అపరిపూర్ణ శరీరంపైనున్న పాపపు పట్టును ఎదిరించుట
“శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.”—రోమీయులు 8:6.
1. మానవులు ఏ సంకల్పం కొరకు సృష్టించబడ్డారు?
“దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” (ఆదికాండము 1:27) ఒక స్వరూపం అంటే ఒక వస్తువు లేక మూలం యొక్క ప్రతిరూపము. అలా, మానవులు దేవుని మహిమకు ప్రతిరూపాలుగా ఉండడానికి సృష్టించబడ్డారు. ప్రేమ, మంచితనము, న్యాయము, ఆత్మీయత వంటి దైవిక లక్షణాలను తమ పనులన్నిటిలో పెంపొందించుకోవడం ద్వారా సృష్టికర్తకు వారు స్తుతిని, ఘనతను తీసుకురావడమే కాక, తమకు తాము సంతోషాన్ని, సంతృప్తిని తెచ్చుకుంటారు.—1 కొరింథీయులు 11:7; 1 పేతురు 2:12.
2. మొదటి మానవ జత ఆ సంకల్పాన్ని చేరుకోవడంలో ఎలా విఫలమయ్యారు?
2 పరిపూర్ణంగా సృష్టించబడిన మొదటి మానవ జత ఈ పాత్ర కొరకు తగినవిధంగా సిద్ధం చేయబడ్డారు. బాగా మెరుగుపెట్టబడిన అద్దాలవలే, వారు ప్రకాశమానంగాను, విశ్వాసంతోను దేవుని మహిమను ప్రతిబింబించే సామర్థ్యం కలిగి ఉండేవారు. అయినా, వారు ఉద్దేశపూర్వకంగా, తమ దేవుడు, సృష్టికర్త అయిన వానికి అవిధేయత చూపించడానికి ఎన్నుకోవడం ద్వారా వారు ఆ స్వచ్ఛమైన మెరుగు కాంతివిహీనమయ్యేలా అనుమతించారు. (ఆదికాండము 3:6) ఆ తర్వాత, వారు దేవుని మహిమను పరిపూర్ణంగా ఇక ఎంత మాత్రం ప్రతిబింబించలేకపోయారు. దేవుని స్వరూపమందు సృష్టించబడడంలోని సంకల్పం నుండి వారు తప్పిపోయారు. దేవుడనుగ్రహించు మహిమను పొందలేక పోయారు. మరో మాటలో చెప్పాలంటే, వారు పాపం చేశారు.a
3. పాపం యొక్క నిజమైన స్వభావం ఏమిటి?
3 ఇది, మనకు మానవుడు ప్రతిబింబించాల్సిన దేవుని మహిమాస్వరూపాన్ని, చెడగొట్టే పాపం యొక్క నిజమైన స్వరూపాన్ని అర్థంచేసుకోడానికి సహాయం చేస్తుంది. పాపం మనిషిని అపవిత్రం చేస్తుంది, అంటే, ఆత్మీయ మరియు నైతిక భావంలో అపరిశుభ్రంగాను, కాంతివిహీనంగాను చేస్తుంది. ఆదాము హవ్వల సంతానమైన మానవ జాతంతా, తన పిల్లలుగా దేవుడు వారి నుండి ఏది కోరుతున్నాడో దానికి తగని విధంగా, కళంకమైన అపరిశుభ్ర స్థితిలోనే జన్మించారు. దాని ఫలితం? బైబిలు ఇలా వర్ణిస్తుంది: “ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12; యెషయా 64:6ను పోల్చండి.
అపరిపూర్ణ శరీరంపైనున్న పాపపు పట్టు
4-6. (ఎ) నేడు అనేకులు పాపాన్ని ఎలా దృష్టిస్తారు? (బి) పాపాన్ని గూర్చిన ఆధునిక దృక్పథాల ఫలితం ఏమిటి?
4 అనేకులు ఈనాడు తమ గురించి తాము అపరిశుభ్రమైనట్లు, కళంకమైనట్లు లేదా పాపభరితులైనట్లు భావించరు. వాస్తవానికి, పాపం అనే మాట ఒక పదంగా, అనేకమంది సంభాషణలో నుండి అంతరించిపోయింది. వారు బహుశ, పొరపాట్లు, బుద్ధిహీనతలు, తప్పుడు అంచనాల గురించి మాట్లాడతారు. కాని పాపాన్ని గురించి మాట్లాడతారా? దాదాపు అసలు మాట్లాడరు. దేవుని యందు ఇంకా విశ్వాసముందని చెప్పేవారికి కూడా, “దేవుని బోధలు నైతికపరమైన ధర్మవిధిగా కాక నైతిక నమ్మకాలుగా మాత్రమే తయారయ్యాయి. పది ఆజ్ఞలకు బదులు ‘పది సలహాలు’గా మారాయి,” అని సామాజిక శాస్త్ర అధ్యాపకుడైన అలాన్ ఓల్ఫ్ అన్నారు.
5 ఈ విధమైన ఆలోచనా విధానం యొక్క ఫలితమేమిటి? పాపం యొక్క వాస్తవికతను నిరాకరించడం, లేక కనీసం నిర్లక్ష్యం చేయడం అయ్యింది. అంతేగాక ఇది తప్పొప్పులను గూర్చిన భావాన్ని పూర్తిగా వక్రీకరించి, ప్రవర్తనకు సంబంధించి తమ స్వంత నియమావళిని ఏర్పరచుకోడానికి ఏమాత్రం వెనుకాడనటువంటి, తాము చేసే దేని గురించైనా ఎవ్వరికి జవాబివ్వాల్సిన బాధ్యత లేదని భావించే ఒక తరం ప్రజలను ఉత్పన్నం చేసింది. అలాంటి ప్రజల మూల భావం తప్పైనా, ఒప్పైనా మంచిదని తలంచటమే.—సామెతలు 30:12, 13; ద్వితీయోపదేశకాండము 32:5, 20ని పోల్చండి.
6 ఉదాహరణకు, ఒక దూరదర్శిని కార్యక్రమంలో, ఏడు మరణకరమైన పాపాలు అని పిలువబడే వాటి గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చడానికి యౌవనులు ఆహ్వానింపబడ్డారు.b “గర్వం పాపము కాదు,” “మీ గురించి మీరు మంచిగానే భావించుకోవాలి” అని వారిలో ఒకరు చెప్పారు. సోమరితనాన్ని గురించి మరొకామె ఇలా చెప్పింది: “అలా ఉండడం కొన్నిసార్లు మంచిది. . . . కొన్నిసార్లు అలా ఊరికే కూర్చుని మీ కొరకు మీరే సమయాన్ని వెచ్చించడం మంచిది.” కార్యక్రమ నిర్వాహకుడు కూడా సంక్షిప్తంగా ఇలా వ్యాఖ్యానించాడు: ‘ఏడు మరణకరమైన పాపాలు చెడ్డ క్రియలు కావు గాని, అవి కష్టం కలిగించగల, అధికంగా సంతోషించదగిన విశ్వవ్యాప్త మానవ మానసిక ప్రేరణలైయున్నవి.’ అవును, పాపంతోపాటు అపరాధం చేశాననే భావం కూడా అంతరించి పోయింది, ఎందుకంటే అసలు అపరాధ భావమనేది మంచిగా వున్నాననే భావనకు పూర్తిగా భిన్నమైనది.—ఎఫెసీయులు 4:17-19.
7. బైబిలు ప్రకారం, మానవులు పాపం ద్వారా ఎలా ప్రభావితులయ్యారు?
7 వీటన్నిటికీ భిన్నంగా, బైబిలు విశదంగా ఇలా తెలియజేస్తుంది: “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమీయులు 3:23) అపొస్తలుడైన పౌలు కూడా ఇలా తెలియజేశాడు: “నా యందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.” (రోమీయులు 7:18, 19) ఇక్కడ పౌలు తనపైతాను జాలి చూపించుకోవడం లేదు బదులుగా దేవుని మహిమకు మానవజాతి ఎంతగా దూరమయ్యిందో ఆయన పూర్తిగా గుణగ్రహించాడు గనుకనే, అపరిపూర్ణ శరీరంపై పాపం యొక్క పట్టును గురించి ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయనిలా తెలియజేశాడు, “నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?”—రోమీయులు 7:24.
8. మనకు మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి? ఎందుకు?
8 ఈ విషయాన్ని గురించి మీ ఉద్దేశం ఏమిటి? ఆదాము సంతానముగా, ఇతరులందరిలాగా మేము అపరిపూర్ణులమే అని మీరనవచ్చు. కాని ఆ జ్ఞానం మీ ఆలోచనను, మీ జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దాన్ని మీరు జీవిత వాస్తవమని అంగీకరించి, సహజంగా ఏది తోచిందో అదే చేస్తూపోతారా? లేదా మీరు చేసేవాటన్నిటిలో దేవుని మహిమను వీలైనంత తేజోవంతంగా ప్రతిబింబించడానికి ప్రయత్నిస్తూ, అపరిపూర్ణ శరీరంపై పాపం యొక్క పట్టును సడలించడానికి ఎడతెగని ప్రయత్నం చేస్తారా? పౌలు చెప్పిన దాని దృష్ట్యా మనలో ప్రతి ఒక్కరికీ ఇది గంభీరమైన విషయమై ఉండాలి: “శరీరానుసారులు శరీరవిషయముల మీద మనస్సు నుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.”—రోమీయులు 8:5, 6.
శరీరానుసారమైన మనస్సు
9. “శరీరానుసారమైన మనస్సు మరణము” ఎందుకు?
9 “శరీరానుసారమైన మనస్సు మరణము” అని పౌలు చెప్పినప్పుడు ఆయన భావమేమిటి? మానవున్ని అతని అపరిపూర్ణ స్థితిలో, తిరుగుబాటు దారుడైన ఆదాము సంతానంగా ‘పాపంలో పుట్టిన’ వానిగా చెప్పడానికి బైబిలు “శరీరము” అనే పదాన్ని తరచూ ఉపయోగించింది. (కీర్తన 51:5; యోబు 14:4) అలా, తమ మనస్సులను పాపకరమైన ప్రవృత్తులు, మానసిక ప్రేరణలు, అపరిపూర్ణ, పాప శరీరం యొక్క కోరికలపై నిలుపుకోవద్దని పౌలు క్రైస్తవులకు ఉద్బోధిస్తున్నాడు. ఎందుకు అలా చేయకూడదు? మరోచోట పౌలు శరీరకార్యాలు ఏమైయున్నాయో మనకు చెప్పి, ఈ హెచ్చరిక చేశాడు: “ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.”—గలతీయులు 5:19-21.
10. ‘మనసుంచడం’ అంటే ఏమిటి?
10 కాని ఒక విషయంపై మనసుంచడం, దాన్ని అవలంభించడం ఈ రెండింటి మధ్య ఎంతో తేడా లేదా? నిజంగా, దేని గూర్చయినా ఆలోచించడం అన్ని వేళలా దాన్ని చేయడానికే నడిపించదు. అయినా, మనసుంచడం అంటే కేవలం ఒక తలంపు కలగడం కంటే ఎక్కువే. పౌలు ఉపయోగించిన పదం గ్రీకులో ప్రోనెమా, మరి అది “ఆలోచనా విధానం, మనస్సు (నిలపడం), . . . లక్ష్యం, అభిలాష, తపన అనేవాటిని సూచిస్తుంది.” గనుక, “శరీరానుసారమైన మనస్సు” అంటే అపరిపూర్ణ శరీర కోరికలచే అదుపు చేయబడిన, స్వాధీనంలోకి తీసుకొనబడిన, నియంత్రించబడిన, కొనిపోబడిన అని భావము.—1 యోహాను 2:16.
11. కయీను శరీరానుసారంగా ఎలా ఆలోచించాడు, దాని ఫలితం ఏమిటి?
11 కయీను అనుసరించిన మార్గాన్ని బట్టి ఈ విషయం చక్కగా వివరించబడింది. కయీను హృదయంలో అసూయ, కోపం ఉత్పన్నమైనప్పుడు, యెహోవా దేవుడు అతన్నిలా హెచ్చరించాడు: “నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.” (ఆదికాండము 4:6, 7) కయీను యెదుట ఒక ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. అతడు తన మనస్సును, లక్ష్యాన్ని, అభిలాషను మంచిదానిపై నిలిపి ‘సత్క్రియ చేయడానికి’ తిరుగుతాడా? లేక అతడు శరీరానుసారమైన మనస్సు కలిగి, తన హృదయంలో దాగివున్న చెడ్డ ఉద్దేశాలపైనే తన మనస్సును కేంద్రీకరిస్తాడా? యెహోవా వివరించినట్లు, కయీను అనుమతిస్తే, అతనిపై దూకి అతన్ని దిగమింగడానికి పాపం “వాకిట పొంచి” ఉన్నది. తన శరీరానుసారమైన కోరికను ‘అదుపు చేసుకుని’ దాన్ని అధిగమించడానికి బదులు, అది అతన్ని లోబరచుకోడానికి—ఒక నాశనకరమైన అంతానికి తనను నడిపేలా కయీను దానిని అనుమతించాడు.
12. “కయీను నడచిన మార్గంలో” నడవకుండా ఉండడానికి మనం ఏమి చేయాలి?
12 నేడు మన విషయమేమిటి? మొదటి శతాబ్ద క్రైస్తవుల మధ్యవున్న అలాంటి కొందరిని గూర్చి యూదా విలపించినట్లుగా, మనం కచ్చితంగా “కయీను నడచిన మార్గమున” నడవడానికి ఇష్టపడము. (యూదా 11) తమ స్వంత కోరికలను కొంత తీర్చుకుంటే లేక ఇక్కడో అక్కడో కొంచెం కట్టడలను మీరితే ఏమీ హానికరం కాదని మనం ఎప్పుడూ సమర్థించుకొని, ఆలోచించకూడదు. దానికి విరుద్ధంగా, మన హృదయంలోకి, మనస్సులోకి ఏదైనా అపవిత్రమైనది, కలుషితం చేసేది ప్రవేశించినట్లైతే, దాన్ని గుర్తించడానికి, అది వేళ్లూనక ముందే దాన్ని తొందరగా తీసేసుకోడానికి మెలకువ కలిగి ఉండాలి. పాపపు పట్టులో అపరిపూర్ణ శరీరం చిక్కుకుపోవడం అంతరంగం నుండే ప్రారంభమవుతుంది.—మార్కు 7:21.
13. ఒక వ్యక్తి ఎలా “తన స్వకీయమైన దురాశచే ఈడ్వబడును”?
13 ఉదాహరణకు, మీరు విభ్రాంతి లేక అసహ్యం కలిగించే, ప్రాముఖ్యంగా చెడును ప్రేరేపించే ఒక శృంగారభరిత రూపాన్ని చూశారు. అది ఒక పుస్తకం, పత్రికలోని చిత్రం కావచ్చు, ఒక సినిమా లేక దూరదర్శినిలోని దృశ్యం కావచ్చు, ఒక బోర్డుపైని వ్యాపార ప్రకటన కావచ్చు, లేక నిజ జీవితంలోని పరిస్థితి కావచ్చు. అది దానంతటదే భయంకరమైనది కాదు, ఎందుకంటే అది ఎవరికైనా జరుగవచ్చు, జరుగుతుంది కూడా. అయినా, ఈ రూపం లేక దృశ్యం కేవలం కొన్ని సెకండ్ల సేపు మాత్రమే ఉన్నప్పటికీ, అది మీ మనస్సులో ఊగిసలాడుతూ, పదే పదే జ్ఞాపకం వస్తుండవచ్చు. అలా జరిగినప్పుడు మీరేమి చేస్తారు? ఆ తలంపును తొలగించుకోడానికి దానితో పోరాడటానికి మీరు వెంటనే చర్య తీసుకుంటారా? లేక, బహుశ ఆ తలంపు వచ్చిన ప్రతిసారి ఆ అనుభవాన్ని మరలా ఊహించుకుంటూ, అది మీ మనస్సులోనే ఉంచుకుంటారా? రెండవది చేయడమంటే, యాకోబుచే వర్ణించబడిన సంఘటనల గొలుసులో చిక్కుకోవడం ప్రారంభమైనట్లే: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” అందుకే పౌలు ఇలా చెప్పాడు: “శరీరానుసారమైన మనస్సు మరణము.”—యాకోబు 1:14, 15; రోమీయులు 8:6.
14. మనం ప్రతిరోజు వేటిని ఎదుర్కొంటాము, మనం ఎలా ప్రతిస్పందించాలి?
14 మనం జీవిస్తున్న లోకంలో లైంగిక దుర్నీతి, దౌర్జన్యం, వస్తుసంపదలు పూజింపబడుతున్నాయి—అవి పుస్తకాలు, పత్రికలు, సినిమాలు, దూరదర్శిని కార్యక్రమాలు, పేరుపొందిన సంగీతము—వంటివాటిలో బహిరంగంగాను, స్వతంత్రంగాను కనబడుతున్నాయి, గనుక నిజంగా మనపై ప్రతిరోజు చెడు తలంపులు, యోచనలు అత్యధికంగా కురిపించబడుతున్నాయి. దానికి మీ ప్రతిస్పందన ఏమిటి? దీనంతటిని బట్టి మీరు ఉల్లాసం చెంది, వినోదం పొందుతున్నారా? లేక “దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడి . . . వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు” ఉండిన నీతిమంతుడైన లోతు వలె మీరు భావిస్తారా? (2 పేతురు 2:7, 8) అపరిపూర్ణ శరీరంపై పాపపు పట్టును ఎదిరించడంలో విజయం సాధించడానికి, కీర్తనల గ్రంథకర్త చేసినట్లు చేయడానికి మనం తీర్మానించుకోవాలి: “నా కన్నుల యెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను.”—కీర్తన 101:3.
ఆత్మానుసారమైన మనస్సు
15. మనపైనున్న పాపపు పట్టును అధిగమించడానికి మనకు ఏ సహాయం ఉన్నది?
15 అపరిపూర్ణ శరీరంపై పాపపు పట్టును ఎదుర్కోడానికి మనకు సహాయం చేయగల ఒక దానిని గూర్చి చెప్తూ పౌలు ఇలా అంటున్నాడు: “ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.” (రోమీయులు 8:6) అలా, శరీరంచే అధిగమించబడే బదులు ఆత్మ యొక్క ప్రభావం క్రిందికి మన మనస్సు వచ్చుటకు అనుమతించి, ఆత్మానుసారమైన విషయాల కొరకు పాటుపడాలి. అవి ఏమిటి? ఫిలిప్పీయులు 4:8 నందు పౌలు వాటి పట్టికను ఇస్తున్నాడు: “మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి.” మనం పరిశీలించుటలో కొనసాగ వలసిన వాటి గూర్చిన సరైన గ్రహింపును పొందడం కొరకు వాటిని మనం బాగా పరిశీలిద్దాము.
16. ఏ లక్షణాలపై మనం “ధ్యానముంచు”కోవాలని పౌలు ప్రోత్సహిస్తున్నాడు, ఒకొక్కదానిలో ఏమి ఇమిడివుంది?
16 మొట్టమొదట, పౌలు ఎనిమిది నైతిక లక్షణాలను తెలియజేసి, ప్రతి పదం ప్రారంభంలో “ఏవి” అని చేర్చాడు. క్రైస్తవులు ఎల్లప్పుడూ లేఖన సంబంధమైన లేక సిద్ధాంతపరమైన విషయాల గురించి మాత్రమే ఆలోచించాలని నిర్భందింపబడడం లేదని ఇది సూచిస్తుంది. మనం మన మనస్సును కేంద్రీకరించగల అనేక విషయాలు లేక అంశాలు ఉన్నాయి. కాని అవి పౌలు సూచించిన నైతిక లక్షణాలకు తగినట్లు ఉండాలి. పౌలు చెప్పిన ‘విషయాలు’ అన్నీ కూడ మన అవధానాన్ని పొందదగినవే. వాటిని మనం ఒకొక్కటి పరిశీలిద్దాము.
◻ “సత్యమైనవి” అనుటలో కేవలం తప్పు లేక ఒప్పు అయివుండడం కంటే ఎక్కువే యిమిడి ఉంది. సత్యవంతంగా, యథార్థంగా, నమ్మదగినట్లుగా, కేవలం పైకి కనిపించడానికి మాత్రమే కాకుండా నిజమైనదానిగా ఉండాలని దాని భావము.—1 తిమోతి 6:20.
◻ “మాన్యమైనవి” అనేది గౌరవప్రదమైన, మర్యాదపూర్వకమైన విషయాలను సూచిస్తుంది. అది గౌరవభావాన్ని కలిగిస్తుంది, అసభ్యమైన, నీచమైన వాటికి బదులు ఉన్నతమైన, ఘనమైన, గౌరవించదగినదిగా ఉంటుంది.
◻ “న్యాయమైనవి (నీతియుక్తమైనవి, NW)” అంటే మానవునివి కాదుగాని దేవుని కట్టడలకు తగినట్లుండుట. లోకస్థులు తమ మనస్సులను అవినీతికరమైన పథకాలతో నింపుకుంటారు, కాని మనం దేవుని దృష్టిలో నీతియుక్తమైన వాటిని గురించి ఆలోచించాలి, వాటిని బట్టి ఆనందించాలి.—కీర్తన 26:4; ఆమోసు 8:4-6 పోల్చండి.
◻ “పవిత్రమైనవి” అంటే గుణం (లైంగిక లేక మరితర) విషయంలోనే కాదు తలంపు, ఉద్దేశాలలో కూడా పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. యాకోబు ఇలా చెప్పాడు: “పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది.” “పవిత్రుడైన” యేసు మనం తలంచడానికి మనకు పరిపూర్ణ మాదిరి నుంచాడు.—యాకోబు 3:17; 1 యోహాను 3:3.
◻ “రమ్యమైనవి (ప్రేమించదగినవి, NW)” అంటే ఇతరులలో ప్రేమను పురికొల్పేవి, ద్వేషం, కాఠిన్యం, కలహం రేకెత్తించే విషయాలపై మన మనస్సులను నిల్పడానికి బదులు మనం “ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెను.”—హెబ్రీయులు 10:24.
◻ “ఖ్యాతిగలవి” అంటే కేవలం “పేరుపొందినవి” లేక “మంచి పేరుగలవి” మాత్రమే కాదుగాని, చురుకైన భావంలో క్షేమాభివృద్ధిని కలిగించాలి, మెచ్చుకొనదగినవి. మనం మన మనస్సులను అమర్యాదకరమైన, హానికరమైన వాటిపైగాక, మంచి, ప్రోత్సాహకరమైన వాటి యందే ఉంచుకొంటాము.—ఎఫెసీయులు 4:29.
◻ “యోగ్యమైనవి” అంటే ముఖ్యంగా “మంచితనం” లేక “నైతిక శ్రేష్టత,” కాని అది ఏ విధమైన శ్రేష్టతనైనా సూచించగలదు. అలా, దేవుని కట్టడలకు తగినట్లుగా వారు సాధించినవాటిని, వారి విలువైన లక్షణాలను, గుణాలను, గమ్యాలను మనం మెచ్చుకోవచ్చు.
◻ “మెచ్చుకొనదగినవి” అంటే దేవుని నుండి లేక ఆయనచే గుర్తింపబడిన అధికారం నుండి అవి మెప్పుపొందేవైతే అవి నిజంగా అలాంటివే.—1 కొరింథీయులు 4:5; 1 పేతురు 2:14.
జీవము, సమాధానముల వాగ్దానము
17. “ఆత్మానుసారమైన మనస్సు”ను బట్టి ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి?
17 మనం పౌలు సలహాను గైకొని “వాటి మీద ధ్యానముంచుకొంటే,” మనం “ఆత్మానుసారమైన మనస్సును” కలిగివుండడంలో విజయం సాధించగలము. దాని ఫలితం జీవం పొందగల ఆశీర్వాదం, అంటే వాగ్దానం చేయబడిన నూతన లోకంలో నిత్యజీవమే కాదు, సమాధానం కూడా. (రోమీయులు 8:6) ఎందుకు? ఎందుకంటే మన మనస్సులు శరీరసంబంధమైన విషయాల దుష్ట ప్రభావం నుండి రక్షించబడ్డాయి, పౌలు వివరించినట్లుగా శరీరానికి ఆత్మకు మధ్య జరిగే బాధాకరమైన పోరాటం ద్వారా మనం ఇక ఎక్కువగా ప్రభావితంకాము. శరీర ప్రభావాన్ని ఎదిరించడం ద్వారా, మనం దేవునితో సమాధానాన్ని కూడా పొందుతాము ఎందుకనగా “శరీరానుసారమైన మనస్సు మరణము.”—రోమీయులు 7:21-24; 8:7.
18. సాతాను ఏ యుద్ధాన్ని చేస్తున్నాడు, మనమెలా విజయం సాధించగలము?
18 మనం దేవుని మహిమను ప్రతిబింబించకుండా కాంతివిహీనం చేయడానికి సాతాను, అతని దూతలు వాళ్లకు వీలైనదంతా చేస్తున్నారు. మన మనస్సులలో శరీరసంబంధ కోరికలను నింపడం ద్వారా, మన మనస్సులను స్వాధీనంలోకి తీసుకోవాలని వాళ్లు ప్రయత్నిస్తారు ఎందుకంటే అలా చేయడం చివరకు దేవునితో శత్రుత్వాన్ని, మరణాన్ని తెస్తుందని వాటికి తెలుసు. అయితే ఈ పోరాటంలో మనం విజయం సాధించవచ్చు. అపరిపూర్ణ శరీరంపైనున్న పాపపు పట్టును ఎదుర్కోడానికి మనకు మార్గాన్నిస్తున్నందుకు పౌలు వలె మనం కూడా “మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము” అని చెప్పగలము.—రోమీయులు 7:25.
[అధస్సూచీలు]
a బైబిలు సాధారణంగా “పాపం” అనే పదాన్ని సూచించడానికి హెబ్రీ క్రియాపదమైన చాటా, గ్రీకు క్రియాపదమైన హమార్టానోలను ఉపయోగిస్తుంది. ఈ రెండు పదాలు తప్పిపోవడం లేక గమ్యాన్ని, గుర్తును, లేక లక్ష్యాన్ని చేరలేకపోవడం అనే వాటి భావంలో “తప్పిపోవడం” అనే అర్థాన్ని కలిగివున్నాయి.
b సాంప్రదాయంగా, గర్వము, దురాశ, కామం, అసూయ, తిండిబోతుతనం, కోపం, సోమరితనం అనే ఈ ఏడూ మరణకరమైన పాపాలు.
మీరు వివరించగలరా?
◻ పాపం అంటే ఏమిటి, అపరిపూర్ణ శరీరంపై పట్టును అదెలా పెంచుకొనగలదు?
◻ మనం “శరీరానుసారమైన మనస్సును” ఎలా ఎదిరించగలము?
◻ “ఆత్మానుసారమైన మనస్సును” వృద్ధిచేసుకోడానికి మనం ఏమి చేయగలము?
◻ “ఆత్మానుసారమైన మనస్సు” జీవమును, సమాధానమును ఎలా తెస్తుంది?
[15వ పేజీలోని చిత్రం]
తన స్వనాశనానికి దారితీసేలా శరీరసంబంధమైన కోరికలు తనను అధిగమించడానికి కయీను అనుమతించాడు
[16వ పేజీలోని చిత్రాలు]
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది