వాత్సల్యంతో కూడిన కనికరంగలవారై ఉండండి
“మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును . . . ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:12.
1. కనికరం చూపించాల్సి అవసరం నేడు ఎందుకు ఎక్కువగా ఉంది?
చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా కనికరంతోకూడిన సహాయము నేడు అనేకమంది ప్రజలకు అవసరమౌతోంది. అనారోగ్యము, ఆకలి, నిరుద్యోగం, నేరం, యుద్ధాలు, అరాజకత్వము, మరియు ప్రకృతి వైపరీత్యాలున్న కాలంలో లక్షలాది మందికి సహాయం అవసరం. అయితే అంతకంటే గంభీరమైన సమస్య ఒకటి ఉంది, అదే మానవజాతి ఆత్మీయ దుస్థితి. తనకు సమయం కొంచెమే ఉందని తెలిసిన సాతాను, “సర్వలోకమును మోస పుచ్చుచు”న్నాడు. (ప్రకటన 12:9, 12) కాబట్టి, ప్రత్యేకంగా నిజమైన క్రైస్తవ సంఘానికి వెలుపల ఉన్నవారు తమ జీవాన్ని కోల్పోయే అపాయముంది, మరి రాబోయే దేవుని తీర్పుదినంలో హతమైనవారికి ఎలాంటి పునరుత్థాన నిరీక్షణ లేదని బైబిలు ఖచ్చితంగా చెబుతోంది.—మత్తయి 25:31-33, 41, 46; 2 థెస్సలొనీకయులు 1:6-9.
2. దుష్టులను నాశనం చేయకుండ యెహోవా ఎందుకు ఊరుకున్నాడు?
2 అయినప్పటికీ, ఈ చివరి ఘడియ వరకు కూడ యెహోవా దేవుడు కృతఘ్నులు, దుష్టుల యెడల ఓపికనూ కనికరాన్ని ప్రదర్శిస్తున్నాడు. (మత్తయి 5:45; లూకా 6:35, 36) అవిశ్వాసులైన ఇశ్రాయేలు జనాంగాన్ని శిక్షించడంలో ఆయన ఎందుకు ఆలస్యం చేశాడో అదే కారణాన్ని బట్టి ఆయన దాన్ని చేశాడు. “నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి, ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.”—యెహెజ్కేలు 33:11.
3. తన ప్రజలు కానివారి విషయంలో యెహోవాకు కనికరం ఉందనేందుకు ఏ ఉదాహరణ ఉంది, మరి దీన్నుండి మనం ఏమి నేర్చుకుంటాము?
3 యెహోవా కనికరం దుష్టులైన నీనెవె పట్టణస్థులకు కూడా అందించబడింది. రాబోయే నాశనాన్ని గూర్చి హెచ్చరించేందుకు యెహోవా తన ప్రవక్తైన యోనాను పంపించాడు. యోనా ప్రకటనకు వారు అనుకూలంగా ప్రతిస్పందించి, పశ్చాత్తాపపడ్డారు. కనికరం గల దేవుడైన యెహోవా ఆ పట్టణాన్ని అప్పుడు నాశనం చేయకుండా ఆపేందుకు యిది ఆయనను కదిలించింది. (యోనా 3:10; 4:11) పునరుత్థానమయ్యే అవకాశమున్న నీనెవె పట్టణస్థుల విషయంలోనే దేవుడు జాలిపడితే, నిత్య నాశనాన్ని ఎదుర్కొంటున్న ప్రజల విషయంలో ఆయన యింకెంత కనికరాన్ని కల్గివుండాలి!—లూకా 11:32.
కనికరంతోకూడిన ఎనలేని పని
4. నేడు యెహోవా ప్రజలకు కనికరాన్ని ఎలా కనపరుస్తున్నాడు?
4 తన కనికరంగల వ్యక్తిత్వానికి అనుగుణంగా, “రాజ్య సువార్త”తో తమ పొరుగువారిని కలుస్తూ ఉండాలనే ఒక ఆజ్ఞను యెహోవా తన సాక్షులకు యిచ్చాడు. (మత్తయి 24:14) మరి జీవాన్ని రక్షించే ఈ పని యెడల ప్రజలు మెప్పుదలతో ప్రతిస్పందించినప్పుడు, రాజ్య వర్తమానాన్ని గ్రహించేలా యెహోవా వారి హృదయాలను తెరుస్తాడు. (మత్తయి 11:25; అపొస్తలుల కార్యములు 16:14) నిజమైన క్రైస్తవులు తమ దేవున్ని అనుకరిస్తూ, ఆసక్తి గలవారిని తిరిగి సందర్శిస్తూ అవసరమైన చోటల్లా బైబిలు పఠనం ద్వారా వారికి సహాయపడడం ద్వారా వాత్సల్యంతో కూడిన కనికరాన్ని కనపరుస్తారు. ఆ విధంగా, 1993లో 231 దేశాల్లో 45 లక్షలకంటే ఎక్కువ మంది యెహోవాసాక్షులు యింటింటి పరిచర్యలో అలాగే తమ పొరుగువారితో బైబిలు పఠించడంలో వంద కోట్ల కంటే ఎక్కువ గంటలు గడిపారు. దానికి ప్రతిస్పందిస్తూ కొత్తగా ఆసక్తి చూపుతున్న ఈ వ్యక్తులు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మము పొందిన ఆయన సేవకుల జాబితాలో చేరే అవకాశాన్ని కల్గివుంటారు. ఆ విధంగా, మృతినొందే సాతాను లోకపు ఉచ్చులో యింకా చిక్కుకుని ఉండి భవిష్యత్తులో శిష్యులయ్యే అవకాశమున్న వీరి యెడల కనికరంతో కూడిన అపూర్వమైన పనిని చేసే బాధ్యతను వారు కూడా గైకొంటారు.—మత్తయి 28:19, 20 యోహాను 14:12.
5. దైవిక కనికరం దాని ఉచ్చస్థాయికి చేరుకున్నప్పుడు, దేవునికి అనుచితంగా ప్రాతినిధ్యం వహించే మతానికి ఏమి సంభవిస్తుంది?
5 త్వరలోనే యెహోవా “యుద్ధశూరు”నిగా వ్యవహరిస్తాడు. (నిర్గమకాండము 15:3) తన నామం యెడల, తన ప్రజల యెడల కటాక్షం గలవాడై, ఆయన దుష్టత్వాన్ని తీసివేసి ఓ నీతియుక్త నూతన లోకాన్ని స్థాపిస్తాడు. (2 పేతురు 3:13) క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చీలు దేవుని ఉగ్రతా దినాన్ని మొట్ట మొదట అనుభవిస్తాయి. యెహోవా తన స్వంత ఆలయాన్ని సహితం బబులోను రాజు చేతిలోనుండి రక్షించకుండా ఉండడం ద్వారా ఎలా విడిచిపెట్టలేదో, అలాగే తనకు తప్పుడు ప్రాతినిధ్యం వహించిన మత సంస్థలను కూడా విడిచిపెట్టడు. క్రైస్తవమత సామ్రాజ్యాన్ని, యితర రూపాల్లో ఉన్న దాని మతాలన్నింటినీ నాశనం చేయాలని దేవుడు ఐక్యరాజ్య సమితి సభ్యుల మనస్సులో పెడతాడు. (ప్రకటన 17:16, 17) “కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసెదను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.—యెహెజ్కేలు 9:5, 10.
6. ఏయే విధాల్లో యెహోవాసాక్షులు కనికరాన్ని కనపర్చేందుకు కదిలించబడ్డారు?
6 ఇంకా సమయముంది గనుక, దేవుని రక్షణ సమాచారాన్ని తమ పొరుగువారికి ఆసక్తితో ప్రకటించడం ద్వారా యెహోవాసాక్షులు కనికరాన్ని కనపరుస్తూ ఉంటారు. సహజంగా, సాధ్యమైనప్పుడెల్లా వస్తుపరమైన అవసరతల్లో ఉన్న ప్రజలకు కూడా వారు సహాయపడతారు. ఈ విషయంలో, తమ సన్నిహిత కుటుంబ సభ్యులకూ తమకు విశ్వాసంలో సంబంధులైనవారికి శ్రద్ధ కనపర్చడం వారి ప్రధమ బాధ్యత. (గలతీయులు 6:10; 1 తిమోతి 5:4, 8) వివిధ వైపరీత్యాలను ఎదుర్కొన్న తమ తోటి విశ్వాసుల కొరకు యెహోవాసాక్షులు గైకొనే అనేక పునరావాస చర్యలు కనికరానికి చక్కటి ఉదాహరణలుగా ఉన్నాయి. అయినప్పటికీ, క్రైస్తవులు కనికరాన్ని చూపేందుకు ఒక అపాయం కొరకు ఎదురుచూడనవసరం లేదు. ప్రతి దిన జీవితంలోని ఎత్తుపల్లాలతో వ్యవహరించడంలో వారు వెంటనే మంచి లక్షణాన్ని కనపరుస్తారు.
నూతన స్వభావంలో ఒక భాగం
7. (ఎ) కొలొస్సయులు 3:8-13 నందు నవీన స్వభావానికి కనికరం ఎలా జతచేయబడింది? (బి) క్రైస్తవులు దేన్ని సులభంగా చేసేందుకు కనికరం దోహదపడుతుంది?
7 మన పాపభూయిష్ట తత్వం, సాతాను లోకపు చెడు ప్రభావం మనం కనికరం గలవారిగా ఉండేందుకు అడ్డంకులుగా ఉన్నాయన్నది నిజం. అందుకనే, “కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, . . . బూతుల” నుండి దూరంగా ఉండాలని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. మనం దేవుని ప్రతిరూపమని రూఢిపర్చే ‘నవీన స్వభావమును ధరించుకోవాలనే’ సలహా మనకు యివ్వబడుతోంది. మొట్ట మొదటిగా, ‘జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొమ్మనే’ ఆజ్ఞ మనకు యివ్వబడింది. ఆ తర్వాత, ఈ లక్షణాలను కనపర్చేందుకు బైబిలు ఆచరణాత్మకమైన విధానాన్ని చూపుతోంది. “ఎవడైనను హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” మనం మన సహోదరుల యెడల ‘కనికరాన్ని’ పెంపొందించుకున్నట్లైతే, క్షమించడం ఎంతో సులభమౌతుంది.—కొలొస్సయులు 3:8-13.
8. క్షమించే ఆత్మను కల్గివుండడం ఎందుకు ప్రాముఖ్యము?
8 మరోవైపు, కనికరంతో కూడిన క్షమాగుణాన్ని కనపర్చడంలో తప్పిపోవడం యెహోవాతో మనకుగల సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ఒక యజమాని, “అచ్చియున్నదంతయు చెల్లించు వరకు” క్షమాగుణంలేని దాసుని బంధించాడని యేసు చెప్పిన ఉపమానంలో, ఆయన దీన్ని ప్రభావవంతంగా చూపాడు. ఆ దాసునికి ఈ శిక్ష తగినదే ఎందుకంటే ఆశ్చర్యకరంగా, దయజూపమని వేడుకున్న తనతోటి సేవకుని యెడల కనికరం చూపించడంలో అతను విఫలుడయ్యాడు. “మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయును” అంటూ యేసు ఆ ఉపమానాన్ని ముగించాడు.—మత్తయి 18:34, 35.
9. నవీన స్వభావం అనే అతి ప్రాముఖ్యమైన విషయానికి కనికరం ఎలా సంబంధాన్ని కల్గివుంది?
9 కనికరం కల్గివుండడం ప్రేమ కనపర్చడంలో ప్రాముఖ్యమైన విషయం. నిజమైన క్రైస్తవత్వానికి ప్రేమ ఒక గుర్తింపు చిహ్నం. (యోహాను 13:35) కాబట్టి, నవీన స్వభావాన్ని గూర్చిన బైబిలు వివరణ యీ నిర్ణయానికొచ్చింది: “వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:14.
మత్సరం—కనికరం కనపర్చేందుకు ఓ అడ్డు
10. (ఎ) మన హృదయంలో మత్సరం నాటుకునేందుకు ఏది కారణం కాగలదు? (బి) మత్సరం వల్ల ఏ చెడు ఫలితాలు రావచ్చు?
10 మన పాపభూయిష్ట మానవ తత్వంవల్ల, మత్సర భావాలు మన హృదయాల్లో సులభంగా చోటు చేసుకోగలవు. ఓ సహోదరుడు లేక సహోదరి మనకు లేని వ్యక్తిగత సామర్థ్యాలతో లేక వస్తుపర ప్రయోజనాలతో ఆశీర్వదించబడి ఉండవచ్చు. లేక ఒకరు ఆత్మీయ ఆశీర్వాదాలనో లేక ఆధికత్యలనో పొంది ఉండవచ్చు. మనం అలాంటి వారిని చూసి వ్యసనపడినట్లైతే, వారితో మనం కనికరంగా వ్యవహరించగలమా? బహుశ వ్యవహరించలేము. వాస్తవానికి, వ్యంగ్య మాటల్లో లేక దయలేని క్రియల్లో మత్సర భావాలు చివరికి తమ రూపాన్ని వెళ్ళగక్కగలవు, ఎందుకంటే మానవులను గూర్చి యేసు యిలా అన్నాడు: “హృదయము నిండినదానిని బట్టి నోరు పలుకును.” (లూకా 6:45) ఇతరులు, విమర్శించే అలాంటి స్వభావానికి మద్దతునివ్వవచ్చు. ఆ విధంగా కుటుంబంలోని లేక దేవుని ప్రజల సంఘంలోని శాంతి భంగపర్చబడగలదు.
11. యోసేపు పది మంది అన్నలూ ఎలా తమ హృదయాల్లో కనికరానికి స్థానంలేకుండా చేసుకున్నారు, మరి దాని ఫలితమేమిటి?
11 ఒక పెద్ద కుటుంబంలో జరిగిన విషయాన్ని పరిశీలించండి. యాకోబు పది మంది పెద్ద కుమారులు తమ చిన్న తమ్ముడైన యోసేపు విషయంలో మత్సరపడ్డారు కారణం ఏమిటంటే, అతను తమ తండ్రికి ప్రియ కుమారుడు. తత్ఫలితంగా, వారు “అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.” తర్వాత, తనపై యెహోవా మెప్పు ఉందని నిరూపిస్తూ యోసేపు దైవిక కలలతో ఆశీర్వదింపబడ్డాడు. అది “వారు అతనిమీద మరి పగపట్ట”డానికి కారణమైంది. వారు తమ హృదయాల్లో నుండి ఆ వ్యసన భావాన్ని తీసేసుకోలేదు గనుక, అది కనికరానికి తావివ్వకుండ ఘోరపాపం చేయడానికి దారితీసింది.—ఆదికాండము 37:4, 5, 11.
12, 13. మన హృదయంలో మత్సర భావాలు చోటు చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి?
12 క్రూరంగా, వారు యోసేపును దాసత్వంలోకి అమ్మేశారు. తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా, వారు యోసేపును ఒక క్రూరమృగం చంపిందని భావించేలా తమ తండ్రికి భ్రమ కలిగించారు. సంవత్సరాల తర్వాత కరువు కలగడం చేత బలవంతం మీద వారు ఐగుప్తుకు వెళ్లి, అక్కడ నుండి ఆహారం కొనుక్కోవల్సి వచ్చినప్పుడు తమ పాపం బయటపడింది. ఆహార యజమాని యోసేపు అని వారు గుర్తుపట్టలేదు. వారిని వేగులవారని నిందించి, మరోసారి తమకు సహాయం కావాలంటే తమ చిన్న తమ్ముడైన బెన్యామీను తీసుకు రావాలని చెప్పాడు. ఆ సమయానికి బెన్యామీను తన తండ్రి ప్రియ కుమారుడయ్యాడు, అంతేకాకుండ యాకోబు అతన్ని పంపేందుకు యిష్టపడడని వారికి తెలుసు.
13 కనుక యోసేపు ముందు నిలుచున్నప్పుడు, వారి మనఃస్సాక్షి వారు యిలా ఒప్పుకునేలా కదిలించింది: “నిశ్చయముగా మన సహోదరుని [యోసేపు] యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెను.” (ఆదికాండము 42:21) కనికరంతో కూడినవైనప్పటికీ తన స్థిర వ్యవహారాల ద్వారా యోసేపు తన సహోదరులు తమ పశ్చాత్తాపం యొక్క సత్యత్వాన్ని నిరూపించుకునేందుకు సహాయపడ్డాడు. అప్పుడు అతను వారికి తానెవరనే విషయాన్ని బయల్పర్చి, వారిని ఉదారంగా క్షమించాడు. కుటుంబ ఐక్యత పునఃస్థాపితమైంది. (ఆదికాండము 45:4-8) క్రైస్తవులుగా, దీన్నుండి మనం ఓ పాఠాన్ని నేర్చుకోవాలి. మత్సరం తీసుకువచ్చే చెడు పరిణామాలను తెలుసుకుని, మన మత్సర భావాల స్థానే ‘జాలియు కనికరమును’ ఉంచేందుకు సహాయపడమని మనం యెహోవాకు ప్రార్థించాలి.
కనికరం విషయంలో యితర అడ్డంకులు
14. అనవసరపు దౌర్జన్యపూరితమైన వాతావరణంలో ఉండడాన్ని మనమెందుకు నివారించాలి?
14 మనం కనికరం కనపర్చకుండేలా చేసే మరో అడ్డంకు, అనవసరంగా మనకైమనమే దౌర్జన్యంతో కూడిన వాతావరణంలో ఉండడం. దౌర్జన్యపూరితమైన క్రీడలూ వినోదం హింసను హెచ్చిస్తాయి. బైబిలు కాలంలో, అన్యమతానికి చెందినవారు మానవులూ లేక జంతువులతో జరిపే పోటీలనూ యితర విధాలైన మానవ హింసనూ రోమా సామ్రాజ్య మందలి మైదానాల్లో చూసేవారు. ఒక చరిత్రకారుని ప్రకారం అలాంటి వినోదం, “జంతువులనుండి మానవుని వేరుపర్చే కనికర భావాలను నాశనం చేసింది.” నేటి ఆధునిక లోకంలోని వినోదానికి కూడా అదే ప్రభావం ఉంది. కనికరం కనపర్చేందుకు ప్రయత్నించే క్రైస్తవులు, చదివే విషయంలో, సినిమాలూ దూరదర్శిని కార్యక్రమాల విషయంలో ఎంతో శ్రేష్ఠమైన ఎంపికను చేసుకోవల్సిన అవసరం ఉంది. వారు కీర్తన 11:5లో ఉన్న విషయాన్ని జ్ఞానయుక్తంగా మనస్సులో ఉంచుకుంటారు: “దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు [యెహోవాకు] అసహ్యులు.”
15. (ఎ) గంభీరమైన కనికరలేమిని ఒక వ్యక్తి ఎలా ప్రదర్శించగలడు? (బి) నిజమైన క్రైస్తవులు తమ తోటి విశ్వాసులకు, పొరుగువారికి గల అవసరతల విషయంలో ఎలా ప్రతిస్పందిస్తారు?
15 స్వార్థపరునికి కూడా కనికరం ఉండదు. అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నట్లుగా యిది గంభీరమైన విషయం: “ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?” (1 యోహాను 3:17) స్నేహపూర్ణుడైన సమరయుని గూర్చిన యేసు ఉపమానంలో అలాంటి కనికర లేమినే స్వనీతిపరులైన యాజకులు, లేవీయులు కనపర్చారు. కొన ఊపిరితోనున్న తమ యూదా సహోదరుని బాధను చూసి, వారు రోడ్డుకు మరో వైపుకు వెళ్లి అలా వెళ్లిపోయారు. (లూకా 10:31, 32) దానికి విరుద్ధంగా, కనికరం గల క్రైస్తవులు తమ సహోదరుల వస్తుపరమైన, మరియు ఆత్మీయావసరతల యెడల త్వరగా ప్రతిస్పందిస్తారు. యేసు ఉపమానంలోని సమరయునిలా, తమకు పరిచయంలేని వారి యెడల కూడా వారు శ్రద్ధ కల్గివుంటారు. అందుకే వారు శిష్యులను తయారుచేసే పనిలో తమ సమయాన్ని, శక్తిని, ధనాన్ని ఆనందంగా వెచ్చిస్తారు. ఈ విధంగా వారు లక్షలాది మంది రక్షణకు దోహదపడతారు.—1 తిమోతి 4:16.
అనారోగ్యంతో ఉన్నవారి యెడల కనికరం
16. అనారోగ్యాన్ని అనుభవిస్తున్న వారితో వ్యవహరించాల్సినప్పుడు మనం ఏ పరిమితులను ఎదుర్కొంటాము?
16 మరణిస్తున్న మానవజాతికి అనారోగ్యం అనివార్యమైనది. క్రైస్తవులు కూడా దీనికి అతీతం కాదు, వీరిలో అనేకులు వైద్య వృత్తిలో ఉన్నవారు కారు, లేక క్రీస్తు నుండి మరియు ఆయన అపొస్తలుల నుండి శక్తిని పొందిన తొలి క్రైస్తవులలా వారు ఏ అద్భుతాలనూ చేయలేరు. క్రీస్తు అపొస్తలులు మరియు వారి తర్వాతి సహవాసులు చనిపోవడంతో, అలాంటి అద్భుతమైన శక్తులు కూడా పోయాయి. కనుక శారీరక బాధను అనుభవిస్తున్న వారికి అంటే, మెదడు పనిచేయకపోవడం, మతిభ్రమించడం వంటివాటిని అనుభవించే వారికి కూడా సహాయపడే విషయంలో మన సామర్థ్యం పరిమితమైంది.—అపొస్తలుల కార్యములు 8:13, 18; 1 కొరింథీయులు 13:8.
17. అస్వస్థతను అనుభవిస్తూ తన ప్రియమైన వారిని కోల్పోయిన యోబుతో వ్యవహరించబడిన విధానం నుండి మనం ఏమి నేర్చుకుంటాము?
17 తరచూ అనారోగ్యం వెంబడి కృంగుదల ఉంటుంది. ఉదాహరణకు, దేవునికి భయపడే యోబు తీవ్రమైన అనారోగ్యం వల్ల, అంతేకాకుండ సాతాను తన మీదికి తీసుకువచ్చిన ఉపద్రవాలవల్ల చాలా కృంగిపోయాడు. (యోబు 1:18, 19; 2:7; 3:3, 11-13) “ధైర్యపర”చే మాటలు మాట్లాడుతూ కనికరంగా వ్యవహరించే స్నేహితులు అతనికి అవసరమయ్యారు. (1 థెస్సలొనీకయులు 5:14) అలా కాకుండ, ఓదార్పునిస్తామంటూ వచ్చిన ముగ్గురు ఆయనను సందర్శించి త్వరపడి ఆయన విషయంలో తప్పుడు నిర్ణయాలు చేశారు. ఆయనకు వచ్చిన ఉపద్రవాలు ఆయన చేసిన తప్పువల్లనే వచ్చాయని చెప్పి యోబు కృంగిన స్థితిపై మరికాస్త కారం జల్లారు. కనికరం కల్గివుండడం వల్ల, క్రైస్తవులు తమ తోటివారు అనారోగ్యంగా ఉన్నా, కృంగిపోయినప్పుడు అలాంటి తప్పును చేయకుండా జాగ్రత్తపడతారు. కొన్నిసార్లు, వారికి అవసరమయ్యే ముఖ్యమైన విషయమేమిటంటే, కనికరంతో విని, అర్థంచేసుకుని, ప్రేమపూర్వకమైన లేఖానాధార సలహాను యివ్వగల పెద్దలు లేక యితర పరిపక్వత గల సహోదరులు చేసే కొన్ని దయగల సందర్శనాలే.—రోమీయులు 12:15; యాకోబు 1:19.
బలహీనుల యెడల కనికరం
18, 19. (ఎ) బలహీనులతో లేక తప్పుచేసిన వారితోను పెద్దలు ఎలా వ్యవహరించాలి? (బి) న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేయవల్సివచ్చినప్పుడు కూడా, తప్పుచేసిన వారి యెడల పెద్దలు కనికరంతో వ్యవహరించడం ఎందుకు ప్రాముఖ్యము?
18 ప్రత్యేకంగా, పెద్దలు కనికరం గలవారై ఉండాలి. (అపొస్తలుల కార్యములు 20:29, 35) “బలవంతులమైన మనము . . . బలహీనుల దౌర్భల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము” అని బైబిలు ఆజ్ఞాపిస్తుంది. (రోమీయులు 15:1) అపరిపూర్ణులం గనుక మనమందరమూ తప్పులను చేస్తుంటాము. (యాకోబు 3:2) “ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన” వారితో వ్యవహరించేటప్పుడు వాత్సల్యపూరితంగా ఉండడం అవసరం. (గలతీయులు 6:1) దేవుని ధర్మశాస్త్రాన్ని అన్వయించడంలో సహేతుకత కనపర్చని స్వనీతిపరులైన పరిసయ్యుల్లా ఉండాలని పెద్దలు ఎన్నడూ కోరుకోరు.
19 బదులుగా, యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తుల కనికరపు మంచి మాదిరిని పెద్దలు అనుసరిస్తారు. దేవుని మందను పోషించి, ప్రోత్సహించి ఉపశమనాన్ని కలుగజేయడమే వారి ముఖ్యమైన పని. (యెషయా 32:1, 2) అనేకమైన నియమాలతో విషయాలను అదుపులో ఉంచేందుకు ప్రయత్నించే బదులు, వారు దేవుని వాక్యంలోని చక్కటి సూత్రాలను సూచిస్తారు. కాబట్టి, నిర్మాణాత్మకంగా ఉండడం, తమ సహోదరుల హృదయాల్లో యెహోవా మంచితనాన్ని గూర్చిన ఆనందాన్ని మరియు మెప్పుదలను పెంపొందింపజేయడమే పెద్దల పనియైయుండాలి. తోటి విశ్వాసులు ఏదైనా చిన్న తప్పు చేస్తే, పెద్ద యితరుల ముందు అతన్ని గద్దించడాన్ని సామాన్యంగా నివారిస్తాడు. మాట్లాడడం అంత అవసరమైతే, ఆ వ్యక్తిని ప్రక్కకు తీసుకువెళ్లి ఎవ్వరూ వినకుండ పెద్ద ఆ సమస్యను చర్చించేటట్లు కనికరం అతన్ని కదిలిస్తుంది. (మత్తయి 18:15 పోల్చండి.) ఒకరితో సర్దుకుపోవడం ఎంత కష్టమైనప్పటికీ, ఆ పెద్ద వారితో మాట్లాడే విధానం ఓపికతో కూడినదై సహాయకరంగా ఉండాలి. అలాంటి వారిని సంఘం నుండి వెలివేసేందుకు కారణాలను వెతకాలని ఆయన ఎన్నడూ కోరుకోడు. న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేయవల్సి వచ్చినప్పుడు కూడా, గంభీరమైన తప్పిదం చేసిన వ్యక్తితో వ్యవహరించేటప్పుడు పెద్దలు కనికరాన్ని కనపరుస్తారు. వారి వాత్సల్యం ఆ వ్యక్తి పశ్చాతాపపడేటట్లు చేయవచ్చు.—2 తిమోతి 2:24-26.
20. కనికరానికి సంబంధించి భావోద్రేకమైన భావాలను వ్యక్తపర్చడం ఎప్పుడు అనుచితం, మరియు ఎందుకు?
20 అయితే, యెహోవా సేవకుడు కనికరాన్ని చూపించలేని కొన్ని సమయాలున్నాయి. (ద్వితీయోపదేశకాండము 13:6-9 పోల్చండి.) బహిష్కరించబడిన తమ సన్నిహిత స్నేహితునితో లేక సంబంధితో “సాంగత్యము చేయ”కుండా ఉండడం ఓ క్రైస్తవునికి నిజంగా ఓ పరీక్షగా ఉండవచ్చు. అలాంటి సందర్భంలో ఒకరు జాలిగల భావాలకు తావివ్వకుండా ఉండడం ప్రాముఖ్యం. (1 కొరింథీయులు 5:11-13) అలాంటి దృఢత్వం తప్పు చేసినవాడు పశ్చాత్తాపడేందుకు ప్రోత్సహించవచ్చు. అంతేకాకుండ, స్త్రీపురుషులు ఒకరితో ఒకరు వ్యవహరించేటప్పుడు, కనికరాన్ని చూపించడంలో లైంగిక దుర్నీతికి దారితీయ గల అనుచితమైన క్రియలను క్రైస్తవులు నివారించాలి.
21. ఏ యితర సందర్భాల్లో మనం కనికరాన్ని కనపర్చాల్సిన అవసరముంది, దానివల్ల వచ్చే ప్రయోజనాలేమిటి?
21 వయస్సుమళ్లినవారితో అలాగే, తమ ప్రియమైన వారిని మరణమందు కోల్పోయినవారితో, అవిశ్వాసులైన తమ జీవిత భాగస్వామి నుండి వచ్చే హింసను అనుభవిస్తున్నప్పుడు కనికరం చూపడం అవసరమైన అలాంటి అనేక రంగాలను మనం చర్చించేందుకు చోటు సరిపోదు. కష్టపడి పనిచేసే పెద్దల యెడల కూడా అలాగే కనికరంతో వ్యవహరించాలి. (1 తిమోతి 5:17) వారిని గౌరవించి వారికి మద్దతునివ్వండి. (హెబ్రీయులు 13:7, 17) “మీరందరూ, . . . కరుణాచిత్తులు . . . నైయుండుడి” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 పేతురు 3:8) అది అవసరమైన అన్ని సందర్భాల్లోనూ ఈ విధంగా వ్యవహరించడం ద్వారా, మనం సంఘంలో ఐక్యతనూ ఆనందాన్ని పెంచగలము అంతేకాక యితరులను సత్యంవైపు ఆకర్షించగలము. అన్నిటికంటే ముఖ్యంగా దీని వల్ల కనికరం గల మన తండ్రియైన యెహోవాను మనం గౌరవించినవారమౌతాము.
పునఃసమీక్షలోని ప్రశ్నలు
◻ పాపభూయిష్ట మానవజాతి యెడల యెహోవా కనికరాన్ని ఎలా కనపరుస్తాడు?
◻ కనికరం కల్గివుండడం ఎందుకు ప్రాముఖ్యం?
◻ మనం కనికరంకల్గి ఉండకుండేటట్లు చేసే కొన్ని అడ్డంకులేవి?
◻ అనారోగ్యంతో ఉన్నవారితోను, కృంగినవారితోను మనం ఎలా వ్యవహరించాలి?
◻ ఎవరు ప్రత్యేకంగా కనికరాన్ని కల్గివుండాలి, ఎందుకు?
[19వ పేజీలోని బాక్సు]
కనికరంలేని పరిసయ్యులు
దేవుని ప్రజలకు సబ్బాతు దినం అంటే, ఆత్మీయ శారీరక ఆశీర్వాదాల కొరకైన దినంగా ఉండేది. అయితే యూదా మత నాయకులు దేవుని సబ్బాతు నియమాన్ని అగౌరవపర్చిన అనేక నియమాలను తయారు చేశారు అంతేకాకుండా అవి ప్రజలకు భారమయ్యేలా చేశారు. ఉదాహరణకు, ఎవరికైనా ప్రమాదం సంభవించినా లేక అస్వస్థతను అనుభవిస్తే, అతని ప్రాణం అపాయంలో ఉంటే తప్ప సబ్బాతునాడు అతను ఏ సహాయాన్ని పొందలేడు.
పరిసయ్యుల్లో ఒక గుంపు, సబ్బాతు నియమాన్ని అన్వయించడంలో ఎంత కఠినంగా ఉందంటే, అది యిలా చెప్పింది: “సబ్బాతునాడు, ఏడ్చేవారిని ఎవరూ ఓదార్చరు లేక ఎవరూ రోగులను దర్శించరు.” ఇతర మత నాయకులు సబ్బాతు నాడు అలాంటి దర్శనాలను అనుమతించినప్పటికీ, “కన్నీళ్లు కార్చరాదు” అని ఖండితంగా చెప్పారు.
కనుక, న్యాయం, ప్రేమ, కనికరం వంటి ధర్మశాస్త్రపు ప్రాముఖ్యమైన ఆవశ్యకతలను అలక్ష్యంచేసిన యూదా మత నాయకులను యేసు సరిగ్గానే ఖండించాడు. ఆయన పరిసయ్యులతో, “మీరు . . . పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు” అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు!—మార్కు 7:8, 13; మత్తయి 23:23; లూకా 11:42.
[17వ పేజీలోని చిత్రం]
ప్రజల గృహాల్లో, వీధుల్లో, జైళ్ళల్లో సహితం యెహోవాసాక్షులు 231 దేశాల్లో కనికరాన్ని కనపర్చే అపూర్వమైన పనిని కొనసాగిస్తున్నారు
[18వ పేజీలోని చిత్రం]
దూరదర్శని వంటి వాటిలో దౌర్జన్యాన్ని చూడడం కనికరాన్ని తగ్గిస్తుంది