియనక రాత్రిళ్లు నిద్రలేకుండా వాటిని కాస్తాడు. తరచు తన ప్రాణానికి తెగించికూడ, కౄరజంతువుల నుండి వాటినతడు కాపాడాలి. మందనంతటిని ఒకచోట ఉంచాలి గనుక అతడు వేరైన లేదా తప్పిపోయిన గొర్రెల్ని వెదకడానికి సమయం వెచ్చించాలి. రోగానికి గురైన లేదా దెబ్బతిన్న గొర్రెలకు అతడు చికిత్సచేయాలి. బలంలేని లేదా నీరసంగానున్న గొర్రెపిల్లల్ని మోసుకెళ్లాలి. వాటికి తగినంత మేత, నీరు అందేలా ఎప్పుడూ చూస్తుండాలి. మందను సంరక్షించడానికి కాపరి రాత్రులందు ఆరుబయట పడుకోవడం అసమాన్యమైన సంగతేం కాదు. కాబట్టి, కాపరిపనంటే అది కఠినమైన జీవితం, దానికి ధైర్యస్థుడైన, కష్టపడి పనిచేయగల, అన్నీ సమకూర్చగల వ్యక్తి అవసరమౌతుంది. అన్నింటికంటే ప్రాముఖ్యంగా, తన కప్పగించిన మందయెడల నిజమైన శ్రద్ధచూపించే సామర్థ్యం గలవాడై యుండాలి.

దేవుని మందను కాయుట

బైబిలు దేవుని ప్రజలను పెంపుడు గొర్రెలుగాను, వారిపైనున్న వారిని కాపరులుగాను వర్ణిస్తున్నది. యెహోవాయే ‘ఆత్మలకు కాపరియు, అధ్యక్షుడునై’ యున్నాడు. (1 పేతురు 2:25) “మంచి కాపరి” అయిన యేసుక్రీస్తు, గొర్రెలయెడల కనికరంతో కూడిన శ్రద్ధచూపబడాలనే తన అభిలాషను వ్యక్తపరుస్తూ అపొస్తలుడైన పేతురుతో యిలా చెప్పాడు: ‘నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను కాయుము, నా గొర్రె పిల్లలను మేపుము.’ (యోహాను 10:11; 21:15-17) దేవుని సంఘమును కాసే గంభీరమైన బాధ్యత క్రైస్తవ అధ్యక్షులకు ఇవ్వబడింది. (అపొస్తలుల కార్యములు 20:28) ఆత్మీయ కాపరులుగా వారి పనికి అక్షరార్థమైన గొర్రెల కాపరులకుండే లక్షణాలే అనగా ధైర్యం, కష్టపడి పనిచేయడం, అన్నీ సమకూర్చగల్గడం ముఖ్యంగా మంద యోగక్షేమాల యెడల హృదయపూర్వక శ్రద్ధ అవసరం.

దేవుని ప్రవక్తయగు యెహెజ్కేలు కాలంలో, ఇశ్రాయేలునందు యెహోవా ప్రజల అవసరతలు తీర్చడానికి నియమించబడిన అనేకమంది కాపరులు వారి విధులు నిర్వహించడంలో విఫలులయ్యారు. దేవుని మంద తీవ్రంగా దెబ్బతినగా, మందలోని అనేకులు సత్యారాధనను విడిచారు. (యెహెజ్కేలు 34:1-10) నేడు, నామకార్థ క్రైస్తవ సంఘానికి తాము కాపరులమని క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు చెప్పుకుంటున్నారు, అయితే ఈ మతనాయకులు యేసు భూమిమీద ఉండిన కాలంలో ప్రజలను నిర్లక్ష్యంచేసి, వారిని నానాబాధలకు గురిచేసిన దుష్టులైన వంచకులను పోలియున్నారని దాని ఆత్మీయ రోగగ్రస్త స్థితి నిరూపిస్తున్నది. క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు “గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము” చేయని ‘జీతగాన్ని’ పోలియున్నారు. (యోహాను 10:12, 13) ఏ విధంగా చూసినా వారు దేవుని మందను కాయుటకు ఇష్టములేనివారును, అసమర్థులును, అర్హతలేనివారునై యున్నారు.

నిజంగా శ్రద్ధచూపే కాపరులు

యెహోవా మందను కాయు వారందరికి యేసు పరిపూర్ణ మాదిరినుంచాడు. ప్రతి విధమందును ఆయన తన శిష్యులయెడల ప్రేమజూపుచు, దయ, జాలి కనబరుస్తూ, సహాయంచేయు వానిగా ఉండెను. అవసరతయందున్న వారిని వెదకుటకు ఆయన చొరవతీసుకొన్నాడు. యేసు పనిరద్దీ కలిగివున్ననూ, తరచు అలసివున్ననూ ఆయనన్ని వేళలా వారి సమస్యల్ని వినడానికి సమయం తీసుకొని వారికి ప్రోత్సాహాన్నిచ్చాడు. వారి పక్షాన తన ప్రాణాన్ని ధారపోయుటకు ఆయనిష్టపడటం ప్రేమను అత్యున్నతంగా వ్యక్తపర్చాడు.—యోహాను 15:13.

నేడు, నియమిత సంఘపెద్దలు, ఆలాగే పరిచారకులందరు మంద యెడల ఈ బాధ్యతను కలిగివున్నారు. కావున, మరో దేశంలో వస్తుసంపద పొందే అవకాశాలున్ననూ, సంఘాలను నిస్సహాయతలో, పర్యవేక్షణలేని స్థితిలో విడిచివెళ్లునట్లు వీరిలోని అనేకులు ఆ ప్రభావానికి లోనుకాలేదు. ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్న మందకు ప్రోత్సాహము, నడిపింపు అవసరము. (2 తిమోతి 3:1-5) “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచున్న” సాతాను ఉరిలో కొందరు చిక్కుకునే ప్రమాదము మరి ఎక్కువగా ఉన్నది. (1 పేతురు 5:8) క్రితమెన్నటికంటె ఇప్పుడు, క్రైస్తవ కాపరులు ‘అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచి, బలహీనులకు ఊతమిచ్చుట’ ప్రాముఖ్యము. (1 థెస్సలొనీకయులు 5:14) మందనుండి అస్థిరులైనవారు పడిపోకుండా వారు అడ్డుకోవాలంటే సదా అప్రమత్తత ఆవశ్యకము.—1 తిమోతి 4:1.

ఒక గొర్రెకు సహాయం ఎప్పుడు అవసరమో కాపరి ఎలా తీర్మానించుకోగలడు? క్రైస్తవ కూటాలకు హాజరుకాకపోవడం, ప్రాంతీయ పరిచర్యలో భాగం వహించడంలో క్రమం తప్పడం, ఇతరులతో సన్నిహిత సంబంధం తప్పించుకోవాలనే స్వభావంవంటివి సుస్పష్టమైన కొన్ని సూచనలైయున్నవి. మంద స్వభావాన్ని, వారి సంభాషణల దృక్పథాన్ని సునిశితంగా గమనించుట ద్వారాకూడ వారి బలహీనతలను కనిపెట్టవచ్చును. బహుశ తమ కోపభావాల్ని కనబరుస్తూ, ఇతరులయెడల వారు కఠిన స్వభావాన్ని చూపుతుండవచ్చు. ఆత్మీయ విషయాలకు బదులు వారి సంభాషణలు అమితంగా వస్తుసంపదను గూర్చిన విషయాలతో నిండియుండవచ్చు. ఉత్సాహం, ఆశాభావం, ఆనందం లేకపోవడం వారి విశ్వాసం బలహీనపడిందనే భావమివ్వవచ్చును. బేలగావున్న వారి ముఖ వర్చస్సు, వ్యతిరేకించే బంధువుల లేదా లోక స్నేహితుల వత్తిడి వారిపై ఉందనడానికి ఒక సూచన కాగలదు. ఈ సూచనలను గమనించుట ద్వారా, కాపరి ఎటువంటి సహాయం అవసరమో తీర్మానించవచ్చును.

సహాయం చేయడానికి తోటి విశ్వాసిని సందర్శించేటప్పుడు, క్రైస్తవ కాపరులు తమ ప్రాథమిక ఉద్దేశాన్ని మనస్సులో ఉంచుకోవడం అవసరం. అది ఏదో పిచ్చాపాటి మాట్లాడటానికి ఊరకనే సందర్శించడం కాదు. తన సహోదరులు ‘స్థిరపడులాగున వారికి ఆత్మసంబంధమైన కృపావరమిచ్చుటకు, వారిని పరస్పరం ప్రోత్సహించుటకు’ సందర్శించుట పౌలు ధ్యేయమై యుండెను. (రోమీయులు 1:11, 12) దీనిని నెరవేర్చుటకు, ముందుగా సిద్ధపడుట అవసరము.

మొదట, ఆ వ్యక్తిని పరిశీలించి అతని ఆత్మీయ పరిస్థితిని బేరీజు వేసుకొనుటకు ప్రయత్నించండి. అది స్థిరపరచుకున్న తర్వాత, ఎలాంటి నడిపింపు, ప్రోత్సాహము లేదా సలహా అతనికి అత్యంత ప్రయోజనకరమో తలంచండి. దేవుని వాక్యమగు బైబిలు “బలముగలదై” యుంది గనుక సమాచారానికి అది ప్రాథమిక మూలమైయుండాలి. (హెబ్రీయులు 4:12) మంద ఎదుర్కొనే ఆయాసమస్యల విశేష అవసరతలను చర్చించే కావలికోట, అవేక్‌! పత్రికలను కూడా పరిశీలించవచ్చును. ఇయర్‌బుక్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్‌నెసెస్‌ నందు ఉత్తేజకరమైన, సేదదీర్పునిచ్చే అనుభవాల్ని చూడగలము. ‘ఆ వ్యక్తి మేలు కొరకు క్షేమాభివృద్ధికరమైన’ ఆత్మీయ విషయాల్ని తెలియజేయుట మన ధ్యేయమై యుండాలి.—రోమీయులు 15:2.

క్షేమాభివృద్ధికరమైన కాపరితనము

అక్షరార్థమైన గొర్రెల కాపరికి మంద రక్షణ, పోషణ కొరకు తనపై ఆధారపడివుంటుందని తెలుసు. ఎక్కువగా తప్పిపోవుట, జబ్బుపడుట, నీరసించుట, గాయము, కౄరజంతువుల నుండి ప్రమాదాలు సంభవిస్తూవుంటాయి. అదేవిధంగా ఆత్మీయకాపరి మంద క్షేమాన్ని బెదిరించే అట్టి ప్రమాదాల్ని గుర్తించి వాటితో వ్యవహరించాలి. ఆత్మీయంగా క్షేమాభివృద్ధికరమైన వర్తమానాన్ని తెలియజెప్పుట విషయమై ఈ క్రింద కొన్ని సమస్యలు వాటికి తగిన కొన్ని సలహాలు ఇవ్వబడ్డాయి.

(1) అజాగ్రత్తగానున్న గొర్రెలవలె, కొంతమంది క్రైస్తవులు నిరపాయకరమైనవిగా, ఆనందానిచ్చేవిగా కన్పించు విషయాల పరధ్యాసలో పడిపోయినందున దేవుని మందనుండి తప్పిపోతారు. ఐశ్వర్యాసక్తి, వినోదం లేదా మనోరంజక సంబంధమైన గమ్యాల్ని వెంబడించుట కారణంగా వారు పరధ్యానమందు పడి నెమ్మదిగా కొట్టుకొనిపోవచ్చును. (హెబ్రీయులు 2:1) అట్టి వ్యక్తులకు సమయ గంభీరతను, యెహోవా సంస్థను హత్తుకొనియుండు అవసరతను, వారి జీవితమందు రాజ్యాసక్తులను మొదటవుంచే ప్రాముఖ్యతను గుర్తుచేయాలి. (మత్తయి 6:25-33; లూకా 21:34-36; 1 తిమోతి 6:8-10) ది వాచ్‌టవర్‌ మే 15, 1984, పుటలు 8-11 నందుగల “కీప్‌ యువర్‌ బ్యాలన్స్‌—హౌ?” అనే శీర్షికలో సహాయకరమగు సలహా ఉంది.

(2) జబ్బుపడిన గొర్రెలకు కాపరి చికిత్స చేయాల్సివుంటుంది. అదే ప్రకారంగా, తమ జీవితాల్లో ప్రతికూల విషయాల్నిబట్టి ఆత్మీయంగా రోగగ్రస్తులైన క్రైస్తవులకు ఆత్మీయ కాపరులు సహాయం చేయాలి. (యాకోబు 5:14, 15) వారు నిరుద్యోగులుగా ఉండవచ్చు, తీవ్ర అస్వస్థతకు గురికావచ్చు, లేదా వారి కుటుంబ జీవితంలో కష్టాలెదుర్కొంటున్న వారిగా ఉండవచ్చు. అట్టి వ్యక్తులు ఆత్మీయాహారము కొరకు, దేవుని ప్రజలతో సహవసించుటకు తక్కువ ఆసక్తి చూపించవచ్చు. దీని ఫలితంగా వారు ఒంటరివారగుట, నిరుత్సాహపడుట సంభవిస్తుంది. యెహోవా వారియెడల శ్రద్ధ చూపిస్తున్నాడని, కష్టసమయాల్లో వారిని ఆదుకుంటాడని వారికి అభయమివ్వడం అవసరం. (కీర్తన 55:22; మత్తయి 18:12-14; 2 కొరింథీయులు 4:16-18; 1 పేతురు 1:6, 7; 5:6, 7) ది వాచ్‌టవర్‌ జూన్‌ 1, 1980, పుటలు 12-15 నందుగల “లుక్‌ సెయిట్‌ ఎహెడ్‌ యాజ్‌ ఎ క్రిస్టియన్‌” అనే శీర్షికను పునఃసమీక్షించుట కూడా సహాయకరంగా ఉంటుంది.

(3) నీరసించిన గొర్రెలను కాపరి ఒకకంట కనిపెడుతూ ఉండాలి. యెహోవా సేవలో కొంతమంది అనేక సంవత్సరాలు నమ్మకంగా కొనసాగారు. వారనేక పరీక్షల్ని, శ్రమల్ని పోరాడి గెలిచారు. ఇప్పుడు వారిలో చక్కని సేవచేయుట, తీవ్రంగా ప్రచారంచేసే అవసరత విషయంలో సందేహాల్ని సహితం వ్యక్తంచేస్తూ నీరసిస్తున్న సూచనలు కన్పించవచ్చు. యేసుక్రీస్తును అనుకరిస్తూ పూర్ణహృదయంతో దేవుని సేవచేయుటలోగల ఆనందంయెడల వారి మెప్పును నూతన పరుస్తూ, వారి స్ఫూర్తిని ఉత్తేజపర్చడం అవసరమై యుంటుంది. (గలతీయులు 6:9, 10; హెబ్రీయులు 12:1-3) వారి యథార్థసేవను యెహోవా అభినందిస్తున్నాడని చూచుటకు వారికి సహాయపడి, ఆయన స్తుతికొరకు భవిష్యత్‌ కార్యక్రమం కొరకు వారిని బహుశ బలపర్చవచ్చును. (యెషయా 40:29, 30; హెబ్రీయులు 6:10-12) ది వాచ్‌టవర్‌ జూలై 15, 1988, పుటలు 9-14 నందుగల “డు నాట్‌ గివప్‌ ఇన్‌ డూయింగ్‌ వాటీజ్‌ ఫైన్‌,” అనే శీర్షికలోని తలంపులను పంచుకొనుట ప్రయోజనకరంగా ఉండవచ్చు.

(4) గాయపడిన గొర్రెలవలె, కొంతమంది క్రైస్తవులు దోషప్రవర్తన అని తాము తలంచిన విషయాన్నిబట్టి గాయపడి ఉండవచ్చు. అయినను, మనము ఇతరులను క్షమించినట్లయిన, మనకు కావలసిన క్షమాపణను మన పరలోకపు తండ్రి మనకనుగ్రహిస్తాడు. (కొలొస్సయులు 3:12-14; 1 పేతురు 4:8) తమకివ్వబడిన లేఖన గద్దింపు లేదా శిక్ష అన్యాయమని కొందరు సహోదర సహోదరీలు భావించవచ్చు. అయితే, లేఖన గద్దింపు లేదా శిక్షనుండి మనమందరము ప్రయోజనం పొందగలము, ఆలాగే తాను ప్రేమించు వారిని యెహోవా శిక్షించునని తెలిసికొనుట ఓదార్పుకరంగా ఉంటుంది. (హెబ్రీయులు 12:4-11) తాము అర్హులమని భావించిన సేవాధిక్యతల్ని తమకివ్వనందున, తమకు సంఘానికి మధ్య అగాధం సృష్టించునట్లు కోపాన్ని కొందరు అనుమతించారు. అయితే యెహోవా సంస్థనుండి మనల్ని దూరం చేసుకుంటే, రక్షణ కొరకు నిజమైన ఆనందం కొరకు మనం వెళ్లగల మరోప్రదేశం మనకు లేదు. (యోహాను 6:66-69 పోల్చండి.) దీనికి సంబంధించిన సహాయకరమగు సలహాలను, ది వాచ్‌టవర్‌ ఆగష్టు 15, 1988, పుటలు 28-30 నందలి “మెయిన్‌టెయినింగ్‌ అవర్‌ క్రిస్టియన్‌ ఒన్‌నెస్‌” అను శీర్షికలో చూడవచ్చును.

(5) గొర్రెలను కౄరజంతువుల బారినుండి రక్షించాలి. అదేవిధంగా, కొందరిని అవిశ్వాసులైన బంధువులు లేదా తోటి ఉద్యోగులు వ్యతిరేకిస్తూ భయపెడుతూ ఉండవచ్చు. దేవునికి చేసే సేవను తగ్గించడానికి లేదా క్రైస్తవ పరిచర్యలో పాల్గొనడాన్ని ఆపుజేయుటకు ఒత్తిడి తేబడినప్పుడు వారి యథార్థత దాడికి గురికావచ్చును. అయితే వ్యతిరేకత వస్తుందని, అది మనం యేసుక్రీస్తు నిజమైన శిష్యులమని నిరూపించే ఒక వాస్తవమని గ్రహించునట్లు వారికి సహాయం చేసినప్పుడు వారు బలపర్చబడతారు. (మత్తయి 5:11, 12; 10:32-39; 24:9; 2 తిమోతి 3:12) వారు నమ్మకంగా ఉంటే, యెహోవా వారినెన్నడూ ఎడబాయడని వారి సహనానికి తగిన ప్రతిఫలమిస్తాడని వారికి సూచించుట ప్రయోజనకరమౌతుంది. (2 కొరింథీయులు 4:7-9; యాకోబు 1:2-4, 12; 1 పేతురు 5:8-10) ది వాచ్‌టవర్‌ ఆగష్టు 15, 1982, పుటలు 21-7 నందలి “ఎన్‌డ్యూరింగ్‌ జాయ్‌ఫుల్లీ డిస్పైట్‌ పర్‌సిక్యూషన్‌” అనే శీర్షిక అదనపు ప్రోత్సాహాన్నిస్తున్నది.

కాపరులారా—మీ బాధ్యతల్ని నెరవేర్చండి

దేవుని మందకున్న అవసరతలు చాలావున్నాయి, దానికి సరియైన కాపుదల అవసరం. అందువల్ల క్రైస్తవ కాపరులు కనికరం, నిజమైన శ్రద్ధతో, సహాయం చేయుటయందు ఆసక్తిగలవారై యుండాలి. ఓపిక, వివేచన ప్రాముఖ్యము. కొందరికి సలహా, గద్దింపు అవసరమైతే, మరికొందరికి ప్రోత్సాహమే అత్యంత ప్రయోజనకరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కొన్నిసార్లు సందర్శించుటే సరిపోవచ్చు, మరికొన్ని సందర్భాల్లో క్రమమైన బైబిలు పఠనం అవసరం కావచ్చును. ప్రతి సందర్భమందు, ఆ వ్యక్తి చక్కని బైబిలు పఠన అలవాట్లు కలిగియుండుటకు, సంఘకూటాలకు క్రమంగా వచ్చుటకు, క్రైస్తవ పరిచర్యలో సమర్థవంతంగా పాల్గొనుటకు పురికొల్పే క్షేమాభివృద్ధికరమైన నడిపింపును లేదా ప్రేమగల సలహా నిచ్చుట మీ ప్రాథమిక ధ్యేయమైయుండాలి. ఇవి తొలి విశ్వాసులకు తోడ్పడి, యెహోవా పరిశుద్ధాత్మ ధారాళంగా అందజేయబడుటకు మార్గాన్ని తెరచుటకు వారికి సహాయపడే ముఖ్యమైన విధానాలైయున్నవి.

అట్టి మద్దతునిచ్చే కాపరులు దేవుని మంద పక్షమున అత్యంత విలువైన సేవచేస్తున్నవారై యుంటారు. (ది వాచ్‌టవర్‌ నవంబరు 15, 1985, పుటలు 23-7 చూడండి.) ఆత్మీయ కాపరులు చేసే సేవను మంద బహుగా అభినందిస్తుంది. అట్టి సహాయం పొందిన, ఒక కుటుంబ యజమాని యిలా చెప్పాడు: ‘సత్యంలో దాదాపు 22 సంవత్సరాలున్న తర్వాత, ఐశ్వర్యాసక్తి ద్వారా లోకవిధానంలోకి మేము జారిపోయాము. కూటాలకు హాజరు కావాలని మేము తరచు కోరుకున్ననూ, అలా హాజరు కావడం మావల్ల కాలేదు. సాతాను విధానానికి తగినట్టు ఉండడం కుదరట్లేదని, సంబంధాలు పూర్తిగా మానేసి, మమ్మల్ని వేరుపర్చుకున్నాము. ఇది మాకెంతో నిస్తేజాన్ని, వ్యాకులతను కల్గించింది. మాకు ప్రోత్సాహకరమైన మాటలు అవసరమైయుండెను. ఒక పెద్ద మమ్మల్ని సందర్శించినప్పుడు, మేము సంతోషంగా మా గృహమందు బైబిలు పఠన ఏర్పాటుకు ఒప్పుకున్నాము. ఇప్పుడు మేమందరము యెహోవాయొక్క సురక్షితమైన సంస్థకు తిరిగివచ్చాము. నేననుభవిస్తున్న ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను.’

తప్పిపోయిన లేదా నిరుత్సాహపడిన సహోదర సహోదరీలు ఆత్మీయ ఉజ్జీవంపొంది తిరిగి క్రియాశీలురైతే అది మనకెంతో ఆనందాన్నిస్తుంది. (లూకా 15:4-7) యెహోవా ప్రజలందరు ‘ఒకమందవలె’ ఐక్యపరచబడినప్పుడు వారియెడల ఆయనకున్న సంకల్పము నిజమౌతుంది. (మీకా 2:12) ఈ రక్షిత నిలయంలో, మంచి కాపరియగు యేసుక్రీస్తు సహాయంతో వారు ‘తమ ఆత్మలకు విశ్రాంతి ననుభవిస్తారు.’ (మత్తయి 11:28-30) ప్రపంచ వ్యాప్తంగా ఐకమత్యంతోనున్న మంద విస్తారమైన ఆత్మీయాహారంతోపాటు నడిపింపును, ఓదార్పును, కాపుదలను పొందుతుంది.

నేడు, ఈ కాపరిసేవా విధానం ద్వారా యెహోవా ప్రాచీన కాలమందు తాను చేసిన ఈ వాగ్దానానికనుగుణ్యంగా ప్రేమగల పనిని జరిగిస్తున్నాడు: “నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును. . . . ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి వాటిని తోడుకొని వచ్చి, . . . వాటిని మేపెదను. . . . తప్పిపోయిన దానిని నేను వెదకుదును, . . . గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును.” (యెహెజ్కేలు 34:11-16) యెహోవా మన కాపరి అని తెలుసుకొనుటలో ఎంత ఓదార్పున్నదో గదా!—కీర్తన 23:1-4.

దేవుని మందను కాయుటకు దైవిక ఏర్పాట్లున్నందున, యెహోవా సేవకులముగా దావీదు కలిగివున్న మనోభావాల్ని మనమూ పంచుకోవచ్చును. ఆయనిలా చెప్పాడు: “యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.” (కీర్తన 4:8) ఔను, యెహోవా ప్రజలు ఆయన ప్రేమగల శ్రద్ధయందు సురక్షితముగా ఉన్నారు, ఆలాగే గొర్రెపిల్లలను కనికరముతో కాయుచున్న క్రైస్తవ పెద్దలనుబట్టి కృతజ్ఞులైయున్నారు.

[20, 21వ పేజీలోని చిత్రసౌజన్యం]

Potter’s Complete Bible Encyclopedia

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి