అధ్యాయం 20
“తెలివిగలవాడు” అయినా వినయస్థుడు
1-3. యెహోవా వినయస్థుడని మనం ఎందుకు ఖచ్చితంగా చెప్పవచ్చు?
ఒకాయన వాళ్ల అబ్బాయికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాలనుకున్నాడు. అది ఆ పిల్లాడి హృదయంలోకి వెళ్లాలి అన్నది ఆయన కోరిక. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఆ పిల్లాడిని భయపెట్టేలా ఇంతెత్తున నిలబడి గయ్‌గయ్‌మని అరిస్తే బాగుంటుందా? లేదా ఆ పిల్లాడి ఎత్తుకు తగ్గి, వంగి అతనితో సౌమ్యంగా, మెల్లగా మాట్లాడితే బాగుంటుందా? ఖచ్చితంగా తెలివి, వినయం ఉన్న ఏ నాన్న అయినా రెండోదే చేస్తాడు.
2 యెహోవా ఎలాంటి తండ్రి? గర్విష్ఠా లేక వినయస్థుడా? క్రూరుడా లేక సౌమ్యుడా? యెహోవాకు తెలియనిదంటూ ఏమీ లేదు, ఆయన దగ్గర అపారమైన తెలివి ఉంది. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా, మిగతావాళ్ల కన్నా కాస్త ఎక్కువ తెలివి, జ్ఞానం ఉంటేనే కొంతమంది మనుషులు అస్సలు ఆగరు. బైబిలు ఇలా చెప్తుంది: “జ్ఞానం వల్ల గర్వం వస్తుంది.” (1 కొరింథీయులు 3:19; 8:1) కానీ యెహోవా “తెలివిగలవాడే” కాదు, వినయస్థుడు కూడా. (యోబు 9:4) యెహోవా వినయస్థుడు అంటే ఆయన వేరేవాళ్ల కంటే తక్కువ అని కాదు, ఆయనకు వైభవం లేదని కాదు. బదులుగా ఆయనలో రవ్వంత కూడా అహంకారం లేదని అర్థం. అలాగని ఎందుకు చెప్పవచ్చు?
3 యెహోవా పవిత్రుడు. కాబట్టి అహంకారం అనే అపవిత్రమైన లక్షణం ఆయనలో లేదు. (మార్కు 7:20-22) పైగా యిర్మీయా ప్రవక్త యెహోవాతో ఏమన్నాడో చూడండి: “నువ్వు తప్పకుండా నన్ను గుర్తుచేసుకుంటావు, నా దగ్గరికి కిందికి వంగి సహాయం చేస్తావు.”a (విలాపవాక్యాలు 3:20, అధస్సూచి) ఒక్కసారి ఊహించండి! ఈ విశ్వానికే సర్వాధిపతి అయిన యెహోవా యిర్మీయా స్థాయికి తగ్గి, “కిందికి వంగి,” ఆ అపరిపూర్ణ మనిషిని పైకి ఎత్తడానికి ఇష్టపడుతున్నాడు. (కీర్తన 113:7) అవును, యెహోవా వినయస్థుడు. ఇంతకీ యెహోవా వినయాన్ని ఎలా చూపిస్తాడు? దానికి, తెలివికి ఏంటి సంబంధం? దానిగురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?
యెహోవా ఎలా వినయం చూపిస్తాడు?
4, 5. (ఎ) వినయం అంటే ఏంటి, యెహోవా దాన్ని ఎలా చూపిస్తాడు? యెహోవాకు వినయం ఉందంటే దానర్థం ఏది కాదు? (బి) యెహోవా దావీదు విషయంలో ఎలా వినయం చూపించాడు? యెహోవా వినయం వల్ల మనకేంటి ఉపయోగం?
4 వినయం అంటే అహంకారం, గర్వం చూపించకుండా మనల్ని మనం తగ్గించుకోవడం. అది హృదయం లోపల ఉండే లక్షణం. అది సౌమ్యత, ఓర్పు, అర్థం చేసుకునే మనస్తత్వం లాంటి వాటి ద్వారా బయటికి కనిపిస్తుంది. (గలతీయులు 5:22, 23) అయితే, దేవునికి ఆ లక్షణాలు ఉన్నాయంటే అన్యాయాన్ని చూసినా ఆయనకు కోపం రాదని, ఆయన చేతకానివాడని, తన శక్తిని ఉపయోగించే ధైర్యం లేదని మనం అనుకోకూడదు. ఆయన వినయం, సౌమ్యత వల్లే తన అపారమైన శక్తిని, అధికారాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకుంటాడు. (యెషయా 42:14) అయితే వినయానికి, తెలివికి సంబంధం ఏంటి? ఒక బైబిలు రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది: “వినయం అంటే అసలు స్వార్థమే లేకుండా ఉండడం. . . . నిజానికి సమస్త తెలివికి మూలం వినయమే.” కాబట్టి నిజమైన తెలివి లేకుండా వినయం లేదు, వినయం లేకుండా నిజమైన తెలివి లేదు. ఇంతకీ యెహోవా వినయం వల్ల మనకేంటి ఉపయోగం?
తెలివైన తండ్రి పిల్లలతో వినయంగా, సౌమ్యంగా ఉంటాడు
5 దావీదు రాజు యెహోవాకు ఇలా పాడాడు: “నువ్వు నీ రక్షణ డాలును నాకు ఇస్తావు, నీ కుడిచెయ్యి నాకు సహాయం చేస్తుంది, నీ వినయం నన్ను గొప్పవాణ్ణి చేస్తుంది.” (కీర్తన 18:35) ఒకవిధంగా, ధూళితో సమానమైన ఒక అపరిపూర్ణ మనిషికి సహాయం చేయడానికి, అతన్ని కాపాడడానికి, ఏ రోజుకు ఆ రోజు అతన్ని చూసుకోవడానికి యెహోవా ఒక మెట్టు దిగివచ్చాడు. శత్రువుల చేతిలో నుండి రక్షణ కావాలన్నా, గొప్ప రాజు అవ్వాలన్నా, యెహోవా ఇలా వినయంగా తనకు సహాయం చేయడం వల్లే సాధ్యమౌతుందని దావీదు గుర్తించాడు. నిజంగా, యెహోవా వినయంతో ఒక మెట్టు దిగొచ్చి సౌమ్యుడిగా, ప్రేమగల తండ్రిగా మనతో ఉండకపోతే మనలో ఎవరికైనా రక్షణ పొందే అవకాశం దొరికేదా చెప్పండి?
6, 7. (ఎ) యెహోవాకు అణకువ ఉందని బైబిలు ఎందుకు చెప్పట్లేదు? (బి) సౌమ్యతకు, తెలివికి ఉన్న సంబంధం ఏంటి? దీనికి గొప్ప ఉదాహరణ ఎవరు?
6 గమనించాల్సిన విషయం ఏంటంటే వినయం వేరు, అణకువ వేరు. అణకువ అనేది మనుషులు పెంచుకోవాల్సిన ఒక అందమైన లక్షణం. వినయంలాగే, అణకువకు కూడా తెలివితో సంబంధం ఉంది. ఉదాహరణకు, సామెతలు 11:2 ఇలా చెప్తుంది: “అణకువ గలవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది.” అయితే, యెహోవాకు అణకువ ఉన్నట్టు బైబిలు ఎక్కడా చెప్పట్లేదు. ఎందుకు? బైబిల్లో, అణకువ అంటే ఎవరి పరిమితుల్ని వాళ్లు తెలుసుకోవడం అని అర్థం. సర్వశక్తిమంతుడైన యెహోవాకు తన నీతి ప్రమాణాల్ని బట్టి తను సొంతగా నియమించుకున్న హద్దులు తప్ప, ఎలాంటి పరిమితులు లేవు. (మార్కు 10:27; తీతు 1:2) పైగా, ఆయన సర్వోన్నతుడు కాబట్టి ఎవరి కిందా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే, యెహోవాకు అణకువతో పనిలేదు.
7 అయితే యెహోవా వినయస్థుడు, సౌమ్యుడు. తన సేవకులు నిజంగా తెలివైనవాళ్లు అవ్వాలంటే సౌమ్యంగా ఉండాలని ఆయన వాళ్లకు బోధిస్తున్నాడు. “తెలివి నుండి పుట్టే సౌమ్యత” గురించి బైబిలు మాట్లాడుతుంది.b (యాకోబు 3:13) దాన్ని యెహోవా ఎలా చూపించాడో ఇప్పుడు చూద్దాం.
యెహోవా వినయంగా పనులు అప్పగిస్తాడు, చెప్పేది వింటాడు
8-10. (ఎ) యెహోవా వేరేవాళ్లకు పనులు అప్పగించడం, వాళ్లు చెప్పేది వినడం ఎందుకు గొప్ప విషయం? (బి) సర్వశక్తిమంతుడు దేవదూతలతో ఎలా వినయంగా ఉన్నాడు?
8 యెహోవా వినయానికి గొప్ప రుజువు ఏంటంటే, ఆయన వేరేవాళ్లకు పనులు అప్పగించడానికి, వాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడతాడు. యెహోవాకు వేరేవాళ్ల సహాయం గానీ సలహాలు గానీ అవసరం లేదు, అయినా ఆయన అలా చేస్తున్నాడంటే అది గొప్ప విషయం. (యెషయా 40:13, 14; రోమీయులు 11:34, 35) యెహోవా దాన్ని ఎలా చేస్తాడో చెప్పే బోలెడు ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి.
9 ఉదాహరణకు, అబ్రాహాము జీవితంలో జరిగిన ఒక మర్చిపోలేని సంఘటనను చూడండి. ఒకరోజు అబ్రాహాము దగ్గరికి ముగ్గురు అతిథులు వచ్చారు, అబ్రాహాము వాళ్లలో ఒకర్ని “యెహోవా” అని పిలిచాడు. నిజానికి ఆ వచ్చినవాళ్లు దేవదూతలు, అయితే వాళ్లలో ఒకరు యెహోవా పేరున వచ్చారు. అంటే ఇప్పుడు ఆ దేవదూత ఏం చెప్పినా, చేసినా యెహోవా చేసినట్టే. ఆ దేవదూత ద్వారా యెహోవా అబ్రాహాముతో, ‘సొదొమ, గొమొర్రాల గురించిన మొర’ తనకు చాలా బిగ్గరగా వినిపించిందని చెప్పాడు. యెహోవా ఇలా అన్నాడు: “నేను కిందికి వెళ్లి, నాకు వినబడిన మొర నిజమో కాదో, వాళ్ల పనులు నిజంగా అంత చెడ్డగా ఉన్నాయో లేదో చూస్తాను. నాకు అది తెలుసుకోవాలనుంది.” (ఆదికాండం 18:3, 20, 21) అయితే, స్వయంగా సర్వశక్తుడే “కిందికి వెళ్లి” చూస్తాడని కాదు. ఆయన తనకు బదులుగా మళ్లీ దేవదూతల్ని పంపించాడు. (ఆదికాండం 19:1) ఎందుకు? అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపించే యెహోవాకు, ఆ ప్రాంతం ఎలా ఉందో నిజంగా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. కానీ అక్కడి పరిస్థితిని, అలాగే సొదొమలో ఉన్న లోతును-అతని కుటుంబాన్ని చూసివచ్చే పనిని యెహోవా వినయంగా దేవదూతలకు అప్పగించాడు.
10 ఇంకో విషయం ఏంటంటే, యెహోవా వేరేవాళ్లు చెప్పేది వింటాడు. ఒక సందర్భంలో, చెడ్డరాజైన అహాబును పడగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుందని యెహోవా దేవదూతల్ని అడిగాడు. యెహోవాకు వేరేవాళ్ల ఐడియాలు అవసరం లేదు. అయినప్పటికీ, ఆయన ఒక దేవదూత ఇచ్చిన ఐడియా విన్నాడు, ఆ పనిని ఆ దేవదూతకే అప్పగించాడు. (1 రాజులు 22:19-22) ఇది కదా వినయం అంటే!
11, 12. అబ్రాహాము యెహోవా వినయాన్ని ఎలా కళ్లారా చూశాడు?
11 దేవదూతలే కాదు, ఆఖరికి అపరిపూర్ణ మనుషులు వాళ్ల మనసులో ఉన్నది చెప్తే కూడా, యెహోవా వినడానికి రెడీగా ఉన్నాడు. ఉదాహరణకు సొదొమ, గొమొర్రాలను నాశనం చేయబోతున్నానని యెహోవా మొదట చెప్పినప్పుడు అబ్రాహాము ఖంగుతిన్నాడు. “నువ్వు ఎన్నడూ అలా చేయవు. భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనది చేయడా?” అని అబ్రాహాము అడిగాడు. ఆ నగరాల్లో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే, యెహోవా వాటిని నాశనం చేయకుండా వదిలేస్తాడా అని అబ్రాహాము అడిగాడు. నాశనం చేయనని యెహోవా చెప్పాడు. కానీ ఆయన ఆ సంఖ్యను 45కి, మళ్లీ 40కి, అలా తగ్గించుకుంటూ చాలా ప్రశ్నలు వేశాడు. యెహోవా నాశనం చేయనని ఎన్నిసార్లు చెప్పినా, అబ్రాహాము పదేపదే ప్రశ్నలు అడుగుతూ ఆ సంఖ్యను పది దాకా తీసుకెళ్లాడు. బహుశా, యెహోవాకు ఎంత కరుణ ఉందో అబ్రాహాముకు ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. ఏదేమైనా తన స్నేహితుడు, సేవకుడు అయిన అబ్రాహాము మనసులో ఉన్న బాధను యెహోవా వినయంగా చెప్పుకోనిచ్చి, ఓపిగ్గా విన్నాడు.—ఆదికాండం 18:23-33.
12 చదువు, తెలివితేటలు ఉన్న ఎంతమంది మనుషులు, వాళ్లకంటే తక్కువ తెలివితేటలు ఉన్నవాళ్లు చెప్పేది ఓపిగ్గా వింటారు?c కానీ మన దేవుడు వింటాడు. ఆయన వినయం అలాంటిది మరి! యెహోవాతో మాట్లాడుతున్నప్పుడు, అబ్రాహాముకు ఇంకో విషయం కూడా అర్థమైంది. అదేంటంటే, యెహోవా “కోప్పడే విషయంలో నిదానించే” దేవుడు. (నిర్గమకాండం 34:6, అధస్సూచి) సర్వోన్నతుని పనుల్ని ప్రశ్నించే హక్కు తనకు లేదని గుర్తొచ్చిందో ఏమో, అబ్రాహాము రెండుసార్లు ఇలా వేడుకున్నాడు: “యెహోవా, దయచేసి కోపంతో మండిపడకు.” (ఆదికాండం 18:30, 32) అయితే, యెహోవా కోపంతో మండిపడలేదు గానీ, నిజానికి “తెలివి నుండి పుట్టే సౌమ్యత” చూపించాడు.
యెహోవా పట్టుబట్టడు, అర్థం చేసుకుంటాడు
13. బైబిల్లో “పట్టుబట్టే స్వభావం లేనిది” అనే మాటకు అర్థమేంటి? ఆ మాట యెహోవాకు ఎందుకు సరిగ్గా సరిపోతుంది?
13 యెహోవాకున్న వినయం, ఇంకో అద్భుతమైన లక్షణంలో కూడా కనిపిస్తుంది. అదే, పట్టుబట్టకుండా అర్థం చేసుకునే మనస్తత్వం. బాధాకరంగా, ఈ లక్షణం అపరిపూర్ణ మనుషుల్లో కనిపించట్లేదు. యెహోవా దేవదూతలు చెప్పేది, మనుషులు చెప్పేది వినడానికే కాదు, తన నీతి ప్రమాణాలకు అడ్డురానంత వరకు ఒక మెట్టు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో “పట్టుబట్టే స్వభావం లేని” అనే పదానికి “తలొగ్గడం” అని అర్థం. ఈ లక్షణం కూడా దేవుని తెలివికి బండగుర్తే. యాకోబు 3:17 ఇలా చెప్తుంది: “పరలోకం నుండి వచ్చే తెలివి . . . పట్టుబట్టే స్వభావం లేనిది.” అపారమైన తెలివి ఉన్న యెహోవా, పట్టుబట్టకుండా అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఎలా చూపిస్తాడు? ఒకటి ఏంటంటే, ఆయన పరిస్థితులకు తగ్గట్టు మారతాడు. ఒకసారి గుర్తుతెచ్చుకోండి, యెహోవా పేరుకు అర్థమే ఆయన తన ఉద్దేశాల్ని నెరవేర్చడానికి ఎలా కావాలంటే అలా అవుతాడని కదా. (నిర్గమకాండం 3:14) కాబట్టి, ఆయన పరిస్థితులకు తగ్గట్టు మారతాడనీ, పట్టుబట్టడనీ ఆయన పేరే చెప్పట్లేదా?
14, 15. యెహెజ్కేలు దర్శనంలో చూసిన రథం, యెహోవా సంస్థలోని పరలోక భాగం గురించి ఏం చెప్తుంది? దానికి, లోకంలో ఉన్న సంస్థలకు తేడా ఏంటి?
14 యెహోవా పరిస్థితులకు తగ్గట్టు మారతాడు అనడానికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఉంది. యెహెజ్కేలు ప్రవక్త ఒక దర్శనంలో, దేవదూతలతో ఉన్న యెహోవా సంస్థలోని పరలోక భాగాన్ని చూశాడు. అతనికి మతిపోగొట్టే సైజులో ఉన్న ఒక రథం కనిపించింది. అది యెహోవా వాహనం, అది పూర్తిగా ఆయన అధీనంలో ఉంది. దాని కదలికలు చాలా ఆసక్తిగా అనిపిస్తున్నాయి. దానికున్న పెద్దపెద్ద చక్రాలు నాలుగు వైపులకు తిరిగి ఉన్నాయి, పైగా వాటినిండా కళ్లు ఉన్నాయి. కాబట్టి అవి దేన్నైనా చూడగలవు; అలాగే ఏమాత్రం వేగం తగ్గకుండానే చిటికెలో దిశను మార్చుకోగలవు. మనుషులు తయారుచేసిన పెద్దపెద్ద వాహనాలైతే ఎటైనా తిరగాలంటే వేగం తగ్గించుకోవాలి, ముందుకూ వెనక్కీ సర్దుకుని పక్కకు తిరగాలి. కానీ ఈ భారీ రథం మాత్రం మెరుపు వేగంతోనే ఏ దిక్కుకైనా తిరగగలదు! (యెహెజ్కేలు 1:1, 14-28) అవును, యెహోవా సంస్థ కూడా దాన్ని నడిపిస్తున్న సర్వశక్తిగల దేవుడిలాగే, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్న పరిస్థితులకు, అవసరాలకు తగ్గట్టు మారుతుంది.
15 అంతలా పరిస్థితికి తగ్గట్టు మారడం, మనుషులకైతే కలలో కూడా జరగని పని. చాలావరకు మనుషులు, వాళ్ల సంస్థలు పరిస్థితులకు తగ్గట్టు మారే బదులు వాళ్లు అనుకున్నదే చేస్తారు, ఒక మెట్టు దిగే బదులు మొండిపట్టు పడతారు. ఉదాహరణకు, సరుకులు రవాణా చేసే పెద్ద ఓడ, లేదా ఒక గూడ్స్ రైలు గురించి ఆలోచించండి. వాటి సైజు, వాటికున్న శక్తి చూస్తే మతిపోతుంది. కానీ పరిస్థితుల్లో ఉన్నట్టుండి ఏదైనా మార్పు వస్తే అవి దిశను మార్చుకోగలవా? ఉదాహరణకు అనుకుందాం, రైలుపట్టాల మీదికి ఏదైనా సడన్‌గా అడ్డొస్తే ఆ గూడ్స్ రైలు మలుపు తిప్పుకోవడం మాట అటుంచితే, కనీసం బ్రేకులు వేయడం కూడా కష్టమే. ఒక భారీ గూడ్స్ రైలు, ఇక్కడ బ్రేకు వేస్తే దగ్గరదగ్గర రెండు కిలోమీటర్ల అవతలకు వెళ్లి ఆగుతుంది! అదేవిధంగా, సరుకులు రవాణా చేసే ఓడ విషయానికొస్తే, ఇంజిన్లు ఇక్కడ ఆపేస్తే అది ఎక్కడో ఎనిమిది కిలోమీటర్ల అవతల ఆగుతుంది. పోనీ రివర్స్ గేర్ వేసినా, ఆ ఓడ కనీసం మూడు కిలోమీటర్లు వెళ్లి ఆగుతుంది! మొండిపట్టు పట్టే మనుషుల సంస్థలు కూడా అంతే. గర్వం వల్ల, మనుషులు మారుతున్న అవసరాలకు, పరిస్థితులకు తగ్గట్టు మారడానికి అంతగా ఇష్టపడరు. ఆ మొండిపట్టు వల్లే చాలా సంస్థలు దివాలా తీశాయి, ఆఖరికి ప్రభుత్వాలే కూలిపోయాయి. (సామెతలు 16:18) యెహోవా గానీ, ఆయన సంస్థ గానీ అలా లేనందుకు మనకెంత సంతోషంగా ఉందో కదా!
యెహోవా పట్టుబట్టడు, అర్థం చేసుకుంటాడు అని ఎలా చూపించాడు?
16. సొదొమ, గొమొర్రాలను నాశనం చేసేముందు యెహోవా లోతు విషయంలో అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఎలా చూపించాడు?
16 సొదొమ, గొమొర్రాల నాశనం గురించి మళ్లీ ఒకసారి ఆలోచించండి. యెహోవా దూత లోతుకు, అతని కుటుంబానికి “కొండ ప్రాంతానికి పారిపో” అని చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ లోతుకు అది నచ్చలేదు. “యెహోవా, దయచేసి నన్ను అక్కడికి పంపించకు!” అని లోతు వేడుకున్నాడు. కొండ ప్రాంతానికి వెళ్తే చనిపోతానని అతను అనుకున్నాడు. అందుకే తాను, తన కుటుంబం దగ్గర్లో ఉన్న సోయరు అనే పట్టణానికి వెళ్తామని లోతు అడిగాడు. నిజానికి, యెహోవా ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. పైగా లోతు భయాలు అర్థంపర్థం లేనివి. ఎందుకంటే, కొండ ప్రాంతంలో యెహోవా ఖచ్చితంగా లోతును కాపాడగలడు! అయినప్పటికీ, యెహోవా లోతు అడిగినదానికి ఒప్పుకుని, ఒక మెట్టు దిగాడు. ఆ దూత లోతుతో ఇలా అన్నాడు: “సరే, నేను నీ విన్నపాన్ని అంగీకరిస్తాను, నువ్వు చెప్తున్న ఆ పట్టణాన్ని నాశనం చేయను.” (ఆదికాండం 19:17-22) నిజంగా యెహోవాకు ఎంత అర్థం చేసుకునే మనసు ఉందో కదా!
17, 18. నీనెవె వాళ్ల విషయంలో యెహోవా అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఎలా చూపించాడు?
17 ఎవరైనా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడితే, యెహోవా తను చేయాలనుకున్నదాన్ని మార్చుకుంటాడు. ఆయన ఎప్పుడూ కరుణ చూపిస్తాడు, సరైనదే చేస్తాడు. యోనా ప్రవక్తను నీనెవె అనే ఒక భయంకరమైన, దారుణమైన నగరానికి పంపించినప్పుడు ఏం జరిగిందో గమనించండి. యోనా నీనెవెలో వీధివీధికి వెళ్లి, దేవుడు చెప్పిన ఈ సందేశాన్ని చాటింపు వేశాడు: నీనెవె మహా నగరం ఇంకో 40 రోజుల్లో నాశనమౌతుంది. కానీ పరిస్థితులు కొత్త మలుపు తీసుకున్నాయి. నీనెవె ఊరివాళ్లు పశ్చాత్తాపపడ్డారు!—యోనా, 3వ అధ్యాయం.
18 అప్పుడు యెహోవా స్పందించిన దానికి, యోనా స్పందించిన దానికి చాలా తేడా ఉంది. ఈ సందర్భంలో యెహోవా వెంటనే ఒక “బలమైన యోధుడి” పాత్ర నుండి, పాపాల్ని క్షమించే వ్యక్తిగా మారిపోయాడు.d (నిర్గమకాండం 15:3) కానీ యోనా మారడానికి, కరుణ చూపించడానికి బొత్తిగా ఇష్టపడలేదు. ఆయన యెహోవాలా మారే బదులు, పైన చెప్పిన గూడ్స్ రైలులా లేదా ఓడలా అలానే ఉండిపోయాడు. నాశనం వస్తుందని చెప్పాను కాబట్టి నాశనం వచ్చి తీరాల్సిందే అని యోనా మొండికేశాడు! ఓర్పులేని ఈ ప్రవక్తకు, యెహోవా గుర్తుండిపోయే పాఠాన్ని చెప్పాడు. మొండిపట్టు పట్టకూడదని, కరుణ చూపించాలని ఓపిగ్గా నేర్పించాడు.—యోనా, 4వ అధ్యాయం.
యెహోవా పట్టుబట్టడు, మన పరిమితుల్ని అర్థం చేసుకుంటాడు
19. (ఎ) యెహోవా మనల్ని అర్థం చేసుకుని, మన నుండి ఎక్కువ అడగడని ఎందుకు నమ్మవచ్చు? (బి) యెహోవా “మంచి” అలాగే “అర్థంచేసుకునే” యజమాని అని, ఆయనకు గొప్ప వినయం ఉందని సామెతలు 19:17 ఎలా చూపిస్తుంది?
19 చివరిగా, యెహోవా మన నుండి ఎక్కువ ఆశించకపోవడంలో కూడా, ఆయనకున్న అర్థం చేసుకునే మనసు కనిపిస్తుంది. దావీదు రాజు ఇలా అన్నాడు: “మనం ఎలా తయారుచేయబడ్డామో ఆయనకు బాగా తెలుసు, మనం మట్టివాళ్లమని ఆయన గుర్తుచేసుకుంటాడు.” (కీర్తన 103:14) మన పరిమితులేంటో, అపరిపూర్ణతలేంటో మనకన్నా బాగా యెహోవాకే తెలుసు. మనం చేయగలిగే దానికన్నా ఎక్కువ ఆయన మన నుండి అడగడు. మనుషుల్లో ‘మంచి యజమానులు, అర్థంచేసుకునే యజమానులే కాదు, కఠినులైన యజమానులు కూడా’ ఉంటారని బైబిలు చెప్తుంది. (1 పేతురు 2:18) ఇంతకీ యెహోవా ఎలాంటి యజమాని? సామెతలు 19:17 ఏం చెప్తుందో చూడండి: “పేదవాళ్ల మీద దయ చూపించేవాడు యెహోవాకు అప్పు ఇస్తున్నాడు.” పేదవాళ్ల కోసం చేసే చిన్న మంచి పనిని కూడా గమనిస్తున్నాడంటే యెహోవా ఎంత మంచివాడో, ఎంత అర్థం చేసుకునే యజమానో దీన్నిబట్టి తెలుస్తుంది. ఈ లేఖనంలో ఇంకో విషయం కూడా ఉంది. అదేంటంటే, ధూళితో సమానమైన మనుషులు ఏదైనా మంచిపని చేస్తే, ఈ విశ్వానికే సృష్టికర్త అయిన యెహోవా వాళ్లకు అప్పు ఉన్నట్టు ఫీల్ అవుతాడు. ఇంతకన్నా గొప్ప వినయం ఉంటుందా?
20. యెహోవా మన ప్రార్థనలు వింటాడని, వాటికి జవాబిస్తాడని ఏంటి గ్యారంటీ?
20 ఇప్పుడు కూడా యెహోవా తన సేవకులతో సౌమ్యంగా ఉంటాడు, అర్థం చేసుకుంటాడు. మనం విశ్వాసంతో ప్రార్థిస్తే, ఆయన వింటాడు. మనం ప్రార్థించినప్పుడు మనతో మాట్లాడడానికి దేవదూతల్ని పంపనంతమాత్రాన, ఆయన మన ప్రార్థనలు వినట్లేదని అనుకోకూడదు. ఒకసారి అపొస్తలుడైన పౌలు ఉదాహరణ గుర్తుచేసుకోండి. ఆయన జైలు నుండి విడుదలయ్యేలా “ప్రార్థిస్తూ” ఉండమని తోటి సహోదర సహోదరీల్ని అడిగాడు. దానివల్ల తాను “ఇంకా త్వరగా” విడుదలై, వాళ్లను కలుసుకోవచ్చని ఆయన అనుకున్నాడు. (హెబ్రీయులు 13:18, 19) అంటే, మనం ఒక విషయం గురించి ప్రార్థించినప్పుడు, దాని విషయంలో యెహోవాకు వేరే ఆలోచన ఉండి ఉండవచ్చు. కానీ, మనం అడిగినందుకు ఆయన కరిగిపోయి మనం అడిగినట్టు చేయవచ్చు!—యాకోబు 5:16.
21. యెహోవా వినయాన్ని మనం ఎలా అపార్థం చేసుకోకూడదు? ఆయన వినయం గురించి మీకేం అనిపిస్తుంది?
21 నిజమే, వినయం వల్ల యెహోవా సౌమ్యంగా ఉంటాడు, చెప్పేది వినడానికి ఇష్టపడతాడు, ఓర్పు చూపిస్తాడు, అర్థం చేసుకుంటాడు. అంతమాత్రాన యెహోవా తన నీతి ప్రమాణాల విషయంలో రాజీ పడిపోతాడని కాదు. క్రైస్తవ మత నాయకులైతే యెహోవా నీతి ప్రమాణాల్ని నీరుగార్చేసి, ప్రజల చెవులకు ఇంపుగా ఉండే మాటలు బోధిస్తూ, అర్థం చేసుకునే మనస్తత్వం చూపిస్తున్నాం అనుకుంటారు. (2 తిమోతి 4:3) కానీ, యెహోవా దృష్టిలో అర్థం చేసుకునే మనస్తత్వం అంటే అది కాదు. ఆయన పవిత్రుడు, ఆయన ఎన్నడూ తన నీతి ప్రమాణాల్ని కల్తీ చేయడు. (లేవీయకాండం 11:44) కాబట్టి, యెహోవాకున్న అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ప్రేమిద్దాం, అది ఆయన వినయానికి రుజువు అని గుర్తిద్దాం. ఈ విశ్వంలోనే ఎంతో తెలివిగలవాడైన యెహోవా, వినయంగా అన్ని మెట్లు దిగి రావడం భలే అనిపిస్తుంది కదా! సౌమ్యత, ఓర్పు, అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న మన దేవుడికి దగ్గరవ్వడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది!
a కొంతమంది శాస్త్రులు లేదా నకలు రాసేవాళ్లు, ఆ వచనంలో కిందికి వంగేది యెహోవా కాదుగానీ, యిర్మీయా అని మార్చేశారు. దేవుడేంటి, కిందికి వంగడమేంటి అని వాళ్లు అనుకుని ఉంటారు. చాలా అనువాదాలు దాన్ని మార్చేయడం వల్ల, ఆ వచనానికి ఉన్న అందమే పోయింది. కానీ ద న్యూ ఇంగ్లీష్ బైబిల్ దాన్ని సరిగ్గా అనువదిస్తూ, యిర్మీయా దేవునికి ఇలా ప్రార్థిస్తున్నట్లు చెప్పింది: “నన్ను గుర్తుచేసుకో, కిందికి వంగి నా దగ్గరికి రా.”
b కొన్ని అనువాదాలు ఆ వచనాన్ని “తెలివి నుండి పుట్టే వినయం” అని, “తెలివికి బండగుర్తు అయిన మృదుత్వం” అని అనువదించాయి.
c ఆసక్తికరంగా, బైబిలు అహంకారానికి వ్యతిరేక పదం ఓర్పు అని చెప్తుంది. (ప్రసంగి 7:8) యెహోవాకున్న ఓర్పు, ఆయన వినయానికి ఇంకొక రుజువు.—2 పేతురు 3:9.
d యెహోవా ‘మంచివాడు, క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు’ అని కీర్తన 86:5 చెప్తుంది. ఆ కీర్తనను గ్రీకులోకి అనువదిస్తున్నప్పుడు, ‘క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు’ అనే దగ్గర ఎపీకీస్ అనే పదాన్ని వాడారు. అంటే “అర్థం చేసుకునేవాడు” అన్నమాట.