కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • cl అధ్యా. 25 పేజీలు 250-259
  • ‘మన దేవుని గొప్ప కనికరం’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘మన దేవుని గొప్ప కనికరం’
  • యెహోవాకు దగ్గరవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కనికరం అంటే ఏంటి?
  • యెహోవా ఒక జనాంగం మీద కనికరం చూపించిన వేళ
  • యెహోవా ఒక్కొక్కరి మీద కనికరం చూపించిన వేళ
  • యెహోవా కనికరం చూపించడం ఆపేసిన వేళ
  • యెహోవాలా కనికరం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • వాత్సల్యంతో కూడిన కనికరంగలవారై ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “కరుణాచిత్తులై” ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెహోవా కనికరముతో పరిపాలిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
యెహోవాకు దగ్గరవ్వండి
cl అధ్యా. 25 పేజీలు 250-259
ఒక స్త్రీ ముఖంలో ఆప్యాయత ఉట్టిపడుతుంది.

అధ్యాయం 25

‘మన దేవుని గొప్ప కనికరం’

1, 2. (ఎ) బిడ్డ ఏడుస్తుంటే తల్లి మామూలుగానే ఏం చేస్తుంది? (బి) తల్లి చూపించే కనికరం కంటే గొప్ప కనికరం ఏంటి?

అర్ధరాత్రి చిన్న బాబు ఏడుస్తున్నాడు. అది విన్న మరుక్షణమే వాళ్ల అమ్మ లేస్తుంది. ఆమె ఇదివరకు బాగానే పడుకునేది, కానీ బాబు పుట్టిన దగ్గర నుండి సరిగ్గా నిద్రపోవడం లేదు. బిడ్డ ఏడ్పును బట్టి వాడికి ఏం కావాలో ఆమెకు అర్థమౌతుంది. అందుకే ఆ బాబు పాల కోసం ఏడుస్తున్నాడా, ఎత్తుకోమని ఏడుస్తున్నాడా, లేదా వేరే దేని కోసం ఏడుస్తున్నాడు అనేది ఆమె ఇట్టే చెప్పేయగలదు. అయితే ఆ బాబు దేనికోసం ఏడ్చినా, ఆమె వెంటనే స్పందిస్తుంది. బిడ్డ మీద ఉన్న కనికరం వల్ల, వాడిని పట్టించుకోకుండా మాత్రం ఉండదు.

2 మనుషుల దృష్టిలో, ఒక తల్లి తన కడుపున పుట్టిన బిడ్డ మీద చూపించేదే గొప్ప కనికరం. కానీ, అంతకుమించి ఎన్నోరెట్లు గొప్ప కనికరం ఇంకొకటి ఉంది. అది మన దేవుడైన యెహోవా చూపించే కనికరం. ఆకట్టుకునే ఆ లక్షణం గురించి తెలుసుకుంటే, మనం యెహోవాకు ఇంకా దగ్గరౌతాం. కాబట్టి ఇప్పుడు కనికరం అంటే ఏంటో, దాన్ని మన దేవుడు ఎలా చూపిస్తాడో తెలుసుకుందాం.

కనికరం అంటే ఏంటి?

3. “కరుణ చూపించడం” లేదా “జాలిపడడం” అని అనువదించిన హీబ్రూ పదానికి అర్థం ఏంటి?

3 బైబిల్లో కనికరానికి, కరుణకు చాలా దగ్గరి సంబంధం ఉంది. గొప్ప కనికరం గురించి చెప్పడానికి హీబ్రూలో, గ్రీకులో బోలెడన్ని పదాలు ఉన్నాయి. ఉదాహరణకు, రాకామ్‌ అనే హీబ్రూ పదాన్నే తీసుకోండి. దాన్ని చాలావరకు “కరుణ చూపించడం” లేదా “జాలిపడడం” అని అనువదించారు. ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తున్నట్టు, రాకామ్‌ అంటే “మనకు ఇష్టమైనవాళ్లు లేదా మన సహాయం అవసరమైనవాళ్లు బలహీనంగా ఉన్నా లేదా బాధలో ఉన్నా, అది చూసినప్పుడు మన మనసు లోతుల్లో కలిగే కనికరం.” తనకు ఎలా అనిపిస్తుందో చెప్పడానికి యెహోవా ఆ హీబ్రూ పదాన్నే ఉపయోగించాడు. దానికీ, “గర్భం” అనే పదానికీ చాలా దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి, దాన్ని “తల్లి చూపించే లాంటి కనికరం” అని కూడా చెప్పవచ్చు.a—నిర్గమకాండం 33:19; యిర్మీయా 33:26.

తన బిడ్డను గుండెకు హత్తుకున్న ఒక తల్లి.

“స్త్రీ . . . తన కడుపున పుట్టిన బిడ్డ మీద కనికరం చూపించకుండా ఉంటుందా?”

4, 5. బిడ్డ మీద తల్లికి ఉండే ఫీలింగ్స్‌ని ఉపయోగించుకుని, బైబిలు మనకు యెహోవా కనికరం గురించి ఎలా నేర్పిస్తుంది?

4 బిడ్డ మీద తల్లికి ఉండే ఫీలింగ్స్‌ని ఉపయోగించుకుని, బైబిలు మనకు యెహోవా కనికరం గురించి నేర్పిస్తుంది. యెషయా 49:15 లో ఇలా చదువుతాం: “స్త్రీ, పాలుతాగే తన చంటిబిడ్డను మర్చిపోతుందా? తన కడుపున పుట్టిన బిడ్డ మీద కనికరం [రాకామ్‌] చూపించకుండా ఉంటుందా? వాళ్లయినా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను ఎన్నడూ మర్చిపోను.” మనసుకు తాకే ఆ మాటలు, యెహోవాకు తన ప్రజల మీద ఎంత కనికరం ఉందో చూపిస్తున్నాయి. ఎలా?

5 బిడ్డ ఆలనాపాలనా చూసుకోకుండా గాలికి వదిలేసే తల్లిని మనం ఊహించుకోలేం. ఎంతైనా, ఒక పసిబిడ్డకు ఇంకొకరి సహాయం అవసరమౌతుంది. పగలు-రాత్రి అనే తేడా లేకుండా బిడ్డకు ఎప్పుడూ తల్లి సహాయం, అనురాగం అవసరం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, పిల్లల్ని వదిలేసే తల్లుల గురించి ఈ మధ్య వింటున్నాం. మరిముఖ్యంగా, ప్రమాదకరమైన ‘చివరి రోజుల్లో మమకారం లేనివాళ్లు’ ఉంటారు. (2 తిమోతి 3:1, 3) అయితే, యెహోవా ఇలా అంటున్నాడు: “నేను మాత్రం నిన్ను ఎన్నడూ మర్చిపోను.” యెహోవాకు తన సేవకుల మీద ఉన్న గొప్ప కనికరం ఎప్పటికీ చెక్కుచెదరదు. మనకు తెలిసినంతవరకు ప్రపంచంలో అన్ని ఫీలింగ్స్‌ కన్నా గొప్పది, ఒక తల్లికి సహజంగా తన బిడ్డ మీద ఉండే కనికరమే. అయితే, యెహోవా కనికరం దానికన్నా ఎన్నోరెట్లు గొప్పది. అందుకే యెషయా 49:15 గురించి ఒక పండితుడు ఇలా చెప్పాడు: “మొత్తం పాత నిబంధనలో, దేవుని ప్రేమ గురించి చెప్పడానికి దీనికన్నా గొప్ప వచనం ఇంకొకటి లేదు.”

6. చాలామంది అపరిపూర్ణ మనుషులు కనికరాన్ని ఎలా చూస్తారు? కానీ యెహోవా మనకు ఏమని మాటిస్తున్నాడు?

6 కనికరం ఒక బలహీనతా? చాలామంది అపరిపూర్ణ మనుషులు అలానే అనుకున్నారు. ఉదాహరణకు, యేసు కాలంలో జీవించిన సెనెకా అనే పెద్ద రోమా తత్త్వవేత్త, “జాలి చూపించడం ఒక బలహీనత” అని చెప్పేవాడు. ప్రశాంతత ఉండాలంటే బాధ, సంతోషం లాంటి ఏ ఫీలింగ్స్‌ చూపించకూడదు అని చెప్పే స్తోయికుల సిద్ధాంతాన్ని సెనెకా ప్రోత్సహించేవాడు. ఒక తెలివైన వ్యక్తి కష్టంలో ఉన్నవాళ్లకు సహాయం చేయాలనిపిస్తే చేయవచ్చు గానీ ఎలాంటి జాలి చూపించకూడదు, ఎందుకంటే అలాంటి ఫీలింగ్స్‌ చూపిస్తే మనశ్శాంతి ఉండదు అని అతను అనేవాడు. కానీ ఇలా స్వార్థంగా ఆలోచిస్తే, ఎప్పటికీ మనస్ఫూర్తిగా కనికరం చూపించలేం. యెహోవా మాత్రం అస్సలు అలా ఉండడు. యెహోవా తాను ‘ఎంతో కనికరంగల వాడినని, కరుణామయుడినని’ బైబిల్లో మనకు భరోసా ఇస్తున్నాడు. (యాకోబు 5:11, అధస్సూచి) ఇప్పుడు మనం చూడబోతున్నట్టుగా, కనికరం అనేది ఒక బలహీనత కాదు, ఒక బలమైన లక్షణం. యెహోవా ఒక ప్రేమగల తండ్రిలా దాన్ని ఎలా చూపిస్తాడో తెలుసుకుందాం.

యెహోవా ఒక జనాంగం మీద కనికరం చూపించిన వేళ

7, 8. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఎలాంటి తిప్పలు పడ్డారు? వాళ్లను చూసి యెహోవా ఏం చేశాడు?

7 ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా ప్రవర్తించిన తీరులో, ఆయన కనికరాన్ని స్పష్టంగా చూడవచ్చు. క్రీస్తు పూర్వం 16వ శతాబ్దం చివరికల్లా, లక్షలమంది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అక్కడ వాళ్లు అష్టకష్టాలు పడ్డారు. ఐగుప్తీయులు ‘వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తూ వాళ్ల జీవితాల్ని దుర్భరం చేశారు; వాళ్లతో బంకమట్టి పని, ఇటుకల పని, బానిసలతో చేయించే అన్నిరకాల కష్టమైన పనుల్ని చేయించారు.’ (నిర్గమకాండం 1:11, 14) కష్టాల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు గొప్ప కనికరంగల దేవుడు ఏం చేశాడు?

8 యెహోవా గుండె కరిగిపోయింది. ఆయన ఇలా అన్నాడు: “ఐగుప్తులో ఉన్న నా ప్రజల కష్టాన్ని నేను నిజంగా చూశాను, వాళ్లతో బలవంతంగా పని చేయిస్తున్నవాళ్ల కారణంగా నా ప్రజలు పెడుతున్న మొరను నేను విన్నాను; వాళ్లు పడుతున్న వేదన నాకు బాగా తెలుసు.” (నిర్గమకాండం 3:7) యెహోవా వాళ్ల కష్టాల్ని ఊరికే చూడడం, వాళ్ల మొరల్ని పైపైన వినడం కాదుగానీ, వాళ్ల బాధను నిజంగా ఫీలయ్యాడు. ఈ పుస్తకంలోని 24వ అధ్యాయంలో చూసినట్టు, యెహోవా తదనుభూతిని చూపిస్తాడు. తదనుభూతి అంటే వేరేవాళ్ల బాధను మన బాధలా ఫీలవ్వడం. దానికి, కనికరానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అయితే, యెహోవా తన ప్రజలు పడుతున్న బాధను ఫీలయ్యి ఊరుకోలేదు గానీ, వాళ్ల కోసం ఏదోకటి చేసేలా అడుగులు వేశాడు. యెషయా 63:9 లో ఇలా ఉంది: “తన ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి ఆయన వాళ్లను తిరిగి కొన్నాడు.” యెహోవా తన “బలమైన చేతితో” ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. (ద్వితీయోపదేశకాండం 4:34) తర్వాత, వాళ్లకు అద్భుతంగా ఆహారం పెట్టాడు, అలాగే పచ్చగా కళకళలాడే దేశానికి వాళ్లను తీసుకొచ్చి దాన్ని వాళ్లకు ఇచ్చేశాడు.

9, 10. (ఎ) వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత, ఇశ్రాయేలీయుల్ని యెహోవా మళ్లీమళ్లీ ఎందుకు విడిపించాడు? (బి) యెఫ్తా రోజుల్లో, యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఎవరి చేతిలో నుండి విడిపించాడు? అలా చేయడానికి ఆయన్ని ఏది కదిలించింది?

9 యెహోవా కనికరం చూపించడం అంతటితో ఆగిపోలేదు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో స్థిరపడ్డాక కూడా, చాలాసార్లు దేవుని మాట వినకుండా కష్టాల్ని కొనితెచ్చుకున్నారు. కానీ తప్పు తెలిసిరాగానే, మళ్లీ యెహోవాకు ప్రార్థించేవాళ్లు. అలా ఒక్కసారి కాదు యెహోవా వాళ్లను మళ్లీమళ్లీ విడిపిస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే, ‘యెహోవా తన ప్రజల మీద కనికరపడ్డాడు.’—2 దినవృత్తాంతాలు 36:15; న్యాయాధిపతులు 2:11-16.

10 యెఫ్తా రోజుల్లో ఏం జరిగిందో గమనించండి. ఇశ్రాయేలీయులు అబద్ధ దేవుళ్లను ఆరాధిస్తున్నందుకు, వాళ్లను అమ్మోనీయులు 18 సంవత్సరాల పాటు అణగదొక్కేలా యెహోవా వదిలేశాడు. చివరికి ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడ్డారు. బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లు తమ మధ్య ఉన్న అన్య దేవుళ్లను తీసేసి, యెహోవాను సేవించారు. దాంతో ఆయన ఇక ఇశ్రాయేలీయుల కష్టాల్ని ఏమాత్రం సహించలేకపోయాడు.”b (న్యాయాధిపతులు 10:6-16) ఒకసారి తన ప్రజలు నిజమైన పశ్చాత్తాపం చూపించాక, యెహోవా ఇక వాళ్ల బాధను చూడలేకపోయాడు. అందుకే గొప్ప కనికరంగల దేవుడు యెఫ్తాను ఉపయోగించుకుని, ఇశ్రాయేలీయుల్ని శత్రువుల చేతిలో నుండి విడిపించాడు.—న్యాయాధిపతులు 11:30-33.

11. ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా ప్రవర్తించిన తీరు నుండి, కనికరం గురించి ఏం నేర్చుకోవచ్చు?

11 ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా ప్రవర్తించిన తీరు నుండి, కనికరం గురించి ఏం నేర్చుకోవచ్చు? ఒకటి ఏంటంటే, ప్రజలు బాధపడడం చూసి ఆయన అయ్యో పాపం అని ఊరుకోలేదు. పైన చూసిన తల్లి ఉదాహరణను ఒకసారి గుర్తుచేసుకోండి. తన బిడ్డ ఏడుస్తున్నప్పుడు, ఆ ఏడ్పును ఆపడానికి ఆమె కనికరంతో ఏదోకటి చేస్తుంది. అలాగే యెహోవా కూడా తన ప్రజలు పెడుతున్న మొరల్ని విని వదిలేయడు. కానీ, తన గొప్ప కనికరం వల్ల వాళ్లను ఆ బాధలో నుండి బయట పడేయడానికి సహాయం చేస్తాడు. రెండోది ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా ప్రవర్తించిన తీరు నుండి, కనికరం అనేది ఒక బలహీనత కాదుగానీ ఒక బలమైన లక్షణం అని నేర్చుకోవచ్చు. ఎందుకంటే, ఆ లక్షణం వల్లే ఆయన తన ప్రజల కోసం గట్టి చర్య తీసుకుని వాళ్లను రక్షించాడు. మరైతే, యెహోవా కనికరాన్ని కేవలం తన సేవకుల గుంపు మీదే చూపిస్తాడా, లేదంటే ఒక్కొక్కరి మీద కూడా చూపిస్తాడా?

యెహోవా ఒక్కొక్కరి మీద కనికరం చూపించిన వేళ

12. యెహోవాకు ఒక్కొక్కరి మీద ఉన్న కనికరం ధర్మశాస్త్రంలో ఎలా కనిపిస్తుంది?

12 యెహోవాకు ఒక్కొక్కరి మీద ఎంత కనికరం ఉందో, ఆయన ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ధర్మశాస్త్రం చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు, పేదవాళ్ల మీద ఆయనకు ఎంత శ్రద్ధ ఉందో చూడండి. అనుకోని పరిస్థితుల వల్ల ఒక ఇశ్రాయేలీయుడు పేదరికంలో కూరుకుపోయే అవకాశం ఉందని యెహోవాకు తెలుసు. మరి పేదవాళ్లను ఎలా చూడాలి? యెహోవా ఇశ్రాయేలీయులకు గట్టిగా ఇలా ఆజ్ఞాపించాడు: “పేదవాడైన నీ సహోదరుడి విషయంలో నువ్వు నీ హృదయాన్ని కఠినపర్చుకోకూడదు, నీ చేతిని బిగబట్టుకోకూడదు. నువ్వు అతనికి ఉదారంగా ఇవ్వాలి, కానీ నువ్వు సణుగుకుంటూ ఇవ్వకూడదు. అప్పుడే నీ దేవుడైన యెహోవా నువ్వు చేసే ప్రతీ కష్టంలో, ప్రతీ పనిలో నిన్ను దీవిస్తాడు.” (ద్వితీయోపదేశకాండం 15:7, 10) యెహోవా ఇశ్రాయేలీయులకు ఇంకో ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అదేంటంటే, వాళ్లు పంటను కోస్తున్నప్పుడు వాళ్ల పొలాల్ని గట్టుదాకా కోయకూడదు, అలాగే వదిలిపెట్టిన వాటిని ఏరుకోకూడదు. ఆ పరిగెను పేదవాళ్ల కోసం వదిలేయాలి. (లేవీయకాండం 23:22; రూతు 2:2-7) దేవుడు శ్రద్ధతో ఇచ్చిన ఈ ఆజ్ఞను ఇశ్రాయేలు జనాంగం పాటించినంత కాలం, వాళ్లలో ఏ ఒక్కరూ ఆహారం కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపే పరిస్థితి రాలేదు. ఇది యెహోవా గొప్ప కనికరానికి ఒక చక్కటి ఉదాహరణ కాదా?

13, 14. (ఎ) యెహోవా మనలో ప్రతీ ఒక్కరిని బాగా పట్టించుకుంటాడని దావీదు మాటలు ఎలా భరోసా ఇస్తున్నాయి? (బి) “విరిగిన హృదయంగలవాళ్లకు” లేదా ‘నలిగిన మనస్సుగలవాళ్లకు’ యెహోవా దగ్గరగా ఉంటాడని ఏ ఉదాహరణ బట్టి చెప్పవచ్చు?

13 ఇప్పుడు కూడా, మన ప్రేమగల దేవుడు మనలో ఒక్కొక్కరిని బాగా పట్టించుకుంటాడు. మనం పడుతున్న పాట్లు ఆయనకు బాగా తెలుసని మనం నమ్మకంతో ఉండవచ్చు. కీర్తనకర్త దావీదు ఇలా రాశాడు: “యెహోవా కళ్లు నీతిమంతుల్ని చూస్తూ ఉంటాయి, ఆయన చెవులు వాళ్ల మొరలు వింటాయి. విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు; నలిగిన మనస్సుగలవాళ్లను ఆయన కాపాడతాడు.” (కీర్తన 34:15, 18) ఆ లేఖనంలో ఉన్నవాళ్లు, “పాపం చేయడం వల్ల హృదయం విరిగిపోయి, మనసు నలిగిపోయి, ఆత్మగౌరవాన్ని కోల్పోయి, తాము తక్కువవాళ్లం అనుకుంటూ, ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకున్నవాళ్లు” అని ఒక బైబిలు పండితుడు వర్ణించాడు. యెహోవా తమకు దూరంగా ఉంటాడని, ఆయన పట్టించుకునేంత విలువైనవాళ్లం కాదని వాళ్లు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. తాము ఎందుకూ పనికిరానివాళ్లం అని అనుకునేవాళ్లను యెహోవా విడిచిపెట్టడని దావీదు మాటలు భరోసా ఇస్తున్నాయి. ముందెప్పటి కన్నా అలాంటి సమయాల్లోనే మనకు దేవుడు ఇంకా అవసరమని మన కనికరంగల తండ్రికి తెలుసు. అందుకే ఆయన మనకు దగ్గరగా ఉంటాడు.

14 ఒక అనుభవం చూడండి. ఒకామె, తన రెండేళ్ల బాబును తీసుకుని పరుగుపరుగున హాస్పిటల్‌కి వెళ్లింది. ఎందుకంటే, ఆ అబ్బాయికి సరిగ్గా ఊపిరాడట్లేదు. డాక్టర్లు ఆ అబ్బాయిని చూసిన తర్వాత, రాత్రికి హాస్పిటల్లోనే ఉంచాలని చెప్పారు. మరి ఇప్పుడు వాళ్లమ్మ రాత్రంతా ఎక్కడ ఉంటుంది? అదే రూమ్‌లో మంచం పక్కనే కూర్చుంటుంది! తన బాబుకు బాలేదు కాబట్టి పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకుంటుంది. మన ప్రేమగల పరలోక తండ్రి అంతకన్నా ఎక్కువే చేస్తాడని మనం నమ్మవచ్చు! ఎంతైనా, మనం ఆయన స్వరూపంలో చేయబడ్డాం కదా. (ఆదికాండం 1:26) మన ‘హృదయం విరిగినప్పుడు’ లేదా ‘మనసు నలిగినప్పుడు,’ యెహోవా ఒక ప్రేమగల తండ్రిలా మనకు దగ్గరగా ఉండి ఇంకా ఎక్కువ కనికరం చూపిస్తాడు, సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. కీర్తన 34:18 లో ఉన్న ఆ మాటలు ఎంత బాగున్నాయో కదా!

15. యెహోవా మనలో ఒక్కొక్కరికి ఏయే విధాలుగా సహాయం చేస్తాడు?

15 ఇంతకీ, యెహోవా ఒక్కొక్కరికి ఎలా సహాయం చేస్తాడు? ఆయన అన్నిసార్లూ మన కష్టాన్ని తీసేయకపోవచ్చు. కానీ, తనకు మొర పెట్టేవాళ్లకు సహాయం చేయడానికి ఆయన బోలెడన్ని ఏర్పాట్లు చేశాడు. ఉదాహరణకు, ఆయన వాక్యమైన బైబిల్లో మంచి సలహాలు ఉన్నాయి. అవి పాటిస్తే కొంతవరకు మన పరిస్థితి మెరుగవ్వవచ్చు. సంఘంలో, ఆధ్యాత్మిక అర్హతలు ఉన్న పెద్దల్ని యెహోవా ఇచ్చాడు. వాళ్లు బ్రదర్స్‌సిస్టర్స్‌ మీద యెహోవాలాగే కనికరం చూపించడానికి కృషిచేస్తారు. (యాకోబు 5:14, 15) అంతేకాదు, “ప్రార్థనలు వినే” దేవుడైన యెహోవా ‘తనను అడిగేవాళ్లకు పవిత్రశక్తిని’ ఇస్తాడు. (కీర్తన 65:2; లూకా 11:13) దేవుని రాజ్యం మన కష్టాలన్నిటినీ తీసేసేవరకు వాటిని తట్టుకోవడానికి ఆ పవిత్రశక్తి మనలో ‘అసాధారణ శక్తిని’ నింపుతుంది. (2 కొరింథీయులు 4:7) యెహోవా ఇవన్నీ ఇచ్చినందుకు మన హృదయాలు కృతజ్ఞతతో ఉప్పొంగట్లేదా? ఇవన్నీ యెహోవా గొప్ప కనికరానికి రుజువులని మనం మర్చిపోకుండా ఉందాం.

16. యెహోవా కనికరానికి తిరుగులేని ఉదాహరణ ఏంటి? దానివల్ల వ్యక్తిగతంగా మనకు ఏంటి ఉపయోగం?

16 నిజమే, యెహోవా కనికరానికి తిరుగులేని ఉదాహరణ, ఆయన ఒక్కగానొక్క కుమారుడిని మనకోసం విమోచన క్రయధనంగా ఇవ్వడం. యెహోవా ప్రేమతో చేసిన ఈ త్యాగం వల్ల, మనం రక్షణ పొందడానికి దారి తెరుచుకుంది. గుర్తుంచుకోండి, విమోచన క్రయధనం అనేది యెహోవా వ్యక్తిగతంగా మన కోసం ఇచ్చిన ఒక బహుమతి. ఈ ఏర్పాటు ‘దేవుని గొప్ప కనికరానికి’ అద్దం పడుతుందని బాప్తిస్మమిచ్చే యోహాను వాళ్ల నాన్న జెకర్యా సరిగ్గానే చెప్పాడు.—లూకా 1:78.

యెహోవా కనికరం చూపించడం ఆపేసిన వేళ

17-19. (ఎ) యెహోవా కనికరానికి హద్దులు ఉన్నాయని బైబిలు ఎలా చూపిస్తుంది? (బి) యెహోవా తన ప్రజల మీద కనికరం చూపించడం ఎందుకు ఆపేశాడు?

17 యెహోవాకు గొప్ప కనికరం ఉందంటే, ఇక దానికి హద్దులు లేవని మనం అనుకోవాలా? కాదు. ఎవరైతే తన నీతి మార్గాల నుండి పక్కకు వెళ్లిపోతారో, వాళ్ల విషయంలో యెహోవా న్యాయంగానే కనికరం చూపించడం ఆపేస్తాడని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (హెబ్రీయులు 10:28) అలా ఎందుకు చేస్తాడో తెలుసుకోవడానికి, ఇశ్రాయేలీయుల ఉదాహరణను ఇంకోసారి చూద్దాం.

18 యెహోవా ఇశ్రాయేలీయుల్ని శత్రువుల చేతిలో నుండి పదేపదే విడిపించినప్పటికీ, ఒకానొక టైంలో వాళ్లమీద కనికరం చూపించడం ఆపేశాడు. ఎందుకంటే ఈ మొండి ప్రజలు విగ్రహాల్ని పూజిస్తూ, ఆ అసహ్యమైన విగ్రహాల్ని ఏకంగా యెహోవా ఆలయంలోకే తెచ్చేశారు! (యెహెజ్కేలు 5:11; 8:17, 18) వాళ్లు ఇంకా ఏం చేశారో బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లు సత్యదేవుని సందేశకుల్ని హేళన చేస్తూ, ఆయన మాటల్ని తిరస్కరిస్తూ, ఆయన ప్రవక్తల్ని ఎగతాళి చేస్తూ వచ్చారు. వాళ్లు ఇక బాగుపడని స్థితికి చేరుకునేవరకు అలా చేస్తూ ఉన్నారు. అప్పుడు యెహోవా ఆగ్రహం తన ప్రజల మీదికి వచ్చింది.” (2 దినవృత్తాంతాలు 36:16) అవును, ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే, ఇక వాళ్లమీద కనికరం చూపించడానికి యెహోవాకు ఏ ఆధారం కనిపించలేదు. అందుకే, న్యాయంగానే ఆయనకు కోపం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు?

19 యెహోవాకు ఇక తన ప్రజల మీద కనికరం చూపించాలి అనిపించలేదు. ఆయన ఇలా అన్నాడు: “నేను వాళ్లమీద కనికరం చూపించను, బాధపడను, కరుణ చూపించను; వాళ్లను నాశనం చేయకుండా ఏదీ నన్ను ఆపలేదు.” (యిర్మీయా 13:14) అందుకే శత్రువులు యెరూషలేమును, దాని ఆలయాన్ని నాశనం చేసి ఇశ్రాయేలీయుల్ని బబులోనుకు బందీలుగా పట్టుకెళ్లిపోయారు. పాపులైన మనుషులు ఇంతలా దేవునికి ఎదురుతిరిగి, ఆయన కనికరం నశించిపోయేలా చేయడం ఎంత బాధాకరమో కదా!—విలాపవాక్యాలు 2:21.

20, 21. (ఎ) మన కాలంలో, దేవుని కనికరం దాని హద్దుకు చేరుకున్నప్పుడు ఏమౌతుంది? (బి) తర్వాతి అధ్యాయంలో, యెహోవా కనికరంతో చేసిన ఏ ఏర్పాటు గురించి చూస్తాం?

20 మరి ఇప్పటి సంగతేంటి? యెహోవా మారలేదు. ఆయన కనికరంతో, “రాజ్య సువార్త” భూమంతటా ప్రకటించమని తన సాక్షులకు చెప్పాడు. (మత్తయి 24:14) మంచి మనసున్న ప్రజలు దానికి స్పందిస్తే, ఆ రాజ్య సందేశాన్ని అర్థం చేసుకునేలా యెహోవా సహాయం చేస్తాడు. (అపొస్తలుల కార్యాలు 16:14) అయితే, ఈ పని ఎల్లకాలం ఇలాగే కొనసాగదు. ఒకవేళ యెహోవా ఈ చెడ్డ లోకాన్ని, కష్టాల్ని, బాధల్ని తీసేయకుండా ఎప్పటికీ ఇలాగే ఉంచితే, అది కనికరం అనిపించుకోదు. యెహోవా కనికరం దాని హద్దుకు చేరుకున్నప్పుడు, ఆయన ఈ చెడ్డ లోకాన్ని నాశనం చేస్తాడు. అయితే, అప్పుడు కూడా ఆయన తన “పవిత్రమైన పేరు” కోసం, అలాగే తన నమ్మకమైన సేవకుల కోసం కనికరం చూపిస్తాడు. (యెహెజ్కేలు 36:20-23) యెహోవా చెడుతనాన్ని పూర్తిగా తీసేసి, నీతి విలసిల్లే కొత్త లోకాన్ని తీసుకొస్తాడు. చెడ్డవాళ్ల గురించి యెహోవా ఇలా చెప్తున్నాడు: “నా కన్ను జాలిపడదు, నేను కనికరం చూపించను. వాళ్ల మార్గాల పర్యవసానాల్ని నేను వాళ్ల తలల మీదికి తీసుకొస్తాను.”—యెహెజ్కేలు 9:10.

21 అప్పటివరకు, నాశనం కాబోయే ప్రజల మీద కూడా యెహోవా కనికరం చూపిస్తాడు. పాపులైన మనుషులు నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే, యెహోవా కనికరంతో చేసిన అత్యంత గొప్ప ఏర్పాట్లలో ఒకటైన క్షమాపణ నుండి ప్రయోజనం పొందవచ్చు. తర్వాతి అధ్యాయంలో, యెహోవా ఎంతగా క్షమిస్తాడో చెప్పే మంచిమంచి పోలికల్ని చూస్తాం.

a కానీ ఆసక్తికరంగా, కీర్తన 103:13 లో రాకామ్‌ అనే హీబ్రూ పదం, తండ్రి తన పిల్లల మీద చూపించే కరుణను లేదా కనికరాన్ని సూచిస్తుంది.

b “ఇక ఏమాత్రం సహించలేకపోయాడు” అనే మాటకు, “ఆయన ప్రాణం ఉండబట్టలేకపోయింది; ఆయన ఓపిక నశించింది” అని అర్థం. ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌లో ఆ వచనం ఇలా ఉంది: “ఆయన ఇక ఇశ్రాయేలీయుల కష్టాల్ని చూసి తట్టుకోలేకపోయాడు.” టనాక్‌​—ఎ న్యూ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌లో ఇలా ఉంది: “ఆయన ఇశ్రాయేలీయుల బాధల్ని భరించలేకపోయాడు.”

ధ్యానించడానికి ప్రశ్నలు

  • యిర్మీయా 31:20 యెహోవాకు తన ప్రజల మీద ఎలాంటి ఫీలింగ్స్‌ ఉన్నాయి? దీన్నిబట్టి మీకు యెహోవా గురించి ఏమనిపిస్తుంది?

  • యోవేలు 2:12-14, 17-19 యెహోవా కనికరం పొందాలంటే ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

  • యోనా 4:1-11 కనికరం ఎంత ముఖ్యమైనదో యెహోవా యోనాకు ఎలా నేర్పించాడు?

  • హెబ్రీయులు 10:26-31 యెహోవా కరుణను లేదా కనికరాన్ని మనం ఎందుకు అలుసుగా తీసుకోకూడదు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి