కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 8/1 పేజీలు 9-14
  • యెహోవా సహేతుకమైనవాడు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా సహేతుకమైనవాడు!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొనుటలో విశ్వమంతటిలో శ్రేష్ఠుడు—యెహోవా
  • దైవిక జ్ఞానానికొక చిహ్నమే సహేతుకత
  • “క్షమించుటకు సిద్ధమైన మనస్సు”
  • కొత్త పరిస్థితులేర్పడినప్పుడు కార్యవిధానాన్ని మార్చుకొనుట
  • అధికారాన్ని ఉపయోగించడంలో సహేతుకత
  • “తెలివిగలవాడు” అయినా వినయస్థుడు
    యెహోవాకు దగ్గరవ్వండి
  • సహేతుకతను అలవర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యెహోవాలా సహేతుకత చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • యెహోవా ఔదార్యానికి, అర్థంచేసుకునే మనస్తత్వానికి ఉన్న విలువను గుర్తించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 8/1 పేజీలు 9-14

యెహోవా సహేతుకమైనవాడు!

“పైనుండివచ్చు జ్ఞానము . . . సహేతుకమైనది.”—యాకోబు 3:17 (NW).

1. దేవుడు నిర్హేతుకమైనవాడని కొందరు ఎలా చిత్రీకరించారు, దేవుని గూర్చిన అలాంటి దృష్టిని గురించి మీరెలా భావిస్తారు?

మీరు ఎటువంటి దేవున్ని ఆరాధిస్తారు? ఆయన మృదుత్వంలేని, కచ్చితమైన న్యాయంగల, నిష్కర్షయైన కనికరంలేని స్వభావంగల దేవుడై ఉండాలని మీరు విశ్వసిస్తున్నారా? ప్రొటస్టెంటు సంస్కర్తయైన జాన్‌ కాల్విన్‌కు దేవుడు ఆ విధంగానే అనిపించి ఉండవచ్చు. ఒక వ్యక్తి నిరంతరం సంతోషంగా జీవిస్తాడా లేక నరకాగ్నిలో నిరంతరం హింసింపబడతాడా అనేది ముందుగానే నిర్ణయిస్తూ, ప్రతి వ్యక్తిని గూర్చి దేవుడు “శాశ్వతమైన, మార్పులేని పథకం” కలిగివున్నాడని కాల్విన్‌ ఆరోపించాడు. ఆలోచించండి: ఇదే నిజమైతే, మీరు ఎంత శ్రమపడి కృషిచేసినా, మిమ్మును మరియు మీ భవిష్యత్తును గూర్చిన దేవుని దీర్ఘకాలిక, కనికరంలేని పథకాన్ని మార్చగల్గేదేదీ మీరు చేయలేరు. అలాంటి నిర్హేతుకమైన దేవునిని మీరు సమీపించగలరా?—యాకోబు 4:8 పోల్చండి.

2, 3. (ఎ) మానవ సంస్థలు, వ్యవస్థల నిర్హేతుకతను మనం ఎలా వివరించవచ్చు? (బి) యెహోవా యొక్క ప్రకాశమానమైన రథాన్ని గూర్చిన యెహెజ్కేలు దర్శనం ఆయన పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోగలడని ఎలా తెలియజేసింది?

2 బైబిలు నందలి దేవుడు మిక్కిలి సహేతుకమైనవాడని తెలుసుకోవడం ఎంత ఉపశమనంగా ఉంటుంది! దేవుడు కాదుగాని మానవులే తమ స్వంత అసంపూర్ణతను బట్టి కఠినంగా, మృదుత్వం లేనివారిగా ఉంటారు. మానవ సంస్థలు గూడ్స్‌ రైలువలె సులభంగా అదుపు చేయలేనివై ఉండవచ్చు. ఒక అతిపెద్ద గూడ్స్‌రైలు పట్టాలపై, పెట్టబడిన అవరోధంవైపు దూసుకు వెళ్తుండగా, దాని గమనాన్ని మార్చడమన్నది అసాధ్యం, దాన్ని ఆపడం కూడా అంత సులభం కాదు. కొన్ని రైళ్ల పురోగమన వేగం ఎంత అధికంగా ఉంటుందంటే, బ్రేకులు వేసిన తర్వాత దాదాపు ఒక కిలోమీటరు దూరం వెళ్లేంత వరకు అవి ఆగలేవు! అలాగే, ఒక పెద్ద చమురు ఓడ, ఇంజను ఆపివేసిన తర్వాత మరో ఎనిమిది కిలోమీటర్లు ముందుకు వెళ్తుంది. వాటిని వెనక్కి తీసుకువెళ్లినా, మూడు కిలోమీటర్ల వరకు అలాగే వెళ్తుంది! కాని, ఈ రెండింటి కంటే ఎంతో అద్భుతమైన, దేవుని సంస్థను సూచించే వాహనాన్ని ఇప్పుడు పరిశీలించండి.

3 దాదాపు 2,600 సంవత్సరాల క్రితం, యెహోవా తన ఆత్మీయ ప్రాణుల పరలోక సంస్థను సూచించే ఒక దర్శనాన్ని ప్రవక్తయైన యెహెజ్కేలుకు యిచ్చాడు. అది ఎల్లప్పుడూ యెహోవా ఆధీనములో ఉండే ఆయన స్వంత “వాహనము” అయినటువంటి భీతిగొలిపే పరిమాణముగల రథము. అది కదిలే విధానం ఎంతో ఆసక్తికరమైనది. దాని పెద్ద చక్రములు నాల్గు దిశలు గలవై పూర్తిగా కండ్లతో నిండివున్నాయి. గనుక అవి అంతటా చూడగలవు, ఆగకుండా లేక ప్రక్కకు తిరగకుండానే అవి తమ దిశను తక్షణమే మార్చుకోగలవు. ఈ అతిపెద్ద వాహనం చమురు ఓడ లేక గూడ్స్‌ రైలంత భారంగా కదులుతూ ఉండనవసరం లేదు. అది సమకోణ మలుపులు తిరుగుతూ మెరుపు వేగంతో కదలగలదు! (యెహెజ్కేలు 1:1, 14-28) లోపభూయిష్టమైన మానవ నిర్మిత యంత్రాల నుండి యెహోవా రథం ఎంత వేరుగా ఉందో కాల్విన్‌ ప్రకటించిన దేవుని నుండి ఆయన అంత వేరుగా ఉన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలచుకొనుటలో ఆయన పరిపూర్ణుడు. యెహోవా వ్యక్తిత్వంలోని ఈ గుణాన్ని మెచ్చుకోవడం, మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొనగల వారమై ఉంటూ, నిర్హేతుకంగా ప్రవర్తించు ఉరిలో పడిపోకుండా తప్పించుకోవడానికి సహాయపడాలి.

పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొనుటలో విశ్వమంతటిలో శ్రేష్ఠుడు—యెహోవా

4. (ఎ) యెహోవా పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోగల దేవుడని ఏయే విధాలుగా ఆయన పేరే తెలియజేస్తున్నది? (బి) యెహోవా దేవునికి అన్వయింపబడిన కొన్ని పేర్లు ఏవి, అవి ఎందుకు తగినవి?

4 యెహోవా పేరే అనుగుణంగా మలుచుకొనుటలోని ఆయన దృక్పథాన్ని సూచిస్తుంది. “యెహోవా” అంటే “సంభవింపజేయువాడు” అని అక్షరార్థ భావము. కాబట్టి తన వాగ్దానాలన్నీ నెరవేర్చేవానిగా యెహోవా తనను తాను చేసుకుంటాడనేది దీని ప్రత్యక్ష భావము. ఆయన పేరును గూర్చి దేవున్ని మోషే అడిగినప్పుడు, దాని భావాన్ని యెహోవా ఇలా విశదీకరించాడు: “నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను.” (నిర్గమకాండము 3:14) రోథర్‌హామ్‌ తర్జుమా ఇలాగున్నది: “నాకిష్టమైనరీతిగా నేను మారుతాను.” తన నీతియుక్తమైన సంకల్పాలను, వాగ్దానాలను నెరవేర్చడానికి అవసరమైన ఏరీతిగానైనా మలచుకొంటాడని యెహోవా నిరూపించుకుంటాడు, లేదా మారడాన్ని ఎంచుకుంటాడు. అందుకే ఆయన సృష్టికర్త, తండ్రి, సర్వాధిపతి, కాపరి, సైన్యముల కధిపతియైన యెహోవా, ప్రార్థన నాలకించువాడు, న్యాయాధిపతి, మహాగొప్ప ఉపదేశకుడు, విమోచకుడు అనే బిరుదులను కలిగివున్నాడు. తన ప్రేమపూర్వక సంకల్పాలను నెరవేర్చడానికి ఆయన తనను తాను వీటి మాదిరిగా, ఇంకా ఎన్నో రీతులుగా మార్చుకుంటాడు.—యెషయా 8:13; 30:20; 40:28; 41:14; కీర్తన 23:1; 65:2; 73:28; 89:26; న్యాయాధిపతులు 11:27; న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ అపెన్‌డిక్స్‌ 1J కూడా చూడండి.

5. యెహోవా యొక్క మలుచుకొనే ధోరణినిబట్టి ఆయన స్వభావం లేక కట్టడలు మారతాయనే ముగింపుకు మనమెందుకు రాకూడదు?

5 అయితే, దేవుని స్వభావం లేక ప్రామాణికాలు మారతాయని దీని భావమా? కాదు; యాకోబు 1:17 చెప్పునట్లుగా “ఆయన యందు . . . గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు.” ఇక్కడేమైనా పరస్పర విరుద్ధత ఉన్నదా? ఎంతమాత్రం లేదు. ఉదాహరణకు, పిల్లల ప్రయోజనార్థం ప్రేమగల ఏ తల్లి లేక తండ్రి వేరు వేరు పాత్రలను నిర్వహించరు? కేవలం ఒక్కరోజులోనే, తల్లిదండ్రులు ఉపదేశకులుగా, వంటవారిగా, గృహపర్యవేక్షకులుగా, ఉపాధ్యాయులుగా, శిక్షకులుగా, స్నేహితులుగా, మెకానిక్‌లుగా, నర్స్‌గా ఉండవచ్చు, ఇంకా ఎన్నో పాత్రలలో కొనసాగవచ్చు. ఈ పాత్రలను నిర్వహించేటప్పుడు తల్లిగాని తండ్రిగాని తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోరు; అతడు లేక ఆమె ప్రస్తుత అవసరాలకు తగినట్లు మలుచుకుంటారు. అలాగే యెహోవా కూడా, కానీ ఆయన విస్తృత పరిధిలో. తన ప్రాణుల ప్రయోజనార్థం ఆయన తనను తాను మార్చుకునేదానికి ఒక పరిమితి లేదు. వాస్తవానికి, ఆయన జ్ఞానం యొక్క లోతు అంతుపట్టజాలనిది!—రోమీయులు 11:33.

దైవిక జ్ఞానానికొక చిహ్నమే సహేతుకత

6. దైవిక జ్ఞానాన్ని వివరించడానికి యాకోబు ఉపయోగించిన గ్రీకు పదం యొక్క అక్షరార్థక భావం మరియు సంబంధిత భావాలేవి?

6 మహోన్నతంగా తనను తాను మలుచుకోగల ఈ దేవుని జ్ఞానాన్ని వర్ణించడానికి శిష్యుడైన యాకోబు ఒక ఆసక్తిదాయకమైన పదాన్ని ఉపయోగించాడు. ఆయనిలా వ్రాశాడు: “పైనుండివచ్చు జ్ఞానము . . . సహేతుకమైనది.” (యాకోబు 3:17 (NW) ఇక్కడ ఆయన ఉపయోగించిన గ్రీకు పదాన్ని (ఎపీకెస్‌) అనువదించడం చాలా కష్టము. అనువాదకులు “మృదువైన,” “దయచూపే,” “ఓర్పుగల,” “ఆలోచించగల” వంటి పదాలను ఉపయోగించారు. న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ దాన్ని “సహేతుకమైన” అని అనువదిస్తూ, అధఃస్సూచిలో “లొంగిపోవు” అను అక్షరార్థ భావాన్ని సూచించింది.a ఇంకా ఈ పదం వ్రాతపూర్వక ఉపదేశంలోని అసలు ఉద్దేశాన్ని విడిచిపెట్టి ప్రతి అక్షరాన్ని పాటించాలని పట్టుబట్టక, అనవసరమైన నిష్కర్షతో లేక కఠినతతో వ్యవహరించక పోవడం అనే భావాలను అందజేస్తుంది. న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌లో పండితుడైన విలియం బార్‌క్లే ఇలా చెప్పాడు: “ఎపీకియాను గూర్చిన మూల, ప్రాథమిక విషయమేమిటంటే అది దేవునికి సంబంధించినది. దేవుడు తన హక్కుల గురించి నొక్కి చెబితే, మనం కఠినమైన ప్రామాణికాల అనుసారంగా మాత్రమే ఉండాలని దేవుడు కోరితే, మనమెక్కడ నిలువగలము? ఎపీకెస్‌ అయివుండడంలో, ఇతరులతో ఎపికెయాతో వ్యవహరించడంలో దేవుడు అత్యున్నత మాదిరిగా ఉన్నాడు.”

7. ఏదేను తోటలో యెహోవా ఎలా సహేతుకతను ప్రదర్శించాడు?

7 యెహోవా సర్వాధిపత్యానికి వ్యతిరేకంగా మానవజాతి తిరుగుబాటు చేసిన సమయం గురించి ఆలోచించండి. కృతజ్ఞతలేని, తిరుగుబాటుదారులైన ఆ ముగ్గురిని—ఆదాము, హవ్వ, సాతానులను శిక్షించడం దేవునికి ఎంత సుళువై ఉండేది! అలా చేయడం మూలంగా తాను ఎంతటి హృదయవేదనను తొలగించుకొని ఉండేవాడు! అలాంటి కచ్చితమైన న్యాయం అమలుపర్చడానికి ఆయనకు హక్కులేదని ఎవరు వాదించివుండేవారు? బదులుగా యెహోవా తన ప్రకాశమానమైన రథము వంటి సంస్థను కఠినమైన, మలుచుకొనవీలులేని న్యాయ ప్రమాణాలతో బంధించలేదు. కాబట్టి ఆ రథము మానవ కుటుంబంపై, మానవజాతి యొక్క ఆనందభరిత భవిష్యత్‌ నిరీక్షణలన్నిటిని నలిపివేస్తూ, నిర్దయగా దొర్లిపోలేదు. అందుకు భిన్నంగా, యెహోవా తన రథమును మెరుపు వంటి వేగంతో మరల్చుకున్నాడు. తిరుగుబాటు జరిగిన తర్వాత వెంటనే, యెహోవా దేవుడు ఆదాము సంతానమంతటికీ దయా నిరీక్షణలను అందజేసిన దీర్ఘకాలిక సంకల్పాన్ని తయారుచేశాడు.—ఆదికాండము 3:15.

8. (ఎ) సహేతుకతను గూర్చిన క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క పొరపాటైన దృష్టికి, యెహోవా యొక్క నిజమైన సహేతుకతకు ఎలా వ్యత్యాసం ఉంది? (బి) యెహోవా సహేతుకతను కలిగివున్నాడంటే ఆయన దైవిక సూత్రాలతో రాజీపడడం కాదని మనమెందుకు చెప్పవచ్చు?

8 అయితే, యెహోవా యొక్క సహేతుకత అంటే, దాని భావం ఆయన దైవిక సూత్రాలతో రాజీపడతాడని కాదు. కేవలం దారి విడిచి తిరుగు తమ మందల యొక్క అభిమానాన్ని పొందడానికి లైంగిక దుర్నీతిని పట్టించుకోకుండా తాము సహేతుకంగా ఉన్నామని నేటి క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు భావించవచ్చు. (2 తిమోతి 4:3 పోల్చండి.) యెహోవా ఎప్పుడూ తన స్వంత శాసనాలను అతిక్రమించడు, తన సూత్రాలతో రాజీపడడు. బదులుగా, ఆ సూత్రాలు న్యాయంగా, దయాపూర్వకంగా అన్వయించుకొనబడేలా మృదువుగా ఉండడానికి, పరిస్థితులకు అనుకూలంగా మారడానికి సుముఖత చూపిస్తాడు. ఆయన తన న్యాయాన్ని, శక్తిని చూపించడంలో, తన ప్రేమ మరియు సహేతుకమైన జ్ఞానాన్ని వాటితో సమతూకం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. యెహోవా సహేతుకతను చూపించే మూడు మార్గాలను మనం పరిశీలిద్దాము.

“క్షమించుటకు సిద్ధమైన మనస్సు”

9, 10. (ఎ) “క్షమించుటకు సిద్ధమైన మనస్సు” కలిగివుండడానికి, సహేతుకతకు ఏమి సంబంధం ఉంది? (బి) క్షమించడానికి యెహోవా కలిగివున్న సంసిద్ధతను బట్టి దావీదు ఎలా ప్రయోజనం పొందాడు, ఎందుకు?

9 దావీదు ఇలా వ్రాశాడు: “ప్రభువా (యెహోవా NW) నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరి యెడల కృపాతిశయము గలవాడవు.” (కీర్తన 86:5) హెబ్రీ లేఖనాలను గ్రీకులోకి అనువదించినప్పుడు, “క్షమించుటకు సిద్ధమైన మనస్సు” అనే పదం ఎపీకెస్‌ లేక “సహేతుకమైన” అని వ్రాయబడింది. వాస్తవానికి, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలిగివుండి దయ చూపించడమనేది సహేతుకతను ప్రదర్శించుటలో కీలక విధానము.

10 ఈ విషయంలో యెహోవా ఎంత సహేతుకమైనవాడో దావీదు స్వయంగా ఎరిగియున్నాడు. దావీదు బత్షెబతో వ్యభిచరించి, ఆమె భర్త చంపబడేలా ఏర్పాటు చేసినప్పుడు అతడు, బత్షెబ ఇద్దరూ కూడా మరణ దండనకు పాత్రులైయుండిరి. (ద్వితీయోపదేశకాండము 22:22; 2 సమూయేలు 11:2-27) కఠినమైన మానవ న్యాయాధిపతులు దీనికి తీర్పుతీర్చి ఉంటే, ఇద్దరూ కూడా తమ ప్రాణాలు కోల్పోయి ఉండేవారే. కాని యెహోవా సహేతుకతను (ఎపికెస్‌) చూపించాడు. వైన్స్‌ ఎక్స్‌పోసిటరీ డిక్షనరి ఆఫ్‌ బిబ్లికల్‌ వర్డ్స్‌ దాన్నిలా తెలియజేస్తుంది: “‘విషయం యొక్క వాస్తవాలను మానవత్వంతో, సహేతుకతతో’ చూసే దయా గుణాన్ని అది వ్యక్తం చేస్తుంది.” యెహోవా యొక్క కనికరం గల నిర్ణయాన్ని ప్రభావితం చేసిన వాస్తవాల్లో, తప్పు చేసినవారు చూపించిన యథార్థమైన పశ్చాత్తాపం, ఇతరుల యెడల దావీదు తానే మునుపు చూపించిన కనికరం కూడా చేరి ఉండవచ్చు. (1 సమూయేలు 24:4-6; 25:32-35; 26:7-11; మత్తయి 5:7; యాకోబు 2:13) ఏమైనప్పటికీ, నిర్గమకాండము 34:4-7 నందు యెహోవా తన గురించి తాను వర్ణించుకున్నదాన్ని బట్టి యెహోవా దావీదు తప్పును సరిచేయడమనేది సహేతుకమై ఉంది. యెహోవా వాక్యాన్ని తాను తృణీకరించాడని తెలుసుకొనేలా ఒక దృఢమైన సమాచారంతో ప్రవక్తయైన నాతానును దావీదు యొద్దకు పంపాడు. దావీదు పశ్చాత్తాప పడ్డాడు గనుక అతడు తన పాపమును బట్టి మరణించలేదు.—2 సమూయేలు 12:1-14.

11. మనష్షే విషయంలో క్షమించడానికి సంసిద్ధతను యెహోవా ఎలా చూపించాడు?

11 ఈ విషయంలో యూదా రాజైన మనష్షే ఉదాహరణ ఎంతో విశేషమైనది. దావీదులా కాకుండా మనష్షే చాలాకాలం వరకు దుష్టునిగానే ప్రవర్తించాడు. మానవ బల్యర్పణతో పాటు హేయమైన మతాచారాలను మనష్షే దేశంలో వృద్ధిచేశాడు. నమ్మకమైన ప్రవక్తయగు యెషయా “రంపములతో కోయబడుటకు” కూడా ఆయనే కారణం అయివుండవచ్చు. (హెబ్రీయులు 11:37) మనష్షేను శిక్షించడానికి, అతడు బబులోనుకు బందీగా కొనిపోబడుటకు యెహోవా అనుమతించాడు. అయితే, మనష్షే చెరసాలలో పశ్చాత్తాపం చెంది కనికరం కొరకు ప్రార్థించాడు. ఈ యథార్థమైన పశ్చాత్తాపానికి జవాబుగా, యెహోవా విపరీత సందర్భంలో కూడా “క్షమించడానికి సిద్ధమైన మనస్సు” కలిగి ఉండెను.—2 దినవృత్తాంతములు 33:9-13.

కొత్త పరిస్థితులేర్పడినప్పుడు కార్యవిధానాన్ని మార్చుకొనుట

12, 13. (ఎ) నీనెవె విషయంలో, తన విధానాన్ని మార్చుకోడానికి పరిస్థితులలోని ఏ మార్పు యెహోవాను పురికొల్పింది? (బి) యెహోవా దేవునికంటే యోనా తక్కువ సహేతుకమైనవానిగా ఎలా నిరూపించుకున్నాడు?

12 కొత్త పరిస్థితులేర్పడినప్పుడు తాను గైకొనాలనుకున్న చర్యను మార్చుకోడానికి ఆయన చూపే సుముఖతలో కూడా యెహోవా యొక్క సహేతుకత కనిపిస్తుంది. ఉదాహరణకు, ప్రవక్తయైన యోనా పురాతన నీనెవె వీధులలో నడిచినప్పుడు, ఆయన ప్రేరేపిత వర్తమానం మరీ సరళమైంది: ఆ మహాపట్టణం 40 దినాల్లో నాశనమవుతుందనేదే. అయితే, నాటకీయంగా పరిస్థితులు మారాయి! నీనెవె నివాసులు పశ్చాత్తాపపడ్డారు.—యోనా, 3వ అధ్యాయము.

13 ఈ మారిన పరిస్థితులకు యెహోవా మరియు యోనా ఎలా స్పందించారో పోల్చి వ్యత్యాసాన్ని చూడడం ఉపదేశాత్మకంగా ఉంటుంది. యెహోవా తన ప్రకాశమానమైన రథం యొక్క గమనాన్ని మార్చాడు. ఈ సందర్భంలో “యుద్ధశూరుడు” కావడానికి బదులు ఆయన పాపాలను క్షమించేవాడయ్యాడు. (నిర్గమకాండము 15:3) మరో పక్షాన యోనా, ఏమాత్రం మారుటకు అనువుగా లేడు. యెహోవా రథము యొక్క వేగంతో తాను కూడా సాగే బదులు మునుపు ప్రస్తావించిన గూడ్స్‌ రైలులా లేక ఓడలా ప్రవర్తించాడు. అతడు నాశనాన్ని ప్రకటించాడు గనుక నాశనమే జరగాలి అనుకున్నాడు. బహుశా అతడు, చెప్పినదానిలో ఏదైనా మార్పు వస్తే తాను నీనెవె నివాసుల దృష్టిలో హీనమైపోతానని భావించి ఉండవచ్చు. అయితే యెహోవా సహనంతో తలబిరుసుగల తన ప్రవక్తకు సహేతుకత, కనికరాలను గూర్చిన గుర్తుంచుకోదగిన గుణపాఠాన్ని నేర్పాడు.—యోనా 4వ అధ్యాయము.

14. తన ప్రవక్తయైన యెహెజ్కేలుకు సంబంధించి యెహోవా ఎందుకు తన చర్యల విధానాన్ని మార్చుకున్నాడు?

14 ఇతర సందర్భాల్లో అంటే చాలా చిన్న విషయాల్లోనూ, యెహోవా తన విధానాన్ని మార్చుకున్నాడు. ఉదాహరణకు, ఆయన ఒకసారి ప్రవక్తయైన యెహెజ్కేలును ఒక ప్రవచనార్థక నాటకం వేయమని, అందులో యెహెజ్కేలు మనుష్య మలముతో కాల్చిన ఆహారమును భుజించవలెనని కూడా యెహోవా సూచించాడు. ఇది ఆ ప్రవక్తకు మరీ విపరీతంగా అనిపించి, “అయ్యో ప్రభువా, యెహోవా” అని, తనకు ఎంతో అసహ్యమైన దానిని చేసేలా చేయవద్దని వేడుకున్నాడు. ప్రవక్త భావాలు సరైనవి కావని యెహోవా తృణీకరించలేదు; బదులుగా, నేటి వరకు అనేక దేశాలలో వంటచెరుకుగా ఉపయోగించే గోమలమును ఉపయోగించడానికి ఆయన అంగీకరించాడు.—యెహెజ్కేలు 4:12-15.

15. (ఎ) మానవులు చెప్పేది విని, ప్రతిస్పందించడానికి యెహోవా సుముఖత కలిగివున్నాడని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) ఇది మనకు ఏ గుణపాఠాన్ని నేర్పాలి?

15 మన దేవుడైన యెహోవా దీనత్వాన్ని ధ్యానించడం హృదయరంజకంగా లేదా? (కీర్తన 18:35) ఆయన మనకంటే ఎంతో ఉన్నతుడు; అయినప్పటికీ ఆయన సహనంతో అపరిపూర్ణ మానవులు చెప్పేది విని, కొన్నిసార్లు తన చర్యల విధానాన్ని తగినట్లు మార్చుకుంటాడు. సొదొమ గొమొఱ్ఱాల నాశనాన్ని గూర్చి అబ్రాహాము తనను ఎంతోసేపు వేడుకొనేలా ఆయన అనుమతించాడు. (ఆదికాండము 18:23-33) తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయులను నాశనం చేసి బదులుగా మోషే నుండి పెద్ద జనాంగం ఏర్పడేలా చేస్తాననే ఆయన ప్రతిపాదనకు మోషే అభ్యంతరం తెలుపుటకు ఆయన అనుమతించాడు. (నిర్గమకాండము 32:7-14; ద్వితీయోపదేశకాండము 9:14, 19; ఆమోసు 7:1-6 పోల్చండి.) తద్వారా సహేతుకమైనప్పుడు, అలా చేయుటకు సాధ్యమైనప్పుడు ఇతరులు చెప్పేది వినుటకు సుముఖతను చూపవలసియున్న తన మానవ సేవకులకు ఆయన పరిపూర్ణమైన మాదిరిని చూపాడు.—యాకోబు 1:19 పోల్చండి.

అధికారాన్ని ఉపయోగించడంలో సహేతుకత

16. అధికారాన్ని ఉపయోగించే విషయంలో అనేకమంది మానవుల నుండి యెహోవా ఎలా వేరుగా ఉన్నాడు?

16 వ్యక్తులు ఎక్కువ అధికారం పొందే కొలది, వారిలో అనేకులు సహేతుకతను అంతగా ప్రదర్శించకపోవడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? దానికి భిన్నంగా, విశ్వమంతటిలో యెహోవా అత్యున్నతమైన అధికార స్థానంలో ఉన్నప్పటికీ సహేతుకత విషయంలో ఆయన అతిగొప్ప ఉదాహరణగా ఉన్నాడు. ఆయన తన అధికారాన్ని విఫలంకానంత సహేతుకమైన విధంగా ప్రదర్శిస్తాడు. అనేకమంది మానవులవలె యెహోవా తన అధికారాన్ని గురించి ఆసక్తితో దాన్ని కాపాడుకోవాలన్నట్లు అంటే ఇతరులకు ఏమాత్రం అధికారాన్ని కట్టబెట్టినా తన స్వంత అధికారానికి ముప్పు వాటిల్లుతుందేమోనన్నట్లు భావించడు. వాస్తవానికి, విశ్వంలో వేరే జీవి కేవలం ఒక్కడే ఉన్నప్పుడు కూడా యెహోవా ఆయనకు విస్తృతమైన అధికారాన్ని ఇచ్చాడు. ఆయన తన “ప్రధాన శిల్పి”యైన లోగోస్‌ను కలుగజేసుకున్నాడు, అప్పటి నుండి ఈ ప్రియ కుమారుని ద్వారా ఆయన సమస్తము ఉనికిలోకి వచ్చేలా చేశాడు. (సామెతలు 8:22, 29-31; యోహాను 1:1-3, 14; కొలొస్సయులు 1:15-17) ఆతర్వాత ఆయనకు “పరలోకమందును భూమిమీదను . . . సర్వాధికారము” అప్పగించాడు.—మత్తయి 28:18; యోహాను 5:22.

17, 18. (ఎ) యెహోవా సొదొమ గొమొఱ్ఱాలకు దూతలను ఎందుకు పంపాడు? (బి) ఆహాబును ఎలా ప్రేరేపించాలి అనే విషయంలో యెహోవా ఎందుకు దూతల సలహాలను అడిగాడు?

17 అలాగే, తానే స్వయంగా ఎంతో బాగుగా చేసుకోగల పనులను కూడా యెహోవా తన సృష్టిప్రాణులకు అప్పగిస్తాడు. ఉదాహరణకు, ఆయన అబ్రాహాముతో “నేను [సొదొమ గొమొఱ్ఱాల యొద్దకు] దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను” అని చెప్పినప్పుడు, అక్కడికి తాను స్వయంగా వెళ్తానని ఆయన భావం కాదు. బదులుగా తనకొరకు అలాంటి సమాచారాన్ని సేకరించడానికి దూతలను నియమిస్తూ, వారికి అధికారాన్ని ఇవ్వడానికి యెహోవా ఇష్టపడ్తున్నాడు. వాస్తవాలను విచారించి, మళ్లీ తనకు నివేదించే పనికి సంబంధించిన అధికారాన్ని ఆయన వారికి అప్పగించాడు.—ఆదికాండము 18:1-3, 20-22.

18 మరో సందర్భములో, యెహోవా దుష్టుడైన ఆహాబు రాజును శిక్షించడానికి నిర్ణయించుకున్నప్పుడు, ఆ మతభ్రష్ట రాజు జీవితాన్ని అంతమొందించే యుద్ధంలో అతడు ప్రవేశించేలాగున అతన్ని ఎలా “ప్రేరేపించాలో” సలహాలు ఇవ్వడానికి పరలోక సమావేశంలోని దూతలను ఆయన ఆహ్వానించాడు. నిజంగా జ్ఞానమంతటికీ మూలమైన యెహోవాకు సరైన చర్యగైకొనడానికి సహాయం అవసరం లేదు! అయినా, పరిష్కారాలను సూచించే ఆధిక్యతను, ఆయన ఎన్నిక చేసినదాని ప్రకారం చర్యగైకొనే అధికారాన్ని దూతలకు ఇచ్చి ఆయన వారిని ఘనపర్చాడు.—1 రాజులు 22:19-22.

19. (ఎ) తాను చేసే కట్టడల సంఖ్యను యెహోవా ఎందుకు పరిమితం చేస్తున్నాడు? (బి) మననుండి యెహోవా ఆశించేదాని విషయంలో తాను సహేతుకంగా ఉన్నానని ఆయనెలా చూపించాడు?

19 ఇతరులపై అనవసరమైన ఆధిపత్యాన్ని చెలాయించడానికి యెహోవా తన అధికారాన్ని ఉపయోగించడు. దీనిలో కూడా ఆయన సాటిలేని సహేతుకతను ప్రదర్శిస్తాడు. కట్టడల సంఖ్యను ఆయన జాగ్రత్తగా పరిమితము చేస్తూ, తన సేవకులు భారమైన తమ స్వంత కట్టడలను చేర్చుకొనడం మూలంగా ‘వ్రాసియున్న సంగతులను అతిక్రమించుటను’ ఆయన నిషేధిస్తున్నాడు. (1 కొరింథీయులు 4:6; అపొస్తలుల కార్యములు 15:28; మరియు మత్తయి 23:4 పోల్చి వ్యత్యాసం చూడండి.) తన సృష్టి ప్రాణులు సహేతుకం కాని విధేయత చూపించాలని ఆయన ఎన్నడూ కోరడు, కాని విధేయత చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాలను, అవిధేయత చూపించడంవల్ల వచ్చే పరిణామాలను వారికి తెలియజేసి, వారికి నడిపింపునివ్వడానికి తగిన సమాచారాన్ని సాధారణంగా వారికి అందజేస్తాడు. (ద్వితీయోపదేశకాండము 30:19, 20) అపరాధభావం, అవమానం, లేక భయం వంటివాటితో ప్రజలను బలవంతపెట్టే బదులు, ఆయన హృదయాలను చేరడానికి యిష్టపడతాడు; తప్పనిసరి అని కాదుగాని నిజమైన ప్రేమనుబట్టి ప్రజలు తనను సేవించాలని ఆయన కోరుకుంటాడు. (2 కొరింథీయులు 9:7) పూర్ణాత్మతో చేసే అలాంటి సేవనంతటిని బట్టి దేవుని హృదయం ఉల్లసిస్తుంది, కాబట్టి ఆయన నిర్హేతుకంగా “సంతోషపెట్టుటకు కష్టమైన” వాడుకాడు.—1 పేతురు 2:18 (NW); సామెతలు 27:11; మీకా 6:8ని పోల్చండి.

20. యెహోవా యొక్క సహేతుకత మిమ్మల్ని ఎలా ప్రభావితం చేయాలి?

20 సృష్టంతటిలో ఎంతో అధికారంగల వ్యక్తియైన యెహోవా దేవుడు ఆ అధికారాన్ని నిర్హేతుకంగా ప్రదర్శించక పోవడం, ఇతరులను బలవంతపెట్టడానికి దానిని ఎన్నడూ ఉపయోగించక పోవడం విశేషమైనది కాదా? అయితే ఆయనతో పోల్చితే ఎంతో అల్పమైయున్న మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించిన చరిత్రను కలిగి ఉన్నారు. (ప్రసంగి 8:9) స్పష్టంగా, యెహోవాను ఎంతగానో ప్రేమించేలా మనల్ని పురికొల్పేదైన సహేతుకత ఒక ప్రశస్తమైన లక్షణము. మరలా మనం ఈ లక్షణాన్ని పెంపొందించుకోడానికి అది మనల్ని పురికొల్పవచ్చు. మనం అలా ఎట్లు చేయగలము? తరువాతి శీర్షిక ఈ విషయాన్ని పరిశీలిస్తుంది.

[అధస్సూచీలు]

a వెనుకటికి 1769లో నిఘంటుకారుడైన జాన్‌ పార్క్‌హర్స్‌ట్‌ ఈ పదాన్ని “లోబడు, లొంగిపోవు స్వభావంగల, మృదువైన, సాత్వికమైన, సహనంగల” అని నిర్వచించాడు. ఇతర పండితులు కూడా “లోబడిపోవు” అనే నిర్వచనాన్నే ఇచ్చారు.

మీరెలా సమాధానమిస్తారు?

◻ యెహోవా పేరు, ప్రకాశమానమైన ఆయన రథ దర్శనము ఆయన పరిస్థితులకు అనుగుణంగా మలచుకోగలడని ఎలా నొక్కి చెబుతున్నాయి?

◻ సహేతుకత అంటే ఏమిటి, అది ఎందుకు దైవిక జ్ఞానానికొక చిహ్నము?

◻ తాను “క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగి” ఉన్నానని యెహోవా ఏయే విధాలుగా చూపించాడు?

◻ ప్రత్యేకమైన సందర్భాల్లో తాను తలపెట్టిన చర్యను మార్చుకోడానికి యెహోవా ఎందుకు ఎంచుకున్నాడు?

◻ తన అధికారాన్ని ఉపయోగించే విధానంలో యెహోవా ఎలా సహేతుకతను ప్రదర్శిస్తాడు?

[10వ పేజీలోని చిత్రం]

దుష్టుడైన రాజగు మనష్షేను యెహోవా ఎందుకు క్షమించాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి